Tuesday, May 28, 2019

చుట్టుపక్కల మనుషుల్ని భరించడం అనేది ...

(గమనిక : ఎప్పటిలాగే అన్ని గమనికలూ అందరికీ వర్తిస్తాయి ...ఎవరి మనో భావాలకూ నేను బాధ్యురాలిని కాను ....)
======================
చుట్టుపక్కల మనుషుల్ని భరించడం అనేది ....రాబోయే రోజుల్లో ...భవిష్యత్తులో ....మనం ఎదుర్కోబోయే అత్యంత క్లిష్టమైన సమస్య కాబోతుంది అని, ప్రస్తుత జీవితంలో జరిగే సంఘటనలు అనుక్షణం హెచ్చరిస్తున్నాయి ..అని నా అనుమానం ....
దాని నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ....??!!
ఎలా మన శరీరాన్ని మన మెదడుని ఎదుటివారికి అనుసంధానించకుండా మనతో మనం ఉంచుకోవాలి??!! 🤔అనేది మనసుని తొలిచేస్తున్న ప్రశ్న ....
...........................
ఏమిటి మనుషుల్ని కూడా భరించకుండా ఎలా ఉంటాం అనే అనుమానం మనకు రావచ్చు ...
ఇక్కడ మనుషుల్ని భరించడం ఎప్పుడంటే ....,,అన్ని సమయాల్లో కాదు ....
వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళతో మనకే సమస్యా ఉండదు ....భరించాల్సిన అవసరమే లేదు ....
అదే మనుషులతో మనం,
కలిసి బ్రతకాల్సి వచ్చినప్పుడు ,
కలిసి నడవాల్సి వచ్చినప్పుడు ,
కలిసి స్నేహం చేయాల్సి వచ్చినప్పుడు ,
కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు,
తప్పనిసరిగా సందర్భానికి తగినంత.. ఒకరినొకరం ...అర్ధం చేసుకోవాలి ...సహకరించాలి ....వెంటనే స్పందించాలి ...
ఇందులో ఏది లోపించినా ....మనం ఒకరినొకరు భరించాల్సి వస్తుంది ....ఈ భరించడం అనేది రాబోయే రోజుల్లో మనకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య ....
ఇది ఎలా అధిగమించాలో అన్వేషించే ముందు ఇది సమస్య ఎందుకయిందో...ఎలా అయిందో తెలుసుకోవాలంటే .....నా నిన్నటి జీవితంలోకి నేను ఒకసారి తొంగి చూసుకోవాలి ....(నిన్నంటే నిన్న కాదు ...ఆదివారం మొదలుపెట్టా వ్రాయడం ....ఇప్పటికి పూర్తయింది ....)
ఆసక్తి ఉన్నవాళ్లు ఓసారి నాతో రావచ్చు ...
------------------------------------
శనివారం ...
సమయం తొమ్మిదిన్నర అయి ఉండొచ్చు .....
సుప్రభాతవేళ ... మెలకువ వచ్చాక ....టైం ఎంతయిందో చూద్దాం అని పక్కనే ఫోన్ ఎక్కడుందో తడిమి చూసి నిద్రకళ్లతో టైం ఎంతయిందో చూసా ...తొమ్మిదిన్నర ....హాయిగా అనిపించింది ...నిద్ర సరిపోయింది ఇక లేవొచ్చు అనిపించింది ....
అర్జెంట్ గా అటెండ్ అవ్వాల్సిన మెసేజ్ లు ఎవరిదగ్గరనుండి అయినా ఉన్నాయా ఫోన్ లో అని చెక్ చేశా ....లేవు ....ఫోన్ పక్కన పడేసి ....లేచి మొహం కడుక్కుని ఫ్రెష్ అయిపోయి మా వారిని విష్ చేసి "కాఫీ తాగుదామా" అడిగా ....
"కాఫీ పెట్టమంటావా " అడిగారు ....
మొహమాటం లేకుండా "పెట్టండి" అని చెప్పా ....
అంతలో నా కూతురు కూడా కాఫీ అడిగింది ....సరే అందరికీ కలుపుతా అన్నారు ....
పాలు వేడి చేసే గాప్ లో మావారు నాకు, తను పొద్దున్నే పవన్ కళ్యాన్ మీద చేసిన వీడియో గురించి చెప్పారు ....
ఓహ్ ....ఇంకా వీడియోస్ చేస్తూనే ఉన్నారా ....అడిగా ఆశ్చర్యంగా ...
అంటే ఎన్నికల ఫలితాల తరువాత ఈ వీడియోలు గట్రా ఆపేస్తారేమో అనుకున్నా ....అందుకని అలా అన్నా ....
"అంటే ....ఏం లేదు ... ఎందుకు ఓడిపోయాం అని ....దానికి ఐదు తప్పిదాలు పవన్ ఏం చేసాడో అని....వాటిని సరిదిద్దుకోవాలి అని
వీడియొ పెట్టాను ....కానీ ఫాన్స్ అందరూ తిడుతున్నారు ....అలా ఎందుకు పెట్టానని ...." అన్నారు విచారంగా ....
"అందులో తప్పేముంది ....తప్పులు తెలుసుకోవడమూ మంచిదేగా ...." చెప్పా ...
"కొంపతీసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ - ఐదు తప్పులు అనే పుస్తకం వ్రాస్తారా ఏంటి ...." అందామనుకుని నోటిదాకా వచ్చి ....ఈ అనవసర ఐడియాలు నాకెందుకు అని, నోట్లో మాట నోట్లోనే మింగేసి మౌనంగా ఉండిపోయా .....
వీడియో ప్లే చేసి వింటూ ఉన్నారు ...ఓ రెండు మూడు వాక్యాలు విన్నాక ....
