Thursday, October 28, 2021

వంట చేసుకోగలిగి ఉండి ....ఎవరిమీదా ఆధారపడకూడదు ...

 వంట చేసుకోగలిగి ఉండి ....ఎవరిమీదా ఆధారపడకూడదు ...

ఇవ్వాళ నేను మాటల సందర్భంలో ఫ్రెండ్స్ కి ఒకటి రెండు సార్లు ..."చెట్లకి కాసిన్ని వంకాయలున్నాయి ....కోసి ...కూర వండాలి ...." అని చెప్పా ....
చెప్పడం వలనో ఏమో ...నా నాలుక వంకాయ కూర మీద నాకు తెలియకుండానే ఆశలు పెంచుకుంది ....
సరే ఇంటికొచ్చాక ...షరా మాములే ...
ఇంటి పనుల్లో బిజీ అయిపోయా ...
అయినా వంకాయలు కోసి కిచెన్ లో పెడదాం అని ...అవి కత్తిరించడానికి కత్తెర కోసం వెతికా ....
ఎప్పుడు ఏది అవసరమో అది కనపడదు అనేది యూనివర్సల్ రూల్ ....
మా ఆయన మధ్యాహ్న్నము బెండకాయలు కోసిన ఆనవాలు కనిపించింది ....
కత్తెర ఎక్కడ పెట్టారు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేకపోయారు ....
తర్వాత క్లాస్ ఒకటి ఉంటే అటెండ్ అయ్యాక ....టైం చూస్తే చీకటి పడింది ....
వంకాయలు ఉన్న ప్లేస్ లో లైట్ లేదు ....ఒక లైట్ అక్కడ పెట్టండి అని ఎన్నోసార్లు మావారికి చెప్పా ...
అది జరగని పని అని నాకూ ...దేవుడికి తెలుసు ....
ఏం చేద్దామ్ ...వంకాయ లేదు టెంకాయ లేదులే పడుకుందాం అనుకున్నా ....
కానీ నా నాలుక ఊరుకోలేదు ...
సరే పిల్లల బొమ్మ కత్తెర ఒకటి చిన్నది దొరికితే అది తీసుకుని చీకట్లో గార్డెన్ లోకి వెళ్ళా ....
తడుముకుని ఒక వంకాయ పట్టుకుని ....ఆ చిన్న కత్తెర తో కట్ చేయగానే ఫట్ మని కత్తెర విరిగిపోయింది ....
ఇక కోపం వచ్చి ....వంకాయలు చేత్తోనే కొన్ని తెంపేసా ....
ఇంట్లోకొచ్చి ....కూర చేశా ..
మా ఆయన వాకింగ్ కి వెళ్లి వచ్చి ...."నేను బెండకాయ కూర చేద్దాం అనుకున్నా ....నువ్వు వంకాయ చేసేసావా" అన్నారు ....
"మీరు అనుకుంటారు ....కానీ చెయ్యరు ....అవి అప్పటికల్లా ముదిరిపోతాయి ....ముదిరిన కాయలు చేస్తారు .....అవి నేనెటూ తినలేను ...."చెప్పా ....
"నాకు అన్నం వద్దు ....నీకు పెట్టమంటావా" అడిగారు ....
ఎదుటి మనిషిని అడిగేటప్పుడు ....కనీసం ...."మనం అన్నం వండుకుందామా" అని అడిగితే...ఇద్దరం కలిసి ఒక ముద్ద వండుకు తిందాంలే అనిపిస్తుంది ....
ముందుగానే ....నాకొద్దు అనే మాట యాడ్ చేస్తే ....నాకు ఒక ముద్ద తిందామనే ఇంటరెస్ట్ పూర్తిగా పోతుంది ....
బయటకెళ్ళి ఏమన్నా తిందాం అంటే కూడా అంతే ....
నాకొద్దు ....నీకు తెమ్మంటే తెస్తా అంటారు ....
నీకు వద్దా లేదా అని నేనడిగానా అని నాకు మండుతుంది ....
ఎదుటివాళ్ళకు ఫుడ్ తిననివ్వకుండా ....ఉన్న ఇంటరెస్ట్ పోయేలా ...అలా మాట్లాడొద్దు అని ఎన్నిసార్లో చెప్పి ఉంటా ....
సరే ఆయనతో నాకెందుకులే అని ....
ఉడకబెట్టిన గోంగూర ఉంటే ....గోంగూర పచ్చడి చేద్దాం అని ...అది కూడా చేసేసా ....
రెండూ విపరీతమైన రుచిగా ఉన్నాయేమో ....నాకు వేడి వేడి అన్నం కావాలనిపించింది ....
ముందు ప్లాన్ ...ఉత్త కూర తినేసి ...పడుకుందాం అని ....
ఒక కప్పు బియ్యం పొయ్యి మీద వేసి ....స్నానం చేసి ....
అన్నం తినే టైం కి ....ఆర్చుకుని తీర్చుకుని వచ్చి .....,
శుభ్రంగా అన్నం పెట్టుకుని ....గోంగూర , వంకాయ వేసుకుని తినేశారు ....
ఆఫ్కోర్స్ నేను కూడా తిన్నా అనుకోండి ....
"నీకు ఇంకాస్త అన్నం పెట్టనా " అడిగారు ...నా ప్లేట్ లో అన్నం అయిపోవడం చూసి ....
"ఇప్పుడు బాగానే అడుగుతారు .....చేసేటప్పుడు ....నాకొద్దు నాకొద్దు అని పాట పాడతారు .....నేను కూరలు చేసేటప్పుడు ....కనీసం ....అన్నం పొయ్యి మీద పెట్టాలని తెలీదూ ...." కడిగేశా .....తనని కాదు ....తిన్న కంచం బాబూ ....
అదన్నమాట కథ ....
వీళ్ళ మీద ఆధారపడితే బొచ్చలో బొమ్మరాయే .....
ఓపికున్నప్పుడు ఒక ముద్ద వండుకున్నామా ....హాయిగా వేళకింత తిన్నామా ....అంతే ...!🙏😇
Like
Comment
Share

