Monday, December 9, 2019

ఈ వీకెండ్ చాలా విపరీతమైన వర్షం ..

ఈ వీకెండ్ చాలా విపరీతమైన వర్షం ...ఎక్కడికీ వెళ్లాలనిపించలేదు ....ఇంట్లోనే ఉండిపోయా ....
కానీ..., తప్పనిసరై ....పిల్లలకు హెయిర్ కట్ కావాలంటే ఆదివారం సాయంత్రం అలా బయటకు వెళ్ళా ....
అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సొచ్చింది ....
ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా కూర్చున్నా ....
కాసేపు ఫోన్ లో ఏవో అప్డేట్స్ చూసుకున్నా ....తర్వాత కాసేపు ఏమీ చేయకుండా చుట్టుపక్కలవాళ్ళను గమనిస్తూ కూర్చున్నా ....
అక్కడ రకరకాల వ్యక్తులు హెయిర్ కట్ చేయించుకుంటూ ....హెయిర్ కలర్ వేయించుకుంటూ ....కొంతమంది మగవాళ్ళు షేవింగ్ చేయించుకుంటూ ఉన్నారు ....
ఇక్కడ ఆడ / మగ కు వేరే వేరే హెయిర్ కట్ సెలూన్స్ ఉండాల్సిన అవసరం లేదు ....అందుకే అందరూ అందరికీ హెయిర్ సర్వీస్ చేస్తారు ....చేయించుకుంటారు .....
వాళ్ళని కాసేపు గమనిస్తూ కూర్చున్నా ....
తర్వాత ఏమీ తోచక ....అక్కడ షాప్ లో ఉన్న ప్రొడక్ట్స్ చూసి ..."Try Me" అని ఉన్నవన్నీ మూతలు తీసి చూసి ....నచ్చినవి కొన్ని ఎందుకు వాడుతారో చదివి ....అవి టచ్ చేసి చూస్తున్నా ....
కొన్ని మంచి ఫ్లవర్ ఫ్లేవర్ స్మెల్ వచ్చేవి బాగా నచ్చాయి ....
అంతలో ఒకమ్మాయి ....
"ఏవైనా కొశ్చన్స్ ఉన్నాయా" అంటూ నా దగ్గరకు వచ్చి పలకరించింది ...
ఉత్తినే టైం పాస్ కోసం చూస్తున్నా ....ఏం లేవని చెప్పా ....
ఆ అమ్మాయి నవ్వుతూ ....ఏదైనా సహాయం కావాలంటే అడగమని చెప్పి వెళ్లి కూర్చుంది ....
ఇక్కడ ....షాప్స్ లో ఉన్నవి చూడాలంటే...., "ఏదో కొంటాను ....అందుకే చూస్తున్నా" అని అబద్ధం చెప్పి నమ్మించాల్సిన అవసరం లేదు కాబట్టి ....నిజమే చెబుతూ ఉంటా అన్నిసార్లూ ....
"మీ హెయిర్ చాలా బాగుంది ..." కాంప్లిమెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి ....
"థాంక్స్ ....కానీ ఇప్పుడు చాలా ఊడిపోయింది ...." ఇది కూడా నిజమే చెప్పా తనకు ...కాంప్లిమెంట్ వాళ్ళ జాబ్ లో ఓ భాగం కాబట్టి ఆశ్చర్యపోకుండా ....
నాకు ఏవో ఫ్రీ సర్వీస్ ఆఫర్స్ ఇచ్చింది కాసేపు మాట్లాడాక ....ఫ్రీ హెయిర్ కట్ , ఫ్రీ హెయిర్ మసాజ్ ఇస్తాను టైం ఉన్నప్పుడు రమ్మని చెప్పింది ....
ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ని కూడా తీసుకుని రమ్మని కొన్ని ఫ్రీ కూపన్స్ ఇచ్చింది ....
థాంక్స్ చెప్పి తప్పకుండా వస్తానని చెప్పా ....
ఆ అమ్మాయి నా గురించి అడిగింది ....కొన్ని వివరాలు చెప్పా ...
ఇండియా నుండి వచ్చి ఎన్నేళ్లయింది ....ఇక్కడ ఎలా ఉంది ....అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాలు ఇలా చాలా విషయాలు అడిగింది ....
ఇక్కడి కల్చర్ గురించి తెలుసుకోవడం మనకు ఎంత ఆసక్తిగా ఉంటుందో .....మన కల్చర్ గురించి మన మనస్తత్వాల గురించి తెలుసుకోవడం వాళ్లకు కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది అంటే మనం నమ్మాలి ...
టాపిక్ ఎలా మళ్లిందో తెలియదు ....అలా అలా డేటింగ్ వరకు వెళ్ళింది ....
నా చిన్నతనంలో డేటింగ్ ఎలా ఉండేదో అడిగింది ....
నాకసలు డేటింగ్ అనే పదమే తెలియదని చెప్పా ...ఎంగేజిమెంట్ , పెళ్లి ఈ రెండే మాకు తెలిసినవి అని చెప్పా ....
ప్రేమ గురించి అడిగింది ....
ప్రేమ గురించి తెలుసు ....కానీ మాకు (ఆడపిల్లలకు ) ఆ ఆప్షన్ లేదు అని చెప్పా ....
