Thursday, March 21, 2019

భిన్నాభిప్రాయాల సమ్మిళితమే జీవితం ...

ఈ మధ్య నేను యు ట్యూబ్ లో ఏదో వీడియో కోసం చూస్తుంటే ....నాకు ఓషో వీడియో కనిపించింది ...
మిత్రులు కొన్నిసార్లు కామెంట్స్ లో , కొన్ని పోస్ట్ లలో ....నా కూతురు ఒకటి రెండు సార్లు మాటల సందర్భంలో ... ఓషో చెప్పిన మాటలను ఉదహరించడం ....ఓషో వ్రాసిన బుక్స్ చదవమని నాకు నచ్చుతాయని ఆత్మీయులు చెప్పడం నాకు గుర్తొచ్చి ....."ఓహో ....ఓషో వీడియోస్ కూడా ఉన్నాయా' అని ....ఒక వీడియో మీద క్లిక్ చేశా ....
జీవితం గురించి జీవించడం గురించి ....ఓషో చెప్పిన విషయాలు విన్నప్పుడు ...మిత్రులు చెప్పింది 100% నిజమే అనిపించింది .....
ఆ తర్వాత ....వివాహం గురించి ఆయన చెప్పిన వీడియో మీద కూడా క్లిక్ చేశా ..మొదటివాక్యం అందరూ విడాకులు తీసుకోవాలి అని చెప్పగానే నవ్వొచ్చింది .....
ఈ అభిప్రాయాన్ని నాలాంటి సామాన్యులు చెపితే సమాజం ఏమంటుందో అని తలచుకుని అనుకోండి ....
ఈ విషయమే మాటల సందర్భంలో మా వారితో చెప్పా ...
"అందుకే ఆయన్ని రాళ్లతో కొట్టారు ...." చెప్పారు మావారు ....(నిజమో కాదో నాకు తెలియదు )
ఆశ్చర్యం లేదు అనిపించింది ....
---------------------
ఈ మధ్య అమెజాన్ లో తెలుగు సినిమా ఏదో సెర్చ్ చేస్తుంటే ....బాబు బాగా బిజీ అనే సినిమా వచ్చింది ....
అది అవసరాల శ్రీనివాస్ నటించిన సినిమా ....
నాకు అతని మీద ....అతను నటించే సబ్జెక్ట్ మీద గౌరవం ఉంది ....అతని సినిమా మీద కాస్త అంచనాలు ఉంటాయి ....
సినిమా పోస్టర్ అంత ఆసక్తిగా లేకపోయినా ....ఎలా ఉంటుందో చూద్దాం అని సినిమా చూశా ....
సమాజంలో సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తూ తీసే సినిమాలు తీయాలన్నా ....చూడాలన్నా ....చూసి అంగీకరించాలి అన్నా ....ముందు సమాజం ఇలా ఉంది అని అంగీకరించే ధైర్యం ఉండాలి ప్రేక్షకుడిలో .....
ఆ సినిమా ఆదరణకు గురై ఉంటుంది అని నాకనిపించలేదు ....
నాకు కూడా అలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయిందని తెలియదు కూడా ....
తర్వాత రోజు ....మావారితో చెప్పా ....సినిమా బాగుంది చూడండి ....అని ....
అది చూసి ...."ఇలాంటి సినిమాలు నీకు నచ్చవు కదా ...." అడిగారు ఆశ్చర్యంగా ....
"నచ్చకపోవడానికి ఏముంది అందులో ....అయినా ఎందుకు నచ్చవు ....ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే ఓ మంచి ప్రయత్నం అది ....అందులోనూ ఒక వ్యక్తి బలహీనత ను ఆధారంగా తీసుకుని తీసిన సినిమా ...." చెప్పా
అదే సినిమా గురించి ....మిత్రులతో చర్చించినప్పుడు ....తప్పొప్పుల నిర్ణయం చాలా విచిత్రంగా అనిపించింది నాకు .....
నేనెక్కడున్నాను అని కించిత్ అనుమానం కూడా కలిగింది ....(అది ఏకాంత సంభాషణ ...)
--------------------------
అప్పుడెప్పుడో ....నా చిన్నతనంలో ....చాలా మంది చలం పుస్తకాల గురించి చాటుగా మాట్లాడుకోవడం నాకు గుర్తొచ్చింది ....
అమ్మాయిలు ....ఏ శరత్ పుస్తకాలో ఇష్టం అని చెప్పాలి తప్ప ....చలం పుస్తకాలు చదివామని కూడా చెప్పకూడదు .....
