Thursday, July 30, 2020

I need privacy

నేను చిన్నతనం నుండి ...ఎప్పుడూ ..."నన్ను ఒంటరిగా వదిలేయండి" అని ...అదే "I need privacy" అని ఎప్పుడూ అనలేదు ...
అలా అంటే కాళ్ళు విరగ్గొట్టి ఉండేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ...
"ఏందే దయ్యం గియ్యం ఏమైనా పట్టిందా" అని వేపాకులు తెచ్చి దులిపేసి ఉండేవాళ్ళు ...
అసలు అలా అనొచ్చు అని కూడా నాకు తెలియదు ...
అసలు ఏకాంతం మనకి ఎందుకు కావాలో ....ఎందుకు అడగాలో కూడా నాకు తెలియదు ...నా పెళ్లయిన తర్వాత కూడా చాలా ఏళ్ళు నాకు తెలియదు ....
నా పిల్లలకి కూడా నేనెప్పుడూ చెప్పలేదు ...వాళ్ళూ నన్నెప్పుడూ అడగలేదు ...చదువుకోవడానికి సరైన వాతావరణం కల్పించడం ....మాట్లాడకుండా , టీవీ పెట్టకుండా ఉండడం లాంటివి చేసేవాళ్ళం ...
కానీ అమెరికా వచ్చాక ...పిల్లల దగ్గరనుండి మొదటిసారి అలాంటి మాట విన్నా ....
బహుశా స్కూల్ లో పిల్లలు నేర్పించి ఉంటారు ...
లేదా ఇంగ్లీష్ బుక్స్ చదివి , షోస్ , సినిమాలు చూసి నేర్చుకుని ఉంటారు ...
ఓహో ...ఎవరికైనా కాసేపు ఏకాంతంగా గడపాలి అనిపిస్తే ....I need privacy అని అడగాలన్నమాట అనుకున్నా ...
చాలా ఏళ్ళు చుట్టుపక్కల అందరికీ Privacy ఇవ్వడం అలవాటైంది కానీ నాకు ఎప్పుడూ అలా అడిగే అవకాశం రాలేదు ...
ఒకసారి ...,,
నా పుట్టినరోజు సందర్భంగా ... పిల్లలు నన్ను ఏం కావాలి అని అడిగారు ...నేనెప్పుడూ జరుపుకోను అని తెలిసినా...
"ఏం వద్దురా ... చిన్నప్పటినుండి పుట్టినరోజులు చేసుకోవడం నాకు అలవాటు లేదు ...ఇప్పుడు కొత్తగా ఉంటుంది ..." చెప్పా ..నొప్పించకుండా ...
"కాదు ...నీకిష్టమైన వంట చేస్తాం ...లేదా బయటకి వెళదాం ...నీకు ఏదైనా డ్రెస్ కావాలా ..." ఇలా లిస్ట్ అడిగారు ...
ఎందుకో టక్కున నాకు Privacy గుర్తొచ్చింది ...
"I need privacy..." అని చెప్పా ...
ఆశ్చర్యంగా చూసారు నా వంక ...
"నిజంగా ...నన్ను ఏకాంతంగా వదిలేయండి ....ఎవరూ నాతో మాట్లాడొద్దు ....నా గురించి పట్టించుకోవద్దు ...నేను ఉన్నానని మర్చిపోండి ...అదే నాకు గిఫ్ట్" అడిగా చాలా ఉత్సాహంగా ...
ఎలా గడిపానో ....ఏం జరిగిందో పక్కన పెడితే ....
నాకు కూడా జీవితంలో ఏకాంతంగా ఉంటానని అడిగే అవకాశం వచ్చింది ...
నిజంగా భలే అనిపించింది ....😍
ప్రతి మనిషికి అప్పుడప్పుడు ఏకాంతంగా గడపడం అవసరం అనిపించింది ....
అలా గడపడం కంటే ...ఎప్పుడు నాకు ఏకాంతంగా గడపాలని ఉంటే అప్పుడు ...ఇతరులకు చెప్పగలగడం చాలా బాగుంటుంది అనిపించింది ...🥰
ఇప్పటికీ అనిపిస్తుంది ....
జీవితంలో నాతో నేను గడిపిన క్షణాలే నేను నేనుగా జీవించిన క్షణాలు ...నాతో నేను జీవించిన క్షణాలు ...అని...
భవిష్యత్తులో కూడా ...I need privacy...నాతో నేను జీవించే Privacy...😍

Saturday, July 25, 2020

చూడాలి ..ఎప్పటికైనా మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తానేమో ...సందర్భం వస్తుందేమో ..

