Thursday, December 30, 2021

శ్యామ్ సింగ రాయ్...

 శ్యామ్ సింగ రాయ్...

ఈ సినిమా టికెట్స్ బుక్ చేసాక ...లాస్ట్ మూమెంట్ లో ఆ రెండు గంటలు ధియేటర్ కి వెళ్లి ఏం చూస్తాంలే క్యాన్సిల్ చేసేద్దామా అనుకున్నా ...సినిమా టైం లో ఒక గంట ముందు వరకు క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది ...
కానీ నా డాటర్ కూడా వస్తాను అంది సినిమాకి ....సరేలే పిల్లలను డిసప్పోయింట్ చేయడం ఎందుకు నా కోసం అని ....సినిమాకి వెళ్ళా ...
కానీ వెళ్ళాక అనిపించింది ....మంచి పని చేశాను ....క్యాన్సిల్ చేయకుండా అని ...
కొన్ని సినిమాలు బాగుంటాయి ....అందరికీ నచ్చుతాయి ....కానీ సినిమా చూసినంత సేపు ...లాజిక్ మిస్సవుతుంది ....అన్ని ప్రశ్నలే ....
కానీ కొన్ని సినిమాలు చూసినంత సేపు ....లాజిక్ అనే పదం ఒకటి ఉందని గుర్తే రాదు ...
ఇది నిజమా కాదా అనే ధ్యాసే ఉండదు ...
అది నిజమే అని నమ్మాలనిపిస్తుంది ...అదే నిజం అని నమ్మించాలనిపిస్తుంది ....నిజం కాదన్న వాళ్ళని నిజంగా ఒకటిచ్చుకోవాలనిపిస్తుంది ...
అందుకే పునర్జన్మ నిజమా కదా ....అనే ఆలోచన పక్కన పెట్టి ...కాసేపు నిజమని నమ్మేసి ...సినిమా చూసేస్తే ....సినిమా అద్భుతం ...అని చెప్పొచ్చు ...
నాకైతే సినిమా చాలా నచ్చింది ...
మనం మన తరవాత తరాలకు .....మన సంస్కృతి ...మన సంప్రదాయాలు ...మన చారిత్రక సంపద ....ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటాం .....
కానీ ఇవన్నీ మనకే తప్పుల తడకలుగా కనిపిస్తే ....వాటిల్లో తప్పులన్నీ పెంచి పోషిస్తూ ఉంటే...వాటిల్లో ఉన్న మూఢత్వాలను స్వార్ధ ప్రయోజనాల కోసం సమర్ధించుకుంటూ పోతే ...ఒక దశలో ...మన సంస్కృతికి ....మన సంప్రదాయాలకు మనమే దూరంగా బ్రతుకుదాం అనిపించేంత అసహ్యం వేస్తుంటే ....తరవాత తరాలకు మనమేం ఇస్తాం ....?!
అదే ....పరిస్థితులకు బానిసలై ఏర్పడిన దురాచారాలను ....పరిస్థితులు మెరుగుపడ్డప్పుడైనా నిర్మూలించుకుంటూ పోతే ....ఒక స్వచ్ఛమైన ...ఆదర్శవంతమైన సంప్రదాయాలను భావి తరాలకు పరిచయం చేసిన వాళ్ళమవుతాం ...
ఇప్పుడు నేను వ్రాసిన దానికి సినిమాకి ఏం సంబంధం లేదు ....
సినిమా చూశాక కలిగే ఆలోచనలు మాత్రమే వ్రాశాను ....
సినిమా వీటన్నిటికి అతీతం ....సినిమాని ఒక అద్భుత కావ్యంగా మలిచాడు దర్శకుడు ....మాటల, పాటల, కథా రచయితలూ దానికి ప్రాణం పోశారు ....
ఇక నటీ నటులైతే చెప్పాల్సిన అవసరం లేదు ....నట వర్గం కనిపించలేదు ....
పాత్రలు మాత్రమే కనిపించాయి ....
సినిమా తప్పక చూడండి...
కుదిరితే... నేను నా డాటర్ వచ్చాక (ఇప్పుడు హవాయి ట్రిప్ లో ఉంది )....అప్పటికి ఈ సినిమా ధియేటర్ లో ఉంటే ....టికెట్స్ బుక్ చేసి మరీ సినిమాకి పంపిస్తాను ....
అసలే మా ఇంట్లో నాని / సాయిపల్లవి ఫాన్స్ ఎక్కువ ...!😍👍🌟🌹

Monday, December 27, 2021

అన్ని ఒకటో రెండో ....నేను మైంటైన్ చేయగలిగినన్ని ఉండాలి ....

 ఇవ్వాళ నా జీన్ ప్యాంటు చిరిగిపోయింది ...

