Wednesday, October 31, 2018

నాకు నా అక్షరాలే ....అయినవాళ్లు ....కానివాళ్ళు ....ఆత్మ బంధువులు .....!

మనిషిని ....జంతువులను, ఇతర జీవులను హింసించడం లేదా చంపడం మానవ మనుగడలో భాగం అయి ఉండొచ్చని అనాదిగా వస్తున్న మన నమ్మకం ....
కానీ మనిషిని మనిషే హింసించడం కూడా మానవ మనుగడలో భాగమే అనిపిస్తుంది ....
కొందరికి కనిపించిన ప్రతి ఒక్కరినీ హింసించాలని ఉంటుంది ....
మరి కొందరు ....వాళ్ళ మనసు , శరీరం అసౌకర్యానికి విపరీతమైన బాధకు గురైనప్పుడు ఆ బాధ ఎదుటివారికి కూడా తెలియజేయాలని ....ఎలాగైనా వాళ్ళు కూడా అలాంటి బాధకు గురైతే తమకు కాస్త ఉపశమనం కలుగుతుందని అనుకుంటారు ....
ఇంకొందరు ....తమ కింద ఉద్యోగస్తులను తమ హింస తత్వాన్ని ప్రదర్శించడానికి ఎన్నుకుంటారు ....ఇది ఎదుటివాళ్లను అసహాయులను చేసి ప్రదర్శించే హింస ...
ఇందులో కొందరు పైకి మంచివాళ్ళం అనిపించుకుని కింది ఉద్యోగస్తులను హింసించాలి అనుకుంటే ....వాళ్ళ ఆర్ధిక , సామజిక , కుటుంబ స్థితిగతులు ఏమిటో తెలుసుకుని ....వాళ్ళ హింసను భరించడం తప్ప వీళ్లకు వేరే మార్గం లేదని తెలుసుకున్న వ్యక్తులను హింసకు ఎన్నుకుంటారు ....
ఈ మధ్య ఇండియా వచ్చినప్పుడు చూసా ....బట్టల షాపులో కౌంటర్ దగ్గర కస్టమర్ కి కస్టమర్ కి బిల్లు కట్టించుకోవడంలో ఉన్న గాప్ లో ....అక్కడే పక్కన కూర్చుని బట్టలు మడతబెట్టుకుంటున్న అమ్మాయి నడుము గిల్లి ఏమీ తెలియనట్టు ....మళ్ళీ బిల్లు కట్టించుకోవడానికి వచ్చాడు ఒకడు .....అదొక రకమైన హింస ...
కొందరు ...మూడో కంటి వాళ్లకు తెలియకుండా హింసించాలి అనుకుంటారు ....అంటే వీళ్ళు ఇంక ఎవరికీ చెప్పలేరు అని నిర్ధారించుకుని అలాంటి వ్యక్తులను మాత్రమే హింసకు ఎంచుకుంటారు ....వీళ్లకు సమాజం అంటే చచ్చే భయం ఉంటుంది .....సమాజంలో చెడ్డపేరు రాకూడదు ....పెద్దమనిషితనం వీళ్లకు చెక్కు చెదరకూడదు .....