"పొద్దున్నే నాకు ఈ రాజకీయాల గోల విసుగ్గా ఉంది .....కాస్త ఆపేస్తారా ...ప్లీజ్ ...." అడిగా ....
"సరే తల్లి ..." తప్పదన్నట్టు ఆపేశారు ...
ఆ విసుగులోనుండి బయటపడి ...నా సాధారణ జీవితాన్ని ఆస్వాదిస్తూ .....
అందరం కలిసి కాఫీ తూగుతూ కూర్చున్నాం ....కాఫీ చాలా చేదుగా అనిపించింది ....అయినా నాకు చేదు కాఫీ ఇష్టమే ...నా కూతురు మాత్రం మళ్ళీ షుగర్ కలుపుకుంది ....
అప్పటికే మా వారి ఫోన్ మెసేజ్ లు గ్యాప్ లేకుండా వస్తూ ఉన్నాయి ....కాల్స్ కూడా ...
తను ఫోన్ లో మాట్లాడే మాటల్ని బట్టి .... యు ట్యూబ్ వీడియో గురించే చర్చ జరుగుతుంది అని అర్ధమైంది ....
ఎలాగో ఆ ఫోన్ కాల్స్ ని పట్టించుకోకుండా ....నా కాఫీ నేను తాగేశా ....
సమయం పదిన్నర అయింది ....
***************************
"ఈ రోజు పిల్ల డాన్స్ ప్రోగ్రాం ఉంది స్కూల్ లో ....మర్చిపోకుండా వెళ్ళాలి ....నిన్నకూడా మిస్ అయ్యాం " చెప్పా ....ఎవరికో ఫోన్ లో సాయంత్రం ఆరు గంటలకు వస్తానని మావారు మాటివ్వడం చూసి ....
ఈ రోజు మిస్ అవ్వకూడదు అని ....ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేస్తూ ....
"ఫ్రంట్ సీట్స్ బుక్ చేయనా" అడిగింది నా కూతురు
కూతురి డాన్స్ ప్రోగ్రాం ....ఫ్రంట్ సీట్స్ లో కూర్చుని చూడడం కన్నా ఆనందం ఏముంది ...??! సరేనని చెప్పా ...
ఇంత సేపయినా ....మావారి ఫోన్ కాల్స్ ....ఈ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోవడం గురించి చర్చలు ఆగలేదు ....
ఎంత సేపయినా ....అవన్నీ వినడం ....సహనంతో భరించడం నా మెదడు మర్చిపోలేదు ....
మేము కాలిఫోర్నియా వచ్చి చాన్నాళ్ళయినా ...ఇంతవరకు మేం డ్రైవర్స్ లైసెన్సు మార్చుకోలేదు ....ఇప్పుడు తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది ....
"ఈ రోజు డ్రైవింగ్ లైసెన్స్ కోసం తప్పనిసరిగా DMV కి వెళ్ళాలి ....కాస్త ఆ డాకుమెంట్స్ రెడీ చేసుకుని ఆ పని పూర్తి చేద్దాం ఇవ్వాళ ...."చెప్పా ....మావారితో ....
"కిందకెళ్ళి పోస్ట్ తెస్తారా ....అందులో లేటెస్ట్ అడ్రెస్స్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి ..." అడిగా మావారిని ....డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి .... రెండు అడ్రెస్స్ ప్రూఫ్స్ కావాలి కాబట్టి ....,
అవి తెచ్చాక ....,అందులో రెండు అడ్రెస్స్ ప్రూఫ్స్ తనవి తనకిచ్చి ...నావి నేను తీసుకుని ,....మిగతా అవసరమైన డాకుమెంట్స్ తీసుకుని రెడీ అయ్యా ....
సమయం పదకొండున్నర అయింది ....
******************************
మావారు ఫోన్ లో పవన్ కళ్యాణ్ కార్యకర్తలు / ఫాన్స్ తో మాట్లాడుతూనే .....నాతో కార్లో కూర్చున్నారు ....
అంతకు క్రితం రోజే ....పార్క్ చేసిన కార్ మిర్రర్ ఎవరో హిట్ చేసి విరగ్గొట్టారు ....ఆ అద్దం వేళ్ళాడుతూ డోర్ కి కొట్టుకుంటూ ఉంది ....డోర్ కూడా డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ....పైగా సైడ్ మిర్రర్ లేకుండా కార్ నడపడం కష్టంగా కూడా ఉంది ....ఏం చేయాలో అర్ధం కాలేదు ....అఫ్కోర్స్ రిపోర్ట్ చేయడం, బాడీ షాప్ లో ఎస్టిమేషన్ కోసం ఫొటోస్ ఇవ్వడం ....అలాంటి ప్రాసెస్ అంతా అయిపొయింది ....
వెంటనే ఒక ఐడియా వచ్చింది ...."ఒక తాడు తీసుకుని ఈ అద్దం కాస్త గట్టిగా కట్టండి ....ఇలా వేళ్లాడకుండా ...." అడిగా మావారిని ....
ఫోన్ లో ....అవతలి వాళ్లకి ...."తమ్ముడూ ...నేను ఫ్యామిలీతో కాస్త పనుండి బయటకు వెళ్తున్నాను ....మళ్ళీ కాల్ చేస్తాను ...." అంటూ అతి కష్టం మీద ఫోన్ పెట్టి ....ఆ అద్దం తాడుతో కట్టారు ...
చాల బెటర్ గా అనిపించింది ....
హమ్మయ్య ....ఆ ఇన్సూరెన్స్ సెటిల్ అయ్యేవరకు ఇలా నడపొచ్చు ....అనుకున్నా....
నా డాక్యుమెంట్స్ అన్ని సరి చూసుకుని ....DMV అడ్రెస్స్ సెర్చ్ చేస్తే ....24 మినిట్స్ డ్రైవ్ అని చూపించింది ...
