Friday, January 6, 2023

నేను మొన్న ఓ పనిమీద నా ఫ్రెండ్ తో

 నేను మొన్న ఓ పనిమీద నా ఫ్రెండ్ తో కార్ లో వెళ్తున్నా ...

తన హస్బెండ్ ఒక అడ్రస్ చెప్పి ... ఆ అడ్రస్ దగ్గర ఒక వ్యక్తి మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ... అతన్ని కలవండి ....అతను మీరు వెళ్లాల్సిన ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు అని చెప్పారు ...
తను ఎక్కువగా బయటకు వెళ్ళదు.. నాకు సిటీ కొత్త ...
"నీకు దారి తెలుసు కదా" అడిగా తనని ...
గుర్తుందిలే పద అంది ...
బయల్దేరాక ...కాస్త దూరం వెళ్ళగానే వాళ్ళాయన దగ్గరనుండి కాల్ ...ఎంత దూరం వెళ్లారు ..ఎక్కడున్నారు అని ..
ఇదిగో ఇక్కడ ఉన్నాం ...ఈ రోడ్డు దాటుతున్నాం అని తను చెబుతుంది ...
కాసేపాగాక మళ్ళీ ఫోన్ ఎక్కడున్నారు అని ...మళ్ళీ చెప్పాం ...
ఇలా కాదని ..నేను పక్కనే కారాపి .. అయన నీకు చెప్పి ...నువ్వు నాకు చెప్పి పుణ్య కాలం పూర్తవుతుంది కానీ ...ఆ అడ్రస్ దగ్గర్లో ఉన్న ఏదైనా గుర్తు చెప్పు అది మ్యాప్స్ పెడతాను అని చెప్పా ...ఏదో స్టేడియం పక్కన అని చెప్పింది ... స్టేడియం అడ్రస్ పెట్టుకుని బయల్దేరాం ...
అంతలో మళ్ళీ ఫోన్ ... మేం జి.పి.యస్ ఫాలో అవుతున్నాం ...తప్పిపోతే చెబుతాం అని చెప్పమని చెప్పా ...
చెప్పాక కూడా అతను ఫోన్స్ చేయడం మాత్రం ఆపలేదు ...సేఫ్ గా వెళ్తున్నారా లేదా అని ..
మొత్తానికి డెస్టినేషన్ రీచ్ అయ్యాం ...
పనైపోయాక ...మళ్ళీ జి.పి.యస్ పెట్టుకుని ఇంటికి వచ్చేశాం ..
నాకెందుకో మా ఆయన గుర్తొచ్చాడు ....ఊరికే గుర్తు రారు మహానుభావులు ..
ఈ ఎపిసోడ్ మొత్తంలో మా ఆయనైతే ఏం చేస్తాడా అని ఆలోచించా ...
ఇంటిదగ్గర బయల్దేరడంతోనే తలుపేసుకుని ...ఏ సినిమానో పెద్ద సౌండ్ పెట్టుకుని హాయిగా చిప్స్ తింటూ ..ఫోన్ చేసినా కూడా ఎత్తడమే ఉండదు ..
దేవుడా అనుకుని ...నవ్వుకున్నా ..
ఇవ్వాళ ఫోన్ చేసినప్పుడు అదే అడిగా ...
వాళ్లిద్దరూ చిన్నప్పటి చడ్డీ దోస్త్ లు ...అందుకే అడగాలనిపించింది ...
"ఏమండీ ...మీ ఫ్రెండ్ మేం బయటికెళ్ళాక ...పాపం వీళ్ళు ఎలా వెళ్లారో ఏంటో అని వంద సార్లు కాల్ చేసారు ...మీకు నేను ఎక్కడికి పోయానో ఎప్పుడొస్తానో ..ఎలా ఉన్నానో అనే చింతే ఉండదు ...ఫోన్ చేయడం మాట అటుంచి ...కనీసం చేసినప్పుడైనా అడగరు ...ఎందుకని ..." అని ప్రశ్నించా ...
"అది ...capability మీద ఆధారపడి ఉంటుంది ...నువ్వు capable అని నేను నమ్మాను అందుకే అడగను" చెప్పారు ...
"కబుర్లు చెప్పొద్దు ...ఇవ్వాళ నేను capable ... కానీ capable కానప్పుడు .. అలా అని మీరు నమ్మనప్పుడు .. స్టార్టింగ్ లో నాకేమీ చేసుకోవడం రానప్పుడు కూడా మీరు నన్ను అడగలేదు ..." గుర్తు చేశా ..
"నాకు ఉన్నది ఉన్నట్టుగా ప్రాక్టికల్ గా ఉండడం ఇష్టం ...డ్రామాలు ఇష్టం ఉండదు ..." చెప్పారు ...
"మీకు డ్రామా ఇష్టం లేదు ...కానీ మీకు డ్రామా చేసే వైఫ్ కావాలి ...అంతేనా ..." అడిగా ..
"నిజమే ..." అంగీకరించారు ..
ఇంకా ఏదో చెప్పబోయారు ..
"ఇంక అయిపొయింది, ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్ లోకి వెళదాం" చెప్పా ....కూల్ గా ..😇✍️

