Wednesday, April 15, 2020

కొన్ని కథలు అంతే ....

నా అమ్మా నాన్న ఆట కథ..
================
అప్పుడు నాకు ఓ పదేళ్లు ఉండొచ్చేమో ...సరిగా గుర్తులేదు వయసెంతో ....ఎక్కువ కావచ్చు ...తక్కువ కావచ్చు ...చెప్పలేను ....
కానీ ఓ జ్ఞాపకం మాత్రం పదిలంగా ఉండిపోయింది ...
అది ..జ్ఞాపకాల పొరల్లోనుండి ..మనసు గది కాస్త ఖాళీ అయినప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది ...
----------------------
వారాంతంలో అప్పుడప్పుడూ పిల్లలతో కలిసి సరదాగా గేదెలను తోలుకుని పొలం వెళ్లేదాన్ని ...
ఇలా వెళ్లడం కోసం ఇంట్లో వాళ్ళను ఎంతో నమ్మించాల్సి ఉండేది ...మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు గేదెల్ని నేను బాగానే చూసుకుంటానని ...ఎక్కడికీ పంట పొలాల్లోకి వెళ్లనివ్వకుండా చూసుకుంటా అని ...ఎవరితోనూ గొడవలు పడను అని ..ఇలా ...
పిల్లలందరం సరదాగా ఆడుకోవచ్చు అని నా అసలు ప్లాన్ అనుకోండి ...అది చిన్నపిల్లల విషయం ..పెద్దవాళ్ళు పట్టించుకోకూడదు ...
ఒకరోజు ...అలాగే పిల్లలు అందరం కలిసి ...వెళ్లాలని ...నిర్ణయించుకున్నాం ....
పొలం అన్నం కూడా తీసుకుని వెళ్దాం అని ...పిల్లలు పెట్టుకుని రమ్మన్నారు ...
ఇంటికొచ్చి పొలం అన్నం పెట్టుకుంటుంటే .."ఇక్కడే కాలవదాకా తోలుకెళ్లే దానికి ...పొలం అన్నం ఎందుకే...." అడిగారు ఇంట్లో ...
"ఏమో తెలీదు ....పిల్లలందరూ తెచ్చుకుంటున్నారు ...." చెప్పా
"కొండ పొలం అంత దూరం పోవద్దు ...." బెదిరించారు ...
"సరే ....మేం ఇక్కడిక్కడే ఉంటాం ...అందరూ అదే చెప్పారు" చెప్పా
"వాళ్ళు పోతే పోయారు ...నువ్వు వెనక్కి తోలుకురా ...." హుకుం జరీ చేసారు ...
అన్నిటికి బుద్ధిమంతుల్లా తలూపి ...క్యారేజ్ చేతబట్టుకుని ....గేదెల్ని తీసుకుని పొలానికి బయల్దేరామ్ ...అందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు ....
దారిలో ...పిల్ల గ్రూప్ చెప్పింది ఏంటంటే ...మేం ఆ రోజు వంకాయలపాడు డొంకకు పోతున్నాం అని ...
అది కొత్త ప్రదేశం నాకు ...ఎప్పుడూ చూడలేదు ...
సరే దారిలో చెట్లు పుట్టలకు దొరికినవి కోసుకుని తింటూ ..వెళ్తూ ఉన్నాం ....కాలవ గట్టు దగ్గర కాసేపు కూర్చున్నాం ....
మా పడమర పొలం కూడా దాటేశాం ...
ఆ తరువాత ఇక నేను దారి గుర్తుపట్టలేకపోయా ...కానీ నా పక్కన ఉన్న పిల్లలందరికీ తెలుసు కాబట్టి భరోసాతో ఉన్నా ....
చాలా దూరం వెళ్ళాక ...అదే వంకాయలపాడు అన్నారు పిల్లలు దూరంగా కనిపిస్తున్న కొన్ని ఇళ్లు చూపించి ...
వింతగా అనిపించింది ....మేం నడుచుకుంటూ వేరే ఊరు వచ్చేసామా అని ...
అక్కడ కొన్ని ఉప్పు గడ్డి దిబ్బలు కనిపించాయి ....అవి గేదెలు తినకుండా చూడాలన్నారు అందరూ ....
కానీ తినకుండా కంట్రోల్ చేయడం మా వల్ల కాలేదు ...ఏదో ఒకటి పాపం ఇష్టంగా తింటున్నాయి కదా అని ఒక దశలో మేం వాటిని వదిలేశాం ....
మమ్మల్ని అవి డిస్ట్రర్బ్ చెయ్యట్లేదు అనే ఆలోచించాం కానీ అవి తినే గడ్డి ఎలాంటిదో మాకు అవగాహన లేదు అప్పట్లో ....
ఇక్కడ నీళ్ల చెలమలు ఉంటాయి ...అవి తవ్వితే నీళ్లు వస్తాయి అన్నారు పిల్లలు ......
