Friday, October 27, 2017

1 బరువైన భావం = 100 తేలికైన భావాలకు సమానం ....😘

నా స్వీయ పరిశీలనను బట్టి ....
చాలా సందర్భాల్లో ....
కొన్ని భావాలు చాలా బరువుగా అనిపిస్తాయి....ఉదాహరణకు ....కోపం , పగ , ద్వేషం , అసూయ .....లాంటివి ...
కొన్ని భావాలు చాలా తేలికగా అనిపిస్తాయి ....ప్రేమ , సంతోషం , అభిమానం , జాలి , దయ కరుణ లాంటివి ....
అయితే ....సందర్భాన్ని బట్టి ...తేలికగా అనిపించే భావాలు కొన్ని సందర్భాల్లో బరువుగాను .....బరువుగా ఉండే భావాలు కొన్ని సందర్భాల్లో తేలికగా ఉండే అవకాశాలు లేకపోలేదు .....
ఏది ఏమైనా ....బరువుగా ఉన్నా , తేలికగా ఉన్నా మన భావాల బాధ్యత అన్ని సందర్భాల్లో మనమే తీసుకోవాలి ....అనేది ...మనం ....భావాలకు తెలియజేయాల్సిన సత్యం ....
అయితే మనం కొన్ని భావాల బాధ్యతను ....మోయమని ....ఇతరులకు పంచే సందర్భాలు కూడా ఉంటాయనుకోండి ....అది ప్రియమైన /
అప్రియమైన వాళ్లకు సంబంధిన విషయం ....
నా వరకు నేను .....చిన్నతనం నుండి .....అన్ని భావాలను నేను ఎంతవరకు మోశాను .....ఎంతవరకు ఇతరులకు పంచాను అని ఆలోచిస్తే ....,,,
బరువైన భావాల్ని నేను మాత్రమే మోశాను .....తేలికైన భావాలను అందరికీ పంచాను .....అని అర్ధమై ....మనసు తేలికైంది ....
అయితే చాలా కాలం మోశాక .....ఒక్కొక్క బరువైన భావాన్ని ఇక మోయలేక వదిలించేయాలని నిర్ణయించుకుని ఒక్కొక్కటీ వదిలించుకుంటూ వస్తున్నా ....
విచిత్రం ఏమిటి అంటే....
ఒక్కో బరువైన భావం వదిలించుకునే కొద్దీ .....ఎన్నో తేలికైన భావాలను మోయగలుగుతున్నా ....
ఉదాహరణకు 1 బరువైన భావం = 100 తేలికైన భావాలకు సమానం ....😘
ఒక్కోసారి ....(ఇంకా ఎక్కువ/తక్కువ కూడా ఉండొచ్చు ) అనుకోండి ...🤔
జీవితం హాయిగా ప్రశాంతంగా ఉంది ......😍

విపరీతమైన సంతోషం కలిగినప్పుడు గొంతు మూగపోతుంది ....

కొన్ని సందర్భాల్లో ....విపరీతమైన సంతోషం కలిగినప్పుడు గొంతు మూగపోతుంది ....
విపరీతమైన దుఃఖం కలిగినప్పుడు గొంతు మూగపోతుంది ....లేదా పూడిపోయినట్టు , గొంతుకి ఏదో అడ్డం పడిన భావము కలుగుతుంది ....
మన భావావేశాలు రోజూ ఏ మోతాదులో అయితే ఉన్నాయో అదే మోతాదులో ఉంటే మనం మాట్లాడతాం , లేదా అరుస్తాం , లేదా వాదిస్తాం ....

అయితే మనం ఒక్క గొంతులో నుండి వచ్చే మాటలనే గమనిస్తున్నాం ...అది కంటికి కనిపించే సాక్ష్యం కాబట్టి .....గొంతు మూగబోయింది అంటాం ...
మిగతా అవయవాలను అంతగా గమనించం....గమనించినా వివరించలేం ....
కానీ ఒక్కసారి గమనించి చూడండి....
మన శరీర వ్యవస్థ అంతా వాటి వాటి స్వభావాలను బట్టి విపరీతమైన మార్పులకు లోనవుతుంది ....పాక్షికంగా స్థంభించిపోతుంది ....
అది మనకు, మన ఆరోగ్యానికి మంచిదా లేదా అనేది పక్కన పెడితే ....అది తట్టుకునే శక్తి మన శరీరానికి , మెదడుకి ఉందా అనేది మనం తరచి చూసుకోవాలి ....
తట్టుకునే శక్తి ఉంటే .... కొన్ని నిమిషాలు / గంటలు / రోజులు / నెలలు ....ఆ స్థితి మీద యుద్ధం చేసి మామూలు స్థితికి రావాలి .....
లేకపోతే నిపుణులను సంప్రదించాలి .....వారి సూచనలను పాటిస్తూ మామూలు స్థితిలో మన శరీరాన్ని ఉంచడానికి ప్రయత్నించాలి .....
స్తంభించిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం చేసే చర్యలు కొన్ని మనకు తెలియకుండానే చేసే అవకాశం ఉంది ....
తర్వాత అవి తప్పు , ఒప్పు అని విశ్లేషిస్తాం ....!

Monday, October 23, 2017

మనకు ఆకలేస్తే ...ఏం చేస్తాం ....??!!

