Thursday, June 14, 2018

కానీ ఇప్పుడు , ఇంత జీవిత కాలం తర్వాత,


అవి నేను రెండవ తరగతి చదువుతున్న రోజులు .....అందుకే ఓ రెండు విషయాలు గుర్తున్నాయనుకుంటా ......
ఒకటి ....ఒక చిన్న పుస్తకాల సంచిలో ఒక మట్టి పలక(తర్వాత ప్లాస్టిక్ పలకలు కొనుక్కున్న గుర్తు),మట్టి బలపం,రెండవ తరగతి పుస్తకం వేసుకుని .....కొన్నిసార్లు లాగు,చొక్కా(ఎందుకు వేసుకునేదాన్నో గుర్తులేదు, బహుశ జేబులో చిరుతిళ్ళు పెట్టుకోవచ్చని అనుకుంటా) వేసుకుని మా ఇంటికి కనుచూపు దగ్గరలోనే ఉన్న బడికి(పేచీ పెట్టకుండా) వెళ్ళడం .....
రెండవది ....మా నాన్న కూడా అదే బడిలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం ......
నాన్న బాధ్యతలు నాన్నకుంటే ,నా బాధ్యతలు నాకు ఉండేవి .....
రోజూ అవుట్ బెల్(విరామం కోసం) కొట్టినప్పుడు ...నాన్న దగ్గరకు వచ్చి డబ్బులు అడిగి తీసుకుని ...నువ్వుల జీడీలు(ఇవి నాకు చాలా ఇష్టం),పప్పు ముద్దలు,మరమరాల ముద్దలు ..ఇలా ...అక్కడ ఏం ఉంటే అవి కొనుక్కుని తినడం ....,ఇంటికి వచ్చేటప్పుడు నాన్న భుజం మీద కూర్చుని మహారాణిలా ఇంటికి రావడం....., ఇవాళ ఎత్తుకోలేను ....నడవమంటే ....నాన్న వేలు పట్టుకుని నడవడం …., ఇంటికి వచ్చాక నాన్న వడిలో కూర్చుని కబుర్లు చెప్పడం ….ఇలా ఎన్నో బాధ్యతలు....అన్నిటికంటే నాకు బాగా గుర్తున్న బాధ్యత ....వేమన శతకం, సుమతీ శతకం లోని పద్యాలను రోజుకొకటి చక్కగా నేర్చుకుని నాన్నకు అప్పజెప్పడం .....
సాయంత్రం ఆరుబయట చల్లని వేళలో ...., "ఏదమ్మా(నన్ను "లక్ష్మి" అని స్పష్టంగా పిలిచేవారు నాన్న......నా అసలు పేరు మహాలక్ష్మి అని పెడితే ......స్కూల్ లో ఏ లక్ష్మి రాయాలో గుర్తురాక .....ఏదో ఒక లక్ష్మి అని, శ్రీలక్ష్మి అని రాసేసారు అని.....తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది ....) ఇవ్వాళ ఏం పద్యం నేర్చుకున్నావో చెప్పు" అంటూ అడిగేవారు .....
నాన్న నన్ను మెచ్చుకోవాలంటే ఒక్క తప్పు కూడా లేకుండా పద్యం చెప్పాలని నాకు బాగా గుర్తుండేది .....పద్యం చెప్పడం పూర్తయ్యాక…, ఒక్క తప్పు లేకుండా చెప్పినందుకు ....…, స్పష్టమైన ఉచ్చారణకు మెచ్చుకునేవారు ...అంతే కాకుండా అర్ధం కూడా వివరించేవారు ......
నాకింకా లీలగా గుర్తు .....ఒకసారి ....."పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు .....జనులా పుత్రుని కనుగొని పొగడంగ నాడు కలుగును సుమతీ" అనే పద్యం అర్ధం చెప్పినప్పుడు అడిగాను ......."నాన్నా, పుత్రోత్సాహము అనే ఎందుకు రాసారు .....పుత్రిక గురించి ఎందుకు రాయలేదు ?!" అని ......"పద్యం లో పుత్రుడినే ఉదాహరించినా అర్ధం ఇద్దరికీ వర్తిస్తుందమ్మా " నాన్న చెప్పడం గుర్తు ........ ఎందుకో ఈ ఒక్క విషయంలో ఇప్పటికీ సంతృప్తి లేదు ..