పాటలు పెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ ....పక్కనే కూర్చున్న మావారి వైపు చూసా ....ఎవరికో ఫోన్ లో మెసెజ్ చేసుకుంటూ ....కనిపించారు ...
సరే ఇంక మాట్లాడడం ఎందుకులే అని ....నా పనిలో నేను లీనమయ్యా ....
అంతలో మళ్ళీ కాల్ ....(నాకు కాదు )
"ఆ తమ్ముడూ ...." పక్కనే చెవిలో ...
తనేమో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడతారు ....నాకేమో చెవిలో అరచినట్టు ఉంటుంది ....
నా డ్రైవింగ్ కి డిస్ట్రాక్షన్....
"ప్చ్ ....ఉఫ్ " అసహనంగా చూసా ....ఇపుడు కాల్స్ వద్దు అన్నట్టు ...
నెమ్మదిగా గొంతు తగ్గించి మాట్లాడడం మొదలుపెట్టారు ....
ఎంత సహనం ప్రదర్శించాలి అనుకున్నా ....నా వల్ల కావడం లేదు ....ఎన్ని విధాలుగా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి అన్నా ....అసహనం బుసలు కొడుతుంది .....మంచి బీట్ ఉన్న సాంగ్ కోసం ....నా ఎడమ చేతి బొటన వేలితో ....పాటలన్ని స్కిప్ చేస్తూ ఉన్నా ....కొంచెం వాల్యూమ్ పెంచా....అలా అయినా ఫోన్ కట్ చేస్తారేమో అని ఆశ ....
నా ఆలోచనల్లో నేనుండగానే ....DMV వచ్చేసింది ....
కార్ పార్క్ చేసి ....లోపలి వెళ్తే, జీవితంలో ఎప్పుడూ కలగనంత ఆశ్చర్యం కలిగింది ....అస్సలు లైన్ లేదు ....కాలిఫోర్నియాలో DMV లో లైన్ లేకుండా ఉండడం .....నా జీవితంలో మొదటిసారి నేను చూడడం ....
ఎంత అదృష్టమో అని సంబరపడి పోయా ....
ఓ ఇద్దరు మా ముందు ఉన్నారు .....
లైన్ లో ఉండి కూడా మావారు ఏవో ఫోన్ మెసేజ్ లు చూసుకుంటూ ఉన్నారు .....ఇక నాకు ఇప్పుడు దాని గురించి అసహనం లేదు ....
చుట్టూ ఉన్నవాళ్లను, పరిసరాలను గమనించడంతో మునిగిపొయా....
తనొకరు నా పక్కనే ఉన్నారు అని మర్చిపోవడానికి రెడీ అయిపోయా ...
అంతలో మా వంతు రానే వచ్చింది ....
ముందుగా మా వారిని అడ్రెస్స్ ప్రూఫ్స్ అడిగింది అక్కడ కూర్చున్న అమ్మాయి ....
చూస్తే చేతిలో అడ్రెస్స్ ప్రూఫ్స్ లేవు ....
"మీకిచ్చాను కదా ఇందాక " నెమ్మదిగా అడిగా ....
"అవును గుర్తుంది ....కానీ తేలేదనుకుంటాను ...." చెప్పారు నెమ్మదిగా ...
"పరుపు మీద పెట్టాను ....తీసుకోమని ..." గుర్తు చేశా ఆఖరి ఆశగా ....
"మర్చిపోయాను ...." చెప్పారు ఆఖరి మాటగా ....
ఇక చేసేదేం వుంది ....బయటకొచ్చాక ....కోపాన్ని కంట్రోల్ చేసుకుని ....
"డాక్యుమెంట్స్ లేకుండా ఏం చేయాలని వచ్చారు....మీకు ఇచ్చా కదా .. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ...ఎక్కడికి వెళ్తున్నాం ....ఏం కావాలి ....అవి ఉన్నాయా లేదా అని చూసుకోవాలని ...." అడిగా ....
"ఇప్పుడు ఏమైంది మళ్ళీ వెళ్లి తీసుకుని వద్దాం ...." అన్నారు ...
"మీకేం ....మళ్ళీ వెళదాం అనే అంటారు ....పక్కన కూర్చుని ఫోన్ లో పవన్ కళ్యాణ్ సోదంతా మాట్లాడుకోవచ్చు కదా నొప్పి లేకుండా ....నేనే మళ్ళీ గంట డ్రైవ్ చేయాలి .....మళ్ళీ వచ్చేసరికి క్యూ ఎంత ఉంటుందో తెలీదు ...." చెప్పా కాస్త కోపంగా ....
డ్రైవ్ చేసేటప్పుడు ఈసారి కాస్త ప్రకృతిని చూస్తూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించా ....
ఇంటికొచ్చి ...మళ్ళీ కావాల్సిన డాక్యుమెంట్ తీసుకుని .....ఆకలేస్తుంది అని .....కాస్త బాక్స్ లో ఫుడ్ తీసుకుని డ్రైవ్ చేస్తూ తినొచ్చు మళ్ళీ ఏ టైం కి అయిపోతుందో ప్రాసెస్ అని .....మళ్ళీ బయల్దేరాం ...
డ్రైవ్ చేస్తూనే మధ్యలో రెడ్ లైట్స్ వచ్చిన దగ్గర కాస్త ఫుడ్ నోట్లో పెట్టుకుని తింటూ ....మళ్ళీ ఎలాగైతేనేం DMV చేరుకున్నాం ....
అనుకున్నట్టుగానే ముందుకంటే లైన్ కాస్త పెద్దదిగా వుంది ....
