Wednesday, November 20, 2019

ఈ రోజు ఒక ఇరానియన్ తో పరిచయం జరిగింది ...

ఈ రోజు ఒక ఇరానియన్ తో పరిచయం జరిగింది ...
మొదట నేనూ అర్ధం కానట్టు చూశా ....నేను ఇరానియన్ అనగానే ....
ఇరాన్ నుండి వచ్చానని చెప్పాక అప్పుడు అర్ధం అయింది ...
అతనితో నా కొద్దిసేపు ప్రయాణం మాత్రం నా కార్ లేకపోవడం వలన అతను ఊబర్ నడపడం వలన చేయాల్సి వచ్చింది అనుకోండి ....అది వేరే విషయం ....
అతనితో మాట్లాడడం చాలా ఆసక్తికరంగా గడిచింది కాసేపు ....
కొంతమందితో మనం కాసేపట్లోనే చాలా రోజులనుండి పరిచయం ఉన్నట్టు కలిసిపోయి మాట్లాడతాం ....కొందరితో ఎన్ని సంవత్సరాలయినా ఏ మాత్రం బండి ముందుకు కదలదు ...
ఇతను మొదటి కోవకు చెందిన వ్యక్తి అన్నమాట ....
అతను అమెరికా ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించాడు తనని తాను పరిచయం చేసుకుంటూ ....
వాళ్ళ అబ్బాయి , అమ్మాయి చదువుకోవడానికి అమెరికా వచ్చి ....ఇక్కడే జాబ్స్ చేస్తూ సెటిల్ అయ్యారట ....వాళ్ళతోనే ఉండాలని ....అతను కూడా ఇరాన్ నుండి ఇక్కడికి వచ్చేశారట ....
అందుకే ...అతని ఇంగ్లిష్ కూడా నా ఇంగ్లిష్ లాగే ఎవరి యాస వాళ్లకు పూసగుచ్చినట్టు అర్ధం కాకుండా ఉంది ...
అతను కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇరాన్ భాషలోనే చదువుకుని ఉంటాడు అనుకున్నా .....
ఇరాన్ లో ఉన్నప్పుడు ...ఎకనామిక్స్ , మాథ్స్ చదువుకుని ఏదో మానేజ్మెంట్ రిలేటెడ్ జాబ్ చేసాడట ....ఇప్పుడు ఇక్కడ కాబ్ నడుపుకుంటున్నాడు ....పిల్లలు మంచి జాబ్స్ లో సెటిల్ అయ్యారు అని కూడా చెప్పాడు ....
మనలో చాలామందికి లేని ధైర్యం నేను అతనిలో చూసా ....
మనం అయితే ఉన్నతోద్యోగం ఏదైనా చేసి ....మళ్ళీ చిన్న పాటి పని చేసుకోవాలి అంటే ....చావనైనా చస్తాం కానీ ....చిన్న ఉద్యోగానికి మాత్రం పోను అంటాం ....
కానీ అతను అంత మంచి ఉద్యోగం వదిలేసి వచ్చి కూడా ఇక్కడ పిల్లల కోసం ఉంటూ ....క్యాబ్ నడుపుకోవడం చాలా హుందాగా చేస్తున్నాడు ....
నన్ను కూడా అతను వివరాలడిగాడు ....సాధ్యమైనంత వరకు చెప్పా ....
నువ్వు సాఫ్ట్ వేర్ లోనే ఎందుకు జాబ్ చేస్తున్నావు ...నీకు ఈ జాబ్ హ్యాపీగా ఉందా అని అడిగాడు ....
ఇది అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నా ....ఇదే కాదు నేను చేయగలిగిన పని , నాకు అన్నం పెట్టే పని ..ఏది దొరికినా హ్యాపీ గానే చేస్తాను ....ఇదే పని చేయాలి / చేస్తాను అని నిబంధనలు ఏమీ లేవని వివరించా ....
------------------------
కాసేపాగాక ...నా పిల్లలకు పెళ్లి చేయడం కష్టంగా ఉంది ...
