Saturday, December 29, 2018

అనుభవాత్మకమైన ఆలోచనకు ...ఊహాజనితమైన ఆలోచనకు

అనుభవాత్మకమైన ఆలోచనకు ...ఊహాజనితమైన ఆలోచనకు ఎంతో తేడా ఉంటుంది ....
ప్రాక్టికల్ థింకింగ్ లో ఎమోషన్స్ కి తక్కువ అవకాశం ఉంటుంది ....ఇది కఠినాత్మకమైన ఆలోచన అనిపిస్తుంది .....ఇలా ఆలోచించేవాళ్ళు ఇతరులకి మానవత్వం లేనివారుగా కనిపిస్తారు ....వీళ్ళెప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటారు .... వీళ్ళు బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చినప్పుడు వెనకాడరు ....పని చేయడమే వీళ్లకు పరమార్ధం ...
ఊహాజనితమైన ఆలోచనలో అంతా ఎమోషన్ మిళితమై ఉంటుంది ....ఇదెంత మానవత్వమో కదా అనిపిస్తుంది ....ఇలా ఆలోచించేవాళ్ళు మానవత్వం మూర్తీభవించినట్టుగా కనిపిస్తారు ....వీళ్ళు వాస్తవాలను దగ్గరకే రానివ్వరు ....వీళ్ళు బాధ్యతలను స్వీకరించడానికి ముందుకు రారు ....ఊహల్లో బ్రతకడం వీళ్లకు ఇష్టం ....

అయితే ...ప్రతి మనిషిలో రెండు రకాల ఆలోచనలూ ఉండొచ్చు ....మోతాదును బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించుకోవచ్చు ....
లేదా పనిని, జీవితానుభవాలను బట్టి వాళ్ళ ఆలోచనా విధానాన్ని సవరించుకోవచ్చు ....చెప్పలేం ...
కానీ ...కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ప్రాక్టికల్ గా ఆలోచించి ....ఎదుటివాళ్ళు ఎమోషనల్ గా ఆలోచించినప్పుడు.....లేదా, మనం ఎమోషనల్ గా ఆలోచించి ఎదుటివాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు ... అభిప్రాయబేధాలు రావచ్చు ....
అవి అర్ధం చేసుకుని... ముందుకు సాగితే ...మానవ సంబంధాలు మెరుగు పడొచ్చు ...!🤔

Tuesday, December 4, 2018

బాహ్యకరణ సంతృప్తి...అంతఃకరణ సంతృప్తి....

బాహ్యకరణ సంతృప్తి...అంతఃకరణ సంతృప్తి....
==============================
కొందరు ఇతరులను బ్రతిమాలి పనులు చేయించుకుంటారు ....
కొందరు ప్రాణం పోయినా పనులు చేయించుకోవడానికి ఎవరినీ బ్రతిమాలరు...
అంటే ...ఈ బ్రతిమాలడంలో కొన్ని రకాలు ఉంటాయి ....
ప్లీజ్ ప్లీజ్ ....ఈ పని చేసిపెట్టరా అనో..., ఈ పని మీరు తప్ప ఎవరూ చేయలేరు అనో ...., ఈ పని మీరు కాకపొతే ఎవరు చేస్తారు అనో ...., మీరు ఈ పని చేసిపెడితే నేను మీకు అది ఇస్తా ఇది ఇస్తా అనో ...., రకరకాలుగా అడుగుతారు .....
ఇలా బ్రతిమాలటం ఇష్టం లేకపోతే ...వీళ్ళను బ్రతిమాలటం కన్నా ఆ పనేదో నేనే చేసుకోవడం బెటర్ అని కొందరనుకుంటారు ....
లేదా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించడానికి ఒకరు గుర్తుచేయడమో , బ్రతిమాలడమో ఎందుకు అని కూడా అనుకుంటారు ....
ఇక కొందరు.... ఎవరైనా బ్రతిమాలితే కానీ పనులు చేయరు ....
కొందరు ...ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు .....అది వేరే విషయం ....
బ్రతిమాలించుకుని పనులు చేయాలి అనుకునేవాళ్లు ఎదుటివాళ్లను అవసరం అయినప్పుడు బ్రతిమాలక పోవచ్చు ....
బ్రతిమాలించుకోకుండా పనులు చేసేవాళ్ళు ఎదుటివాళ్లను అవసరమైనప్పుడు బ్రతిమాలొచ్చు ....ఇది మరో విషయం .....
ఏది ఏమైనా అసలు ఈ బ్రతిమాలటం ....బ్రతిమాలించుకోవడం వెనక ఉన్న కథా కమామీషు ఏమిటాని .... ఒకానొక శుభముహూర్తాన కాస్త మెదడు కేంద్రీకరించి ఆలోచించా ....
అప్పుడు నాకు ఒక విషయం బోధపడింది .....
ఎవరు ఏవిధంగా పనులు చేసినా / చేయించుకున్నా .....ప్రతి ఒక్కరికి ఒక విధమైన సంతృప్తి మాత్రం కలుగుతుంది ....
బ్రతిమాలేవాళ్లకు ....ఎదుటివాళ్ళు తమ మాట విని పనులు చేసిపెట్టగానే ....మా పని అయింది కదా అనే సంతృప్తి ....
బ్రతిమాలటం ఇష్టం లేని వాళ్లకు ....బ్రతిమాలకుండా మనం చేయాల్సిన పనులు మనం చేసుకున్నాం ...అనే సంతృప్తి ....
సంతృప్తి ఇద్దరికీ వస్తుంది ....మరి ఇక్కడ సమస్య ఎక్కడుంది ....ఏదో అసౌకర్యంగా ఉంది అని ఆలోచిస్తే ....నేను గమనించినంతవరకు ....,,,
చాలావరకు ఈ బ్రతిమాలేవాళ్ళు ....తాత్కాలికమైన సంతోషానికి ....క్షణికమైన సంతోషానికి ప్రాముఖ్యతనిస్తారు ...ఓ రకంగా చూస్తే వీళ్ళు మనసుతో ఆలోచించి మాట్లాడరు...అలా అని ఏదీ మనసులోకి కూడా తీసుకోరు ....పెదవులమీద నుంచే పదాలు పుట్టిస్తారు ....అప్పటికప్పుడు పని జరగడం కోసం ఏ మాటలైనా చెబుతారు ....అబద్ధాలు ఆడడానికి వెనకాడరు .... ఎదుటివాళ్ళ మీద పొగడ్తలు కురిపిస్తారు....అవి అబద్ధాలని వాళ్లకు తెలిసినా ....ఆశలు చూపిస్తారు ....వీళ్లకు పని జరగడమే ముఖ్యం ....పని జరిగాక హమ్మయ్య అనుకుంటారు ....వీళ్ళు పనిచేయలేని బద్దకస్తులు కూడా కావచ్చు ...."బాహ్యకరణ (అంతఃకరణ పదానికి వ్యతిరేకపదం లా ఉపయోగించాను....నూతన పద ప్రయోగం )సంతృప్తి" మాత్రమే తెలిసినవాళ్ళు ఈ పద్దతి అనుసరిస్తారు ....
ఇక ..చాలావరకు బ్రతిమాలని వాళ్ళు ....శాశ్వతమైన సంతోషానికి ....ఎప్పటికీ గుర్తుండిపోయే సంతోషానికి ప్రాముఖ్యతనిస్తారు...వీళ్ళు మనసుతో ఆలోచించి మాట్లాడతారు ....హృదయం లో నుండి పదాలు పుట్టుకొస్తాయి ....వీళ్లకు పని కంటే మనసు చెప్పింది చేయడం ఇష్టం ....అబద్ధాలు చెప్పి , ఆశలు చూపించి పని చేయించడానికి వీళ్ళ మనసు అంగీకరించదు....మనసు అంగీకరించని , మనసుకి సంతోషం కలిగించని పని వీళ్ళు చేయలేరు ....అలాంటి అబద్ధపు జీవితం బ్రతకడం కంటే మరణమే నయమనుకుంటారు ....వీళ్ళు శ్రమ జీవులు అయి ఉంటారు ...."అంతఃకరణ సంతృప్తి" తెలిసినవాళ్ళు మాత్రమే ఈ పద్దతి అనుసరిస్తారు ....
ఏది సరైన విధానం ...ఎవరు సరైన వ్యక్తులు అనేది నిర్ణయించడం కష్టం ....
ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అనేది .... వారి వారి వ్యక్తిగత అలవాట్లు , అభిరుచులు, జీవిత విధానం పై ఆధారపడి ...వారిచే ....నిర్ణయించుకోబడుతుంది ....!
సమాజం విభిన్న వ్యక్తుల, మనస్తత్వాల కలయిక ....అదే భిన్నత్వంలో ఏకత్వం ....!😍
=============================
(గమనిక : నేను సైకాలజిస్ట్ ని కాదు ....నా దైనందిన జీవితంలో నాకెదురైన వ్యక్తులను గమనించి మాత్రమే వ్రాస్తూ ఉంటాను ....)

