Sunday, June 24, 2018

ప్రపంచంలో ఇంతమంది శాడిస్ట్ లను ....మంచితనం ముసుగేసుకున్న పిచ్చివాళ్లను చూశాక ..

చిన్నతనం నుండి నాకు అనుభవం లోకి వచ్చిన ఒక జీవిత సత్యం ఏమిటంటే ....,,
నాకు ఏదైతే భయమో ,నేను ఏదైతే చేయడానికి భయపడతానో .....అది తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ....
అది చేయాల్సిన పరిస్థితి ఎంతవరకు ఎదురయ్యేదంటే ....ఆ పని అంటే నాకు భయం పోయేంత వరకు ,మళ్లీ జీవితంలో ఇంకెప్పుడూ ఆ పని అంటే నేను భయపడనంత వరకు ....!
--------------------------------
ఉదాహరణకు ….,,
నా చిన్నతనంలో....ఇంజక్షన్ చేయించుకోవడం అంటే నాకు చాలా భయం .....
టీకాలు వేసేవాళ్ళు స్కూల్ కి వస్తున్నారంటే స్కూల్ మానేసేవాళ్ళం ....అప్పట్లో టీకాలకు ఉన్న విలువ ఏమిటో కూడా ఇంట్లో చెప్పలేదు ....టీకాలు వేస్తే జ్వరం వస్తుందనే నమ్మకం ...
అలాగే ఒకరోజు స్కూల్ కి టీకాలు వేసే వాళ్ళు వస్తున్నారని తెలిసి, స్కూల్ మానేసి పిల్లలందరం ఇంట్లో ఉన్నాం ....(హ్యాపీ గా ) ...
అంతలో పిల్లల్లో ఎవరో ఒక పుకారు లేవదీసారు ....బడి మానేసిన పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళ ఇంటికొచ్చి మరీ టీకాలు వేస్తున్నారట అని ....ఇంకేముంది ...మా మొహాలన్నీ నల్లగా మాడిపోయాయి .....మా ఆనందం అంతా ఆవిరైపోయింది .....ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి లా తయారైంది మా పరిస్థితి .....
తప్పించుకోవాలి...తప్పించుకోవాలి ....కానీ ఎలా ....??
పిల్లలందరం ఒక కమిటీ వేసి ఎక్కడో ఒకచోట దాక్కోవాలి అని నిర్ణయించాం ...
అప్పట్లో మా ఇంట్లో & మా బాబాయి వాళ్ళింట్లో ఇంటి నిండా పత్తి మండెలు (క్వింటాళ్ళ కొలది ప్రత్తి ని ఒకచోట కుప్పగా పోయడం) ఉండేవి ....
అర్ధమైంది కదా ...అవును ....అదే అయిడియా మాకు కూడా వచ్చింది ....ఆ పత్తి మండెలే మా ఉనికిని కాపాడే రహస్య స్థావరాలు అని నిర్ణయించుకున్నాం ....
మా నాయనమ్మకు భయపడి కొంతమంది పిల్లలు మా ఇంటికి రావడం కుదరదు అని నిర్ద్వందంగా ప్రకటించారు ....
సరే అని మా బాబాయి వాళ్ళింట్లోకి వెళ్లి లోపల గడి వేసుకుని .....అందరం పత్తి మండె మీదకు ఎక్కి తలా ఒక మూల కూర్చున్నాం ......కూర్చున్న కాసేపటి తర్వాత మాకు మళ్లీ భయం వేసింది ... మా బాబాయి వాళ్ళ ఇంటి గడి అంత గట్టిగా ఉండదు ....గట్టిగా తోసేస్తే వచ్చేస్తుంది ....ఒకటి రెండు సార్లు పరీక్షించుకుని చూసి అక్కడ మాకు రక్షణ లేదు అని గమనించాం .....ఫలితం మళ్లీ కమిటీ .....
ఈ సారి కమిటీలో ....మా నాయనమ్మ నుండి వాళ్లకు రక్షణ కల్పిస్తానని నేను ఇచ్చిన హామీ ఫలితంగా అందరూ మా ఇంటికి రావడానికి అంగీకరించారు .....
సీన్ అదే ....ప్లేస్ మారింది .....అస్సలు శబ్దం చేయకుండా ...గుస గుసగా మాట్లాడుకుంటూ .....వినపడని వాళ్లకి చెవిలో చెప్పుకుంటూ అక్కడ చెమటలు కక్కుకుంటూ ...మేం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు .....సాయంత్రం అయింది ....