Tuesday, October 12, 2021

నేను ఆ మధ్య కాలంలో అసలు చీరలే కొనలేదు ..

 నేను ఆ మధ్య కాలంలో అసలు చీరలే కొనలేదు ..

ఇక్కడ ఎటూ చీరలు కట్టుకోలేం ...పైగా ఇండియా వచ్చినప్పుడే చీరలు తీసుకోగలను ....అప్పుడు ఉన్న కాస్త టైం లో షాపులన్నీ తిరిగే ఓపిక ఉండాలి ....నచ్చాలి ...దాని మీద బ్లౌజ్ లు కుట్టించుకోవాలి ....
తీరా ఇంతా చేస్తే ....ఫ్లయిట్ వాడు బరువు ఎక్కువైతే బయటకు గెంటేస్తాడు ...
అది కూడా దాటుకుని ఇక్కడకు తెస్తే కట్టుకునే సందర్భం ఉండాలి ....
ఆ సందర్భం కూడా వస్తే అప్పుడు నాకు మూడ్ ఉండాలి ....ఇన్ని దాటుకుని ఆ చీర కట్టుకుంటే ఏం కట్టుకోపోతే ఏం లే అని నిరాసక్తత వలన ....కొనడం కూడా తగ్గిపోయింది ....
కానీ ఈ మధ్య ...ఎందుకో కాసిన్ని కొందాం అని డిసైడ్ అయ్యి ....అంటే మా పిల్లలు కూడా ....మమ్మి ఇప్పుడు సరదాగా కొనుక్కుని కట్టుకో ....ఇంకా కొన్నాళ్ళు పొతే నీకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ..ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి అని అన్నారని....ఆన్లైన్ లో చూడడం మొదలు పెట్టా ...
నాకు ఇష్టమైన షాప్ ఒక్కటే ఒక్కటి ...కంకటాల షాప్ ...అక్కడ చీరలంటే నాకు కాస్త పిచ్చి ఉంది ....
సరే కంకటాల ఆన్లైన్ కూడా ఉందని తెలుసుకుని ....అందులో చీరలు చూడడం మొదలు పెట్టా ....
కొన్ని నాకు నచ్చాయి కానీ ....రేట్లు చాలా ఎక్కువ అనిపించాయి ....
నేను క్రేప్ సిల్క్ డిజైనర్ చీరలంటే ....పడి సచ్చిపోతా అసలు ....
కానీ అవి లేవు వాళ్ళ దగ్గర ...
వేరే చాలా రకాలున్నాయి ....అవి కొన్ని సెలెక్ట్ చేసి కార్ట్ కి యాడ్ చేయడం ...అవి కొందాం కొందాం అని ఆలోచిస్తూ ఉండడం ....
వాడు రెండు రోజులు పోగానే సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టడం ....అయ్యో నా చీరలు ఎత్తుకుపోయారురా అని వాపోవడం ....చీరలు కొనుక్కోవాలి కార్ట్ లో పెడితే అవి నీవి అయిపోవు అని పిల్లలు ఎగతాళి చేయడం ....ఇలా ....
కానీ నేను సెలెక్ట్ చేసినవి బాగున్నాయా లేదా అని ఎవరికైనా చూపించే ముందే అమ్ముడైపోతుంటే ...అవి బాగున్నాయని ...సరైన ధరే అయ్యుంటుందని డిసైడ్ అయ్యా ....
వాళ్ళ వాట్సాఅప్ నెంబర్ కి కాల్ చేసి ...ఎందుకంత రేటున్నాయి అని అడిగా ....
మా బ్రాండ్ అలాంటిది మేడం ....క్వాలిటీ గ్యారెంటీ అని చెప్పారు ...
సరే ధైర్యం చేసి మొన్నామధ్య కొన్ని చీరలు కొన్నా ....
చాలా మంచిగా పాక్ చేసి పంపించారు ...చీరలు కూడా బాగున్నాయి ....
ఒక్కటే ఒక్కటి డౌట్ ....చీరలు మరీ అంత ధరలు పెరిగిపోయాయా అని ....
ఏమో ...అక్కడ నేను షాపింగ్ చెయ్యట్లేదు కాబట్టి ....అక్కడున్న ఫ్రెండ్స్ ని అడగాలి ...
తీరా తెచ్చానే కానీ ...వాటి మీద బ్లౌజ్ కుట్టించుకోలేదు ...
అవి చిలకలూరిపేటలో ఉన్న మా మిషన్ పిల్లాడు స్టిచ్ చేస్తేనే నాకు నచ్చుతాయి ....ఇంకెవరు స్టిచ్ చేసినా బ్లౌజ్ లు వేసుకోలేను ....
అందుకని ఏదో మ్యాచ్ అయిన బ్లౌజ్ లు ఇప్పటికి వేసుకుందాం అని అనుకుంటున్నా ....
దీపావళి వస్తుంది కాబట్టి అప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక కొత్త చీర వేసుకుందాం అనుకుంటున్నా ....వితౌట్ మ్యాచింగ్ బ్లౌజ్ ...
ఇంకా చాలా ఉన్నాయి చీర కష్టాలు .....
కానీ అయామ్ మిస్సింగ్ క్రేప్ సిల్క్ డిజైనర్ వేర్ శారీస్ ....ఎక్కడా ఆన్లైన్ లో లేవు ....😢
ఈసారి ఇండియా వచ్చినప్పుడు తీసుకుంటా ...!😘
Sai Lakshmi Koppireddy, Praveen Bathula and 1 other

