Friday, March 31, 2017

కొన్నిసార్లు దుష్ట శక్తులకు లొంగిపోక తప్పదు .....

జీవితంలో కొందరు మనల్ని....ఇప్పుడు ఉన్న స్థానం కంటే ..... అట్టడుగు స్థానానికి తొక్కేయాలని చూస్తూ ఉంటారు .....
ఇప్పుడు ఉన్న స్థానం కంటే పైకి రావాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం ....
కొన్ని సార్లు పైకి రాగలం ....కానీ కొన్నిసార్లు దుష్ట శక్తులకు లొంగిపోక తప్పదు ..... :(
పైకి వచ్చినప్పుడు మన శక్తికి మించి పోరాడాం అని అనుకోవాలి .....
కింద పడిపోయినప్పుడు మనకు ఇంకా ఎక్కువ శక్తి అవసరం అని భావించాలి ....
అయితే ఇక్కడ ఒక గమ్మత్తుంది ....
కింద పడిపోయినప్పుడు మనం అనుకుంటాం ....అది అవమానం , అపజయం , ఓటమి అని అనుకుని నిరుత్సాహపడిపోతాం .....పైకి చెప్పుకోవడానికి సంశయిస్తాం ....మనం అంగీకరించడానికి కూడా ఇష్టపడం .....అది ఆస్వాదించడానికి సాహసించం ....
విజయం మాత్రమే ఆస్వాదించదగింది అని అనుకుంటాం ....అదే జీవితం అనుకుంటాం ....అదే అందరికీ పంచుకోదగింది అనుకుంటాం ....
కానీ అపజయాన్ని , కింద పడిపోవడాన్ని మనం ఆస్వాదిస్తే .....అందులో ఉన్న జీవితాన్ని గుర్తించగలిగితే ....అదే మనిషి జన్మకు పరిపూర్ణత .... <3
అందుకే ....
నేను నేనుగా కింద పడిపోతే ....లేచి ...చేతులకు , కాళ్లకు అంటిన మట్టిని దులుపుకుని ...నవ్వుకుంటూ ముందుకు సాగిపోతా ..... <3
ఎవరైనా కింద పడేయడానికి ప్రయత్నిస్తే .....అయినా.... లేచి ..చేతులకు , కాళ్లకు అంటిన మట్టిని దులుపుకుని ...నవ్వుకుంటూ ముందుకు సాగిపోతా ... <3
ఎందుకంటే పడిపోయినప్పుడు జీవితాన్ని .....గెలిచినప్పుడు జీవితాన్ని ఒకే విధంగా ఆస్వాదించే సమ స్థాయిని నేను సంపాదించుకోవాలనే కలలతో కూడిన విశ్వాసం తో ఉన్నా కనుక ..... <3 <3

Thursday, March 30, 2017

"కొన్ని తప్పుల్ని క్షమించలేను ..." అని :)

