Saturday, September 30, 2017

"ప్రపంచంలో నీకు ఉన్నంత అహం నేను ఎవరిలోనూ చూడలేదు ...."

"ప్రపంచంలో నీకు ఉన్నంత అహం నేను ఎవరిలోనూ చూడలేదు ...." ఈ రోజు ఒకరు నాతో అన్నారు ...🤣
ఒక్కసారిగా ఫక్కుమని నవ్వొచ్చింది .....🤣
పండగ పూట నన్నింత మాట అంటారా ....మాటకు మాట సమాధానం చెప్పు ....అని నాలో ఉన్న అహం అహాన్ని నిద్రలేపబోయింది కానీ ....వద్దులే ...అది అలా నిద్ర పోవడమే నీకు నాకు ఆరోగ్యం అని ....అహం హాయిగా నవ్వింది ....🤣
నిజానికి వాళ్ళు / మరెవరో అన్నారని కాదు కానీ ....నాకు (చాలా / కొద్దిగా నాకు తెలియదు ....) అహం ఉన్న మాట నిజం ....😊
అయితే ఈ అహం అన్ని సమయాల్లోనూ ....అందరి దగ్గర మనం ప్రదర్శించం ....
అసలు మనలో ఉందని కూడా మనకు తెలియదు ....ఎవరో చెప్తే తప్ప ...
వాళ్ళు ఎలాంటి సందర్భంలో చెప్పారు .. మనలో ఉన్న అహాన్ని వాళ్లెలా చూసారు అని ఆలోచిస్తే ....., మనం వాళ్లకు అహాన్ని చూపించే అవసరాన్ని వాళ్ళు కలిగించారు ....అని అర్ధం చేసుకోవచ్చు ....🤔
మనలో అహం అనేది ఎప్పుడూ సుషుప్తావస్థలో ఉంటుంది ...😴
ఓ రకంగా అది నిద్రిస్తున్న సింహం లాంటిది ....🦁
సింహం దానిని నిద్రపోనిస్తే ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించదు ....దాని మీద ఎవరైనా రాళ్లు వేస్తే అది గర్జిస్తుంది ...దానికి ఎవరైనా నొప్పి కలిగిస్తే అది కూడా పంజా విసురుతుంది ....దాన్ని ఎవరైనా చంపాలని చూస్తే ....అది తిరిగి వాళ్ళ ఉనికే లేకుండా కబళించాలని చూస్తుంది .....
అలాగే అహం కూడా ....🤔
తనను ప్రశ్నిస్తే ....అవమానిస్తే ....తక్కువ చేసి చూస్తే ....అది ఎలాగైనా మళ్ళీ అలాంటి సందర్భం తనకు ఎదురుకాకుండా ప్రశాంతంగా ఉండడం కోసం ...వాళ్ళని తనకంటే తక్కువ చేసి , వాళ్ళను కూడా అవమానించి ....వాళ్ళను కూడా తక్కువ చేసి ....తన కోపం చల్లార్చుకుంటుంది .....
నా చిన్నతనం నుండి నాలో అహం ఉందని గుర్తించిన వాళ్లంతా ...ఎక్కువ శాతం ....అలా నన్ను బాధపెట్టిన వాళ్ళు ....లేదా అవమానించిన వాళ్ళుగా గుర్తించబడ్డారు ...☝️
వాళ్ళనలా పక్కన పెడితే ....మరి కొందరు ....అహాన్ని కావాలని రాళ్ళేసి రెచ్చగొట్టి ...అది కోపంతో గర్జిస్తే ....అబ్బే సరదాకి రాళ్లేశాను అని ....అని తెలివిగా తప్పుకునేవాళ్ళు ....😢
మరి కొందరు ...అహాన్ని బాధపెట్టి ....అది నొప్పితో అరిస్తే ....చూశావా దీన్నే అహం అంటారు ....అని గుచ్చి చూపించేవాళ్ళు ...😥
అయితే ....చాలాకాలం రకరకాల ఆటలన్నీ చవిచూశాక ....ఒకరోజుకి ...ఇవన్నీ అర్ధమై హాయిగా నవ్వుకునే స్థాయికి అహం చేరుకుంటుంది ....
అలాంటి వ్యక్తులనే నిరహంకారి అని పిలుస్తాం ...
ఇక ఈ స్థితికి చేరుకున్నాక ....ఎవరు ఏ విధంగా ..నిద్ర లేపాలి అని ప్రయత్నించినా .... అది గుర్రు పెట్టి నిద్రపోతుంది తప్ప ....ఏ మాత్రం చలించదు...
నేను ఇంకా ఆ నిరహంకార స్థితికి చేరుకోలేదు ....కానీ ప్రయత్నిస్తున్నా ....😢
ఆ నిరహంకార స్థితికి చేరుకోవాలంటే ...ముందు
మనలో అహం ఉందని గుర్తించాలి ....అది గుర్తించాక ఎప్పుడెప్పుడు అది గర్జిస్తుందో పరిశోధించాలి ....ఎలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు అది నిద్ర లేస్తుంది ....అని ....అప్పుడు దానికి ఏ సమాధానము చెప్పి నిద్ర లోకి పంపించాలో ....సాధన చేయాలి .... దాన్ని శాశ్వత సుషుప్తావస్థలో ఉంచాలి ....😔
మొత్తానికి మన అహం పై మనం విజయం సాధించాలి .....ఆ విజయం కోసమే నా కృషి ....😍

