Tuesday, March 19, 2024

అది మా మిషన్ పిల్లాడి గొప్పతనం ...

 ప్రపంచంలో ఎవరినైనా ...హెల్ప్ అడిగితే ఒకసారి కాకపోతే వందసార్లు అడిగితే ...పోనీలే పాపం అని చేస్తారు ...

ఎవరికైనా ...ఓ వందసార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి అయినా ఎత్తుతారు ...
ఎవరైనా ..బాబ్బాబు అని బ్రతిమాలితే .. పోనీలే అని జాలి పడతారు ...
ఎవరైనా ...కాళ్ళా వేళ్ళా పడితే .. ఒక్కసారైనా కరుగుతారు ...
కానీ మా మిషన్ కుట్టే పిల్లాడున్నాడే ...(పిల్లాడంటే పిల్లాడు కాదులే ...నా ఈడు వాడే ...కాకపోతే నా పెళ్ళికి ముందు నుండి మా టైలర్ ఈ పిల్లాడే అవడం వలన ...పిల్లాడు అంటూ ఉంటా ...)
ఉలకడు ..పలకడు...ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు.. చేసినా ...ఎప్పుడు కుడతావ్ అంటే ..."కుడదాం లేమ్మాయ్ " అంటాడు ...
పోనీ డబ్బులు ఇవ్వడం లేదా అంటే ...ముందుగానే ..కాసిన్ని అయినదానికంటే ఎక్కువే ఇచ్చేస్తా ...
అయినా ధీమా ...ఇక ఎక్కడికీ పోదు ఈ అమ్మాయి అని ...
పోనీ వేరేవాళ్లని చూసుకుందామా అంటే ... ఈ పిల్లాడు కుడితే తప్ప నచ్చవు నాకు ...
అది నా బలహీనత ...
పని అంటే ...ఒక నిబద్ధత , ఒక ఏకాగ్రత , ఒక భక్తి ఎవరికైతే ఉన్నాయో ...వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని ఈ ఒక్క కారణానికి ఆరాధించేస్తూ ఉంటా నేను ...
ఆ పిల్లాడికి ఎంత నమ్మకమంటే తనమీద తనకి ...అతను ఒకసారి నాతో అన్న ఈ మాట వింటే ఇట్టే అర్ధమై పోతుంది ... వర్కర్స్ రాలేదమ్మాయ్ అని చెప్పినప్పుడు .....అన్ని నువ్వే కొట్టొచ్చు కదా శ్రీను అంటే ..."వాళ్ళు కుట్టేయి నేను కుట్టను...నేను కుట్టేయి వాళ్ళు కుట్టలేరు .." అని నవ్వుతూ చెప్పేస్తాడు ...
ఆ మాటకి నేను ఫిదా ...
అసలు నా చిన్నతనం నుంచి నేను తన దగ్గరే స్టిచ్చింగ్ కి ఇచ్చేదాన్ని ...
మూడవ తరగతి చదివాడు ... మా పెదనాన్న దగ్గర ..(మంచి టైలర్ అని పేరున్న వ్యక్తి ) సొంత పెదనాన్న కాదు ...రోజువారీ కూలీగా చేరాడు
...అక్కడనుండి చిన్నగా జాకెట్లు కుట్టడం నేర్చుకుని ...ఆ పక్కనే ఒక చిన్నగది అద్దెకు తీసుకుని ...మిషన్ కొనుక్కుని సొంతంగా షాపు పెట్టుకుని ...అనతి కాలంలోనే ఆ షాపు పక్కన ఒక చిన్న స్థలం కొనుక్కుని ...అందులో కింద షాపు ...పైన ఇల్లు కట్టుకున్నాడు ...ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ముగ్గురు బిడ్డలకు తండ్రయ్యాడు ...కాలక్రమేణా ...అందులోనే ఇంకో అంతస్థు లేపి ...అది బ్యూటీ పార్లర్ కి అద్దెకు ఇచ్చాడు ...ఆ ఆతర్వాత ...ఆ కింద కూడా షాపింగ్ కాంప్లెక్ చేసి ...మరో స్థలంలో ఇంకో ఇల్లు కట్టి ...అక్కడికే తన షాప్ మార్చుకున్నాడు .. ఇప్పుడు ...గుంటూరులో కూడా స్థలం కొని ఇల్లు కట్టిస్తున్నాడు ...