టీకాలు వేసేవాళ్ళు రాలేదు .....మా పెద్దవాళ్ళు వచ్చారు ....నా వీపు విమానం మోత మోగించారు .....
ప్రత్తి మండె అంతా తొక్కి... సర్వ నాశనం చేశామని ....
నిజం చెప్పొద్దూ ....ఆ టీకా ఏదో చేయించుకున్నా ... మాకు అంత నొప్పి ఉండేది కాదేమో ....??!!
ఆ తర్వాత అదృష్టమో దురదృష్టమో తెలియదు ..నా కడుపులో ఓ పాప ఉందనీ ....ఆ పాపకు టీకా నా ద్వారానే వేయించాలని డాక్టర్ చెప్పేవరకు ....నాకు ఇంజక్షన్ చేయించుకోవాల్సిన అవసరం రాలేదు ....
అప్పుడు నా భయం నాకు మళ్ళీ గుర్తొచ్చి ....పక్కనే ఉన్న మా వారి చేయి గట్టిగా పట్టుకున్నా భయంతో ....
పట్టుకున్న చేయి నన్ను చూసి (నా భయాన్ని చూసి ) నవ్వింది ....
నవ్వింది ఎవరి చేయి అయినా కానివ్వండి .....ఆ భయం గురించి మరో పదిమందికి తెలియడం ఇష్టం లేక అయినా కానివ్వండి ....అందువల్ల కలిగిన ఉక్రోషం నాకు నెమ్మదిగా ఇంజక్షన్ అంటే ఉన్న భయాన్ని క్రమంగా అధిగమించేలా స్ఫూర్తినిచ్చింది ....
ఇప్పుడు ఇంజక్షన్ చేస్తుంటే ....ఆ నీడిల్ వైపే నవ్వుతూ చూస్తూ ఉంటా అనుకోండి ...అది వేరే విషయం .....
======================
అలాగే ....
ఎన్నో భయాలు ....ఎన్నెన్నో భయాలు...చాలా భయాలు ....అలా అధిగమిస్తూనే ఉన్నా ....జీవితంతో ప్రయాణిస్తూ ....
చివరకు నాకు తెలిసింది ఏమిటంటే ....ఏది అంటే నేను భయపడతానో అది నేను అధిగమించేవరకు నాకు ఎదురవుతూనే ఉంటుంది .....
ఒకసారి అధిగమించానా ....దాని తస్సాదియ్యా ....అది పత్తా లేకుండా మాయమైపోతుంది ....అప్పుడు నిజానికి సరదా పడుతూ ఉంటా ....రా రా రా ...అని ....,రాదు ....
చాలా మంది అంటూ ఉంటారు ....మీకు ఏం భయాలండీ అని ...
నాకూ భయం ఉందంటే ....ఓ పట్టాన నమ్మరు ఎంత చెప్పినా ....
అయితే వ్యక్తి వ్యక్తికీ భయాలు మారుతూ ఉంటాయి ....
కొందరికి మనుషులంటే భయం ....మరి కొందరికి జంతువులంటే భయం ...జంతువులు మనిషిని చూసి భయపడుతూ ఉంటాయని తెలుసు కానీ మనిషిని చూసి మనిషి భయపడడం ఏమిటి అనిపిస్తుంది కొన్నిసార్లు ....
అయినా ఇక్కడ మీకో రహస్యం చెప్పాలి ....ఇప్పుడంటే ఇలా అనిపిస్తుంది కానీ ....
ఈ మనిషిని చూసి భయపడడం నేనూ చేసేదాన్ని నాకు తెలియకుండానే ....ముఖ్యంగా పిచ్చివాళ్ళంటే నాకు భయం ఉండేది ....దాన్ని ఎలా అధిగమించానో నాకూ తెలియదు ....అధిగమించానో లేదో కూడా నాకు తెలియదు ...ఏమో ...
అసలు ఈ భయం నాకు ఎలా మొదలైందో మీకు చెప్పాలి ....
------------------------
నా చిన్నతనంలో ...నాకు ఊహ తెలిశాక ....మా ఊర్లోకి పిచ్చి శంకరాయ్ అని ఒక వ్యక్తి వచ్చాడు అని అందరూ చెప్పుకుంటుంటే వినేదాన్ని ....
