Saturday, December 29, 2018

అనుభవాత్మకమైన ఆలోచనకు ...ఊహాజనితమైన ఆలోచనకు

అనుభవాత్మకమైన ఆలోచనకు ...ఊహాజనితమైన ఆలోచనకు ఎంతో తేడా ఉంటుంది ....
ప్రాక్టికల్ థింకింగ్ లో ఎమోషన్స్ కి తక్కువ అవకాశం ఉంటుంది ....ఇది కఠినాత్మకమైన ఆలోచన అనిపిస్తుంది .....ఇలా ఆలోచించేవాళ్ళు ఇతరులకి మానవత్వం లేనివారుగా కనిపిస్తారు ....వీళ్ళెప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటారు .... వీళ్ళు బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చినప్పుడు వెనకాడరు ....పని చేయడమే వీళ్లకు పరమార్ధం ...
ఊహాజనితమైన ఆలోచనలో అంతా ఎమోషన్ మిళితమై ఉంటుంది ....ఇదెంత మానవత్వమో కదా అనిపిస్తుంది ....ఇలా ఆలోచించేవాళ్ళు మానవత్వం మూర్తీభవించినట్టుగా కనిపిస్తారు ....వీళ్ళు వాస్తవాలను దగ్గరకే రానివ్వరు ....వీళ్ళు బాధ్యతలను స్వీకరించడానికి ముందుకు రారు ....ఊహల్లో బ్రతకడం వీళ్లకు ఇష్టం ....

అయితే ...ప్రతి మనిషిలో రెండు రకాల ఆలోచనలూ ఉండొచ్చు ....మోతాదును బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించుకోవచ్చు ....
లేదా పనిని, జీవితానుభవాలను బట్టి వాళ్ళ ఆలోచనా విధానాన్ని సవరించుకోవచ్చు ....చెప్పలేం ...
కానీ ...కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ప్రాక్టికల్ గా ఆలోచించి ....ఎదుటివాళ్ళు ఎమోషనల్ గా ఆలోచించినప్పుడు.....లేదా, మనం ఎమోషనల్ గా ఆలోచించి ఎదుటివాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు ... అభిప్రాయబేధాలు రావచ్చు ....
అవి అర్ధం చేసుకుని... ముందుకు సాగితే ...మానవ సంబంధాలు మెరుగు పడొచ్చు ...!🤔

Tuesday, December 4, 2018

బాహ్యకరణ సంతృప్తి...అంతఃకరణ సంతృప్తి....