మనకు ఆకలేస్తే ...ఏం చేస్తాం ....??!!
ఏదో ఒకటి తినాలి ...
కొన్నిసార్లు మనం ....బాగా ఆకలేసినప్పుడు... ఇంట్లో రెడీమేడ్ పాకెట్స్ , ఫుడ్ ఏముందో అని చూసుకుని ....తీసుకుని వేడి చేసుకుని ఆవురావురుమని తింటాం ...
అంత రుచిగా అనిపించకపోయినా ...ఆయిల్ ఎక్కువైనా ...నిల్వ ఉండడానికి వాడే కెమికల్స్ ఉన్నా ....ముందు మన ఆకలి తీరుతుంది .....
హమ్మయ్య పోనీలే ఆకలి తీరింది అనుకుంటాం ....
కానీ మనసులో ఏ మూలో ...."ఈ రెడీమేడ్ ఫుడ్ మీద ఆధారపడకూడదు ...ఆరోగ్యానికి అంత మంచిది కాదు ....ఎలాగైనా కాస్త సమయం కేటాయించుకుని లేదా బద్ధకం వదిలించుకుని ....ఇంట్లో వంట చేసుకోవాలి ..." అనుకుంటాం ...
ఆ తర్వాత ...
షాపింగ్ కి వెళ్లి ...కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకుని ....శుభ్రం చేసుకుని ...మన రుచికి తగిన విధంగా ...వంట చేసుకుంటాం ....
చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ....రుచికి రుచి ...ఆరోగ్యానికి ఆరోగ్యం ...
బద్ధకించకుండా ...ఇలా రోజూ వంట చేసుకుని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటాం కదా....అనుకుంటాం ...
కానీ మనసులో ఏ మూలో ...."ఇలా కూరగాయలు , సరుకులు కొనుక్కుని వంట చేసుకోవడం కాకుండా .....కొంత ఖాళీ ప్రదేశం చూసుకుని ....అన్నీ మనమే సొంతంగా పండించుకుని వంట చేసుకుని తింటే ....ఓహ్ ...ఆ ఫీలింగే వేరు కదా ...." అనుకుంటాం ....
ఆ తర్వాత ...
మన ఇంటిచుట్టూ ఉన్న ప్రదేశాన్ని చదును చేసి , విత్తనాలు వేసి , మనకు నచ్చిన కూరగాయలు, పప్పు ధాన్యాలు పండించుకుని ...ఏ రోజు ఏం వంట చేసుకోవాలి అనిపిస్తే ఆ వంట మన రుచి , అభిరుచికి తగిన విధంగా వండుకుని ...సంతృప్తిగా , సుష్టుగా భోజనం చేస్తాం ....
ఆహా ఇది కదా జీవితం అంటే అనిపిస్తుంది ....
వీలయితే స్నేహితులకు , బంధువులకు కూడా మా ఇంట్లో ఇవి నేనే పండించాను ....అని, కొన్ని కూరగాయలు కూడా సంతోషంగా ఉచితంగా ఇస్తాం ....
--------------------
అలాంటిదే మనలోని ప్రేరణ (మోటివేషన్) కూడా ....
ఎవరిదగ్గరనుండి అయినా ప్రేరణ ఆశించడం అనేది ....రెడీమేడ్ ఫుడ్ లాంటిది ...
వాళ్ళు ప్రేరణ ఇస్తారు ...ఒకరోజు మన అవసరం తీరుస్తుంది .....మళ్ళీ అవసరం రాగానే వాళ్ళ మీద ప్రేరణ కోసం మనం ఆధారపడాల్సిందే .....
ఒక పని చేయడానికి ప్రేరణ కలిగిస్తారు ....రెండో పనికి వాళ్ళ ప్రేరణ అందుబాటులో లేకపోతే...మన పని ఆగిపోతుంది ....పైగా ఆనందంగా / మనస్ఫూర్తిగా ఆ పని చేయలేము ....ఏదో అయింది అనిపిస్తాం ....
----------------
చెట్టు నుండి , పుట్టనుండి , కనిపించే/కనిపించని వస్తువుల నుండి ,మరి కొందరి నుండి ప్రేరణ మనమే తెచ్చుకుంటాం ...
ఇది కూరగాయలు , సరుకులు తెచ్చుకుని మనకు నచ్చినట్టుగా వంట చేసుకోవడం లాంటిది ...
చేసిన పని సంతృప్తిగా అనిపిస్తుంది ...అయితే మనం ఏ రోజు అయినా సరుకులు తెచ్చుకోలేకపోతే ....బజార్లో ఏ సరుకులూ లేకపోతే , మనకు నచ్చినవి దొరకకపోతే ....ఉన్నదానితోనే సర్దుకు పోవాలి .....
---------------------
అయితే..., ఆ ప్రేరణ మనలో నుండి మనం పుట్టించగలిగితే ...,,, మన ఆలోచనల్లో నుండే మనం ప్రేరణ పొంద గలిగితే ....,,,,ఎవరి అవసరమూ మనకు లేకపోతే .....,,, ఓహ్ ...
ఇదే ....విత్తనాలు వేసి , ఎరువులు వేసి , పంటలు పండించి ....మనకు నచ్చిన విధంగా వంట చేసుకుని తినడం లాంటిది ....
ఎంత ఆనందం , ఎంత సంతృప్తి ....
తుఫానులు రానీ....వరదలు రానీ.... సునామీలు రానీ....ప్రపంచంలో ఎక్కడా ఏం దొరకకుండా కరువులు రానీ....
ఏది ఏమైనా ....మనం పండించుకున్న పంట మన కడుపు నింపడమే కాకుండా ....మరి కొంతమందికి పంచేంత తయారు చేసుకునే శక్తి / యుక్తి ....మన దగ్గర ఉంటుంది ....
---------------------
మనలో నుండి మనం ప్రేరణ పొందడం నేర్చుకుంటే ....,, ఈ ప్రపంచం నుండి మనం ఆశించడం కాదు ....ప్రపంచమే మన నుండి ఆశిస్తుంది ....
జీవితానికి సార్ధకత అంటే నాకు తెలిసిన అర్ధాల్లో ఇదో అద్భుతమైన అర్ధం ....😍

