Tuesday, February 12, 2019

జీవితంలో మనం ఇంత దూరం ప్రయాణం చేసి ఉంటాం అంటే ....

జీవితంలో మనం ఇంత దూరం ప్రయాణం చేసి ఉంటాం అంటే ...., తప్పనిసరిగా ఎన్నో కష్టాలను, సుఖాలను దాటుకుని వచ్చి ఉంటాం అనేది ...జగమెరిగిన సత్యం ......
-------------------
కొందరి జీవితంలో ఎక్కువ కష్టాలు తక్కువ సుఖాలు ఉండొచ్చు ....
మరి కొందరి జీవితంలో ఎక్కువ సుఖాలు తక్కువ కష్టాలూ ఉండొచ్చు ....
ఇంకొందరి జీవితం అంతా కష్టాల మయమే కావచ్చు ...
అరుదుగా కొందరు, ముందు గోల్డెన్ స్పూన్ పుట్టి తర్వాత వాళ్ళు పుట్టి ఉండొచ్చు ట్విన్స్ లాగా ...
మరో కోణంలో చూస్తే ప్రపంచానికి ఇందంతా ఉత్తదే కావచ్చు కూడా ....
ఆ... అవీ ఒక కష్టాలేనా...అవీ ఒక సుఖాలేనా ...అవి పెదవి విరవొచ్చు ....
లేదా కష్టాలను సుఖాలుగాను ....సుఖాలను కష్టాలుగాను భ్రమించొచ్చు ....అంటే అఫ్కోర్స్ అవి మనం ఉన్నది ఉన్నట్టు చూపించనప్పుడు అనుకోండి ....(చూపించినా కూడా )
--------------------
అయితే ఈ ప్రపంచానికి చూపించడం అనే మాటకొస్తే ....ఇందులో కూడా రకరకాల చిత్ర విచిత్ర మనస్తత్వాలు ఉన్నాయండోయ్ ....
కొందరు మనిషి కనిపించీ కనిపించగానే ఉన్న కష్టాలన్నీ ఏకరువు పెడతారు ....
మరి కొందరు తమ వైభోగాలన్నీ ఎదుటివాళ్ళ కష్టాలను కూడా లెక్కచేయకుండా లెక్కకు మిక్కిలి చెప్పుకుంటూనే ఉంటారు ....
ఇంకొందరు ....మనం పైన చెప్పుకున్నట్టు కష్టాలను సుఖాలుగా సుఖాలను కష్టాలుగా మార్చి చెబుతారు ....
కొందరు ఏమీ చెప్పక మా సంగతులు ఎదుటివారికి ఎందుకులే అని మౌనంగా ఉంటారు ....
అఫ్కోర్స్ .... ఈ చెప్పడం చెప్పకపోవడం అనేది మళ్ళీ, వాళ్ళు ఆత్మీయులా కాదా అనే విషయం మీద కూడా ఆధారపడి ఉందనుకోండి ....
------------------
మరో విధంగా చూస్తే కొన్ని కష్టాలు కాలక్రమేణా మాసిపోయి ....మనకే కష్టాలు కాకుండానూ పోవచ్చు ....
కొన్ని సుఖాలు అతిగా దాపురించి ....మనకే కష్టాలు గానూ మారొచ్చు ....
మన కష్టాలు మనమే ఇతరులకు చెప్పుకుంటే అవి అసలు కష్టాలు ఎలా అవుతాయి అనేది మరో కోణం ....
ఈ ప్రాసెస్ ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలు అయిపోతాయి ...కాబట్టి అసలు విషయానికొస్తే ...,,,
--------------------
నా వరకు నేను కూడా ఏదో నాకున్నంతలో కొన్ని కష్టాలు , కొన్ని సుఖాలను జీవితంలో దాటుకునే ఇంత దూరం వచ్చానని ఈ సందర్భంగా నాకు నేను చెప్పుకోక తప్పదు ....
అయితే నేను, ఈ కష్టాలు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నాలుగు ముక్కలు అక్షరాల్లో వ్రాసుకోవడమో ....లేదా మరీ ఆత్మీయులతో మాట్లాడుతున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు అదీ వాళ్ళు అడిగితే చెప్పడమో....ఇంకా ఆత్మ బంధువులు అయితే ....నాకు చెప్పాలనిపిస్తే చెప్పడమో చేస్తూ ఉంటా ....