Tuesday, September 19, 2017

ధైర్యంగా దగ్గరవ్వాలని....😍

ఆత్మీయులను , బంధాలను , స్నేహితులను , బంధువులను ....ఎవరైనా కానివ్వండి ....మనం వాళ్ళను ఎందుకు దూరం చేసుకుంటాం ....ఏ సందర్భంలో దూరం చేసుకుంటాం ....??!!
అని ఆలోచిస్తే ....నాకు అర్ధమైంది ఏమిటంటే .....,,,
వాళ్ళ వలన మనకు ఏదైనా ....మానసికంగా , శారీరకంగా , ఆర్థికపరంగా .....నష్టం / కష్టం కలిగినప్పుడు మనం వాళ్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాం ....అని
ఇంకా కాస్త ముందుకు వెళ్లి ఆలోచిస్తే ....మన వాళ్ళు అనుకున్న వాళ్లకు ఎవరైనా నష్టం / కష్టం కలిగించినా ...అది మనకే కలిగింది అనుకుని ....మనం కొందరికి దూరమవుతాం ...అది వేరే విషయం ...
అయితే జీవితం అంతా ఇలా అందరినీ దూరం చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమా అని ఆలోచిస్తే ....నాకెందుకో అది సరైన పరిష్కారం కాదనిపించింది ....
ఇలా కాదు .....అని ఆలోచించి ....
ఎవరైనా నాకు ఏదైనా నష్టం / కష్టం కలిగిస్తే ...వాళ్లకు, "నీ ప్రవర్తన వలన నాకు ఈ నష్టం / కష్టం కలిగింది ...దయచేసి ఇలా ఎప్పుడూ చేయకండి ...." అని చెప్పడం అలవాటు చేసుకున్నా ....
కొన్నిసార్లు వాళ్ళు చేసిన పని నాకు ఏ విధంగా బాధ కలిగిస్తుందో విడమరచి చెప్పా ...
కొన్నిసార్లు ఏడుస్తూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ....నాకు అంత బాధ కలిగించారు మీరు అని చెప్పడం కోసం ....😥
విచిత్రం ఏమిటి అంటే ....అలా చెప్పినప్పుడు ....అవతలి వాళ్ళు...
బాధ కలిగించాం అని ఒప్పుకోవడానికి నిరాకరించారు ....కొన్నిసార్లు , నువ్వలా చేయడం వలెనే మేమిలా చేసాం అని ....తిరిగి నా మీదే తప్పుని మోపడానికి ప్రయత్నించారు ....
కొందరు ....సారీ చెప్పి, అదే ప్రవర్తనను మళ్ళీ మళ్ళీ కనబరుస్తున్నారు ....
మరి కొందరు ....ఆ విషయాన్ని దారి మళ్లించి మనం ఆ విషయం మర్చిపోయేలా చేయాలని ...ఏడుస్తున్న పిల్లల చేతిలో చాకోలెట్ పెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు ....
అయినా నా ప్రయత్నం నేను ఆపకుండా ....మళ్ళీ ధైర్యంగా "మీ ప్రవర్తన వలన నాకు ఈ విధమైన బాధ కలిగింది ....దయచేసి మళ్ళీ అలా ప్రవర్తించకండి ...." అని చెబుతూనే ఉన్నా ....
ఇప్పటివరకు అలా చెప్పించుకున్నవాళ్ళల్లో ...."నేను నిన్ను బాధపెట్టి ఉంటే....క్షమించు ...మళ్ళీ ఎప్పుడూ ఇలా ప్రవర్తించను...." అని మనస్ఫూర్తిగా చెప్పినవాళ్ళే లేరు ....😥 (
అయినా ఆపకుండా ....నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను ...
ఇందంతా నేను చేసేది ....పిరికిదానిలా వాళ్లకు చెప్పకుండా నేను వాళ్లకు దూరం కాకూడదని ....వాళ్ళ ప్రవర్తన నాకెలా బాధ కలిగిస్తుందో వాళ్లకు తెలియజేసి ..ధైర్యంగా దగ్గరవ్వాలని....😍
అప్పుడు కూడా ఒక సమస్య ఎదురవుతుంది .....😥
(అదేమిటో మిత్రుల ఊహాశక్తికి వదిలేస్తున్నా ..... 🙂)