నేను వ్రాసినవి కొందరికి

 నేను వ్రాసినవి కొందరికి భయం, కొందరికి విమర్శనాత్మకంగా అనిపిస్తుంటే .. అందుకు నేను చింతిస్తున్నా ...

దాని వెనుక ఉన్న నిజాల్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా ...
నేను నాకెదురైన సంఘటనల్నే వ్రాస్తున్నా కానీ కల్పనలు కాదు ...
నాకెదురైన సంఘటనలు అందరికీ ఎదురుకావాలని లేదు ....అందరూ ఇలాంటి స్థితి గతుల్లోనే ఉంటారని కాదు ...
అమెరికాలో పిల్లలున్నవాళ్ళు భయపడకండి ...వాళ్ళు ఇలాంటి పరిస్థితులుంటే మీ దగ్గరికి రారేమో అని ..
వాళ్ళు తల్లితండ్రుల కోసం వస్తారు ...ఇక్కడున్న జ్ఞాపకాల కోసం వస్తారు ..
వచ్చిన తర్వాత కొన్ని రోజులకు కానీ అడ్జస్ట్ అవలేరు ...అది సర్వ సాధారణం ...
ఏం మీరు అమెరికా వస్తే ఈజీగా ఒక్క రోజులో అడ్జస్ట్ కాగలరా ...
అక్కడ ఎలా జీవించాలో ఒక్క రోజులో మీకు వచ్చేస్తుందా ...
మీరు ఫ్లైట్ లో ఎకానమీలో ఎక్కడ కూర్చోలేకపోతారో అని ...పిల్లలు ఎకానమీ క్లాస్ లో ఉండి , తల్లితండ్రుల్ని బిజినెస్ క్లాస్ లో తీసుకెళ్లే పిల్లలున్నారు ...
పిల్లలు అమెరికా వెళ్లి ఒక జీవన విధానానికి అలవాటు పడిన తర్వాత ....ఎప్పుడో ఒకసారి ఇక్కడికొస్తే ఈ జీవనానికి , మారిన పరిస్థితులకు అడ్జస్ట్ అవడానికి కాస్త టైం పట్టదా ...
మారిన రూల్స్ అర్ధం చేసుకోవద్దా ...
ఆ సందర్భాల్లో ఎదురైన కొన్ని సంఘటనల్నే నేను వ్రాస్తున్నా ...
నేను ...ఇక్కడి ప్రదేశాలనో ..లేక ప్రభుత్వాన్నో విమర్శించాలని కాదు ...
అలా విమర్శించాలి అనుకుంటే ఇలా డొంక తిరుగుడుగా వ్రాయాలని కూడా అనుకోను ...
ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా విమర్శించే హక్కు నాకు ఉంది..బాధ్యత కూడా ఉంది ..
కాబట్టి నేను వేసిన పోస్ట్ ల్లో ఏదేదో వెతికి అవి విమర్శలు అనుకోవద్దు ...
అలాగే మీ అమెరికా వెళ్లిన పిల్లలు ఇక్కడికి రారు అని భయపడొద్దు ...వాళ్ళు వచ్చేలా కొన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నించండి ...బేసిక్ వి ...
అందులో పరిశుభ్రత చాలా ముఖ్యమైంది ...విలాసాలు అవసరం లేదు ...
తల్లితండ్రులు పిల్లలు ఒకరినొకరు ఎవరికేం కావాలో అర్ధం చేసుకుంటే ...చింతించాల్సిన అవసరం లేదు ...
అలాగే నాకెదురైన ఆహార అలవాట్లు ఒక తెగ వారికి చెందినవి ..
వాళ్ళ జీవన విధానం అది ...మా ఊర్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ...వాళ్ళ కులం గురించి ప్రస్తావించదల్చుకోలేదు..
వాళ్ళతో కలిసి జీవించడం , వాళ్ళ ఆహార అలవాట్లు అర్ధం చేసుకోవడం అనేది అదృష్టంగా భావించాలి ...అసహ్యించుకోకూడదు ..
ఆదిమ మానవుడి ఆహార వేటలో వాళ్ళు ఏం దొరికితే అది తిని బ్రతికారు..
వాళ్లకు కూడా మనం తినే రిచ్ మెనూ దొరికితే అలాంటి ఆహారం ఎందుకు తింటారు ...
అయినా అమెరికాలో షాప్స్ లో దొరికే కొన్ని జంతువుల పేర్లు కూడా నాకు తెలియదు ..
వివిధ దేశాల వాళ్ళు అవి తింటూ ఉంటారు అని అనుకుంటా ...
మరీ ఎక్కువ ఆలోచించకుండా ...దేశభక్తిని , మానవత్వాన్ని అవసరమైన ప్రదేశాల్లో వాడండి ..!

