Friday, June 30, 2017

ప్రపంచానికి తెలియకుండా దాచాల్సిన విషయాలు

ప్రపంచానికి తెలియకుండా దాచాల్సిన విషయాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయంటే ....అవి చాలావరకు మన తప్పులే అయి ఉంటాయి ....
ప్రపంచానికి వెలుగెత్తి చెప్పాల్సిన విషయాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయంటే ....అవి చాలావరకు మన గొప్పలే అయి ఉంటాయి ....  

మనస్ఫూర్తిగా ఒకసారి నవ్వాలి ,

ఎవరి మరణం ఎప్పుడు రాసిపెట్టి ఉందో ఎవరికీ తెలియదు .....🤔
అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు .....🙂
అవసరం అయి ఆలోచించినా పర్వాలేదు ....
మనం ఆలోచించినా ...ఆలోచించకపోయినా ...అది మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అనేది ...జీవితం ఎరిగిన సత్యం ....
అప్పుడు ఎప్పుడో ....ఎవరో నాతో ..మరణించడం గురించి మాట్లాడడం తప్పు అన్నారు ....
జీవితం గురించి మాట్లాడడం తప్పు కానప్పుడు ....మరణం గురించి మాట్లాడడం తప్పు ఎలా అయింది .....అని ఆశ్చర్యం వేసింది ....😮
కానీ మరణించే ముందు మనం చేయాల్సినవి కొన్ని అనివార్యమైన పనులు ఉన్నాయి ....అవి చేసినవాళ్లు , చేస్తున్నవాళ్లు మరణం గురించి చింతించాల్సిన అవసరం లేదు ....అని నా అభిప్రాయం ...😎
కానీ చేయనివాళ్ళు మాత్రం కాస్త ఆలోచించాలి .....ఆ పనులు చేయకుండా ఎన్నాళ్లు బ్రతికినా , ఎంత ముందుగా చచ్చిపోయినా వాళ్ళను చూసి ....అయ్యో అనక తప్పదు .....😥
ఇంతకూ ఏం చేయాలి అనుకుంటున్నారా ....??!!
మనస్ఫూర్తిగా ఒకసారి నవ్వాలి ,
మనసారా ఓ సారి ఏడవాలి ,
తనివి తీరా ఓ సారి ప్రేమించాలి ....😍
ఇలాంటివి కూడా చేయకుండా మనిషి చనిపోతే /బ్రతికితే...వాళ్ళను చూసి భలే జాలేస్తుంది నాకు ....!

స్త్రీ అమాయకత్వం ...

పురుషుడు తనకు పరిణతి లేని సమయంలో ....పరిణతి కలిగిన స్త్రీ సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు ....
తనకు పరిణతి కలిగాక ....పరిణతి లేని స్త్రీకి ....తన సాన్నిధ్యాన్ని పంచాలని కోరుకుంటాడు ....
---------------------------------
స్త్రీ ఎప్పుడూ తన పరిణతి స్థాయి గురించి ఆలోచించదు... పురుషుడి పరిణతికి తగ్గట్టు తనను తాను మలచుకుంటుంది ....ఆమె స్థాయి అతనికి కనిపించకుండా దాచుకుంటుంది ....అతని ముందు ఎంత పరిణతి కనపరిస్తే అతనిలో తనను కలుపుకోగలడో అంతే పరిణతి కనపరుస్తుంది ....మిగతా అంతా ఆమె పురుషుడికి కనిపించకుండా జాగ్రత్త పడుతుంది .....
ఆమె పరిణతి విశ్వవ్యాప్తం , ఆమె కోరిక విశ్వజనీనం ,..ఆమె సమయస్పూర్తి ఇరువురి కలయికకు అనువైన కార్యం .... 
-----------------------------------
దీనికి పురుషుడు తన సంతృప్తి కోసం పెట్టుకునే పేరు .....స్త్రీ అమాయకత్వం ....! 😀
(ఇవన్నీ ఒక కోణంలో ఆలోచించి వ్రాసినవి మాత్రమే ..అందరికీ వర్తించకపోవచ్చు ....)

ఎవరికైనా ఎవరినైనా చంపెయ్యాలి అనేంత కోపం ఉందనుకోండి ....

ఎవరికైనా ఎవరినైనా చంపెయ్యాలి అనేంత కోపం ఉందనుకోండి ....
అప్పుడు ఈ కోపం ఉన్నవాళ్లు కొందరు ఏం చేస్తారంటే .... వాళ్ళ గురించి .....వాళ్లకు పరిచయం ఉన్నవాళ్ల అందరి దగ్గర విపరీతంగా పొగడడం ప్రారంభిస్తారు ....ఎంత విపరీతంగా పొగుడుతారు అంటే .....వాళ్ళ మీద ఈర్ష్యతో .....ఆ పరిచయస్తులు దహించుకు పోవాలి .....
ఆ తర్వాత వీళ్ళు కనిపించినప్పుడు .....ఓయబ్బో వీళ్ళింత గొప్పవాళ్ళా....నేనిన్నాళ్ళూ మాతో సమానమైన వాళ్ళు అనుకున్నానే .....అని వీళ్ళతో మాట్లాడకూడదు ....
వీళ్లల్లో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయా అని శల్య పరీక్ష చేసి చూడాలి .....అవతలి వాళ్ళు వీళ్ళని దేవత / దేవుడు అన్నారు .....వీళ్ళు దేవుళ్ళా /దేవతలా అని వాళ్లకు అనుమానం కలగాలి ....
వీళ్ళ గురించి అంతగా పొగిడేంతగా ఏముంది వీళ్లల్లో ....అని వాళ్లకు ఏహ్య భావం కలగాలి ....చివరకు, మానసికంగా వాళ్లకు తెలియకుండానే వాళ్ళు దూరం కావాలి .....
అప్పుడు ....ఈ చంపెయ్యాలి అని కోపం ఉన్నవాళ్లు అమాయకుల లాగా ....నేను వాళ్ళ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎంతో పొగిడాను ....ఎందుకు వాళ్ళలా దూరమయ్యారో తెలియదు అంటారు .....
లేదా వాళ్ళు ఇదివరకు అంత స్నేహంగా లేరు ఇప్పుడు .....ఇదివరకు వాళ్ళు నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఫ్రెండ్స్ ....వాళ్ళ స్నేహం అలా ఎందుకయ్యిందో తెలియట్లేదు అని మొసలి కన్నీరు కారుస్తారు ....
కొన్నాళ్ళకు ఎవరికి వాళ్ళు నిజాలు తెలుసుకుని అర్ధం చేసుకున్న తరవాత ..... వాళ్ళు మౌనంగా ఉంటారేమో కానీ .....
ఆ సదరు పొగడ్తలతో బంధాలను విడదీసే వ్యక్తులు మాత్రం మరొకరిని చూసుకుని ...వారి పని వారు మొదలు పెడతారు .....
చివరకు వారికి ఏ ఇద్దరి మధ్య ఏ బంధమూ ఉండడం సహించలేరు .....
ఎందువలన అనగా ......,,,
చిన్నతనం నుండి వాళ్ళు ఏ బంధం లేకుండా పెరిగారు ....
వాళ్ళు కోరుకున్న ఏ బంధమూ వాళ్లకు జీవితంలో దొరకలేదు ....
కోరుకున్న బంధాలను సంపాదించుకోవడానికి వారి దగ్గర కావలసిన గుణాలు .... , డబ్బు , సమాజంలో గౌరవం లేకపోవడం ....
అందరిచే చీదరించుకోబడడం ....
సమాజం ఆమోదించే ఏ మంచి గుణాన్ని అంతర్గతంగా పెంపొందించుకోలేకపోవడం వలన
ఎప్పటికప్పుడు తనకు లేని గుణాల్ని సమాజానికి చూపించుకుంటూ బ్రతకడం అలవాటు కావడం .....ఇలాంటి కొన్ని మానసిక కారణాలు ...వాళ్ళ ప్రవర్తనకు దోహదం చేయవచ్చు ....
అందుకే ఎవరైనా ఎవరి గురించి అయినా అతిగా పొగిడితే ....ఆ పొగడ్తల వెనక ఎలాంటి ఉద్దేశ్యం ఉందో గ్రహిస్తే ....కొన్ని అపార్ధాలను అధిగమించవచ్చు ....!