Sunday, October 22, 2017

"The Motivation Manifesto " :)


మొన్నామధ్య చాలా పుస్తకాలు మోసుకొచ్చి ఇంటినిండా పెట్టారు మావారు ....📚
ఇలా కాళ్ళకింద వేళ్ళకింద పుస్తకాలు పరిచేస్తే కుదరదు ....మొత్తం ఆ Garage లో పెట్టుకోండి ....అని చెప్పా ...సరే అని Garage లో పెట్టారు (కాదు చిందరవందరగా పడేసారు .... 👿)
పుస్తకాలు ఇలా పడేస్తే ఎలా ....నీట్ గా సర్దుకోవాలి అని మొన్నా మధ్య నేనే సర్దడం మొదలు పెట్టా ....

వద్దు వద్దు ...నా పుస్తకాలు నేనే సర్దుకుంటా ...నువ్వు వెళ్ళు ...నేను సర్దుకుని వస్తా అన్నారు ...
అప్పటికీ ...."నేను నమ్మలేను ...సర్దుకోనివ్వండి ...ఇలా ఉంటే నాకు చిరాకు" అన్నా ...
నన్ను నమ్ము అన్నారు ....
సరే అని... ఎప్పట్లాగే మళ్ళీ నమ్మేశా ...🙄
ఇప్పటికి రెండు వారాలు అయింది ఇది జరిగి ....
ఇక చూడలేక ...ఒకానొకరోజు పోన్లే అని నేనే సర్దేసా ....😓
అయితే సర్దేటప్పుడు ....ఒక పుస్తకం కనిపించింది ....🤓
తస్సాదియ్యా ...ఆ పుస్తకం ఒక్కటీ లేకుండా ఉంటే ....నాకసలు కోపమే వచ్చేది కాదు....🤔
విసిరి కొట్టాలనిపించింది ఆ ఒక్క పుస్తకాన్ని ....😡
దాని పేరే ...."The Motivation Manifesto "
కోపాన్ని దిగమింగేసి ...ఆ పుస్తకం కూడా సర్దేసి ...పోనీలే అని ... నా దైనందిన కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉన్నా ...😎
-------------
నిన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు ...కావాల్సిన కొన్ని సామాన్లు ట్రాలీలో పడేసి ....,,,
"ఇప్పుడే వస్తాను ...ఈ ట్రాలీ పట్టుకోండి" అని మావారికి చెప్పి.... నాకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకోవడం కోసం పక్కకి వెళ్ళా ....
మళ్ళీ వచ్చి చూస్తే...ట్రాలీ లేదు ....ట్రాలీ పట్టుకోమన్న మనిషీ లేడు...
🤦‍♀️
తిరునాళ్లలో పిల్లలు తప్పిపోతే కంగారు పడినట్టు కంగారు పడడం ఆపేసి చాలా కాలం అయింది కాబట్టి ....ఏ మాత్రం కంగారు పడకుండా పుస్తకాలు ఉండే సెక్షన్ ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్ళా ...😋
అక్కడ ఇద్దర్నీ కనిపెట్టి ....పదండి ....పోదాం ...అన్నా ....😀
"ఏం పుస్తకం కొన్నానో చెప్పుకో చూద్దాం ...."నవ్వుతూ అడిగారు ...
నేను మౌనంగా ఉన్నా ....ఏదో పిడక పుస్తకానికి ...గెస్ వర్క్ కూడా అని ...😡
"చూడు చూడు " అంటూ ..నా ముందు ఉంచారు పుస్తకాన్ని ...📗
దాని పేరు "How to Decorate Home"
అక్కడ అంతమంది ఉన్నారని కూడా చూడకుండా ....ఫక్కుమని నవ్వా ....🤣 (అక్షరాల్లో ఫక్కుమని అని చెప్పా కానీ ....రియల్ గా చూస్తే ....జనం ఉలిక్కిపడతారు ...అంత విరగబడి నవ్వుతా అన్నమాట )
అంటే ....బాగా కడుపు మండితే.. దాన్ని అలా నవ్వుగా మార్చడం ....ఏ పుస్తకం చదవకుండానే ప్రాక్టీస్ చేశాలే ....అందుకు ...??!! 😀🤣😜
(ఎప్పుడూ నా మీద ఏ ఆర్టికల్ వ్రాయవు అనే మా వారికి ఈ ఆర్టికల్ అంకితం ..  )

Friday, October 20, 2017

అతను మన పెళ్లి లో చదివే మంత్రాలు ఎప్పుడూ వినలేదు ....