అతను వేణుగోపాలస్వామి గుడిలో ....శివుడి గుడిలో (రెండూ ఎదురెదురుగానే ఉండేవి /ఉన్నాయి ) ఉన్నాడని ..అక్కడ ఎవరైనా ఏదైనా పెడితే తింటూ ....గుళ్లో ప్రసాదం పెడితే తింటూ ....అక్కడ బావి చుట్టూ ఉన్న గుంటల్లో నీళ్లు తాగుతూ ...ఉండేవాడని కూడా నాకు గుర్తు ....
అతను ఎలా వచ్చాడో ....ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికీ తెలియదు ....
అతనికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు ....
బహుశా శంకరుడి గుడిలో ఉండడం వలన శంకరాయ్అని పిలిచారేమో ....లేదా ఎప్పుడో తనలో తానే తన పేరు చెప్పుకుంటుంటే ఎవరైనా విన్నారేమో ....ఏమో ...తెలియదు ....
అయితే అతను పిచ్చివాడు కాబట్టి పసి పిల్లలని ....నా అంత పిల్లలని కూడా భయపెట్టడానికి తల్లితండ్రులకు / పెద్దవాళ్లకు ఓ ఆయుధం ....
ఒకసారి మా నాయనమ్మ నేను చెప్పిన మాట వినకపోతే ...."పెద్దబావి కాడ / గుడి కాడ పిచ్చి శంకరాయ్ ఉన్నాడు ....పట్టుకుపోతాడు" అని చెప్పేది
అలాగే మిగతా పిల్లలకు కూడా ఈ విలువైన సమాచారం పెద్దవాళ్లందరి చేత చేరవేయబడింది .....
ఇక అప్పటినుండి ...ఆ పెద్దబావి వైపు ఏదైనా పని ఉందని చెప్తే ...."అక్కడ పిచ్చి శంకరాయ్ ఉన్నాడు ....నేను వెళ్లను" అని చెప్పేదాన్ని
అలా అలా అందరిలో అతనంటే ఒక భయం అయితే మాత్రం ఏర్పడి పోయింది ....
అలాంటి రోజుల్లో ....నాకూ ఓ రోజు అతన్ని చూసే అవకాశం కలిగింది ....
మా అమ్మ చెప్పిన ఏదో పనిమీద ఆ వైపు తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది ...
అక్కడి వరకూ పరుగులు తీసుకుంటూ వెళ్లిన నా కాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆగిపోయాయి ....
నా కాళ్ళ పట్టీల చప్పుడు వినపడకుండా జాగ్రత్తపడుతూ ....మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ ఉన్నా ....
ఆ క్షణంలో నేనతన్ని మొదటిసారి చూసాను .....
బాసింపట్లు వేసుకుని గుడి అరుగుమీద కూర్చుని ఉన్నాడు ....అతని జుట్టు పాయలు పాయలుగా వేళ్ళాడేసుకుని తైల సంస్కారం లేకుండా ఎండిపోయి ఉంది ....అతని గడ్డం జుట్టు కలిసిపోయి ఏది ఏదో గుర్తుపట్టలేనట్టుగా ఉంది ...చిరిపోయి మట్టిగొట్టుకుపోయిన లాగు చొక్కా వేసుకుని ఉన్నాడు ...స్నానం చేసి ఎన్నో యుగాలయిందేమో అన్నట్టుగా ఉంది అతని వాలకం ....
అంతకు మించి అతని వర్ణనకు ఉపయోగపడే ఆభరణాలేవీ లేవు అతని దగ్గర ....వయసు ఓ ముప్పై ఉండొచ్చేమో అనిపించేలా ఉన్నాడు ....అతని పక్కన అతనికి సంబంధించిన మూట కూడా ఏదో ఉంది ....తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది ....
ఇదంతా అతనికి అనుమానం రాకుండా గమనించుకుంటూ గుండెల్లో భయం చిక్కబట్టుకుని ....నెమ్మదిగా ముందుకు వెళ్లి ...అక్కడినుండి ఒక్క పరుగున వెళ్ళిపోయా ....
