Monday, July 31, 2017

నేనూ అమ్మనే కదా ....??!! అందుకే బాగా తెలుసు ...!! :)

అమ్మకు నేను పెద్దదాన్ని అయి చూపించాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా ....
అది నా సంతోషం కోసం కాదు ....అమ్మ సంతోషం కోసం .....
--------------------------------
చిన్నతనంలో ....
అమ్మా ముల్లు గుచ్చుకుంది అంటే.... ఆదారిలో నుండి ఎందుకెళ్లావ్ అని అమ్మ కోప్పడేది ....
అమ్మా కడుపులో నొప్పిగా ఉంది అంటే .....రెండు మూడు రోజుల క్రితం
నుండి నేనేం తిన్నానో అమ్మ లిస్ట్ చదివి ....అందులో నా కడుపులో నొప్పికి కారణమైన వాటిని ....దూరంగా ఉంచాలని ప్రయత్నించి ....అవి తిన్నందుకు నన్ను తిట్టి పోసేది ....
వేడి చేసింది అంటే ...ఎండలో బయటకు వెళ్లకుండా ఉండమని హెచ్చరికలు చేసేది ....
ఇంజక్షన్ అంటే భయం అని ఏడిస్తే ....అందుకు బదులు టాబ్లెట్స్ తీసుకుంటానని డాక్టర్ ని అడిగేది .....
ముక్కు కుట్టించుకుంటాను అని సరదా పడితే ....ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవు అని వాయిదా వేసేది ....
ఎక్కడైనా పడి దెబ్బలు తగిలించుకుంటే ....అసలు ఆటల్లోకి ఎందుకు వెళ్లావని నిలదీసేది....
ఇవన్నీ అమ్మ చేసినప్పుడల్లా ....అప్పట్లో అమ్మ అన్నిటికి అడ్డు పడుతుందని అమ్మ మీద కోపం వచ్చినా ....నేను చిన్నదాన్ని కాబట్టి నొప్పి తట్టుకోలేనని నా మీద ప్రేమతో అలా నన్ను కోప్పడి ఉంటుందని ఇప్పుడు అనుకుంటూ ఉంటా ....
కానీ ఇప్పటికీ ....ఇంకా నేను చిన్నదాన్నే అని భావిస్తూ ఉంటే ...నాకే కష్టం కలుగుతుందో అని అమ్మ ఎప్పుడూ కంగారు పడుతూ ఉంటే .....నేను నొప్పి తట్టుకోలేనని...ఆ నొప్పిని తాను తీసుకోవాలని అమ్మ ప్రయత్నిస్తూ ఉంటే ....
నా కష్టాలేమిటో ఎలాగైనా తెలుసుకుని అవన్నీ తాను పంచుకోవాలని అమ్మ ఆరాటపడుతూ ఉంటే ....
అమ్మకు చెప్పాలనిపిస్తుంది ....అవసలు కష్టాలే కాదమ్మా అని ...,,,
ఇంకా నేను చిన్నపిల్లని కాదమ్మా అని ....,,,
నేను చాలా చాలా పెద్దదాన్ని అయిపోయానమ్మా అని ....,,,,
.........................................
కానీ ఒక్కటే భయం వేస్తుంది ....ఎలా పెద్దయ్యావు అని అమ్మ అడిగితే ఏం చెప్పాలా అని ....??!! 
నేను పెద్దయ్యాను అని చెప్పినా భరించలేదు , నేను చిన్నదాన్నే అని చెప్పినా కంగారు పడుతుంది .... 
అందుకే ఒక చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటూ ఉంటా .... 
కానీ నాకెక్కడో చిన్న భయం ....ఈ అమ్మల్ని నమ్మకూడదు ....ఎలాగైనా బిడ్డ మనసు అర్ధం చేసుకునే శక్తి వాళ్లకు ఉంటుంది .... 
నేనూ అమ్మనే కదా ....??!! అందుకే బాగా తెలుసు ...!! 