Monday, November 5, 2018

ఇదే ఖో ఖో ...

జీవితం అనేది ఒక ఆట అనేది ఆడేవాళ్ళందరికీ తెలిసిన విషయమే ....
----------------------
అయితే, అది వివిధ సమయాల్లో ....వివిధ సందర్భాల్లో వివిధ ఆటలను పోలి ఉంటుంది ....
కొన్నిసార్లు చదరంగంలా కనిపిస్తుంది ....ఎత్తులు ...పైఎత్తులు ...పావులు కదపడం ...చెక్ పెట్టడం ...ఎత్తుకు పై ఎత్తు వేయలేకపోయామంటే ఓడిపోతాం ....
కొన్నిసార్లు ....కబడ్డీలా అనిపిస్తుంది ....ప్రత్యర్థికి చిక్కకూడదు....కూత ఆపకూడదు .....ప్రత్యర్థికి చిక్కి .....కూత ఆపితే అవుట్ ...ఇక్కడా అంతే....శత్రువుకి ఎక్కడా చిక్కకూడదు ....చిక్కినా మన పోరాటం ఆపకూడదు ....
అలాగే ....ఎంతెంత దూరం అనే ఆట గురించి ఇంతకు ముందు చెప్పినట్టు నడక ఆపకుండా గమ్యం చేరుకోవడం ....
ఇహ పరుగు పందెం గురించి చెప్పేదేముంది ...జీవితమే ఒక పరుగు కదా .....
నాకెందుకో అనిపిస్తుంది....మనం ఆ ఆటలేవీ నేర్చుకోకపోయినా ....ఎలా ఆడాలో తెలియకపోయినా .....మన రోజువారీ జీవితంలో ఈ ఆటలన్నీ ఆడుతూనే ఉన్నామనిపిస్తుంది ....
జీవితం మనల్ని ఒక కోచ్ లా ఈ ఆటలన్నీ ఆడిస్తూనే ఉందనిపిస్తుంది ....
ఎప్పుడు మనకు ఏ ఆట అవసరం అయితే ఆ ఆట ఆడిస్తుంది ....కొన్నిట్లో ఓడిస్తుంది ....కొన్నిట్లో గెలిపిస్తుంది ....కొన్నిట్లో తన అనుభవం అంతా జోడించి ఆడిస్తే గెలుస్తాం ....అనుభవం లేని చోట ఓడిపోతాం .....
కొందరికి మంచి కోచింగ్ దొరుకుతుంది .....కొందరికి మంచి కోచింగ్ దొరకదు ....ఫలితం గెలుపు ....ఓటమి .....
నా జీవితం ....నాకు మాత్రం...ఒక్కోసారి ఒక్కో ఆటను పోలి ఉందనిపిస్తూ ఉంటుంది ....
ఈ మధ్య నాకు ఖో ఖో ఆట ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది ....
-------------------------
కొందరు మనకు అనుకూలంగా ఉంటారు (మిత్రులు )....కొందరు మనకు ప్రతికూలంగా ఉంటారు ....(శత్రువులు ) ....
మన మిత్రులు మనల్ని ఏమీ చేయరు ....శత్రువులు మనల్ని అవుట్ చేయాలని ప్రయత్నిస్తారు .... ఒకవేళ వాళ్ళు మనల్ని పట్టుకోలేకపోతే...అలసిపోతే .... మరో శత్రువు సహాయం అడుగుతారు ...ఒక శత్రువు అలుపు తీర్చుకునేవరకు ....మరో శత్రువు మన వెనకే ...వాళ్ళ వెనకే మరొకరు ....మరొకరు .....ఇలా వెంటాడుతూనే ఉంటారు .....
గమనం మార్చుకుంటే ....శత్రువులు మిత్రులు అవుతారు .... మిత్రులు శత్రువులు అవుతారు ....
వాళ్ళను ఏమార్చుకుంటూ ....తప్పించుకుంటూ ....పరుగులు పెడుతూ .......మిత్రులు శత్రువులై శత్రువులు మిత్రులై ....గమ్యం వైపు పరుగులు పెడుతూ .....ఇదే ఖో ఖో ...ఇదే ఆట ....జీవితంలో కూడా ....
------------------------------
ఈ ఖో ఖో అయిపోయాక కబడ్డీ ఆడొచ్చు ....అదీ అయిపోతే చదరంగానికి శ్రీకారం చుట్టొచ్చు ....
అందుకే జీవితమే ఒక ఆట ...కోచ్ ...అన్నీ ....
ఏది ఏమైనా పరుగు ఆపలేం కదా ....అన్నట్టు ....పరుగు కూడా ఆటే కదా ....??!! 😍

Sunday, November 4, 2018

ఇంకా ఇంతకంటే ఏం కావాలి ....??!!