శ్రావణ శుక్రవారం కోసం సంవత్సరం అంతా ఎదురుచూసేవాళ్ళం చిన్నతనంలో ...కొన్ని కొన్ని సరదా అలంకరణల కోసం ...
పొద్దున్నే లేచి ...కుంకుడుకాయలతో తల స్నానం చేసి ...కొత్త బట్టలు వేసుకుని (ఉంటే) , లేదా ఒకసారి వేసుకున్న కొత్తబట్టలు వేసుకుని ...కాళ్లకు పసుపు రాసుకుని ....రెండు జడలు సగం వరకు అల్లుకుని ...సగం రిబ్బన్ తో కట్టి వదిలేసి ....చామంతి పూల చెండులు వచ్చేవి ఆ రోజుల్లో ...చామంతి చెండు కుడివైపు జడలో పెట్టుకుని ...ఇంట్లో ఉన్నవరకు నగలు వేసుకుని ...కాళ్లకు గజ్జెల పట్టీలు పెట్టుకుని ...ఇంట్లో తిరుగుతుంటే ...అందరూ లక్ష్మి దేవి ఇంట్లో తిరుగుతుంది అన్నట్టే చూసేవాళ్ళు ....😍

పెద్దవాళ్ళ పూజలతో మాకు సంబంధం ఉండేది కాదు ....మేం నిద్ర లేచేసరికి ...ఇల్లంతా తళ తళ మెరుస్తూ ...గడపలకు పసుపు రాసి ...కుంకుమ బొట్లు పెట్టేసి ఉండేవి ....
ఈ సీజన్లో ...చామంతి మొక్కలు ...వాటికి పూసేపూలు ఎంతో అందంగా ఉండేవి ....
ఒకసారి నేను ఇంట్లో వేసిన చామంతి మొక్క విరగబూసింది ...పూలన్నీ విచ్చుకునేవరకూ అసలు ఒక్క పువ్వు కూడా కోయకూడదని ..అలాగే ఉంచా ...
కానీ ఆ బరువుకి ....ఒక కొమ్మ విరిగిపోయింది ....
ఆ రోజు ఎంతగా బాధపడ్డానో ఇప్పటికీ గుర్తుంది ....ఇవి మల్లె పూవుల్లాగా సుకుమారంగా లేవని ముద్దుగా విసుక్కున్నా ....కానీ నెలలు పాటు చెట్టుకే ఉండి ఆనందాన్నిస్తున్నాయిగా అని సర్దుకుపోయా ....😘
అవి మరపు రాని జ్ఞాపకాలు ....
పొద్దున్న ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ...
శ్రావణ శుక్రవారం ....వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుతూ ...
ఇవన్నీ గుర్తులేక... "ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ ...అదీ ఈ భర్తల కోసం ... మన వల్ల కాదు ....నా దగ్గరనుండి అసలు ఎక్స్పెక్ట్ చేయకు ..."అని చెప్పా సరదాగా ...
"ఇవన్నీ భర్త కోసం అని ఎందుకనుకుంటున్నావ్ ...మనం ఈ శ్రావణ మాసం అంతా ...లక్ష్మి దేవి కోసం చేస్తాం ...." అని గుర్తు చేసింది ఫ్రెండ్ ..🥰
నిజమే కదా ...అసలు ఇదంతా మర్చేపోయాను ...అని ...చిన్నతనంలో ఏం చేసామో గుర్తు చేసుకున్నా ....😇
అసలు పండుగలన్నీ మర్చిపోతున్నా అని అనిపిస్తుంది ...😢
చూడాలి ..ఎప్పటికైనా మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తానేమో ...సందర్భం వస్తుందేమో ...🤔🙏
శ్రావణ మాస పూజల పోస్ట్ లు చూసి గుర్తుకొచ్చాయి ఇవన్నీ ....😇