నేను అంతకు ముందు ఎప్పుడూ అలాంటివి చూడలేదు ...
ఒక చిన్న పుల్ల తీసుకుని ....ఒకచోట ఇసుక ను తవ్వడం మొదలుపెట్టారు అందరూ ....
కాస్త తవ్వగానే అందులోనుండి నీళ్లు ఊరడం మొదలయ్యింది ....అవి తాగొచ్చు అన్నారు ....అవి నిజంగానే చాలా బాగున్నాయి ....
అలా సరదాగా ఒక్కో చెలమ తవ్వడం ....నీళ్లు రాగానే సరదా పడిపోవడం ....
అన్ని రుచి చూడడం ....కొన్ని తియ్యగా ఉన్నాయని , మరికొన్ని చప్పగా ఉన్నాయని ....కొన్ని ఉప్పగా ఉన్నాయని సర్టిఫికెట్స్ ఇచ్చెయ్యడం ....
చాలా సమయం అక్కడే ఇసుకలో చెలమలు తవ్వుతూ గడిపేసాం ....
ఇక ఆకలేస్తుందని ....తెచ్చుకున్న కారేజీల్ని అందరం కలిసి తినేసాం ...
అయితే ..ఇవన్నీ జరుగుతున్నంతసేపూ ...ఎక్కడో ఏదో అసహజంగా ఉన్న వాతావరణం ....ఎవరో నన్ను అదే పనిగా గమనిస్తున్న స్పర్శ ....నన్నే చూడాలని తపిస్తున్న కళ్ళు ...నా పక్కనే ఉండాలని ఆరాటపడుతున్న ఓ ఉనికిని నా మెదడు , శరీరం గమనిస్తుందని నాకు తెలియకుండానే అనిపించింది ...
అదేమిటో నాకు అప్పుడు అర్ధం కాలేదు ...
సరే అన్నం తినడం అయిపోయాక ....మా క్యారేజీలు మేం తీసుకుని ...గేదెల్ని తోలుకుని ఇంకో చోటుకి వెళ్దాం అని బయల్దేరాం ....
కొంత దూరం వచ్చాక ...ఎండగా ఉందని కాసేపు గేదెల్ని చెట్లు కింద నిలబెడదాం అని ....మేం చెట్లకిందకు చేరుకున్నాం ....
అప్పుడు పిల్లలు ఏవైనా ఆటలు ఆడుకుందాం అన్నారు ...
ఏం ఆటలు అక్కడ ఆడామో నాకు సరిగా గుర్తులేదు ...కానీ ఒకే ఒక్క ఆట గుర్తుంది ...
అమ్మ నాన్న ఆట ...
అందులో ఉన్న మగ పిల్లలు ....అమ్మా నాన్న ఆట ఆడదాం అన్నారు ....
ఎవరెవరు అమ్మా నాన్న ....ఎవరు పిల్లలు ..అని అందరూ నిర్ణయించేసారు ....
నేను ఒకబ్బాయికి పెళ్ళాం గా (అప్పట్లో భార్య అనే పదం తెలియదు అసలు మాకు...మొగుడు పెళ్ళాం ఇంతే తెలుసు) ఉండాలన్నారు ...
సరే అంటే ...సరే అనుకున్నాం ...
నాకు తెలిసి నేను అమ్మా నాన్న ఆట ఆడిన మొదటి / చివరి సందర్భం అదే ...
ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తారో అవన్నీ చేయాలి ....
అక్కడున్న మట్టి గడ్డలు , పుల్లలు , మేం తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లు ...ఉపయోగించి ....అన్నం కూర లాంటివి వండి వడ్డించడం చేసాం ...ఉత్తుత్తి వంట చేయడం , ఉత్తుత్తిగా వడ్డించడం ...వాళ్ళు తిన్నాక ...చేయి కడుక్కోవడానికి నీళ్లివ్వడం ...పిల్లలకి పెట్టడం (పిల్లల క్యారెక్టర్స్ కొందరు ఉంటారుగా )
ఇంట్లో చూసినవి గుర్తున్నవి చేసాం ....
ఇక పడుకుందాం రాత్రయింది అన్నారు ...
ఇప్పుడు మొగుడు పెళ్ళాం పక్క పక్కనే పడుకోవాలి అన్నారు ....
అప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించింది ....
మేం మాతో తెచ్చుకున్న కండువా వోణిలాగా చుట్టుకున్నది ...అక్కడే పరిచేసి ....పక్కనే పడుకోమన్నారు...
ఆ అబ్బాయి నేను పక్క పక్కనే పడుకున్నాం ...
కాసేపు నిద్రపోయినట్టు నటించి ...లేచాం ...
పిల్లలందరూ మా ఇద్దర్నీ మొగుడూ పెళ్లాలుగా గుర్తించారు ....అప్పటినుండి ....అలాగే పిలవడం మొదలు పెట్టారు ....ఆ అబ్బాయి కూడా ...నన్ను అలాగే చూసుకోవడం మొదలు పెట్టాడు ....