జీవితంలో జీవితం మనకు సహకరించనప్పుడు కూడా జీవించడానికి మనకంటూ కొన్ని జీవన దృశ్యాలు కావాలి ....జీవన అనుభూతులు కావాలి ....జీవన జ్ఞాపకాలు కావాలి ....మొత్తానికి మరో పదిలపరుచుకోగలిగే జీవితం కావాలి ...
అవి జీవితం మనకు సహకరించినప్పుడే మనం ఏర్పరచుకోగలం ....
అంటే ....మనం రోజూ ఉరుకులు పరుగులతో జీవించే జీవితం వేరు ....పదిలపరచుకునే జీవితం వేరు ....

ఉరుకుల పరుగుల జీవితం అంటే ....ఈ క్షణమే అది శాశ్వతం ....మరుక్షణం ఏం చేసామో గుర్తుండదు ....గుర్తుంచుకోవలసిన అవసరం ఉండదు ....అందులో జ్ఞాపకంగా మారే అనుభూతి ఏమీ ఉండదు ....అలా అని అది జీవితం కాదా అంటే ....అదీ జీవించడమే ....కానీ అది అవసరం ...నీ మనుగడకు అవసరం అంతే....
పదిలపరచుకునే జీవితం అంటే....ఈ ఉరుకుల పరుగుల జీవితంలోనే ఏర్పడే శాశ్వత క్షణాలు ....మంచు లాగా ఘనీభవించిన క్షణాలు ....లావా లాగా ఉబికి ఎగిసిన క్షణాలు .... మెరుపై ఓ క్షణం నిలిచిపోయిన క్షణాలు ...అనుభూతిగా మారి మనసుని స్పృశించిన క్షణాలు ...జ్ఞాపకంగా మారి మరు క్షణానికి తరలించబడే క్షణాలు ....మరో జీవితంగా మారి మరు జీవితాన్ని పరిపూర్ణం చేసే క్షణాలు ...ఇదే పదిలపరచుకునే జీవితం ....అదే జీవితంలో జీవితం ....ఇది అస్తిత్వానికి అవసరం అంతే...
మరి మనకు అలాంటి అస్తిత్వానికి అవసరమైన జీవితం ఉందా అంటే ....ఏమో ...ఆలోచించాలి ....
ఈ మధ్యే నేను ఒక కార్యక్రమం గురించి విన్నాను ...
ఒక వారం రోజులు మనం ప్రపంచానికి దూరంగా ఉండాలి ....మనం కాదు... నేను , లేదా నువ్వు ....ప్రపంచానికి దూరంగా ఉండాలి ....
ఏ సమాచార వ్యవస్థ నీకు దొరకదు ....ఎవరూ నీకు తోడుండరు ....ఎవరూ నీతో మాట్లాడరు...ఎవరూ నీకు కనిపించరు ....ఎవరూ నీతో రారు ....బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధం నీకుండదు ....ధ్యానంలో గడపాలి ....నీతో నువ్వే మాట్లాడుకోవాలి ....నిన్ను నువ్వే పలకరించుకోవాలి ....నిన్ను నువ్వు అర్ధం చేసుకోవాలి ....అలా ఓ వారం రోజులుండాలి ...
ఒకవేళ నేను ఆ కార్యక్రమానికి వెళ్తే .....అలా నేనుండగలనా అని ఆలోచించా ......
ఎవరి గురించి ఆలోచిస్తాను ....ఏం ఆలోచిస్తాను ....అసలు వారం రోజులు ఆలోచించడానికి ఏం ఉంది ...అనే ఆలోచన వచ్చింది ....
నా రోజువారీ పనులన్నీ ఎవరు చేస్తారు ....ఆగిపోతాయా ....ఏమీ ఆగిపోవు ....ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలరు ....ఒకటి రెండు రోజులు ....వాళ్లకు అలవాటు అవుతుంది ....
మరి నా వాళ్ళు ? ఎవరు నా వాళ్ళు ....ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ....ఉన్నారనేది నా ఆలోచన మాత్రమే ....ఈ ఆలోచనలేవీ అసలు ఉండకుండా నా గురించి మాత్రమే ఆలోచించుకునే నా జ్ఞాపకాలు నాకు గుర్తొస్తాయా ....
ఏమో ....ఒకవేళ గుర్తొస్తే .....నాకంటూ జ్ఞాపకాలు ఉన్నాయా ....
నేను జీవించినప్పుడు ఏర్పరచుకున్న మరో జీవితం ఉందా ....
అందులో ఏం జ్ఞాపకాలు ఉన్నాయి .....
ఆలోచించి చూసుకుంటే , ....ఉన్నాయి ....చాలా జ్ఞాపకాలు ఉన్నాయి .....నేను పదిలపరచుకున్న మరో జీవితం ఉంది ....అని అర్ధమైంది ...
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ....చాలా చాలా క్షణాల్ని నాకు తెలియకుండానే నేను పదిలపరుచుకున్నాను...
ఎన్నో మంచుముద్దలు ఉన్నాయి ....ఆ మంచుముద్దల్లో కరిగిపోని కరడుగట్టిన కఠిన వాస్తవాలు ఉన్నాయి ....
ఎన్నో లావాలు ఉన్నాయి ....ఆ లావాలో కరిగి ప్రవహించని కన్నీటి కథలు ఉన్నాయి ...
ఎన్నో మెరుపులూ ఉన్నాయి ....ఆ మెరుపుల్లో మాయమైపోని మమతల మధురిమలు ఉన్నాయి ....
వీటన్నిటినీ తన జ్ఞాపకంగా పదిలపరుచుకున్న పదిలమైన జీవితం ఉంది ...ఆ జీవితానికి ఓ అస్తిత్వం ఉంది ...😍
ఇంకా ఇంతకంటే ఏం కావాలి ....??!!

Wednesday, October 31, 2018

నాకు నా అక్షరాలే ....అయినవాళ్లు ....కానివాళ్ళు ....ఆత్మ బంధువులు .....!