నాన్న దగ్గర ఉన్న (సిరా పోసుకుని రాసుకునే) పెన్నులంటే అప్పట్లో నాకు చాలా సరదాగా ఉండేది .... బ్లూ కలర్ ,రెడ్ కలర్ సిరా బుడ్లు(Ink Bottles) ఉండేవి ఇంట్లో ......కలంలో సిరా అయిపోగానే ఇంకు పిల్లర్ తో ఇంకు తీసుకుని నింపుకోవాలి .....అది కూడా సరదాగానే ఉండేది .....ఒక్కోసారి పాళీ(Nib) సరిగా పడకపోతే నోటితో సరిచేయాలని ప్రయత్నించి పొరపాటున నోటినిండా సిరా పీల్చి రంగులలో మునిగిన నోటిని చూసుకోవడం కూడా సరదానే ....
అప్పట్లో ఓ రోజు నాన్న కొత్తగా ఒక పెన్ను కొనుక్కొని వచ్చారు .....నాకిప్పటికీ ఆ పెన్ను గుర్తుంది ......నలుపు రంగు పెన్ను ....దాని మీద తెల్లటి చారలు .....ఎంత అందంగా కనిపించిందో ......ఆ పెన్ను నాకు కావాలనే ఆశ కలిగింది .....కానీ ఎలా ..... పెన్నుతో రాసే వయసు కాదు ......అయినా అడిగా ....
"ఇది చిన్న పిల్లలకు ఇవ్వకూడదు .. పిల్లల పరీక్ష పేపర్లు దిద్దడానికి తీసుకుని వచ్చాను ...కుదరదు" అన్నారు నాన్న ....
సరే అప్పటికి మర్చిపోయాను ....
తర్వాత ఒకరోజు స్కూల్ లో నేను తరగతిలో ఉన్నాను ......మా క్లాసు టీచరు రామకోటయ్య మాష్టారు .....నాన్నకు మంచి స్నేహితులు కూడా .....
పక్క క్లాసులో నాన్న ఉన్నారు .....ఎందుకో గుర్తులేదు …నేను నాన్న దగ్గరకు వెళ్లి మళ్లీ ఆ పెన్ను చూసి ఒక్కసారి కావాలని పేచీ పెట్టాను .....కుదరదన్నారు ....నేను కూడా ఇంకా మొండికేసాను ......
నాన్నకు ఎప్పుడూ కోపం రాదు ....అదీ మా మీద అస్సలు రాదు .....ఆ క్షణంలో నేను పెట్టిన పెచీకి నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది .....అక్కడే ఒక బెత్తం(స్టిక్) ఉంది .....అది తీసుకుని నాన్న నన్ను "కుదరదని చెబుతుంటే పేచీ పెడతావా" అంటూ ఒక్కటిచ్చారు ......నాన్నతో నేను దెబ్బలు తినడం నాకు గుర్తున్నంతవరకు అదే మొదటిసారి, చివరిసారి ......ఆ భయంలో నా లాగు తడిసిపోవడం కూడా నేను గమనించలేదు .....వెక్కి వెక్కి ఏడుస్తూ బయటికొచ్చాను ...రామకోటయ్య మాష్టారు నేను ఏడవడం చూసి ....ఏం జరిగిందో గ్రహించి .....ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని రా పో అని ఇంటికి పంపించారు .....ఏడుస్తూ ఇంటికి వెళ్ళాను .....ఏం జరిగింది అని అడిగింది మా అమ్మ ....ఏడుస్తూనే చెప్పాను........నువ్వు బడికెళ్ళి ఇలా పేచీలు పెడతావా అని మా అమ్మ ఇంకో నాలుగు తగిలించింది .....బట్టలు మార్చి .....బడికి వెళ్ళమని పంపించింది ........