అక్కడ టోకెన్ తీసుకుని ....మా నెంబర్ కోసం వేచి చూస్తూ కూర్చున్నాం ...
మావారు యధావిధిగా మెసేజ్ లకు రిప్లయ్ లు ఇస్తూ కూర్చున్నారు .....మనుషులతో ఏ మాత్రం సంబంధం లేనట్టు .....
సమయం రెండున్నర అయింది .....
******************************
మా వంతు వచ్చాక ....విండో దగ్గరకు వెళ్ళాక ....మీకెప్పుడైనా ఇంతకుముందు కాలిఫోర్నియా లైసెన్స్ ఉందా అని అడిగింది అక్కడ కూర్చున్న అమ్మాయి .....
ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వుంది అని చెప్పా .....అయితే అది గనక ఇప్పుడు సిస్టం లో ఉంటే....18 ప్రశ్నలున్న పరీక్ష పత్రం వ్రాస్తే సరిపోతుంది ....32 ప్రశ్నలున్న పరీక్ష పత్రం వ్రాయాల్సి అవసరం లేదు ...చెప్పింది ....
"ఓహ్ ....థాంక్స్ ,..." చెప్పా సంతోషంగా ....
వెతికితే ....సిస్టమ్ లో నేను అమెరికా వచ్చిన కొత్తలో ఫోటో ఒకటి ....కనిపించింది ...తొంగి చూసా ....
చుడీదార్ వేసుకుని ఉన్నా ....
"అప్పట్లో ఎలా ఉండేదాన్ని అని చూస్తున్నా ......." చెప్పా నవ్వుతూ ఆమెకు ...
"అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నావు ...." చెప్పింది తను కూడా ...
"అప్పుడు చాలా అమాయకంగా .....భయం భయంగా ఉన్నాను కదూ ...." అడిగా నవ్వుతూ ....
తను కూడా నవ్వింది ....
తర్వాత ఫీజ్ కట్టించుకుని ఎగ్జామ్ కి బెస్టాఫ్ లక్ చెప్పింది .....
ఫోటో తీయించుకుని ....ఎగ్జామ్ వ్రాయడానికి వెళ్ళా ....
అస్సలు ప్రిపేర్ అవ్వలేదు ....పరీక్షకు ....
మూడు సార్లు ఛాన్స్ ఉంటుంది ....పరీక్ష వ్రాయడానికి ....మూడు సార్లు ఫెయిల్ అయితే మళ్ళీ రెండోసారి ఫీజు కట్టి పరీక్ష వ్రాయాలి ....
అంతలోనే మా వారు పరీక్ష వ్రాయడం అయిపొయింది ....రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు ...
"ఉండు ....నీకు ఏ ప్రశ్నలు ఇస్తున్నారో చెబుతాను ...."అన్నారు ....
"పర్వాలేదు ....అవసరం లేదులే ..." చెప్పా ...
కంప్యూటర్ లో ఎగ్జామ్ స్టార్ట్ చేసి నియమ నిబంధనలు చదివి ....పరీక్ష వ్రాయడంలో మునిగిపొయా ....
రెండు ప్రశ్నలు అర్ధం కాక స్కిప్ చేశా....ఆలా చేయొచ్చు ....కానీ మళ్ళీ పూర్తి చేయాల్సిందే ....
ఆ రెండే చివరకు తప్పు పోయాయి ....
అయిపోయాక ....ఎవరికి చెప్పాలి అని చూస్తుంటే ....మావారు పక్కనే ఉన్నారు ....
ఏదో ప్రశ్న కు సమాధానం ఏమిటని అడుగుతూ ఉన్నారు ...
కాసేపు విన్నాక గానీ నాకు అర్ధం కాలేదు ఏదో అడుగుతున్నారు అని ....
అంతలో వెనకనుండి ఒకావిడ వచ్చి ....మాట్లాడకూడదు ....మాట్లాడితే ఫెయిల్ అంది ...
నా ఎగ్జామ్ ఎప్పుడో అయిపొయింది అని చూపించా ....
తర్వాత నేను బయటికొచ్చేసా ....రిజల్ట్ తరువాత పిలిచి చెబుతారు ....
వెంటనే పిలుపొచ్చింది ....పాసయ్యానని చెప్పి ....కంగ్రాట్స్ చెప్పింది ....థాంక్స్ చెప్పి నేను వెళ్లి నా సీట్లో కూర్చున్నా ....
అంతలో మావారు బయటకొచ్చి ..."నువ్వు పాసయ్యావా ?" అడిగారు ....
"అవును " చెప్పా ...
"మీరు ?" అడిగా ....
"నేను ఫెయిల్ ...చాలా కష్టంగా వుంది ....మళ్ళీ వ్రాశా ...నేను నీకు చెప్పలేదు కానీ రాత్రంతా పుస్తకం చదువుతా కూర్చున్నా....అయినా కష్టంగా వుంది ..." చెప్పారు ....
"ఎప్పుడైనా కారు నడిపితేగా రూల్స్ తెలియడానికి ....థియరీ ఉంటే సరిపోదు ....అందుకే మీ పార్టీ కూడా ఓడిపోయింది ...ఓటెలా వేయాలి అని థియరీ చెబితే ....ఓట్లు పడతాయా ....జనంలో తిరిగి ఓట్లెలా వేయాలో ఎందుకు వేయాలో చెబితే ఓట్లు పడతాయి ...." చెప్పా సందర్భం వచ్చిందని ...
తర్వాత తను కూడా పాసయ్యానని ఆనందంగా చెప్పారు ....
సాధించార్లె ఐఏఎస్ ....పదండి ....అని ఇంటికెళ్దాం అని బయల్దేరాం ....
సమయం నాలుగున్నర అయింది ....
