Friday, April 26, 2019

సమాజానికి సెప్టిక్ అయింది ....😢😢

సమాజానికి సెప్టిక్ అయింది ....😢😢
===================
అవును ....
నిజమే అనిపిస్తుంది ....
చిన్నతనంలో ....ఊర్లో చాలామంది ....మేం కూడా ...
పరిగెడుతూ పడిపోతేనో ....పెన్సిల్ చెక్కుతూ చేయి తెగితేనో ....కూరగాయలు తరుగుతూ కొడవలి కోసుకుంటేనో ....మేత నరుకుతూ గొడ్డలి గాటు పడితేనో ....కాలు బెణికితే ....ఎముక విరిగితే .....ప్రతి గాయానికి డాక్టర్ దగ్గరకి వెళ్ళేవాళ్ళు కాదు ...
పల్లెటూరు లో డాక్టర్ అందుబాటులో లేక ...లేదా పేదరికం వలన ....
ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికెందుకు ....అదే తగ్గిపోతుందిలే అనేవాళ్ళు ....
ఇంట్లోకెళ్ళి ...అలమరాలో ఉన్న పసుపు డబ్బాలో ఉన్న పసుపో....దొడ్లోకెళ్లి కుండలో ఉన్న సున్నమో తెచ్చి తెగిన చోట అద్ది ....పల్చటి పాత గుడ్డ ముక్క చుట్టి కట్టు కట్టేవాళ్ళు ....
కాస్త వైద్యం తెలుసని వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం ఉన్నవాళ్లు ....పసరు కట్టు అని ...కలబంద కట్టు అని కట్టేవాళ్ళు ....
మా నాయనమ్మ పసరు కట్టు కట్టేది ....
మా ఇంటి దగ్గరే ఉన్న చెట్లలోకి వెళ్లి ఏదో ఒక ఆకు తెచ్చేది ...అది రోట్లో వేసి నూరి ....ఆ ఆకులనుండి వచ్చిన పసరు(రసం) గాయం మీద పిండి ....కట్టు కట్టేది ....
రోజూ ఉదయం సాయంత్రం కట్టు కట్టాలి....తగ్గేవరకూ ....
ఇదే వైద్యం దూడలకూ గేదెలకూ కూడా చేసేది ....
వాటికి కళ్ళకు ఏదైనా గాయం అయితే ....నోటితో ఆ ఆకును నమిలి వాటి కళ్ళల్లో చుక్క చుక్క నోటితో వేసేది ....
నాకు కాస్త తెలివితేటలు(అంటే ఏమిటో తెలియదు) వచ్చాక మా నాయనమ్మను ఆ ఆకు ఏమిటో నాకూ చూపించవా...అది ఎలా పనిచేస్తుంది అని అడిగా చాలాసార్లు ....
అది ఇతరులకు చెప్తే పని చేయదు ....నీకు నా చివరి రోజుల్లో ఆ రహస్యం చెబుతాను అంది ....
చాలాసార్లు ....ఆ చివరి వరకూ ఆగే ఓపిక లేక ....దొంగ లాగా మా నాయనమ్మ వెనకాలే వెళ్లి చూసొద్దాం అనుకున్నా .....
కానీ ఎప్పుడైతే అది పనిచేయదు అని భయపెట్టిందో ఆ ఆలోచన విరమించుకున్నా....
చివరకు చాలా విషయాల్లాగే ఇది కూడా చెప్పకుండానే పోయింది ...ఇప్పటికీ ఆ ఆకు రహస్యం తెలియనే తెలియదు .....
అయితే ..ఈ నాటు వైద్యం ......శరీరానికి సహజ నిరోధక శక్తి ఉంటే...అదృష్టం బాగుంటే ఆ గాయం తగ్గిపోయేది ....
లేకపోతే .... అది, ఏ తుప్పు పట్టిన బ్లేడో కత్తో అయితే ....ఎక్కడైతే గాయం అయిందో అక్కడ లోపల్లోపలే ఆ శరీర భాగం కుళ్ళి పోవడం మొదలయ్యేది ....పైన గాయం మానిపోయినట్టే కనపడుతుంది ....లోపల శరీరాన్ని తినేస్తూ ఉంటుంది ఆ కలుషితం ....