Monday, June 26, 2017

అదే నా దృష్టిలో "పని చేస్తున్నాను" అని చెప్పడం అంటే ....

ఈ జీవితంలో ఈ పని చేయడం నాకు సాధ్యం కాదు అని నేననుకోవాలి .......,
నువ్వు ఈ పని చేయగలవా ....నీ వల్ల కాదు.....అని నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను చూసి ఎప్పుడో ఒకసారి నవ్వి ఉండాలి .......,
విధి నాకు... అన్ని విధాలుగా సహకరించకుండా ఎదురు నిలవాలి .......,
అయినవాళ్ళు ,కానివాళ్ళు .."ఈ పని మొదలు పెట్టడమే కానీ ....పూర్తి చేయడం నా తరం కాదు..." అని ఒక బలమైన నిర్ణయానికి వచ్చేయాలి ....
అలాంటి ఒక పనిని నేను మొదలుపెట్టి .....చావడమా,చేయడమా (Do or Die) అని రెండే ప్రత్యామ్నాయాలు పెట్టుకోవాలి .....,
అదే నా దృష్టిలో "పని చేస్తున్నాను" అని చెప్పడం అంటే ......లేదా నాకు తీరిక లేదు అని చెప్పడం అంటే ......!!

Sunday, June 25, 2017

మన ఆలోచనలకు విచక్షణ నేర్పాలి....

ఈ రోజు వాకింగ్ కి వెళ్తూ ఓ రెండు బాటిల్స్ వాటర్ తీసుకుని వెళ్ళా ....
దారి మధ్యలో ఒక బాటిల్ ఖాళీ అయిపోయింది ....నీళ్లు ఉన్నంత సేపు మోయడం కష్టం కాదు కానీ ....ఖాళీ అయిన బాటిల్ మోయాలంటే కాస్త చిరాగ్గా ఉంటుంది.... 
దారిలో డస్ట్ బిన్స్ ఏం లేవు ...అది తప్పని సరిగా ఇంటివరకు మోయాల్సిందే .... పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉండడం వలన దారి పక్కన ,ఎక్కడా విసిరేయలేం .... 

అయితే..., ఈ రోజు దారిలో ఒక పొద దగ్గర కొందరు పడేసిన చెత్త కాస్త కనిపించింది ....చెత్త అంటే మరీ ఎంతో కాదు ...ఒక కోక్ కాన్, ఒక వాటర్ బాటిల్ , ఒక చిన్న పేపర్ ....ఇలా ....
రెండు మూడు వస్తువులకే అక్కడ ఎంతో చెత్త ఉన్నట్టుగా అనిపించింది .....అమెరికాలో ఆ మాత్రం చెత్త కనిపించడమే గ్రేట్ ....
వెంటనే నేనూ నా బాటిల్ అక్కడ విసిరేద్దామా అనిపించింది .... 
వాళ్లెవరో వేశారని నేను వేయడం ఏమిటి .... ??!! అని నవ్వుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నా .... 
--------------------------------
తర్వాత ఆలోచించా ....మిగతా శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో విసిరేయాలని అనిపించలేదు ....ఇక్కడ చెత్త చూడగానే విసిరేయాలని ఎందుకు అనిపించింది ....అని 
మనిషి మనస్తత్వం అంతే .....చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తే మనమూ అదే చేయడానికి అగస్మాత్తుగా ఓ క్షణం ప్రయత్నిస్తాం ....
అది ...తప్పా ఒప్పా ....మంచి చెడా...మన మనస్తత్వం అందుకు అంగీకరిస్తుందా అంగీకరించదా.... అనే విషయాలు విచక్షణతో ఆలోచించి మన ప్రవర్తనను అనుక్షణం మనకు అనుగుణంగా మలచుకోకపోతే....
మన బ్రతుకు మందలో గొర్రె బ్రతుకే .... 
అలాగే మనుషుల్లోని ఆలోచనలు కూడా ....,,,
మన చుట్టూ ఉన్నవాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ....మన ఆలోచనల మీద వాటి ప్రభావం ఏమిటో గమనించి ....ఎలాంటి మనుషుల మధ్య మనం మనుగడ సాగించాలి అనేది నిర్ణయించుకోవాలి ....
ఒకవేళ ..అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉండేలా మనం నిర్ణయించుకునే స్వేచ్ఛ మన జీవితానికి లేకపోతే ....మన ఆలోచనలకు విచక్షణ నేర్పాలి....
ఈ రోజు నేను నేర్చుకున్న జీవిత సత్యం ఇదే .....!!  