కానీ ఆ చిరిగిపోయిన ప్యాంటు తోనే ...మధ్యాహ్న్నము వరకు ఉండాల్సి వచ్చింది ...
ఎలాగో ఎవరూ చూడకుండా నడిచి ...కవర్ చేసుకున్నా అనుకోండి ...
ఆఫ్కోర్స్ ఎవరైనా చూసినా ఇంక చేసేదేం ఉంది ...లైట్ లే అనుకున్నా ...
అయితే ...అసలు అది చిరిగిపోయిందాకా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది శ్రేయోభిలాషుల ప్రశ్న ...
దానికి నా దగ్గర సమాధానం లేదు ....
అప్పుడు....చిరిగిన ప్యాంటు సాక్షిగా మరోసారి నా మనస్తత్వాన్ని పునః సమీక్షించుకున్నా ....
మొన్న థాంక్స్ గివింగ్ టైం లో ....పిల్లలు ...."మమ్మి నీకు కూడా కొన్ని షర్ట్స్ ఆర్డర్ చేయమంటావా ...మంచి ఆఫర్స్ ఉన్నాయి ..." అడిగారు ....
"చూద్దాం లేరా ....అయినా అవసరం అయినంతవరకు ఉన్నాయిగా ....అవి పాడై పోయాక చూద్దాంలే ..." చెప్పా ....
అయినా ఊరుకోక ఓ రెండు మూడు ఆర్డర్ చేసారు ...
వేసుకుని చూడడం ....వాళ్లేమో ...ఏ యాభై / వంద డాలర్లో చెప్పడం ....ఇప్పుడు ఎందుకులేరా ....ఆఫర్స్ ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు ...తర్వాత తీసుకుంటాలే ...రిటర్న్ చెయ్యండి అనడం ....
తర్వాత మరో రోజు నా డాటర్ ఒక ప్యాంటు ఆర్డర్ చేసుకోవడం ....అది మరీ కళ్ళు చెదిరే రేంజ్ లో ఉండడం ....ఎంతరా అని అడగడం ....200 డాలర్లు అని చెప్పడం ....నీకు కూడా ఒకటి కావాలా అని నన్ను అడగడం ...వామ్మో ...నాకొద్దురో అని నేను అనడం ...తర్వాత కొన్ని ఫ్రాక్స్ బాగున్నాయని నాకు చూపించడం ....అవి కావాలా అని అడగడం ....ఇప్పుడొద్దులేరా అనడం ....
ఈ తరహా సమాధానాలతో పిల్లలు విసిగిపోయి ...చివరకు నన్ను అడగడం మానేసి ....వాళ్ళే వాళ్ళకోసం ఏవో ఆర్డర్ చేసుకుని సంబరపడ్డారు ....
మరో సందర్భంలో నా డాటర్ ....మమ్మి నీ దగ్గర ఎక్స్ట్రా హ్యాండ్ బాగ్ ఉందా అని అడగడం ....
నాకున్న ఒక్క హ్యాండ్ బాగ్ చూపించి ....అదొక్కటే ఉందిరా నా దగ్గర అనడం ....
ఇంకో సందర్భంలో మ్యాచింగ్ చెప్పులు కోసం చూడడం ....నాకున్న రెండు జతల చెప్పులు తిప్పి తిప్పి వేసుకోవడం ....
ఇలా ...షూస్ ఒక జత ....చెప్పులు ఒక జత ...కూలింగ్ గ్లాస్సెస్ ఒకటి ....ఫేస్ క్రీం ఒకటి ....వాచ్ ఒకటి ....పర్స్ ఒకటి ...
నాకు అన్ని ఒకటో రెండో ....నేను మైంటైన్ చేయగలిగినన్ని ఉండాలి ....
అంతకంటే ఎక్కువ నేను కొనను ....కొనడం ఇష్టం ఉండదు ....
షాప్ కి వెళ్ళినప్పుడు ఏవో కొత్త మోడల్స్ ఉంటాయి ....అవి బాగా నచ్చుతాయి ....కానీ వెంటనే ...అయ్యో ఇంట్లో ఒకటి ఉందిగా ...అది పాడైపోయాక కొనుక్కోవచ్చులే అనుకుంటా ...
అలాగే జీన్స్ కూడా నాకు రెండే ఉన్నాయి ....అవి పాడైపోయాక కొనుక్కోవచ్చులే అనే ఆలోచన ...
ఇవ్వాళ దానికి రోజులు చెల్లిపోయాయి ...
నాకెందుకో ఎక్కువ ఉంటే ....వాటిని మైంటైన్ చేయలేక ...అవి నాకు బరువుగా అనిపిస్తాయి ...
అభద్రతా భావం కలుగుతుంది ...
బహుశా కొంతమందికి ఎక్కువ లేకపోతే అభద్రతా భావం ఉండొచ్చు ...కాదనలేను....
ఎవరిష్టం వాళ్ళది ...
నా జీవితం ఎలా ఉండాలని నేను కలలు కంటానంటే ....నా నిత్యావసర వస్తువులు ఒక సూట్ కేస్ లో పట్టే విధంగా ఉంచుకుని ....ఎప్పుడైనా ...ఎక్కడికైనా వెళ్లిపోగలగాలి ....
మరి ఇదంతా వ్రాసుకున్నా కదా ....ఏమైనా మార్పొస్తుందా అంటే ....
మారాల్సిన అవసరం ఇప్పటివరకు కనిపించలేదు ....నా మనస్తత్వం అందరిలా ఉండాలని ఏం లేదుగా ...ఊరికే రివ్యూ కోసం వ్రాసుకున్నా ...నేనింతే ...
అయితే ఈ మధ్య కొన్ని చీరలు మాత్రం కొన్నా ....కొన్నప్పుడు సంతోషంగానే అనిపించింది కానీ ...తర్వాత అంత బాగా అనిపించలేదు ....అనవసరంగా అవసరం లేకుండా కొన్నానే అని బాధపడ్డా ...
నా దగ్గర అవసరానికి మించి ఏదైనా ఉన్నాయి అంటే ...అవి చీరలు మాత్రమే ...
నా మనస్తత్వం ఎందుకిలా ఉంది అనేది ...నేనే రీసెర్చ్ చేసుకోవాలి..
ఎప్పుడో చిన్నతనంలో స్కూల్ లో ఆటలాడుతూ స్కర్ట్ చిరిగిపోతే ....కనపడకుండా దాచుకుంటూ ఇంటికొచ్చిన గుర్తు ....
ఇదిగో మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా ....
ఇప్పుడు అర్జెంటుగా ఒక జీను ప్యాంటు కొనుక్కోవాలి ....అప్పటివరకు ...ఒకటే ప్యాంటు మరి ...!😇😊