Sunday, October 10, 2021

చిన్నతనంలో స్కూల్ కి వెళ్లే వయసులో ...

 చిన్నతనంలో స్కూల్ కి వెళ్లే వయసులో ... గోరింటాకు మొక్క ఒకటి మా గడ్డి వాము దగ్గర వేశా ...

అప్పట్లో విత్తనాలు వేయడం తక్కువ ....అందరూ కొమ్మలు నాటేవారు ...
నేను వేసిన కొమ్మ బాగా బతికింది ...దానికి కంచె అడ్డుగా వేసి ఉంచేవాళ్ళం ...మేకలు లోపలికి పోకుండా ...
రోజూ స్కూల్ నుండి రాగానే ఒకసారి వెళ్లి ఆ మొక్క చూసుకుని వచ్చేదాన్ని ...ఎంత సంతోషం వేసేదో...మా ఇంట్లో కూడా గోరింటాకు మొక్క ఉందని ...
ఒకరోజు అలవాటుగా స్కూల్ నుండి రాగానే ...మొక్క చూసుకుందాం అని వెళ్తే ...మొక్క పీకి ఉంది దాని మొదట్లోనే పెట్టి ...
దానికి ఉన్న కొమ్మలు కూడా ఎవరో విరిచేసారు ...విరిచేసిన కొమ్మలు మాత్రం కనిపించలేదు ...
అక్కడేమైనా సిసి కెమెరాలు ఉంటాయా ఎవరు చేసారో కనిపెట్టడానికి ...
మేకలు పడ్డాయా అంటే ...అవి మొక్కలు పీకలేవు ...మహా అయితే ఆకులు తినగలవు అంతే ...
ఒక రెండు మూడు రోజులు తరువాత అనుకుంటా ...
మా నాయనమ్మ.. మా బాబాయి వాళ్ళ కొష్టంలో ఏదో తేవడానికి వెళ్ళినప్పుడు ....(అక్కడ ఎడ్లబండి పైన దూలానికి కట్టేసి ఉండేది ...)ఆ కట్టేసిన బండి మీద చివర్లో కనిపించాయి మా నాయనమ్మకు గోరింటాకు కొమ్మలు ...
నేనేమో బాగా ఏడ్చాను ...మా నాయనమ్మ వాళ్ళ కుళ్ళుమోతు తనాన్ని తిట్టి పోసింది ...
అదే కాదు ....కనకాంబరం మొక్కలు ...ఇతర పూల మొక్కలు ఏవీ బతికేవి కావు ....స్కూల్ కి వెళ్లకుండా నేను కాపలా ఉండడం కుదరదు కాబట్టి ...మా అమ్మ మొక్కలు లేవు ఏం లేవు ....ఈ తగాదాలు మేం పడలేం ....అని వేయొద్దు అని చెప్పేది ....
ఆ తర్వాత కాలంలో ...ఇక గోరింటాకు మొక్క వేసే అవకాశం నాకు కలగలేదు ....
నా పెళ్లయ్యాక కొన్నాళ్ళకి మా అమ్మ ఒక మొక్క ఇంటి ముందే వేసింది ....
పిల్లలు నేను సెలవుల్లో వెళ్ళినప్పుడు ....గోరింటాకు రుబ్బి పిల్లలకు పెట్టేదాన్ని ...
అమెరికా వచ్చాక ....మా అమ్మ దగ్గరనుండి తెచ్చిన గోరింటాకు విత్తనాలు వేద్దాం అని చాలా సార్లు ప్రయత్నించా ....ఈ చలి వాతావరణంలో సాధ్యం కాదని వాటి గురించి మర్చిపోయా ....