(Wrote and published on June 25, 2016)

Saturday, June 17, 2017

అతని కష్టంలో ఓ ఇష్టమైన బాధ్యత కనిపించింది

ఆ మధ్య ఓ వ్యక్తి (తన ఫ్రెండ్ ) మా వారితో ....
"అరె ...పిల్లలని పెంచడం చాలా కష్టం రా ...రోజూ పొద్దున్నే లేవాలి ....వాళ్ళని స్కూల్ కి పంపించాలి ....ఆఫీస్ కి వెళ్ళాలి ..ఇంటికి వచ్చాక ....మళ్ళీ పిల్లల దగ్గర కూర్చుని హోమ్ వర్క్ చేయించాలి .. తీరా చూస్తే వాళ్లకు A గ్రేడ్ లు రావాలంటే అతి కష్టం మీద వస్తున్నాయి ....నువ్వెలా పెంచావురా పిల్లల్ని ....." ఆరా తీశారు ....🤔
"ఏమోరా ....మా పిల్లల్ని నేనెప్పుడూ దగ్గరుండి హోమ్ వర్క్ చేయించలేదు ....వాళ్లకు వాళ్ళే చేసుకునేవాళ్ళు ...." ఇంకా ఏవో కొన్ని సలహాలు తనకు తెలిసినవి ఇచ్చారు ....😜
వాళ్ళ ఫోన్ కాల్ పూర్తయ్యాక ....
"నన్నిలా అడిగాడు మా ఫ్రెండ్ ....ఏమైనా మన పిల్లలు గ్రేట్ ....నేను ఎప్పుడూ దగ్గర కూర్చుని చదివించకపోయినా ....భలే చదువుకుంటారు ....వాడు ఎంత కష్టపడుతున్నాడో పాపం రోజూ ...."స్నేహితుని మీద సానుభూతి గా చెప్పారు నాతో మావారు ...😥
"నిజమే ....మీ ఇద్దరూ చాలా కష్టపడి పిల్లలను పెంచుతున్నారు ..మీరు గ్రేట్ నాన్నలు ...."అంగీకరిస్తూ చెప్పా నేను కూడా ...😜
ఆ తర్వాత ....కొన్ని రోజులకు ....ఒకరోజు జిమ్ లో వర్కౌట్ చేసుకుంటున్నప్పుడు ....,,,
ఓ ఇద్దరు పిల్లలని తీసుకుని ఓ నాన్న జిమ్ కి వచ్చాడు ....
వాళ్ళిద్దరితో కూడా వర్కౌట్ చేయిస్తున్నాడు .....
అప్పట్లో నేను జిమ్ లో ఎక్కువసేపు ఉండేదాన్ని ....అలా వాళ్ళని నేను ఉన్నంతసేపు గమనిస్తూ ఉన్నా ..... 👀
పిల్లలు ఇద్దరినీ వాళ్ళ వయసుకు తగిన వ్యాయామం అంతా చేయిస్తున్నాడు .....కొంత సేపటికి పిల్లలు అలసిపోయారు ....
అయినా ఊరుకోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా చేయిస్తూనే ఉన్నాడు ....వాళ్ళు చేయలేని ప్రతిసారీ ....ఇంకా ఒక్కసారి ఇంకా ఒక్కసారి అంటూ....వాళ్ళ చేతులు పట్టి తానే పైకి లేపుతూ .... ....వాళ్ళతో తాను కూడా పరిగెడుతూ ...చూపులతోనే వాళ్ళని పరుగులు పెట్టిస్తూ ....వాళ్ళతో బరువులు ఎత్తిస్తూ ....వాళ్ళ కంటే తను ఎక్కువ బరువు మోస్తూ ....
అచ్చు నాన్నలా ....నాన్నంటే ఇలానే ఉంటాడేమో అనిపించింది ....😍
పిల్లలు అలసిపోయినా వాళ్ళ అలసటలో ఓ సంతోషం కనిపించింది ....అతని కష్టంలో ఓ ఇష్టమైన బాధ్యత కనిపించింది ....చూస్తుంటే ముచ్చటగా అనిపించింది .....😍
వెంటనే పక్కనే ఉన్న మా వారితో ...."పిల్లలను పెంచడం అంటే ఇలా అనుకుంటా కదా ....." సందేహంగా అడిగా
మరి నేనేమో.... కష్టపడి నాన్నలు పిల్లలని పెంచుతారేమో అనుకున్నా .....అతనేమో ఇష్టపడి పెంచుతున్నాడు .....అందుకే సందేహం వచ్చింది .....🤔
ఏమోలే ....కష్టపడి పెంచినా ....ఇష్టపడి పెంచినా ....నాన్నలందరికీ .... Happy Father's Day ....😍

ఎక్కువ శాతం ....

ఎక్కువ శాతం ....
తప్పులెప్పుడూ ....తాత్కాలికంగా సమాజానికి తప్పులు గానూ ....మనకు కాలక్రమంలో ఒప్పులుగానూ మారుతూ ఉంటాయి ..... 😍
ఒప్పులెప్పుడూ....తాత్కాలికంగా సమాజానికి ఒప్పులు గానూ ....మనకు కాలక్రమంలో తప్పులుగానూ మారుతూ ఉంటాయి .... 🙃
అందుకే తప్పులు చేసాం అనుకుని కృంగిపోకూడదు ....ఒప్పులు చేసాం అనుకుని పొంగిపోకూడదు ...అని స్వానుభవం ....🤣

Monday, June 12, 2017

వాస్తవంలో బ్రతుకుతూ ...కలలు కంటారు ...

కొందరు ....వాస్తవంలో బ్రతుకుతూ ...కలలు కంటారు ....అవి జీవితానికి తప్పనిసరి ....అవే, జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో ....ఏం సాధించాలో మార్గ నిర్దేశకత్వం చేసే సాధనాలు ...🙂
కొందరు ....వాస్తవంలో బ్రతకడమే తప్ప.... కలలు కనరు....వాళ్లకు, జీవితంలో ఉన్న చోటనే ఉండాలని ఉంటుంది ....బహుశా కంఫర్ట్ జోన్ లో ఉండి ఉంటారు ....ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో అనే భయం ....ఎందుకొచ్చిన తంటాలు ....ఏదో పిడికెడు తిని ....గుక్కెడు తాగి పడుండక...అనుకుంటారు ...😎
మరి కొందరు ....కలల్లో బ్రతుకుతూ వాస్తవం గురించి కలలు కంటారు ....వీళ్లకు జీవితంలో జీవించాలని ఉంటుంది ....కానీ కలలు వీళ్ళను వాస్తవం లోకి రానివ్వవు ....హాయిగా ఏవో లోకాల్లో తేలిపోతూ కాలం గడిపేస్తారు ....వీళ్ళు కనపడితే వీలయితే కాస్త సానుభూతి చూపించడం తప్ప ఏం చేయలేము ...😥
ఇంకా కొందరుంటారు ...కలల్లో బ్రతకడం తప్ప వాస్తవ జీవితం అనేది ఉందని వీళ్లకు అసలు తెలియదు ...తెలుసుకోరు ....వీళ్ళే అసలు సిసలు పి హెచ్ డి సబ్జెక్టు లు ....వీళ్లకు జీవితమే కల ....అదే జీవితం అని వాదిస్తారు ....మేం బ్రతికేదే జీవితం ....మీరంతా వృధా అంటారు అందరినీ ....వీళ్ళు కలల్లో అయినా బ్రతుకుతారా అంటే ....పాపం అక్కడా బ్రతకలేరు .....కొన్నాళ్ళు అదే జీవితం అనుకుని ఉంటారు ....తర్వాత అది ఎలా నిజం చేసుకోవాలో తెలియక తెల్ల మొహం వేస్తారు ....(మనకు అర్ధం అవుతుంది ....అది జీవితం కాదు కాబట్టి అది ఎప్పటికీ నిజం చేయలేరు అని ) వాళ్లకు అది అర్ధం కాదు ....రెండిటికీ చెడ్డ రేవడిలా మారి ...జీవితాన్ని కలగా మార్చేస్తారు ...అవసరం అయితే పక్కవాళ్ళకి కూడా ఆ కలలు చూపించి ....అదే జీవితం ....అందులోకి రమ్మంటారు .....జీవితం గురించి అస్సలు తెలియని వాళ్ళ మాటలు నమ్మి ఆ కలల ప్రపంచంలోకి వెళ్తే .....! ....ఊబిలో చిక్కుకున్నట్టే ....🤔
బయటపడడం చాలా కష్టం .....! 😜