Saturday, December 25, 2021

మా అయన వంట చేయాలి అని అందుకే నేను కోరుకోను ....

 మొన్నొక రోజు ..."మిరియాల చారు పెట్టమంటావా " అడిగారు మావారు ....

అంటే ....ఈ మధ్య నా డాటర్, వాళ్ళ డాడీ కి ట్రైనింగ్ ఇచ్చి మరీ కొన్ని వంటలు నేర్పిస్తుంది ...
అంటే కొన్ని అయినా నేర్పిస్తే మమ్మి కి హెల్త్ బాగాలేనప్పుడు వండి పెడతారని తన ఆశ ...(అది నాకు అర్ధం అయింది )
"చూసావా ...తను ఎంత బాగా నేర్పిస్తుందో ...నువ్వెప్పుడైనా ఇలా నేర్పించావా ...." అన్నారు నా వైపు చూస్తూ ...
"ఆ శభాష్ శభాష్ ...బాగా నేర్చుకోండి ...నేను ఎప్పటికీ మీకు ఇలా నేర్పించలేను ....నేను ఏదైనా చెబితే తమరు చెవిదాకా రానిచ్చింది ఎప్పుడు ...." చెప్పా ...ప్రశాంతంగా ...
ట్రైనింగ్ లో భాగంగా ....ఈ మిరియాల చారు పెట్టడం నేర్చుకున్నారు ....ఈ మధ్య ...
నాకు అప్పుడే ఆరోగ్యం బాగోలేక ...నా పాటికి నేను పడుకుని ఉంటే ....అప్పుడు మిరియాల చారు అఫర్ వచ్చింది ...
ఉఊ అనే ఓపిక లేక ...ఊ అని మూలిగా ...
ఇంకేముంది ....చారు కార్యక్రమం షురూ అయ్యింది ....
ఆ తాలింపులో ఏం వేస్తారో ఏమో గానీ ....బాత్ రూమ్ లో కి వెళ్లి దాక్కున్నా ...కోరు తప్పించుకోలేను ...
నాకు ఆ తాలింపు కోరు అస్సలు పడదు ....
అయినా ఏదో కాసేపులే ...అని ముక్కు మూసుకుని భరించేసి ...ఎలాగో ఆ చారు పెట్టాక ....కాస్త నాలుగు మెతుకులు ఎంగిలి పడ్డా ...
"ఇంకాస్త చారు పోసి ఇవ్వనా ...."అడిగారు ....
జలుబు చేసిన గొంతుకి కాస్త హాయిగా అనిపించిందేమో ....కాసిన్ని ఇవ్వండి ....అని అడిగా ....
దానికి ..."డాడీ మీరు చేసిన వంట మమ్మి రెండోసారి అడిగి మరీ తాగుతుంది ...గుడ్ జాబ్ డాడీ" అనడం ....
నాకు రసం పెట్టడం వచ్చేసిందోచ్ అని ....ఈయన గంతులు వేయడం ఎలాగో అయిపొయింది ....
రెండో రోజు ....స్టవ్ దగ్గరికి పోదును కదా ....
ఆ రసం పెట్టడం ఏమో గానీ ....స్టవ్ మాడబెట్టిన వైనానికి అది క్లీన్ చేసేసరికి ...నా చేతులు అరిగి పోయి ....తాతలు దిగొచ్చారు ....
వంట చేయడం అంటే ...ఎవరో ఒకరు నేర్పిస్తారు ...
క్లీన్ చేయడం ఎవరు నేర్పిస్తారు ....
చిన్న బేసిక్ థింగ్ ...మన చుట్టూ ఉన్న పరిసరాలు మనం శుభ్రం చేసుకోవాలి ...
మనం తిన్న కంచాలు మనం కడుక్కోవాలి ...
వంట చేసాక ...పొయ్యి కడుక్కోవాలి అనేది ...
అది ఎప్పటికి నేర్చుకుంటారో ....
ముఖ్యంగా మగాళ్లు ....అదీ మా అయన వంట చేయాలి అని అందుకే నేను కోరుకోను ....
చేస్తాను అంటే ....భయం వేసేది కూడా అందుకే ....
పస్తు అయినా పడుకోవడానికి రెడీ కానీ ....తరువాత చేసుకునే క్లీనింగ్ తలచుకుని వణుకు పుడుతుంది ....
వంట చేయడానికి నాకు అరగంట పడితే ... ఆయనతో వంట చేయించుకుని అది క్లీన్ చేసుకోవడానికి రెండు గంటలు పడుతుంది ....
కాబట్టి నాకు, వంట చేసుకోవడమే బెటర్ ఆప్షన్ ....
అందుకే ..., పులిబొంగరాలు నేను చేశాను ....పుదీనా చట్నీ నా డాటర్ చేసింది ...
ఇద్దరం హాయిగా తినేశాం ..!😇