పదండి ముందుకు ....పదండి త్రోసుకు ...పోదాం పోదాం పైపైకి .... (ఈ ఒక్క వాక్యానికి శ్రీ శ్రీ గారికి కృతజ్ఞలతో)

చిన్న తనంలో పిల్లలు అందరం కలిసి ఆటలాడుకునేటప్పుడు .....,,,,
ఒకళ్ళ వెనక ఒకళ్ళం వరసనే నిలబడి ....మగపిల్లలు అయితే ...ముందువాళ్ళ చొక్కా ,లేకపోతే... ఆడపిల్లలం అయితే ముందువాళ్ళ జాకెట్టు అంచులు పట్టుకుని .....గుండ్రంగా ఒక మాట అనుకుంటూ పరుగులు పెట్టాలి .....
వెనక ఉన్న నలుగురు ....ఎంతెంత దూరం ....అని అడుగుతారు ....
చానా చానా దూరం అని ముందు వాళ్ళు చెప్పాలి .....
అలా ఎంతెంత దూరం ....చానా చానా దూరం అని గుండ్రంగా ,ఆపకుండా పరిగెడుతూనే ఉండేవాళ్ళం .....
ఎంత పరుగులు తీసినా ఆ గమ్యం రాదు ....
పరుగులు తీసీ తీసీ అలసి పోతాం ....అలసి పోయి ఆపితేనే ....ఆ చానా చానా దూరం వచ్చినట్టు ....
ఆట ఆడి అలసి పోవడమే ఆ ఆటలో పరమార్ధం ....ఆడి ఆడి అలసిపోయాక వచ్చే సంతృప్తే గెలుపు ......గమ్యం కోసం అలసట వచ్చే వరకు విసుగు లేకుండా పరుగులు తీయడమే అంతరార్ధం ....
అంతే కానీ ....ఒడ్డున కూర్చుని ...ఉత్తినే పరుగులు పెట్టడమే కదా ...ఏముంది ఈ ఆటలో అనుకుని ఆడకుండా కూర్చుంటే ....ఆడిన సంతృప్తి ఎక్కడినుండి వస్తుంది .... ఆటలో నువ్వు ఎక్కడుంటావ్ ....
-------------------------------------------
జీవితం కూడా అంతే .....గెలుపు అంటే ...అనుక్షణం జీవించడమే....ప్రతి క్షణం శ్రమించడమే ...
ఎప్పుడో ఏదో గెలుపు అనే అద్భుతం జరుగుతుంది ....అప్పుడే జీవించాలి అని కాదు ...
పరుగులు పెట్టడం , అలసి పోవడం ,పడిపోవడం ,తప్పటడుగులు , గమ్యం చేరడం ....
ఇదే గెలుపు .....!! ఇది రోజూ ఉండేదే ,రోజూ ఆడేదే ....రోజూ జీవించేదే ...!!
----------------------------------------
గెలుపు అనేది ఇంకా ఏదో ఉంది ,ఎక్కడినుండో ఊడి పడుతుంది అని భావించక ....
పదండి ముందుకు ....పదండి త్రోసుకు ...పోదాం పోదాం పైపైకి .... (ఈ ఒక్క వాక్యానికి శ్రీ శ్రీ గారికి కృతజ్ఞలతో)

Sunday, July 30, 2017

ఎవరు సంతోషంగా ఉంటారు ....ఎవరు ఏడుస్తూ ఉంటారు ....??!!