ఇదంతా జరిగే క్రమంలో ...నా పెళ్లి , పిల్లలు , నేను అమెరికా రావడం .. నా పిల్లలు పెద్దవడం ...ఇంత జరిగినా ....నా పిల్లలకి నాకు , బట్టలు కుట్టేది మాత్రం ఆ పిల్లాడే ...
నాకు ఇండియాలో ఉన్నప్పుడు ...రెడీమేడ్ బట్టలు పిల్లలకు కొనడం ఇష్టం ఉండేది కాదు ...
కానీ మంచి మంచి మోడల్స్ పిల్లకు కుట్టించాలని ఆశ మాత్రం ఉండేది ...
అప్పుడు నేను నా ఫ్రెండ్ ...చందనా బ్రదర్స్ , బొమ్మనా బ్రదర్స్ లాంటి షాపులకు వెళ్లి ...తానుల్లో మిగిలిన ముక్కలన్నీ మంచివి కలెక్ట్ చేసి ...తన దగ్గరకు పట్టుకెళ్ళేదాన్ని ...ముక్క చూడగానే ...ఇది ఇలా కుడదాం అమ్మాయ్...ఇది చిన్నమ్మాయికి కుడదాం ...ఇది పెద్దమ్మాయికి కుడదాం అని ...నేను సినిమాల్లో ఉన్న మోడల్స్ చూపిస్తే ...వాటికంటే ఇంకా బాగా వర్క్ చేసి మరీ కుట్టి ఇచ్చేవాడు ...
చూస్తే ఎంత డీసెంట్ గా ఉండేవంటే ...పిల్లలకు వేసి చూసుకుని ...ఆ కుట్టుని , పని తనాన్ని తలచుకుని ...మురిసిపోయేదాన్ని ...
ఏమాటకామాటే ...సినిమాల్లో డిజైన్స్ కంటే ఇంకా బాగా వచ్చేవి ...పిల్లలు కూడా బుట్ట బొమ్మల్లా ఎంతో ముద్దొచ్చేవాళ్ళు ...
ఒక ముక్క కూడా వేస్ట్ చేయకుండా ...ముక్క ఎక్కువైనా తక్కువైనా డిజైన్ లో ఎలాగో ఇరికించేస్తాడు ...
ఎప్పుడు అయినా వెళ్లనీ ..."ఇప్పుడొచ్చావేందమ్మాయ్ ... పెళ్లిళ్ల సీజన్ లో ..." అంటాడు...
నేనెప్పుడొచ్చినా అదే మాట అంటావ్ అని విసుక్కుంటూ ఉంటా ...
అదంతా నాకు తెలియదు ...నావి నాకు ఈ డేట్ లోగా ఇచ్చేయ్యాల్సిందే అని పేచీ పెడుతూ ఉంటా ...
నాకు ఇదివరకు మోడల్స్ మంచివి కుట్టేవాడు... కొంత లావయ్యాక ...తనే డిసైడ్ చేసేశాడు ...నీకు ఆ మోడల్స్ వద్దమ్మాయ్ ...బాగోవు అని ...
ఎంత పొడుగు పెట్టాలో ...ఎంత పొట్టి పెట్టాలో ఏది బాగుంటుందో ఏది బాగుండదో ....అంతా తన ఇష్టమే ...
ఆఫ్కోర్స్ ..ఇప్పటి పిల్లలకు అలా కుడితే నచ్చట్లేదు అనుకోండి ...
మనిషిని కంటితో చూస్తే ఇక కొలతలు తీసుకోడు.. ఏం అవసరం లేదులేమ్మాయ్ ...నేను కుడతాలే అంటాడు ... కళ్ళతోనే కొలతలు చెప్పేస్తాడు ...
ఒక సినిమాకి వెళ్ళడు, సోది చెప్పేవాళ్లొస్తే వాళ్ళతో మాట్లాడడు... ఎంతో అవసరం అయితే తప్ప ఫంక్షన్స్ కి వెళ్ళడు ...విలాసాల జీవితం ఇష్టం ఉండదు ...ఫ్రెండ్స్ తో తిరగడు...
భార్యని పిల్లల్ని చూసుకుంటూ ...పనే లోకంగా బ్రతికేస్తాడు ...
సెలవు రోజుల్లో ...రాత్రి పది గంటల తర్వాత ...ఒక్కడే నిలబడి ఒక శిల్పి లాగా కటింగ్స్ చేసుకుంటూ కూర్చుంటాడు ... పది గంటల తర్వాత షాప్ ఓపెన్ చేస్తే పోలీసులు ఒప్పుకోరు కదా అంటే ..."ఎవురమ్మాయి మనల్ని అనేది ..అదుగో ఆ ఎస్సై గారి భార్య జాకెట్లు ...వారం నుంచి తిరుగుతుంది ...." అంటూ నవ్వేస్తాడు ...