*******************************
దారిలో ఇండియన్ స్టోర్స్ కి వెళ్లి కావాల్సిన సరుకులు తెచ్చుకుందామా అడిగా ....
"ఆర్టీషియా వెళ్దాం పోనీ మామిడిపళ్ళు అసలు ఈ సీజన్ లో తెచ్చుకోలేదు ...."గుర్తు చేశా ....
అడ్రెస్ పెట్టడం ....డైరెక్షన్ మార్చడం క్షణాల్లో జరిగిపోయింది ....
ఆరు గంటలకల్లా డాన్స్ ప్రోగ్రాం కి వెళ్ళాలి అని గుర్తొచ్చింది ....సగం దూరం వచ్చాక ....
సరే తొందరగా తీసుకుని తొందరగా వచ్చేద్దాం అని ....ఫాస్ట్ గా నడపడం మొదలుపెట్టా ....
అంతలో మళ్ళీ మావారి ఫోన్ రింగయ్యింది ....ఈసారి ఫోన్ లో తెలిసినవాళ్ళే ....అయినా నా పాటికి నా పని నేను చేసుకుంటూ ఉన్నా .....
ఈ పవన్ కళ్యాణ్ ....తప్పులు ....దిద్దుకోవడం ....వీడియో ....గురించే చర్చ ....
ఈసారి ఆపమని కూడా చెప్పలేదు ....సౌండ్ ఎక్కువ పెట్టి ...పాట మీదనే ఫోకస్ చేశా ...
అవతలి నుండి ....పాట గురించి అడగడం ....మేడం గారు వింటున్నారు ...నేను తరువాత చేస్తాను ....తను కోపంగా వుంది అని మావారు చెప్పడం ...అవతలినుండి ....ఏం పవన్ కళ్యాన్ అంటే ఇష్టం లేదా అని అడగడం ....పవన్ అంటే కాదు పాలిటిక్స్ వద్దని తన అభిప్రాయం అని మావారు సర్ది చెప్పడం ....నా చెవిని పడకుండా పోలేదు ....
మంచి రొమాంటిక్ సాంగ్ వింటున్నానేమో నేను అంతగా పట్టించుకోలేదు ....మాట్లాడలేదు ....
కొంతమంది ఫ్రెండ్స్ నన్ను రొమాంటిక్ సాంగ్స్ నీకెందుకు నచ్చుతాయి ఎక్కువగా అని అడగడం గుర్తొచ్చింది ....
ఎందుకంటే ....ఇంత విసుగుని కూడా వెంటనే డైవర్ట్ చేయగల శక్తి ఒక్క రొమాంటిక్ సాంగ్స్ కే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అనేది నాకు ఎన్నో సందర్భాల్లో అనుభవైకవేద్యం .....అని వాళ్లకు నచ్చజెబుతూ ఉంటా అనుకోండి ....అది వేరే విషయం ...
అంతలో షాప్ వచ్చేసింది ....గబా గబా కావాల్సిన సరుకులు ట్రాలీ లో వేసుకుని పరుగులు తీస్తూ ....బిల్ చేసుకుని ....కార్లో వేసుకుని బయల్దేరాం ....
చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు పాటల మీద ...మాటలమీద ...ఫోకస్ చేయకుండా డ్రైవింగ్ మీద మాత్రం ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటా ....అప్పుడు కూడా అలాగే చేశా ....
ఇలాంటప్పుడే ... ఒక్కసారి మా సీతారాంపురం రోడ్డు మీద ఎప్పటికైనా కార్ నడపగలనా అనుకుంటూ ఉండేదాన్ని చిన్నతనంలో ....
ఆ ఒక్క రోడ్డు ఏం ఖర్మ ....ప్రపంచం లో ఉన్న రోడ్లన్నీ నీవే అని భగవంతుడు నా నుదిటి మీద వ్రాశాడు ....అని తలచుకుని నవ్వొస్తూ ఉంటుంది ....
ఆలోచనల్లో ఉండగానే ....ఎలాగైతే ఏం ఇంటికొచ్చేసాం ....
సమయం అయిదున్నర అయింది ....
****************************
అంతలో ....బ్యాంకు నుండి క్యాష్ డ్రా చేయాలని గుర్తొచ్చింది ....స్కూల్ లో ఫ్లవర్ బొకే కొని ఇవ్వాలి తనకు .....బయటనుండి తెస్తాను అంటే ....వద్దు స్కూల్ లోనే కొనమని చెప్పింది నా డాటర్ ...కారణం గుర్తురాలేదు ....అక్కడ డెబిట్ / క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేయరని గుర్తొచ్చింది .....
పది నిమిషాల్లో బ్యాంకు కి వెళ్ళాలి త్వరగా కానివ్వండి అని మా వారికి చెప్పి .... కాస్త మొహం కడుక్కుని ఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్ కి వెళ్ళా ....
అంతలో ....పిల్లకు ఏదైనా బిస్కట్స్ లాంటివి తీసుకువెళ్దాం అని గుర్తొచ్చి ....ఓ మిల్క్ బికిస్ , ఒక గుడ్ డే పాకెట్ ....చిప్స్ ఏవైనా ఉంటే అవి ....ఒక వాటర్ బాటిల్ , ఒక కోక్ ....ఒక కవర్ లో వేయండి త్వరగా ....లిస్ట్ చదివా ....రెస్ట్ రూమ్ లో నుండే ....
డ్రెస్ మార్చుకోవడానికి కూడా టైం లేదు ....తల దువ్వుకుని ....అదే డ్రెస్ మీద కాస్త పెర్ఫ్యూమ్ కొట్టుకుని....ఆ బాగానే ఉన్నాలే ...నా బిడ్డకు నేనెలా ఉన్నా నచ్చుతాలే ...అని సరిపెట్టుకుని ....