మరికొందరు ....తమ కష్టాలు ఎదుటివాళ్ళకు చెప్పి ....వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు సంతోషిస్తారు ....అంటే మనకోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కదా అని సంతోషం ....ఎక్కువగా బాధ పెట్టడం కోసం కష్టాలను గోరంత ను కొండంత చేసి చెబుతారు ....
కొన్నిసార్లు కష్టం మాత్రమే చెప్పి దానికి దొరికిన పరిష్కారం చెప్పరు...వాళ్ళు ఎక్కువ కాలం అదే విషయం గూర్చి చింతిస్తూ ఉండాలని ....తర్వాత ఎప్పుడో వాళ్ళు అడిగితే ...ఈ మధ్యే పరిష్కారం అయింది ....అని విచారంగా చెబుతారు ....(అయ్యో వీళ్ళ బాధ పోతుందే ఎలా అని )
ఇలా మనిషిని మనిషి బాధపెట్టడానికి అవకాశం ఇవ్వాలే కానీ ... చిత్ర విచిత్రమైన తత్వాలతో మనిషి ప్రపంచంలో ఉన్న క్రూర జంతువులన్నిటిని మించిపోగలడు .....మనుషులు ఎన్ని రకాలు ఎన్నాయో హింసలు అన్ని రకాలు ఉంటాయని ... నాకు కొందరు నేర్పిన జీవిత పాఠం ....
ఏది ఏమైనా ....
ఇతరులతో మనం బాధింపబడినప్పుడు ఆత్మీయుల దగ్గర సాంత్వన పొందడం ...ఆత్మీయులతో బాధింపబడినప్పుడు ఇతరుల దగ్గర సాంత్వన పొందడం .... మనం అప్పుడప్పుడూ చేస్తూ ఉంటాం ....
కానీ ఆ ఆత్మీయులు ఎవరు ....ఆ ఇతరులు ఎవరు అనేదే మనం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి .....
నేనూ ఈ దుష్ట మానవ ప్రవృత్తికి అతీతమైన వ్యక్తిని కాను ....
నాకు తెలియక నేను ఎవరిని హింసిస్తానో నాకు తెలియదు ....నాకు తెలిసీ నేను ఎవరినీ హింసించాలని అనుకోను ....
ఒకవేళ నన్ను ఎవరైనా హింసిస్తే ఎందుకు వాళ్ళు హింసిస్తున్నారో ఆలోచిస్తా ....
అది వారి మనుగడలో భాగం అయితే దూరంగా జరుగుతా ....
కావాలని హింసిస్తే ....అయినా దూరంగా జరుగుతా....
ఒకవేళ వాళ్ళ బలహీనతలను అధిగమించడానికి అయితే ....కొంతవరకు హింసను భరిస్తా .....
నా బాధ్యతలు నిర్వర్తించడానికి అయితే .... ఆనందంగా హింసను భరిస్తా ....
నా లక్ష్యాలను సాధించడానికి అయితే ....ఆనందంగా హింసను ఆస్వాదిస్తా ....
కానీ, సాంత్వన కోసం అయితే ...అక్షరాలను ఆశ్రయిస్తా ....
నాకు నా అక్షరాలే ....అయినవాళ్లు ....కానివాళ్ళు ....ఆత్మ బంధువులు .....!😍