పిల్లలందరూ మీ ఆయన అనడం ...నాకు విచిత్రంగా అనిపించడం మొదలు పెట్టింది ...
మీ ఆవిడ అంటుంటే ...అందుకు ఆ అబ్బాయి ముసి ముసిగా నవ్వడం ఇంకా చిత్రంగా అనిపించింది ....
సరే అందరం సాయంత్రానికి ఇంటికి వచ్చేసాం ....
ఇంటికి వచ్చాక ...ఎటూ అంత దూరం వెళ్లినందుకు ....గేదెలకు ఉప్పు గడ్డి తినిపించినందుకు అక్షింతలయితే పడ్డాయ్ ...
కానీ ..నాకు అందుకు భయం వేయలేదు ఈ సారి ...
నేను తప్పు చేసానని భయం వేసింది ....ఆ తప్పు మా పెద్దవాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందో అని భయం వేసింది ...అమ్మ నాన్న ఆట ఆడడం తప్పని భయం వేసింది ....
అంతకంటే ఎక్కువ భయం వేసింది ఒకటి ఉంది ....చెప్తే నవ్వకూడదు ...ఇది ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ....
మేం పక్క పక్కనే పడుకున్నాం కదా ....నాకు కడుపొస్తుందేమో ...పిల్లలు పుడతారేమో అని భయం వేసింది ....
అప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను కొడతారేమో అని భయం వేసింది ....
పక్క పక్కనే పడుకుంటే పిల్లలు పుడతారా లేదా అనే భయంతో కూడిన సందేహం వచ్చింది ...ఎలా నా సందేహం తీరేది ...సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా ...
పక్కపక్కనే పడుకున్నప్పుడు ఆ పిల్లాడు నా మీద చెయ్యి కూడా వేసాడని గుర్తు ...అంటే తాకితే ఖచ్చితంగా పిల్లలు పుట్టేస్తారా ....ఈ రోజు పొట్ట కాస్త లావయింది ....అంటే పిల్లలు పొట్టలోకి వచ్చేసారా ...ఎన్ని రోజులు పడుతుంది నాకు పిల్లలు పుడతారా లేదో తెలుసుకోవడానికి ...ఓ రెండు మూడు రోజులు పడుతుందా ...దేవుడా ఇంక ఈ తప్పు ఎప్పుడూ చేయను ....ఈ ఒక్కసారికి పిల్లలు పుట్టకుండా చూడు ....ఇలా సాగింది నా ఆలోచనల ప్రవాహం ...
ఈ తప్పు చేశాననే భయంతో ....ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా మంచిగా వినేదాన్ని కొన్ని రోజులు ....
ఆ తర్వాత పిల్లలు బయట ఎక్కడ కనిపించినా ...మీ ఆయన అడుగో అనడం ....ఏడిపించడం మొదలుపెట్టారు ....
కానీ ఇదంతా చిన్ననాటి ఆటలుగా పక్కన పెడితే ...ఆ ఫీలింగ్ ఎప్పటికీ నా మనసులో ఉండిపోయింది ...ఆ అబ్బాయితో నేను ఎప్పటికీ మాట్లాడలేదు ఆ తర్వాత ....
చిన్నప్పుడు భయంతో ....తర్వాత సిగ్గుతో ....ఎప్పుడు చూసినా ఆ ఆట గుర్తుకు వచ్చేది ...నన్ను మాట్లాడనిచ్చేది కాదు ...
తను ఎందుకు మాట్లాడలేదో నాకు తెలియదు ....బహుశా సామజిక అంతరాలు , భయం కావచ్చు ...
కానీ ...తను నాకు తారసపడుతున్నప్పుడల్లా .... ఎక్కడో ఏదో అసహజంగా ఉన్న వాతావరణం ....ఎవరో నన్ను అదే పనిగా గమనిస్తున్న స్పర్శ ....నన్నే చూడాలని తపిస్తున్న కళ్ళు ...నా పక్కనే ఉండాలని ఆరాటపడుతున్న ఓ ఉనికిని నా మెదడు , శరీరం గమనిస్తుందని నాకు తెలిసీ అనిపించేది ...
అదేమిటో నాకు అప్పుడు అర్ధం అయింది ...
కానీ ఎక్కడో ఏదో అజ్ఞాతంగా ఎప్పుడూ అడ్డు పడుతూ ఉండేది ...
మేం ఇద్దరం ఆ ఆతర్వాత ఎప్పటికీ మాట్లాడుకోకుండానే మిగిలిపోయాం ....
ఇంకెప్పటికీ ఖచ్చితంగా అలాగే మిగిలిపోతాం ....😢
కొన్ని కథలు అంతే ....నా అమ్మా నాన్న ఆట కథ కూడా అంతే ...!
************************************