మా దేశం వాళ్లకు ....మా సంస్కృతి తెలిసిన వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది ....కానీ వాళ్ళు ఈ దేశంలో ఎక్కువమంది దొరకరు ....దొరికినా వాళ్లకు మేము ....మాకు వాళ్ళు నచ్చడం కష్టంగా ఉంది అని అసలు విషయం చెప్పుకొచ్చాడు ....
అవును ....ఈ సాంస్కృతిక విభేదాలు అన్ని దేశాల వాళ్ళు ఎదుర్కొనేవే ....మా దేశం వాళ్లకు కూడా ఈ కష్టాలు ఉన్నాయని అంగీకరించా ....
"ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న విషయం ....నువ్వు ధైర్యంగా చర్చిస్తున్నావు ...."చెప్పా అతనితో .....
నేను చాలామంది ఇండియా అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటాను ....అమెరికా అమ్మాయిల్ని చేసుకోవడం ఎవరూ ఇష్టం లేదన్నారు .ఎందుకో తెలియదు ....చెప్పాడు సందేహంగా ...
"ఎందుకంటే ....అమెరికా అమ్మాయిలు వంట చేయరు ....మేమైతే రోజూ వంట చేసి పెడతాం ....మాది లైఫ్ టైం అగ్రిమెంట్ ..." చెప్పా ...నవ్వుతూ ...
"ఇంకా మాట్లాడితే ....వీళ్ళే వాళ్లకు వండి పెట్టాలి ....అమెరికా అమ్మాయిల్ని చేసుకుంటే ...."మళ్ళీ నేనే క్లారిటీ ఇచ్చా ...
"కానీ ఇండియా అమ్మాయిలు అమెరికా అబ్బాయిల్ని చేసుకోవడానికి ఇష్టపడతారు ...." చెప్పాడు అతను ...
"అమెరికా అబ్బాయిలు కూడా ఇండియా అమ్మాయిల్ని చేసుకోవడానికి ఇష్టపడతారు ...."మళ్ళీ అతనే చెప్పాడు ....
"అదృష్టాన్ని ఎవరు కాదనుకుంటారు ...." చెప్పా అతనికి , అంతా విని ..
"అమెరికా అబ్బాయిలు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు ....అమెరికా అమ్మాయిలు అసలు సర్దుకుపోరు ....వివాహ బంధంలో " చెప్పాడతను ....(నిజంగా చెప్పాడండోయ్...నా అభిప్రాయం కాదు )
"ఇక్కడి అమ్మాయిలకు ఛాయిస్ ఉంది ....మాకు లేదు ..." నవ్వా ....నాకు ఎదో గుర్తొచ్చి ....
--------------------------
ఇదిగో ఇలా సాగింది మా సంభాషణ ....
కొసమెరుపేమిటంటే ....ఫ్రెంచ్ వాళ్ళు చాలా రొమాంటిక్ అబ్బాయిలట ....(ఇది కూడా అతనే చెప్పాడు )
ఒక ఇరానియన్ ఒక ఫ్రెంచ్ అతను రొమాంటిక్ అని అంగీకరించడం కూడా గొప్పే కదా ....పాపం ఇతనికి అసలు లౌక్యం తెలియనట్టుంది ....అనుకున్నా మనసులో ....😭
అయితే నాకు తెలిసినా ....నేను ధ్రువపరుచుకున్న విషయం ఏమిటంటే ....
ఈ భిన్న సంస్కృతుల కలయిక ....జీవన విధానాల వలన ...ప్రేమలు - పెళ్లిళ్లు కూడా రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే సమస్యలు అని ....
మనం ఇంకా ....కులాల దగ్గర , మతాల దగ్గర , ప్రాంతాల దగ్గర ....భాషల దగ్గరే సతమతమవుతున్నాం ....పిల్లల ఎదుగుదలను, జీవితాన్ని, జీవన విధానాన్ని ....సంస్కృతుల్ని ...వాళ్ళ ప్రేమను అర్ధం చేసుకునే దాకా ఎప్పుడొస్తాం ...??!!