ఎవరు సంతోషంగా ఉంటారు ....ఎవరు ఏడుస్తూ ఉంటారు ....??!!
=====================
కొందరు ....వాళ్లకు ఏదైనా జరగనివ్వండి ....అది ఆ క్షణమే మర్చిపోయి ....మరుక్షణమే హాయిగా నవ్వుతూ బ్రతికేస్తారు ...
కొందరు ....ఏదైనా జరగడం మాట అటుంచి ....ఏం జరగకపోయినా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు ...
ఈ మధ్య... ఈ ఇతివృత్తానికి ఇద్దరిని ఎంచుకుని ....అదే అంశం వాళ్లకు అన్వయించి గమనించా .....(గమనించే అవకాశం వచ్చింది ....)
అయితే వారి మధ్య ప్రాంతీయ వ్యత్యాసం కూడా ఉందనుకోండి ....అది వారు చిన్నతనం నుండి పెరిగిన విధానాన్ని గమనించడానికి తోడ్పడింది .....అయితే అది కూడా వారి వారి ప్రవర్తనకు కారణం కావచ్చు అనేది నిర్వివాదాంశం ...
==========================
అందులో X అనే వ్యక్తి వయసు... 50 సంవత్సరాలు ....చాలా లావుగా ఉంటాడు ....నడవడం కూడా కష్టంగా నడుస్తాడు ....అతను ఎప్పుడూ నవ్వుతూ ....ఎదుటివారిని నవ్విస్తూ ....ప్రతిక్షణం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు .....
Y అనే వ్యక్తి వయసు.... 35 సంవత్సరాలు .....ఎప్పుడూ నవ్వు అనేది ఉండదు మోహంలో ....ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఓ అభద్రతా భావంలో ఉంటాడు ....ముభావంగా ఉంటాడు ....
ఇద్దరూ ఒకే ఉద్యోగం ....ఒకే సంపాదన ....ఒకే విధమైన జీవన విధానం .....(అలాంటి సమయంలోనే మన పరిశోధన సులభం అవుతుంది అనుకోండి ....)
సంతోషంగా ఉండే వ్యక్తి (X)...ఒకే అంశం మీద తన జీవితం ఆధారపడకుండా చూసుకున్నాడు .....
ఏడుస్తూ ఉండే వ్యక్తి కి ....జీవితం అంతా ఒకే అంశం మీద ఆధారపడేలా చేసుకున్నాడు ....
ఉదాహరణకు .....కెరీర్ , వైవాహిక జీవితం , పిల్లలు, కళలు , ఆటలు , పాటలు , మాటలు , వినోద వ్యాపకాలు ....ఇలా జీవితంలో అనేక రకాలైన అంశాలు మన దైనందిక జీవితంలో మనం భాగంగా చేసుకోవాలి ....
కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే ....మనం ఒకే అంశాన్ని జీవితంగా చేసుకుంటాం ....కెరీర్ ని పట్టుకుంటే కెరీర్ లోనే ఉండిపోయి ....ఇల్లు , పిల్లలు మర్చిపోయి అదే జీవితం అనుకుంటాం .....
ఇల్లు , పిల్లలు జీవితం అనుకుంటే ....కెరీర్ ని వదిలేసుకుంటాం .....
లేదా మగవాళ్ళు ఇది చేయాలి / ఆడవాళ్లు ఇది చేయాలి అని నియమాలు పెట్టుకుంటాం ....ఇక కళలు అయితే ....అవి వయసుకి పరిమితం చేసి వాటి జోలికి వెళ్ళడానికి కూడా సాహసం చేయం ....
ఎప్పుడైతే ఒకే అంశానికి పరిమితమై పోయి అదే జీవితం అనుకుంటామో ....అక్కడ మనకు ఒక అభద్రతా భావం మనకు తెలియకుండానే చోటు చేసుకుంటుంది ......అందులోకి ఎవరైనా వచ్చి మనల్ని అధిగమిస్తారేమో అనే భయం , అందులో ఓడిపోతామేమో అనే భయం , అది లేకపోతే ఇక జీవితంలో అన్ని కోల్పోయామని నిర్ణయం .....
కెరీర్ లో ఫెయిల్ అయితే ....మరో కెరీర్ చూసుకోవచ్చు అనే ఆలోచన రాదు ....వైవాహిక జీవితం విఫలం అయితే కెరీర్ ఉంది అనే ఆలోచన రాదు ....లేదా పిల్లలు / కళలు ....ఇలా ....
అదే, జీవితంలో వివిధ అంశాలను నీ సొంతం చేసుకుంటే ....జీవితం భద్రంగా అనిపిస్తుంది ...
నువ్వు ఎంచుకున్న కెరీర్లో నీకు అవకాశాలు లేవా ....అయితే కెరీర్ మార్చుకో ....
భార్యా భర్తలకు పడట్లేదా ....కాస్త దూరంగా ఉండి....నీకిష్టమైన వ్యాపకం మీద దృష్టి సారించు ....
మ్యూజిక్ వినడం విసుగనిపించిందా .....కాసేపు డాన్స్ చేసుకో .....లేదా నీకిష్టమైన ఆటలు ఆడుకో ....
ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడు ...లేదా పోట్లాడు ....
మొత్తానికి జీవితాన్ని ఒక అంశం మీద ఆధారపడకుండా తీర్చిదిద్దు .......
నీ జీవితం ఎంత భద్రంగా ఉంటుందో నువ్వు అంత సంతోషంగా ఉంటావు ....అంత సంతోషాన్ని ఇతరులకు పంచుతావు ....😍
=========================
X అనే వ్యక్తి అదే చేసాడు ....ఉదయం నుండి సాయంత్రం వరకు ...అతను తన జీవితానికి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాడు .....😍
Y అనే వ్యక్తి ....ఒకే ఆప్షన్ ఇచ్చాడు ...😥
==========================
ఇప్పుడు ....నీ జీవితాన్ని అభద్రతా భావంలో ఉంచడమా ఆప్షన్స్ ఇవ్వడమా అనేది నీ చేతుల్లో ఉంది .....😀
ఎన్ని ఆప్షన్స్ నువ్వు నీ జీవితానికి ఇస్తావో నీ జీవితం అంత హాయిగా భద్రంగా ఉంటుంది ..... 