Friday, December 17, 2021

నిన్న సాయంత్రం ..

 నిన్న సాయంత్రం ...మా ఆయన హఠాత్తుగా చేయాల్సిన పనులన్నీ క్యాన్సిల్ చేసి ...నీరసంగా సోఫాలో కూర్చున్నారు ...

నేను గిన్నెలు కడుక్కుంటూ ...కిచెన్ శుభ్రం చేసుకుంటున్నా ....
"ఏం ఎందుకు ....పనులన్నీ క్యాన్సిల్ చేసారు ...." అడిగా ...
అది లేదు ఇది లేదు అని ఏదో చెప్పారు ....
"అది వంకలు సృష్టించుకోవడం అంటారు ....నిజంగా చేయాలని ఉంటే ఇన్ని వంకలు చెప్పరు ఎవరూ" చెప్పా ...
"నీకేం నువ్వు అలాగే చెప్తావు" సీరియస్ మొహం వేసుకుని చెప్పారు ....
"అక్కడికి పనులన్నీ మీరొక్కరే మీదేసుకుని చేస్తున్నట్టు ....మేమందరం ....పొద్దుటినుండి క్లబ్బులకి పబ్బులకి బలాదూర్ తిరిగొచ్చినట్టు ....ఈ డ్రామా డైలాగులే తగ్గించుకుంటే మంచిది ..." చెప్పా ...నా పని నేను చేసుకుంటూ ...
సరే నేను నా పనంతా చేసుకుని ....కిచెన్ అద్దంలా చేసుకుని .వంట చేయడం మొదలు పెట్టా ....
ఏంటో కిచెన్ శుభ్రంగా ఉంటే గానీ నాకు వంట మొదలుపెట్టాలి అనిపించదు ....అది నా బలహీనత ...
చికెన్ బిర్యానీ ఓవెన్ లో పెట్టి ...కాసేపు వర్క్ చేసుకుని ...బిర్యానీ రెడీ అయ్యాక ....పిల్లలని పిలిచా ...డిన్నర్ చేయడానికని ...
అంతలో ...అప్పటిదాకా అంత ఆపసోపాలు పడుతూ కూర్చున్న మనిషి ....హడావిడిగా ....ఎవరో ఐసియు లో ఉన్నట్టు ...ఫోన్ మాట్లాడుతూ బయటకి పోయారు ...
మేం ప్లేట్ లో బిర్యానీ పెట్టుకుని ....వేడి వేడిగా తింటారు కదా అని ..."డాడీ బయటికెళ్లారనుకుంటా ...పిలవండిరా" అని పిల్లల్ని అడిగా ...
"డాడీ సినిమాకి వెళ్లారు ..." చెప్పారు పిల్లలు ...
"ఏం సినిమా .." అడిగా ...ఆశ్చర్యంగా ...
"అదే పుష్ప ....ఇవ్వాళ ప్రీమియర్ షో ఉంది వెళ్తున్నా అని చెప్పారు కదా ..." పిల్లలు ...
అప్పుడెప్పుడో అన్నది గుర్తొచ్చింది ....
ఓహో అందుకా పనులన్నీ ఎగ్గొట్టి ....కుంటి సాకులు చెప్పింది ...అనుకుని ....నేను ... పిల్లలతో కలిసి ..శుభ్రంగా బిర్యానీ తిని ....నిద్రపోయా ...
పొద్దున్నే సినిమా గురించే నోరెత్తలేదు ...నేనూ అడగలేదు అనుకోండి ...
ఇందాకెప్పుడో సినిమా గురించి పిల్లలతో చెప్తుంటే విన్నా ...బాగాలేదని ...
అంత నాటకాలేసి ..పనులన్నీ ఎగ్గొట్టి ....ఫ్యామిలీని కూడా తీసుకెళ్లకుండా ....సినిమాకి పొతే ఎందుకు బాగుంటది ....చెప్పా ...
(నా డైలాగ్ కి సినిమా ఫ్లాప్ కి ఏం సంబంధం లేదని సినిమా ప్రియులకు హెచ్చరిక ....)
మా ఆయన బుద్ధి..!😇🤔😀😂

Friday, December 3, 2021

నా ఇరవై ఏళ్ళ వయసు వచ్చేవరకు ...(20)

 నా ఇరవై ఏళ్ళ వయసు వచ్చేవరకు ...(20)