Friday, October 26, 2018

జీవితం ఎప్పుడూ అద్భుతమే ....

జీవితం ఎప్పుడూ అద్భుతమే ....
అలాగే జీవితం సమస్యల వలయం కూడా ...
మనం ఎన్నో సందర్భాల్లో ....అనుకోకుండా వచ్చిన ఎన్నో సమస్యల్ని అధిగమిస్తూ ఉంటాం ....కొన్ని మనంతట మనమే అధిగమిస్తాం ....కొన్ని మన చుట్టూ ఉన్నవాళ్లు మనకు సహాయం చేస్తే అధిగమిస్తాం .....కానీ ఎలా అయినా ...సమస్యలు ఎదురవక తప్పదు ...మనం అధిగమించక తప్పదు కదా అనిపిస్తుంది ....
అలాగే ఎన్నో అద్భుతాలను కూడా ఆస్వాదిస్తాం ....
అంటే ..., ఒక కీకారణ్యంలో మొదటిసారి ఎవరూ లేకుండా వెలుగులోనూ చీకట్లోనూ ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ....అలా ఉంటుందన్నమాట జీవితం ....
వెలుగులో ప్రయాణం చేయడం అంటే ....వచ్చే సమస్యలను , అద్భుతాలను కాస్త ముందుగా గమనించే అవకాశం ....ఆ సమస్యల్ని తప్పించుకునే అవకాశం ....లేదా అద్భుతాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది ....
ఉదాహరణకు ...ఏ పులో దాడి చేస్తుంది అని పసిగడితే ....దగ్గర్లో ఉన్న చెట్టుమీదకో పుట్టమీదకో ఎక్కి ప్రాణాలని కాపాడుకోవడం .....లేదా అద్భుతమైన లోయలో , సరోవరాలో ఎదురైతే ....కాసేపు ఆగి ఆస్వాదించడమో.....ఇలాంటి సందర్భాలు వెలుగు ఉంటే ఏర్పడే ప్రయాణం ....
ఇక చీకట్లో ప్రయాణం అంటే....వచ్చే సమస్యలనూ చూడలేం ....అద్భుతాలనూ చూడలేం ....అద్భుతాలను చూడకపోయినా పర్వాలేదు ....కానీ సమస్యను చూడలేక పోయామంటే ....సమస్యల వలయంలో చిక్కుకున్నట్టే ....ప్రాణాలను కోల్పోయినట్టు జీవితాలను కోల్పోయినట్టే ....
అఫ్కోర్స్ ఏ ప్రయాణానికి గమ్యం తెలియదనుకోండి ....
కొందరికి వాళ్ళ జీవితం అంతా పగటి ప్రయాణమే కావచ్చు ....రాత్రిని చూసే అవసరమే కలగకపోవచ్చు ....కొందరికి వాళ్ళ జీవితం అంతా రాత్రి ప్రయాణమే కావచ్చు ....పగటిని చూసే అవకాశమే రాకపోవచ్చు ...
లేదా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పగలు రాత్రి అనేవి ...అప్పుడప్పుడు మెరిసే మెరుపులు కావచ్చు ....చూడాలనుకునేంతలో మాయమైపోవచ్చు ....
చెప్పలేం ....
నా జీవితం లో ....పగలు రాత్రి అనే కాల చక్రం మొదలయ్యే నాటికి (ఊహకు వయసొచ్చేనాటికి ) ...కీకారణ్యంలోరాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది ....