Thursday, January 5, 2023

ఇవ్వాళ మధ్యాహ్న్నము నా భోజనం ...

 ఇవ్వాళ మధ్యాహ్న్నము నా భోజనం ...

వోది పిట్ట కూర, తోటకూర , దొండకాయ కూర ..
ఈ వోది పిట్టలు ఒక్క వడ్లు మాత్రమే తింటాయంట ...అందుకే వాటికి ఆ పేరు వచ్చింది ...రాత్రి పూట వెళ్లి పట్టుకుని వస్తారు పొలాల్లో దొరుకుతాయి ...
కోడి కూర లాగే ఉంటుంది ...తిని చూడమని బలవంతం చేశారు ...
సరే అని ఒకే ఒక్క స్పూన్ వేసుకుని చూశా.. బాగానే అనిపించింది ... ఫ్రై కూడా పెట్టారు ..
నిన్న ...చేపల కూర ...అవేవో లోకల్ గా దొరికే చేపలు...పండు చేప అంట ..కోరమీను కూడా ...
రెండు రకాల చేపలు కలిపి కూర చెయ్యొచ్చని ఫస్ట్ టైం అర్ధం అయింది ..
ఎలా వండమంటారు కూర అని అడిగారు .. మీ స్టైల్ లో నే చేయండి అని చెప్పా ..
కానీ ఏమాటకామాటే పులుసు తక్కువ వేసినా ....చాలా బాగా చేశారు ...
బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో రొయ్యల వేపుడు స్నాక్ అంట ...
ఇదొక వైల్డ్ లైఫ్ .. వీళ్ళు వీళ్ళ ఆహార అలవాట్లు విచిత్రంగా ఉన్నాయి ...
సంస్కృతి అంటే ముఖ్యంగా ఆహార అలవాట్లే కదా ...
వీళ్ళు చాలా జంతువుల్ని తింటారు ... అవన్నీ వీళ్ళే వేటాడి తెచ్చుకుంటారు చాలావరకు ..
వీళ్ళు ఎలుకలు కూడా తింటారని తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది ...అలాగే కోడి తినరట...ఏంటో ...
రేపు ఉంటానంటే ఇవి తెస్తాం అవి తెస్తాం అంటారు ...
మొత్తానికి మా ఆయన అందుకే ఇక్కడికొచ్చి కదలరు అని అర్ధం అయింది ...!😇✍️







Wednesday, January 4, 2023

ఇవ్వాళ ఒక లైన్ లో నిలబడాల్సి వచ్చింది..

 ఇవ్వాళ ఒక లైన్ లో నిలబడాల్సి వచ్చింది.. ఆ లైన్ కాస్త పొడుగ్గానే ఉంది ..