భర్త మీద ఆధారపడం ఎలా ....భర్తని చూసుకోవడం ఎలా ....భర్త కి వండి పెట్టడం ఎలా ....భర్త చెప్పినట్టు నడుచుకోవడం ఎలా ....భర్త అడుగు జాడల్లో నడవడం ఎలా ....భర్త మాట వినడం ఎలా ....భర్త చేత మంచి భార్య అనిపించుకోవడం ఎలా ....భర్త ఇష్టపడేలా ప్రవర్తించడం ఎలా ....భర్త ఏదైనా సాధిస్తే ఆనందపడడం ఎలా ....ఇంకా భర్త ...భర్త ....భర్త ...జీవితాన్ని తీర్చి దిద్దడం ఎలా ....
నా ఇరవై ఒకటో ఏడు నుండి ....నలభై ఏళ్ళు వచ్చేవరకు ....( 20 - 40)
భర్త ....భర్త ....భర్త ....తో పాటు ...
పిల్లలను పెంచడం ఎలా ...పిల్లలను చూసుకోవడం ఎలా ...పిల్లలకి వండి పెట్టడం ఎలా ....భర్తని పిల్లల కోసం భరించడం ఎలా ...భర్త మీద ఆధారపడకుండా ఉండడం ఎలా ....పిల్లలకు అడుగులు నేర్పించడం ఎలా ...పిల్లలు ఇష్టపడేవి చేసి పెట్టడం ఎలా ....పిల్లలచే మంచి తల్లి అనిపించుకోవడం ఎలా ....పిల్లలు ఏదైనా సాధిస్తే ఆనంద పడడం ఎలా ....ఇంకా ....పిల్లలు ....పిల్లలు ....పిల్లల ....జీవితాల్ని తీర్చి దిద్దడం ఎలా ....
నా నలభై వ ఏడు నుండి ..... (40 - forever)
పిల్లలు ....పిల్లలు ....పిల్లలతో పాటు ....
నేను ఏడవడం ఎలా ....నవ్వడం ఎలా ....పాకడం ఎలా ....నడవడం ఎలా ....పరుగులు పెట్టడం ఎలా ....చదువుకోవడం ఎలా ...పని చేసుకోవడం ఎలా ....నన్ను ఇష్టపడేలా నేను బ్రతకడం ఎలా ....నాకు నేను నచ్చేలా జీవించడం ఎలా ... ఇంకా నా జీవితాన్ని తీర్చి దిద్దుకోవడం ఎలా ....
నేను ..నేను ...నేను ....
ఇదిలా సాగిపోతుందో ....ఎక్కడైనా ఆగిపోతుందో ....లేదా మలుపులు తిరుగుతుందో ....కాలమే సమాధానం చెప్పాలి .....!
Happy Weekend!

Saturday, November 27, 2021

ఆమె పుట్టుక లోపం ....ఆమె పెరుగుదల లోపం , ఆమె జీవితం లోపం , ఆమె రూపం లోపం, ఆమె చర్యలు లోపం ...అసలు ఆమె ఒక లోపం ...