గత సంవత్సరం నుండి ...ఈ కాలిఫోర్నియా వాతావరణంలో ...మళ్ళీ మొదలు పెట్టి ...కుండీలో చాలాసార్లు విత్తనాలు వేశా ....కానీ మొలకెత్తలేదు ....
మళ్ళీ ఓ నెల క్రితం వేశా ...లక్కీగా కొన్ని మొక్కలు వచ్చాయి ...కానీ అనుకున్నంతగా ఎదగడం లేదు ....
రోజూ దాన్ని ప్రాణంలా కాపాడుతున్నా....
అంతలో ....,,
ఈ రోజు గడ్డి శుభ్రం చేద్దాం అని గార్డెన్ లోకి వెళ్ళా ....గత కొన్ని రోజులుగా తీరిక దొరకక మావారిని అడిగా చాలాసార్లు ....కాస్త ఆ గడ్డి పీకొచ్చు కదా అని ....
అహ...నేను లేకుండా ....నేను మొదలు పెట్టకుండా ....అయన అటువైపు అడుగు పెట్టరు...ఏ పనైనా అఱంగుళం కూడా కదలదు ...
సరే నేనే చేసుకుందాం లే అని ఇవ్వాళ వెళ్తే .... అక్కడ గడ్డిలో మహాలక్ష్మిలా కనిపించింది ..ఈ గోరింటాకు మొక్క ....
ఎప్పుడో కుండీలో మట్టి అక్కడ విసిరేసి ఉంటాను ...అది మొలిచింది ...
లంకె బిందెలు దొరికినప్పుడు కళ్ళు ఎలా వెలిగిపోతాయో అలా వెలిగిపోయాయి ....గోరింటాకు మొక్క చూడగానే ....
వెంటనే ....చుట్టూ ఉన్న గడ్డి శుభ్రం చేసి ...దాని చుట్టూ కేజ్ పెట్టేసి ...మావారికి చెప్పా ...పొరపాటున కూడా ఇటువైపు రావద్దు ...గడ్డి అనుకుని పీకొద్దు అని ....
ఈయన బద్ధకం కూడా ఒకోసారి నాకు కలిసి వస్తుంది ....పరమానందయ్య శిష్యుల్లాగా ....
ఆయన నేను చెప్పిన వెంటనే గడ్డి పీకేసి ఉంటే ...ఈ మొక్క కూడా పీకేసి ఉండేవారు ....
థాంక్స్ చెప్పా ...మీరు పీకకపోవడం వలెనే ఆ మొక్క బతికింది అని ...🙏
అయినా ఆ మధ్య ఇక్కడ ఒక ఫ్రెండ్ తన దగ్గర మొక్క ఉంది ఇస్తాను అని అంది ...
నేనేమో మా అమ్మ ఇచ్చిన విత్తనం ఎలా అయినా బతికించాలని ....
ఇన్నేళ్లకి నా గోరింటాకు చెట్టు కల నెరవేరింది ....
చుట్టూ ఉన్న ఫిగ్ ట్రీ కొమ్మలు కొన్ని కట్ చేయాలి ....నా బంగారానికి ఎండ తగిలేలా ...
ఏంటో ...ఇవ్వాళ నా కాళ్ళు అటువైపు పోకుండా ఆగడం లేదు ...ఎన్ని సార్లు చూసుకున్నానో ...నా దిష్టే తగిలేలా ఉంది ...!😍🥰😘

Friday, October 8, 2021

మనిషిలో మార్పు అనేది సాధ్యమవుతుందా ....లేదా అసాధ్యమా ....

 మనిషిలో మార్పు అనేది సాధ్యమవుతుందా ....లేదా అసాధ్యమా ....