ఆ తర్వాత కూడా నేను అతనిని ఎన్నో సార్లు చూసా ....కొన్నిసార్లు చెత్తలో ఏవో ఏరుకుంటూ కనిపించేవాడు .....కొన్నిసార్లు తన మూటమీద తలపెట్టుకుని నిద్రపోతూ కనిపించేవాడు .....కొన్నిసార్లు ఎవరో పెట్టినవి తింటూ కనిపించేవాడు ....కానీ ఎవరికీ ఏ హానీ చేసినట్టు నేను ఎవరిదగ్గరా వినలేదు ....ఆ తర్వాత అతను ఎక్కడికి పోయాడో కూడా ఎవరికీ తెలియదు ....అలాగే మాయమైపోయాడు ....
------------------------------
కానీ ఇన్నేళ్ల తర్వాత నాకు అతను మళ్ళీ గుర్తొచ్చాడు ....
విచిత్రంగా అతనంటే నాకు ఈసారి భయం వేయలేదు ....అతని మీద నాకు ఇష్టం , గౌరవం కలిగింది ....ఇప్పుడు మళ్ళీ నేను పనిమీద ఆ దారిలో వెళ్తే ....అతను ఆ గుడి గట్టు మీద కూర్చుని ఉంటే....నా పట్టీలు చప్పుడయ్యేలా అతని ముందు నుండే ఎగురుకుంటూ నడవాలనుంది....అతని పక్కన కూర్చోవాలని ఉంది ....భయం లేకుండా అతని కళ్ళలోకి చూడాలనుంది ....పిచ్చి శంకరాయ్ అని ప్రేమగా ....కాదు కాదు ...శంకర్ అని ...పిలవాలనుంది...
--------------------------
ఏమో ...అతనంటే నాకు భయం ...ఎందుకు ఎలా పోయిందో నాకు తెలియదు ....బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నాకు అంతకంటే ఎక్కువ పిచ్చి ఉన్నవాళ్లే కనిపించడం వలన అయి ఉండొచ్చు ....అంతకంటే ఎక్కువ భయంకరమైన వాళ్లనే నేను చూడడం వలన కావచ్చు ....
వాళ్ళు కనిపించిన ప్రతిసారి నా గుండె చప్పుడు వాళ్లకు వినిపించకుండా ఊపిరి శబ్దం బిగబట్టి బ్రతకడం ...అలవాటు కావడం వలన కావచ్చు ....
వాళ్ళు సూట్లు , బూట్లు వేసుకుని ...నీట్ గా షేవ్ చేసుకుని .... కళ్ళల్లో క్రూరత్వాన్ని , రాక్షసత్వాన్ని అవలీలగా అనుమానం రాకుండా నవ్వుతూ ప్రదర్శించడం వలన కావచ్చు ...మనుషుల అంతర్ముఖం , బాహ్య ముఖం గుర్తుపట్టలేకుండా కలిసిపోయి అసహ్యంగా కనిపించడం వలన కావచ్చు ....
-------------------------
చెప్పలేను ....ఒక్కటి మాత్రం అనిపిస్తుంది ...ప్రపంచంలో ఇంతమంది శాడిస్ట్ లను ....మంచితనం ముసుగేసుకున్న పిచ్చివాళ్లను చూశాక ...ప్రపంచానికి అతను పిచ్చి శంకరాయ్ కావడంలో /చేయడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది ....!
(ఇంకా ఉండొచ్చు ....లేకపోవచ్చు ....సశేషం కావచ్చు ....శేషం కావచ్చు ...చెప్పలేను )

Sunday, June 17, 2018

నాన్నంటే నాకు తెలిసి ...అమ్మను గౌరవించడం అని అర్ధం ....


కుంచనపల్లి సీతారావమ్మ గారు ...
ఉన్నవ పోస్ట్ ....సీతారాంపురం ...
ప్రత్తిపాడు తాలుకా ..
గుంటూరు జిల్లా ..
ఆంధ్రప్రదేశ్ ...
పిన్ : 522019

------------------
పోస్ట్ మాన్ సైకిల్ మీద వచ్చి ....ఈ అడ్రెస్స్ ఉన్న లెటర్ చేతికి ఇచ్చిన వెంటనే చేతివ్రాత చూసి ఎవరు వ్రాశారో నాకు వెంటనే అర్ధమై పోయేది ....
"అమ్మమ్మా నీకు ఉత్తరం వచ్చింది ...."కేకేసి చెప్పేదాన్ని ....