ఒక మిత్రుడు ఉన్నాడన్నమాట ....
ఎవరు ...ఎప్పుడు ...ఏదైనా ఇవ్వనివ్వండి ....అది సగం మాత్రమే తింటాడు ....మిగతా సగం బాక్స్ లో పెట్టుకుంటాడు ....
ఒకటి రెండు సార్లు నేను గమనించి ....ఎందుకలా పెట్టుకుంటున్నాడు ....ఇచ్చింది కొంచెమే ...తాను తినగలడు ....అయినా ఎందుకు ప్రత్యేకంగా దాచుకోవడం అని ఆలోచించా ....అయినా నాకెందుకులే ...అని అడగలేదు ...
ఒకరోజు ....నేను ఏదో ఇచ్చాను ...."ఇది నేను ఇంటికి తీసుకుని వెళ్తాను ......తీసుకుని వెళ్ళొచ్చా .....నా భార్య కోసం " అని అడిగాడు ....
నేను నవ్వి ...ఇది మీరు తినండి ...మీ భార్య కోసం మరి కొంత పాక్ చేసి ఇస్తాను ....అని చెప్పా ...😍
ఇచ్చింది భద్రంగా లంచ్ బాక్స్ లో పెట్టుకున్నాడు ఎప్పటిలాగే ....
అప్పుడు నాకు అర్ధం అయింది ....
రోజూ అతను ఎవరు ఏం ఇచ్చినా ఎందుకు సగం దాచుకుంటాడో ...
నాకు ముచ్చటేసింది ....
తాను ఏం తిన్నా తన భార్యకు సగం తీసుకుని వెళ్ళాలి అని ఆలోచించే అతని ఆలోచన నన్ను కదిలించింది ....
అప్పటినుండి నేను అతనికి ఏం ఇవ్వాలనుకున్నా అతని భార్యకు సగం ఇచ్చి అతనికి సగం ఇవ్వడం నేర్చుకున్నా ....😍
ఈ రోజు ఒకరు (లేడీ ) ....బ్యాక్ పెయిన్ వచ్చిన కారణంగా మసాజ్ తెరపిస్ట్ దగ్గరికి వెళ్లానని ....వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేసారు అని ...తనతో చెప్పగానే ....ఆమె అడ్రెస్స్ ఇవ్వమని ...తన భార్యను కూడా అక్కడికి తీసుకుని వెళ్లి కొన్ని పెయిన్స్ కి మసాజ్ చేయించాలని అడగడం వినగానే ....నా హృదయం ఆనందాశ్చర్యాలకు లోనయింది ....😍
అతను మన మతం కాదు , మన దేశం కాదు ...అతనికి మన సంప్రదాయాల గురించి తెలియదు ....అతను మన పెళ్లి లో చదివే మంత్రాలు ఎప్పుడూ వినలేదు ....
మన పెళ్ళిలో... భార్యంటే భర్తలో సగం అని విన్నవాళ్ళు ఎవరూ అలా ఆచరించడం నేను చూడలేదు ....!

అలాంటప్పుడే ...నాకు ఓటమి కూడా ఆనందాన్ని ఇస్తుంది ....

ఈ రోజు ఒక ప్రెజెంటేషన్ సరిగా చేయలేకపోయాను .....అయినా నేనెందుకు హ్యాపీగా ఫీలయ్యాను ??!!
--------------------
నాకున్న సమయంలో ....నాకిచ్చిన పనిలో ....నాకున్న వనరుల్లో ....నాకున్న విజ్ఞానం ఆధారంగా నేను ఎంతవరకు చేయగలనో అంతవరకూ ఆ పని 100% చేసాను ....
-----------------------
తర్వాత చేద్దాం లే అని ఆ పనిని వాయిదా వేయలేదు ....
నేను చేయలేను అని ఆ పనిని తప్పించుకోవాలని చూడలేదు ....
నాకవి లేవు నాకివి లేవు అని చెప్పలేదు ....
నాకది చేయడం రాదు అని చెప్పలేదు ....
-----------------------
నాతో ముడిపడి ఉన్న మిగతావాళ్ళ పనికి నా వలన ఆటంకం కలుగకూడదు అనుకున్నా ....
అలా అని నా పనికి న్యాయం చేయకుండా కూడా ఉండకూడదు ....
అంతే.... ,,, ఆ పని మొదలుపెట్టినదగ్గర నుండి ...ఆ పని గురించే నా ఆలోచన ....
ఇంత తక్కువ సమయం ఉంది కాబట్టి మిగతా పనులను త్వరగా పూర్తి చేసుకుని ఆ సమయాన్ని ఈ పనులకు ఎలా కేటాయించుకోవాలి ....అని ఆలోచించా ....
నిద్ర పోయే సమయాన్ని తగ్గించుకున్నా ....
వాకింగ్ చేసే సమయాన్ని తగ్గించుకున్నా ....
కొన్ని అనుకోని పనులు వచ్చినప్పుడు ....ఏవి వాయిదా వెయ్యగలమో ఆలోచించా ....
ఎవరెవరు నాకు సహాయం చేయగలరో వాళ్ళని ఆ సహాయం అడిగా ....
ఒకటికి పదిసార్లు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అయ్యా ....
అయినా ఆచరణలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి ...
నాకే సంతృప్తి కలగలేదు ....
నేను చేసిన తప్పు ఏమిటో అర్ధం అయింది ....అయినా సరిదిద్దుకునే సమయం లేదని కూడా అర్ధం అయింది .....
వాళ్ళు మేం కోరుకున్నది ఇదీ అన్నారు ....నేను వాళ్లకు కావాలసింది మరొకటి అనుకున్నా ....
---------------------------
అయిపోయిన తర్వాత నేను వెనక్కి తిరిగి ఆలోచించా ...
ఎక్కడైనా ప్రయత్నంలో లోపం చేసానా అని ....ఎక్కడైనా నేను తక్కువగా చేసానా అని .....లేదు 100% నా పని నేను సక్రమంగా చేశాను అనిపించింది .....
అందుకే నాకు సంతోషంగా అనిపించింది .....
-----------------
ఇదే కాదు ....
ఏ పనిలో అయినా అంతే ...మన బాధ్యత నిర్వర్తించేటప్పుడు మనం వందశాతం ఆ బాధ్యతకు న్యాయం చేస్తే ....ఆ తర్వాత ప్రపంచం అంతా మనల్ని ఎంత విమర్శించినా మనకు బాధ కలగదు ....
పైగా సంతోషంగా కూడా అనిపిస్తుంది ...., వాళ్ళు చెప్పకముందే మన లోపాలేవో మనమే గుర్తించగలుగుతాం ....ఆ పని ఎలా చేసామో , ఎలా చేయలేకపోయామో , ఎలా చేయాలో మనకు అప్పటికే తెలుసు కాబట్టి ....
అదే మనం ఆ పనిని ....
చేస్తాను చేస్తాను అని చెప్పి ....చివరలో ....వర్షంలో తడిశాను ....నాకు జలుబు చేసింది ...ఇంటికి చుట్టాలొచ్చారు ....అని వంకలు చెప్పడం , అల్లా ఫలానా వాళ్ళు ఇది చేస్తారు అనుకున్నాను ....చివర్లో మోసం చేసారు అని , నా సిస్టం ఆగిపోయింది అనో ఏదో ఒక సాకు చెప్పి ఆ పని సరిగా చేయలేకపోతే .....అప్పుడు నిజంగా ఎవరూ ఏం అనకపోయినా కూడా మనకు బాధగా అనిపిస్తుంది ....
------------------
అందుకే .... ఎక్కడైనా ఓటమి ఎదురైనా అది విజయం అని అనుకోవాలి అంటే .....ఆ పనికి ఎప్పుడూ 100 % న్యాయం చేయాలనుకుంటాను ...
అలాంటప్పుడే ...నాకు ఓటమి కూడా ఆనందాన్ని ఇస్తుంది ....😍

