Wednesday, September 4, 2019

Middle Age Crisis

Middle Age Crisis (not sure , may be at any age )
==============
"ఉదయం నిద్ర లేవగానే జీవితం శూన్యంగా అనిపిస్తుందని .....జీవితం అంటే ఇంతేనా ....ఇంకేం లేదా ...అని అనిపిస్తుందని ...ఈ భర్త , పిల్లలు ..కుటుంబం అంతా వదిలేసి వెళ్ళాలి అనిపిస్తుందని ....దేనినీ ఆస్వాదించలేకపోతున్నా అని ...సంతోషంగా ఉండలేకపోతున్నా ...అని ..." ఒకరు తనతో చెప్పిన విషయం నాతో పంచుకున్నారు ఒకరు ఈ రోజు ....
"అంతేనా ....ఇంకేమైనా అనిపిస్తుందా ...."ఆవిడా /అతను నాకు తెలిసినవాళ్ళే కావడం వలన కాస్త నవ్వుతూ అడిగా ...
"సీరియస్ గా చెబుతున్నా ....కావాలంటే నీకు మెసేజ్ చూపిస్తా ....ఇంకా చాలా విషయాలు వ్రాసింది ...నువ్వేదైనా సలహా చెబుతావని నేను నీకు చెబుతున్నా ...." అడిగారు మళ్ళీ
"ఓదార్పు కావాలేమో ....చూడకపోయారా ...." కాస్త జోక్ చేశా ....
"నిజంగా అడుగుతున్నా ....ఈ Middle Age Crisis‎ అంటారే .....అది అందరికీ వస్తుంది కదా ....నువ్వు అవన్నీ దాటిపోయావు కదా ...నువ్వు ఏదైనా సలహా ఇస్తావని ....." చెప్పారు ...
"ఏంటది ....మీరిద్దరూ నా కంటే పదేళ్లు పెద్దోళ్ళు ....మీరేమో బాలా కుమారులు ....నేను మిమ్మల్ని దాటి పోయానా ...." సందేహంగా అడిగా ...
"ఆ ...అంటే వయసులో కాదు ....ఆలోచనల్లో మమ్మల్ని దాటిపోయావని అర్ధం ....మా గురువుగారు(ఈ గురువుగారు ఎవరో మరో సందర్భంలో చెప్పుకుందాం ) నువ్వు సమానంగా ఆలోచిస్తారు కదా ....." సర్ది చెప్పారు ....
"ఏమో ....ఇప్పుడు ఆవిడ గురించి ....మీ గురించి ....మీ మిడిలేజ్ సమస్యల గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు ....నాకు చాలా పనులున్నాయి ....నా పనులు నన్ను చేసుకోనివ్వండి ....అయినా నేనేం మానసిక శాస్త్ర నిపుణురాలిని కాదు ....కావాలంటే మీరు కూర్చుని ఆలోచించుకోండి ....." చెప్పా
ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తూ ....పెట్రోల్ అయిపోతుందని టెన్షన్ ...అక్కడేమో విపరీతమైన లైన్ ...గ్యాస్ ఫుల్ చేసుకుని ...తర్వాత రోడ్డెక్కితే మొత్తం రోడ్డు బ్లాక్ ....అనవసరంగా ఈ రోడ్ లోకి వచ్చాను ....ష్ ...ఇంకో గంట డ్రైవ్ చేయాలి అనుకుంటూ .... నా ఆలోచనల్లో నేనుండి ....సమాధానం చెప్పకుండానే ఫోన్ పెట్టేసా ....
*****************************
కానీ ఇంటికొచ్చాక ....,
వాకింగ్ చేస్తున్నా ....డిన్నర్ చేస్తున్నా ...పనులన్నీ ముగించుకుని పక్కమీదకు చేరినా ఆ సంభాషణ తాలూకు పూర్వాపరాలు ఏమిటా అనే సందిగ్ధత నన్ను వీడలేదు ....