ఆ క్షణాలే నాకు జీవితాన్ని జీవించిన సంతృప్తి కలిగించిన క్షణాలు ....😍

ఈ రోజు మధ్యాహ్న్నం....
ఒక సమస్య గురించి ....ఏమైంది అని అడిగిన నా డాటర్ కి ....,,
"కక్ష్య తీర్చుకునే అవకాశం ఉన్నా కూడా ....అన్ని పరిస్థితులూ నాకు అనుకూలంగా ఉన్నా కూడా ....ఆలోచించి ....క్షమించి ...వదిలేశాను ....
కక్ష్య తీర్చుకుంటే సంతోషంగా ఉండేదాన్నో లేదో నాకు తెలియదు ....కానీ క్షమించి వదిలేసినందుకు నేను ఈ క్షణం చాలా సంతోషంగా ఉన్నాను ....
మంచి పని చేసాను అని అనుక్షణం నాకు నేను చెప్పుకుంటున్నాను ....
నిజంగా క్షమించడం చాలా కష్టంగా అనిపించింది ....ఎంతో సంఘర్షణకు గురయ్యాను ....కానీ క్షమించాక వచ్చే ఆనందం ముందు ఆ కష్టం చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ...." అని ఓ వ్యక్తి పట్ల నా ప్రవర్తనను వివరించా ....😍
నిజం చెబుతున్నాను ....
నిజానికి నాకు క్షమా గుణం చాలా తక్కువ ....😥ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా ....
నిజం చెప్పొద్దూ ....జీవితం ఎంతో హాయిగా అనిపిస్తుంది ...❤️
ఇన్నాళ్లూ ...మనకు లేదా ఇతరులకు ద్రోహం చేసిన వాళ్ళ మీద ....ప్రతీకారం /పగ తీర్చుకోవడమే పర్యవసానం అనుకునేదాన్ని ...
కానీ ఇప్పుడు అర్ధమవుతుంది ....అలా ద్రోహం చేసినవాళ్ళని క్షమించడం లోనే గొప్పతనం దాగుందని ....క్షమించడమే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అని ...🤔
క్షమించడం అంటే ....
వాళ్ళేదో చేసార్లే ... వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అని వదిలేయడం కాదు ....అది అసమర్ధత కూడా అవుతుంది .....
అలా చేసిన వాళ్ళ పట్ల .... అంతకంటే ఎక్కువ బుద్ధి చెప్పగలిగే అవకాశం మనకు వచ్చినప్పుడు (అలా వచ్చే వరకూ పోరాటం చేయాలి ) ...ఆ సందర్భంలో కూడా క్షమించడమే ఇక్కడ మనం అలవరచుకోవాల్సింది....
అప్పుడే మన నిజమైన నిగ్రహ శక్తి తో కూడిన క్షమా గుణాన్ని మనకు మనం పరిచయం చేసుకుంటాం ....🙂
ఈ రోజు...ఆ క్షణాలే నాకు జీవితాన్ని జీవించిన సంతృప్తి కలిగించిన క్షణాలు ....😍

Wednesday, September 13, 2017

ప్రేమైక జీవితం మన సొంతం అవుతుంది ...!