అది కూడా వాళ్ళ భవిష్యత్తులో ఒక భాగం అని ఎప్పుడు గుర్తిస్తాం ....??!!🤔
-----------------------------
జవాబు అందని ప్రశ్నలు కాసేపు పక్కనపెట్టి నేను నా దైనందిన కార్యక్రమాల్లో లీనమైపోయా ....ఈ రోజుకి ...!🙏

Sunday, November 17, 2019

భాష రాకపోవడం వలన అడుగడుగునా శ్రమ దోపిడీ ...

ఈ పోస్ట్ చదివి ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు ....
ఈ నా అభిప్రాయం నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న , నా పోస్ట్ చదవడం తటస్థించిన ఏ కొద్ది మందికో చేరుతుంది తప్ప ....ఏ నిర్ణయాలను మార్చే శక్తి లేదు ....
========================
అందుకే... కాసేపు, మన మన అభిప్రాయాలను చర్చించుకునే ఓ వేదిక అనుకుని ..మాట్లాడుకుందాం ....
మొన్నొక రోజు ...."ఇప్పుడు ఉన్న కరెంట్ టాపిక్ "తెలుగు మాధ్యమాన్ని" రద్దు చేయడంపై నీ అభిప్రాయం ఏమిటి ..." అని ఫోన్ లో అడిగారొకరు నన్ను ...
"నన్నెందుకు అడిగారు" నవ్వుతూ అడిగా ....
"అంటే నీకు తెలుగు భాషంటే చాలా ఇష్టం కదా ....పైగా చిన్నతనం నుండి నువ్వు తెలుగు మీడియం లో చదివావు ...తెలుగుని అభిమానిస్తూనే పెరిగావు ....ఇప్పుడు ఇక్కడున్న కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ లో జాబ్ చేస్తున్నావు ...అందుకే ..." నా సందేహ నివృత్తి కోసం చెప్పారు ...
"నేనిప్పుడు ఏ విషయం మీదా నా అభిప్రాయాలు ఏం చెప్పడం లేదు ....మానేశా ..అంటే, లేక కాదు ....చెప్పాలని లేదు ...అయినా మీకో అభిప్రాయం ఉంటుందిగా ....అది ప్రొసీడ్ అవ్వండి ...." మళ్ళీ చెప్పా ....
"ఉంటుందనుకో ....కానీ, నేను / ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ...ఇలా ఎవరి అభిప్రాయం అడిగినా ....పార్టీలకనుగుణంగా ....ప్రాంతాల, గ్రూపుల వారీగా ...అలోచించి చెబుతున్నారు ....నువ్వు అయితే నీ మనసులో ఏం అనుకుంటున్నావో అదే చెబుతావు కదా ....అది తెలుసుకుందాం అని అడిగా ...." చెప్పారు వివరంగా ...
"ఓహ్ ....పోనీలెండి ....ఇంకా మీకు నా మీద సదభిప్రాయమే ఉంది ..."
చెప్పా ....నా అభిప్రాయాన్ని, అక్కడ - ఇక్కడ జోడిస్తూ ...
========================
ఇక నా విషయానికి వస్తే ....నాకు భాషా నిర్ణయం మీద అభిప్రాయం చెప్పడానికి అర్హత లేదని నా అభిప్రాయం ....
ఎప్పుడో ....ఇరవై ఏళ్ళ క్రితమే నేను నా పిల్లలని తెలుగు మీడియంలో చదివించకుండా ఇంగ్లిష్ మీడియంలోనే చదివించాను ....గవర్నమెంట్ స్కూల్ కి పంపించకుండా ఇంగ్లిష్ కాన్వెంట్ కి పంపించాను ...చిన్నవయసులోనే వాళ్ళని అమెరికా కి తీసుకొచ్చాను ...మమ్మి అంటే మురిసిపోయా ...డాడీ అంటే చప్పట్లు కొట్టా....
ఇప్పుడు పిల్లలందరూ తెలుగే చదివి ....నా భాషని బ్రతికించాలని వెర్రి కోరిక నాకు లేదు ....