ఇక్కడ అమ్మమ్మ అంటే మా నాయనమ్మే ....
మా అమ్మ నాయనమ్మను ఎప్పుడూ అత్తయ్య అని పిలిచేది కాదు ....అమ్మా అని పిలిచేది ...అది వినీ వినీ మేం కూడా మా నాయనమ్మను చిన్నతనం నుండి అమ్మమ్మా అని పిలిచేవాళ్ళం ....
ఉత్తరం ఎవరు వ్రాశారో అనే కంగారు ఏం లేకుండా నింపాదిగా వచ్చేది ఇంట్లో నుండి నాయనమ్మ ....
మా నాన్న ఒక్కరే తనకు ఉత్తరం వ్రాసేది అని, తనకు ,మాకే కాక ఊరందరికీ (పోస్ట్ మాన్ తో సహా ) తెలుసు ....
ఏం రాసాడో చదువమ్మా ....అనేది ....
నేనే తనకు చదివి వినిపించేదాన్ని ....
ఎప్పుడూ నాన్న ఇన్లాండ్ కవర్ లోనే వ్రాసేవారు .....
కవర్ జాగ్రత్తగా విప్పి ....చదవడం మొదలు పెట్టేద్దాన్ని ....
వినడానికి తను పక్కనే శబ్దాలు ఏం లేకుండా చూసుకునేది ....
పూజ్యునీయురాలైన మాతృ మూర్తి పాద పద్మములకు నమస్కరించి వ్రాయునది ,
(ఓసారి మా నాయనమ్మ పాదాల వైపు చూసేదాన్ని ....పొలంలో తిరిగి వచ్చిన కాళ్ళు శుభ్రంగా కడుక్కోక పోవడం వలన ఎప్పుడూ మట్టితోనే ఉండేవి ....ఒకింత ఆశ్చర్యం వేసేది ....ఇవి పాద పద్మాలా అని ....మళ్లీ చదవడం మొదలు పెట్టేదాన్ని)
నేను ఇచ్చట క్షేమము , మీరు అందరూ అచట భగవంతుని దయవలన క్షేమమని భావించెదను .....
ముఖ్యముగా వ్రాయునది ఏమనగా ....మీకు తెలియజేసిన విధంగా 15 వ తేదీన ఇంటికి రాలేకపోయాను ....పిల్లలకు పరీక్షలు నిర్వహించడం వలన తీరిక లేక రాలేదు ....ఇంకా కొన్ని అత్యవసర పనులు చేయవలసి రావడం వలన నా ప్రయాణాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు ....ఇచట పనులన్నీ పూర్తి చేసుకుని ....ఒక వారంలో ....అనగా ఈ నెల 30 వ తేదీన ఉదయం బయలు దేరి 30 తేదీ రాత్రి కి ఇంటికి రాగలను ....3 బస్సులు మారాల్సి రావడం వలన ప్రయాణం ఆలస్యం అవుతుంది ....
మన పొలంలో పంటలు బాగున్నాయని తలుస్తాను ....అన్ని పనులు వేళకు సక్రమంగా జరుగుతున్నాయని భావిస్తున్నాను ....
నీ ఆరోగ్యం జాగ్రత్త ....
తమ్ముడిని ,తిరపతమ్మ ను (మా అత్తయ్య ) అడిగినట్లు తెలియజేయవలయును ....
చిరంజీవులు అందరికీ నా ఆశీస్సులు అందించవలయును....
ఇంతే సంగతులు ...
ఇట్లు
మీ కుమారుడు ...
--------------------------
ఉత్తరం అంతా చదివాక ....అంతా విని మా నాయనమ్మ సంతృప్తిగా వెళ్ళిపోయేది ....
---------------------------
ఆ ఉత్తరంలో ఎప్పుడూ మా నాయనమ్మకు మా నాన్న జవాబుదారీగా ఉండడమే నాకు అర్ధం అయ్యేది ....😍
నాన్నంటే నాకు తెలిసి ...అమ్మను గౌరవించడం అని అర్ధం .... నాన్నను చూసే మా అమ్మను ఇలా గౌరవించాలి అనిపించేది ....😍
అమ్మను గౌరవించాలని ఆచరించి చూపించే నాన్నలందరికీ ....పితృ దినోత్సవ శుభాకాంక్షలు .... 