జీవితంలో ఒక దశలో మనకు భయం వేస్తుంది ....మనకు దొరికిన అభిమానం జీవితాంతం ఉండదేమో అని .....మనకు దొరికిన ప్రేమను మనం కోల్పోతామేమో అని ....లేదా ఈ ప్రేమ, అభిమానం లేకుండా మన జీవితం ఏమవుతుందో అని .....ఇలా ....
కానీ ఒక్కసారి .....ఒక్కసారి ఆ అభిమానం ,ప్రేమ ఏం లే
కుండా లేదా పోగొట్టుకుని కొంతకాలం బ్రతికాక ....వాటికి మనం ఎంత విలువ ఇచ్చాము మనల్ని కూడా కాదని అని తెలుసుకుంటే ....మన నుండి మనల్ని ఎంత కోల్పోయామో అర్ధం అవుతుంది ....
అప్పుడే మనల్ని మనం అభిమానించడం ,ప్రేమించడం నేర్చుకుంటాం ....
ఇక ఒకసారి మనల్ని మనం ప్రేమించాక ,అభిమానించాక.....ఇతరుల ,అభిమానం ప్రేమ మన వద్దకు వచ్చి రెండు రోజులుండి పోయే అతిధులే అని మనకు అర్ధం అవుతుంది ....
అతిథుల్ని మనం వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తాం , మన దగ్గర ఉన్నది పంచుతాం , గౌరవంగా చూసి పంపిస్తాం ....
అతిథుల్ని మనం ఆహ్వానించినా , వాళ్ళంతట వాళ్ళే వచ్చినా ....శాశ్వతంగా ఉండిపోరుగా ....
మళ్లీ వాళ్ళు వెళ్ళిపోయాక మనం , మన జీవితం ....యధాతధంగా .... 
ఇక భయాలేం ఉండవు ....ప్రేమైక జీవితం మన సొంతం అవుతుంది ....... 

Tuesday, September 12, 2017

నేను అందరికీ ప్రియమైన శత్రువుని అన్నమాట ....😍


జీవితంలో ...
వీళ్ళు నాకు చాలా ఆత్మీయులు , స్నేహితులు,బంధువులు,హితులు , సన్నిహితులు అని అనుకున్నవాళ్ళే ...నన్నుఆగర్భ శత్రువుగా పరిగణిస్తూ ఉంటారు ...నేను తప్పనిసరై వాళ్ళతో శత్రుత్వం ప్రకటించేవరకు నన్ను వదిలిపెట్టరు...అస్సలు నేను ఈ మధ్య శత్రుత్వం అనే పదం మర్చిపోయాను అని మొత్తుకున్నా ....వాళ్ళ ప్రవర్తనతో శత్రుత్వం కలిపి రంగరించి నా మీద గుమ్మరిస్తారు ....😥
మరో కోణంలో ....వీళ్ళు నాకు ఆగర్భ శత్రువులు అనుకున్న వాళ్ళు ....నాకు ప్రాణ మిత్రులుగా మారిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే .....నేను వాళ్ళను మిత్రులుగా చేసుకుంటా రమ్మని ...బొట్టు పెట్టి పిలిచినా కూడా ... వాళ్ళు కాదు మాకూ శత్రుత్వమే ఇష్టం అంటారు .....😜
ఇలా అందరూ నాతో మితృత్వం కన్నా శత్రుత్వాన్నే ఇష్టపడతారు ....ఎందుకో అర్ధం చేసుకోవాలి ....🤔
అలా ...నేను అందరికీ ప్రియమైన శత్రువుని అన్నమాట ....😍

Sunday, September 10, 2017

"ఇంక నా జీవితంలో ఏ పురుషుడికి చోటు లేదు ...."