ఇప్పడు కొన్ని బంధాలు కూడా చనిపోయిన లేగ దూడలే ....


హెచ్చరిక: రెండు లైన్ల కంటే ఎక్కువ చదవలేని వారు ....ఈ ఆర్టికల్ ను చదివే సాహసోపేతమైన చర్యకు పాల్పడవద్దని హెచ్చరిక ....(మిత్రులకు ఈ హెచ్చరిక వర్తించదు .... :P )
=================================
మా నాయనమ్మ నాకు ఓ సామాజిక శాస్త్రం ...నేను సామాజిక శాస్త్రం చదివినప్పుడు ...అస్సలు టెక్స్ట్ బుక్స్ చదివే అవసరం లేకుండా పరీక్షలు వ్రాయగలిగాను అంటే అంతకు ముందే మా నాయనమ్మను క్షుణ్ణంగా చదవడం వలన అని ఖచ్చితంగా చెప్పగలను ....
అయితే చిన్నతనంలో 'మా నాయనమ్మకు - నాకు' ఉన్న అనుబంధం అంతా ఒక ఎత్తయితే ....'మా నాయనమ్మకు - తను పెంచే గేదె' కు ఉన్న అనుబంధం ఒక ఎత్తు ....నాకు వీళ్లిద్దరితో ఉన్న అనుబంధం మరొక ఎత్తు ....
ఆ గేదెకు సరిపోయినన్ని నీళ్ళు తెచ్చిపోయడం ....
కుడితి కలపడం ...
మా నాయనమ్మ వేకువఝామునే గడ్డి కోయడానికి వెళ్తే ...
కాస్త పొద్దెక్కాక నేను కూడా వెళ్లి మోయగలిగినంత గడ్డి నెత్తిన పెట్టుకుని తేవడం ....
మోయలేక మెడ నొప్పి పుట్టేస్తే ...మధ్యలో ఎవరైనా గడ్డి మూట ఎత్తగలిగే వాళ్ళు ఎదురుగా వస్తుంటే ....మూట కింద పడేసి ....కాసేపు కూర్చుని...వాళ్ళు దగ్గరకొచ్చాక ...మూట మళ్లీ నెత్తి మీదకు ఎత్తించుకోవడం....
ఒకవేళ గడ్డి దొరికే సీజన్ కాకపోతే ....ఎండు గడ్డి వాము దగ్గరకు వెళ్లి .....కాస్త ఎండు గడ్డి తెచ్చి గేదెకు వేయడం ....
సెలవు రోజుల్లో ఎప్పుడైనా సరదాగా గేదెల దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్ళడం ....
కొష్టం దగ్గరనుండి తాడు విప్పుకుని ఇంటికి తెచ్చి నీళ్ళు తాగే వరకు ఆగి, తాగాక మళ్లీ కొష్టం దగ్గర కట్టేయడం ,
పేడ శుభ్రం చేయడం ....
బకెట్లు బకెట్లు నీళ్ళు తెచ్చి దానికి ఒళ్ళు కడగడం ....
అది శుభ్రంగా ఉంటే సంతృప్తి చెందడం ,
కడుపునిండా తిని దాని డొక్కలు నిండితే ఆనంద పడడం....మొదలైనవన్ని....మా నాయనమ్మతో నేను పంచుకునే చిన్న చిన్న బాధ్యతలు …..ఆనందాలు (చెప్పినప్పుడు ....మాట వినకపోతే వీపు పగిలే బాధ్యతలు కూడా …)
-----------------------------------
అయితే ఇది కాకుండా మరో బాధ్యత కూడా ఉండేది ...గేదె ఈనేటప్పుడు....(అంటే ప్రసవించడం ) దాని దగ్గరే ఉండి మా నాయనమ్మకు సహాయం చేయడం ....
కానీ ...ఏ మాటకామాటే చెప్పాలి ....మా నాయనమ్మ ...పరమ గయ్యాళి గా కనిపిస్తుంది కానీ ....ఆ గేదె మీద చూపించే ప్రేమ గమనిస్తే.... ఎంత మానవత్వం ఉందా మా నాయనమ్మకు ..అని ఆశ్చర్యం వేస్తుంది ....
స్త్రీలు ప్రసవించేటప్పుడు కూడా ఎవరూ అన్ని సేవలు చేయలేరేమో అనిపిస్తుంది ....
"ఎందుకే నీకు దానిమీద అంత ప్రేమ" అంటే ....
"నోరు లేని గొడ్డు ...దాని బాధ ఆ దేవుడికి కూడా తెలియదు" అంటుంది ....
భగవంతుడే తెలుసుకోలేని బాధను తను గుర్తించింది అంటే .... ఆ క్షణంలో ఆ గేదెకు / నాకు మా నాయనమ్మ భగవంతుడి కన్నా ఎక్కువే అనిపించేది ........
గేదె నొప్పులు పడుతుంటే ఆముదం వేసి దాని వీపు మీద సవర తీస్తుంది ....దాని తల నిమురుతుంది ..దానికి తిండి , నీళ్ళు సహించక నెప్పులు పడుతుంటే ...జొన్న అన్నం వండి పెడుతుంది ....అయినా అది తినదు ….(బిడ్డను భూమి మీదకు తీసుకుని రావడం మీదే దాని ప్రాణాలన్ని పెడితే ఇక తిండి ఎలా సహిస్తుంది ….)
పాపం అంటుంది ...అది పడుకుంటుంది ,లేస్తుంది ....లేచేటప్పుడు లేవలేక లేవలేక లేస్తుంది ....
నొప్పులు భరించలేక అరుస్తుంది ....అది అరచినప్పుడల్లా మా నాయనమ్మ కలవరపడుతుంది ……
నేను దగ్గరుండి చూస్తూ ఉంటా ...ఏదైనా ఇంటి దగ్గర నుండి తేవాలంటే నేను అందుబాటులో ఉండాలి తనకు …..అందుకే నేను అక్కడే ఉంటా ....మా నాయనమ్మ గేదెను వదిలి ఎక్కడికీ వెళ్ళదు ఆ సమయంలో .....