Monday, April 6, 2020

నా చిన్నతనంలో మా ఇంట్లో ఎక్కువగా కూరగాయలు కొనేవాళ్ళు కాదు ..

క్వారంటైన్ కబుర్లు ...
==============
నా చిన్నతనంలో మా ఇంట్లో ఎక్కువగా కూరగాయలు కొనేవాళ్ళు కాదు ...ఎక్కువగా ఏమిటి ...అసలు కొనేవాళ్ళు కాదు ....ఎంతో అవసరం అయితే తప్ప ....
మరి కూరలు ఎలా తిన్నారు అని అనుకోకండి ...బోలెడన్ని కూరలు ఉండేవి తరుగు లేకుండా ...అన్ని ఆర్గానిక్ వే ...
మా పొలంలో ....గోంగూర , తోటకూర , వంకాయలు , టమాటో, మిరపకాయలు (మధ్యలో బంతి పూవులు కూడా పెట్టుకునేదాన్ని నేను ) , చిక్కుడు కాయలు (గోరు చిక్కుడు ), తంబ కాయలు (ఇవి ఒకసారి చూసినట్టు గుర్తు ), బెండకాయలు లాంటివి ...మా అమ్మ కుంట పక్కన కాస్త చోటు కేటాయించి ...ఈ మొక్కలన్నీ వేసేది ....
ఇవే కాకుండా ...అక్కడున్న జమ్మి చెట్లు, గట్టు మీద .... చిక్కుడు, సొర , గుమ్మడి , బీర , కాకర , దొండ, దోస (ఇది కిందే అల్లుకుంటది) ....మొదలైన కూరగాయలు ...చెట్టు మొదట్లో పాదు పెట్టేది ...
ఇంకా ఎక్కడ పడితే అక్కడ ...పొన్నగంటి కూర , ఇంకా ఏవో ఆకులు తెచ్చేది మా నాయనమ్మ ....
వర్షాలు పడగానే ...పొలంలో పుట్టగొడుగులు వచ్చేవి ...
సంవత్సరం అంతా కూరగాయలకు కరువుండేది కాదు ...మేం తినగా మిగిలినవి నలుగురికి పంచడానికి కూడా వీలుండేది ....
మరి వేసవి కాలం ఎలా అంటే ...అప్పుడు కూడా కూరగాయలు కొనేవాళ్ళు కాదు ...
పొలంలో పండిన కందిపప్పు ఎలాగూ ఉండేది ...జాడీల నిండా పచ్చళ్ళు ఉండేవి ....
మునక్కాయల చెట్టు ఉండనే ఉంది ...పప్పు చారుకి ....
నాన్ వెజ్ కూడా కొనే పని ఉండేది కాదు ...మా నాయనమ్మ దగ్గర అవి కూడా ఉండేవి ...
పాలు చెప్పనవసరం లేదు ....
ఎప్పుడూ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొని తేవడం నేను చూడలేదు ...
ఇక చింతపండు, నూనె, వడ్లు ...మొదలైన సరుకులు ఆరు నెలలకు/ సంవత్సరానికి సరిపడా ....తెచ్చి ఇంట్లో పడేసేవాళ్ళు ...
ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు...మా అమ్మని నేను క్యారెట్ తెమ్మని అడిగేదాన్ని...నాకు పచ్చివి తినడం ఇష్టం ఉండేది ....
అది కూడా తెచ్చేవాళ్ళు కాదు ...."అమ్మో.... రేట్లు మండిపోతున్నాయి ...ఎక్కడ కొంటాం " అని చెప్పేవాళ్ళు ఇంటికొచ్చి ....(అన్ని అబద్దాలే 😥)
ఏడ్చి ఏడ్చి అన్నం తినకుండా అలిగి పడుకునేదాన్ని ....
ఓసారి ఇలాగే ఓ రోజు నాకు నచ్చిన కూర ఏం లేదని నేను అన్నం తినను అని పేచీ పెడితే ...మా నాయనమ్మ ...,
నువ్వు ఎప్పుడూ తినని కూర ...పది నిమిషాల్లో రెడీ చేస్తా ఉండు అని చెప్పింది నాతో ...
దానికసలు కూరలు చేయడమే రాదు ....పది నిమిషాల్లో నాకిష్టమైన కూర ఏం చేసిద్దా అనుకుని ....కోడిగుడ్డు పొరుటు చేస్తుందేమో అని నాకొద్దు అని చెప్పేశా ...
కాదు నేను చేస్తా కదా అని ....
నిజంగానే పది నిమిషాల్లో బెల్లం వేసి పచ్చి పులుసు పెట్టేసింది ....వేసుకుని తింటే ...భలే ఉంది అనిపించింది ...నిజంగానే బాగా చేసావే ....అని లొట్టలేసుకుని తినేసా ....
మా నాయనమ్మకు ఇలాంటి క్రియేటివిటీ బాగానే ఉంటుంది కొన్నిసార్లు ....
ఏం లేదు ....చింతపండు పులుసు తీసి ....అందులో రెండు పచ్చిమిరపకాయలు , కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ....ఉప్పు , పసుపు , కారం ...బెల్లం వేసింది అనుకోండి ....
అలాగే అప్పుడప్పుడు మజ్జిగ పులుసు పెట్టేది ....
ఇలా ఎన్నో ...ఇంట్లోనే క్రియేట్ చేసి చేసేవాళ్ళు కానీ ...పొద్దస్తమానూ బయటికెళ్లి కొనుక్కురావడం ఉండేది కాదు ....
ఏంటో ఇప్పుడు రెండు రోజులకోసారి ....బయటికెళ్లి మార్కెటింగ్ చేయకపోతే జరగని పరిస్థితులు ....
ఇలాంటి లోక్ డౌన్ సమయాల్లో మా నాయనమ్మలా....క్రియేటివిటీ తో ....వంటలు చేయాలని నాకు అర్ధం అవుతుంది ....🤔
అలాగే మీరు కూడా ఇంట్లో దొరికేవాటితో ఏవైనా చేసుకోగలిగితే ...అలాంటివి ప్రయత్నించండి ....నాకూ చెప్పండి ....👍
లాక్ డౌన్ ...జిందాబాద్ ...😊😎

Friday, April 3, 2020

నిన్న ఓ వ్యక్తి నాతో మాట్లాడారు ...

నిన్న ఓ వ్యక్తి నాతో మాట్లాడారు ...
ఆ వ్యక్తి చిర పరిచితులే ...
కానీ ...ఎప్పుడూ నన్ను నా ప్రవర్తనను తిడుతూ ఉండేవారు ...