మన సమాజం , సినిమాలు ...ఎందుకో చిరకాలం నుండి లోపాలను ఎంచడంలో ...లోపాలు ఎత్తి చూపడంలో వివక్ష చూపించింది అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ...
ఇప్పటికీ ఈ వివక్ష నేను గమనిస్తూ ఉంటాను ...అది వేరే విషయం ....
మా అత్తయ్య అనేది ఎప్పుడూ ..."మా లక్ష్మికేమ్మా ....పుట్టినప్పుడే ...నా చేతుల్లో కి తీసుకున్నా.. మమ్మ, తెల్ల జాంకాయలా ఉండేది ...మహా లక్ష్మే ....అనేది ..."
"అది కాస్త నలుపనే కానీ ...దాని ముక్కు మొహం బంగారం ...."
"అది తెల్లటి తెలుపు ....దాన్ని ఎవరైనా ఎగరేసుకు పోతాడు ..."
"వాడికేం ...మగపిల్లాడు ....కాస్త నలుపైతే ...ఏం ...." ఇలా పుట్టినప్పుడే ....రకరకాల మాటలు వినేదాన్ని ...
ఇక పెరిగేకొద్దీ ....ఈ పొగడ్తలు / వివక్షలు వింటూనే ఉండేదాన్ని ...
ఆ ముక్కు చూడు ...మూరెడు పొడుగు పెరుగుతుంది ...అమ్మగారికి ...అని మా తాతయ్య ఎగతాళి చేసేవాడు కొన్నిసార్లు ....
ఏదో సరదాగా అన్నా ...ఇంటికొచ్చి అద్దంలో వందసార్లు చూసుకునేదాన్ని ....
నిజంగానే అంత పొడుగయిందా ....అయినా దాన్ని నేనెలా తగ్గించగలను ....ఈసారి అన్నప్పుడు సమాధానం చెప్పాలి అని మనసులో అనుకునేదాన్ని ....
నా ముందు పన్ను ఒకటి ఎత్తుగా ఉండేది ....అని ...పళ్లెత్తు అని ఒకరు ఒకసారి అన్నారని ...పౌరుషం వచ్చేసి ...
"వాళ్ళకి అన్ని సరిగ్గా ఉన్నాయా ...అయినా నా పళ్ళు నా ఇష్టం ..."అని తిట్టిపోశా ...
అలాగే పెళ్లి చూపుల్లో ...శల్య పరీక్షలు ...అమ్మాయిలకు తప్పనిసరి ...(ఈ కాలంలో కాస్త తగ్గి ఉండొచ్చు )
రంగు , ఎత్తు , నడక , గొంతు ...ఇలా ఒక వ్యాపార వస్తువుని చూసినట్టు చూస్తారనడంలో ఏ మాత్రం అతి శయోక్తి లేదు ...
మరి అబ్బాయిలకో అంటే ...చాలా లోపాలు సంపాదనలో కొట్టుకుపోతాయి ...
ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అనే చూస్తారు ...
ఎంత డబ్బు సంపాదిస్తే అన్ని లోపాలు కొట్టుకుపోతాయి ...
సినిమాలూ అంతే ...
స్త్రీ లోని లోపాలను మాత్రమే చూపించింది ....అది పురుషుడు క్షమిస్తే ...అంగీకరిస్తే అదే పదివేలు అనే స్థితికి తెచ్చింది ...
స్త్రీ , పురుషుడి లోపం గురించి అడగొచ్చు ...మన లోపాలను ఎత్తి చూపినప్పుడు నీ లోపాలు కూడా నీకు ఒక మనిషిగా ఉంటాయి ...కాబట్టి నాలో ఉన్నవన్నీ లోపాలని చిత్రీకరించొద్దు అని అడగొచ్చు అని ....తరతరాలుగా స్త్రీ మర్చిపోయింది ....
స్త్రీ ...ఆమె ప్రమేయం లేకుండా పురుషుడి బలాత్కారానికి గురైతే ....తప్పు ఆమెదే అనడం ....జీవితకాలం శిక్షించడం ...వేలెత్తి చూపడం ....వెలివేయడం ...ఆమెకి పెళ్లి చేసుకునే అర్హత లేదని ...ఆమె అపవిత్రమైపోయిందని ...ఇక ఆమె బ్రతుకు ని ఉద్ధరించే పురుషుడు దేవుడని ...
ఇలాంటి అపరాధ భావము స్త్రీ కి సృష్టించిన ఘనత ...మన సమాజం , సినిమాలదే ...
అలాంటి దారుణానికి గురైన వారికి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గం అనే భావం కలిగించడం కూడా మన సమాజానికే చెల్లింది ....
పెళ్లయ్యాక కూడా ....భర్త తన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి భార్యనే అడుగడుగునా అవమానిస్తూ ....ఆమె లో ఉన్న లోపాలను ....(అంటే సమాజం నవ్వుకోదగినవి ...) ఇతరుల ముందు ప్రస్తావిస్తూ ...ఇది మగవాడిగా నా జన్మ హక్కు అని జీవిస్తూ ఉంటాడు ...
అదే తన లోపాలు భార్య ప్రశ్నిస్తే ...విడాకుల ఆయుధం ఉపయోగిస్తాడు ...
నాకు అసలు లోపాలనేవి ఉంటాయా అని విర్రవీగుతాడు ....
ఆమె పుట్టుక లోపం ....ఆమె పెరుగుదల లోపం , ఆమె జీవితం లోపం , ఆమె రూపం లోపం, ఆమె చర్యలు లోపం ...అసలు ఆమె ఒక లోపం ...
అతని పుట్టుక వరం ...అతని పెరుగుదల సమాజం ...అతని జీవితం అతనిష్టం ...అతని రూపం ఆరాధనీయం ...అతని చర్యలు పొగడ్తలకు అనుగుణం ...అసలు అతనే ఓ అద్భుతం ...
ఇదంతా ఒకప్పుడు...
ఇప్పుడు కాలం మారుతుంది ...
ఆడవాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి ...
మగవాళ్ల ఆలోచనలు కూడా మారక తప్పడం లేదు ...
తదనుగుణంగా ....సమాజం ...సినిమాలు కూడా తమ పంధా మార్చుకోవాల్సి వస్తుంది ....ఇదంతా ఆహ్వానించదగ్గ పరిణామం ....
ఒకప్పుడు ...ఇద్దరు భార్యలున్న సినిమాలు ...ఆడవాళ్లు స్వచ్చందంగా అంగీకరించారు ...
మగవాళ్ళు ఏం చేసినా అడగకూడదు అని ఆడవాళ్లే జై కొట్టారు ....
మగవాళ్లకు లోపాలుంటాయా ....వాళ్ళు దేవుళ్ళు అన్నారు ....
ఇప్పుడు అలా కాదు...
ఇప్పుడు మగవాళ్ల లోపాలను కూడా చర్చించగలిగే సినిమాలు తీస్తున్నారు ...
ఇలాంటి క్రియేటివ్ సినిమాలకు ఈ పాండమిక్ ప్రాణం పోసింది ....
లోపాలు అందరికీ సహజం అని సమాజం అర్ధం చేసుకుంటుంది ....
ఇక క్రమేణా సమాజంలో వివక్ష తగ్గుతుందని ఆశించొచ్చు అనిపిస్తుంది ....
అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ....
30 weds 21 ..., ek mini katha..., nootokka jillala andagadu....
మూడూ విభిన్నమైన కథా చిత్రాలు ...
చూడదగిన చిత్రాలు ...!