Tuesday, October 17, 2017

ఒక్క డాలర్ ఖర్చు పెట్టి మిలియన్ డాలర్ రావాలని కోరుకోవడం తప్పే ...


(హెచ్చరిక ....లాటరీ టికెట్ కొనడం వ్యసనం ..అనుసరించుటకు అనర్హం ....)


ఒక్క డాలర్ ఖర్చు పెట్టి మిలియన్ డాలర్ రావాలని కోరుకోవడం తప్పే ...
ఖచ్చితంగా వ్యసనం అయిన లాటరీ టికెట్ కొనడం కూడా తప్పే .....
కానీ అందులో నా జ్ఞాపకాలను వెతుక్కోవడం ....జ్ఞాపకాలలో ఉన్న అనుభూతులను చెమరింపు కోరడం తప్పు కాదుగా .....
అలాంటి సందర్భాలను స్నేహితులతో పంచుకోవడం కూడా తప్పు కాదు కదా .....
ఒకానొక రోజుల్లో .............................
నాన్న వేరే ఊరులొ జాబ్ చేసే రోజుల్లో 15 రోజులకు లేదా నెలకోసారి ఇంటికి వచ్చేవారు ...మూడు బస్సులు మారాల్సి రావడమే అందుకు ఒక కారణం ....ఇంటికి వచ్చే రోజు నేను నాన్న కోసం ఎంత రాత్రయినా మేలుకునే ఉండేదాన్ని ....(అసలే మనం లేట్ గా నిద్ర పోయే అలవాటు ...ఇంకా మేలుకోవడం ఏమిటి )...నాన్నతో అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పడం(చెప్పించుకోవడం) అంటే నాకు చాలా ఇష్టం ....మేమిద్దరం ఒకేలా మాట్లాడుకునేవాళ్ళం ....సరదాగా సాగేవి మా కబుర్లు ....మా ఊరులొ కబుర్లన్ని నేను చెబితే ...తను జాబ్ చేసే ఊరులొ కబుర్లన్నీ నాన్న చెప్పేవారు .....ఊరు నిశ్శబ్దంగా ఉండటం వలన మా మాటలు విని మా నాన్న వచ్చారని అందరికి తెలిసిపోయేది ....అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నామని మా అమ్మ విసుక్కున్నా మా కబుర్లు వినడం మా అమ్మకు కూడా ఇష్టమని నాకు లీలగా తెలిసిపోయేది ....
అలా కోడికూసే వేళకు అతి కష్టంగా కునుకు తీసేదాన్ని ....రోజూ ఎంత నిద్రలేపినా లేవనిదాన్ని పొద్దున్నే నిద్రలేచేదాన్ని .....అన్ని పనుల్లో నాన్నతో కలిసి ఉండటం కోసం ...వేపపుల్లతో పళ్ళు తోముకుని ....అరుగుమీద కూర్చునేవారు ....కుర్చున్న వెంటనే ఏం చేయాలో నాకు బాగా తెలుసు ....ఇంట్లోకి పరుగు పరుగున వెళ్లి బియ్యం డబ్బాలో ఉన్న చెక్కరకేళి అరటి పళ్ళల్లో బాగా మగ్గిన పండు ఒకటి తీసుకుని కొడవలితో దాన్నితొక్క తీయకుండా ముక్కలుగా కోసి (అలా తినడం నాన్నకు ఇష్టం) నాన్నకు ఇచ్చేదాన్ని ....అది తిని తర్వాత కాఫీ తాగేవారు నాన్న ....అంతలో మా నాయనమ్మ కూడా వచ్చి కూర్చునేది ...నాయనమ్మ రాగానే నాన్న తన జీతం ఇవ్వడం కోసం ఇంట్లో గోడకున్న కొక్కేనికి తగిలించిన చొక్కా తెమ్మని నాతో చెప్పేవారు ......
అదేమిటో తన జీతం ఎప్పుడు తెచ్చినా నాయనమ్మకే ఇచ్చేవారు ......మళ్లీ అక్కడే మా అమ్మను పిలిచి మా నాయనమ్మ అమ్మ చేతిలో పెట్టేది ......
ఇంతోటి దానికి నాయనమ్మకివ్వడం ఎందుకో అర్ధమయ్యేది కాదు .....కానీ అదే తల్లిని గౌరవించడం అంటే అని జీవితంలో తర్వాత గానీ నాకు అర్ధం కాలేదు .....
సరే నాకు అందులో సరదా ఏంటంటే నాన్న జేబులో ఏమున్నాయో చూడటం ....నాకు కావాల్సినవి అడగటం .....
కొత్త రూపాయి నోట్లు ...రెండు రూపాయల నోట్లు ....ఇదు రూపాయల నోట్లు అంటే నాకిష్టం ....అవి తళ తళా మెరిసిపోవాలి ...అవి నాకిష్టం అని తెలిసి నా కోసమే తెచ్చేవారు నాన్న .....అవి తీసుకుని మడత నలగకుండా పెట్టుకుని సంబరపడిపోయేదాన్ని ......ఎందుకో అవి ఖర్చుపెట్టాలంటే ప్రాణం పోయేది .....వేడి వేడి బెల్లం జిలేబి కొనుక్కోవాలంటే మాత్రం రెండింటికి సమానంగా ఓట్లు పడేవి .......