అయితే బడికి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే ....బడికి ఇంటికి మధ్యలో తుమ్మచెట్లు దగ్గర అలిగి కూర్చుండి పోయాను .....అలిగి ఉండటం అయితే ఉన్నాను కానీ ....ఎంత సేపని అక్కడ ఉంటాను ..... కొమ్మలకున్న ఆకులన్నీ కోసి కుప్పలు పోయడం మొదలు పెట్టాను ......అలవాటు లేని పని …కాసేపు చేసాక విసుగు పుట్టింది కానీ అలక తగ్గలేదు .....దారిన పోయేవాళ్ళందరూ ఆగి ...."పంతులు గారమ్మాయివి కదూ .....ఇక్కడేం చేస్తున్నావు ...ఇంటికి పో ...." అనడం మొదలు పెట్టారు ....
ఆకులన్నీ అయిపోయాక కొమ్మలు విరిచేసాను .....అయినా కోపం తగ్గలేదు .....అలా అలా జరుగుతూ మరో చెట్టు దగ్గరకు వెళ్ళా ...... అప్పుడు కనిపించింది అక్కడ, చుట్ట చుట్టుకుని ....గోధుమ రంగులో ...చచ్చిందా బ్రతికిందా అనే అనుమానం కలిగిస్తూ పడుకుని నిద్రపోతున్న ఒక పాము ......(మా ఊర్లొ ఉండేవి అన్ని త్రాచులే.....బురద పాములు సరదాగా చూసిపోవడానికి కూడా రావు .... ) నాకు కాళ్ళు వణికి పోయాయి ....చప్పుడు చేస్తే పాముకి ఎక్కడ మెలకువ వస్తుందో అని .....మెల్లగా అడుగులో అడుగేస్తూ కొంత దూరం నడిచి .....ఆ తర్వాత పరుగే పరుగు ఇంటికి ......ఇంటికొచ్చాక ఎవరితో మాట్లాడకుండా అరుగు మీద ...కుర్చుని ....తర్వాత చీకటి పడ్డాక ....మెల్లగా ఇంట్లోకి వచ్చి కూర్చున్నా ......
సాయంత్రం అందరూ భోజనాలు చేసే సమయం .....నాన్న నన్ను పిలిచారు ....తన వడిలో కుర్చోబెట్టుకున్నారు ......"అలా క్లాసులో కొచ్చి పేచీ పెట్టొచ్చా ....తప్పు కదూ ...." అని ఓదార్చి ....అన్నం కలిపి నోట్లో పెట్టారు ....బడిలోకి రాకుండా,ఇంటికి రాకుండా అలా వెళ్ళడం తప్పు కదూ అన్నారు .... మళ్లీ వెక్కిళ్ళు గుర్తొచ్చాయి …..అలా ఎప్పుడూ చెయ్యకూడదు అన్నారు ..... అలా చేయడం పొరపాటేనని తలూపి నాన్న గుండెలపై వాలిపోయి నిచ్చింతగా నిద్రపోయా .......
కానీ ఇప్పుడు , ఇంత జీవిత కాలం తర్వాత, అదే వెక్కిళ్ళతో నాన్నకు చెప్పాలనుంది ..... అలా పేచీ పెట్టడం పొరపాటు కానే కాదనీ .....నేనలా చేసి ఉండకపోతే , మీ ఒడిలో ఉన్న"ఓదార్పు” ...... మీ గుండెలపై వాలినప్పుడు ఉన్న “నిశ్చింత” ....నాకెప్పటికీ దొరికి ఉండేవి కావని ...... అసలు ఆ పదాలకు అర్ధమే తెలిసి ఉండేది కాదని......, ప్రపంచంలో ఎక్కడ వెదికినా ...ఎవరిని అడిగినా ..... దొరకవని తెలిసే, అప్పుడు మీరు నాకిచ్చారు అని ......!!
(అప్పటి నాన్న ఫోటో .....నిలబడిన వ్యక్తులలో ఎడమవైపు నుండి మొదటి వ్యక్తి ....అప్పటి ఫోటో అందించిన Siva Jasthi గారికి థాంక్స్ .....)
(Note : Wrote and published on June 14, 2014)

No comments:

Post a Comment