మనం ఎవరినైనా మార్చగలమా ...పోనీ ఎవరైనా మారిస్తే మనం మారిపోగలమా ....
నేను చిన్నతనంలో తెలుగు సినిమాలు చూసి అనుకునేదాన్ని ....
ఆహా ...ప్రేమతో మనం ఎవరినైనా మార్చగలం అని ....ఎలాంటి చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ... ప్రేమగా చూసుకుని ...ఒక్క ముద్దిస్తే ..లేదా సినిమాల్లో చూపించినట్టు ....ఏవో కొన్ని కండిషన్స్ పెడితే ....వాళ్ళు ఇట్టే మారిపోతారు అనుకునేదాన్ని ....
అలా అని నేను మారిపోవడానికి సిద్ధంగా లేనా అంటే ....అది కూడా ఆలోచించేదాన్ని ...నేను కూడా ఎదుటివారికి తగ్గట్టుగా నడుచుకోవాలి ... వాళ్ళ ఇష్టాలేమిటో తెలుసుకుని ....అవన్నీ చేసి పెట్టాలి అని కూడా అనుకునేదాన్ని ....
ఇలాంటి అసాధ్యపు ఆలోచనలన్ని తెలుగు సినిమా మన బుర్రల్లో ముద్రించగలిగింది ....
నేనెంత మారాను అనేది పక్కన పెడితే ....
మావారిని నేను సూది మొన మోపినంత కూడా మార్చలేకపోయా ....
తన చెడు అలవాట్లు ....తన మంచి అలవాట్లు అన్ని తనతోనే ఉన్నాయి ....
బహుశా ....సమాజం పురుషుడికి ...నువ్వు మారాల్సిన అవసరం లేదు ....నీతో కలిసి జీవించేవాళ్ళు అందరూ నీకు అనుగుణంగా మారిపోతారు అని తేల్చి చెప్పిందేమో ....అని అనిపిస్తూ ఉంటుంది తనని చూసినప్పుడు ....
లేదా నువ్వు వాళ్ళని వదిలెయ్యొచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చే ఉంటుంది ....
ఆఖరికి పుట్టిన పిల్లల్ని కూడా పురుషుడు తనకు అనుగుణంగా పెరగాలి అంటాడే తప్ప ....తాను కాస్తయినా మారదాం అని అనుకోడేమో అని నా సందేహం ....
అయితే ఈ విశ్లేషణ పక్కన పెడితే ....మావారు మా ఇద్దరికీ పెళ్లయినప్పుడు ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉంటారు ....చాలా విషయాల్లో ....
నేను అసలు మార్పు మార్చాలి ....మారిపోవాలి అనే పదాలు.. మర్చిపోయి ....నా పనులు ఏవో నేను చేసుకోవడం అలవాటై కూడా చాలా ఏళ్లయింది ....
అయితే ...తనకు మారాలని ఉండేది ...అందుకు అనుగుణంగా నేను ప్రయత్నం అయితే చేయాలని ఉండేది ...ఆ ప్రయత్నం అనేది ...ఎలా ఉండాలి అంటే ...."నా ప్రయత్నం తన మార్పుకు అనుగుణంగా మారాలి తప్ప ....నా ప్రయత్నానికి అనుగుణంగా తను మారకూడదు అన్నమాట ...."
అంత బలమైన ప్రయత్నం నేను చేయలేకపోయా ....
నాకున్న అనేక బాధ్యతలు , పిల్లలు , జీవితం వీటన్నిటిలో చాలా బిజీ అయిపోయి ....పెళ్లయిన కొత్తలో చేసినంత ప్రయత్నం చేయలేకపోయా ....అని అంగీకరించాలి ....
కానీ ఈ జీవన గమనంలో నేనైతే చేలా మారిపోయా ....
ఎంతగా మారాను అంటే ....మార్పు గురించి ఆలోచించడానికి ....మాట్లాడడానికి తీరిక లేనంత ....ఎప్పుడో ఒకసారి కాస్తంత సమయం దొరికితే ....అవును కదా ...అప్పుడు అలా ఉండేదాన్ని కదా అని ఎవరో నా ఆత్మీయులు గుర్తు చేస్తుంటే ...ఆశ్చర్యపోయి వినేంత ....
అది ఓ ఇరవై ఏళ్ళ క్రితం కావచ్చు ....ఇరవై రోజుల క్రితం కావచ్చు ....
ఇరవై రోజులకే అంత మార్పుంటే ఇంకా మార్పు గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది నా పిచ్చి కాకపోతే ....