పైన చూసుకుని సంబరపడి ....ఆహా భలే ఉంది ...తగ్గిపోయింది ....అంతా బాగుంది ...అని సంబరాలు జరుపుకుంటాం ....లోపల శరీరావయవాలు కుళ్లిపోయాక .....వాటిని తీసివేయక తప్పని పరిస్థితి ఎదురవుతుంది .....
అదే ....గాయం అయిన వెంటనే ....డాక్టర్ దగ్గరకు వెళ్లి ...ఎక్సరే తీయించుకుని ....సరైన వైద్యం చేయించుకుంటే ....సమస్య అనేదే తలెత్తదు కదా....
అయితే అందుకు ముందుగా మనకు అవగాహన ఉండాలి ....అలవాటు ఉండాలి ....
చిన్నతనం నుండి ....మన అలవాటు ప్రకారం....ప్రాణం మీదకు వస్తే గానీ డాక్టర్ దగ్గరకు వెళ్లాలనిపించదు...
తలనొప్పి వస్తే ....శారిడాన్ ...వేసుకుంటాం .....పాముకరిస్తే మంత్రం వేస్తాం ....జ్వరం వస్తే తాయెత్తు కడతాం ....ఇలా చెప్పుకుంటూ పోతే ..... మంత్రాలు చెప్పి చింతకాయలు రాలతాయేమో అని చూస్తూ ఉంటాం ....
--------------------------
ఇప్పుడు మన సమాజం కూడా అంతే అయింది...లేదా మనం చేసాం ...
గాయాలకు ...సున్నమో, పసుపో , ఆకు పసరో పూస్తున్నాం ....అంతా బాగుంది అంటున్నాం ...సంబరాలు జరుపుకుంటున్నాం ...
సమస్యని లోపలే పాతి పెడుతున్నాం ....లోపల్లోపలే సమస్య సమాజాన్ని కుళ్లబెడుతుంది ....
సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ....అసలు లోపం ఏమిటో విశ్లేషించకుండా ...పరిష్కారం ఏమిటో కనుక్కోకుండా ....విధి విధానాలేమిటో సవరించుకోకుండా ....సమస్యను ...వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేసి చేతులు దులుపుకుంటున్నాం ....
ఫలితం ...ప్రాణాలే బలవుతున్నాయి ....పసి మొగ్గలు, యువత , వృద్ధులు తేడా లేకుండా ...అందరి మరణాలకూ సాక్షీ భూతాలవుతున్నాం ...
అందుకే ఇప్పుడైనా ...సమాజానికి గాయం అయితే ....మంచి డాక్టర్ కి చూపించి ...వైద్యం చేయిద్దాం ...రుగ్మతలు లేకుండా చేద్దాం ....సెప్టిక్ కాకుండా చూద్దాం ....🙏
*********************************

Thursday, April 4, 2019

ఇప్పుడిక కాలగమనంతో నాకు పనిలేదు ....

మా ఊర్లో మాకు నీళ్ల కోసం బోరింగులు వేసే రోజుల నాటికి నేను 7/8 వ తరగతి చదువుతున్నట్టు గుర్తు ....
అంతకు ముందు మాకు తోడు బావి ఉండేది ....బావికి మధ్యలో అడ్డంగా పెట్టిన ఒక రాయి ఉండేది ....అంటే ఆ రాయి మీద బావి ఒడ్డు మీద అటొక కాలు ఇటొక కాలు పెట్టి బుంగకు తాడు కట్టి నీళ్లు తోడుకోవాలి ....
చేతులతో ఒక పదిసార్లు చేయి మార్చుకుంటూ తోడుకుంటే గానీ నీళ్లు రావు ...(అంత లోతు ఉంటుంది అని ) అదే కాస్త బలంగా ఉన్నవాళ్లు ....చేతులు పొడుగ్గా ఉన్నవాళ్లు అయితే ....ఒక అయిదారు సార్లు చేయి మార్చుకుని తోడుతారు ....