అసలు తెలుగు మీడియం లో చదివితేనే తెలుగు నేర్చుకుంటారు అనే అభిప్రాయం ఏమిటో కూడా నాకు అంతు పట్టలేదు ....
నా పిల్లలు తెలుగు మీడియం లో చదవకపోయినా ....తెలుగు చాలా బాగా మాట్లాడగలరు ....
ఇప్పటికీ నా పిల్లలు ఆర్ట్ వేసుకునేటప్పుడు ....తెలుగు బుక్స్, తెలుగు ఆర్టికల్స్, కథలు ...వాళ్లకు చదివి వినిపిస్తూ ఉంటా ...
ఏ పదానికి అర్ధం తెలియకపోయినా నాకు ఫోన్ చేసి మరీ అడుగుతారు ....భాష మీద ఉన్న మమకారం....
నేను లేనప్పుడు నన్ను మిస్ అవ్వకూడదు అని, తెలుగు పాటలు (నేను వినే పాటలు ) పెట్టుకుని విని నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు ....
నా ఆర్టికల్స్ ఇంగ్లిష్ లోకి అనువదించాలి అంటే వాళ్ళు చేస్తేనే నా భావానికి న్యాయం చేశారనిపిస్తుంది ...
----------------------------
నేను కూడా చిన్నతనంలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని ఉంటే బాగుండేది అని ....ఎన్ని వేలసార్లు ఇక్కడ అనుకున్నానో గుర్తులేదు ....ఆ మరుక్షణమే ...పోనీలే పిల్లలైనా ఈ పోటీ ప్రపంచంలో నాలా ఇబ్బందులు పడరు....అని నాకు నేను సర్ది చెప్పుకుని ఉంటాను ...
ఒక హిందీ సినిమా ఉంటుంది Hichki...అని ....
అందులో హీరోయిన్ కి ఒక syndrome ఉంటుంది ...
(Tourette's syndrome is a problem with the nervous system that causes people to make sudden movements or sounds, called tics, that they can't control. For example, someone with Tourette's might blink or clear their throat over and over again. Some people may blurt out words they don't intend to say. (Sourced from Google))
తన ఫ్యామిలీతో డిన్నర్ కి వెళ్లిన ఓ సందర్భంలో తనకు ...ఆపకుండా వెక్కిళ్లు వస్తూ ఉంటాయి ...
వెయిటర్ కి తను ఆర్డర్ ఇవ్వాలి ....వెయిటర్ వెయిట్ చేస్తూ ఉంటాడు ...
హీరోయిన్ ఫాదర్ ....ఇబ్బందిగా ఫీల్ అయ్యి ....కూతురి కోసం ఆర్డర్ తనే ఇస్తాడు ..
నిజానికి తను మాట్లాడలేకపోయినందుకు కాదు ....ఆ క్షణంలో తండ్రి తనను అర్ధం చేసుకోలేకపోయినందుకు ....అదొక లోపంగా ఎత్తి చూపినందుకు ఆ అమ్మాయికి ఏడుపొస్తుంది ...
నాకు కూడా ఏడుపొచ్చింది ఆ సీన్ చూసినప్పుడు ....
అప్పట్లో నేను కూడా ఏ హోటల్ కి వెళ్లినా ....నా కోసం ఎవరినైనా ఆర్డర్ చేయమని అడిగేదాన్ని....వాళ్ళు చెప్పేది నాకు ...నేను చెప్పింది వాళ్లకు అర్ధం కాదేమో అని భయం ...
పైగా నేను రెండు మూడు సార్లు చెప్పడం ....వాళ్లకి అర్ధం కాకపోవడం ....మా వారికి ఇబ్బందిగా అనిపించి కాబోలు ....ఎప్పుడూ మావారు ....నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసేవారు ....వాళ్లకి అర్ధం అయినా కూడా ....
ఆఫ్కోర్స్ తర్వాత అస్సలు నా కోసం మాట్లాడొద్దు అని నా చుట్టూ ఉన్నవాళ్లను రిక్వెస్ట్ చేసి పరిస్థితుల్ని నాకనుగుణంగా మార్చుకున్నాను అనుకోండి ....అది వేరే విషయం ....