కొన్ని గంటలు... సృష్టి ధర్మాన్ని అనుసరించి ... సృష్టిలో కష్టపడే ప్రతి తల్లి లాగే ....కష్టపడిన తర్వాత ....ముందుగా ఉమ్మనీరు బయటకు వచ్చేది ....కాసేపట్లో నేను కూడా వస్తున్నా అని బిడ్డ ప్రేమగా ఇచ్చే సందేశంలా .....
అన్న మాట నిలబెట్టుకోవడానికి అన్నట్టు ...కాసేపటికి ....దూడ కాళ్ళు కొద్దిగా బయటకు వస్తాయి .....నిజంగా అప్పుడు నాకు ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారో అర్ధం కాదు ....ఒక వైపు గేదె అరుస్తూ ఉంటుంది (నొప్పులతో ..)….ఒక వైపు మా నాయనమ్మ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది (దానికేమవుతుందో అనే కంగారుతో …)….ఆ సమయంలో నేను ....అడిగింది చేయడం ఆలస్యం అయిందో ....నా వీపు పగులుతుంది ....అందుకే నేను చాలా అలర్ట్ గా ....ఏం అడుగుతుందో అన్నట్టు ,చెవులు రిక్కించి వింటూ , కళ్లార్పకుండా చూస్తూ ఉండేదాన్ని ...
ఇంకా కాసేపట్లో సృష్టి తల్లికి నియమించిన కష్టాలు అయిపోతాయనగా ......రెండు ముందరి కాళ్ళతో పాటు ....తల కూడా కాస్త బయటకు వచ్చేది .......అప్పుడు మా నాయనమ్మ …ఎన్నో వందల డెలివరీలు చేసిన ఒక గైనకాలజిస్ట్ లాగా ….ఏ మాత్రం కంగారు లేకుండా ....ఏం పర్వాలేదు ....ఇంకాస్త కష్టపడు ....నేనూ నీకు సాయం చేస్తున్నా …అని మాటలతోనే తల్లికి భరోసా ఇస్తూ దూడను పట్టుకుని బయటకు లాగేది....అది మిగిలిన ఉమ్మనీరు తో సహా బయటకు వచ్చేది .....
(మనుషులు కంటే కొన్ని విషయాల్లో నాకు గేదెలే నయం అనిపిస్తుంది ....గేదెలకు ఆడ దూడ పుడితే సంతోషపడతారు ....అదే మనుషులకు ఆడపిల్ల పుడితే ఏడుస్తారు ....అప్పట్లో అర్ధం కాకపోయినా ....తర్వాత కొన్నాళ్ళకి అర్ధం అయింది .....ఏదైనా భవిష్యత్తు లాభ నష్టాలు దృష్టిలో పెట్టుకుని వ్యాపారంలా ఆలోచిస్తారు కొందరు అని ....కానీ గేదెకు ఈ తేడా తెలియదు ...తన బిడ్డ అంటే బిడ్డ అనే తెలుసు ....)
అక్కడే పరిచిన మెత్తటి చెత్త మీద ...గేదెకు అందుబాటులో ఉండేలా పడుకోబెట్టేది ....ఇంత సేపు అరచిన అరుపులు మర్చిపోయి ....గేదె దాని ఉమ్మనీరు అంతా ప్రశాంతంగా నాకుతూ ఉంటే ...మా నాయనమ్మ కాళ్ళ గిట్టలు గిల్లేది ....గిల్లి అవి అరచేతిలో పట్టుకుని గేదెకు తినిపించేది .....అది ప్రేమగా తినేది ....నిజం చెప్పొద్దూ నేనూ కాసిని గిల్లి గేదెకు తినిపించేదాన్ని ...తర్వాత ముక్కుల్లోకి, కళ్ళల్లోకి పోయిన ఉమ్మనీరు పిండాలి ....చాలా జాగ్రత్తగా ఆ పని కూడా చేసేది ....నేనూ చేశానని మీకు చెప్పకపోయినా అర్ధం అయింది కదా ....ఇదంతా మేం చేస్తుంటే గేదె దాని బిడ్డ మీద ప్రపంచంలో ఉన్న ప్రేమంతా ఒలకపోస్తూ నాకుతూనే ఉంటుంది ....బహుశా ఈ నాకడంలో దానికి బిడ్డకు మధ్య ఒక అనుబంధం ఏర్పరచుకుంటుందేమో అని నా ప్రగాఢ అభిప్రాయం .....
---------------------------------
ఓ రెండు మూడు రోజుల వరకు దూడ నడవలేదు ....మొదటి రోజు పొదుగు దగ్గరకు తీసుకుని వెళ్లి మొదటి సారి వచ్చిన పాలు తప్పనిసరిగా దానికే పట్టించాలి .....అవి ముర్రు పాలు అంటారు ....
ఆ రోజు పాలు కాసినే ఇస్తుంది .....రెండో రోజు నుండి బాగా ఇస్తుంది ...అయితే లేగ దూడకు నడవడం రాదు కాబట్టి ....ఉదయం ,సాయంత్రం రెండు పూటలా ....దాన్ని తప్పటడుగులు వేయిస్తూ తల్లి దగ్గరకు తీసుకుని వెళ్లి పాలు తాగించాలి ....వచ్చిన పాలన్నీ దానికే పట్టించకూడదు ....ఎక్కువవుతాయి ....పాలు పిండడానికి ముందు ఒకసారి ,కాసిన్ని పిండాక చివర్లో ఒకసారి దానికి సరిపోయినన్ని మిగిల్చి పట్టించాలి ...మధ్యలో పిండిన పాలు జున్ను తయారు చేసేవారు ....మేం కూడా తినేవాళ్ళం .....