"ఇంక నా జీవితంలో ఏ పురుషుడికి చోటు లేదు ...." చెప్పింది... ఓ స్త్రీ ఈ రోజు నాతో ....తన జీవితంలో ఎదురైన చేదు వాస్తవాల గురించి వివరిస్తూ ....
"ఆ ఆలోచనే... మీకు ఇప్పుడు ఉన్న బాధను రెట్టింపు చేస్తుంది ....మీ మనసుని , శరీరాన్ని డిప్రెషన్ లోకి వెళ్ళమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ....ఒక పురుషుడి వలన మోసపోయిన స్త్రీ ....మరో పురుషుడు నా జీవితంలో లేడు ....అని ....ఒక స్త్రీ వలన మోసపోయిన పురుషుడు...నా జీవితంలో మరో స్త్రీ లేదు అని తాత్కాలికంగా అనుకోవడం ....ఆ బాధ నుండి ఉపశమనం పొందడం కోసమో ...ఆ బాధను భరించలేకో అయి ఉంటుంది ....
ఆ ఆలోచన రానీయకండి ....జీవితం ఎంతో విశాలమైనది ....
మరో పురుషుడికి చోటు ఉంటే ఉంటుంది ...ఉండకపోతే ఉండదు ...మీకు తెలియని మీ జీవితాన్ని మీరు శాసించకండి ....
ఏమో ....మరో అద్భుతమైన ....మీ మనసుని అర్ధం చేసుకునే పురుషుడు మీ జీవితం లోకి రావచ్చు ...అప్పుడు మీరు కాదనలేరు ...
ఎవరూ రాకపోవచ్చు ....అప్పుడు మీరు బాధపడలేరు ....
జీవితాన్ని ఏం జరిగినా జరగనివ్వండి ....మరో పురుషుడికి చోటులేదు అనే నిర్ణయం ఇప్పుడే తీసుకోవాల్సిన అత్యవసరం ఏముంది ....??!! మరో పురుషుడు రేపే ఎదురై మీ జీవితం లోకి వస్తాను అంటే ఆనందంగా ఆహ్వానించండి ....లేదా ఎన్నాళ్ళున్నా ఎవరూ రాకపోయినా వారి కోసం అన్వేషించకండి....
జరిగిన సంఘటనలను ....జరగనిచ్చి ....మీ బాధ్యతలను మీరు నిర్వర్తించుకుంటూ ... ....సంతోషంగా ఉండండి ...." చెప్పా ....

మన అభిప్రాయాలు ...

మన అభిప్రాయాలు ...
ఎదుటివాళ్ళ లోపాలను తడిమి చూడనంతవరకు వాళ్ళ దృష్టిలో అవి గొప్ప భావాలు ....  
ఒక్కసారి, వాళ్ళ లోపాలను తడిమి చూస్తే ...
అంతే ...కట్టలు తెగిన వారి ఆగ్రహానికి సాక్ష్యం చెప్పలేని మౌన గీతాలు ....  

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!
ఇప్పుడున్న చోటు నుండి మరో అడుగు ముందుకు వేయడానికో , మరో మెట్టు పైకి ఎక్కడానికో ప్రయత్నిస్తున్నావా ....??!!
అయితే..... ఒక విషయం తప్పనిసరిగా గమనించి ,గుర్తుపెట్టుకోవాలి .....,,,
మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్పకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ....ఏ సమస్యా లేదు ..... కానీ ....
అలా కాకుండా ...మనవాళ్లే కదా , మన మేలు కోరేవాళ్లే కదా అనుకుని ..... చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్తే ....మనల్ని కదలకుండా గట్టిగా అయినా పట్టుకుంటారు , లేదా కిందకు లాగేస్తారు .....
అంతే కాకుండా ....వాళ్లు ఏ క్షణంలో అయినా మనల్ని వదిలేయొచ్చు ....అందుకు కూడా సిద్ధంగా ఉండాలి .....
ఎందువలననగా ....,,,,
మనం వాళ్ళ కింద అయినా ఉండాలి , లేదా వాళ్లకు సమానంగా అయినా ఉండాలి ....వాళ్ళ కంటే ఎత్తుకు ఎదగడానికి ఎవ్వరూ ఒప్పుకోరు .....ఏ రోజుల్లో అయినా ....
"లోక సహజ జీవన సిద్ధాంతం ....!!"  
----------------------------
(గమనిక : ఇందులో "నువ్వు" అంటే అర్ధం "నేను" అని ....
ఇది అన్ని వేళలా అందరికీ వర్తించదు .... అని అర్ధం  )

Monday, September 4, 2017

ఈ రోజు చేయగలిగిన పని ఈ రోజే చేయాలి ...

