Thursday, May 10, 2018

గుంపులు గుంపులుగా రామచిలకలు వేపచెట్టు మీద వాలి


సాయంత్రం ఆరు గంటలయిందంటే ఆరుబయట అందరి ఇళ్ళ ముందు లాగే మా ఇంటి ముందు కూడా మంచాలు వేసుకునేవాళ్ళం ..... గుంపులు గుంపులుగా రామచిలకలు వేపచెట్టు మీద వాలి, చేస్తున్న
అల్లరి చూడాలంటే రెండు కళ్ళు సరిపోయేవి కావు ....చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ...వాటి ముక్కులతో పాలుగారే లేత వేపకాయలన్ని ముక్కలు ముక్కలు చేసి, అప్పుడే శుభ్రం చేసిన వాకిలి నిండా చల్లినా రవ్వంత కోపం కూడా రాదెందుకో .....ఎంత అందంగా అల్లరి చేస్తున్నాయో చూసి ఆస్వాదించడం తప్ప ....."కడుపునిండా పాలు తాగి తల్లి ఒడిలోనుండి తొంగి చూసే పసిపాప కొంటె చూపు చిలకలదైతే .....,బిడ్డకు కడుపునిండా పాలిచ్చి.....ఇంక ఒడిలోనుండి కిందకు దిగివెళ్ళవా అనే తల్లి మందలింపు చూపులు మావయ్యేవి ....."
వాటి అల్లరి సద్దుమణిగే సమయానికి కడుపులో ఆకలి అల్లరి చేయడం మొదలు పెట్టేది ......మా నాయనమ్మ పొలం నుండి తెచ్చిన గోంగూర, పచ్చడి చేయడం అమ్మ మొదలు పెట్టింది అని ,అప్పటి వరకు ఆగాలని, అల్లరి చేస్తున్న ఆకలికి తెలిసేది కాదు ....కాదు కాదు ....తెలియనట్టు నటించేది .....ఆనక నక నక లాడిపోయేది.....
పొయ్యిమీద అప్పటికే ఉడికిన అన్నం "రా నన్ను వడ్డించుకో" అని వేడి వేడిగా ఒక చూపు చూసేది .....ఇక ఆగడం సాధ్యమా ...?! 
గుంటూరు తెల్ల గోంగూర,పచ్చిమిరపకాయలు ,కాస్త వెల్లుల్లి ,ఒక రెమ్మ కరివేపాకు ,కాస్త కళ్ళు ఉప్పు, రోట్లో వేసి రోకలిబండతో నూరుతుంటే .....నేను పళ్ళెంలో అన్నం పెట్టుకుని వచ్చి ...."అమ్మా తొందరగా కాస్త పచ్చడి వెయ్యమ్మా" అని అడిగేదాన్ని .....
"రోట్లో పచ్చడి వెయ్యకూడదు ....తిరగమోత కూడా పెట్టాలి ....కాసేపు ఆగు" అనేది అమ్మ.....
ఆ కాస్త సమయంలో ....రోటినిండా పచ్చడి వేసి ,కాస్త కూడా పక్కకి పడిపోకుండా,కళ్ళల్లో పడకుండా ఎలా నూరుతుందా అని ....గమనిస్తూ ఉండేదాన్ని .....ఇంతకు ముందు నేను చేసిన ప్రయోగాలలో కళ్ళల్లో కాస్త పడేసుకుని ....కెవ్వుమని కేకలు పెట్టి ,ఒంటినిండా చిందించుకుని ...."నా వల్ల కాదమ్మా"అని పరుగులుపెట్టిన అనుభవం నాది మరి ...... అమ్మ,అమ్మ పని.. ఇప్పటికీ నాకెప్పుడూ అద్భుతమే ....
గోంగూర పచ్చడితో ,ఆరుబయట మంచం మీద కూర్చుని,రేడియో లో వచ్చే పాటలు వింటూ,వెన్నెలను ఆస్వాదిస్తూ అన్నం తినడం మరువలేని ఒక చిన్ననాటి అనుభూతి ....సరే అదలా ఉంచితే ...
6నెలల క్రితం ....
ఇండియా వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాను ....ఎప్పుడూ నేనెప్పుడు వస్తున్నానో ముందుగా అమ్మకు చెప్పను ....ఊహించకుండా వెళ్లి అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం ,ఆనందం చూడడం నాకిష్టం .....కానీ విచిత్రం ఇప్పటివరకు ఆనందమే తప్ప ఆశ్చర్యం కనిపించకుండా చేసి ,ఆ ఆశ్చర్యం నాకే ఇచ్చేస్తుంది అమ్మ....నన్నెప్పుడూ అమ్మ అతిధిగా భావించదు,ఏదో లేదని కంగారు పడదు ..... అప్పటికప్పుడు నాకిష్టమైనది ఏదైనా చేసిపెట్టగల శక్తి అమ్మ సొంతం ..... 