కాస్త చిన్నవాళ్లు ....అంగ వేయలేని స్త్రీలు అయితే అంచుమీద నిలబడి అంచుకు తగిలేలా తాడు లాగుతూ తోడుకునేవాళ్ళు ....
నాకు ఆ బావిలోకి చూడాలంటేనే భయం వేసేది ...మా అమ్మ పొలం నుండి వచ్చి తోడితే కొన్నిసార్లు చిన్న చిన్న బిందెలతో నీళ్లు మోసేదాన్ని ....లేదా చిన్న చిన్న బకెట్లు తాడుకి కట్టుకుని తోడుకొని తెచ్చేదాన్ని ....
ఆ మధ్యలో రాయి జారి కొంతమంది బావిలో పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ....అయితే ఎవరికీ ప్రాణహాని జరగలేదనుకోండి ....
అప్పట్లో గిలక బావి ఉన్నవాళ్లను చూసి వీళ్ళెంత అదృష్టవంతులో కదా అనుకునేదాన్ని ....
కానీ నిజం చెప్పొద్దూ ....అప్పుడు మా సీతారాంపురంలో బోరింగ్ వేసిన రోజు నాకైతే నిజంగా పండగే ....ఆ బోరింగ్ వేయడానికి వచ్చినవాళ్ళకు ఒకరోజు మా ఇంట్లో కూడా భోజనాలు ఏర్పాటు చేసిన గుర్తు (పూటకొకరు ఏర్పాటు చేసారు )
ఇక అప్పటినుండి ....బడి నుండి రాగానే ....బిందె తీసుకుని బోరింగులో నీళ్లు కొట్టుకుని గాబు నిండా తెచ్చిపోసేదాన్ని ...బిందె కాగయ్యింది ....కాగు బకెట్లుగా మారింది ....ఏది ఏమైనా...మా అమ్మ పొలం నుండి రావడం ఆలస్యం అవుతుందని .... ఈ పని మాత్రం నా బాధ్యత లాగా చేసేదాన్ని ....
ఇదే కాకుండా ....ఇంటి ముందు కసువులు చిమ్మడం .....గేదెకు నీళ్లు పెట్టి శుభ్రం చేయడం ....పొయ్యి లోకి పుల్లలు...గేదెలకు మేత తేవడం (చీకటి పడితే పాములు ఉంటాయని ) ...గిన్నెలు కడగడం ...
బట్టలు మడతలు పెట్టడం ...లాంటి పనులన్నీ చేసి ....స్కూల్ బాగ్ ముందేసుకుని హోమ్ వర్క్ చేయడానికి కూర్చునేదాన్ని ....
మా అమ్మ వచ్చాక ....ఇంటిపని ఇంత చేశా అని చూపించేదాన్ని ...అంటే కాస్త మెచ్చుకుంటుందని ఆశ ...
ఆ సరేలే ....అనేది ....ఏం పట్టించుకోనట్టు ....
ఎంత చేసినా గిన్నెలు దగ్గర దొరికి పోయేదాన్ని ....
కట్టెల పొయ్యి మీద వండిన గిన్నెలకు/తపేలాలకు అంటిన మసి పోయేలా తోమడం నా వల్ల అయ్యేది కాదు ....నా శక్తి అంతా ఉపయోగించి కడిగినా మసి పోయేది కాదు ....
మా అమ్మకు గిన్నెలు శుభ్రంగా లేకపోతే నచ్చదు ....అప్పట్లోనే కాస్త తక్కువ మోతాదులో OCD (Obsessive Compulsive Disorder) ఉండేది ...ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది అనుకోండి ....
ఆ గిన్నెలన్నీ మళ్ళీ దొడ్లో వేసుకుని కడిగేది ....నీళ్లు వృధా నా టైం వృధా ...
అంతకంటే ఎక్కువగా మిగతా పనులు ఈ తప్పు వలన అడ్రస్ లేకుండా పోయేవి ...
మెచ్చుకోవడం మాట అటుంచి ....గిన్నెలు సరిగా కడగడం రాదు అనే ముద్ర ఉండేది ....