నేను తప్పులు చేస్తున్నాననీ ....తప్పుగా ప్రవర్తిస్తున్నాననీ ...నేను లౌక్యం నేర్చుకోవాలని ...మనుషుల్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని ...నా ప్రవర్తన లో మార్పు రావాలనీ ...ఇలా ఎన్నో ...
నేను అన్నిటికీ నవ్వి వూరుకునేదాన్ని ...
ఒక్కటే సమాధానం చెప్పేదాన్ని ...కాలం అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది ....అని ....
అయినా మారలేదు ...
ఎప్పుడైనా కలవనీ అదే పాఠం ..
వారికీ విసుగు లేదు ....నాకూ కోపం రాలేదు ...
చెప్పేది మన మంచి కోసం అయినప్పుడు ......పరమార్ధం మన సంతోషం అయినప్పుడు ...చెప్పే విషయం ఎంత కఠినమైనదైనా .మనకు కోపం రాదు ....విసుగనిపించదు....
అందుకే చిరునవ్వు...
అయితే నిన్న హఠాత్తుగా ....,,
"మిస్ ...నువ్వు అప్పుడు ఎందుకలా ప్రవర్తించావో ...ఆ ప్రవర్తనకు అర్ధం ఏమిటో నేను తెలుసుకున్నాను ...నిజానిజాలు నాకు అర్ధం అయ్యాయి ... నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది ...." అంటూ ముగించారు ....(అంటే ఇంకా చాలా చెప్పారు ...అవన్నీ సందర్భోచితం కానివి అనుకోండి )
నేను నవ్వి థాంక్స్ చెప్పా ....
నాకు ఇక్కడ ఒక జీవిత సత్యం అర్ధం అయ్యింది ....
మనం అందరికీ అన్నివేళలా ..అర్ధమయ్యేలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు ....మన ప్రవర్తనకు అందరికీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు ....ఒకవేళ మనల్ని అపార్ధం చేసుకున్నా సమాధానపరచాల్సిన అవసరం లేదు ....అన్నిటికంటే ముఖ్యంగా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం అసలే లేదు ....
మనం ఏ సందర్భంలో ఎవరిపట్ల ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నామో మనకి మాత్రం తెలిస్తే చాలు ...
నిజం తెలుసుకుని నన్ను ...నా ప్రవర్తనను ...అర్ధం చేసుకోవడానికి ....వాళ్లకి ఏళ్ళు పట్టొచ్చు ...యుగాలు పట్టొచ్చు ...అసలెప్పటికీ తెలియకపోవచ్చు కూడా ...
తెలిస్తే వాళ్ళు నన్ను కలిసి ఇలా అపార్ధం చేసుకున్నాం ...ఇప్పుడు అర్ధం అయింది అంటారు ....
లేదా నేను ఒక అర్ధం కాని వ్యర్ధ పదార్థంగా మిగిలిపోతా ...
అయితే ...నా జీవితానికి మాత్రం ఒక అర్ధవంతమైన అపురూపంగా చేరువవుతా ...😍

Note: Wrote and published on March 16, 2010

కనీసం రెండు వారాలు ఇంట్లోనే ఉండాలని అనుకున్న తర్వాత ...

క్వారంటైన్ కబుర్లు ...
==============
కనీసం రెండు వారాలు ఇంట్లోనే ఉండాలని అనుకున్న తర్వాత ...ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ నిన్ననే తెచ్చుకున్నాం ....
ఇవ్వాళ నా డాటర్ ని కాలేజీ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్లాల్సి వచ్చింది ...కాలేజ్ క్లోజ్ చేయడం వలన ...
జస్ట్ వెళ్లడం ...సామాను ప్యాక్ చేసుకోవడం ...ఇంటికొచ్చేయడం... ఇది ప్లాన్ ...

ప్యాక్ చేసిన వస్తువులన్నీ కిందకి దింపి కార్ లో లోడ్ చేయడానికి చాలాసార్లు రౌండ్స్ వేయాల్సి వచ్చింది ...
ఒక రౌండ్ పూర్తి చేయడానికి ...
వెళ్ళేటప్పుడు ..ఒక డోర్ హేండిల్ తాకాలి ...లిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ ప్రెస్ చేయాలి ....లిఫ్ట్ లోపల ఒక బటన్ ప్రెస్ చేయాలి ...మళ్ళీ హాస్టల్ లోపలికి వెళ్ళడానికి ఒక డోర్ ఓపెన్ చేయాలి ...మళ్ళీ బయటకి రావాలంటే ఇదంతా పూర్తి చేయాలి ....
అప్పుడు ఒక రౌండ్ పూర్తవుతుంది ....
ఇన్ని తాకాలంటే ...అన్ని అయిపోయాక సోప్ తో హాండ్స్ వాష్ చేసుకోవాలి ...వీలు కాదంటే ....వైప్స్ తో హాండ్స్ శుభ్రం చేసుకోవాలి ...
మధ్యలో ...మన మొహం కూడా మనం తాకకూడదు ...
నేను సామాను కిందకి దింపుతుంటే ...నా డాటర్ తన ఫ్రెండ్ ని పరిచయం చేసింది ...
తను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచింది ...(పాపం పిల్లలు కదా మర్చిపోతారు ...)
నేను ...సారీ ...షేక్ హ్యాండ్ ఇవ్వను అని చెప్పా ...వాళ్ళ దగ్గరనుండి నాకు ఏదో అంటుకుంటుంది అని కాదు ....నా దగ్గర నుండి వాళ్లకు ఏమైనా అంటుకుంటుందేమో అని కూడా ....
ఓహ్ సారీ మర్చిపోయాను అంది ...తను కూడా ...
తర్వాత నేను 6 ఫీట్ దూరంగా ఉండి మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయా ....
ఒకసారి నేను లిఫ్ట్ ప్రెస్ చేసినప్పుడు ....పై నుండి లిఫ్ట్ లో అప్పటికే ఓ ముగ్గురు వస్తున్నారు ...
నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పా వాళ్లకి ....లిఫ్ట్ లో ఇద్దరు మాత్రమే వెళ్లడం సేఫ్ కాబట్టి ...
ఇదంతా ప్యాక్ చేస్తుంటే ...నా కార్ బ్యాటరీ డౌన్ అయ్యింది ...ఇన్సూరెన్స్ కి కాల్ చేసాక అతనొచ్చాడు ...
అతనికి నా దగ్గర ఉన్న కార్ కీస్ ని వైప్స్ తో తుడిచి ఇచ్చా ...అతను కార్ గురించి వివరిస్తూ దగ్గరగా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు ...
అతనికి ఈ ఆరడుగుల దూరం అంతు పట్టినట్టు లేదు ఇంకా ...
నేనే కాస్త దూరంగా జరిగి మాట్లాడా ....
తరవాత నా డ్రైవింగ్ లైసెన్సు అతనికి ఇచ్చా ....అతను అంతా చెక్ చేసుకుని నాకు కార్డు ఇచ్చాడు ....
వెట్ వైప్స్ తో కార్డు తీసుకుని తుడుచుకుని నా పర్స్ లో పెట్టుకున్నా .....
అతనికి కూడా చేతులు శుభ్రం చేసుకోవడానికి వైప్స్ ఇచ్చా ...
అతను తాకిన కార్ హేండిల్ ...స్టీరింగ్ ...బటన్స్ అన్ని శుభ్రం చేశా ...
అతనికి థాంక్స్ చెప్పి పంపించా ....
అన్ని ప్యాక్ చేసుకోవడం అయిపోయాక ....చేతులు వాష్ చేసుకుని ...డ్రైవ్ చేసుకుంటూ సరాసరి ఇంటికొచ్చేసాం ...
ఇంటికి వచ్చాక ....రాగానే స్నానం చేసి ...కూర్చున్నాక ప్రశాంతంగా అనిపించింది ....
ఓ రెండు వారాలు ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా నా వంతుగా ...
ఇదంతా...నేనెంతో జాగ్రత్తగా ఉన్నానని చెప్పడం కాదు ...వైరస్ ఇప్పటికే నాలో ఉండి ఉంటే అది స్ప్రెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కాబట్టి ...
ఎందుకొచ్చిందో ...ఎలా వచ్చిందో.. అనే దానికన్నా ముఖ్యం ....మనకు సోషల్ డిస్టెంసింగ్ గురించి అవగాహన రావాలి ...అలవాటు కావాలి ...కొన్నాళ్ళు ....
ఇదో రకమైన జీవన విధానం ...అలవాటు చేసుకోవడం తప్పనిసరి ...!