భాష రాకపోవడం , మన మనసులో ఉన్నది పూర్తిగా చెప్పలేకపోవడం కూడా ఈ సిండ్రోమ్ లాంటిదే ....
-------------------------------------------
నాకింకా గుర్తుంది ....ఒకసారి ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఒక అమెరికన్ లేడీ నేను వెళ్ళగానే ....నేను ఎక్కడ ఉంటున్నాను అని , నేనుండే ప్రదేశం పేరు అడిగింది ....
"gaithersburg" చెప్పా ...
అర్ధం కానట్టు పెట్టిన ముఖకవళికలు చూసి ...."gaithersburg" చెప్పా ...ఇంకొంచెం సాగదీసి ....
ఓహ్ ...."gaithersburg" చెప్పింది సరి చేసి ....
ఇన్నేళ్లయినా నాకిప్పటికీ ...నేను చెప్పిన దానికి ....ఆవిడ చెప్పిన దానికి .... ఉన్న తేడా ఏమిటో అర్ధం కాలేదు ...ఇంకెప్పటికీ కాదు కూడా ....
తెలుగు మీడియం లో చదివిన చాలామందికి ఎదురయ్యే కష్టాలు ఏమిటో కొంతమందికి ఎంత వివరించినా అర్ధం కావు ....
భాష రాకపోవడం వలన అడుగడుగునా శ్రమ దోపిడీ ...
ఒక పని చేయడానికి మనకు పది గంటలు పడితే ఒక్క ముక్కలో ఫలానాది చేస్తున్నాం అని చెబుతాం ....రెండో ముక్క చెప్పడానికి భాష రాదు ....ఎదుటివాళ్ళకు అర్ధం కాదేమో అని భయం ....లేదా రెండో ముక్క చెప్పడానికి ఆలోచించే సమయం ఉండదు ....
తెలుగు అక్షరాల్ని పదాలుగా మార్చి దాన్ని ఆంగ్లం లోకి అనువదించి .....వెనకేసి , కిందేసి , ముందేసే సరికి ఉన్న సమయం కాస్తా అయిపోతుంది ....(ఇందంతా మెదడులో జరిగే ప్రక్రియ)
అదే పని ఈ భాష వచ్చిన వాడు చెప్పాలంటే ....ఒక గంట చేసిన పని రెండు గంటలు, కథలు కథలుగా చెప్పుకుంటాడు ....
ఎవరు కష్టపడినట్టు కనిపిస్తుంది అంటే ....,,, కథలు చెప్పిన వాడు,
పని చేసిన వాడిగా ....చెప్పలేని వాడు, చేయని వాడిగా ముద్ర వేయబడతాడు ..
డెమో ఇవ్వాలంటే భయం ....మీటింగ్స్ కండక్ట్ చేయాలంటే భయం ....
ఒకే ఒక్క కారణం భాష మీద పట్టు లేకపోవడం ....
మనం చేసిన పని ఎదుటివాడికి అర్ధమయ్యేట్టు మనం చెప్పే లోపు .... భాష బాగా తెలిసిన వాడు ....చిలవలు పలవలు అల్లి దోచుకుపోతాడు ...కాకి పిల్లి కథలా ....
మనకొచ్చిన ఇంగ్లిష్ బ్రతకడానికి సరిపోవచ్చు .....రాణించడానికి సరిపోవాలంటే ఇంకా భాష కావాలి ....
అలా అని వీళ్ళకొచ్చు వాళ్లకొచ్చు అని వేళ్ళమీద లెక్కించకండి ..వేలు మీద లెక్కపెట్టి చూడండి....
----------------------------
అంతెందుకు చిన్నతనం నుండి మనం ఇంగ్లిష్ మాట్లాడిన వాడినే గొప్పోడిగా చూసాం ....తెలుగు మాట్లాడితే చిన్న చూపు చూసాం ....ఇప్పటికీ చూస్తున్నాం ....