మనిషిని ....జంతువులను, ఇతర జీవులను హింసించడం లేదా చంపడం మానవ మనుగడలో భాగం అయి ఉండొచ్చని అనాదిగా వస్తున్న మన నమ్మకం ....
కానీ మనిషిని మనిషే హింసించడం కూడా మానవ మనుగడలో భాగమే అనిపిస్తుంది ....
కొందరికి కనిపించిన ప్రతి ఒక్కరినీ హింసించాలని ఉంటుంది ....
మరి కొందరు ....వాళ్ళ మనసు , శరీరం అసౌకర్యానికి విపరీతమైన బాధకు గురైనప్పుడు ఆ బాధ ఎదుటివారికి కూడా తెలియజేయాలని ....ఎలాగైనా వాళ్ళు కూడా అలాంటి బాధకు గురైతే తమకు కాస్త ఉపశమనం కలుగుతుందని అనుకుంటారు ....
ఇంకొందరు ....తమ కింద ఉద్యోగస్తులను తమ హింస తత్వాన్ని ప్రదర్శించడానికి ఎన్నుకుంటారు ....ఇది ఎదుటివాళ్లను అసహాయులను చేసి ప్రదర్శించే హింస ...
ఇందులో కొందరు పైకి మంచివాళ్ళం అనిపించుకుని కింది ఉద్యోగస్తులను హింసించాలి అనుకుంటే ....వాళ్ళ ఆర్ధిక , సామజిక , కుటుంబ స్థితిగతులు ఏమిటో తెలుసుకుని ....వాళ్ళ హింసను భరించడం తప్ప వీళ్లకు వేరే మార్గం లేదని తెలుసుకున్న వ్యక్తులను హింసకు ఎన్నుకుంటారు ....
ఈ మధ్య ఇండియా వచ్చినప్పుడు చూసా ....బట్టల షాపులో కౌంటర్ దగ్గర కస్టమర్ కి కస్టమర్ కి బిల్లు కట్టించుకోవడంలో ఉన్న గాప్ లో ....అక్కడే పక్కన కూర్చుని బట్టలు మడతబెట్టుకుంటున్న అమ్మాయి నడుము గిల్లి ఏమీ తెలియనట్టు ....మళ్ళీ బిల్లు కట్టించుకోవడానికి వచ్చాడు ఒకడు .....అదొక రకమైన హింస ...
కొందరు ...మూడో కంటి వాళ్లకు తెలియకుండా హింసించాలి అనుకుంటారు ....అంటే వీళ్ళు ఇంక ఎవరికీ చెప్పలేరు అని నిర్ధారించుకుని అలాంటి వ్యక్తులను మాత్రమే హింసకు ఎంచుకుంటారు ....వీళ్లకు సమాజం అంటే చచ్చే భయం ఉంటుంది .....సమాజంలో చెడ్డపేరు రాకూడదు ....పెద్దమనిషితనం వీళ్లకు చెక్కు చెదరకూడదు .....
మరికొందరు ....తమ కష్టాలు ఎదుటివాళ్ళకు చెప్పి ....వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు సంతోషిస్తారు ....అంటే మనకోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కదా అని సంతోషం ....ఎక్కువగా బాధ పెట్టడం కోసం కష్టాలను గోరంత ను కొండంత చేసి చెబుతారు ....
కొన్నిసార్లు కష్టం మాత్రమే చెప్పి దానికి దొరికిన పరిష్కారం చెప్పరు...వాళ్ళు ఎక్కువ కాలం అదే విషయం గూర్చి చింతిస్తూ ఉండాలని ....తర్వాత ఎప్పుడో వాళ్ళు అడిగితే ...ఈ మధ్యే పరిష్కారం అయింది ....అని విచారంగా చెబుతారు ....(అయ్యో వీళ్ళ బాధ పోతుందే ఎలా అని )
ఇలా మనిషిని మనిషి బాధపెట్టడానికి అవకాశం ఇవ్వాలే కానీ ... చిత్ర విచిత్రమైన తత్వాలతో మనిషి ప్రపంచంలో ఉన్న క్రూర జంతువులన్నిటిని మించిపోగలడు .....మనుషులు ఎన్ని రకాలు ఎన్నాయో హింసలు అన్ని రకాలు ఉంటాయని ... నాకు కొందరు నేర్పిన జీవిత పాఠం ....
ఏది ఏమైనా ....
ఇతరులతో మనం బాధింపబడినప్పుడు ఆత్మీయుల దగ్గర సాంత్వన పొందడం ...ఆత్మీయులతో బాధింపబడినప్పుడు ఇతరుల దగ్గర సాంత్వన పొందడం .... మనం అప్పుడప్పుడూ చేస్తూ ఉంటాం ....
కానీ ఆ ఆత్మీయులు ఎవరు ....ఆ ఇతరులు ఎవరు అనేదే మనం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి .....
నేనూ ఈ దుష్ట మానవ ప్రవృత్తికి అతీతమైన వ్యక్తిని కాను ....
నాకు తెలియక నేను ఎవరిని హింసిస్తానో నాకు తెలియదు ....నాకు తెలిసీ నేను ఎవరినీ హింసించాలని అనుకోను ....
ఒకవేళ నన్ను ఎవరైనా హింసిస్తే ఎందుకు వాళ్ళు హింసిస్తున్నారో ఆలోచిస్తా ....
అది వారి మనుగడలో భాగం అయితే దూరంగా జరుగుతా ....
కావాలని హింసిస్తే ....అయినా దూరంగా జరుగుతా....
ఒకవేళ వాళ్ళ బలహీనతలను అధిగమించడానికి అయితే ....కొంతవరకు హింసను భరిస్తా .....
నా బాధ్యతలు నిర్వర్తించడానికి అయితే .... ఆనందంగా హింసను భరిస్తా ....
నా లక్ష్యాలను సాధించడానికి అయితే ....ఆనందంగా హింసను ఆస్వాదిస్తా ....
కానీ, సాంత్వన కోసం అయితే ...అక్షరాలను ఆశ్రయిస్తా ....
నాకు నా అక్షరాలే ....అయినవాళ్లు ....కానివాళ్ళు ....ఆత్మ బంధువులు .....!😍

Friday, October 26, 2018

జీవితం ఎప్పుడూ అద్భుతమే ....