మరి మారిన నన్ను చూసి కానివ్వండి ....మారలేకపోతున్న తనను చూసి కానివ్వండి ... పాపం మా వారికి కూడా అప్పుడప్పుడు మారాలనిపించింది అనుకుంటా ...
కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేసే ఉంటారనుకుంటా ....అప్పుడప్పుడు నేను చాలా మారిపోయాను అని నా దగ్గరకు వచ్చి ...చెప్పేవారు ....
కానీ నేను ..."మారిపోతే నేను గమనించి మీకు చెప్పాలి కానీ ....మీ అంతట మీరు ఆలా చెప్పుకోకూడదండీ ...." అని నవ్వేసే దాన్ని ....
అయినా మీరు ఎందుకు మారాలనుకుంటున్నారు...ఇప్పుడు ఉన్న మీరు మీకు నచ్చడం లేదా ....ఎందుకు నచ్చడం లేదు ....ముందు మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి అని కొన్నిసార్లు చెప్పేదాన్ని ....ఏదో ఫ్రెండ్లీ గా అన్నమాట ....మారాలనే హోప్ తో కాదు ....
ఆ తర్వాత ....చాలా మందితో ...."లక్ష్మికి నేను అది చేస్తే ఇష్టం ఉండదు ....ఇది చేస్తే ఇష్టం ఉండదు ...అది నా అలవాటు ....ఇది నా అలవాటు ...తనకు ఇలా చేసేవాళ్ళంటే ఇష్టం ...." అని ఉదాహరణగా చెప్పేవారు ....
వాళ్లంతా అయన మీద సానుభూతి చూపించి ...."మీరు మారిపోవచ్చు కదండీ ...అయన అలా బాధపడుతుంటే ....." అని నాకు ఎదురు క్లాసులు పీకేవారు ...
నాకేం చేయాలో అర్ధమయ్యేది కాదు ....
నాకు ఫలానా కమల్ హాసన్ యాక్టింగ్ అంటే ఇష్టం అంటే ....మీరూ కమల్ హాసన్ లా ఉండాలని కాదు కదా ..... బాలసుబ్రహ్మణ్యం పాటంటే నాకు ఇష్టం అంటే ....అందరినీ గాయకులైపొమ్మని కాదు కదా ...
అర్ధం కాని ....అర్ధం చేసుకోలేని మందతో ....సారీ మందితో ....వాదించడం ఎందుకులే ...నా సమయం వృధా అని ....మౌనం వహించడం చేస్తూ ఉండేదాన్ని ....ఈ మౌనం కూడా మార్పేనండోయ్ ....
అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ....పరిస్థితులకు అనుగుణంగా ....ఎవరినీ నొప్పించకుండా ....మనం నొప్పించుకోకుండా ....హాయిగా సంతోషంగా బ్రతకడమే మార్పంటే ....మార్పు ఎక్కడో లేదని ....మన రోజు వారీ జీవితంలో నే ఉందని ....నా చిన్న బుర్రకు అర్ధమైందనుకుంటా ....అందుకే ...మార్పు గురించి అదెప్పుడో మర్చిపోయి ఉంటుంది ....
మార్పు గురించి నేను మర్చిపోయి ....మావారు అన్వేషిస్తూ ....ఈ పరుగులు పెడుతున్న జీవితంలో ....
అనుకోకుండా ఒకరు ఎదురయ్యారు ఈ మధ్య ...
ఆయనే మావారికి పరిచయమైన గురువు .....
ఆయన రోజూ ఈయనకి క్లాసులు చెబుతూ ఉండేవారు ....క్లాసుల్లో భాగంగా ...."నాకు మారాలని ఉంది ...నాకు అది చేయాలని ఉంది ...ఇది చేయాలని ఉంది" ...అని గురువుకి చెప్పేవారు ఈయన ...
"నువ్వు నేను చెప్పినట్టు చేసి ....చెప్పింది తప్పనిసరిగా ఆచరిస్తే ....నిన్ను భగవంతుడిని చేస్తా ...."అన్నారు గురువు ఈయనతో ....
అంటే భగవంతుడు కాదు ....భగవంతుడి శిష్యుడు అన్నమాట ....గురువు భగవంతుడి పోస్ట్ రిజర్వ్ చేసుకున్నాడు మరి ....(నాకు వాళ్ళు చెప్తేనే ఇవన్నీ తెలుస్తాయి ....సొంత ఆలోచనలు కావు .....)
సరే ...రోజూ గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకోవడం ...అయన చెప్పింది ఈయన పుస్తకంలో వ్రాసుకోవడం ....అయన చెప్పింది ఈయన అప్పజెప్పడం ...ఇలా సాగుతూ ఉండేది ....మార్పు పాఠశాల ...