Thursday, November 11, 2021

ఉదయాన్నే నిద్ర లేవగానే మా ఆయన్ని నేను కాఫీ అడుగుతా ...

 ఉదయాన్నే నిద్ర లేవగానే మా ఆయన్ని నేను కాఫీ అడుగుతా ....ఇద్దరం కలిసి కాఫీ తాగొచ్చు అని ...

గొడవ పడ్డప్పుడు అడగను ....అయన కూడా అంతే ...ఎవరి కాఫీ వాళ్ళు పెట్టుకుని తాగుతాం ...
ఈ రోజు కూడా ఎప్పటిలాగే కాఫీ పెడుతూ "నాకో ప్రశ్న ఉంది అడగొచ్చా ...." అడిగారు ... నేనేదో ఆయనకు గైడ్ లాగా ....
పొద్దునే నిద్ర లేవడమే నాకు కష్టం ....బద్దకంగా అనిపిస్తుంది ...సూపర్ షార్ప్ గా ఆలోచించే తెలివి నా బుర్ర కలిగి ఉండదు ...
ఆయనేమో కోడి కంటే ముందే లేచి కూర్చుని ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటి గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు ...
రోజూ ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటారు అనుకోండి అది వేరే విషయం ..
అడగడం ఓకే కానీ ...వాటన్నిటికీ నా మట్టి బుర్ర దగ్గర సమాధానం వెతకడమే నాకు అర్ధం కాదు ...
సరే టాపిక్ లోకి వస్తే ....
"నాకు సడెన్ గా ఏదైనా అయితే ....నువ్వు బాధపడతావా ...ఏడుస్తావా ...." అడిగారు ....
నేను షాకవ్వలేదు ...ఆలోచించలేదు ...ఇలాంటి ప్రశ్నలు నాకు మాములే ....
"బాధపడను ....ఏడవను ...." చెప్పా ...కూల్ గా ...
"అస్సలు బాధపడవా ..." ఆశ్చర్యంగా అడిగారు ...
"ఏం బాధ లేదు ...ఎవరు పోవాల్సొస్తే వాళ్ళు పోవాలి ....ఎందుకు బాధపడాలి" అడిగా
"కనీసం నేను సంపాదించే డబ్బులు పోతాయని అయినా బాధపడాలి కదా" అడిగారు ....
"అవును ...కానీ, అవన్నీ తర్వాత గుర్తొచ్చి బాధపడతానేమో ...మీరు, వెంటనే ఏం చేస్తావ్ ...అని అడిగారు ...నేను దానికి మాత్రమే సమాధానం చెప్పా ...." చెప్పా ....
"మరి నీకేదైనా అయితే నేను బాధపడతానని అనుకుంటున్నావా ...." అడిగారు ....
"అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు ....ఆలోచించలేదు ...మీరెలా ఫీలయితే నాకెందుకు ...నేనేమన్నా చూస్తానా ...కావాలంటే హాయిగా పండగ చేసుకోండి ...ఐ డోంట్ కేర్ ..." చెప్పా ...
"పొద్దున్నే నువ్వు నన్ను హర్ట్ చేసావు ....నువ్వు చాలా బాధపడతావు అని అనుకుంటూ ఉన్నా ...కనీసం అబద్ధం అయినా చెప్పొచ్చుగా ...." చెప్పారు ...కాఫీ ఇస్తూ ....
"ఇలాంటి డ్రామా ఫీలింగ్స్ ...సినిమాలు చూసి డెవలప్ చేసుకోవడం వలెనే ....చాలామంది ....నేను పోయాక నా కోసం నా వాళ్లంతా ఎంతో ఏడుస్తారు ....ఎంతో బాధపడతారు ....వాళ్ళకి నేను ఉన్నప్పుడు నా విలువ తెలియదు ....అని ఊహించుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ...
ఎందుకొచ్చిన డ్రామా ఫీలింగ్స్ ....పొద్దున్నే లేచి మీరు చేసే పని ఇదేనా ...హాయిగా కాఫీ తాగి పని చేసుకోక ..." కసిరేసి ....నా దారిన నేను పోయా ...!😇😇😇
Happy Weekend All!

Thursday, October 28, 2021

వంట చేసుకోగలిగి ఉండి ....ఎవరిమీదా ఆధారపడకూడదు ...

 వంట చేసుకోగలిగి ఉండి ....ఎవరిమీదా ఆధారపడకూడదు ...