ఔరా అనుకుంటా ...
ఒకసారి అలాగే .. నా దగ్గర కార్ ఉంది కొంటావా అంటే ...కొందామని ఆశపడ్డాడు ..
"ఉండమ్మాయ్ మా ఆవిడ్ని అడిగి వస్తాను ..." అంటూ లోపలికెళ్ళాడు ...
మళ్ళీ కాసేపటికి వచ్చి ..."మా ఆవిడ వద్దంటుందమ్మాయ్ ...వద్దులే " అన్నాడు ..
పద నేను మీ ఆవిడ్ని కన్విన్స్ చేస్తాను అన్నా ....
లోపలికెళ్తే వాళ్ళావిడ కూర్చోబెట్టి టీ ఇచ్చి ..వాళ్ళ స్కూటర్ ని షాపులో పనిచేసే వర్కర్స్ వేసుకెళ్లి ఎలా పాడు చేశారో చెప్పి ...కార్ కూడా అంతేనండీ ...అందుకే వద్దన్నాను ..." అని చెప్పింది ...
"ఇది అట్లా చేయన్లే ...ఒప్పుకో " అని బ్రతిమాలాడు పాపం ...
తను ఒప్పుకోలేదు ..ఇక తన నిర్ణయం మార్చుకున్నాడు ...
నాకు ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఒకటి అర్ధం అయింది ...
భార్యకు , భార్య మాటకు (ముగ్గురు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యాక కూడా ) అంత గౌరవం ఇవ్వడం ... నిర్ణయం తీసుకునే ముందు పర్మిషన్ అడగడం చూసి ...తెగ ముచ్చటేసింది ...
ఆహా ...చదువుకి ...భార్య ను చూసుకోవడానికి, గౌరవించడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు అనిపించింది ..
మూడో క్లాసయితే ఏం ...ముచ్చటగొలిపే సంస్కారాలు ఉన్నప్పుడు ...
ఒక సిగరెట్ అలవాటు లేదు ... చెడు తిరుగుళ్ళు తిరగడు ...మందు అలవాటు లేదు ...రేయింబవళ్లు పని పని పని ...
చాలా చాలా మంది జంటలకు ఉన్నది వాళ్లకు లేనిది మాత్రం ఒక్కటే ...అందుకే వాళ్ళు అంత మంచి జంట అయ్యారు అనిపించింది ...అదే ఇగో ...అహం ..
ఈ మధ్య పొరపాటున కొన్ని ఆన్లైన్ లో బట్టలు ఆర్డర్ చేసి ...అవి పిల్లలకు కుట్టి పోస్ట్ చేయమని పంపించా ....పిల్లలేవో మోడల్స్ కుట్టమన్నారు ..
అవి ఇచ్చి రెండు నెలలయింది ...ఎప్పుడనగా పోస్ట్ చేస్తా అన్నాడో ...ఇంతవరకు అతీగతీ లేదు ...ఫోన్ చేస్తే తియ్యడు ...అదేమంటే ఫోన్ ఇంటికి తీసుకెళ్లనమ్మాయ్ అంటాడు ...మరెప్పుడు ఇస్తావ్ అంటే ...పెళ్లంటాడు ...ఇల్లంటాడు ...
బాగా కోపం వచ్చింది ...కానీ కోపం లో నుండి కూడా గౌరవం , ప్రేమే వచ్చింది ...
అది మా మిషన్ పిల్లాడి గొప్పతనం ...
నేను బాగా అడ్మయిర్ చేసేవాళ్ళల్లో ఒక వ్యక్తి ఈ అబ్బాయి ..
ఈ జీవితానికి ఈ ఋణానుబంధం విడిపోదు ఇక ... రేపో ఎల్లుండో ఫోన్ తీస్తాడు ...ఏం చేస్తాం బ్రతిమాలుకోవడమే ...బాబ్బాబు అని ...!
కొసమెరుపు ఏంటంటే ...తను పని నేర్చుకున్న మా పెదనాన్న గారబ్బాయికి తన దగ్గర పని ఇచ్చాడు ...సరిగా పని చేయడు..తాగుడు అని... లాభం లేదమ్మాయ్ అని నవ్వుతాడు ...కోపం మాత్రం రాదు మహానుభావుడికి ...!
అదండీ కథ ...!😇✍️
See insights and ads
Like
Comment
Share