ఎటూ మళ్ళీ కడుక్కునేదానికి గిన్నెలు నేను కడగడం ఎందుకు అనిపించేది ....బట్టలు ఉతికినా,ఇల్లు తుడిచినా ఇదే తంతు ....అప్పట్లో OCD అనేది జబ్బు అని ....ఇది మనుషులకు ఉంటుంది అనే తెలియదు ...(మొన్నా మధ్య ఫ్లైట్ లో నా పక్కన కూర్చున్న ఒకమ్మాయి నేను వెళ్లి తన పక్కన కూర్చోగానే ...ఎదో స్ప్రే కొట్టుకుని చేతులు తుడుచుకుంటూ ....నాకు OCD ఉంది అంది ...దానికి సారీ అని కానీ ...ఇబ్బంది పడడం కానీ ఏం చేయలేదు ....నేను కూడా ...."I see" అని చెప్పా ...జనం దాన్ని ఏదో ప్రెస్టీజ్ లాగా ఫీల్ అవుతున్నారేమో అని కూడా అనిపించింది ....)
సరే ....అదలా ఉంచితే ...ఎప్పుడైనా స్కూల్ సెలవుల్లో సరదాగా పొలం పనులు చేయడానికి కూడా వెళ్లేదాన్ని ....
ప్రత్తి విత్తనాలు వేయడం , కలుపులు తీయడం , ప్రత్తి తీయడం లాంటివి చేయడానికి ....
కూలీలతో , మా అమ్మతో సమానంగా చేయలేకపోయేదాన్ని ....కాసేపు చేసి ఎండ రాగానే చెట్టు కింద కూర్చోవడం ....లేకపోతే పొలం అన్నం తినాలని సరదాపడి ....అన్నం ఎప్పుడు తిందాం అని టైం ఎంతయ్యింది (వాచ్ ఉండేది కాదు ....ఎండ చూసి, నీడను బట్టి, లేదా స్కూల్ గంట ను బట్టి , లేదా బస్సు ని బట్టి టైం చెప్పుకునేవాళ్ళు ) అని గోల పెట్టేదాన్ని ....
కాస్త సాయంత్రం కాగానే ఏ రేగిపళ్ళు కోసమో , కందికాయల కోసమో ...చెట్లు పుట్టలు పట్టుకుని తిరిగేదాన్ని ....
అంతా అయిపోయాక ఇంటికి రాగానే ...."మమ్మ ఈ రోజు ఎండకి అల్లాడిపోయిందమ్మా ....ఎంత కష్టపడిందో" అని మెచ్చుకునేవాళ్ళు ....
ఔరా ...రోజూ ఇరవై బిందెల నీళ్లు కొట్టి , మోసి .....ఇంట్లో పనంతా చేస్తే ఏం పని అని తీసి పారేసిన వాళ్ళు ....ఒక్కరోజు పొలం వెళ్లి షికార్లు చేసి వస్తే ఎంత కష్టపడ్డానో అంటున్నారు .....ఇదా కష్టం ...ఇదా గుర్తింపు ....అని ఆశ్చర్యం వేసేది ...
జీవితాన్ని అర్ధం చేసుకుంటున్న రోజులవి ....
========================
పోన్లే పాపం....పసిపిల్ల ... జీవితాన్ని అర్ధం చేసుకుంటుంది ....కాసేపు ఆగుదాం ...అని కాలగమనం ఊరుకుంటుందా ....
దానిపాటికి అది కదిలిపోతూనే ఉంటుంది .....
ఆ కదలికల కుదుపుల్లో నేనుండగానే నా గమనం మారిపోయింది ....తేరుకుని చూస్తే ....నా పక్కన వివాహం ...భర్త ...పిల్లలు ....
కుటుంబ బాధ్యతలు నిర్వహణలో ఎక్కడా నాకు తెలిసి నేను లోపం జరగనివ్వలేదు ....ఒకే ఒక్కటి తప్ప ....
కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం ....