పదండి పదండి ....అన్ని కవర్లో వేశారా ....అడిగా ....
మామిడికాయ తింటూ కనిపించారు .....(థాంక్ గాడ్ ....ఫస్ట్ టైం ఫోన్ లో మాట్లాడకుండా వేరే పని చేస్తూ ఉన్నారు ....అనుకున్నా ...)
"వచ్చాక తినొచ్చు ....త్వరగా రండి ....ఫ్రంట్ సీట్స్ దొరకవు ప్లీజ్ ....."నా తొందరలో నేను ....
ఒక్క పరుగున కార్లో కూర్చుని ....ఫాస్ట్ గా బ్యాంకు కి పోనిచ్చా ....అక్కడ క్యాష్ డ్రా చేసి ...అంతకంటే ఫాస్ట్ గా స్కూక్ కి వెళ్ళాం ...
సమయం ఆరున్నర అయింది ....
**************************
సరిగా అదే సమయానికి మావారి ఫోన్ లో "స్కూల్ లో డాన్స్ ప్రోగ్రాం ఉంది .....స్కూల్ కి వచ్చేసాం తమ్ముడూ తర్వాత ఫోన్ చేస్తాను" అని ఎవరికో చెప్పడం కూడా అయింది ....
నేను ఆయన్ని పట్టించుకోకుండా మైలు దూరం వెనక ఉన్నారని కూడా చూడకుండా ... ముందు ఫాస్ట్ గా నడుస్తూ ఉన్నా ....ఫోన్లు ఎక్కడ వినపడతాయో అని భయం వేసి ....
అంతలో నా కూతురు మెసేజ్ చేసింది .....
ఒక రెస్టారెంట్ నుండి వీలయితే ఫుడ్ తెమ్మని .....
"అయ్యో ఇక్కడికి వచ్చేసాంరా ....ఇప్పుడు వెళ్లి రావడం కష్టం ....కాకపోతే బిస్కట్స్ తెచ్చాను ...." చెప్పా దిగులుగా ....
"పర్వాలేదులే " చెప్పింది ....
డాన్స్ ప్రోగ్రాం మిస్సయితే మళ్ళీ చూడలేను ....కాబట్టి ....ఫుడ్ తేలేదని బాధగా ఉన్నా ప్రోగ్రాం కి వెళ్ళా ....
అక్కడ తనకు ఫ్లవర్ బొకే కొని ....పేరు వ్రాసి ....తనకివ్వమని పంపించి ...
ధియేటర్ ఓపెన్ చేసాక ముందు వరసలో మా నంబర్స్ చూసుకుని కూర్చున్నాం ....
"ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు .....చూడకూడదు ....చాలా స్త్రిక్ట్ గా చెబుతున్నా ...అది రూల్ కూడా ...." చెప్పా అప్పటికే ఫోన్ చూస్తున్న మా వారితో ....
ప్రోగ్రాం కాసేపట్లో మొదలవుతుంది ....అనగా ....అప్పటికే చుట్టుపక్కల కూర్చున్నవాళ్లను చూసా ....విచిత్రంగా అందరూ ఫోన్ లో మెసేజ్ లు చూసుకుంటూ బిజీ గా కనిపించారు ....ఆ సీట్లు చాలా చిన్నవి ....
నాకు ఎడం పక్కన మా వారు ....కుడి పక్కన ఓ ముసలావిడ కూర్చుంది ....
ఆవిడ కూడా ఫోన్ చూసుకోవడంలో బిజీ గా ఉంది ....ఆవిడ ట్రంప్ ఫాన్స్ తో మాట్లాడుకుంటూ ఉండి ఉండొచ్చు ....చెప్పలేం ....
ఒక్క క్షణం ఎందుకో ....వీళ్లిద్దరి చేతుల్లో ఫోన్ లు తీసి విసిరి కొట్టాలన్నంత అసహనం కలిగింది ....
ఎక్కడికీ పారిపోలేని జైలు లో బంధించిన ఫీలింగ్ కలిగింది ....
కాదు ఈ ప్రోగ్రాం అయ్యేవరకు వీళ్ళిద్దరినీ భరించాల్సిందే అని ....మౌనంగా ప్రోగ్రాం లిస్ట్ చదవడంలో మునిగిపొయా ....అవన్నీ ఇంగ్లిష్ సాంగ్స్ ....నా డాటర్ ఏ సాంగ్స్ కి డాన్స్ చేస్తుందో గుర్తు పెట్టుకున్నా ....
సమయం ఏడున్నర అయింది ....
**************************************
ప్రోగ్రాం స్టార్ట్ అయింది ....
ఏమాటకామాటే చెప్పాలి ...."యంగర్ జనరేషన్ పాడయింది అని మనం అంటాం గానీ ....వాళ్ళెంత బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు ....ఎంత చక్కగా డాన్స్ చేసారో ..." అని ఓ క్షణం అనుకోకుండా ఉండలేకపోయా ....
అంతలో నా డాటర్ చేస్తున్న సాంగ్స్ కూడా వచ్చాయి ....ఇంటర్వెల్ అని అనౌన్స్ చేసారు ...
అందరూ మళ్ళీ ఫోన్ లో మెసేజ్ లు చెక్ చేసుకున్న తర్వాత .....ప్రోగ్రాం కొనసాగింది ....
అయిపోయాక ....అందరూ బయటకు వచ్చాక ....నా డాటర్ నన్ను చూడగానే హగ్ చేసుకుంది ....
నా అలసటంతా ఓ క్షణం మాయం అయింది ....పిల్లలకు అవి మరిచిపోలేని క్షణాలు ....వాళ్ళ కష్టాన్ని తల్లి తండ్రులు గుర్తించడం కన్నా వాళ్ళు ఏం కోరుకోరు .....