---------------------------
Note: (మా నాన్న చేతివ్రాతతో ఉన్న ఉత్తరాలు చాలావరకు పోగొట్టుకున్నాను ...ఒక ఉత్తరం మిగిలింది ...ఇది పెళ్ళికి ముందు మావారికి మానాన్న వ్రాసిన ఉత్తరం ...అందులో సెలవులకు వచ్చేటప్పుడు ఉద్యోగ వివరాలు తెలియజేసే డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని వ్రాసిన ఉత్తరం ....నాన్న పేరు కనిపిస్తుందని ఇలా ఫోటో తీసా ... ఎంత బాగుందో కదా నాన్న చేతివ్రాత ✍️)

Thursday, June 14, 2018

కానీ ఇప్పుడు , ఇంత జీవిత కాలం తర్వాత,


అవి నేను రెండవ తరగతి చదువుతున్న రోజులు .....అందుకే ఓ రెండు విషయాలు గుర్తున్నాయనుకుంటా ......
ఒకటి ....ఒక చిన్న పుస్తకాల సంచిలో ఒక మట్టి పలక(తర్వాత ప్లాస్టిక్ పలకలు కొనుక్కున్న గుర్తు),మట్టి బలపం,రెండవ తరగతి పుస్తకం వేసుకుని .....కొన్నిసార్లు లాగు,చొక్కా(ఎందుకు వేసుకునేదాన్నో గుర్తులేదు, బహుశ జేబులో చిరుతిళ్ళు పెట్టుకోవచ్చని అనుకుంటా) వేసుకుని మా ఇంటికి కనుచూపు దగ్గరలోనే ఉన్న బడికి(పేచీ పెట్టకుండా) వెళ్ళడం .....
రెండవది ....మా నాన్న కూడా అదే బడిలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం ......
నాన్న బాధ్యతలు నాన్నకుంటే ,నా బాధ్యతలు నాకు ఉండేవి .....
రోజూ అవుట్ బెల్(విరామం కోసం) కొట్టినప్పుడు ...నాన్న దగ్గరకు వచ్చి డబ్బులు అడిగి తీసుకుని ...నువ్వుల జీడీలు(ఇవి నాకు చాలా ఇష్టం),పప్పు ముద్దలు,మరమరాల ముద్దలు ..ఇలా ...అక్కడ ఏం ఉంటే అవి కొనుక్కుని తినడం ....,ఇంటికి వచ్చేటప్పుడు నాన్న భుజం మీద కూర్చుని మహారాణిలా ఇంటికి రావడం....., ఇవాళ ఎత్తుకోలేను ....నడవమంటే ....నాన్న వేలు పట్టుకుని నడవడం …., ఇంటికి వచ్చాక నాన్న వడిలో కూర్చుని కబుర్లు చెప్పడం ….ఇలా ఎన్నో బాధ్యతలు....అన్నిటికంటే నాకు బాగా గుర్తున్న బాధ్యత ....వేమన శతకం, సుమతీ శతకం లోని పద్యాలను రోజుకొకటి చక్కగా నేర్చుకుని నాన్నకు అప్పజెప్పడం .....
సాయంత్రం ఆరుబయట చల్లని వేళలో ...., "ఏదమ్మా(నన్ను "లక్ష్మి" అని స్పష్టంగా పిలిచేవారు నాన్న......నా అసలు పేరు మహాలక్ష్మి అని పెడితే ......స్కూల్ లో ఏ లక్ష్మి రాయాలో గుర్తురాక .....ఏదో ఒక లక్ష్మి అని, శ్రీలక్ష్మి అని రాసేసారు అని.....తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది ....) ఇవ్వాళ ఏం పద్యం నేర్చుకున్నావో చెప్పు" అంటూ అడిగేవారు .....
నాన్న నన్ను మెచ్చుకోవాలంటే ఒక్క తప్పు కూడా లేకుండా పద్యం చెప్పాలని నాకు బాగా గుర్తుండేది .....పద్యం చెప్పడం పూర్తయ్యాక…, ఒక్క తప్పు లేకుండా చెప్పినందుకు ....…, స్పష్టమైన ఉచ్చారణకు మెచ్చుకునేవారు ...అంతే కాకుండా అర్ధం కూడా వివరించేవారు ......