Note: Wrote and published on March 22, 2010

చిన్నతనంలో అద్దెషాపులో నావెల్స్ తెచ్చుకుని ...

క్వారంటైన్ కబుర్లు ...
==============

చిన్నతనంలో అద్దెషాపులో నావెల్స్ తెచ్చుకుని ...రోజుకొకటి చొప్పున అదో పిచ్చిలాగా చదివేవాళ్ళం ...
మా ఊరులో అద్దె షాపు ఉండేది కాదు ...పొరుగూరు వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ...
రోజుకో పుస్తకం అద్దె కట్టి తెచ్చుకోవడం కష్టం అని ....సభ్యత్వ రుసుము చెల్లించి ...ఒక్కో పుస్తకానికి పది రోజులకు సరిపడా అద్దె కట్టి ...ఓ పది పుస్తకాలు తెచ్చుకుని ...చదివేవాళ్ళం ...

పొద్దున్న పనవ్వగానే మొదలు పెట్టి ....మళ్ళీ సాయంత్రం పని చేసే టైం కే పుస్తకం లోనుండి బయటకు వచ్చేది ....
మధ్యలో ఎవరైనా పిలిచినా ..పని చెప్పినా ...విసుగు ...
తప్పించుకోవడానికే చూసేదాన్ని ...
పాపం మా నాయనమ్మ, పిల్ల చదువుకుంటుంది ..కదిలించొద్దు ....మనం పోదాం పద ...అని మిగతావాళ్ళని డిస్టర్బ్ చేయనీయకుండా చేస్తుంటే ...వామ్మో దీనికి అసలు విషయం తెలిస్తే ..ఆ గేదె బదులు నన్నే బాది పడేసిద్ది అని భయం వేసేది ....
తిండి గురించి ధ్యాస ఉండేది కాదు ...
మళ్ళీ రాత్రి పనై పోయి ...అందరూ పడుకోగానే ...లోపల గడేసుకుని ...పుస్తకం మొదలు ...అర్ధరాత్రి లైట్ ఆపెయ్యలేదని ...బయటనుండి పెట్టె కేకల్ని లెక్క చేయకుండా ...చదవడమే పని .......
ఒక్కో పుస్తకం అయిపోయేసరికి ....వేకువ జాము అయిపోయేది ...
ఒక పుస్తకం అయిపోయాక ఆ పుస్తకం ఫ్రెండ్స్ కి ఇచ్చి ...వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు నేను తెచ్చుకునేదాన్ని ...
ఏమాటకామాటే చెప్పాలి ...పుస్తకం ఒక్క పేజీ వదలకుండా చదవాల్సిందే ....
ఎవరైనా అండర్ లైన్ చేసి ఉంటే చిరాకు పుట్టేది ...వీళ్ళకేం పనిలేదా అని ...
అయితే అసలు కారణం తెలిసాక ఇప్పుడు నవ్వొస్తూ ఉంటుంది ....పాపం అనిపిస్తుంది ....(అది నేను ఊహించింది కాబట్టి ఇక్కడ చెప్పలేను ...)
లాస్ట్ పేజీ చిరిగి పోయి ఉంటే ...నిద్ర పట్టేది కాదు ..
ఏది ఏమైనా ...అందరూ ఇంట్లో ఉండి ఓ రెండు వారాలు హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చు కదా అనిపిస్తుంది ...
ఆలోచించండి ....
నవారు మంచం ..పరుపు ...ఓ మూలకి హాయిగా బోర్లా పడుకుని ...పక్కనే చక్కరాలు పెట్టుకుని ...హాయిగా తింటూ ...నవలకి తగ్గ హావభావాలతో మునిగి తేలుతూ ...
భలే ఉంటుందిగా ...😍

Note: Wrote and published on March 23, 2010

అందుకే అంటారు జీవితం ఒక్కటే ....మళ్ళీ మళ్ళీ రాదు అని ...