మనస్ఫూర్తిగా "చాలా బాగా చేసావు నాన్నా ...." అని చెప్పా .......
ఇద్దరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం ....
సమయం తొమ్మిదిన్నర అయింది ...
**************************
తను ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వెళ్తానని చెప్పాక ....సరే రా....టేక్ కేర్ అని చెప్పి ...ఇంటికి బయల్దేరాం .....
అప్పుడు నాకు, ఉదయం నుండి సరిగా ఏం తినలేదని గుర్తొచ్చింది .....ఇంటి దగ్గర ఏమున్నాయి తొందరగా చేసుకునేవి అని ఆలోచిస్తే ....దోసెలు పిండి ఉంది ....
కానీ దోసెలు తినాలని లేదు ....
ఏం చేయాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నా ....
"డిన్నర్ కి బయటికెళదామా ...." అడిగారు మా వారు ....సమాధానం చెప్పాలనిపించలేదు ....
మౌనంగా నడుస్తూ ఉన్నా ....
అంతలో రాంగ్ పార్కింగ్ ప్లేస్ కి వచ్చామని గుర్తించి ....మళ్ళీ కరెక్ట్ ప్లేస్ కి నడుస్తున్నా ....
అక్కడ చుట్టూ అంతా చీకటి ....ఎవరూ లేరు ....నేను - నావెనక ఎక్కడో మావారు ....ఫాస్ట్ గా నడుస్తున్నా ...
వెనక అంత చీకటిలో కూడా .... మావారు ఫోన్ మెసేజ్ కి రిప్లై ఇవ్వడం మర్చిపోలేదు ....
అంత చీకట్లో నడుస్తూ కూడా మెసేజ్ లకు రిప్లై లు ఇస్తూ ఉన్నారు ...అనే ఆలోచన నన్ను వదల్లేదు ....ఒక్క క్షణం నాకు ఈ ఆలోచన నచ్చలేదు అనిపించింది ....
ఇక నేను తన కోసం ఆగకుండా వేగంగా నడవడం మొదలుపెట్టా ...కాస్త ముందు నడవడం వల్ల నేను ఒక్కదాన్నే నడుస్తున్నాను అనే ఫీలింగ్ కి నేను దగ్గరయ్యా ....ఆ ఫీలింగ్ నాకు అంత చీకట్లోనూ ఎంతో ప్రశాంతతను ....హాయిని ...ధైర్యాన్ని ఇచ్చింది ....
కాస్త చలిగా కూడా అనిపించింది ..... నడుచుకుంటూ వచ్చి కార్లో కూర్చున్నా ....
తను కూడా వచ్చాక ....అప్పుడు కూడా తెరిచి ఉంచే రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ పాక్ చేసుకుని ....ఇంటికొచ్చి .....కడుపునిండా తినేసరికి .....నిద్ర ముంచుకొచ్చేసింది ....
డ్రెస్ చేంజ్ చేసే ఓపిక కానీ ....స్నానం చేసే ఓపిక కానీ అస్సలు లేదు ...
ఏ సి ఆన్ చేసుకుని ముసుగేసుని పడుకున్న వెంటనే ఎప్పుడు నిద్ర పోయానో నాకే తెలియదు .....
సమయం పదకొండున్నర అయి ఉండొచ్చు ...
****************************
అదిగో ఆలా గడిచింది ....ఓ శనివారం .....
*******************************************
ఇక ఈ రోజుకొచ్చి చూస్తే ....
ఈ ప్రస్తుత జీవన ప్రయాణంలో ....ఈ మధ్య కాలంలో కొందరు స్నేహితులు కూడా ఇదే స్థితి ....మనం మాట్లాడుతుంటే ....ఫోన్ చూసుకుంటూ .....ఈ లోకంలో లేకుండా ....ఈ మనుషులతో కలవకుండా ....ఈ జీవితాన్ని స్వీకరించకుండా .....ఈ క్షణంలో బ్రతకకుండా ....ఈ బ్రతుకంటే బాధ్యత లేకుండా ....ఈ బాధ్యతలకు బాధ్యులు కాకుండా ....
వాళ్ళతో ముడిపడిన జీవితాలను వాళ్ళు ....అర్ధం చేసుకోక , సహకరించక , స్పందించక ....మరో లోకంలో ....తేలిపోతూ ..
మరి కొందరేమో వాళ్ళను భరిస్తూ ...
ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే .....భవిష్యత్తులో .....ఎవరూ ఒకరితో ఒకరు జీవించరు ....ఒకరినొకరు భరించడమే ఉంటుంది ....
ఎన్నాళ్ళు ఎన్నేళ్లు అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకమే ....??!!
ఇది అతి పెద్ద సమస్య గా మారి ....మానవ సంబంధాలను కబళించబోతుంది .... అనేది ...నేను అర్ధం చేసుకున్న జీవిత సత్యం
**************************🙏******************************

Monday, May 20, 2019

"నీకేం తెలుసు ...." ఒకరు నాతో

"నీకేం తెలుసు ...." ఒకరు నాతో
"నీకు తెలుసు కదా ...ఇక నేను చెప్పేదేముంది ....??!!" మరొకరు నాతో
విచిత్రం ఏమిటంటే ....,,,
మొదటి మాట విన్నప్పుడు "నాకు ఎంతో తెలుసు" అని ఉక్రోషంతో పోరాటం చేసాను ....
రెండో మాట విన్నప్పుడు "నాకేమీ తెలియదు" అని సంతోషంగా అంగీకరించాను ...
దీనికి కారణం ...., నాలో ఉన్న నేనే ...!
మొదటి మాట విన్నప్పుడు నాలో ఉన్న అభద్రతా భావం నాలో లేనిది కూడా ఉందని చూపించాలని పోరాటం చేసింది ....తన ఉనికిని కాపాడుకోవడం కోసం ....