జీవితంలో కొన్ని బలహీనతలను అధిగమించాలి అని నేను లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటా ....
అందులో ముఖ్యమైనది ...ఎదుటివాళ్ళు ఏం తప్పు చేసినా క్షమించగలిగే స్థాయికి , నన్ను నేను.... ఏ తప్పు చేసినా క్షమించకుండా ఉండే స్థాయికి ఎదగాలనేది ఒక లక్ష్యం ..... <3
అయితే కొన్నిసార్లు ....ఈ లక్ష్యాలను సమీక్షించుకుని ...సరిచేసుకునే అవసరం కలిగించే  సంఘటనలు నాకు ఎదురవుతూ ఉంటాయి ....అప్పుడు మాత్రం లక్ష్యం లో కాస్త మార్పులు చేర్పులు చేయక తప్పదని నిర్ణయించుకుంటా ....
నా లక్ష్య సాధనలో మార్పు గురించి ఆలోచించాల్సిన సంఘటన నాకీ రోజు ఎదురైంది .....
===================
ఈ రోజు ఒకరి పుట్టినరోజు సందర్భంగా ఒక రెస్టారెంట్ కి లంచ్ కి వెళ్లాలని అందరం ప్లాన్ చేసుకున్నాం ...
తీరా బయల్దేరి వెళ్ళాక ఆ రెస్టారెంట్ క్లోజ్ చేసారని తెలిసి అక్కడికి దగ్గరలోనే ఉన్న మరో రెస్టారెంట్ కి వెళ్ళాం ....ముందుగానే ఏ రిజర్వేషన్ లేకపోవడం వలన అక్కడ సరిపోయిన సీట్స్ లేవు ...సగం మందికి మాత్రమే దొరికాయి ....సరే అందరం సీట్లు దొరికే వరకు వెయిట్ చేసి ....సీట్లు దొరికాక అందరం లోపలికి వెళ్లాం ....కానీ సగం మందికి ఒక పక్క సగం మందికి మరో పక్క దొరికాయి ....సర్దుకొని రెండుచోట్ల కూర్చోవాలని నిర్ణయించుకున్నాం ....
ఇండియన్ రెస్టారెంట్ ....అక్కడ బఫె కాబట్టి అందరం ప్లేట్స్ లో తెచ్చుకుని తింటున్నాం ....అలా నోట్లో పెట్టుకున్నామో లేదో వెయిటర్ వచ్చి ...నా పక్కన ఉన్నవాళ్లను ఏదో అడిగాడు ....నా పక్కన ఉన్న అతను సరే అని చెప్పి తాను తింటున్న ప్లేట్ తీసుకుని లేచి వెళ్లబోతుంటే అడిగా ....
"ఎక్కడికి వెళ్తున్నావు అని ...."
"వాళ్ళ పక్కన (మిగతా సగం మంది కూర్చున్న చోట) సీట్స్ ఖాళీ అయ్యాయట ....అక్కడికి వెళ్లమంటున్నారు ....అందుకే అక్కడికి వెళ్తున్నా ..." అన్నాడు ...
"సరే, తింటున్న ప్లేట్ అయిపోయాక వెళ్లొచ్చు కదా ...." చెప్పా ....
"ఆ లేదండీ ....ఇంకెవరో ఈ సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారట ...." అంటూ తను వెళ్ళిపోయాడు....
అయినా నేను లేవకుండా ...మిగతావాళ్ళకి చెప్పా ...."ఈ ప్లేట్ కంప్లీట్ చేసాక వెళదాం ...." అని ...సరే అని వాళ్ళూ నాతోపాటు తింటున్నారు ....
అంతలో వెయిటర్ వచ్చి ....మీరు కూడా అక్కడికి వెళ్ళాలి అన్నాడు ....
"ఇది తినడం అయిపోయాక వెళ్తాను ...." అని చెప్పా ....
"వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ...." అన్నాడు ...తలుపు దగ్గర ఎవరివైపో చూపిస్తూ
అప్పుడు నాకు వచ్చిన కోపానికి మామూలు గా నేను ఒక్కదాన్నే వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది .....
అందరితో కలిసి వచ్చినప్పుడు ....వాళ్ళ మీద కోప్పడి ....అందరి మూడ్ ని పాడు చేయడం ఇష్టం లేక .....
తింటున్న ప్లేట్ అక్కడినుండి పట్టుకెళ్ళకుండా ...అక్కడే వదిలేసి వేరే ప్లేట్ తీసుకుని వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్ళా ....
అప్పటికే, నేను వదిలేసిన ప్లేట్ పట్టుకుని అక్కడ వెయిటర్ ఎదురు చూస్తున్నాడు ....
అప్పుడు మాత్రం నాకు కోపం కంట్రోల్ చేసుకోవడం కష్టం అయింది ....
"నేను అక్కడినుండి ఎంగిలి ప్లేట్ చేత్తో పట్టుకుని రాలేను ....అందుకే అక్కడ వదిలేసి వచ్చాను ...అది మళ్ళీ నువ్వు తెచ్చావు ...నువ్వేం చేస్తున్నావో నీకు అర్ధం అవుతుందా ...." అని వాడికి మాత్రమే నా కోపం అర్ధం అయ్యేలా చెప్పా ....
"సారీ మేడం ....సారీ మేడం ...."అంటూ ప్లేట్ పట్టుకుని వెళ్ళాడు ....
"ఇలా చెయ్యడం సరి అయిన పని కాదు ...." అని అతనికి చెప్పి ....
ఎవరికీ నా హావభావాలు కనిపించనివ్వకుండా ....భోజనం చేయడం ముగించా ....
తర్వాత ఒకరు అడిగితే చెప్పా ...."కొన్ని తప్పుల్ని క్షమించలేను ..." అని :)
=====================
అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడు, ఏ భ్రష్టు పట్టిన కారణంతో అయినా ఆపే వాళ్ళని ....
అన్నం పెట్టిన చేతిని ...ఏ విషం చిందే కారణంతో అయినా కాటేసే వాళ్ళని... ఎప్పటికీ క్షమించక పోవడమే సరైన నిర్ణయం అని, అలా క్షమించడమే మనం చేసే తప్పు అని .... అర్ధం అయి ....
నా లక్ష్యం లో అందుకు తగిన మార్పులు చేర్పులు చేసుకున్నా ....!! :) :) <3

Wednesday, March 29, 2017

వాళ్లనే సింపుల్ గా "కారణజన్ములు" అంటారు ....నా దృష్టిలో ...