ఈ రోజు చేయగలిగిన పని ఈ రోజే చేయాలి ...
ఈ రోజు చేయాల్సిన పని రేపు చేయాలి అనుకుంటే .....రేపు రెండు పనులు చేయాలి.....
రేపు చేయాల్సిన ఒక పనిని ఎల్లుండి చేయాలి అనుకుంటే ....ఎల్లుండికి మూడు పనులు అవుతాయి .....
సహజంగానే.. రేపు చేయాల్సిన పని మాత్రమే రేపు చేయగలం ....రేపు నిన్న చేయాల్సిన పనిని చేయలేము .....
నిన్న చేయాల్సిన పనిని, రేపు చేయగలం అని అనుకోవడం .....నిన్న చేయలేక తప్ప ....రేపు చేయగలిగి కాదు .....
ఎల్లుండి మూడు పనుల్లో ఒక పనినే చేయగలం కాబట్టి, ఆ తర్వాత రోజుకి మూడు పనులు చేయాల్సి ఉంటాయి .....
ఆ తర్వాత రోజు అనుకోని ఒక పని వచ్చిపడుతుంది .....అప్పుడు మొత్తం నాలుగు పనులు అవుతాయి .....
ఇన్ని పనులు ఎలా చేయగలం అని ఆందోళనకి గురవుతాం ....
ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయగలిగితే ..... రేపటికి మన జీవితంలో అనుకోని పనులకు కాస్త చోటు ఉంచామని అర్ధం .....ఆ పని మనం ఆందోళనకి గురవకుండా పూర్తి చేయగలుగుతాం .....
ఎప్పుడు ఏ అనుకోని ఆపద అవస్తుందో అని జీవితం జీవితాన్ని ఆందోళనకు గురిచేయకుండా ....నీరాకను ముందే ఊహించాను ....నాలో నీ కోసం కాస్త చోటు ఉంచాను నువ్వు రావాలనుకుంటే రా .....నేను నిన్ను ఎదుర్కోగలను అని జీవితం ఆపదను ఆహ్వానించాలి ...
ఇది కొందరు తమకు తెలియకుండానే తాము ఆచరిస్తూ ఉంటారు ... .....వాళ్లనే మనం ....నాయకులు , తెలివైనవాళ్లు , నియమ నిబద్ధులు అని ...రకరకాల పేర్లతో పిలుస్తాం .... 
అనుసరించలేని వాళ్ళు ...ఏ చిన్న కష్టం వచ్చినా తమ మీద ప్రపంచంలో ఉన్న భారం అంతా పడిపోయిందని ....మేం చేసేపని ఈ భూ ప్రపంచం మీద ఎవరూ చేయడం లేదని .... గగ్గోలెత్తి పోయి, జీవితాన్ని నరకం చేసుకుంటారు ....! 😥