అయితే జేబులో పనికి రాని కాగితాలన్నీ నాన్న పడేస్తున్నప్పుడు నా దృష్టిని ఒకటి చాలా ఆకర్షించేది ....అదే లాటరీ టికెట్ ...."నాన్నా..... ఈ లాటరీ టికెట్ ఎక్కడిది నాన్నా" అని అడిగేదాన్ని .....
అది..... ఆ షాపు అతను "ఒక్కటి కొనండి మాష్టారూ" అని బ్రతిమాలతాడమ్మా ....అందుకే కొంటాను ....అనేవారు ...
ఆ షాపు అతని కోసం నెల నెలా తప్పనిసరిగా ఒక లాటరీ టికెట్ మాత్రం కొనేవారు ....
ప్రైజ్ వచ్చిందా నాన్నా అని అడిగితే మాత్రం ...."ఏమో ....చూడలేదమ్మా ..."అనేవారు ....
కానీ నాకు మాత్రం ప్రతినెలా ఆ లాటరీ టికెట్ చూడటం .....ప్రైజ్ వచ్చిందా నాన్నా అని అడగటం ....ఆ తర్వాత ఫక్కుమని నవ్వడం అలవాటైపోయింది ....నాతోపాటు నాన్న కూడా నవ్వేవారు ....
.........................................................................................................................
ఈ రోజు ఒక చోట ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది ....అనుకోకుండా ఎదురుగా లాటరీ టికెట్ కనపడింది .....ఎందుకో నాన్న గుర్తొచ్చారు ...వెంటనే ఒక డాలర్ నోట్ తీసి ఆ మెషిన్ లో వేసా ....అది ఒక టికెట్ ఇచ్చింది .....(జీవితంలో మొదటిసారి లాటరీ టికెట్ కొన్నా ....)అది ఎంతో ఏమిటో కూడా చూడలేదు .... సన్నటి నీటిపొర అనుకుంటాను టికెట్ మీద ఏం రాసుందో సరిగా కనబడనివ్వలేదు ....టికెట్ పర్సులో దాచుకున్నా ....
కానీ ఒక్క డాలర్ కి మిలియన్ డాలర్స్ వస్తాయా ....అని తల్చుకుని ఫక్కుమని నవ్వేసా ....నాతోపాటు నాన్న కూడా నవ్వినట్టే అనిపించింది ....!!

(wrote and published on October 17 2014 )

ఎవరికైతే ....తన మీద తనకు నమ్మకం ఉండదో ...

ఎవరికైతే ....తన మీద తనకు నమ్మకం ఉండదో ....వాళ్ళే ఇతరులను అనుక్షణం కింద పడేయాలని చూస్తూ ఉంటారు ....
ఒక్కో మెట్టు ........ఎక్కడానికి కలలు కంటూ....మనం జాగ్రత్తగా నిర్మించుకుంటుంటే ....దాన్ని కాలితో తన్నేస్తూ ఉంటారు ....
మనం ఏదైనా చిన్న తప్పు చేయగానే ...."నీకు ఇది కూడా రాదా అంటారు ...." మెట్లు నిర్మించుకునే సమయంలో తప్పులు సహజం అని అర్ధం చేసుకోలేక ....
అదే తమ మీద తమకు నమ్మకం ఉంటే...,"కొన్నిసార్లు పొరపాటు జరుగుతూ ఉంటుంది....ఎవరికైనా సహజం ....అర్ధం చేసుకోగలను ...." అంటారు ....
మన ఆలోచనా విధానం కూడా మారాలి ....ఎదుటివాళ్ళు మనల్ని కింద పడెయ్యగానే ....మనం కింద పడిపోకూడదు ....🙅‍♀️
వాళ్ళ ఆలోచనా విధానం అధమ స్థాయిలో ఉంది ....అందుకే అలా అంటున్నారు అని అర్ధం చేసుకుని ..వాళ్ళని ఖండించాలి , లేదా నవ్వి ఊరుకోవాలి .....😀
"నాకింత చిన్నది రాకపోవడం/ తెలియకపోవడం ఏమిటి నీ అమాయకత్వం కాకపోతే" అని నవ్వుతూ చెప్పాలి ....   
లేదా ...అవును, ఇంత చిన్నది అయినా నాకు తెలియదు అని నమ్మకంగా చెప్పాలి ...😋
ఇవన్నీ మీకు తెలుసనుకోండి ...నాకు నేను గుర్తు చేసుకుంటున్నా ఓసారి ...🤔