ప్రతి ఒక్కరూ తమ దుఃఖాన్ని తాము దాచుకుంటారేమో గానీ ....తమ సంతోషాన్ని మాత్రం వీలైనంతమందికి పంచుకోవాలని అనుకుంటారు ....ఎక్కడో ఒకరు తప్ప ....
అయితే ఇతరుల దుఃఖాన్ని అందరూ పంచుకుంటారేమో గానీ ...ఇతరుల సంతోషం పంచుకోవాలి అంటే అందరికీ సాధ్యం కాదు .... :(
అది వాళ్ళ తప్పు కూడా కాదు ....వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది ....

సాధారణంగా వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఇతరుల ఆనందాన్ని హాయిగా పంచుకుంటారు ...
వాళ్ళు ఆనందంగా లేకపోయినా కొన్నిసార్లు ఇతరుల ఆనందాన్ని పంచుకుంటారు ....వాళ్ళ సంతోషమే మన సంతోషం అనుకుంటారు ...
వాళ్ళు ఏదో బాధలో ఉన్నప్పుడు మాత్రమే మన సంతోషాన్ని వాళ్ళు పంచుకోలేరు .... :(
అందుకే ఎదుటివాళ్ళ మానసిక స్థితిని గమనించి ..మన బాధ , సంతోషం మనం ఎవరితో పంచుకోవాలో ...పంచుకోకూడదో నిర్ణయించుకోవాలి ....
ఏది ఏమైనా ....ఈ ప్రపంచంలో కొందరు మాత్రం ....వాళ్ళు బాధలో ఉన్నా కూడా ఇతరుల సంతోషాన్ని పంచుకుంటారు .... <3 <3
వాళ్లనే సింపుల్ గా "కారణజన్ములు" అంటారు ....నా దృష్టిలో .... :) <3 <3

Friday, March 24, 2017

"నువ్వేమిటో వివరించు ( tell me about yourself?? )"

నా జీవితంలో నేను ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న అతి కష్టమైన ప్రశ్న .....
"నువ్వేమిటో వివరించు ( tell me about yourself?? )"
ఈ ప్రశ్నకు తడుముకోకుండా ....ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం లేకుండా ....నా గురించి ఏమీ దాచకుండా .....ఉన్నది ఉన్నట్టుగా ....అనుకున్నది అనుకున్నట్టుగా .... ఇష్టం ఉన్నది ఉన్నట్టుగా ....ఇష్టం లేనిది లేనట్టుగా ....అసలు నేనేంటి అనేది ....నాకు సంతృప్తి ఇచ్చేలా 
 చెప్పాలని ...అలా చెప్పేలా నేను ఎదగాలని ....నన్ను నేను తీర్చి దిద్దుకోవాలని కలలు కంటున్నా .... !! <3 <3 <3

జీవితం అంటే ఒక ఆట ....

"ఫలానా ప్రదేశానికి వెళ్తున్నాను ...అక్కడ ఉన్న ఫలానా అతను నన్ను కలుస్తాను అన్నాడు ....అతను ఇంతకు ముందు నన్ను మోసం చేసిన వ్యక్తే అయినా కలుద్దామనే అనుకుంటున్నా ...." ఓ వ్యక్తి ఈ రోజు నాతో...
"ప్రపంచంలో మంచి చెడు అని రెండు వ్యక్తులు ఏం లేరు ...మన ఆలోచనలే అన్నీ....అందువలన తప్పకుండా కలవండి ...." చెప్పా నేను ... :P
"జీవితం అంటే ఒక ఆట ....వాళ్ళు నాతో ఆడుకున్నట్టే ...నేను కూడా అలాంటి వాళ్ళతో ఆట ఆడడం నేర్చుకోవాలి ....తప్పదు ...." వారు నాతో ....
"ఆడండి ....కానీ ఆట ఆడడం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ....ఆటలో పండిపోయిన వాళ్ళను ఆడడానికి ప్రత్యర్థిగా ఎంచుకోవడం అంత సరైన నిర్ణయం కాకపోవచ్చు ....ముందు అస్సలు ఆట తెలియని అమాయకులను ఎంచుకుని....ఆడి ....ఆటలో నేర్పరితనం సంపాదించి ....తర్వాత అలాంటి నిపుణులతో ఆడండి ....." నవ్వుతూ చెప్పా .... :) :P :)
"ఉదాహరణకు .. ఆట తెలియని నాలాంటి అమాయకులు అన్నమాట" నిజాయితీగా చెప్పా ... <3 <3 <3
===============================
అవతలి వాళ్ళేం అనుకున్నారో / అన్నారో నన్ను అడగకండి ... :) :P