క్వారంటైన్ కబుర్లు ...
==============


చిన్నతనంలో మా ఇంటి ముందు / పక్కన ఖాళీ స్థలం ఉండేది ....చుట్టూ ప్రహరీ గోడ ఉండేది ...
పక్కనున్న ఖాళీ స్థలం చిన్న సందులాగా ఉండేది ...అక్కడ సిమెంట్ గచ్చు, నీళ్ల గాబులు ...రాళ్లతో పెట్టిన పొయ్యి కూడా ఉండేది ....
మా అమ్మ అక్కడే వంట చేసేది ....

అయితే మా అమ్మ వంట చేయడం అంటే నాకు వ్యాయామం చేయడం అన్నట్టు ....
కూరగాయలు పళ్లెంలో తీసుకుని వెళ్లి ....కొడవలితో కోయడం మొదలు పెట్టాక ...,
అమ్మాయ్ కూర తపేలా తీసుకురా అనేది ...
నేను ఇంట్లోకి వెళ్లి బోర్లించిన తపేలాలన్నీ చూస్తే ...అందులో ఏ తపేలా అర్ధమయ్యేది కాదు ....సరేలే అని ఒకటి తీసుకొస్తే ...
ఇది కాదే ....చట్టి పిడత ...అనేది ....అదేంటో గుర్తు పట్టేసరికి ఓ రెండు మూడు సార్లు ఇంట్లోకి , పొయ్యి కాడికి రౌండ్స్ అయ్యేవి ....
అంతలో ...అమ్మాయ్ ...నూనె డబ్బా తీసుకురా ....
పరిగెత్తుకుంటూ వెళ్లి నూనె డబ్బా తెస్తే ....
తాలింపు గింజల డబ్బా కూడా తీసుకుని రా ....
ఉల్లిపాయ తీసుకురా ...
తెచ్చా ...
ఉప్పు అను ...పసుపు తీసుకురా ....(పాపం ఎందుకో దయ రెండూ ఒకేసారి చెప్పింది ....)
కూర గంటె తీసుకురా ...
ఏ గరిటె ....గుంట గరిటా....(ఈసారి కాస్త తెలివి ఉపయోగించా ....డౌట్ క్లారిఫై చేసుకున్నా ముందుగానే )
ఆ అదే ...
వెళ్ళాక కనపడకపోతే ....ఎక్కడ పెట్టావు అంటే ...అక్కడే అని సమాధానం తప్ప ...అదెక్కడో ఎప్పటికీ అర్ధం కాదు ...
కారం డబ్బా తీసుకురా పో ...
అది తెస్తే ....
మధ్యలో ....అల్లం వెల్లుల్లి నూరాలంటే ....రోకలి బండతో నూరుకుని రావాలి ....
అయ్యో చింతపండు మర్చిపోయా ...మళ్ళీ పరుగు ....
అన్నం వండే తపేలా తీసుకుని ...సోలతో తలకొట్టి సోలడు పోసి ....బియ్యం కడిగి పెట్టు.........
ఇదంతా అయ్యేసరికి కనీసం ఒక మైలు దూరం అయినా నేను నడిచినట్టే ....
ఎంత వ్యాయామం ఒక కూర అన్నం వండేసరికి ....ఇంకా ఎన్ని పనులు చేయాలి .....😓
ఎంత వ్యాయామం చేసేవాళ్ళం ...
ఎంతయినా చెప్పండి ....
కాళ్లకు పట్టీలు పెట్టుకుని ....ఘల్లు ఘల్లునా ఎగురుకుంటూ ఇంట్లో తిరుగుతుంటే అటు వాళ్ళకీ పిల్లలంటే సందడి ఉండేది ...ఇటు మనకీ ఎంతో సరదా ఉండేది ....
ఇప్పుడు ఎవరి ఫోన్స్ , సిస్టమ్స్ ముందు వాళ్ళే ....
వ్యాయామం అంటే ....పనిగట్టుకుని వాకింగ్ పోవాలి ....అక్కడ ఎన్ని స్టెప్స్ అని లెక్కలు పెట్టుకోడం ....జిమ్ ....
కనీసం ఇప్పుడు అది కూడా లేదనుకోండి ....
దానికి తోడు క్వారంటైన్ లైఫ్ ....
అందుకే అంటారు జీవితం ఒక్కటే ....మళ్ళీ మళ్ళీ రాదు అని ....అవకాశం ఉన్నప్పుడే జీవించెయ్యాలి అని ..😍🥰

Note: Wrote and published on March 27, 2010

నా కూతురు ఈ వారం అంతా ఇంటిదగ్గరనుండే కాలేజ్ క్లాసులకి అటెండ్ అవుతుంది ...