ప్రేమను సృష్టించేవాళ్ళు, ప్రేమను స్వీకరించేవాళ్లు,

ప్రేమను సృష్టించేవాళ్ళు,
ప్రేమను స్వీకరించేవాళ్లు,
ఈ రెండు రకాలవాళ్లే ఉంటారు ఈ ప్రపంచంలో ....
ప్రేమను తయారు చేసేవాళ్ళు ఎప్పుడూ వాళ్ళల్లో వాళ్ళే జీవిస్తూ ....వాళ్ళల్లో వాళ్ళే స్ఫూర్తి పొందుతూ ....వాళ్ళల్లో నుండి ప్రేమను పుట్టిస్తూ ఉంటారు ......
ప్రేమను స్వీకరించేవాళ్లు ....ప్రేమను సృష్టించే వాళ్ళ దగ్గరనుండి , ప్రేమను స్వీకరిస్తూ ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉంటారు ....
అయితే, ఎవరు ప్రేమను సృష్టిస్తున్నారు , ఎవరు ప్రేమను స్వీకరిస్తున్నారు అనేది ....ఈ తేడా ఇద్దరికీ తెలియకుండానే జీవితకాలం గడిపిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ...
లేదా ప్రేమను సృష్టిస్తున్నాం అని భ్రమ పడేవాళ్ళు కూడా ఉంటారు ....ప్రేమను స్వీకరిస్తున్నాం అని తెలియని వాళ్ళు ఉంటారు ....ప్రేమను స్వీకరిస్తున్నాం అని తెలిసినవాళ్ళు కూడా ఉంటారు ....
ఏది ఏమైనా ప్రేమను సృష్టించేవాళ్ళల్లో కూడా ....సృష్టిస్తున్నాం అని తెలిసినవాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు ....
అలా తెలుసుకున్న రోజు ....ప్రేమ కోసం ఇక వాళ్ళు ఆలోచించాల్సిన స్థితి ఉండదు .....తమ హృదయంలో నుండి ప్రేమను అనుక్షణం సృష్టించేపనిలోనే వాళ్ళు ఉంటారు ....❤️
అయితే .... ప్రేమను స్వీకరించేవాళ్ళు ఇతరులపై మేం ప్రేమ కోసం ఆధారపడుతున్నాం అని తెలియకుండానే ఆధారపడుతూ ఉంటారు .....ఎదుటివాళ్ళు ప్రేమ ఇవ్వకముందే ఆధారపడడం .... ప్రేమను పొందడం కోసం ఏం కావాలో అవన్నీ చేస్తూ ఉండడం ....ఆ ప్రేమ ఎక్కడికి పోతుందో అని భయపడుతూ బ్రతకడం ...ఆ ప్రేమ పోతే మానసిక వ్యాధికి లోను కావడం చేస్తూ ఉంటారు ....  😥
ప్రేమను సృష్టించేవాళ్ళు ప్రేమను సృష్టించడం ..అది అందరికీ పంచాలని ఆరాటపడం ....ప్రేమ కావాల్సిన వాళ్లకు ప్రేమను ఇచ్చి ....సంతృప్తి పడడం ....ఇంకా ఇంకా ప్రేమను సృష్టించడం ....ప్రేమ సృష్టించలేనని భయపడకుండా బ్రతకడం చేస్తూ ఉంటారు ....😍😘
-----------------------------
అయితే వీటన్నిటికి అతీతంగా ఆలోచిస్తే....కొందరు ప్రేమను స్వీకరించడానికి కూడా భయపడుతూ ఉంటారు ఎందుకు అనే ప్రశ్న ఎదురైంది నాకు .....??!!
నాకు తెలిసిన సమాధానం ...,,,
ప్రేమను మన దగ్గరనుండి పొందాలి అంటే ....మళ్ళీ మనకు తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమో అనే సందేహం ....ప్రేమను మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన సందర్భం వస్తే ....ప్రేమ కోసం ఎవరిదగ్గరో ఆధారపడే తన దగ్గర ప్రేమ ఎక్కడినుండి వస్తుంది ,,,...ప్రేమే లేకపోతే ఎదుటివాళ్ళకు ఎలా ఇవ్వగలను అనే భయం .....
వీరు ప్రేమను ప్రేమతో కాకుండా మరే వస్తువుతో అయినా కొనుక్కోవాలని చూస్తారు ....
ఇతరులకు డబ్బు , అధికారం , పదవి లాంటివి ...ఏదో ఒకటి ఇచ్చి తాత్కాలిక ప్రేమను తయారు చేసుకుని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని ప్రేమను పొందుతూ ఉంటారు ...
అదే మనం ఏం ఆశించకుండా జీవితాంతం వాళ్ళని ప్రేమిస్తూ ఉంటామని వాళ్లకు నమ్మకం కలిగితే వాళ్ళు మన దగ్గర నుండి ప్రేమను తీసుకోవడానికి సందేహించరు ....
వాళ్లకు నిబంధనలు లేని ప్రేమ కావాలి ....
ఏది ఏమైనా ....ప్రేమను సృష్టించేవాళ్ళు వీళ్ళను అర్ధం చేసుకుని నిబంధనలు లేని ప్రేమను వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నించి ....ప్రపంచాన్ని ప్రేమ మయం చేయక తప్పదని నా అభిప్రాయం ....😍

Wednesday, October 4, 2017

నేను ఎప్పటికీ శ్రీలక్ష్మి లాగే ఉండాలి ..!