అలా చెప్పిన వాళ్ళను పెళ్లి చేసుకోవడానికి ఏ పురుషుడూ ఇష్టపడడని ఓ ప్రచారం వాడుకలో ఉండేది ....
అఫ్ కోర్స్ ...స్త్రీ స్వేచ్ఛ అనే పదం వ్రాసినప్పుడు ఆయన చేయి కూడా కాస్త వణికే ఉంటుందని నాకు ఓ అనుమానం ....
అంతెందుకు ...ఈ సమాజం ఇలా ఎంతమందిని వ్యతిరేకించలేదు చెప్పండి ....
భూమి గుండ్రంగా ఉందన్నవాళ్ళని ....భగవంతుడు లేడన్నవాళ్ళని ....స్త్రీ కి మనసు ఉంటుంది అన్నవాళ్లను ....ఇలా .... తప్పు అని ఎత్తి చూపడానికి ఈ సమాజానికి హద్దు ఎక్కడుంది ....??!!
------------------------------
అసలు ఈ అభిప్రాయాలు అనేవి ఎందుకు తప్పు అంటారు అని ఆలోచిస్తే ....నాకు ఒక సమాధానం దొరికింది ....కానీ అదే సరైనది అని నేను చెప్పలేను ....
సమాజం లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు ....మనం పెరిగిన వాతావరణం ...ఆర్ధిక స్థితి గతులు ....చిన్నతనం నుండి మనం ఎదుర్కొన్న సంఘటనలు ...సమాజం ....అందరూ మనం మన అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు దోహదపడతారు ....
ఒకసారి ఆ అభిప్రాయాలను ఏర్పరచుకున్న తర్వాత ....మళ్ళీ మార్చుకోవాల్సిన సందర్భం ఎదురయ్యేవరకు .....అదే అభిప్రాయంలో కొన్ని సంవత్సరాలు ఉండిపోతాం ....అదే కంఫర్ట్ జోన్ గా మన అభిప్రాయాల చుట్టూ ఏర్పడుతుంది .....ఆ కంఫర్ట్ జోన్ దాటి రావాలి అంటే ...ఎవరినైనా ఆ అభిప్రాయాల జోలికి రానివ్వాలంటే ....మనం చాలా అసౌకర్యానికి గురవుతాం ....ఎందుకు నా అభిప్రాయం నేను మార్చుకోవాలి కారణాలు చెప్పమంటాం ....
కారణాలు మనకు జరిగే సంఘటనలు సృష్టిస్తాయి ....అవి లేనప్పుడు అభిప్రాయాలు మార్పు చెందవు ....
మనలోనే ఇంత సంఘర్షణ జరుగుతుంటే ....ఎవరో చెప్పిన అభిప్రాయాలు అంగీకరించాలి అంటే ...ఇంకెంత అభద్రతాభావం ఉంటుంది ....
అయితే ....మన స్వభావాన్ని బట్టి కూడా మనం మన అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ ....మార్చుకుంటూ ....సరిదిద్దుకుంటూ ...మెరుగుపరచుకుంటూ ....దాచిపెడుతూ ...వ్యక్తపరుస్తూ ఉంటాం ....
అలాంటి సందర్భంలో మన కంఫర్ట్ జోన్ ఎప్పటికీ దాటి రాలేం అని తెలిసిన అభిప్రాయాలు ....మన కంఫర్ట్ జోన్ లో నుండి ఎవరైనా మనల్ని లాగేస్తారేమో అని భయపెట్టే భావాలు ఎవరైనా చెబితే ...
మనం వెంటనే అవి చాలా తప్పు అంటాం ....వాటికి మనం మన అభిప్రాయాల కారణాలు చెబుతాం ....
------------------------
తప్పు అన్నవాళ్లకు ....మనం ఒప్పు అన్న అభిప్రాయాలు వాళ్ళు ఏర్పరచుకోవడానికి తగిన సందర్భాలు కానీ సంఘటనలు కానీ ....వాళ్ళ జీవితంలో ఏర్పడి ఉండవు .....
ఒప్పు అన్నవాళ్లకు ....మనం తప్పు అన్న అభిప్రాయాలు వాళ్ళు తప్పు అని అంగీకరించడానికి తగిన సందర్భాలు కానీ సంఘటనలు కానీ ....వాళ్ళ జీవితంలో ఏర్పడి ఉండవు .....
ఈ అభిప్రాయం తప్పు కావచ్చు ....ఒప్పు కావచ్చు ....భిన్నాభిప్రాయాల సమ్మిళితమే జీవితం ...
ఇంకా విశ్లేషించాలి !