ఇదివరకటి ఇల్లు వాస్తు సమస్య ఉందని ఎవరో చెబితే ఆ ఇల్లు పడేసి ....కనుచుపుమేరలోనే మాకున్న మరొక స్థలంలో ఇల్లు వేసుకుని ఉంటుంది .....ఆ వేపచెట్టు కూడా లేదనుకోండి ......
కారుదిగి ఇంటి ముందుకు రావడంతోనే ....కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది.....అలా కాళ్ళు కడుక్కుని బయట ఉన్న మంచం మీద కాసేపు విశ్రాంతిగా పడుకుని ఆకాశం వంక చూసాను ....ప్రపంచంలో ఎక్కడా నాకు ఆకాశం వంక చూడాలనిపించదు ....మా ఇంటిముందు మంచం మీద పడుకుని చూసేదే ఆకాశం అని నాకు గట్టి నమ్మకం ...ఆ మేఘాలు చూడగానే ...చిన్ననాటి నేస్తాలు కనిపించాయని మనసు మురిసిపోతుంది ......
అక్కడున్న సూర్యుడు,చంద్రుడు మా దేశం వాళ్ళే ...మా ఊరు వాళ్ళే అనే మతిలేని వాదన నాది ....
నేను ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండగానే ....అంతరాయంలా అమ్మ పిలుపు ....."ఒకసారి ఇంట్లోకి రామ్మా "అంటూ ...
"ఎందుకమ్మా " అడిగాను ...లేచి వెళ్ళడానికి బద్దకిస్తూ .....(అసలు అమ్మ దగ్గరకు వెళ్ళగానే ఎందుకో బద్దకానికే బద్దకంగా అనిపిస్తుంది .....)
"గారెలు తిందువుగాని రామ్మా ...."పిల్లలకు చేసిపెట్టడం ఇంత ఆనందం కలిగిస్తుందా ....అనిపించేలా అమ్మ పిలుపు .....(అన్నట్లు అమ్మ గారెలు చేస్తే రోట్లో పిండి రుబ్బి చేయాల్సిందే ...ఆ రుచే వేరు ....)
"ఇక్కడకు తీసుకుని రామ్మా ....." ఆరుబయట తినే ఆనందం కోసం ఎదురు చూస్తూ నేను 
"అందరి కళ్ళూ ఇటే.....దిష్టి పెడతారు ....ఇంట్లోకిరా ....." (అప్పటికే నాకు దిష్టి తీయడం అనే కార్యక్రమం చాలాసార్లు పూర్తి చేసినా కూడా.....)
"ఉహు నేను ఇంట్లోకి రాను ....." మొండిగా నేను ....
"చెప్తే వినరు కదా ....."కోపం +విసుగు కలగలిపిన నిస్సహాయత ....."రా ఇంట్లోకి "మళ్లీ గద్దింపు ....
"అయితే ...నాకు ఏమీ వద్దు ఫో,నేను తినను ....." అలగటం అనే విషయం అప్పుడే గుర్తొచ్చిందా అన్నట్టు .....
"ఉష్ ....పిల్లలు చెప్పిన మాట వినరు కదా ....." కక్కలేని కోపంతో అమ్మ.....
అలవాటైన అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందిలే అనే ధీమాతో కూడిన నవ్వు నాలో ....
తర్వాత హాయిగా గారెలు ఆస్వాదిస్తూ నేను....నా అలకను సంతృప్తి పరుస్తూ అమ్మ ......
ప్రపంచంలో నాకు అలిగే అవకాశం అమ్మ దగ్గరే .....నా అలకను భరించే శక్తి అమ్మకే సొంతం ......
కడుపునిండా పాలు తాగి తల్లి ఒడిలోనుండి తొంగి చూసే పసిపాప కొంటె చూపు నాదైతే.....,బిడ్డకు కడుపునిండా పాలిచ్చి.....ఇంక ఒడిలోనుండి కిందకు దిగివెళ్ళవా అనే తల్లి మందలింపు చూపులు అమ్మవయ్యేవి.....!!
అమ్మ ...ఇల్లు,వేపచేట్టులా నాకు కనిపిస్తే .....నేను ..అమ్మకు చిలకమ్మలా కనిపిస్తాను ఎప్పటికీ మా బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ .....
మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో .............
(ఫోటో ....మా ఊరు లోకి వెళ్లేదారి ....)


(Note: Wrote and published on May 10th 2014) 

No comments:

Post a Comment