ఎందుకిలా జరుగుతోంది అనే సందేహం నన్ను ఆలోచింపజేస్తూనే ఉంది ...
తను అన్నట్టుగానే నేను మిడిలేజ్ సమస్యలు దాటేశానా ....దాటితే ఎప్పుడు దాటాను ....అసలెప్పుడు వచ్చాయి ....వస్తే వాటి పర్యవసానం ఏమిటి ....అది నేను గమనించానా ....దానికి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానా ....అసలు అధిగమించానా లేదా ....లేదా అధిగమించినట్టు నటించానా ...
ఏమో ...అదేమిటో గుర్తు తెచ్చుకోవాలనుంది....
ఒకవేళ ఆమె చెప్పిన సమస్యలలాంటివేనా ....కానీ అలా ఎప్పుడూ నాకు బాధ్యతలు వదిలి పారిపోవాలి అనిపించలేదే....
ఒకవేళ బాధ్యత ఉంది అంటే ....ఆ బాధ్యతని నాదిగా చేసుకుని ....మనసా వాచా దాన్ని ప్రేమించానుగా....అదే నా సర్వస్వం అనుకున్నాగా ...దానిలోనే సంతోషం ఉందని గుర్తించానుగా....
అసలు ఆ బాధ్యతలు నిర్వర్తించలేదని నిలదీస్తానని ....అనుక్షణం వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తానని .... పీడిస్తాను అనే కదా ....నాకందరూ దూరమయ్యేది ...నేను నా చుట్టూ ఉన్నవాళ్లకు రాక్షసిలా కనిపించేది ....
ఓహ్ ...ఇదిగో ..ఇక్కడే ఎక్కడో రహస్య సమస్య ఉందనిపిస్తుంది ....
ఈ బాధ్యతలు అనేవి కష్టాలని ....వేరే ఎక్కడో ....ఏ పొదలోనో ...మదిలోనో .....సొదలోనో...సంతోషం దాగుందని ....దాన్ని అందుకోవాలని మనిషి ఎప్పుడైతే పరుగులు తీస్తున్నాడో ....అప్పుడే జీవితాన్ని కోల్పోతున్నాడు ....
కోల్పోయిన జీవితాన్ని అనేషిస్తూ ఎండమావి వెంట పరుగు తీస్తున్నాడు ....
పర్యవసానమే ...ఇల్లొదిలి / అందరినీ వదిలి / బాధ్యతలను వదిలి ...పారిపోవాలి అనిపించడం ....ఇందులో జీవితం లేదనిపించడం .....
కానీ ..... ,,,
బాధ్యతలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేని వాళ్లకు ప్రపంచంలో ఎక్కడా ఏ పనిలోనూ ఆనందం దొరకదని ....
ఒకవేళ ...ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఆనందం ఉన్నా ...అది వీళ్లకు అందుబాటులోకి వచ్చినా ....అది అందుకోలేని ఎండమావే అవుతుందని ....
ఎప్పుడైతే ...బాధ్యతను ఆనందంగా నిర్వర్తిస్తూ ....ఆస్వాదించడం నేర్చుకుంటారో ....ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆనందమే కనిపిస్తుందని ....
ఎప్పుడైతే తెలుసుకుంటారో ....అప్పుడే, జీవితం అంతా ప్రేమైక జీవనమే కనిపిస్తుంది ....ఎక్కడికీ పారిపోవాలని అనిపించదు ....!
***************************
ఇదే ...కాస్త ప్రశాంతంగా నిద్ర పోవడానికి ....ఈ రోజుకి ....నాకు దొరికిన ఒక సమాధానం ....!
********************************
(గమనిక: నేను మానసిక శాస్త్ర నిపుణురాలిని కాదు ....జీవితంలో నాకెదురైన సంఘటనలను అనుసరించి నేను ఏర్పరుచుకున్న నమ్మకాల ఆధారంగా వ్రాసినవి మాత్రమే ...)