నా జీవితం నేర్చుకున్న జీవిత సత్యాలు .....

లోతైన బాధలోకి వెళ్లి వచ్చాక సంతోషించడం నేర్చుకోవడం .....
లోతైన దుఃఖం లోకి వెళ్లి వచ్చాక చిరునవ్వులు నేర్చుకోవడం ....
లోతైన మౌనం లోకి వెళ్లి వచ్చాక మాటలు నేర్చుకోవడం ...
లోతైన ధ్యానం లోకి వెళ్లి వచ్చాక ఆలోచనలు నేర్చుకోవడం ...
లోతైన అజ్ఞానంలోకి వెళ్లి వచ్చాక జ్ఞానం నేర్చుకోవడం .....
లోతైన మరణం లోకి వెళ్లి వచ్చాక జీవించడం నేర్చుకోవడం .....
------------------------------------------------------------
నా జీవితం నేర్చుకున్న జీవిత సత్యాలు ..... 

మన జీవితాన్ని ఏదైనా చేసుకునే హక్కు మనకు ఉంటుంది ..

మన జీవితాన్ని ఏదైనా చేసుకునే హక్కు మనకు ఉంటుంది ...అది ఎవరూ కాదనలేని సత్యం ....
ఎప్పుడూ మనం.....మన జీవితాన్ని గెలిపించాలని , అందంగా తీర్చిదిద్దాలని , ఆదర్శవంతంగా చేయాలని .....కృషి చేస్తూ ఉంటాం ....
అయితే ....మన ప్రమేయం లేకుండా కానీ ,ఉండి కానీ కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే ఓడిస్తాం ,తప్పుదారి పట్టిస్తాం ....
ఎలా జరిగినా ..... అలా ఓడిన జీవితాన్ని వదిలేసే హక్కు మనకు లేదు ...
ఓడిన జీవితాన్ని మళ్ళీ గెలిపించే బాధ్యత , తప్పుదారి పట్టిన జీవితానికి గమ్యం చూపే బాధ్యత మళ్ళీ మనదే ....!!

గెలుపు కావాలి అనుకుంటే ....,,,,

గెలుపు కావాలి అనుకుంటే ....,,,,
ప్రతి క్షణం ఓడిపోతూ ...ఓటమిని అంగీకరిస్తూ ...ఓటమిని అధిగమిస్తూ ...ఓటమిని ఆస్వాదిస్తూ ....ఓటమితో పోరాడుతూ ....ఓటమి నుంచి నేర్చుకుంటూ ....
అక్కడక్కడా ఆగిపోతూ ....తప్పటడుగులు వేస్తూ ....ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ ...సాగిపోతూ ఉండాలి .......
అదే గెలుపు అవసరం లేదు అనుకుంటే ...ఇవేమీ ఉండవు ....,,,,,
ఒకే ఒక్క క్షణం ...ఇప్పుడున్న క్షణం దగ్గర ఆగిపోయి .....ఒక్క అడుగు వెనక్కి వేస్తే చాలు .... !!