అయితే ...ఈ ఆలస్యంగా నిద్ర లేవడం అనే లోపం నా మిగతా బాధ్యతల నిర్వహణలు అన్నింటిని ....కనిపించకుండా చేసి ....నన్ను మళ్ళీ దోషిని చేసింది ....
ఈ కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం కోసం ఎన్ని ఆలస్యంగా నిద్రపోవడాలు ఉండేవో ఎవరికీ కనిపించేది కాదు ....నా పనులన్నీ అయ్యే సరికి ప్రపంచం నిద్ర పోయేది ....(నా లాంటి స్త్రీలు తప్ప )
రాత్రే ఇల్లంతా సర్దుకుని ....ఇడ్లి పిండి ....దోసెల పిండి అంతా రెడీ చేసి ....ఫ్రిడ్జ్ లో పెట్టి ...ఇంగ్లీషు , తెలుగు కథల పుస్తకాలు ముందేసుకుని ....పిల్లలకు నిద్రొచ్చేవరకు చెప్పి ....ఇంకా ఆ రోజు న్యూస్ పేపర్ లో ....మ్యాగజైన్స్ లో వచ్చిన కార్టూన్లు , కథలు ....అన్ని అయిపోయేవరకు చెప్పి ....ఆఖరికి పొట్లాలు కట్టగా వచ్చిన పేపర్ ముక్కల్లో వి కూడా అయిపోయాయి అనగా ....అప్పుడు కూడా పిల్లలు నిద్రపోకుండా ఇంకా కథలు కావాలని పేచీ పెడితే ....చీమల సీరీస్ కథలు క్రియేట్ చేసి మరీ చెప్పి పడుకునేదాన్ని ....
తెల్లవారి నేను కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల మా ఆయనకి కలిగిన కాస్త అసౌకర్యం ఏమిటంటే ....కుక్కర్ లో కాసిన్ని నీళ్లు పోసి ....ఇడ్లి ప్లేట్స్ లో పిండి వేసి ....కుక్కర్ వెలిగించడం ....ఓ పది నిమిషాల తరువాత కట్టెయ్యడం ...
ఈ కాస్త ఆలస్యం నన్ను ఓ జీవిత కాల దోషిగానే నిలబెట్టింది ....నా మిగతా పనులన్నీ ఈ తప్పు వలన అడ్రెస్స్ లేకుండా పోయేవి ....
వీటితో పాటు ...నా ఉద్యోగ ప్రయత్నాలు , చదువులు , పిల్లల చదువులు ....నా అభిరుచి కోసం చేసిన ప్రాజెక్ట్ లు ....ఇవేవీ మావారి దృష్టిలో ఎప్పుడూ నేను పని చేసినట్టు అనిపించేలా చేయని పనులే ....
పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు పడేసిన బట్టలు మడతలు పెట్టడం ....విసిరిపడేసిన పెన్సిళ్లు , పెన్నులు , పుస్తకాలు సర్దడం కూడా ...నేను, పని భగవంతుడితో సమానం ...అన్నంత శ్రద్ధగానే చేసేదాన్ని ....అవి సర్దకపోయినా అన్నం తినొచ్చు , నిద్రపోవచ్చు ....రోజు గడిచిపోతుంది ....అదసలు పనే కాదు అనేది కొందరి భావన కావచ్చు ....నేను కాదనను ....
ఏ పెన్సిల్ కు ఏ ముక్కును జత చేయాలి .... ఏ కాప్ ఏ పెన్ కి చెందుతుంది ....ఏ స్కెచ్ ఏ బాక్స్ లో పెట్టాలి అనే రీసెర్చ్ లో ఏవైనా అవార్డుల్లాంటివి పెడితే నాకే గ్యారెంటీగా అవార్డు వస్తుంది అని సరదాగా పిల్లలతో అప్పుడప్పుడూ అంటూ ఉంటా ....
జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి సమయం కూడా లేని రోజులవి ....
=======================
పోన్లే పాపం....పసిపిల్లల తల్లి ... జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి సమయం కూడా లేదు ....కాసేపు ఆగుదాం ...అని కాలగమనం ఊరుకుంటుందా ....