చాలాసేపు పడుతుందేమో వెళ్ళిపోదాం అనుకున్నా .. కానీ సగం ప్రాసెస్ అవడం వలన అక్కడే ఉండక తప్పలేదు ...
సరే లైన్ లో మా తర్వాత వచ్చిన ఒకళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి చెప్పా ... నేను మీ కంటే ముందుగానే వచ్చానండి ...మీరు నా తర్వాత అని ...
వాళ్ళు సరే అని నా వెనక్కి వెళ్లారు ...
ఒక్కొక్కళ్ళ ప్రాసెస్ గంట పడుతుంది ...ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని అడిగితే ...దానికి ఆ లైన్ లో ఉన్నవాళ్ళంతా ...వీళ్లంతా కొత్తగా వచ్చిన ఎంప్లాయిస్ అండి ...అందుకే అంత లేట్ అన్నారు ...
అదేం రీజన్ అండి ...మనకు మనమే ఆలా కారణాలు వెతుక్కుని అన్వయించుకుంటే ఎలా అని అడిగా ...
కాసేపటికి లైన్ కదిలింది ...
అంతలో ఒకరు హడావిడిగా అందర్నీ తోసుకుని వెళ్ళడానికి ట్రై చేసాడు ..
హలో మేము అనేవాళ్ళం కొంతమంది ఇక్కడ లైన్ లో ఉన్నాం అని చెప్పా అతనికి ...నేను ఈ లైన్ కాదండీ ...పక్క నే ఉన్న ఇంకో లైన్ అన్నాడు ...
కానీ ముందుకు వెళ్లి పక్కకి వెళ్లినట్టు నటించి ...మా లైన్ లోకి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయాడు ...
అది నేను గమనించను కూడా లేదు ... నా ముందు వెనక ఉన్నవాళ్లు చెప్పారు ...
అదేంటండీ చూస్తే మీరు అడగలేదెందుకు అని అడిగా ...
వాళ్ళంతేనండీ అన్నారు ...
అంతలో మళ్ళీ ఒకతను హడావిడిగా మమ్మల్ని తోసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాడు ...
నా వెనక ఉన్నవాళ్లు వీల్లేదని చెప్పారు అతనికి ...
అతను వినలేదు ...
నేను అర్జెంటు గా పోవాలి ..అన్నాడు ...
మాకు కూడా పనులున్నాయండీ ...మీరు వెనక్కి వెళ్లాల్సిందే ముందుకు పోవడానికి వీల్లేదని అందరూ ఏక కంఠంతో చెప్పారు ...
నాకు భలే హ్యాపీ అనిపించింది ...
ఎవరైనా హక్కుల గురించి మాట్లాడితే నాకు అలాగే అనిపిస్తుంది ...
పోనీలెండి , వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారు , దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు , మనకెందుకులే ....అనే వాళ్ళని చూస్తే ...బానిసత్వ మనస్తత్వానికి ప్రతీకగా కనిపిస్తారు ...
అంతలో అతను ...ఇంకా పెద్ద గొంతేసుకుని.. నేను అడ్వకేట్ ని తెలుసా అన్నాడు ..
అప్పటివరకు సైలెంట్ గా ఉన్న నాకు కొన్ని ప్రశ్నలు అడగాలనిపించింది ...
అయితే ఏంటండీ మీ గొప్ప అని అడిగా ....నేను మిమ్మల్ని ఏం అనలేదండీ ...వీళ్ళని అన్నాను అన్నాడు ...
నువ్వు ఎవరిని అంటే ఏంటి ...అసలు నువ్వు అడ్వకేట్ అయితే ఏంటి గొప్ప ...అడ్వకేట్ లు లైన్ లో నిలబడరా అడ్వకేట్ లు రూల్స్ ఫాలో అవరా ...అని అడిగా ...
రెండు ముక్కలు నేను అడిగేసరికి ...మిగతా వాళ్లంతా పిచ్చి కోపంతో ...అతన్ని లైన్ లాస్ట్ కి తరిమికొట్టారు ...అది వేరే విషయం ..
అసలు నాకు అర్ధం కానిది ఏంటంటే ...లైన్ లో ఉన్నవాళ్ళంతా పనీ పాట లేనోళ్ళు అనా అర్ధం ....
లైన్ లో నిలబడడం సిగ్గు పడే పనా ...
ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి ఉంటుంది ...బ్రతకడానికి ఎవరికి అవకాశం ఉన్న పని వాళ్ళు చేసుకుంటారు ...ఎవరు కష్టపడిన డబ్బు వాళ్ళకే చెందుతుంది ...నువ్వు ఎవడికి గొప్ప ...నేను ఎవడికంటే తక్కువ ...?!😇✍️
Note: Published on 29th Dec 2022