నాకు సమస్యలనేవి ఎదురై ....అవి నేను ఊహించనివి అని తెలుసుకునేవరకు ....అది పగటి ప్రయాణమే అనుకున్నా ...సమస్యలే లేవనుకున్నా ....అన్నీ అద్భుతాలే అనుకున్నా ....
సమస్యలు ఎదురయ్యాక ....అవి ఊహించలేకపోయాక తెలిసింది ....నాది రాత్రి ప్రయాణం అని ....జీవితాలే కోల్పోయే ప్రయాణం అని ....అప్రమత్తమవ్వాల్సింది నేనే అని .....
కీకారణ్యం ....చుట్టూ చిమ్మ చీకటి ....దారి తెలియక ....గమ్యం లేక ....పగలును వెతుక్కుంటూ ....వెలుగుని ఊహించుకుంటూ ....గుండెల్లో గంపెడంత మరణ భయంతో.... ప్రయాణం ....
దారిలో ...ఏ రాళ్లు గుచ్చుకున్నాయో ....ఏ క్రూర జంతువులు నాపై దాడి చేశాయో ...ఏ రక్కసి తన కోరల్ని నా శరీరంలో దాచుకుందో ....ఏ అవయవాల్లోనుండి రక్తం ధారలై ప్రవహిస్తుందో ....గమనించడం వృధా అనుకున్నా ....
గుచ్చుకున్న రాళ్లను పూలేమో అనుకున్నా .....
క్రూరజంతువులు దాడి చేస్తుంటే నాకు ప్రేమ పంచుతున్నాయేమో అనుకున్నా ....
కాలికి తగిలిన విషపు నాగుల్ని తాడుగా చేసుకుని చెట్లు ఎక్కడానికి ఉపయోగించుకున్నా...అసలు ఈ దేహం నాది కాదు అనుకున్నా ....
ప్రేమను ద్వేషమేమో అని భ్రమించి వదులుకున్నా ....ద్వేషాన్ని ప్రేమేమో అని ఆశించి హృదయానికి హత్తుకున్నా .....
ఇంతా చేస్తున్నా....మనసులో ఒకటే లక్ష్యం ...
వెలుగుని చూడాలి ....పగటిలో ప్రయాణం చేయాలి ...పగటి వెలుగులో అద్భుతాల్ని చూడాలి .....
నన్ను నేను వెలుగులో చూసుకోవాలి ....నన్ను నేను వెలుగులో చూసుకుంటే ఎలా కనిపిస్తానో ...అని ఆసక్తి గా ఉంది ....
ఇప్పుడిప్పుడే నా జీవితంలో వెలుగు రేఖలు తూరుపు కొండల్ని దాటుకుని రావాలని ....నన్ను తనివితీరా స్పృశించాలని ....ఆరాటపడుతూ నా చెంతకు చేరుకుంటున్నాయి ....
నా వాళ్ళు ...ప్రపంచం ....రూపు రేఖలు మారిపోయిన నన్ను ....మనిషిగా గుర్తించలేకపోవచ్చు ....సభ్య సమాజంలో నేను సభ్యురాలిని కాదేమో అని అనుమానించొచ్చు ....అసలు మనిషినా కాదా అని నాకే అనుమానం రావచ్చు .....
ప్రేమను ప్రేమగా, ద్వేషాన్ని ద్వేషంగా గుర్తించలేకపోతున్నానని నన్ను వెలివేయవచ్చు .....
కానీ నాకు వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి ....సూర్యోదయం చూడగలననే నమ్మకం కలుగుతుంది ...😍