నేను మా వారికి తెలుగులో ఒక అభిప్రాయాన్ని చెప్పాననుకోండి ....మొదటి చెవి వరకు కూడా రానివ్వరు ....అదే నాకూతురు అదే అభిప్రాయాన్ని ఇంగ్లిష్ లో చెప్పిందనుకోండి ....
"ఇవ్వాళ నా డాటర్ ఎంత గొప్ప విషయం చెప్పిందనుకున్నావ్" అంటారు ....కళ్ళెగరేస్తూ ....
విన్న తర్వాత ....ఇదే కదా మొన్న నే చెప్పింది అంటే ....ఓహ్ నువ్వు చెప్పావా ఎప్పుడు అంటారు ....
అప్పుడు గుర్తొస్తుంది ....ఓహ్ నేను తెలుగులో చెప్పా కదూ ....అని ....
ఇంగ్లిష్ మీడియం పెట్టినందుకు "అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఏం కాను" అని ఏ తల్లితండ్రులూ ఏ ఉద్యమాలూ చేయలేదు ఎందుకంటారు ....
ఎందుకంటే ....ఎవరికీ తెలుగులో చదివించడం ఇష్టం లేదు కనుక .....
మనం ఉద్యమాలు చేసేది ఎవరి కోసం ....తెలుగు భాష కోసమా ...పిల్లల భవిష్యత్తు కోసమా ....
ఏమో ...ఈ రెండూ అయితే ఉద్యమం అవసరం లేదు ....
ఇప్పటికే ఇంటికో అమెరికా వాసి ఉన్నారు ....వాళ్ళ కోసం అమెరికా లేదా మరో దేశానికి వచ్చిన తల్లితండ్రులు కూడా ప్రపంచ నివాసానికి ఏది అవసరమో అది నేర్చుకుంటున్నారు ....
అసలు నా సదభిప్రాయం ఏమిటంటే ....,,,
ఇప్పుడు పెట్టిన ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ లో తల్లితండ్రులకు కూడా చదువుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది అని ....వాళ్ళు, పిల్లల కోసం భవిష్యత్తులో విదేశాలకు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు ...
అమెరికాలో తన కొడుకుని చూడడానికి వచ్చిన ఓ తండ్రి మనసులో మాట ...."నాకు కూడా ఇంగ్లిష్ ఇచ్చి ఉంటే డ్రైవింగ్ లైసెన్సు తెచ్చుకుని ....నా కొడుక్కి సహాయంగా ఉండేవాడిని ...నేనూ మా ఆవిడ అన్ని ప్రదేశాలూ తిరిగి చూసేవాళ్ళం ....వాడి మీద ఆధారపడాల్సి వస్తుంది ....కాళ్ళు చేతులు అన్ని బాగుండి కూడా ...."
-------------------------
అయినా ఒక నియమం పెట్టినప్పుడు ముందే ఎందుకు వ్యతిరేకత ....
రేపు అది ఉపయోగం లేకపోతే మళ్ళీ మార్చుకోవచ్చు కదా ....ఒక నూతన నియమాన్ని పరిచయం చేయడం ఉరిశిక్ష కాదుగా ....
ఎప్పటికప్పుడు మన అవసరాలకు అనుగుణంగా నియమ నిబంధనలు మార్చుకుంటూ జీవితాలను చక్కదిద్దుకోవడం మానవ మనుగడకు ఎంతో అవసరం ....
ఏమో ...భవిష్యత్తులో ...ఇలాగయినా.. తెలుగు మాట్లాడేవాడిని గొప్పోడిగా చూస్తామేమో ....తెలుగు వ్రాయడం , తెలుగు మాట్లాడడం అదృష్టం అనుకుంటామేమో ...వేచి చూద్దాం ...
------------------------------
అన్నట్టు ...గమనిక చెప్పాలిగా ....ఈ అభిప్రాయం వలన రాజ్యాలు కూలిపోవు , రాచరికాలు కొట్టుకుపోవు ...భాష అంతరించి పోదు ...
ఎందుకంటే చెప్పింది తెలుగులో కదా ...పెద్దగా విలువేం ఉండదు ....😂