Sunday, July 23, 2017

"కృతజ్ఞతలు" :) :) :)

మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అని శ్రీ శ్రీ గారన్నట్టు ....ఎవరైనా అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉన్నా లేకపోయినా .....,,,,
మనల్ని అవమానించేవాళ్ళు , కించపరచేవాళ్ళు , మనల్ని అసహ్యించుకునేవాళ్ళు , మనల్ని కింద పడేసేవాళ్ళు ....విమర్శించేవాళ్ళు .....ఇలాంటి వాళ్ళు కొందరు మాత్రం మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి .. 
మనం ఆశతో ఎగరడానికి రెక్కలు నిర్మించుకున్న ప్రతిసారీ ....ఆ రెక్కల్ని నిర్దాక్షిణ్యంగా ముక్కలు చేసి నరికి పడేసి ...."ఇదే నా నైజం" అని మన ముందు నిలబడతారే....
అదిగో అలాంటి వాళ్ళు అతి తప్పనిసరిగా ఉండాలి .... 
మనం ఆ రెక్కలన్ని ఎక్కడున్నాయో ఏరుకుని ....వరసగా పేర్చుకుని ....ఆశతో అతి జాగ్రత్తగా మళ్ళీ అతికించుకుని ....మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించాలి ....
మళ్ళీ మళ్ళీ ఇదే జరిగినా .....మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి ....
ఎలాగైనా ఎగరాలనే ఆశ అంత గొప్పది కావాలి ..... 
కాకపోతే ఇక్కడ ఒక చిన్న మార్పు జరుగుతూ ఉంటుంది .....
మొదటిసారి రెక్కలు విరిచేసినప్పుడు ....వద్దు అంటాం ,బ్రతిమాలతాం ,కాళ్ళా వెళ్ళా పడతాం ...బాధతో గిల గిల లాడిపోతాం .....ప్రాణాలు పోయే బాధ కలుగుతుంది ..... 
రెండోసారి కొద్దిగా .... 
మూడోసారి ఏం ఉండదు ..... 
చివరకు ....,,,,,,
రెక్కలు విరిచేసే సమయంలో ....నవ్వుకుంటాం ....ఇది మీకు అలవాటే కదా .....అన్నట్టు చిద్విలాసంగా చూస్తాం .....రెక్కలు వరుసగా పేర్చుకోవడం ,అతికించుకోవడం .....అనుభవజ్ఞుల్లా చాకచక్యంతో చేసేస్తాం .....ఒక్క క్షణంలో రెక్కలు అతికించుకుంటాం .....
ఇక ఎగరడం నేర్చుకోవడమే ఆలస్యం ..... 
రెక్కలు విప్పి ఆకాశానికి ఎగిసిన క్షణంలో .....వాళ్ళ అల్పత్వం అక్కడినుండి చూసినప్పుడు అనిపిస్తుంది .....
ఎన్నో జీవితసత్యాలు నేర్పిన వాళ్లకు, ఒక్కసారి "కృతజ్ఞతలు" చెప్పాలని .. 
కానీ వాళ్ళు మనల్ని అందుకోలేనంత లోతులో ఉంటారు ..... 
అందుకే ముందుగానే వాళ్లకు "కృతజ్ఞతలు" చెప్పేస్తే ఓ పనైపోతుంది కదా ..??!!
"కృతజ్ఞతలు"   

"నేను వాళ్ళ వలన మోసపోయాను ..."