"అమెరికా వచ్చాక మాత్రమే నాకు డేటింగ్ గురించి తెలిసింది ...అది కూడా నా పిల్లలు పెద్దయ్యాక సరిగా అర్ధం చేసుకున్నాను ....డేటింగ్ అనేది అబ్బాయి - అమ్మాయి అర్ధం చేసుకోవడానికే .....అది తప్పు పదం కాదని ...."అని చెప్పా ....
"మరి మీరు పెళ్లి ఎలా చేసుకున్నారు ...." అడిగింది ...
"మా పేరెంట్స్ ఓ రెండు మూడు సంబంధాలు చూస్తారు ....అందులో ఒకటి మాకు నచ్చింది మేం సలెక్ట్ చేసుకోవాలి ...ఉన్నవాటిలో బెస్ట్ చూసుకుంటాం అన్నట్టు ....
మూడూ వరస్ట్ వి అయినా ....అందులో లీస్ట్ వరస్ట్ మాకు బెస్ట్ అన్నట్టు ....." చెప్పా ....
"మేం అబ్బాయితో పెళ్ళికి ముందు మాట్లాడకూడదు ...." వివరించా ...
"మరి వాళ్ళ గురించి మీకు ఎలా తెలుస్తుంది ...." అడిగింది ...
"మా పెద్దవాళ్ళు చెప్తారు ...వాళ్లకు తెలిసింది తెలుసుకుంది ....దాని ద్వారా మేం మాకున్న విజ్ఞానంతో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని సెలెక్ట్ చేసుకుంటాం ...."
"అసలు కొంతమంది ఆడపిల్లలకు ఈ చాయిస్ కూడా ఉండదు ....పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్లనే పెళ్లి చేసుకోవాలి ..." చెప్పా ....
"డివోర్స్ ఆప్షన్ ఉంటుందా ...." అడిగింది పాపం ఆఖరి ఆశగా
"లీగల్ గా ఉంటుంది ....సామాజికపరంగా ఉండదు ....ఉన్నా తీసుకోవడానికి మాకు ధైర్యం ఉండదు ...." చెప్పా ....
"OMG, so scary "చెప్పింది ....
"అవును ....ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు భయంగానే అనిపిస్తుంది ...
"ఇప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉందా" అడిగింది ....
"లేదు ...ఇప్పటి తరం ఆలోచనల్లో మార్పొచ్చింది ....ప్రేమ వివాహాలు ....డేటింగ్ లు , డివోర్స్ ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు ..." చెప్పా ...
"ఇప్పుడు నేను నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను ....
డేటింగ్ అంటే ఎంతో భయపడే నేను ....నా పిల్లలు డేటింగ్ చేస్తే అభ్యంతరం లేదు అనే ఆలోచన లోకి రాగలిగాను ....
ఇక్కడ అంతా నా పిల్లల వలెనే ఇలా ఆలోచించడం నేర్చుకున్నాను ....చెప్పా ....
"మీ పెళ్లి అయి ఎన్నేళ్లయింది ...." అడిగింది ....
చెప్పా ....
"మీకెలా అనిపిస్తుంది అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే నా ...." అడిగింది ....
"మొదటి రోజు నుండి నాకు తెలిసిన ఒకే ఒక్క పదం " సర్దుకుని పోవడం(compromise)" ప్రతి రోజూ ...ఇప్పటికీ ....
మాకు వేరే చాయిస్ లేదు ....ఉందేమో తెలియదు ప్రస్తుతానికి ...." చెప్పా ...
"మీరు నిజంగా గ్రేట్ ....ఊహించడానికే భయంగా ఉంది మాకు ...." చెప్పింది ...
"ఒప్పుకుని తీరాల్సిందే ....భారతీయ మహిళకు ఉన్నంత ధైర్యం ...ప్రపంచంలో ఏ మహిళలకూ ఉండదు ...." తనతో అనలేదు ....మనసులో అనుకున్నా ....
-------------------------------
అంతలో నా కూతురు తన పని అయిపోయి నా దగ్గరకు వచ్చింది ....
నేను తను మాట్లాడుకున్న విషయాలు చెప్పింది తనకు రాగానే ....
'మా ఫ్రెండ్స్ కి కూడా మా మామ్ గురించి చెబుతూ ఉంటా ....తను చాలా బ్రాడ్ మైండెడ్ ....'చెప్పింది నా కూతురు ....🥰
తను ఇంకా ఫ్రీ కూపన్స్ మా చేతిలో పెట్టి ...."మీ మామ్ నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం" మళ్ళీ తప్పకుండా రమ్మని గుడ్ నైట్ చెప్పింది ....
ఎక్కడికొచ్చినా ..కాసేపట్లో ఫ్రెండ్స్ చేసుకుంటావు ....ఊరికే ఉండవా ..నా టాలెంట్ ని ముద్దుగా కోప్పడింది నా కూతురు ...😘
-------------------------------
అదిగో అలా గడిచింది ఈ వర్షం కురిసిన ఆదివారం సాయంత్రం
కాసిన్ని సాంస్కృతిక ముచ్చట్లతో....(కాసిన్ని అతిశయాలైన పొగడ్తలతో ...)!😊