వచ్చేటప్పుడు కొన్ని పనులు నేను చేయలేకపోయినవి

 వచ్చేటప్పుడు కొన్ని పనులు నేను చేయలేకపోయినవి చెప్పి వచ్చా మా ఆయనకి,

అవి తప్పనిసరిగా త్వరగా చేయాల్సినవి ...
ఎన్నిసార్లు అడిగినా ఆ పనులు చేయలేదనే సమాధానం.. అయినా విసుగుపడకుండా ప్రశాంతంగా అడిగేదాన్ని ...చేశారా చేశారా అని ...
లేదనే సమాధానం ..
చివరికి ...నువ్వు లేకుండా నాకు మోటివేషన్ లేదు ...చేయలేకపోతున్నా అని చెప్పారు ఓ రోజు ...
రాముడు ..అశ్వమేధ యాగం చేసేటప్పుడు ....సీత విగ్రహం చేయించుకున్నట్టు ...మీరు కూడా మోటివేషన్ కోసం నా విగ్రహం ఒకటి పెట్టుకోండి అని ఐడియా ఇచ్చా .. మీరు ఏక పత్నీవ్రతులు కాకపోయినా ...చెప్పా ...
అయినా ఫలితం లేదు ...
చివరికి ఇలా కాదని ...
రోజూ మెయిల్ పెట్టడం స్టార్ట్ చేశా ...To Do లిస్ట్ అని ..
రిమైండర్ అని రోజూ ఫార్వార్డ్ చేయడం నా డ్యూటీ అన్నట్టు...
అయినా ఫలితం లేదు ...ఒకరోజు ఇలాగే తను కాల్ చేసినప్పుడు నా ఫ్రెండ్ ముందు ఉన్నా ...
అయినా అప్పుడు కూడా ప్రశాంతంగానే అడిగా ...చేశారా అని ...
చేయలేదు అనే సమాధానం ....
మనసులో నా ఉద్దేశ్యం ఏమిటంటే ...అడగడం నా బాధ్యత ... నా బాధ్యత అయిపొయింది అన్నట్టు నేను కూల్ గా ఉంటా ...(మోటివేట్ చేయడం నా బాధ్యత కాదని చాలా ఏళ్ళ క్రితమే జ్ఞానోదయం అయింది ....)
ఆయన ...పొద్దున్నే లేచి నేను ఏదో సరదాగా మాట్లాడదాం అని కాల్ చేస్తే ...ఈ పనుల గోలేంటి అని ఆయన ఫీలింగ్ ....
అయినా నేను అడగడం ఆపను..
తర్వాత ...తన ఫ్రెండ్స్ తో వెళ్లిన లాస్ వేగాస్ ట్రిప్ ఎలా గడిచింది ...ఎంత పోగొట్టుకున్నారు తదితర వివరాలడిగి ...అంతే ప్రశాంతగా ఫోన్ పెట్టేశా ...
బహుశా మళ్లీ తర్వాత రోజు ఉదయం కూడా ఇదే ప్రశ్నతో మా సంభాషణ మొదలవ్వొచ్చు ....చెప్పలేను ..
ఫోన్ పెట్టేసి మా ఫ్రెండ్ వైపు చూస్తే ఫ్రెండ్ కళ్ళల్లో నీళ్లు ...
అంటే ...నాలో మార్పుని చూడగలిగే ఒకే ఒక్క ఫ్రెండ్ ...పాతికేళ్ల స్నేహం ...
చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు ...నన్ను అతి తక్కువ సందర్భాల్లో చూసి ఉండొచ్చు ... లేదా ఫేస్ బుక్ రాతల్ని బట్టి అంచనా వెయ్యొచ్చు ...లేదా చిన్నప్పటిలా ఉంటాను అనుకోవచ్చు ...ఆఖరికి నన్ను కన్న తల్లి కూడా నాలో మార్పుని గమనించలేకపోవచ్చు ...
కానీ తను అలా కాదు ...నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనల్లో నా ప్రవర్తనను ...మాటల్ని ...హావభావాలను దగ్గరగా చూసిన వ్యక్తి ...
"అసలు ఎలా మాట్లాడుతున్నావు ...కోపం లేకుండా ...నువ్వు అడగాల్సింది అడిగి ..పోగొట్టుకున్న డబ్బుతో నాకు సంబంధం లేదన్నట్టు ...తల్లోయ్ ...నువ్వు నిజంగా ..." అంటూ ఎమోషనల్ అయ్యింది ...
"చాలా నేర్చుకున్నాను ...జీవితం నేర్పించింది" ...చెప్పా తనకు ...
ఆఫ్కోర్స్ ఇవ్వాళ కూడా అదే ప్రశ్న అడిగా ...పొద్దున్న కాల్ లో ...
ఒక్క పని అయింది అన్నారు .. థాంక్స్ చెప్పా ...రెండో పని ...మూడో పని గుర్తు చేయడం మర్చిపోలేదు అనుకోండి ...అది వేరే విషయం ...
పెళ్లయిన కొత్తలో ..." మీకు ఇంగ్లిష్ బాగా వచ్చు కదా ...నాకు రోజుకో ఇంగ్లిష్ పదం నేర్పించండి ...." అని అడిగా మా వారిని ...
అన్నప్రాసన రోజే ఆవకాయ వేసినట్టు ..."procrastination" అనే పదం నేర్పించారు ...
అప్పుడనుకోలేదు ....ఆ పదానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్ అని ...
ఆ తర్వాత రెండో పదం ఇంతవరకు నేర్పించలేదు ....అడిగే ధైర్యం నేనూ చేయలేదు.!😇🙏