Sunday, September 3, 2017

ఆల్కహాల్ / మత్తు పదార్ధాలు సేవిస్తూ ....,

ఆల్కహాల్ / మత్తు పదార్ధాలు సేవిస్తూ ...., "నువ్వు కూడా తాగు ...నీకూ కిక్ వస్తుంది ....హాయిగా అనిపిస్తుంది ..." అని నన్ను అడిగిన ఒకరిని
"ఎందుకు మీరు వాటికి అలవాటు పడ్డారు ....తాగితే మీలో ఏం జరుగుతుంది ....ఆ కిక్ వలన మీకు ఎలా అనిపిస్తుంది" అని అడిగా నవ్వుతూ
"జాబ్ లో, ఫ్యామిలీ లో, రిలేషన్స్ లో... భవిష్యత్తు గురించి ఉండే టెన్సన్స్ నన్ను భయపెడతాయి ....అప్పుడు మైండ్ విపరీతమైన భయానికి గురవుతుంది .....భవిష్యత్తు గురించి భయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు .....తాగినప్పుడు ....అవేవీ గుర్తుకు రావు ....అవి మసక మసకగా కనిపిస్తాయి .....అవి అసలు కనిపించవు కూడా ....అందుకే తాగుతాను ...." వాళ్ళ సమాధానం
"అంటే ....మీకు అవేవీ గుర్తుకు రాకుండా ఉండడం కోసం మాత్రమే తాగుతారు ...అవేవీ గుర్తుకు రాకపోతే మీకేమనిపిస్తుంది ..." అడిగా ...
"అంతే కదా ...అవేవీ గుర్తుకు రాకపోతే ...నేనే రాజు నేనే మంత్రి అనిపిస్తుంది ....ఎంతో హాయిగా ... నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను అనిపిస్తుంది ...." వారి సమాధానం
"ఒకవేళ ఆల్కాహాల్ తీసుకోకుండానే ...మీ జీవితాన్ని మీరు జీవిస్తున్నారు అని ...లేదా భవిష్యత్తు గురించిన ఆందోళనలు లేకుండా జీవితం హాయిగా అనిపిస్తే ...మీరు ఆల్కహాల్ తీసుకోవడాన్ని ఆపేస్తారా ...." నా ప్రశ్న
"ఇంపాజిబుల్ ....అలా అనుకోవడం అసాధ్యం ...."అపనమ్మకం నిండిన స్వరం అటువైపు
"ఒకవేళ అలా అనుకోగలిగితే, నీకు ఆల్కాహాల్ అవసరం లేదు కదా ...." నవ్వుతూ అడిగా ...
"అవసరం లేదు ...అవసరం ఉన్నదే అలా అనుకోవడం కోసం కదా ...." సందేహం ...
"సరే ....నీకు ఏ సమస్య ఎదురైనా ....ఆ సమస్యను నీ జీవితంతో పోల్చి చూడు ....
ఉదాహరణకు సమస్య అనే ఒక సర్కిల్ , జీవితం అనే ఒక సర్కిల్ పక్క పక్కనే నీ మెదడులో గీసుకో ....
నీకు సమస్య రాగానే ....
సమస్య అనే సర్కిల్ ని చిన్నదిగా చేస్తూ పో ....జీవితం అనే సర్కిల్ అలాగే ఉంచు .....
అప్పుడు సమస్య జీవితం కంటే చిన్నదిగా కనిపిస్తుంది ....
మళ్ళీ... సమస్య అనే సర్కిల్ ని చిన్నదిగా చేయడానికి ప్రయత్నించు .....అప్పుడు సమస్య జీవితం కంటే ఇంకా చిన్నదిగా కనిపిస్తుంది ...
విశ్రమించకు ....ఇంకా సమస్య నీకు కనిపిస్తూనే ఉందని మరిచిపోకు ....ఇంకా అదే చేయడానికి ప్రయత్నించు ....
కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు ....
సమస్యను తగ్గించడం సున్నా తగ్గించినంత తేలిక కాదు కదా ....??!!
అందుకే ఈసారి జీవితం అనే సర్కిల్ దగ్గరికి రా ....
ఇప్పుడు జీవితం అనే సర్కిల్ ని కాస్త పెద్దది చేయి ....
రెండూ పోల్చి చూడు ....
సమస్య ఇంకా చిన్నదైపోయింది కనిపిస్తుంది ...జీవితం ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది ....
ఇలా సమస్యను తగ్గిస్తూ ...జీవితాన్ని విశాలం చేసుకుంటూ ..., జీవితాన్ని విశాలం చేసుకుంటూ ..సమస్యను తగ్గిస్తూ .... పో ....
చివరకు జీవితం ఎంతో విశాలంగా కనిపిస్తుంది .....సమస్య కనుమరుగైపోతుంది ....
ఇలా సమస్యలను జీవితం ముందు చిన్నవిగా చేసి , అతి తక్కువ కాలంలోనే వాటిని కనుమరుగు చేయడం .. జీవితాన్ని హాయిగా జీవించడం అలవాటు చేసుకుంటే ....అలాంటి మత్తు పదార్ధాలను ఆశ్రయించే అవసరం ఏముంది .....??!!
ప్రపంచంలో అసాధ్యం అనే పదం ఎంత పొదుపుగా వాడుకుంటే , సాధ్యం అనే పదం అంత విరివిగా వాడుకోగలుతాం ..." చెప్పా ...నేను రోజూ అనుసరించే జీవిత సూత్రం ..... 

ఈ క్షణం మనం చేసిందే సరైనది ...