Monday, July 20, 2020

కాకరకాయ కారం:

కాకరకాయ కారం:
చేదు కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ...కానీ అది తింటే వచ్చే ప్రయోజనాల కోసం కళ్ళు మూసుకుని తింటూ ఉంటారు అందరూ ...
అలాంటి వాళ్లకు కూడా ఖచ్చితంగా నోరూరిస్తుంది ఈ కాకరకాయ కారం...
మా ఫ్రెండ్స్ అందరికీ ఇది పేవరెట్ ...ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ....ఇక మావారి గురించి నేను చెప్పను ....అయన తింటారు అనేకంటే , ఎవరికీ మిగలకుండా మరీ తినేస్తారు అనడం న్యాయం ...నేనైతే ...కాఫీ లోకి స్నాక్ లా కూడా వాడేస్తూ ఉంటా ....😘
అమెరికన్స్ కదా ఉత్తినే టేస్ట్ చూస్తారులే అని కొన్నిసార్లు మోసపోయి వాళ్ళ కోసం వండి పెట్టా ...అన్ని డిష్ ల కంటే ముందుగా ఇదే కంప్లీట్ చేసి ...చివరగా దాని పేరు గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నించి ....కాకరకాయ ని కీకారకాయ అనేసారు ..అదేదో సామెత చెప్పినట్టు ...చదువుకోకముందు శుభ్రంగా కాకరకాయ అనేవాడు ....చదువుకున్న తర్వాత అది కీకారకాయ అని చదివాడు అని ..అలా అన్నమాట ...😂
దీని ముందు ఏ చిప్స్ అయినా దిగదుడుపే అని చెప్పగలను ....అంత రుచిగా ఉంటుంది ....
నేను చేసానని గొప్ప కాదు కానీ ...ఇది తిన్నవాళ్ళు ..ఇంతవరకు రెసిపీ అడగకుండా ఎవరూ లేరు ....
దూర ప్రయాణాల్లో కూడా ఇది ఒక డబ్బాలో పెట్టుకుని పట్టుకు పోవచ్చు ...రెండు నెలలవరకూ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా నిల్వ ఉంటుంది ...
ఇది చేసినరోజు , మరుసటి రోజు వరకూ ...ఇంట్లో ఈ సువాసన వస్తూనే ఉంటుంది ....
చిన్నతనంలో పిల్లలు...స్కూల్ నుండి ఇంటికి రాగానే ....ఏం వంటలు చేసానో వాసన చూసి కనుక్కోవడం వాళ్లకి అలవాటు ....ఈ కారం చేసినరోజు ...."కాకరకాయ కారం చేసావు కదా ...." అని ఈజీగా చెప్పేసేవాళ్ళు ....🥰
ఎప్పుడైనా వీడియో చేసి పెట్టేస్తాను ...ఎలా చేయాలో 😘🥰😍

 ...

Sunday, July 12, 2020

ఓ బేబీ ...సినిమా రిలీజ్ అయిన కొత్తలో ...