అయితే ...ఇక్కడ తల్లులందరికీ తెలిసిన విషయమే అయినా.... తెలియని కొందరికి చెప్పాల్సిన విషయం ఏమిటంటే ....ముందుగా లేగదూడకు పాలు పట్టిస్తేనే ....బిడ్డ పెదవుల స్పర్శ పొదుగుకు తగలడం వలన తల్లిలో కలిగే మాతృ స్పందనకే పాలు తయారవుతాయి ....లేదా పాలు రావు....
అలా కొద్ది రోజులకే ....నడక నేర్చుకోవడమే కాకుండా లేగదూడ పరుగులు కూడా నేర్చుకునేది ....పాలు కోసం వదిలినప్పుడు దాని పరుగులు చూడాలి ....దాన్ని పట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు ....
అది నిన్న కాక మొన్న నడకలు నేర్చుకుని నన్ను పడేసేది....అయినా ఎంత ముద్దుగా ఉండేదో ....మా నాయనమ్మను ,నన్ను తప్ప దాని బిడ్డను ఎవరు తాకినా తల్లికి చాలా కోపం వచ్చేది .....మేమిద్దరం దానికి నమ్మకస్తులం అన్నట్టు ....
అలా లేగ దూడ గంతులు , దానికి పాలు పట్టడం , నీళ్ళు తాగించడం , కాస్త గడ్డి చిన్న చిన్నది తెచ్చి నోటికి అందించడం ....అది తినేవరకు అక్కడే కూర్చోవడం ....వాళ్ళ అమ్మ పొలం మేతకు వెళ్ళినా ....ఇంటికి వచ్చేటప్పుడు ఒక్క పరుగున రావడం ....తృప్తిగా బిడ్డను చూసుకోవడం .....ఇలా కొన్నాళ్ళు ఆనందంగా గడిచిపోయేది ......
------------------------------
ఆ తర్వాత ....కొన్నాళ్ళకు...అరుదుగా ..కొన్నిసార్లు ....ఏదో కారణాల వలన ఆ దూడ బ్రతకలేక చనిపోయేది .....అప్పుడు ఏం చేయాలో అర్ధం కాదు ....తల్లి అరుస్తూ ఉంటుంది ....బిడ్డ కోసం ....పాలు ఇవ్వదు ....ఒక్కోసారి నిలవ ఉన్న పాలు గడ్డ కట్టి తల్లికే ప్రమాదం జరగొచ్చు.....ఎంత మభ్య పెట్టినా ఇచ్చేది కాదు ....పొదుగు దగ్గర కూర్చుంటే తన్నేది ....కట్టేసిన గాట చుట్టూ ఊపిరాడకుండా తిరిగేది ....మేత మెయ్యదు, నీళ్ళు తాగదు....ఒకటే అరుపులు .....
అదిగో అప్పుడు ఒక క్రూరమైన (నాకు అనిపించేది ) పని చేసేవాళ్ళు ....కొందరు లేక అందరూ అదే చేసేవారు .......
దాని బిడ్డలాంటి డమ్మీ బొమ్మని తయారు చేస్తారు ....చెత్తతోనో , పాత గుడ్డలతోనో తయారు చేస్తారు .....
కాస్త చీకటి పడిన తర్వాత ....చీకట్లో దాన్ని దూరంగా నిలబెట్టి ....ఇక్కడ దాని పొదుగుని అచ్చం దూడలాగే....ముందు కాసేపు సరి చేసి ....పాలు పిండడానికి ప్రయత్నించేవాళ్ళు ....
కాసేపు తర్వాత ....చీకట్లో ఉన్న తన బిడ్డ నిజమా కాదా అని చూసుకోవడానికే దానికి కాస్త సమయం పట్టేది ....ఆ సందేహంలో రాని తన బిడ్డ కోసం పాలు దాచి ఉంచాలనే సగంతి కాసేపు పక్కన పెట్టేది .....ఈ మభ్య పెట్టిన సమయంలో ఏదో కాసిని పాలు పిండేవాళ్ళు ...
ఆ తర్వాత కొన్నాళ్ళకు అరచీ అరచీ అది అలసి పోతుంది ....బిడ్డ విషయం నెమ్మదిగా మరచిపోవాలని తల్లి మనసు అలవాటు చేసుకుంటుంది...
కొన్ని రోజులకు చీకట్లో డమ్మీ బిడ్డను పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ....
అవసరం ఉండకపోవడానికి కారణం.... బహుశా ....
ఏ నీడనో చూసి తన బిడ్డే అని నమ్మడం ఆ తల్లి మనసు నేర్చుకుని ఉండొచ్చు ....
ఆ నీడ మీదే తన తల్లి మనసులోని ప్రేమను మౌనంగా కురిపించడం అలవాటు చేసుకుని ఉండొచ్చు .....
కొన్నాళ్ళకు ఒక బిడ్డ తనకు ఉండేదనే విషయమే మర్చిపోయి ...మరో బిడ్డ కోసం తన తల్లి ప్రయాణం మొదలు పెడుతుంది ....
ఇది సృష్టిలోని ….కొంత సృష్టించబడిన తప్పనిసరి జీవన విధానం
------------------------------------------
అయితే ....
ఇప్పడు కొన్ని బంధాలు కూడా చనిపోయిన లేగ దూడలే ....
చీకట్లో నీడను చూసి .... నమ్ముతున్నాం ....
నమ్మాలి ....నమ్ముతూనే ఉండాలి ...
బిడ్డను మర్చిపోయి బ్రతికే తల్లిలా ....మరో బిడ్డ కోసం బ్రతకాలనుకునే తల్లిలా ....
బంధాలు మర్చిపోయిన మనిషిలా ....మరో బంధం కోసం బ్రతకాలనుకునే ఆశలా ….!