"నేను ఇలా చేస్తే మారిపోతాను .....అలా చేస్తే మారిపోతాను ....
ఈ పని చేస్తే నాలో మార్పు రావచ్చు ....ఆ పని చేస్తే నాలో మార్పు రావచ్చు ....."
ఇలా కొంతమంది నాతో అనడం నేను వింటూ ఉంటాను ...
అసలెందుకు మారిపోవడం ....??!! అని నాకు సందేహం కలుగుతూ ఉంటుంది ..... 
అంటే ఇప్పుడున్న నిన్ను నువ్వు ఇష్టపడడం లేదా ....నువ్వు చేసేది తప్పు అని నువ్వు భావిస్తున్నావా ...అలా భావించినప్పుడు తెలిసీ ఆ తప్పు ఎందుకు చేస్తున్నావు ..... ??!! పలు ప్రశ్నలు నాకు నేను వేసుకుంటూ ఉంటాను ....
పరిస్థితుల ప్రభావం వలన చేస్తున్నాను అని సమాధానం చెప్పొచ్చు ....ఒప్పుకుంటాను ..
కానీ ....నా అభిప్రాయం ఏమిటంటే ...,,,,ఆ పరిస్థితులు ....అందులో ఉన్న నిన్ను ...నువ్వు ఇష్టపడే తీరాలి ....అదే జీవితాన్ని జీవించడం అంటే ....,,,,
నువ్వు ఇప్పుడున్న స్థితి నుండి మారిపోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నావు అంటే ....నువ్వు ఈ రోజుకి మరణించినట్టే అర్ధం ....నీలో నువ్వు ఈ క్షణం లేవనే అర్ధం ....ఎప్పటికో జీవించాలని ప్రయత్నిస్తున్నావని అర్ధం ...
పరిస్థితులు ఏవైనా ....మనం ఎలా ఉన్నా ....మనం ఏం చేసినా ...ఈ క్షణం మనం చేసిందే సరైనది నా దృష్టిలో...ఈ క్షణం మనం చేసిందే సరైనది నా దృష్టిలో...అది తప్పయినా ఒప్పయినా ... అదే జీవితం ....జీవితాన్ని జీవించడం ...   

Friday, September 1, 2017

అక్షరాలు అందమైన / పదునైన ...ఆయుధాలు ...

అక్షరాలు అందమైన / పదునైన ...ఆయుధాలు ...
అవి....
ఏ మాత్రం పరిచయం లేని వారిని ఆత్మీయులుగా చేయగలవు ....
ఎంతో ఆత్మీయులను శత్రువులుగా చేయగలవు .....
అలాగే ...
ఆత్మీయులను ఇంకా ఆత్మీయులుగా చేయగలవు ....
శత్రువులను ఆత్మీయులుగా చేయగలవు ....
అక్షరాలకు ఉన్న శక్తి అలాంటిది ......కాదనలేం....
అందుకే ....ఏదైనా వ్రాసేటప్పుడు ....మనం ..."అక్షరాల బంధాలకు" సిద్దపడి, ఆలోచించి ... వ్రాయాలి .....
నేను ....సాధారణంగా నా చుట్టూ జరిగే సంఘటనలు , నిత్యం నాలో జరిగే ఆలోచనల సంఘర్షణ ను అక్షరాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటా .....
అవి అన్వయించుకుంటే అందరికీ/లేదా కొందరికి వర్తిస్తూ ఉంటాయనుకోండి ....
అందువలన , ఏదైనా భావం ...ఎవరికైనా ముల్లులా గుచ్చుకుంటే ...వాళ్లకు నేను శత్రువునైపోతా .... 
ఏదైనా భావం వాళ్ళ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తే .....వాళ్లకు నేను ఆత్మీయురాలిని అవుతూ ఉంటా ..... 
అందులో ఆత్మీయులు , అపరిచితులు ఇద్దరూ ఉంటారు ..... 
అపరిచితులు ..మిత్రులైనా ,శత్రువులైనా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ..... 
కానీ ఆత్మీయులు శత్రువులుగా మారినప్పుడు ....ఒకింత బాధగా అనిపిస్తుంది ..... 
ఏ సందర్భంలో ....ఏం వ్రాశానో ఆలోచించుకుని .....అందులో ఏ మాత్రం తప్పు లేదు అనిపిస్తే ....అన్ని బంధాలను విస్మరించి వ్రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటా .....
కొన్నాళ్ల తర్వాత ఆత్మీయులు అర్ధం చేసుకుని ....మళ్లీ మనల్ని అభిమానిస్తారేమో కానీ .....,,,,,,,,,,,,,,
అక్షరాలు ఏర్పరచుకునే భావాలను విస్మరిస్తే ....అవి మళ్లీ మన దగ్గరకు ఎప్పటికీ రావు .... 
అందుకే ...ఆత్మీయుల కన్నా ...నా భావాలకు,అక్షరాలకు విలువ ఇవ్వడం అలవాటు చేసుకున్నా ... 
ఇది నాకు నేను చేసుకుంటున్న మరో జీవిత న్యాయం .....