జీవితం ఎప్పుడూ అద్భుతమే ....
అలాగే జీవితం సమస్యల వలయం కూడా ...
మనం ఎన్నో సందర్భాల్లో ....అనుకోకుండా వచ్చిన ఎన్నో సమస్యల్ని అధిగమిస్తూ ఉంటాం ....కొన్ని మనంతట మనమే అధిగమిస్తాం ....కొన్ని మన చుట్టూ ఉన్నవాళ్లు మనకు సహాయం చేస్తే అధిగమిస్తాం .....కానీ ఎలా అయినా ...సమస్యలు ఎదురవక తప్పదు ...మనం అధిగమించక తప్పదు కదా అనిపిస్తుంది ....
అలాగే ఎన్నో అద్భుతాలను కూడా ఆస్వాదిస్తాం ....
అంటే ..., ఒక కీకారణ్యంలో మొదటిసారి ఎవరూ లేకుండా వెలుగులోనూ చీకట్లోనూ ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ....అలా ఉంటుందన్నమాట జీవితం ....
వెలుగులో ప్రయాణం చేయడం అంటే ....వచ్చే సమస్యలను , అద్భుతాలను కాస్త ముందుగా గమనించే అవకాశం ....ఆ సమస్యల్ని తప్పించుకునే అవకాశం ....లేదా అద్భుతాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది ....
ఉదాహరణకు ...ఏ పులో దాడి చేస్తుంది అని పసిగడితే ....దగ్గర్లో ఉన్న చెట్టుమీదకో పుట్టమీదకో ఎక్కి ప్రాణాలని కాపాడుకోవడం .....లేదా అద్భుతమైన లోయలో , సరోవరాలో ఎదురైతే ....కాసేపు ఆగి ఆస్వాదించడమో.....ఇలాంటి సందర్భాలు వెలుగు ఉంటే ఏర్పడే ప్రయాణం ....
ఇక చీకట్లో ప్రయాణం అంటే....వచ్చే సమస్యలనూ చూడలేం ....అద్భుతాలనూ చూడలేం ....అద్భుతాలను చూడకపోయినా పర్వాలేదు ....కానీ సమస్యను చూడలేక పోయామంటే ....సమస్యల వలయంలో చిక్కుకున్నట్టే ....ప్రాణాలను కోల్పోయినట్టు జీవితాలను కోల్పోయినట్టే ....
అఫ్కోర్స్ ఏ ప్రయాణానికి గమ్యం తెలియదనుకోండి ....
కొందరికి వాళ్ళ జీవితం అంతా పగటి ప్రయాణమే కావచ్చు ....రాత్రిని చూసే అవసరమే కలగకపోవచ్చు ....కొందరికి వాళ్ళ జీవితం అంతా రాత్రి ప్రయాణమే కావచ్చు ....పగటిని చూసే అవకాశమే రాకపోవచ్చు ...
లేదా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పగలు రాత్రి అనేవి ...అప్పుడప్పుడు మెరిసే మెరుపులు కావచ్చు ....చూడాలనుకునేంతలో మాయమైపోవచ్చు ....
చెప్పలేం ....
నా జీవితం లో ....పగలు రాత్రి అనే కాల చక్రం మొదలయ్యే నాటికి (ఊహకు వయసొచ్చేనాటికి ) ...కీకారణ్యంలోరాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది ....
నాకు సమస్యలనేవి ఎదురై ....అవి నేను ఊహించనివి అని తెలుసుకునేవరకు ....అది పగటి ప్రయాణమే అనుకున్నా ...సమస్యలే లేవనుకున్నా ....అన్నీ అద్భుతాలే అనుకున్నా ....
సమస్యలు ఎదురయ్యాక ....అవి ఊహించలేకపోయాక తెలిసింది ....నాది రాత్రి ప్రయాణం అని ....జీవితాలే కోల్పోయే ప్రయాణం అని ....అప్రమత్తమవ్వాల్సింది నేనే అని .....
కీకారణ్యం ....చుట్టూ చిమ్మ చీకటి ....దారి తెలియక ....గమ్యం లేక ....పగలును వెతుక్కుంటూ ....వెలుగుని ఊహించుకుంటూ ....గుండెల్లో గంపెడంత మరణ భయంతో.... ప్రయాణం ....
దారిలో ...ఏ రాళ్లు గుచ్చుకున్నాయో ....ఏ క్రూర జంతువులు నాపై దాడి చేశాయో ...ఏ రక్కసి తన కోరల్ని నా శరీరంలో దాచుకుందో ....ఏ అవయవాల్లోనుండి రక్తం ధారలై ప్రవహిస్తుందో ....గమనించడం వృధా అనుకున్నా ....
గుచ్చుకున్న రాళ్లను పూలేమో అనుకున్నా .....
క్రూరజంతువులు దాడి చేస్తుంటే నాకు ప్రేమ పంచుతున్నాయేమో అనుకున్నా ....
కాలికి తగిలిన విషపు నాగుల్ని తాడుగా చేసుకుని చెట్లు ఎక్కడానికి ఉపయోగించుకున్నా...అసలు ఈ దేహం నాది కాదు అనుకున్నా ....
ప్రేమను ద్వేషమేమో అని భ్రమించి వదులుకున్నా ....ద్వేషాన్ని ప్రేమేమో అని ఆశించి హృదయానికి హత్తుకున్నా .....
ఇంతా చేస్తున్నా....మనసులో ఒకటే లక్ష్యం ...
వెలుగుని చూడాలి ....పగటిలో ప్రయాణం చేయాలి ...పగటి వెలుగులో అద్భుతాల్ని చూడాలి .....
నన్ను నేను వెలుగులో చూసుకోవాలి ....నన్ను నేను వెలుగులో చూసుకుంటే ఎలా కనిపిస్తానో ...అని ఆసక్తి గా ఉంది ....
ఇప్పుడిప్పుడే నా జీవితంలో వెలుగు రేఖలు తూరుపు కొండల్ని దాటుకుని రావాలని ....నన్ను తనివితీరా స్పృశించాలని ....ఆరాటపడుతూ నా చెంతకు చేరుకుంటున్నాయి ....
నా వాళ్ళు ...ప్రపంచం ....రూపు రేఖలు మారిపోయిన నన్ను ....మనిషిగా గుర్తించలేకపోవచ్చు ....సభ్య సమాజంలో నేను సభ్యురాలిని కాదేమో అని అనుమానించొచ్చు ....అసలు మనిషినా కాదా అని నాకే అనుమానం రావచ్చు .....
ప్రేమను ప్రేమగా, ద్వేషాన్ని ద్వేషంగా గుర్తించలేకపోతున్నానని నన్ను వెలివేయవచ్చు .....
కానీ నాకు వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి ....సూర్యోదయం చూడగలననే నమ్మకం కలుగుతుంది ...😍

Wednesday, October 17, 2018

తప్పు చేయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ...