Wednesday, October 17, 2018

తప్పు చేయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ...

తప్పు చేయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ...అనేది జగమూ మనమూ ఎరిగిన సత్యం ....
ఇక్కడ తప్పు అంటే, మనం ఇంతకుముందు చాలాసార్లు చర్చించుకున్నట్టు అది సమాజం దృష్టిలో ....తప్పు అన్నమాట ...
అదే మన దృష్టిలో అయితే ....మనం చేసే లేదా చేయాలనుకునే ప్రతి తప్పుకి (సమాజం దృష్టిలో ) ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది ....ఒకవేళ లేకపోతే మనం సృష్టిస్తాం ....అది వేరే విషయం ....

ఎవరైనా నేను తప్పు చేయలేదు అని కానీ ఎప్పుడూ చేయను అని కానీ చెప్తే ...విని నవ్వుకోవడం మానేసి కూడా దశాబ్ద కాలం అయింది ....అది ఇంకో విషయం ....
నా విషయానికి వస్తే నేను రోజూ అనేక తప్పులు చేస్తూ ఉంటా ....
చిన్నతనం నుండి ....నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి తప్పులు చేస్తూనే ఉన్నా ....
పోనీ ఇప్పటికి అయినా తప్పులు చేయడం తగ్గిందా అంటే ....ఊహు ....ఏమైనా అంటే ఇంకాస్త ముందుకెళ్లి, ఆ తప్పులకు న్యాయపరమైన , చట్టపరమైన , నైతికపరమైన సవివరణలను సోదాహరణంగా సమీకరించుకుని తప్పులు చేసే పరిపక్వతను సంపాదించుకున్నానే కానీ తప్పులు చేయడం తక్కువ చేసుకోలేదు ....
అయితే ఇన్ని తప్పుల్లో కూడా ఒక ఒప్పు (నా దృష్టిలో ) చేస్తూ ఉంటా ....
ఒక తప్పుని ఇక నేను చేయకూడదు అనుకున్నప్పుడు అది చేయకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటా ...అవి అనుసరిస్తూ ఉంటా ....
ఈ మధ్య కాలంలో నా ఆలోచనావిధానాన్ని ....తప్పులు చేసే విధానాన్ని ...నేను గమనిస్తే ....కొన్ని తప్పులు చేసినప్పుడు (నా దృష్టిలో కాదు) ...,,,
ఆ తప్పు సభ్య సమాజానికి ఆమోద యోగ్యం కానప్పుడు, ఎదుటివాళ్ళకు ఇబ్బంది కలిగించేది అయినప్పుడు ....అది మళ్ళీ చేయకుండా ఉండడం కోసం ....,,,ఆ తప్పు చేస్తున్నాను అని నిజాయితీగా బయటకు చెప్పడం నేర్చుకున్నా ...
అది కూడా ఎవరిపట్ల అయితే ఆ తప్పు చేస్తున్నానో ... వారికే నేరుగా చెప్పడం అలవాటు చేసుకున్నా ....
"నా ఆలోచనలు ఇవి ....ఇవి తప్పు అని నాకు తెలుసు ....అయినా నా ఆలోచనలు ప్రస్తుతం అవే...మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను ....లేదా నా ఆలోచనల వలన మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను ....." అని చెబుతున్నా ....
విచిత్రంగా కొన్నాళ్ళకు ఆ ఆలోచనలు బహిరంగ స్థితి సంతరించుకుని ....వాటికవే సరైన దారిలో నడవడానికి ప్రయత్నిస్తున్నాయి ....లేదా స్థితిగతుల్ని ....దాచిపెట్టినప్పటికంటే ఇంకా విశాల దృక్పధం తో అర్ధం చేసుకుని ....అవగాహనతో ముందడుగేస్తున్నాయి ....
తద్వారా కొన్నాళ్ళకు ....ఎవరిపట్ల అయితే మనం ఇబ్బంది కరమైన తప్పు ఆలోచనలు చేసామో .....వారే ఎదురై అలాంటి ఆలోచనలే చేయమన్నా కూడా .....నవ్వుతూ ...."లేదు అది ఇప్పుడు తప్పు అని ....మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అని నాకు అర్ధమైంది ...నా ఆలోచనలను నేను దారి మళ్ళించాను అని చెప్పగల విజ్ఞత మన సొంతమవుతుంది ....."
అదే ఆ ఆలోచనను మనలోనే దాచుకోవడం వలన ....తప్పు చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం ...అని పదే పదే మన ఆలోచనలు మనకే అపార్ధం కలిగిస్తున్నాయి ....
మన ఆలోచనల్లో స్వచ్ఛత , పారదర్శకత ఎప్పుడూ మనల్ని సరైన దారిలో ....మనకు కావాల్సిన దారిలో ...ముందుకు నడిపిస్తుంది అని తెలుసుకున్నా .... ❤️
మన జీవితం కూడా సంతోషానికి ప్రతిరూపమవుతుంది...😍
ఇది ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న తప్పు జీవిత సత్యం .... 😊😍

Tuesday, October 16, 2018

జీవితంలో ఏం సంపాదించుకున్నాం అనేది ఎంత ముఖ్యమో...