"నేను ఈ రోజు, (ఇంతకుముందు అభిప్రాయ బేధాలు వచ్చి కొన్నాళ్ళు దూరంగా ఉన్న) నా స్నేహితురాలిని కలిశాను ....ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంది ....తన మాటలు చేతలు అన్ని ఎంత అబద్ధంగా ఉన్నాయో ....అంతకు ముందు ఎన్నో సంవత్సరాలు స్నేహంలో ఉన్నప్పటికంటే ....కొన్నాళ్ళు దూరం అయ్యాక ....మళ్ళీ కలిశాక ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది ...అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది స్పష్టంగా గుర్తించగలుగుతున్నాను .... " చెప్పింది నా డాటర్ బాధగా నాతో ....
"నువ్వు చూసేది అబద్ధం అని ఇప్పుడు తెలుసుకున్నావు ....దగ్గరగా ఉన్నప్పుడు ఆ అబద్ధాన్ని గుర్తించలేకపోయావు ....అదే నిజమని నమ్మావు...
ఇప్పుడు నువ్వు ఇది అబద్ధం అనుకుంటున్నావు సరే ...కానీ మరొకటి ఏదో నువ్వు నిజమని నమ్ముతున్నావు ....అది కూడా కొన్నాళ్ళు పోయాక అబద్ధం అని తెలుస్తుంది ....
బహుశా, ఇప్పుడు అబద్ధం అని నమ్ముతున్నది అప్పుడు నిజం అని నీకు సందిగ్ధం కలిగే అవకాశం ఉంది ....
భవిష్యత్తులో మరో నిజం నీకు కనిపించినప్పుడు ఇప్పుడు ఉన్నవన్నీ అబద్ధాలు గా కనిపించొచ్చు ....లేదా నిజాలుగా మారిపోవచ్చు ....ఇలా నువ్వు జీవితం అంతా నిజం అని నమ్మినవే అబద్ధాలుగా మారిపోతూ ఉంటాయి ....మళ్ళీ మళ్ళీ నిజం కోసం అన్వేషిస్తూనే ఉంటావు ....
నాకు తెలిసి నేను ఇంతవరకూ నిజాన్ని ఎప్పుడూ చూడలేదు ......జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తుంది అనే ఆశతో అన్వేషించడమే జీవితం అని ....మనం ఏర్పరచుకున్న నమ్మకం మాత్రమే నిజం అని అర్ధం అయింది ...." వివరించా ...
"అయితే నిజమే లేకపోతే.. ఇక దేనికోసం ఈ పరుగు ....?"
"అందుకే దేనికోసం పరుగులు పెట్టొద్దు ....ఒక్క క్షణం నువ్వు దేనికోసమో ఆశించి పరుగులు పెట్టావా ....ఆ క్షణం నువ్వు నీ జీవితాన్ని కోల్పోయినట్టే .....
ఈ క్షణం , ఈ రోజు .....నీ మనసుకు , శరీరానికి ఏం కావాలి అని ఆలోచించుకో ....అవి ఇవ్వడానికి కృషి చేయి ....ఏదైనా నీ దగ్గరనుండి ఆశించి ఎవరైనా వస్తే ....నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు ....లేదా ఎవరి దగ్గరనుండి అయినా నువ్వు ఏదైనా ఆశిస్తే అడుగు ....
మొత్తానికి నీకు కావాల్సింది నీకు దొరికిందా... సంతృప్తిగా సంతోషంగా బ్రతుకు ....నీకు దొరకలేదా ...అయినా సంతోషంగా సంతృప్తిగా బ్రతుకు ...
ప్రతి క్షణాన్ని ఆస్వాదించు ....అది ఎలా ఉన్నా సరే ....!"
నేను అనుసరించే జీవితాన్ని వివరించా ...దగ్గరగా ఉండి వాళ్ళు చూసేదే అయినా .....!
"నువ్వు మమ్మల్ని కనకుండా ఉంటే....ఓషో అయి ఉండేదానివి అనిపిస్తుంది ...." చెప్పింది ....ఏదో ఆలోచిస్తూ ....
"హ హ ....నాకు ఓషో అవ్వాలని లేదు నాన్నా ....నేను ఎప్పటికీ శ్రీలక్ష్మి లాగే ఉండాలి ....నా జీవితాన్ని నేను ఆస్వాదించాలి .....నాకు మరొకరిలా ఉండాలని ఎప్పటికీ ఉండదు ...." నవ్వుతూ చెప్పా ....
"అలా ఎందుకు చెప్పాను అంటే ... నీకు గొప్ప పేరొస్తుంది కాదా ...అందరికీ అర్ధమయ్యేలా ఇంకా బాగా చెప్పగలుగుతావు ...." అభిప్రాయ వ్యక్తీకరణ ...
"ఆ పేరు కోసం ...ఎవరిలాగో అవ్వాలనుకోవడం కూడా అబద్ధమేగా ....దాని కోసం పరుగులు పెట్టడమే కదా ....అప్పుడు మనం మన జీవితాన్ని ఎక్కడ ఆస్వాదిస్తున్నాం ....ఈ క్షణం ఎక్కడ జీవిస్తున్నాం ....నా దృష్టిలో ఓషో ఓషోనే ....నేను నేనే ..." ఆ ఓషో ఏం చెప్పాడో నాకేం తెలియకపోయినా వివరించా ....
"నాకు నీతో మాట్లాడాక చాలా సంతోషంగా అనిపిస్తుంది ....థాంక్స్ " చెప్పింది ప్రేమగా .....😍