"నేను వాళ్ళ వలన మోసపోయాను ..."
"నన్ను వాళ్ళు మోసం చేశారు "
"నన్ను అందరూ మోసం చేశారు "
"నన్ను ఎవరూ మోసం చేయలేరు "
"నేను ఎవరి వలనా మోసపోకూడదు ..."
-----------------------
ఇలాంటి వాక్యాలు నాకు తరచూ మిత్రుల నుండి వినిపిస్తూ ఉంటాయి ....
(కొన్నాళ్ల క్రితం వరకూ నేనూ అలానే అనుకునే దాన్ని అనుకోండి )
మిత్రులకు చెప్పాలనుకునే....నేను గమనించిన జీవిత సత్యం ఏమిటంటే .........,,,,
ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరినీ మోసం చేయడం ఉండదు ....మన అవసరాల కోసం మనం వాళ్ళను నమ్ముతాం ....వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అవకాశాలు చూసుకుంటారు ....(తీసుకుంటారు )
"ఎవరి అవసరాలు, అవకాశాలు ,జీవన పోరాటాలు వారివి ..."
అయితే ....,,,
నేను ఇది ఇచ్చాక నువ్వు అది ఇవ్వాలి ..అనే సిద్ధాంతం ....ప్రతిపాదించినపుడు ....ఫలితం నిర్ణయించే అవకాశం ఎదుటివాళ్ళకు ఇచ్చాము అని అర్ధం ....
నువ్వు అది ఇచ్చాక నేను ఇది ఇస్తాను ....అనే సిద్ధాంతం ....ప్రతిపాదించినపుడు ...ఫలితం నిర్ణయించే అవకాశం మనం తీసుకున్నాం అని అర్ధం ...
ఎలాంటి సిద్ధాంతం మనం ప్రతిపాదించాలి, ఏ సందర్భంలో ఏ సిద్ధాంతం ప్రతిపాదించాలి అనే విషయంలో......,,,,
మన స్థితిగతులు , సామాజిక పరిస్థితులు , వ్యక్తిగత కారణాలు , అవసరాలు మొదలైనవి ప్రధాన పాత్ర వహిస్తాయి ....
కాబట్టి ...చివరగా ...వాళ్ళు వీళ్ళు నన్ను మోసం చేశారు అనే ఆలోచనలు మానేసి ....హాయిగా ఉండండి .....   

Friday, July 21, 2017

అందరితో విమర్శలకు గురవుతుంటా....!! :)

"ఎప్పుడూ నీలో ఉన్న అనుకూల అంశాలు మాత్రమే వ్రాస్తూ ఉంటావు ....నీ గురించి నువ్వు గొప్పలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటావు ...." అని కొందరు ఆంతరంగిక మిత్రులు నా పట్ల చేసిన నిరంతర విమర్శల వలన ....,,
ముందుగా వారిమీద కాస్త కోపం కలిగినా .....
కాస్త తరచి ఆలోచించి చూసి ....,,
వాళ్ళ విమర్శలకు కూడా కాస్త విలువ నివ్వాలని ....,,
వాళ్ళకి కూడా మనసు ఉంటుందని .....,,
అభిప్రాయం ఉంటుందని ....,,
వాటిని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించుకుని .....,,
నాలో ఉన్న ప్రతి కూల విషయాలు కూడా కొన్ని అప్పుడప్పుడు వ్రాద్దాం అని నిర్ణయించుకున్నా ..... 
సరే ప్రతికూల విషయాలు అంటే ఏమిటి అని ఆలోచిస్తే ....ఎప్పుడూ నాలో కనిపించే అనుకూల అంశాలు గురించి వ్రాస్తున్నా కాబట్టి ....లేనివన్నీ ప్రతికూల అంశాలే కదా అని అర్ధమైంది .....  
నాలో ఏం లేవా అని మళ్ళీ ఆలోచిస్తే ...చాలా సేపటికి ఒక విషయం తట్టింది ..... 
నాలో "క్షమాగుణం"(ఉండీ లేనట్టు ) చాలా తక్కువగా ఉంది ... 
ఉన్నదాన్ని వృధా చేయకుండా చాలా పొదుపుగా వాడుకుంటూ ఉంటా ... 
వీలైతే ఎవరికీ కనిపించకుండా దాచుకుంటూ ఉంటా ... 
మరీ ఎదుటివాళ్ళు చావు బ్రతుకుల్లో ఉన్నారు అని అనుకుంటే తప్ప ఇవ్వను ....
ఎంత బ్రతిమాలినా ఇవ్వాలనిపించదు....ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటూ ఉంటా ....
"సారీ" అనే పదం ఇస్తాం అంటారు .....అయినా ఇవ్వను ... 
ఉన్న కాస్తా "సారీ" కే ఇచ్చేస్తే ...రేపు భవిష్యత్తులో అంతకంటే అవసరం ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ....చేసిన తప్పులకు ప్రాణాలే తీసుకుంటాం అంటే క్షమా భిక్ష వెయ్యడానికి కాస్త అయినా దాచుకోవాలిగా .....??!!  
అందుకే ఈ విషయంలో ఇంత కఠినంగా ప్రవర్తించి ...,,,
నా దగ్గర తక్కువగా ఉన్న క్షమాగుణం ఎవ్వరికీ ఇవ్వకుండా పిసినారిలా దాచుకుంటూ ఉంటా ..... 
అందరితో విమర్శలకు గురవుతుంటా....!! 
---------------------------------------
ఇక ముందు కూడా ....అప్పుడప్పుడు నాలోని ప్రతికూలతలు తెలియజేసే పోస్ట్ లు పెడతానని ...ఆంతరంగిక మిత్ర వర్గానికి మనవి .....  