నాకింకా లీలగా గుర్తు .....ఒకసారి ....."పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు .....జనులా పుత్రుని కనుగొని పొగడంగ నాడు కలుగును సుమతీ" అనే పద్యం అర్ధం చెప్పినప్పుడు అడిగాను ......."నాన్నా, పుత్రోత్సాహము అనే ఎందుకు రాసారు .....పుత్రిక గురించి ఎందుకు రాయలేదు ?!" అని ......"పద్యం లో పుత్రుడినే ఉదాహరించినా అర్ధం ఇద్దరికీ వర్తిస్తుందమ్మా " నాన్న చెప్పడం గుర్తు ........ ఎందుకో ఈ ఒక్క విషయంలో ఇప్పటికీ సంతృప్తి లేదు ..
నాన్న దగ్గర ఉన్న (సిరా పోసుకుని రాసుకునే) పెన్నులంటే అప్పట్లో నాకు చాలా సరదాగా ఉండేది .... బ్లూ కలర్ ,రెడ్ కలర్ సిరా బుడ్లు(Ink Bottles) ఉండేవి ఇంట్లో ......కలంలో సిరా అయిపోగానే ఇంకు పిల్లర్ తో ఇంకు తీసుకుని నింపుకోవాలి .....అది కూడా సరదాగానే ఉండేది .....ఒక్కోసారి పాళీ(Nib) సరిగా పడకపోతే నోటితో సరిచేయాలని ప్రయత్నించి పొరపాటున నోటినిండా సిరా పీల్చి రంగులలో మునిగిన నోటిని చూసుకోవడం కూడా సరదానే ....
అప్పట్లో ఓ రోజు నాన్న కొత్తగా ఒక పెన్ను కొనుక్కొని వచ్చారు .....నాకిప్పటికీ ఆ పెన్ను గుర్తుంది ......నలుపు రంగు పెన్ను ....దాని మీద తెల్లటి చారలు .....ఎంత అందంగా కనిపించిందో ......ఆ పెన్ను నాకు కావాలనే ఆశ కలిగింది .....కానీ ఎలా ..... పెన్నుతో రాసే వయసు కాదు ......అయినా అడిగా ....
"ఇది చిన్న పిల్లలకు ఇవ్వకూడదు .. పిల్లల పరీక్ష పేపర్లు దిద్దడానికి తీసుకుని వచ్చాను ...కుదరదు" అన్నారు నాన్న ....
సరే అప్పటికి మర్చిపోయాను ....
తర్వాత ఒకరోజు స్కూల్ లో నేను తరగతిలో ఉన్నాను ......మా క్లాసు టీచరు రామకోటయ్య మాష్టారు .....నాన్నకు మంచి స్నేహితులు కూడా .....
పక్క క్లాసులో నాన్న ఉన్నారు .....ఎందుకో గుర్తులేదు …నేను నాన్న దగ్గరకు వెళ్లి మళ్లీ ఆ పెన్ను చూసి ఒక్కసారి కావాలని పేచీ పెట్టాను .....కుదరదన్నారు ....నేను కూడా ఇంకా మొండికేసాను ......
నాన్నకు ఎప్పుడూ కోపం రాదు ....అదీ మా మీద అస్సలు రాదు .....ఆ క్షణంలో నేను పెట్టిన పెచీకి నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది .....అక్కడే ఒక బెత్తం(స్టిక్) ఉంది .....అది తీసుకుని నాన్న నన్ను "కుదరదని చెబుతుంటే పేచీ పెడతావా" అంటూ ఒక్కటిచ్చారు ......నాన్నతో నేను దెబ్బలు తినడం నాకు గుర్తున్నంతవరకు అదే మొదటిసారి, చివరిసారి ......ఆ భయంలో నా లాగు తడిసిపోవడం కూడా నేను గమనించలేదు .....వెక్కి వెక్కి ఏడుస్తూ బయటికొచ్చాను ...రామకోటయ్య మాష్టారు నేను ఏడవడం చూసి ....ఏం జరిగిందో గ్రహించి .....ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని రా పో అని ఇంటికి పంపించారు .....ఏడుస్తూ ఇంటికి వెళ్ళాను .....ఏం జరిగింది అని అడిగింది మా అమ్మ ....ఏడుస్తూనే చెప్పాను........నువ్వు బడికెళ్ళి ఇలా పేచీలు పెడతావా అని మా అమ్మ ఇంకో నాలుగు తగిలించింది .....బట్టలు మార్చి .....బడికి వెళ్ళమని పంపించింది ........