ఒక దశలో నాకు ఆశ్చర్యం వేసింది కూడా ....ఏంటి గంటల తరబడి ఈయన వూ కొడుతూ వింటున్నాడు .....అయన ఏం చెప్తున్నాడు అని ....
"ఏమండీ ....ఏం చెబుతున్నాడు అయన ...." అని అడిగా ఓ సారి ఉండబట్టలేక ....
"ష్ ...." అని మాట్లాడొద్దు అని సైగ చేస్తూ ....."అయన ట్రాన్స్ లో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు ....అయన చెప్పింది వినాలి ....అప్పుడు ఆయన్ని భగవంతుడే మాట్లాడిస్తాడు ....." అన్నారు ....
"ఓహో ....దేవదూతా ...." అడిగా...
నాకు రోజు రోజుకీ ఉత్సుకత పెరగడం మొదలైంది ....వీళ్లిద్దరి సంభాషణ మీద ....
"ఇదేంటి ఈయన పెళ్లయిన దగ్గరనుండి ...పట్టుమని పది మాటలు కూడా నేను చెప్పినవి విని ఉండరు....నేనేమిటి .....ఎవరు చెప్పినా వినే అలవాటు లేదు .... డబ్బులిచ్చి అయినా ఎదుటివాళ్ళకు చెప్పడమే తప్ప ...అని ఆశ్చర్యం వేసింది"
సరే ...వాళ్ళ గురువు గారు చెప్పినవన్నీ నా దగ్గర చెప్పేవారు ....అవన్నీ నేను ఎదో ఒక సందర్భంలో ఇదివరకు చెప్పినవే ....అవి మీరు తోసి పారేసినవే అని గుర్తు చేసేదాన్ని ....
కాదు గురువు గారు చెప్పేది డిఫరెంట్ అనేవారు ....
అయన చెప్పింది అవునా కాదా నన్ను అడగడం .....నేను అడిగింది నిజమా కాదా అని ఆయన్ని అడగడం వలన గురువుతో నాకు కూడా కాస్త వర్చువల్ రిలేషన్ ఏర్పడింది కాస్త ......
"లక్ష్మి చెప్పిన మాట విను ....స్త్రీ లు అంటే దేవతలు ....వాళ్ళని ప్రేమించు ...." అని గురువుగారు చెప్పేవారని ....
ఆయనకి వాళ్ళావిడ అంటే అమితమైన ప్రేమ అని చెప్పేవారు .....
ఓహో ....ఇదేమన్నా మా అయన మీద వర్కౌట్ అవుతుందా అని ఆలోచించేదాన్ని ....
అబ్బే ...నమ్మకం కలిగేది కాదు ....
ఆ తరువాత కొన్ని సందర్భాల్లో ....
గురువుకి నాకు ....అభిప్రాయబేధాలు రావడం వలన ....(అదేలే...వర్చువల్ ) "నువ్వు నేను చెప్పినవన్నీ లక్ష్మికి చెప్పొద్దు" అని గురువు ఈయనతో ప్రామిస్ చేయించుకున్నారు అని సమాచారం అందింది ....
సరేలే పోనివ్వండి మీరే మాట్లాడుకోండి ....అని చెప్పా ....
ఒకరోజు ...."ఇన్ని గంటలు ఎలా మాట్లాడుకుంటున్నారు ...." అని అడిగా ....
"ఏమో మేమిద్దరం లవర్స్ లా మాట్లాడుకుంటున్నాం ...అయన నన్ను నేనేది అవ్వాలనుకుంటే అది చేసేస్తాను .... అని చెప్పారు ...." అన్నారు సమాధానంగా ...
మధ్య మధ్యలో నిన్ను బాగా చూసుకోమన్నారు ....ప్రేమించమన్నారు అని ఉదహరించడం మర్చిపోలేదు ....
"ఏంటి ఆకారణమైన ప్రేమ నా మీద ఆయనకి " ఉండబట్టలేక అడిగా ....
"ఏమో ....ఆయనేం చెప్తే అది చేయడమే .....ప్రశ్నించడాలు లేవు ..." చెప్పారు ....
"నన్ను కొద్ది రోజుల్లో కంప్లీట్ గా ఒక గౌతమ బుద్ధుడిలాగా ....ఒక గాంధీ మహాత్ముడిలాగా ....మార్చేస్తాను ....అన్నారు గురువుగారు ...." వెర్రి ఆనందంతో ...చెప్పారు...
"అంత వద్దు ....ఏదైనా ఒక్క విషయం మార్చాను అని గురువు గారిని ప్రూవ్ చేయమనండి .... నేను ఓడిపోతే .....నేను గురువుగారికి గుడి కట్టిస్తా ...మీరు ఓడిపోతే ...ఇక మార్పు గురించి.. ఎప్పుడూ మీరూ మీ గురువూ మాట్లాడకూడదు ....మనిద్దరి మధ్య పందెం పెట్టుకుందాం ....ఇది మీ గురువుకి ఛాలెంజ్ కూడా ....." అడిగా ...