వీళ్ళ జన్మ చూసి ప్రకృతి పులకిస్తుంది ....

కొందరు....,,,,
100 విషయాల్లో ..., 99 బాధపడే విషయాలు ....ఒక్క సంతోషించే విషయం ఉన్నప్పుడు ....సంతోషాన్ని వాళ్ళు ఆస్వాదించే భావంగా ఎంచుకుంటారు ....
వీళ్ళు సందేహం లేకుండా ...ఏ దిగులూ లేకుండా సంతోషంగా బ్రతకడానికి పుట్టి ఉంటారు ..... 
మరి కొందరు ....,,,,,
100 విషయాల్లో ..., 99 సంతోషించే విషయాలు ....ఒక్క బాధపడే విషయం ఉన్నప్పుడు ...బాధను వాళ్ళు కుళ్లిపోయే భావంగా ఎంచుకుంటారు ...
వీళ్ళు సందేహం లేకుండా ...ప్రపంచ పర్యావరణం సర్వ నాశనం చేయడానికే పుట్టి ఉంటారు ...... 
అరుదుగా కొందరు మాత్రం ...,,
విషయాలు ఎలాంటివో సంబంధం లేకుండా ...సంతోషాన్ని అందరికీ పంచుతూ ....బాధ వస్తే మాత్రం తాము ఒక్కరే భరిస్తూ ....తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నందన వనంలా ఉంచుతారు .....
వీళ్ళను సింపుల్ గా కారణ జన్ములు అంటారు ....
వీళ్ళ జన్మ చూసి ప్రకృతి పులకిస్తుంది ....
ప్రపంచం పరవశిస్తుంది ....
వీళ్ళు ఎక్కడుంటే అక్కడ కాంతి రేఖలు ప్రసరిస్తూ ఉంటాయి .....వీళ్ళు దగ్గరుంటే చాలు అని ప్రతి ఒక్కరూ అనుక్షణం కోరుకుంటూ ఉంటారు ....  
-------------------------------------------------
అయినా సంతోషాన్ని అందరికీ పంచడం కంటే ఈ జన్మకు కారణం ఏం ఉంటుంది .....??!!  

ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో రెండురకాల వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ....

ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో రెండురకాల వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ....
ఒకరు ధైర్యవంతులు ఉంటారు ....
రెండు ధైర్యవంతులం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు ....
ధైర్యవంతులు… ఒక పనిలో ఉన్న రిస్క్ గురించి ఆలోచించరు....ముందు ఆ పని చేస్తారు ...అందులో ఏదైనా నష్టం ఎదురైతే వాళ్ళు ఒక్కరే భరిస్తారు ....లాభం ఎదురైతే అది పది మందికీ పంచి ...ఈ పనిలో ఉన్న సాధ్యా సాధ్యాలు ఇవి అని ప్రపంచానికి వివరించి ....ఆ పని చేయడానికి అందరినీ ప్రోత్సహిస్తారు .... 
ధైర్యవంతులం అని చెప్పుకునేవాళ్ళు ....ధైర్యవంతులు చేసిన పనిని మాత్రమే వాళ్ళు చేస్తారు ....తర్వాత ప్రపంచానికి మేం ధైర్యవంతులం అని చెప్పుకుంటారు ....