బాహ్యకరణ సంతృప్తి...అంతఃకరణ సంతృప్తి....
==============================
కొందరు ఇతరులను బ్రతిమాలి పనులు చేయించుకుంటారు ....
కొందరు ప్రాణం పోయినా పనులు చేయించుకోవడానికి ఎవరినీ బ్రతిమాలరు...
అంటే ...ఈ బ్రతిమాలడంలో కొన్ని రకాలు ఉంటాయి ....
ప్లీజ్ ప్లీజ్ ....ఈ పని చేసిపెట్టరా అనో..., ఈ పని మీరు తప్ప ఎవరూ చేయలేరు అనో ...., ఈ పని మీరు కాకపొతే ఎవరు చేస్తారు అనో ...., మీరు ఈ పని చేసిపెడితే నేను మీకు అది ఇస్తా ఇది ఇస్తా అనో ...., రకరకాలుగా అడుగుతారు .....
ఇలా బ్రతిమాలటం ఇష్టం లేకపోతే ...వీళ్ళను బ్రతిమాలటం కన్నా ఆ పనేదో నేనే చేసుకోవడం బెటర్ అని కొందరనుకుంటారు ....
లేదా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించడానికి ఒకరు గుర్తుచేయడమో , బ్రతిమాలడమో ఎందుకు అని కూడా అనుకుంటారు ....
ఇక కొందరు.... ఎవరైనా బ్రతిమాలితే కానీ పనులు చేయరు ....
కొందరు ...ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు .....అది వేరే విషయం ....
బ్రతిమాలించుకుని పనులు చేయాలి అనుకునేవాళ్లు ఎదుటివాళ్లను అవసరం అయినప్పుడు బ్రతిమాలక పోవచ్చు ....
బ్రతిమాలించుకోకుండా పనులు చేసేవాళ్ళు ఎదుటివాళ్లను అవసరమైనప్పుడు బ్రతిమాలొచ్చు ....ఇది మరో విషయం .....
ఏది ఏమైనా అసలు ఈ బ్రతిమాలటం ....బ్రతిమాలించుకోవడం వెనక ఉన్న కథా కమామీషు ఏమిటాని .... ఒకానొక శుభముహూర్తాన కాస్త మెదడు కేంద్రీకరించి ఆలోచించా ....
అప్పుడు నాకు ఒక విషయం బోధపడింది .....
ఎవరు ఏవిధంగా పనులు చేసినా / చేయించుకున్నా .....ప్రతి ఒక్కరికి ఒక విధమైన సంతృప్తి మాత్రం కలుగుతుంది ....
బ్రతిమాలేవాళ్లకు ....ఎదుటివాళ్ళు తమ మాట విని పనులు చేసిపెట్టగానే ....మా పని అయింది కదా అనే సంతృప్తి ....
బ్రతిమాలటం ఇష్టం లేని వాళ్లకు ....బ్రతిమాలకుండా మనం చేయాల్సిన పనులు మనం చేసుకున్నాం ...అనే సంతృప్తి ....
సంతృప్తి ఇద్దరికీ వస్తుంది ....మరి ఇక్కడ సమస్య ఎక్కడుంది ....ఏదో అసౌకర్యంగా ఉంది అని ఆలోచిస్తే ....నేను గమనించినంతవరకు ....,,,
చాలావరకు ఈ బ్రతిమాలేవాళ్ళు ....తాత్కాలికమైన సంతోషానికి ....క్షణికమైన సంతోషానికి ప్రాముఖ్యతనిస్తారు ...ఓ రకంగా చూస్తే వీళ్ళు మనసుతో ఆలోచించి మాట్లాడరు...అలా అని ఏదీ మనసులోకి కూడా తీసుకోరు ....పెదవులమీద నుంచే పదాలు పుట్టిస్తారు ....అప్పటికప్పుడు పని జరగడం కోసం ఏ మాటలైనా చెబుతారు ....అబద్ధాలు ఆడడానికి వెనకాడరు .... ఎదుటివాళ్ళ మీద పొగడ్తలు కురిపిస్తారు....అవి అబద్ధాలని వాళ్లకు తెలిసినా ....ఆశలు చూపిస్తారు ....వీళ్లకు పని జరగడమే ముఖ్యం ....పని జరిగాక హమ్మయ్య అనుకుంటారు ....వీళ్ళు పనిచేయలేని బద్దకస్తులు కూడా కావచ్చు ...."బాహ్యకరణ (అంతఃకరణ పదానికి వ్యతిరేకపదం లా ఉపయోగించాను....నూతన పద ప్రయోగం )సంతృప్తి" మాత్రమే తెలిసినవాళ్ళు ఈ పద్దతి అనుసరిస్తారు ....
ఇక ..చాలావరకు బ్రతిమాలని వాళ్ళు ....శాశ్వతమైన సంతోషానికి ....ఎప్పటికీ గుర్తుండిపోయే సంతోషానికి ప్రాముఖ్యతనిస్తారు...వీళ్ళు మనసుతో ఆలోచించి మాట్లాడతారు ....హృదయం లో నుండి పదాలు పుట్టుకొస్తాయి ....వీళ్లకు పని కంటే మనసు చెప్పింది చేయడం ఇష్టం ....అబద్ధాలు చెప్పి , ఆశలు చూపించి పని చేయించడానికి వీళ్ళ మనసు అంగీకరించదు....మనసు అంగీకరించని , మనసుకి సంతోషం కలిగించని పని వీళ్ళు చేయలేరు ....అలాంటి అబద్ధపు జీవితం బ్రతకడం కంటే మరణమే నయమనుకుంటారు ....వీళ్ళు శ్రమ జీవులు అయి ఉంటారు ...."అంతఃకరణ సంతృప్తి" తెలిసినవాళ్ళు మాత్రమే ఈ పద్దతి అనుసరిస్తారు ....
ఏది సరైన విధానం ...ఎవరు సరైన వ్యక్తులు అనేది నిర్ణయించడం కష్టం ....
ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అనేది .... వారి వారి వ్యక్తిగత అలవాట్లు , అభిరుచులు, జీవిత విధానం పై ఆధారపడి ...వారిచే ....నిర్ణయించుకోబడుతుంది ....!
సమాజం విభిన్న వ్యక్తుల, మనస్తత్వాల కలయిక ....అదే భిన్నత్వంలో ఏకత్వం ....!😍
=============================
(గమనిక : నేను సైకాలజిస్ట్ ని కాదు ....నా దైనందిన జీవితంలో నాకెదురైన వ్యక్తులను గమనించి మాత్రమే వ్రాస్తూ ఉంటాను ....)