నన్ను మార్చలేకపోతే మా గురువుకే ఓటమి అన్నారు ...
మరి పందేనికి రెడీనా ....అడిగి కనుక్కుని చెప్పండి అన్నా ....
కొన్ని రోజులు పోయాక ...."ఫ్రీ గా చెప్తే ...నేను తను చెప్పినవి పాటించడం లేదని ....మారడం లేదని ...నన్ను నెలకింత డబ్బులు కట్టమన్నారు ...పంపించడం మొదలు పెట్టాను ....
అయన ఆయన చేతులతో డబ్బులు ముట్టుకోరు ....అందుకే వాళ్లావిడకి పంపిస్తున్నా ...." చెప్పారు కొన్నాళ్ల తర్వాత ....
విని ఊరుకున్నా ....నేను డబ్బులు ఇవ్వొద్దు అని చెప్తే ఏమీ లెక్కచేయరు అనే నమ్మకం వలన ....(ఇది నాలో వచ్చిన మార్పు )
మరి కొన్నాళ్ళు పోయాక ....గురువుగారు కోప్పడుతున్నారు ....ఎంత చెప్పినా మారడం లేదని ...అని ఒకసారి ....
నువ్వు ఇంకా డబ్బులు ఎక్కువ పంపించు అని అన్నారని ఒకసారి చెప్పుకొచ్చారు ...
ఆ తర్వాత ....మారడం ఇక సాధ్యం కాదని అనుకున్నారో ఏమో ....లేదా మొదట్లో ప్రేమగా మాట్లాడిన వ్యక్తి ....మారకపోవడం వలన ....కాదు కాదు ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడం వలన ....కోపంగా చెప్పడం మొదలు పెట్టడం వలనో ఏమో ....
మారడం ఈయన వల్ల కాదని ....మార్చడం ఆయన వల్ల కాదని డిసైడ్ అయ్యారు చివరకు .....
నేను కూడా గుడి కట్టించే కార్యక్రమం తప్పింది అని సంతోషించా అనుకోండి ....అది వేరే విషయం ....
మార్పంటే అంత ఆషామాషీగా ఉందా ....
మార్పు అనేది మన మెదడు కొసల్లో నుండి మొదలు కావాలి ....నర నరాల్లో ...రక్తం ప్రవహించినట్టు ప్రవహించాలి ....కాన్సర్ వచ్చిన వ్యక్తి కి ఎలా అయితే రక్తాన్ని మారుస్తారో ....అలా మార్పుని నర నరాల్లో చొప్పించాలి ....
అలా రోజూ ....ప్రతి నిమిషం .....ప్రతి క్షణం ....ప్రతి ఘడియ ...మారుస్తూనే ఉండాలి మార్పుని ....అయినా మారతామనే గ్యారెంటీ లేదు ....అదృష్టం అంతే ....
రక్త మార్పిడి చేసినంత మాత్రాన కాన్సర్ నయమవుతుంది గ్యారెంటీ ఉందా ...
ఇదీ అంతే ....
మనం కృషి చేయకుండా ....ఎవరో వచ్చి మనల్ని మారుస్తారని ....డబ్బులిస్తే ఏమైనా జరిగిపోద్దని ....ఎవరినైనా ఇట్టే మార్చేయొచ్చు అని .....
ఒకరిది అహంకారం ....ఒకరిది అమాయకత్వం...
కొసమెరుపేంటంటే ....ఇంత తెలిసినా ....ఇవ్వాళ పొద్దున్న ....
"ఇన్ని సంవత్సరాలయింది ...అణువంత కూడా మారరా మీరు ....మార్పు రాదా ....కాస్త కూడా ఆలోచించరా ఎదుటివాళ్ళ గురించి ....రోడ్డు మీద ఇదెలా పోతుందో ...ఎంత ఇబ్బంది పడుతుందో ....అని కాస్తయినా కన్సర్న్ లేదా ..." పెట్రోల్ మొత్తం ఖాళీ చేసి ...అది ఫిల్ చేయండి అని మరీ మరీ చెప్పినా ...లెక్కచేయకపోవడం చూసి కోపంగా చెప్పా ....(ఇలా చెప్పకుండా ఉండడం...లేదా ఉండే పరిస్థితులు కల్పించుకోవడం .... మార్పు గురించి ఇలా మరోసారి వ్రాసుకోకుండా ఉండడం ....నాలో రావాల్సిన మార్పు ....)
అన్నట్టు ......
మనిషిలో మార్పు అనేది సాధ్యమవుతుందా ....లేదా అసాధ్యమా ....
మనం ఎవరినైనా మార్చగలమా ...పోనీ ఎవరైనా మారిస్తే మనం మారిపోగలమా ....?!
*********************************************
Happy Weekend!
1