జీవితం అద్భుతంగా కనిపించేది మాత్రం........

జీవితం అందంగా కనిపించేది ....ఈ రోజు గురించి ఆలోచించినప్పుడు ....
జీవితం ఆనందంగా అనిపించేది ..ఈ రోజు లో జీవించినప్పుడు ....
జీవితం అద్భుతంగా కనిపించేది మాత్రం........
నిన్నటి వరకు ఉన్న జీవితం పూర్తిగా వదిలేసి ... మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టిన / మొదలుపెట్టాల్సి వచ్చిన ప్రతిసారీ .... <3 <3 <3

Thursday, March 23, 2017

బ్లైండ్ స్పాట్ .....చీకటి ప్రదేశం ....

బ్లైండ్ స్పాట్ .....చీకటి ప్రదేశం ....
=========================
ఇండియా లో నేను డ్రైవ్ చేసేటప్పుడు నాకు ఈ బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటో తెలియదు ....మనం మన సిటీ రోడ్లు మీద కార్ అంత స్పీడ్ గా డ్రైవ్ చేయలేం, ...ఇక హై వే మీద లేన్ మార్చాల్సిన అవసరం ఉండదు ....
అమెరికా వచ్చాక ....ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు తెలిసింది ...బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటో ...
మనం కార్ నడిపేటప్పుడు ఏం చేస్తాం (ఇది అమెరికా డ్రైవింగ్ కు వర్తిస్తుంది )....
ముందు వైపు....రెండు పక్కల ....వెనక వైపు కూడా జాగ్రత్తగా చూస్తాం ......ముఖ్యంగా కారు లేన్ మార్చేటప్పుడు ...పక్క లేన్ లో ఏవైనా కార్లు ఉన్నాయా అని .., మధ్యలో మిర్రర్ , ఏ పక్క లేన్ లోకి మనం మారాలనుకుంటున్నామో ఆ పక్క మిర్రర్ లో చూసుకుని లేన్ మారుతూ ఉంటాం ....
అయితే మనం ఇవన్ని చూసినా కూడా మరో ప్రదేశంలో చూడకపోతే ....ఘోరమైన యాక్సిడెంట్స్ జరిగిపోతాయి ...అదే "బ్లైండ్ స్పాట్" ...
అది .......మన కారు వెనక ఉండదు ....ముందు ఉండదు ....మన పక్కనే ఉంటుంది ....అలా అని అద్దంలో కనిపించదు....మనం తల పక్కకి తిప్పి చూస్తే మాత్రమే కనిపిస్తుంది…..మనం పక్కకి రావడానికి కాస్త చోటు ఉంచి...రాగానే ప్రమాదానికి గురి చేసేలా ....
అందుకే దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు .....
ప్రతి సారి లేన్ మార్చేటప్పుడు తల పక్కకి తిప్పి చూసుకుని ...మార్చకపోతే ....ప్రమాదం తప్పదు ....
అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కార్స్ లో ....ఈ బ్లైండ్ స్పాట్ గురించి మనల్ని అప్రమత్తం చేయడం కోసం అలారం సిస్టం , రకరకాల మిర్రర్స్ అందుబాటులోకి వచ్చాయి .....
పక్కనే బ్లైండ్ స్పాట్ లో ..మన కార్ పక్కన కార్ ..ఏ పక్కన ఉంటే ఆ పక్కన ఆరెంజ్ కలర్ లైట్ ఆన్ అవుతుంది ...మనం టర్న్ సిగ్నల్ వేయగానే లైటుతో పాటు అలారం మోగుతుంది .....వెంటనే మనం ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడతాం ....ప్రమాదం తప్పించుకుంటాం ....!!
.......................
అలాగే ...మనుషులు ....బంధాలు ....బంధువులు ....జీవిత ప్రయాణం కూడా ...........
మనం ఎవరు ప్రమాదకరమైన వ్యక్తులు , ఎవరు మంచివాళ్ళు ,ఎవరు చెడ్డవాళ్ళు .....ఇవన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ జీవితం అనే ప్రయాణం సాగిస్తూ ఉంటాం ....
బ్లైండ్ స్పాట్లో ఉన్న వ్యక్తులను మాత్రం మనం గమనించలేం....తల తిప్పి జాగ్రత్తగా చూస్తే గానీ కనపడరు....
ఒక వేళ చూడలేదా ....ప్రమాదం తప్పదు ....
ఇది గుర్తించే టెక్నాలజీ మన మనసే ...ఎన్ని ప్రమాదాలు ఇంతకు ముందు జరిగాయి ....ఎలా ఆ ప్రమాదాల్ని ముందుగానే పసిగట్టాలి అనే దాన్ని బట్టి .....అంచనా వేసుకుని మనసు గుర్తుపడుతుంది....
మన ఆలోచనలతో ,వివేకంతో .....బ్లైండ్ స్పాట్ కి స్పాట్ పెట్టకపోతే ప్రమాదాలు తప్పవు .....!!!!