తప్పు చేయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ...అనేది జగమూ మనమూ ఎరిగిన సత్యం ....
ఇక్కడ తప్పు అంటే, మనం ఇంతకుముందు చాలాసార్లు చర్చించుకున్నట్టు అది సమాజం దృష్టిలో ....తప్పు అన్నమాట ...
అదే మన దృష్టిలో అయితే ....మనం చేసే లేదా చేయాలనుకునే ప్రతి తప్పుకి (సమాజం దృష్టిలో ) ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది ....ఒకవేళ లేకపోతే మనం సృష్టిస్తాం ....అది వేరే విషయం ....

ఎవరైనా నేను తప్పు చేయలేదు అని కానీ ఎప్పుడూ చేయను అని కానీ చెప్తే ...విని నవ్వుకోవడం మానేసి కూడా దశాబ్ద కాలం అయింది ....అది ఇంకో విషయం ....
నా విషయానికి వస్తే నేను రోజూ అనేక తప్పులు చేస్తూ ఉంటా ....
చిన్నతనం నుండి ....నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి తప్పులు చేస్తూనే ఉన్నా ....
పోనీ ఇప్పటికి అయినా తప్పులు చేయడం తగ్గిందా అంటే ....ఊహు ....ఏమైనా అంటే ఇంకాస్త ముందుకెళ్లి, ఆ తప్పులకు న్యాయపరమైన , చట్టపరమైన , నైతికపరమైన సవివరణలను సోదాహరణంగా సమీకరించుకుని తప్పులు చేసే పరిపక్వతను సంపాదించుకున్నానే కానీ తప్పులు చేయడం తక్కువ చేసుకోలేదు ....
అయితే ఇన్ని తప్పుల్లో కూడా ఒక ఒప్పు (నా దృష్టిలో ) చేస్తూ ఉంటా ....
ఒక తప్పుని ఇక నేను చేయకూడదు అనుకున్నప్పుడు అది చేయకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటా ...అవి అనుసరిస్తూ ఉంటా ....
ఈ మధ్య కాలంలో నా ఆలోచనావిధానాన్ని ....తప్పులు చేసే విధానాన్ని ...నేను గమనిస్తే ....కొన్ని తప్పులు చేసినప్పుడు (నా దృష్టిలో కాదు) ...,,,
ఆ తప్పు సభ్య సమాజానికి ఆమోద యోగ్యం కానప్పుడు, ఎదుటివాళ్ళకు ఇబ్బంది కలిగించేది అయినప్పుడు ....అది మళ్ళీ చేయకుండా ఉండడం కోసం ....,,,ఆ తప్పు చేస్తున్నాను అని నిజాయితీగా బయటకు చెప్పడం నేర్చుకున్నా ...
అది కూడా ఎవరిపట్ల అయితే ఆ తప్పు చేస్తున్నానో ... వారికే నేరుగా చెప్పడం అలవాటు చేసుకున్నా ....
"నా ఆలోచనలు ఇవి ....ఇవి తప్పు అని నాకు తెలుసు ....అయినా నా ఆలోచనలు ప్రస్తుతం అవే...మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను ....లేదా నా ఆలోచనల వలన మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను ....." అని చెబుతున్నా ....
విచిత్రంగా కొన్నాళ్ళకు ఆ ఆలోచనలు బహిరంగ స్థితి సంతరించుకుని ....వాటికవే సరైన దారిలో నడవడానికి ప్రయత్నిస్తున్నాయి ....లేదా స్థితిగతుల్ని ....దాచిపెట్టినప్పటికంటే ఇంకా విశాల దృక్పధం తో అర్ధం చేసుకుని ....అవగాహనతో ముందడుగేస్తున్నాయి ....
తద్వారా కొన్నాళ్ళకు ....ఎవరిపట్ల అయితే మనం ఇబ్బంది కరమైన తప్పు ఆలోచనలు చేసామో .....వారే ఎదురై అలాంటి ఆలోచనలే చేయమన్నా కూడా .....నవ్వుతూ ...."లేదు అది ఇప్పుడు తప్పు అని ....మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అని నాకు అర్ధమైంది ...నా ఆలోచనలను నేను దారి మళ్ళించాను అని చెప్పగల విజ్ఞత మన సొంతమవుతుంది ....."
అదే ఆ ఆలోచనను మనలోనే దాచుకోవడం వలన ....తప్పు చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం ...అని పదే పదే మన ఆలోచనలు మనకే అపార్ధం కలిగిస్తున్నాయి ....
మన ఆలోచనల్లో స్వచ్ఛత , పారదర్శకత ఎప్పుడూ మనల్ని సరైన దారిలో ....మనకు కావాల్సిన దారిలో ...ముందుకు నడిపిస్తుంది అని తెలుసుకున్నా .... ❤️
మన జీవితం కూడా సంతోషానికి ప్రతిరూపమవుతుంది...😍
ఇది ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న తప్పు జీవిత సత్యం .... 😊😍

Tuesday, October 16, 2018

జీవితంలో ఏం సంపాదించుకున్నాం అనేది ఎంత ముఖ్యమో...

జీవితంలో ఏం సంపాదించుకున్నాం అనేది ఎంత ముఖ్యమో...
ఏం వదులుకున్నాం అనేది కూడా అంతే ముఖ్యం ...
సంపాదించుకోవడానికి మనం రాత్రింబవళ్లు ఎలా శ్రమిస్తామో వదులుకోవడానికి కూడా అలాగే శ్రమించాలి ....
పిచ్చుకలు పుల్లా పుల్లా తెచ్చుకుని ఎండనక వాననకా.. గూడు కట్టుకున్నట్టు .... ఎన్నో సంపాదించుకుంటాం .....
అలాగే ఒక్క గాలివానకు గూడు కుప్పకూలిపోయినట్టు అన్నీ కోల్పోతాం ....
సంపాదించుకోవడానికి ఎన్నాళ్ళయితే శ్రమిస్తామో ....వదులుకున్నప్పుడు కూడా అన్నాళ్ళు బాధపడతాం ....
సంపాదించుకున్నప్పుడు నాది అనుకుంటాం ....వదులుకున్నప్పుడు కూడా నాది అనుకుంటాం ....అందుకే సంపాదించుకుంటే సంతోషం ....వదులుకుంటే బాధ ....
మనం సంపాదించుకున్నవాటిల్లో ....అన్నిటికన్నా ఏది వదులుకుంటే బాధ కలుగుతుందా అని ఆలోచిస్తే ....నాది అనుకున్నదంతా బాధే మిగులుతుంది ....
కొన్ని సంపాదించుకున్నప్పుడు మనిషి అమితానందానికి ఎలా లోనవుతాడో ....కొన్ని వదులుకున్నప్పుడు అలా అధఃపాతాళానికి కృంగిపోతాడు ....
ఆనందాన్ని అలవాటు కాబట్టి భరించగలడేమో గానీ ....బాధను భరించలేడు ....
అందుకే ...నా దృష్టిలో ఎంత సంపాదించామో అనేది మాత్రమే గొప్ప కాదు ....ఎంత వదులుకున్నామో అనేది కూడా గొప్ప విషయమే ....
నేనింత సంపాదించాను అని చెప్పేవాళ్ల కన్నా నేనింత వదులుకున్నాను అనే చెప్పేవాళ్ళను చూస్తే .... (అది కూడా నవ్వుతూ ....)వాళ్ళది కదా జీవితం అంటే ....అనిపిస్తుంది ....
ఈ రోజు నా స్నేహితురాలితో మాటల సందర్భంలో ....నేను ఏం సంపాదించుకున్నానో ....వాటి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నానో చెప్పాను ....ఏవి నావి అనుకున్నానో చెప్పాను ....
వాటిని ఎలా వదులుకున్నానో కూడా చెప్పాను ....నవ్వుతూనే ....
నాకూ తెలియదు ... నేను నవ్వుతూ చెప్పగలనని ....
చెప్పాక భలే అనిపించింది ....సంపాదించుకోవడం మాత్రమే కాదు ....వదులుకోవడమూ అంత సులభం కాదని ....
ఇది కదా జీవితం అంటే ....అనిపించింది ...😍
ఇది ఈ రోజు ... నేను తెలుసుకున్న జీవితసత్యం .....!😍