రెండవమాట విన్నప్పుడు నాలో ఉన్న భద్రతా భావం నాలో ఉన్నది కూడా దాచేయాలని ప్రయత్నించింది .....తన ఉనికికి ఓ గుర్తింపు అప్పటికే లభించింది కనుక ...
అఫ్కోర్స్ ...చెప్పే వ్యక్తిని బట్టి మన ప్రవర్తనకు మరో కోణం ఉంటుంది ...సమాధానాలు వ్యతిరేకంగానూ ఉంటాయి ....
కానీ , అప్పుడు కూడా తన ఉనికి తాను కాపాడుకోవడం... నాలో ఉన్న నేను మర్చిపోను ...!🙏

Thursday, May 16, 2019

నా జీవితం పరిధి చాలా చిన్నది ...

నా జీవితం పరిధి చాలా చిన్నది ...
======================
నాకు తెలిసిన వ్యక్తులు , పరిచయం ఉన్నవారు , ఆత్మీయులు కూడా బహు కొద్ది మంది ....
ఇహ సెలెబ్రిటీలైతే నాకెవ్వరూ తెలియదు ...అది వేరే సంగతి అనుకోండి ... 😜
సరే ....అందుకు కారణాలు ఏవైనా నా ఆలోచనలు , అభిప్రాయాలు, అభిప్రాయబేధాలు మొదలైనవి ..ఎప్పుడూ ఆ అతి కొద్ది మంది చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ....
అందుకేనేమో ....ఆ అతికొద్ది మంది మీద నేను నాకు తెలియకుండానే ఆధారపడుతూ ఉంటా ....
ఆధారపడడం అంటే ఇక్కడ....వాళ్ళు నన్ను పెంచి ,పోషించి , లాలించాలని కాదు ....
నా అభిప్రాయాల ఏర్పాటుకు, వేర్పాటుకు ...సహాయపడుతూ ఉంటారని ...నేను ఆధారపడుతూ ఉంటానని ....
అయితే ...ఈ అతి కొద్దిమందిలో ...నేను, కొందరిని అభిమానిస్తూ ఉంటా ....కొందరిని ఆరాధిస్తూ ఉంటా ....మరి కొందరిని ప్రేమిస్తూ ఉంటా ....ఇంకొందరితో స్నేహం చేస్తూ ఉంటా ....కొందరితో కేవలం పరిచయం మాత్రమే కలిగి ఉంటా ....సహజంగానే కొందరిపై కోపం కలిగి ఉంటా ....కొందరిని ద్వేషిస్తూ ఉంటా ....
తద్వారా నా అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటా ....
కొన్నిసార్లు నా అభిప్రాయాలు తప్పని కొందరు నిరూపిస్తూ ఉంటారు ....కొన్నిసార్లు నా అభిప్రాయాలు ఒప్పని కొందరు నిరూపిస్తూ ఉంటారు ....
అభిప్రాయాలు తప్పని, లేదా ఒప్పని నిరూపించినవాళ్లు నేను ప్రేమించేవాళ్ళు కావచ్చు ....నేను ద్వేషించేవాళ్ళు కావచ్చు ....చెప్పలేను ...
కానీ విచిత్రంగా కొన్నిసార్లు ...నా అభిప్రాయాలు తారుమారవుతూ ఉంటాయి ....వాళ్ళు నా అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉండరు (లేదా వాళ్లకు తగ్గట్టు నా అభిప్రాయాలు ఉండవు ...)...
అంటే నా ముందు నటిస్తూ ఉంటారు కావచ్చు ....నేను వాళ్ళముందు నటించి ఉండొచ్చు ...అప్పుడు నేను వాళ్ళ మీద తప్పు అభిప్రాయం కలిగి ఉంటా ...
అలాంటప్పుడు ....నేను ద్వేషిస్తున్నవాళ్ళు, నా ద్వేషానికి ...నేను ప్రేమిస్తున్నవాళ్ళు, నా ప్రేమకు అర్హులు కాకపోవచ్చు ....
ఈ అభిప్రాయాల సంఘర్షణలో ....ద్వేషించేవాళ్లను పోగొట్టుకున్నా పర్వాలేదు ....కానీ, ప్రేమించేవాళ్లను కోల్పోతేనే సమస్య ....
అలా కోల్పోకుండా ఉండాలంటే ....నా అభిప్రాయాలకు నేను మరో అవకాశం ఇస్తూ ఉంటా ....మరో గమనింపునిస్తూ ఉంటా ....
విచిత్రంగా నాకు నా జీవితంలో ఇప్పటివరకు ....,
ప్రేమించిన వాళ్ళు కూడా ద్వేషించడం నేర్పించారు ....
ద్వేషించిన వాళ్ళు కూడా ప్రేమించడం నేర్పించారు ....
నమ్మిన వాళ్ళు కూడా మోసం నేర్పించారు ...
మోసగించిన వాళ్ళు కూడా నమ్మకం నేర్పించారు ....
గెలిపించిన వాళ్ళు కూడా ఓటమి నేర్పించారు ....
ఓడించిన వాళ్ళు కూడా గెలుపు నేర్పించారు ....
------------------
నాకున్న ఈ చిన్న పరిధిలో ఉన్న వ్యక్తుల్లో ఎవరు ఏం నేర్పిస్తారో ....ఎవరి వలన ఏ జీవిత సత్యాలు బోధపడతాయో చెప్పడం కష్టం ...
అందుకే నేను ద్వేషించేవాళ్ళని కూడా నా దగ్గరే ఉంచమని ... నాకు నేను నచ్చజెప్పుకుంటూ ఉంటా ....😊