కానీ ఫోన్ చేసి మరీ ...అడిగించుకుని మరీ ....ఆవేశంతో ఊగిపోతూ ....అవతలి వాళ్ళు వింటున్నారా లేదా అని స్పృహ లేకుండా ....వాళ్లకి పని ఉందా లేదా పరామర్శించకుండా ....ఆవు వ్యాసం లాగా వాళ్ళేం అడిగినా ..."అనగనగా ఒక ఆవు ....ఆ ఆవుకి నాలుగు కాళ్లుండును ...ఒక తోక ఉండును....తెల్లగా ఉండును ...." అని అయితే మాత్రం చెప్పను ...
ఉదాహరణకు ...మిస్సమ్మ సినిమాలో హీరోయిన్ భూమిక చెప్తూ ఉంటుంది ...."నాకంటూ జీవితంలో ఎవ్వరూ లేరు ....నేను ఒంటరిదాన్ని ......." ఇలా ..
హీరో శివాజీ కి విసుగొచ్చి ...."అబ్బా తెలుసండీ ....మీ చిన్నప్పుడే తల్లిపోయింది ....అందరూ మిమ్మల్ని ఒక బంగారు బాతులా మీ వెనకున్న ఐశ్వర్యాన్నే చూశారు ..." అని విసుక్కుంటాడు ....
కష్టాలు చెబుతూ చెబుతూ పోతూ ఉంటే వినేవాళ్లకు కూడా ఇలాగే విసుగొస్తుంది ....ఏంటిరా బాబూ ఈ కర్మ అని ....
---------------------
నా అభిప్రాయంలో ....కష్టాలు అయినా సుఖాలు అయినా ....మనం ఇతరులతో పంచుకోవాలి అంటే .... ఇతరులు వాళ్ళ జీవితంలో వాళ్లకు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ...మనల్ని గుర్తు చేసుకుని ....అవి మనం ఎలా దాటుకుని వచ్చామో అని..."అరె ...ఇదే సంఘటన వాళ్ళ జీవితంలో జరిగింది కదా .....వాళ్ళు ఈ సందర్భంలో ఎలా ప్రవర్తించారు .....ఎలా ఎదుర్కొన్నారు ....ఎలా భరించారు ....ఎలా ఆస్వాదించారు .....ఎలా దాటుకుని ముందుకు వచ్చారు ....." అని వాళ్లకు ఆలోచన కలిగి ...వాళ్ళు మనకు ఫోన్ చేసి లేదా కలిసి ....వాళ్ళంతట వాళ్ళు మనల్ని అడగాలి ....
"నీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది కదా ....నువ్వెలా ఎదుర్కొన్నావు ....నువ్వెలా భరించావు" అని ....
అప్పుడు మన జీవితపు అనుభూతుల్ని ...మనం వాళ్లకు సవివరంగా .... ..ఏమీ దాచుకోకుండా ....పంచుకోవాలి .....(అభ్యంతరం లేకపోతే)
వాళ్ళు అది స్ఫూర్తిగా తీసుకుని ....అనుసరించడానికి, తెలుసుకోవడానికి , అధిగమించడానికి ప్రయత్నించాలి .....అని అనిపిస్తూ ఉంటుంది
--------------------
నాకు ఇలాంటి సందర్భం ఈ మధ్య కాలంలో రెండుసార్లు ఎదురైంది ....అదీ నాకూతురు నుండి ....
ఫోన్ చేసి మరీ రెండు సందర్భాలను అడిగింది ....
నిజానికి ఆ సందర్భం తనకు ఎదురై కాదు ....తన ఫ్రెండ్ మదర్ కి ఎదురై ....
"నీ లైఫ్ లో కూడా ఇలాంటి సందర్భమే ఎదురైంది కదా ......అప్పుడు నువ్వెలా ఆలోచించావు .....నువ్వెలా అధిగమించావు .....నీకూ కష్టంగా అనిపించిందా " అని అడిగింది ....
"మళ్ళీ నన్ను అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లి ....నేను చేసినట్టు గానే చేయమంటే ....నేనెదుర్కొన్నట్టుగా ఎదుర్కొమంటే నాకూ సాధ్యం కాదేమో ...కానీ నేనిలా చేశాను ....సాధ్యం అయితే ప్రయత్నం చేయమని చెప్తాను ..ఫలితం నాకు తెలియదు ....." వివరంగా చెప్పా ....
ప్రయాణం ఏదైనా ...ఎలాంటిదైనా ....ఎంత దూరం అయినా ....మన జీవితం....ఎదుటివాళ్ళు ప్రయాణం చేయాలనుకునే... కష్ట సుఖాల చిరునామా కావాలి ...ఎదుటివాళ్ళు పారిపోవాలనుకునే ప్రయాణం కాకూడదు కదా ...??!!🙏
*************సమాప్తం ****************