Saturday, October 13, 2018

అందుకే ...,,జీవితం అంత అందమైనది ...

కొన్నిసార్లు,,,
మనం ధైర్యంగా ఉన్నప్పుడు పిరికివాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాం ...
మనం పిరికిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నవాళ్ళ దగ్గర ధైర్యాన్ని తీసుకుంటాం ...
కానీ కొన్నిసార్లు ....,,,
ఎదుటివాళ్ళు పిరికిగా ఉన్నప్పుడు, మనం ధైర్యంగా ఉంటే ..మన ధైర్యాన్ని వాళ్ళే తీసుకుంటారు ....
ఎదుటివాళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడు, మనం పిరికిగా ఉంటే ...మనకు పిరికితనాన్ని వాళ్ళే ఇస్తారు ....
అలాగే కొన్నిసార్లు .....,,,
మనం ధైర్యంగా ఉన్నప్పుడు పిరికివాళ్ళకు దూరంగా జరుగుతాం ....
మనం పిరికిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నవాళ్లకు దగ్గరగా జరుగుతాం ...
ఇదంతా మానవ మనుగడ అస్తిత్వ పోరాటంలో భాగం ....కొన్ని తెలిసి కొన్ని తెలియక కొన్ని అసంకల్పితంగా ...జరిగిపోతూ ఉంటాయి ....
ఏది ఏమైనా ప్రక్రియలో భాగంగా ....,,,
మనం కొందరికి దూరమవుతూ ఉంటాం ....కొందరికి దగ్గరవుతూ ఉంటాం ....కొన్ని బంధాలు వదులుకుంటాం ....కొన్ని బంధాలు ఏర్పరచుకుంటాం ....
ఇది మన జీవనంలో మమేకమైన మనకు తెలిసిన /తెలియని ....గమనించిన / గమనించని జీవన విధానం .... :)

అందుకే ...,,జీవితం అంత అందమైనది .... ప్రతి ఒక్కరూ జీవించాల్సినది .... <3 <3

Wednesday, October 10, 2018

రెండు రకాల వ్యక్తులూ నాకు తరచూ ఎదురవుతూ ఉంటారు ....

చాలామంది మనస్తత్వాలు మనకు బాగా దగ్గరైన తర్వాత గానీ మనకు అర్ధం కావు ....
దగ్గర కావడం అంటే ...అంటుకుపోవడం కాదు ....(కావచ్చు కూడా )
వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళను దగ్గరనుండి గమనించే అవకాశం అన్నమాట ...
తరచూ వాళ్ళను మనం గమనించే అవసరం, అవకాశం కలిగినప్పుడు మనకు వాళ్ళ అసలైన వ్యక్తిత్వం తెలుసుకునే ఆస్కారం కలుగుతుంది ....
కొన్ని క్లిష్టపరిస్థితుల్లో కూడా వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు బహిర్గతం అవుతూ ఉంటాయి ....
అయితే ...కొందరు,
దూరంగా ఉన్నప్పుడు మనకు చాలా చెడ్డవాళ్లుగా .....లేదా ముభావంగా ఉండేవారిలా ....లేదా అసలు సమాజంలో ఉండకూడని వ్యక్తులుగా కనిపిస్తారు ....
అదే వ్యక్తులు దగ్గరైనప్పుడు ...వాళ్ళ మంచితనం , మాటకారితనం , సంస్కారం తెలుసుకునే అవకాశం కలిగి ....అరె వీళ్లనా నేను ఇంతకాలం అపార్ధం చేసుకుంది .....వీళ్ళు నిజంగా ఎంత మంచివాళ్ళు ....అనిపిస్తుంది ...
వీలయితే ఇంకాస్త ముందుకు వెళ్లి ....నేను మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను ....మీరింత మంచి వ్యక్తులనుకోలేదు అని ..... వాళ్లకు క్షమాపణ కూడా చెప్పాలనిపిస్తుంది ....
కొందరు ....
దూరంగా ఉన్నప్పుడు ....సంస్కారంలో ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ చేసేవారిలా ....అబ్బా వీళ్ళతో పరిచయం కలిగితే చాలు జన్మ ధన్యం అనుకునే వ్యక్తుల్లా ...సమాజంలో గౌరవం అనే పదం వీళ్ళను చూసే పుట్టిందా అనుకునేలా ఉంటారు ....
వీళ్ళను నమ్మి దగ్గరకు చేరనిచ్చామా(సహజంగా నే నమ్మేస్తాం అనుకోండి ) ....వాళ్ళ అసహ్యం , దరిద్రగొట్టు బుద్ధులు, కుసంస్కారం, వికారమైన వంకర బుద్ధులు .... అంతా బయటపడి ....అరె ....ఈ ఛండాలాన్ని ఎలా వదిలించుకోవాలా అని ....మన మీద మనకే అసహ్యం కలిగే పరిస్థితి ఎదురవుతుంది .....
వీలయితే ...ఇంకాస్త వెనక్కి వెళ్లి ....వీళ్ళనే వాళ్ళను అసలు నేను చూడనే చూడలేదు ....కలవనే కలవలేదు ....అనుకోవాలనిపిస్తుంది ....
------------------------------
రెండు రకాల వ్యక్తులూ నాకు తరచూ ఎదురవుతూ ఉంటారు ....
మొదటి రకం వ్యక్తులు ఎదురైనప్పుడు ....వాళ్ళు ఎంత సామాన్యమైన వ్యక్తులైనా .... వాళ్ళను ఎంత తొందరగా ... అక్కున చేర్చుకుంటానో ....,,,,😍
రెండో రకం వ్యక్తులు ఎదురైనప్పుడు ....వాళ్ళు ఎంతటి గొప్ప వ్యక్తులైనా ...వాళ్ళను అంత తొందరగా విసిరి కొట్టడానికి ఏ మాత్రం వెనకాడను .....🙅‍♀️
--------------------------
నా గురించి తెలిసినవాళ్లకు ....నేనెంతో .....😍
నా గురించి తెలుసుకునేవాళ్లకు ....నేనంతే....😊
నా గురించి తెలియనివాళ్లకు ....నేనింతే ....😜😉