అయితే బడికి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే ....బడికి ఇంటికి మధ్యలో తుమ్మచెట్లు దగ్గర అలిగి కూర్చుండి పోయాను .....అలిగి ఉండటం అయితే ఉన్నాను కానీ ....ఎంత సేపని అక్కడ ఉంటాను ..... కొమ్మలకున్న ఆకులన్నీ కోసి కుప్పలు పోయడం మొదలు పెట్టాను ......అలవాటు లేని పని …కాసేపు చేసాక విసుగు పుట్టింది కానీ అలక తగ్గలేదు .....దారిన పోయేవాళ్ళందరూ ఆగి ...."పంతులు గారమ్మాయివి కదూ .....ఇక్కడేం చేస్తున్నావు ...ఇంటికి పో ...." అనడం మొదలు పెట్టారు ....
ఆకులన్నీ అయిపోయాక కొమ్మలు విరిచేసాను .....అయినా కోపం తగ్గలేదు .....అలా అలా జరుగుతూ మరో చెట్టు దగ్గరకు వెళ్ళా ...... అప్పుడు కనిపించింది అక్కడ, చుట్ట చుట్టుకుని ....గోధుమ రంగులో ...చచ్చిందా బ్రతికిందా అనే అనుమానం కలిగిస్తూ పడుకుని నిద్రపోతున్న ఒక పాము ......(మా ఊర్లొ ఉండేవి అన్ని త్రాచులే.....బురద పాములు సరదాగా చూసిపోవడానికి కూడా రావు .... ) నాకు కాళ్ళు వణికి పోయాయి ....చప్పుడు చేస్తే పాముకి ఎక్కడ మెలకువ వస్తుందో అని .....మెల్లగా అడుగులో అడుగేస్తూ కొంత దూరం నడిచి .....ఆ తర్వాత పరుగే పరుగు ఇంటికి ......ఇంటికొచ్చాక ఎవరితో మాట్లాడకుండా అరుగు మీద ...కుర్చుని ....తర్వాత చీకటి పడ్డాక ....మెల్లగా ఇంట్లోకి వచ్చి కూర్చున్నా ......
సాయంత్రం అందరూ భోజనాలు చేసే సమయం .....నాన్న నన్ను పిలిచారు ....తన వడిలో కుర్చోబెట్టుకున్నారు ......"అలా క్లాసులో కొచ్చి పేచీ పెట్టొచ్చా ....తప్పు కదూ ...." అని ఓదార్చి ....అన్నం కలిపి నోట్లో పెట్టారు ....బడిలోకి రాకుండా,ఇంటికి రాకుండా అలా వెళ్ళడం తప్పు కదూ అన్నారు .... మళ్లీ వెక్కిళ్ళు గుర్తొచ్చాయి …..అలా ఎప్పుడూ చెయ్యకూడదు అన్నారు ..... అలా చేయడం పొరపాటేనని తలూపి నాన్న గుండెలపై వాలిపోయి నిచ్చింతగా నిద్రపోయా .......
కానీ ఇప్పుడు , ఇంత జీవిత కాలం తర్వాత, అదే వెక్కిళ్ళతో నాన్నకు చెప్పాలనుంది ..... అలా పేచీ పెట్టడం పొరపాటు కానే కాదనీ .....నేనలా చేసి ఉండకపోతే , మీ ఒడిలో ఉన్న"ఓదార్పు” ...... మీ గుండెలపై వాలినప్పుడు ఉన్న “నిశ్చింత” ....నాకెప్పటికీ దొరికి ఉండేవి కావని ...... అసలు ఆ పదాలకు అర్ధమే తెలిసి ఉండేది కాదని......, ప్రపంచంలో ఎక్కడ వెదికినా ...ఎవరిని అడిగినా ..... దొరకవని తెలిసే, అప్పుడు మీరు నాకిచ్చారు అని ......!!
(అప్పటి నాన్న ఫోటో .....నిలబడిన వ్యక్తులలో ఎడమవైపు నుండి మొదటి వ్యక్తి ....అప్పటి ఫోటో అందించిన Siva Jasthi గారికి థాంక్స్ .....)
(Note : Wrote and published on June 14, 2014)