(Note: Wrote and published on June 12, 2016) 

Sunday, June 11, 2017

ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుని ...

రాత్రి ఏదో డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది అని ....ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం ....అయిపోయాక మమ్మల్ని పికప్ చేసుకుని ....అందర్నీ వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేయాలి అని అడిగింది నా చిన్న కూతురు ....
అక్కడికి తీసుకుని వెళ్ళే బాధ్యత వేరే పిల్లల పేరెంట్స్ తీసుకున్నారు అనుకోండి ....
ఈ రాత్రి పూట డ్రైవింగ్ అంటే నాకు కాస్త కష్టం .......కళ్ళల్లో పడుతున్న లైట్స్ తిక మకగా ఉంటాయి ..
సరే నేనూ వస్తాను పద నీకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటాను ....అని నా పెద్ద కూతురు కూడా తోడుగా వచ్చింది ....దారిలో కొన్ని ఇంగ్లిష్ పాటలు వినిపించింది ...మంచి మంచివి సెలెక్ట్ చేసి ....అలా ... <3
ఇద్దరం అక్కడికి వెళ్ళాం ...కొన్నిసార్లు చిన్న చిన్న ప్రదేశాల్లో , ఇంతకు ముందు ఉన్న ప్రదేశాలు రూపు రేఖలు మారినప్పుడు GPS సరైన అడ్రెస్స్ గుర్తుపట్టదు ....అక్కడా అదే జరిగింది ....అటు తిరిగి ...ఇటు తిరిగి ...ఎలాగైతే ఏం అక్కడకి వెళ్ళాం ... :)
అక్కడకి వెళ్ళాక ఫోన్ చేస్తే ...మేం ఇంకా డాన్స్ లో ఉన్నాం ...ఓ ఐదు నిమిషాల్లో వస్తున్నాం వెయిట్ చేయండి అని పిల్లల మెసేజ్ ....
అక్కడే పార్కింగ్ లాట్ లో ఇద్దరం కార్లో వైట్ చేస్తూ ఉండగా ....అక్కడికి ఓ వృద్ధ జంట మా ముందున్న కారు దగ్గరకు వస్తూ కనిపించారు ....నిశ్శబ్దమైన వాతావరణం ....చుట్టూ చీకటి ...అక్కడున్న పార్క్ లైట్స్ వాళ్ళిద్దరి మీద పడి వాళ్ళు మాకు స్పష్టంగా కనిపిస్తున్నారు ....మేం కార్లో ఉన్న విషయం వాళ్లకు కనిపించదు...అందుకే కాస్త దైర్యంగా వాళ్ళనే గమనించా ....
ఆ భర్త ...నెరిసిన గడ్డం , కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు ....ప్యాంటు షార్ట్ వేసుకుని ఉన్నాడు ...కారు డోరు తీసుకుని నవ్వుకుంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు ....అచ్చు హీరోలా ఉన్నాడు ...
ఆమె , దేహం అక్కడక్కడా ముడుతలు పడినా ....అస్సలు అదేమీ చూడాల్సిన విషయం కాదన్నట్టు ....చిన్నపిల్లలు వేసుకునే లాగా ఒక గౌను వేసుకుంది ...ఏదో ఒక పూసల దండ వేసుకుంది ....నడవడానికి ,డాన్స్ చేయడానికి అనుకూలంగా ఉన్న చెప్పులు , మెరిసిపోతున్న వాచ్ పెట్టుకుని ....ఏ మాత్రం అలసట అనేది తెలియదు అన్నట్టు ...జుట్టుని స్టైల్ గా వెనక్కి తోసి ....కార్ డోర్ తీసుకుని ఎక్కి కూర్చుంది ....ఓ హీరోయిన్ లా అనిపించింది ....
వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు ....సంతోషంగా ,తృప్తిగా చూసినట్టు అర్ధం చేసుకుని ....కారు స్టార్ట్ చేసుకుని ....వెళ్ళిపోయారు ...<3
"అరె వాళ్ళిద్దరూ చూశావా ...ఎలా ఫెస్టివల్ కి వచ్చి డాన్స్ చేసుకుని వెళ్తున్నారో .....ఎంత సంతోషంగా ఉన్నారో ....ఆమె చూడు ....ఎంత చక్కగా రెడీ అయి వచ్చిందో ...డాన్స్ చేయడానికి సరిపోయే డ్రెస్ ....చక్కగా చిన్న పిల్లలు వేసుకునే లాంటి గౌనులో వచ్చిందో ....భలే బాగున్నారు కదా ...." అడిగా నా కూతుర్ని ....తనూ నాతో గమనించడం గమనించి ...
"అవును ,....చూశాను ...." చెప్పింది ....
మా చిన్నతనంలో వేసుకునే డ్రెస్ ల గురించి ఎలా ఆంక్షలు ఉండేవో వివరించా ...
గౌన్లు ఆపేసి ..లంగా జాకెట్లు వేసుకుంటే ...మళ్లీ గౌన్లు వేసుకోకూడదు ....లంగా జాకెట్లు ఆపేసి , వోణీలు వేసుకుంటే ....మళ్లీ లంగా జాకెట్లు వేసుకోకూడదు ....వోణీలు ఆపేసి చీరలు కట్టుకుంటే మళ్లీ వోణీలు వేసుకోకూడదు ....ఇలా ...
నువ్వు ఒక వయసు దాటి వెళ్ళావు అంటే ....అంతే ...ఆ వయసులో ఇంతక్రితం వేసుకున్న డ్రెస్ లకు అర్హత లేదు ....ఇదే మా చిన్నతనంలో జరిగేది ...
అంటే అందరూ అలా చేస్తారని కాదు ....సమాజంలో ఎక్కువ మంది అలా చేసేవారు ....
ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుని ....మనకు అనుకూలత ఉండేలా చూసుకుని ...జీవితాన్ని అందరూ హాయిగా ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది .... మనస్పూర్తిగా కోరుకున్నా .... ♥

(Note: Wrote and published on June 11 2016)

హృదయం ఎన్ని దెబ్బలు వేసినా చెక్కు చెదరని రాయి లాంటిదా ... ??!!

హృదయం ఎన్ని దెబ్బలు వేసినా చెక్కు చెదరని రాయి లాంటిదా ... ??!!
ఒక్క దెబ్బ వేస్తే ముక్కలైపోయే అద్దం లాంటిదా.... ??!!
నాకు మాత్రం ....,
ప్రపంచం లో అందరూ ఎన్ని మాటలన్నా ఏమీ కానప్పుడు రాయి లాంటిది అనిపిస్తుంది ....,
ఆత్మీయులలో ఒక్కరు ఒక్క చిన్న మాటన్నా ముక్కలైనప్పుడు అద్దం లాంటిది అనిపిస్తుంది .....!!

ఒక మంచివాడి వలన ఒక అసమర్ధుడు తయారవుతాడు ....

ఒక మంచివాడి వలన ఒక అసమర్ధుడు తయారవుతాడు ....
ఒక అసమర్ధుడి వలన ఒక దుర్మార్గుడు తయారవుతాడు ....
ఒక దుర్మార్గుడి వలన ఒక మంచివాడు తయారవుతాడు ....
ఒక మంచివాడి వలన మళ్లీ ఒక అసమర్ధుడు తయారవుతాడు .... :p
......
ఒకరి వలన ఒకరు ....ఒకరి కోసం ఒకరు ...ఒకరితో ఒకరు బ్రతకడం... సృష్టి ధర్మం .... :) :)
కాబట్టి అందుమూలంగా ....ఎవరూ కారణ జన్ములు కాదు ....లేదా ...అందరూ కారణ జన్ములే .... :P
బతికిన నాలుగు రోజులూ...., అందరూ సమానమే ....ఒకరి కొకరు అందరూ అవసరమే అని ...సంతోషంగా బ్రతకడమే ......!!!

Friday, June 9, 2017

"అప్పట్లో నువ్వు చాలా అమాయకురాలివి ...." ఒకరు నాతో .

"అప్పట్లో నువ్వు చాలా అమాయకురాలివి ...." ఒకరు నాతో ....🤣
"ఇప్పట్లో కూడా నేను చాలా అమాయకురాలినే....నాకు తెలియని విషయాల్లో ఎప్పటికీ నేను అమాయకురాలినే .....
నాకు తెలిసిన విషయాల్లో ఎప్పుడూ నేను తెలివైన దాన్నే ....అప్పుడూ నాకు తెలిసిన విషయాల్లో తెలివైన దాన్నే ...." నవ్వుతూ నేను ....😀
కాకపోతే ....
ఏ విషయాలు తెలుసు , ఏ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటాను , ఏ విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని విసిరిపారేస్తాను , ఏ విషయాలు తెలుసుకోవాలని కృషి చేస్తాను .....అనేది, పూర్తిగా నా ఇష్టా ఇష్టాల మీద , జీవన మనుగడ మీద , మానసిక / శారీరక అవసరాల మీద ఆధారపడి ఉంటుంది అనేది నేనెరిగిన సత్యం ....😍

Thursday, June 8, 2017

స్త్రీకి "Choice" కావాలి ....కాదు కాదు ....సృష్టించుకోవాలి ...