దానిపాటికి అది కదిలిపోతూనే ఉంటుంది .....
ఆ కదలికల కుదుపుల్లో నేనుండగానే నా గమనం మళ్ళీ మారిపోయింది ....తేరుకుని చూస్తే ....నా పక్కన ...నేను, సాఫ్ట్ వేర్ జాబ్....
జాబ్ చేయడం మొదలు పెట్టాక (అనుకోకుండా ఆ ఫీల్డ్ లోకి వెళ్లాల్సొచ్చింది ) ఆఫీస్ కి వెళ్లి రావడం ....ఇంట్లో పనులు చూసుకోవడం ....పిల్లల పనులు ....ఇవన్నీ షరా మామూలే అయిపోయాయి జీవితంలో .....నిద్ర పోయే సరికి పన్నెండు ఎటూ అవుతుంది ...కాకపోతే ఇప్పుడు కాస్త పిల్లల బాధ్యతలు తగ్గాయి ....
అయితే మా వారు కొత్తగా ...."ఈ మధ్య నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావు ....అసలు నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేయగలవని నాకు తెలియదు ....." అని హాశ్చర్య పడిపోవడం మొదలు పెట్టారు ....
"ఈ మధ్య మీరు గుర్తించి ఉండొచ్చు ....కానీ నేను పుట్టినప్పటినుండి , నా బాధ్యతలు నిర్వర్తించకుండా బద్ధకంగా తప్పించుకున్న సందర్భాలు ....పని ఎగ్గొట్టేసి బాధ్యత తెలియకుండా తిరిగిన సందర్భాలు కానీ ....పని చూసి దొంగలా పారిపోయిన సందర్భాలు కానీ ఏం లేవు ....నేను ప్రతి పని మనసా వాచా త్రికరణ శుద్ధితో చేశాను ...మీరే ఆలస్యంగా కళ్ళు తెరిచారు ...." అని నవ్వుతూ చెబుతూ ఉంటా .....
=======================
ఏది ఏమైనా ఇంత జీవిత కాలం తర్వాత నాకు అర్ధమైన జీవిత సత్యం ఏమిటంటే .....,,,
ఎవరి పని ఎవరికీ గొప్ప కాదు ....ఎవరిది వాళ్ళకే గొప్ప అన్నట్టు ....
మా అమ్మ దృష్టిలో పొలం పని మాత్రమే గుర్తించదగిన పని ....మా వారి దృష్టిలో సాఫ్ట్ వేర్ జాబ్ మాత్రమే గుర్తించదగిన పని .....
అదే ...రాజకీయాల్లో ఉంటే ....రాజకీయాలు మాత్రమే గుర్తించదగిన పని .... రోడ్లు ఊడ్చేవాళ్లను అడిగితే అదెంత కష్టం అనొచ్చు ....వంట చేసేవాళ్లకు అది మాత్రమే పనిలా కనిపించొచ్చు .....
మిగతా పనులు పనికి రానివిగా కనిపించొచ్చు .....
అది చూసేవాళ్ళ సంస్కారాన్ని , దృష్టిని, దృక్పధాన్ని బట్టి ఉంటుంది అని ఇన్నేళ్ల తర్వాత గానీ నాకు అవగతం కాలేదు .....
నాకు మాత్రం అవతలి వాళ్ళు ఏం చేసినా అబ్బురంగానే కనిపిస్తుంది ....అది పని కాదా అనిపిస్తుంది ....వాళ్ళ పని వాళ్ళు ఎంత ప్రతిభావంతంగా చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉంటా ....
నా పని నేను అంత శ్రద్ధగానే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా ....ఎప్పటికీ ....
======================
ఇప్పుడిక కాలగమనంతో నాకు పనిలేదు .....నా పనిని బట్టి తన గమనాన్ని మార్చుకోమని, అందరి దృష్టిని , దృక్పధాన్ని , సంస్కారాన్ని తన గమనంలో కలుపుకొని సాగిపొమ్మని .....కాలానికి నా ఉచిత సలహా ..!!
*************************🙏