క్వారంటైన్ కబుర్లు ...
==============
నా కూతురు ఈ వారం అంతా ఇంటిదగ్గరనుండే కాలేజ్ క్లాసులకి అటెండ్ అవుతుంది ...
క్లాసులకి సంబంధించి తాను నాతో పంచుకున్న ఒక విషయం ...మీకు కూడా చెప్పాలి అనిపించింది ...తద్వారా నాకూ ఒక జ్ఞాపకం అవుతుంది అనుకోండి ....🥰
ఇందాక ..తనతో కలిసి లంచ్ చేద్దాం అని పిలిచా...
క్లాసు అయ్యాక వస్తాను అంటే ...అంతలో ...టమాటో పప్పు తాలింపు వేద్దాం అని రెడీ చేస్తున్నా ....
అంతలో తనకు క్లాస్ అయిపోయింది ...
వచ్చాక ..., "సారీ మమ్మీ ....క్లాస్ కాస్త లేట్ అయింది .." అంది
"పర్వాలేదు రా ....పప్పు గుత్తి తీసుకుని ...పప్పు మెత్తగా చెయ్యి ..అంతలో నేను తాలింపు వేస్తా" అని చెప్పి ...అది చేస్తూ ఉన్నా ...
తన క్లాస్ గురించి కబుర్లు చెబుతూ ..."నేను ఇప్పుడు వెళ్ళింది సైన్ లాంగ్వేజ్ (sign language) క్లాస్ కి ...అందులో ఒక ఓల్డర్ పర్సన్ ఉన్నారు ....తనకి ఎన్నిసార్లు చూపించినా నేను చూపించే సైన్స్ అర్ధం కావడం లేదు.... నీ అంత వయసు ఉంటుంది తనకి ....అందుకే తను అర్ధం చేసుకొనే వరకు చెప్పి వచ్చేసరికి లేట్ అయింది...తను ఏ సైన్ చూపించినా తప్పు చెప్పేస్తుంది ....మళ్ళీ తానే నవ్వేస్తుంది ... ఎంత క్యూట్ కదా ..." నవ్వుతూ చెప్పింది ...
"ఓ అవునా ...నా వయసున్నవాళ్ళు కూడా మీ క్లాసుకి వస్తారా ..." ఆశ్చర్యంగా అడిగా ..
"అవును ...ఎవరైనా రావచ్చు ...ఆ కోర్స్ వరకు డబ్బులు కట్టి రావచ్చు ...." చెప్పింది ...
"నాకూ నేర్చుకోవాలని ఉందిరా ..." అడిగా ..
"ఎందుకు నేర్చుకోకూడదు ...రావచ్చు నువ్వు కూడా" చెప్పింది ...
"ఇంతకూ తను ఎందుకు ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చిందో నీకు తెలుసా ..." అడిగింది ....
"చెప్పు ...ఎందుకు ..."అడిగా ...
"వాళ్ళ పక్కింటివాళ్ళకి మూగ, చెవుడు ...తను వాళ్ళతో మాట్లాడలేకపోతుంది ....అందుకే వాళ్ళతో మాట్లాడడం కోసం ...ఈ కోర్స్ లో జాయిన్ అయింది .." చెప్పింది ...
నిజంగా ఆశ్చర్య పోవడం నా వంతయింది ...
"ఎంత అద్భుతం రా ...." చెప్పా ...
"అసలు ప్రపంచంలో ఇలాంటి పర్సన్ ఒకరు ఉన్నారంటేనే అద్భుతంగా అనిపిస్తుంది కదా ..." మళ్ళీ నేనే చెప్పా ...
"అవును మమ్మీ ..తన గురించి తెలిసాక నాకు కూడా అలాగే అనిపించింది ...పక్కింటివాళ్లతో మాట్లాడడం కోసం ఈ వయసులో తను ఒక భాష నేర్చుకోవడానికి వచ్చింది అని... " గౌరవంగా చెప్పింది ....
---------------------------
మన ఫోనుల్లో నంబర్లు దూరంలో ఉంటాం మనం ....కానీ ఎప్పుడూ పలకరించుకోకుండానే బతికేస్తాం ....పక్కింటి వాళ్లకు మాటలు వచ్చు ....కానీ కనిపించినా మొక్కుబడిగా హలో అంటాం...
ఫ్రెండ్స్ లిస్ట్ చాంతాడంత ఉంటుంది ....కానీ ఎవరున్నారో కూడా తెలీకుండా స్నేహితులని పేరు ...
ఒకవేళ పొరపాటున మాట్లాడినా ....వంద గొడవలు ...
అంతెందుకు ...ఒకే ఇంట్లో ఉండి దశాబ్దాల పాటు శత్రువులుగా బతికేస్తాం ....ఫ్యామిలీ అని అందమైన పేర్లు ఉంటాయి ...అంతే ....నటిస్తూ బతికేస్తాం ....బతుకే నటనగా మార్చేస్తాం ...
కానీ ఆవిడేంటో మరి ....పక్కింటోళ్ల కోసం భాష నేర్చుకోవడానికి ఇప్పుడు కాలేజ్ కి వెళ్తుంది ....అద్భుతాలంటే ఇవేగా 🤔🥰
-------------------------
ప్రతి వ్యక్తి ...వయసుతో సంబంధం లేకుండా ...సాధ్యం కాని పనైనా ....చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ..అందుకు ఏదో బలమైన కారణం ఉంటుంది ....అది అర్ధం చేసుకోవడానికి సంస్కారం కూడా ఉండి ఉండాలి ....అని నా అభిప్రాయం ...
నా కూతురి అర్ధం చేసుకొనే మనస్తత్వం చూసి కూడా నాకు ముచ్చటేసింది ....ఆమె వయసుని ....నేర్చుకోవడానికి గల కారణాన్ని అర్ధం చేసుకున్నందుకు ....ఆమె తప్పులు చెప్పడం క్యూట్ అన్నందుకు ...🥰😘