జీవితంలో ఏం సంపాదించుకున్నాం అనేది ఎంత ముఖ్యమో...
ఏం వదులుకున్నాం అనేది కూడా అంతే ముఖ్యం ...
సంపాదించుకోవడానికి మనం రాత్రింబవళ్లు ఎలా శ్రమిస్తామో వదులుకోవడానికి కూడా అలాగే శ్రమించాలి ....
పిచ్చుకలు పుల్లా పుల్లా తెచ్చుకుని ఎండనక వాననకా.. గూడు కట్టుకున్నట్టు .... ఎన్నో సంపాదించుకుంటాం .....
అలాగే ఒక్క గాలివానకు గూడు కుప్పకూలిపోయినట్టు అన్నీ కోల్పోతాం ....
సంపాదించుకోవడానికి ఎన్నాళ్ళయితే శ్రమిస్తామో ....వదులుకున్నప్పుడు కూడా అన్నాళ్ళు బాధపడతాం ....
సంపాదించుకున్నప్పుడు నాది అనుకుంటాం ....వదులుకున్నప్పుడు కూడా నాది అనుకుంటాం ....అందుకే సంపాదించుకుంటే సంతోషం ....వదులుకుంటే బాధ ....
మనం సంపాదించుకున్నవాటిల్లో ....అన్నిటికన్నా ఏది వదులుకుంటే బాధ కలుగుతుందా అని ఆలోచిస్తే ....నాది అనుకున్నదంతా బాధే మిగులుతుంది ....
కొన్ని సంపాదించుకున్నప్పుడు మనిషి అమితానందానికి ఎలా లోనవుతాడో ....కొన్ని వదులుకున్నప్పుడు అలా అధఃపాతాళానికి కృంగిపోతాడు ....
ఆనందాన్ని అలవాటు కాబట్టి భరించగలడేమో గానీ ....బాధను భరించలేడు ....
అందుకే ...నా దృష్టిలో ఎంత సంపాదించామో అనేది మాత్రమే గొప్ప కాదు ....ఎంత వదులుకున్నామో అనేది కూడా గొప్ప విషయమే ....
నేనింత సంపాదించాను అని చెప్పేవాళ్ల కన్నా నేనింత వదులుకున్నాను అనే చెప్పేవాళ్ళను చూస్తే .... (అది కూడా నవ్వుతూ ....)వాళ్ళది కదా జీవితం అంటే ....అనిపిస్తుంది ....
ఈ రోజు నా స్నేహితురాలితో మాటల సందర్భంలో ....నేను ఏం సంపాదించుకున్నానో ....వాటి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నానో చెప్పాను ....ఏవి నావి అనుకున్నానో చెప్పాను ....
వాటిని ఎలా వదులుకున్నానో కూడా చెప్పాను ....నవ్వుతూనే ....
నాకూ తెలియదు ... నేను నవ్వుతూ చెప్పగలనని ....
చెప్పాక భలే అనిపించింది ....సంపాదించుకోవడం మాత్రమే కాదు ....వదులుకోవడమూ అంత సులభం కాదని ....
ఇది కదా జీవితం అంటే ....అనిపించింది ...😍
ఇది ఈ రోజు ... నేను తెలుసుకున్న జీవితసత్యం .....!😍

Saturday, October 13, 2018

అందుకే ...,,జీవితం అంత అందమైనది ...

కొన్నిసార్లు,,,
మనం ధైర్యంగా ఉన్నప్పుడు పిరికివాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాం ...
మనం పిరికిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నవాళ్ళ దగ్గర ధైర్యాన్ని తీసుకుంటాం ...
కానీ కొన్నిసార్లు ....,,,
ఎదుటివాళ్ళు పిరికిగా ఉన్నప్పుడు, మనం ధైర్యంగా ఉంటే ..మన ధైర్యాన్ని వాళ్ళే తీసుకుంటారు ....
ఎదుటివాళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడు, మనం పిరికిగా ఉంటే ...మనకు పిరికితనాన్ని వాళ్ళే ఇస్తారు ....
అలాగే కొన్నిసార్లు .....,,,
మనం ధైర్యంగా ఉన్నప్పుడు పిరికివాళ్ళకు దూరంగా జరుగుతాం ....
మనం పిరికిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నవాళ్లకు దగ్గరగా జరుగుతాం ...
ఇదంతా మానవ మనుగడ అస్తిత్వ పోరాటంలో భాగం ....కొన్ని తెలిసి కొన్ని తెలియక కొన్ని అసంకల్పితంగా ...జరిగిపోతూ ఉంటాయి ....
ఏది ఏమైనా ప్రక్రియలో భాగంగా ....,,,
మనం కొందరికి దూరమవుతూ ఉంటాం ....కొందరికి దగ్గరవుతూ ఉంటాం ....కొన్ని బంధాలు వదులుకుంటాం ....కొన్ని బంధాలు ఏర్పరచుకుంటాం ....
ఇది మన జీవనంలో మమేకమైన మనకు తెలిసిన /తెలియని ....గమనించిన / గమనించని జీవన విధానం .... :)

అందుకే ...,,జీవితం అంత అందమైనది .... ప్రతి ఒక్కరూ జీవించాల్సినది .... <3 <3

Wednesday, October 10, 2018

రెండు రకాల వ్యక్తులూ నాకు తరచూ ఎదురవుతూ ఉంటారు ....