Monday, February 19, 2024

నా జీవితం గురించి ఓ క్షణం అలోచించి

 నా జీవితం గురించి ఓ క్షణం అలోచించి ... నాకు అవసరమైనప్పుడు సలహాలిచ్చి ...నాకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేసి ...నేనోడిపోతుంటే నా గెలుపు కోసం ఆరాటపడి ... నే పడిపోతుంటే నాకు చేయూతనిచ్చి ... నేను ధైర్యం కోల్పోయినప్పుడు నాకభయమిచ్చి ... నా కోసం వాళ్ళ సమయం కాస్త వెచ్చించి ... నా పోరాటంలో వాళ్ళు ఒక సమిధై ... నా యుద్ధంలో వాళ్ళు ఒక సైన్యమై ... నా జీవితంలో వాళ్ళు ఓ భాగమై ... ఎవరైతే ఉంటారో ...వాళ్ళు నాకు సెలెబ్రిటీ అవుతారు ...

అంతే గానీ ...
వాళ్ళ జీవితం గురించి వాళ్ళే ఆలోచించుకుని ... వాళ్లకి అవసరమై వాళ్ళు ఏదో సాధించి ... వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు కష్టపడి ... వాళ్ళ సమయం వాళ్ళే వెచ్చించుకుని ...వాళ్ళ పోరాటం .,...వాళ్ళ యుద్ధం ....వాళ్ళ జీవితం ...అన్ని వాళ్ళ కోసమే బ్రతికే వాళ్ళు ....నాకు సెలిబ్రిటీ ఎలా అవుతారు ....?!
నా సెలెబ్రిటీలు నా జీవితంలో చాలామంది ఉన్నారు ...వాళ్ళని కలవడానికి ...వాళ్ళతో కాస్త సమయం గడపడానికి నేను ఆసక్తి చూపిస్తా ...!😇✍️

Wednesday, January 24, 2024

అంతా మానవ మనుగడలో భాగమే ...!

 ఒక వ్యక్తిని,

ఇష్ట పడడం కన్నా ...కష్ట పెట్టడం చాలా కష్టం ...
క్షమించడం కన్నా ... తప్పుల్ని ఎత్తి చూపడం చాలా కష్టం ...
ప్రోత్సహించడం కన్నా ... నిరుత్సాహ పరచడం చాలా కష్టం ...
మాట్లాడడం కన్నా ... మౌనంగా ఉండడం చాలా కష్టం ...
బంధం లో ఉండడం కన్నా ... వదిలివేయడం చాలా కష్టం ...
ప్రేమించడం కన్నా ...ద్వేషించడం చాలా కష్టం ...
ఏ మనిషీ పుట్టుకతోనే ...ద్వేషంతో, కోపంతో ..పుట్టరు ..
కానీ అవన్నీ పులుముకుని జీవించాల్సి వస్తుంది అంటే అది తప్పనిసరై ...లేదా తప్పకుండా మనుగడ కోసమే ...అయ్యుంటుంది
అందుకే ...
మానవత్వం మూర్తీభవించిన శాంత, సహన , క్షమా గుణ సంపన్నులందరు మంచివాళ్ళు కారు ....
ద్వేషం నింపుకుని బ్రతుకుతూ ...ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు ...
ఎవరెవరి జీవితాల్లో ఏముందో ...ఎవరెవరి మనస్సులో ఏం జరుగుతుందో చదివినప్పుడే వాళ్ళ వాళ్ళ ప్రవర్తనకు అర్ధం తెలుస్తుంది ...
అంతా మానవ మనుగడలో భాగమే ...!