ఓ బేబీ ...సినిమా రిలీజ్ అయిన కొత్తలో ...
నా కూతురికి ఫోన్ చేసి అడిగా ...సినిమా చూసారా అని ...(పిల్లలిద్దరూ ఒకేచోట ఉన్నారు హాలిడేస్ లో )
"టైం కుదరలేదు ...సినిమా ఎలా ఉంది ...మా ఫ్రెండ్స్ కొంతమంది కి అంత నచ్చలేదు అన్నారు ...అందుకే ఇంట్రెస్ట్ అనిపించలేదు వెళ్ళడానికి ..." చెప్పింది...నా పెద్ద కూతురు ....
"లేదు ....సినిమా నాకు నచ్చింది ..మీకు కూడా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది ...ఒకసారి చూడండి...నేను ఈ సినిమాలో చాలా చోట్ల నాకు నేను గుర్తొచ్చాను ... కానీ ఒక్క సీన్ లో మాత్రం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కన్నీళ్లు ఆగలేదు ... కళ్ళవెంట నీళ్లు వాటంతట అవే వచ్చేసాయి ...అక్కడ నాకు నువ్వే గుర్తొచ్చావు ...నువ్వు నాతో తరచూ అనే మాటలు గుర్తొచ్చాయి ....ఆ సీన్ ఏమిటో నేను నీకు చెప్పను ...సినిమా చూసాక ....నువ్వు చెప్పగలవేమో చూద్దాం ..." అడిగా ...
కొందరు సినిమా చూస్తున్నంతసేపు ప్రతి చిన్న సెంటిమెంట్ కి ఏడుస్తూనే ఉంటారు ... నాకు సినిమాలో కష్టాలకు ఎందుకో అంత తొందరగా ఏడుపు రాదు ...నేను అంత తేలికగా ప్రతి చిన్న సెంటిమెంట్ సీన్ కి ఏడవను అని పిల్లలకు తెలుసు ...అందుకే ఒకే ఒక్క సీన్ లో ఏడ్చాను అని చెప్పా ...
తర్వాత ...వాళ్ళు సినిమాకు వెళ్లడం ....చూడడం ....చూసిన వెంటనే నాకు ఫోన్ చేయడం ....వరుసగా జరిగిపోయాయి ఆ వీకెండ్ ....
"సినిమా నచ్చిందా ...."అడిగా ఆసక్తిగా ...
"నచ్చింది ....అది తర్వాత చెబుతాం ....కానీ మేమిద్దరం ఒక పందెం వేసుకున్నాం ...ఎవరు పందెంలో ఓడిపోతే వాళ్ళే ఈ వీక్ మొత్తం డిషెస్ వాష్ చేయాలి .....అందుకే నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలి ...." అడిగారు ...
"అవునా ...సరే అడగండి ...ఏమిటో ...." ఆశ్చర్యంగా అడిగా
"నీకు ఏడుపొచ్చిన సీన్ , నేను ఒకటి అనుకున్నాను ...చెల్లి ఒకటి అనుకుంది ....ఏది కరెక్ట్ అనేది చెప్పాలి ....." అన్నారు ఇద్దరూ ఫోన్ స్పీకర్ లో పెట్టి ....
"ఓడిపోయిన వాళ్ళు ఒక వీక్ డిషెస్ వాష్ చేయాలా ..." నవ్వుతూ అడిగా ....తమాషా పందెంలా అనిపించి ....
"నిజం చెప్పాలి ..." షరతు విధించారు ఇద్దరూ ....చిన్నదానికి ఫేవర్ చేస్తానేమో అని సందేహం పెద్ద దానికి ...దానికి ఫేవర్ గా చెబుతానేమో అని దీనికి....
ముందు చిన్న కూతురు ఒక సీన్ చెప్పింది ...."అది కాదు " చెప్పా ...
"ఆ ....నువ్వు అబద్ధం చెబుతున్నావు ....అదే .." నిరాశతో అరిచింది ....
తరువాత నా పెద్ద కూతురు చెప్పింది ....
"అవును " నవ్వుతూ అంగీకరించా ....
"చెప్పానా...నువ్వే డిషెస్ వాష్ చేయాలి ...." చెప్పింది ...చెల్లిని టీజ్ చేస్తూ ....
*******************************
ఈ పందెం ...సరదా సంగతి పక్కన పెడితే ...,
పిల్లలు .....నా మనసు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ....మనసు లోతుల్లోకి తొంగి చూసిన ప్రేమ ...మనసు మునకలై మనసు చదివిన మమత ....నాకు ఎప్పటికీ మరువలేని ఓ జ్ఞాపకం ... 🥰😍😇❤️