చాలామంది మనస్తత్వాలు మనకు బాగా దగ్గరైన తర్వాత గానీ మనకు అర్ధం కావు ....
దగ్గర కావడం అంటే ...అంటుకుపోవడం కాదు ....(కావచ్చు కూడా )
వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళను దగ్గరనుండి గమనించే అవకాశం అన్నమాట ...
తరచూ వాళ్ళను మనం గమనించే అవసరం, అవకాశం కలిగినప్పుడు మనకు వాళ్ళ అసలైన వ్యక్తిత్వం తెలుసుకునే ఆస్కారం కలుగుతుంది ....
కొన్ని క్లిష్టపరిస్థితుల్లో కూడా వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు బహిర్గతం అవుతూ ఉంటాయి ....
అయితే ...కొందరు,
దూరంగా ఉన్నప్పుడు మనకు చాలా చెడ్డవాళ్లుగా .....లేదా ముభావంగా ఉండేవారిలా ....లేదా అసలు సమాజంలో ఉండకూడని వ్యక్తులుగా కనిపిస్తారు ....
అదే వ్యక్తులు దగ్గరైనప్పుడు ...వాళ్ళ మంచితనం , మాటకారితనం , సంస్కారం తెలుసుకునే అవకాశం కలిగి ....అరె వీళ్లనా నేను ఇంతకాలం అపార్ధం చేసుకుంది .....వీళ్ళు నిజంగా ఎంత మంచివాళ్ళు ....అనిపిస్తుంది ...
వీలయితే ఇంకాస్త ముందుకు వెళ్లి ....నేను మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను ....మీరింత మంచి వ్యక్తులనుకోలేదు అని ..... వాళ్లకు క్షమాపణ కూడా చెప్పాలనిపిస్తుంది ....
కొందరు ....
దూరంగా ఉన్నప్పుడు ....సంస్కారంలో ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ చేసేవారిలా ....అబ్బా వీళ్ళతో పరిచయం కలిగితే చాలు జన్మ ధన్యం అనుకునే వ్యక్తుల్లా ...సమాజంలో గౌరవం అనే పదం వీళ్ళను చూసే పుట్టిందా అనుకునేలా ఉంటారు ....
వీళ్ళను నమ్మి దగ్గరకు చేరనిచ్చామా(సహజంగా నే నమ్మేస్తాం అనుకోండి ) ....వాళ్ళ అసహ్యం , దరిద్రగొట్టు బుద్ధులు, కుసంస్కారం, వికారమైన వంకర బుద్ధులు .... అంతా బయటపడి ....అరె ....ఈ ఛండాలాన్ని ఎలా వదిలించుకోవాలా అని ....మన మీద మనకే అసహ్యం కలిగే పరిస్థితి ఎదురవుతుంది .....
వీలయితే ...ఇంకాస్త వెనక్కి వెళ్లి ....వీళ్ళనే వాళ్ళను అసలు నేను చూడనే చూడలేదు ....కలవనే కలవలేదు ....అనుకోవాలనిపిస్తుంది ....
------------------------------
రెండు రకాల వ్యక్తులూ నాకు తరచూ ఎదురవుతూ ఉంటారు ....
మొదటి రకం వ్యక్తులు ఎదురైనప్పుడు ....వాళ్ళు ఎంత సామాన్యమైన వ్యక్తులైనా .... వాళ్ళను ఎంత తొందరగా ... అక్కున చేర్చుకుంటానో ....,,,,😍
రెండో రకం వ్యక్తులు ఎదురైనప్పుడు ....వాళ్ళు ఎంతటి గొప్ప వ్యక్తులైనా ...వాళ్ళను అంత తొందరగా విసిరి కొట్టడానికి ఏ మాత్రం వెనకాడను .....🙅‍♀️
--------------------------
నా గురించి తెలిసినవాళ్లకు ....నేనెంతో .....😍
నా గురించి తెలుసుకునేవాళ్లకు ....నేనంతే....😊
నా గురించి తెలియనివాళ్లకు ....నేనింతే ....😜😉