"పురుషులు ....ఏ వయసులో అయినా ,ఏ సమయంలో అయినా తప్పు (అంటే పరాయి స్త్రీ తో శారీరక సంబంధం కలిగి ఉండటం) చేయడానికి కారణం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కారణం తప్ప....అది పురుషుని తప్పు కాదు ...." ఒకరు నాతో ....,,
"ఇది మీరు అంగీకరించాలి ...." మళ్లీ అదే వ్యక్తి నాతో ...
"......................................." నా మౌనం ....
“మీరు అంగీకరిస్తారా ...లేదా ...”మళ్లీ అదే ప్రశ్న ఆ వ్యక్తి నుండి .....
"ఒక స్త్రీగా ....ఈ రోజు , ఈ క్షణం ఇది నేను అంగీకరించకపోవడానికి “Choice” ఏం ఉందా ....అని ఆలోచిస్తున్నాను ....." కాసేపటి తర్వాత నా సమాధానం ....
--------------------------------------
అవును ....నిజమే ....స్త్రీకి "Choice" కావాలి ....కాదు కాదు ....సృష్టించుకోవాలి ....తనకు తానే ....ఎప్పటికీ ......!!
-----------------------------------------------
కొన్నిసార్లు సమాధానం ఇవ్వడంలో ....వాదించడంలో నేను ఓడిపోతూ ఉంటాను .....సరైన సమాధానం ఇవ్వలేను ....అచేతనావస్థలోకి వెళ్ళిపోతాను .....ఎన్నో రోజులు, నెలలు ,సంవత్సరాలు సమయం పడుతుంది సమాధానం ఇవ్వడానికి .....ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందా అని ఆలోచిస్తాను .....ఇలా చెప్పి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ....అలా ఖండించాల్సింది అనిపిస్తుంది .....నన్ను నేనే అసహ్యించుకుంటాను ....నాకు నచ్చిన నేనులా ఆ క్షణంలో లేనని ...
తర్వాత అర్ధమవుతుంది ....నేను “నాకు నచ్చిన నేనులా” రూపు దిద్దుకోవడానికి భగవంతుడు నాకు ఇచ్చే అవకాశాలే ఇవన్ని అని .....అప్పుడు మాత్రం తుఫాను తర్వాత ప్రశాంతత లా ఉంటుంది మనసు .....
ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ...... చాలా పెద్ద తుఫాను తర్వాత .............!!!!!!!!!!!!!!!!!!! :) :) :)
(Note: wrote and published on June 8 2015 )

కారు దిగి అలా నడుచుకుంటూ జిమ్ లోకి వెళ్తున్నా ...

ఈ రోజు ...
కారు దిగి అలా నడుచుకుంటూ జిమ్ లోకి వెళ్తున్నా ...
ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నా ....బహుశా నా ఆలోచనలు నా నడక మీద ప్రభావం చూపాయేమో కాస్త నెమ్మదిగా నడుస్తున్నా(బహుశా అందులో ఎనర్జీ కూడా తగ్గిందేమో ...గమనించలేదు ) ....

అంతలో జిమ్ లో నుండి... ఓ వ్యక్తి ...నాకు కాస్త దూరంలో ఎదురుగా వస్తూ కనిపించాడు ....ఒక్క క్షణం చూశాను...మళ్లీ తలొంచుకుని నడుస్తున్నా ....
నా ఆలోచనలను అనుసరిస్తూ ....
అతను దగ్గరకు రాగానే .... "నో ....నువ్వలా నడవ కూడదు ....ఇలా రన్ చేయాలి ..." అంటూ రన్ చేస్తూ ... ఓ రెండడుగులు రన్ చేసి చూపించాడు .... ....:)
మనిషి చూస్తే కండలు తిరిగిన శరీరం ....అలా ఫన్నీ గా రన్ చేసేసరికి నాకు ఒక్కసారిగా ఫక్కున నవ్వొచ్చింది .... :)
తర్వాత ...."నేను నీలా ఉండలేను ....నేను ఇలానే నాలానే ఉండగలను ,..." అని నవ్వుతూ చెప్పా ....అతని కండలను ఉద్దేశించి .... :)
అయినా ..అతను నేను చెప్పింది అసలు పట్టించుకోలేదు ....హాయిగా నడుచుకుంటూ.... నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ... :)
ఆ తర్వాత ...అతను ఎందుకలా చెప్పాడు ...రన్ చేసి నేను నవ్వేలా చేశాడు ....నేను నవ్వగానే పనయిపోయినట్టు అలా మౌనంగా వెళ్లి పోయాడు ....అని ఆలోచించా ....
ఒకదానికి ఒకటి లింక్ చేస్తే ....నెమ్మదిగా నాకు అర్ధమైంది ....
నేనేదో కాస్త నీరసంగా , అన్యమనస్కంగా , ఏదో ఆలోచిస్తూ అతనికి కనిపించాను ....అతను ఎలాగైనా నన్ను నవ్వించాలి అనుకున్నాడు ....అలా రన్ చేసి చెప్తే నేను నవ్వుతానని అతనికి అప్పటికప్పుడు అనిపించింది .....వెంటనే నవ్వించాడు ....నవ్వడం నా బలహీనత కాబట్టి అతను ఊహించిన దానికంటే ఎక్కువే నవ్వా నేను .....ఆ నవ్వు చూసి అతను సంతోషంగా వెళ్ళిపోయాడు ....
సందేహం లేదు .......అతనికి ఇతరుల సంతోషం లో తన సంతోషాన్ని చూసుకునే అలావాటు ఉంది ....ఖచ్చితంగా అతను మనిషి .....
నాకు వెంటనే అలాంటి అద్భుతమైన వ్యక్తిని మళ్లీ చూడాలి అనిపించింది ....<3
కానీ ....ఇవన్ని నేను ఆలోచించే సరికి అతను కనుమరుగైపోయాడు .. :(
అద్భుతాలు ,అద్భుతమైన వ్యక్తులు ఎప్పుడూ అంతే ....మెరుపులా మెరిసి మాయమైపోతారు .... :(
కానీ నేనెంతో అదృష్టవంతురాలిని అనిపించింది ....నిజంగా అలాంటి వ్యక్తులు ఎదురుకావడం కూడా అదృష్టమేగా .....??!! <3 :)
మళ్లీ ఎప్పుడైనా మనుష్యులు ఎదురైతే మీకు పరిచయం చేస్తాను .... ♥
(Note: Wrote and published on June 8 2016)