జీవితం అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ...

జీవితం అంటే సింపుల్ గా చెప్పాలి అంటే .....పడటం ,లేవడం ,మళ్లీ పడటం , మళ్లీ లేవడం .... :)
పడి లేవలేకపోయినా ....లేచి పడకపోయినా ...పడే అవసరం రాకపోయినా ....లేచే సాహసం లేకపోయినా ....జీవితంలో ఎన్నో కోల్పోతాం ....
అయినా పడకపోతే ,లేవకపోతే జీవితంలో మజా ఏముంది ...అనుకుంటూ ఉంటా ... :) :)
కానీ ...,,, మీరు నమ్మినా ,నమ్మకపోయినా .....ఈ మజా లు అన్ని నాకు జీవితంలో ఎప్పుడూ ఒక భాగమే అయినా.......
అసలు మజా ఏమిటో తెలుసా .....??!!
మనం పడడం ,మనమే లేవడం కాదు ....
ఎవరైనా మనల్ని పడేయాలని ప్రయత్నించడం ,మనం లేవాలని ప్రయత్నించడం .... :) :) :)
అలాంటప్పుడే ...జీవితం లో అసలైన మజా ఏమిటో తెలుస్తుంది .....!!
పడేయాలని ప్రయత్నించే వాళ్లకి ...లేవాలని ప్రయత్నించే వాళ్లకి ....అందరికీ ఆల్ ది బెస్ట్ .... :) :)
ఎవరి పనుల్లో వాళ్ళు ....అందరూ జీవితాన్ని ఆస్వాదించండి ....!!! :) :P

Saturday, March 18, 2017

పుల్లా పుల్లా పోగేసుకుని పక్షులు గూడు

పుల్లా పుల్లా పోగేసుకుని పక్షులు గూడు నిర్మించుకోవడం పూర్తి చేసినట్టు ....
ఒక్కొక్క సాక్ష్యం ....ఒక్కొక్క ఆధారం పోగేసుకుని ....ఒక భావాన్ని నిర్మించుకుంటాం .... <3
పక్షులు ....అవి మోయగల బరువులో ఉండి.....అవి నిర్మించుకోవాలనుకున్న గూడులో ఇమడగల పుల్లల కోసం నిరంతరం అలుపెరగక అన్వేషిస్తూ ఉంటాయి ....అవి దొరకగానే ముక్కున కరుచుకుని గూడులో పెట్టుకుంటాయి .. <3
నేనూ అంతే....,,,ఒక భావం గూడు కట్టుకోవడానికి సాక్ష్యాలు సేకరిస్తూ ....ఆధారాలు నిర్మించుకుంటూ ఉంటా రోజూ ....
ఒక్కొక్క భావాన్ని నిర్మించుకున్న ప్రతిసారీ ....ఒక గూడు కట్టుకున్నంత ఆనందం ..... :) <3
ఆ గూడులైనా గాలికో వానకో...చెల్లా చెదురై పోవచ్చు కానీ .... :( :(
నా భావాలు చెక్కు చెదరవు.... <3