ఇవ్వాళ నేను మాటల సందర్భంలో ఫ్రెండ్స్ కి ఒకటి రెండు సార్లు ..."చెట్లకి కాసిన్ని వంకాయలున్నాయి ....కోసి ...కూర వండాలి ...." అని చెప్పా ....
చెప్పడం వలనో ఏమో ...నా నాలుక వంకాయ కూర మీద నాకు తెలియకుండానే ఆశలు పెంచుకుంది ....
సరే ఇంటికొచ్చాక ...షరా మాములే ...
ఇంటి పనుల్లో బిజీ అయిపోయా ...
అయినా వంకాయలు కోసి కిచెన్ లో పెడదాం అని ...అవి కత్తిరించడానికి కత్తెర కోసం వెతికా ....
ఎప్పుడు ఏది అవసరమో అది కనపడదు అనేది యూనివర్సల్ రూల్ ....
మా ఆయన మధ్యాహ్న్నము బెండకాయలు కోసిన ఆనవాలు కనిపించింది ....
కత్తెర ఎక్కడ పెట్టారు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేకపోయారు ....
తర్వాత క్లాస్ ఒకటి ఉంటే అటెండ్ అయ్యాక ....టైం చూస్తే చీకటి పడింది ....
వంకాయలు ఉన్న ప్లేస్ లో లైట్ లేదు ....ఒక లైట్ అక్కడ పెట్టండి అని ఎన్నోసార్లు మావారికి చెప్పా ...
అది జరగని పని అని నాకూ ...దేవుడికి తెలుసు ....
ఏం చేద్దామ్ ...వంకాయ లేదు టెంకాయ లేదులే పడుకుందాం అనుకున్నా ....
కానీ నా నాలుక ఊరుకోలేదు ...
సరే పిల్లల బొమ్మ కత్తెర ఒకటి చిన్నది దొరికితే అది తీసుకుని చీకట్లో గార్డెన్ లోకి వెళ్ళా ....
తడుముకుని ఒక వంకాయ పట్టుకుని ....ఆ చిన్న కత్తెర తో కట్ చేయగానే ఫట్ మని కత్తెర విరిగిపోయింది ....
ఇక కోపం వచ్చి ....వంకాయలు చేత్తోనే కొన్ని తెంపేసా ....
ఇంట్లోకొచ్చి ....కూర చేశా ..
మా ఆయన వాకింగ్ కి వెళ్లి వచ్చి ...."నేను బెండకాయ కూర చేద్దాం అనుకున్నా ....నువ్వు వంకాయ చేసేసావా" అన్నారు ....
"మీరు అనుకుంటారు ....కానీ చెయ్యరు ....అవి అప్పటికల్లా ముదిరిపోతాయి ....ముదిరిన కాయలు చేస్తారు .....అవి నేనెటూ తినలేను ...."చెప్పా ....
"నాకు అన్నం వద్దు ....నీకు పెట్టమంటావా" అడిగారు ....
ఎదుటి మనిషిని అడిగేటప్పుడు ....కనీసం ...."మనం అన్నం వండుకుందామా" అని అడిగితే...ఇద్దరం కలిసి ఒక ముద్ద వండుకు తిందాంలే అనిపిస్తుంది ....
ముందుగానే ....నాకొద్దు అనే మాట యాడ్ చేస్తే ....నాకు ఒక ముద్ద తిందామనే ఇంటరెస్ట్ పూర్తిగా పోతుంది ....
బయటకెళ్ళి ఏమన్నా తిందాం అంటే కూడా అంతే ....
నాకొద్దు ....నీకు తెమ్మంటే తెస్తా అంటారు ....
నీకు వద్దా లేదా అని నేనడిగానా అని నాకు మండుతుంది ....
ఎదుటివాళ్ళకు ఫుడ్ తిననివ్వకుండా ....ఉన్న ఇంటరెస్ట్ పోయేలా ...అలా మాట్లాడొద్దు అని ఎన్నిసార్లో చెప్పి ఉంటా ....
సరే ఆయనతో నాకెందుకులే అని ....
ఉడకబెట్టిన గోంగూర ఉంటే ....గోంగూర పచ్చడి చేద్దాం అని ...అది కూడా చేసేసా ....
రెండూ విపరీతమైన రుచిగా ఉన్నాయేమో ....నాకు వేడి వేడి అన్నం కావాలనిపించింది ....
ముందు ప్లాన్ ...ఉత్త కూర తినేసి ...పడుకుందాం అని ....
ఒక కప్పు బియ్యం పొయ్యి మీద వేసి ....స్నానం చేసి ....
అన్నం తినే టైం కి ....ఆర్చుకుని తీర్చుకుని వచ్చి .....,
శుభ్రంగా అన్నం పెట్టుకుని ....గోంగూర , వంకాయ వేసుకుని తినేశారు ....
ఆఫ్కోర్స్ నేను కూడా తిన్నా అనుకోండి ....
"నీకు ఇంకాస్త అన్నం పెట్టనా " అడిగారు ...నా ప్లేట్ లో అన్నం అయిపోవడం చూసి ....
"ఇప్పుడు బాగానే అడుగుతారు .....చేసేటప్పుడు ....నాకొద్దు నాకొద్దు అని పాట పాడతారు .....నేను కూరలు చేసేటప్పుడు ....కనీసం ....అన్నం పొయ్యి మీద పెట్టాలని తెలీదూ ...." కడిగేశా .....తనని కాదు ....తిన్న కంచం బాబూ ....
అదన్నమాట కథ ....
వీళ్ళ మీద ఆధారపడితే బొచ్చలో బొమ్మరాయే .....
ఓపికున్నప్పుడు ఒక ముద్ద వండుకున్నామా ....హాయిగా వేళకింత తిన్నామా ....అంతే ...!🙏😇
Like
Comment
Share