Wednesday, August 29, 2018

నేను భరించలేని ఓ అతను మళ్ళీ ఎదురయ్యాడు ....

మళ్ళీ ఎదురయ్యాడు ....అతనే ....నేను భరించలేని ఓ అతను మళ్ళీ ఎదురయ్యాడు ....
అతనంటే ఎవరు అంటే ....ఏం చెప్పాలి ...??!!
నేను సహించలేని ఓ శాల్తీ మళ్ళీ తారసపడ్డాడు ...

వాళ్ళని నవ్వుతూ భరించడం అలవాటు చేసుకునేవరకూ మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే ఉంటారా ....??!!
ఏమో ....అదే విధి నిర్ణయం అయితే ....నా సహనానికి పరీక్షే అయితే ....అతను నాకు ఎదురుకావడం సబబే ....
నేను అతని నుండి సహనం , సర్దుకుపోవడం నేర్చుకునేవరకు మళ్ళీ మళ్ళీ అతన్ని నాకు ఎదురు పంపించాలని ప్రకృతి నిర్ణయిస్తే .....అతనిని నేను ముఖాముఖీ ఎదుర్కొనే తీరాలి .....
ఇంతకూ ఆ సెలెబ్రిటీ ఎవరనే కదా ....
అతనే, నాకు సహనం ...భరించడం అనే సుగుణాలను పరిపూర్ణంగా నేర్పించడానికి, దుర్గుణాలు పోతపోసుకుని వచ్చిన "బద్ధకస్తుడు ..."
అబ్బా ....ఎలా కూర్చున్నాడో చూడు ....కుర్చీలో ....జారగిలబడి....మధ్యలో ఏం తోచక ఊగుతూ ...ఉబుసుపోక పొద్దస్తమానూ ఫోన్ లో మెసేజ్ ల కోసం చూసుకుంటూ ....పిచ్చాపాటీ కబుర్ల కోసం మొహం వాచినట్టు అందరి మొహాల వంక చూసుకుంటూ ....ఆవులిస్తూ ....
ఏ పని చెప్పినా ...దానికి సవాలక్ష వంకలు పెట్టి పనిని వాయిదా వేస్తూ ....పని చేయడానికి పుట్టలేదన్నట్టు ....ఇతరుల మీద ఆధారపడడం ఎలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ....భూమికి భారమవుతూ ...ఎలా కూర్చున్నాడో ....
వీడిని నేను భరించే తీరాలా ....వీడిని నేను సహించే తీరాలా .....ఎలా ??!!
ఒళ్ళంతా ...కోపంతో , అసహ్యంతో ఈ బద్దకస్తుడిని చూస్తే రగిలిపోతుందే ....
తప్పదు ....నేనూ భరించడం నేర్చుకోవాలి ....నేనూ సహించడం నేర్చుకోవాలి .....అది వాడి కోసం కాదు ....నా కోసం ....మనిషిగా నేను పరిపూర్ణత సంపాదించడం కోసం భరించాలి .....
అయినా భూదేవి భరించడం లేదా ఇలాంటివాళ్ళందరినీ ....నేనెంత ....
అవును భరించే తీరాలి ...!🙏🙏

Sunday, July 29, 2018

మనుషులు ఎన్ని రకాలు ఉంటారో మనం లెక్కపెట్టలేం ....

మనుషులు ఎన్ని రకాలు ఉంటారో మనం లెక్కపెట్టలేం ....
కానీ మనుషుల్ని అర్ధం చేసుకునేవాళ్ళు రెండు రకాలు ఉంటారు నాకు తెలిసినంతవరకు ....
ఒకరు ఎదుటివాళ్ళ మనసు చదివి అర్ధం చేసుకునేవాళ్ళు ....రెండు ఎదుటివాళ్ళ మెదడు చదివి అర్ధం చేసుకునేవాళ్ళు ....
నేను గమనించినంత వరకు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ....మనసు చదవగలిగేవాళ్లకు మెదడు చదవడం రాదు ...(బహుశా గమనించరు అనుకుంటా )
మెదడు చదవగలిగేవాళ్లకు మనసు అర్ధం కాదు (ఆ వైపు చూడనే చూడరు అనుకుంటా )
ఇదంతా మనం చిన్నతనం నుండి ఏం చదవడానికి ప్రాముఖ్యతనిస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని అనిపిస్తుంది ....🤔
అభద్రతా పరిస్థితుల్లో పెరిగిన వారు ఎక్కువగా మెదడుకి ప్రాధాన్యతనివ్వడం నేర్చుకుంటారు ....వీళ్ళకి స్పందించే , స్పందనలు తెలుసుకునే అవకాశం కలగదు ....వీళ్ళను వీళ్ళు ఇతరుల శారీరక మానసిక దాడుల నుండి కాపాడుకోవడంతోనే గడిచిపోతుంది ....వీళ్లకు బ్రతుకొక పోరాటం ....వీళ్ళు ఎదిగాక, జీవితం సాఫీగా సాగిపోతుందని తెలుసుకున్నా ఇంకా ఆ అభద్రతా భావం వెంటాడుతూనే ఉంటుంది ....వీళ్ళు ఏం చెప్పినా లాజికల్ గా ఆలోచిస్తారు ....స్పందనవరకు ఆలోచనలు వెళ్లనివ్వరు ....
జీవితానికి ఏ దిగులూ చింతా లేకుండా పెరిగినవారు ....మనసుకి ప్రాధాన్యతనివ్వడం నేర్చుకుంటారు ....వీళ్ళు జీవితం ఓ పూలబాట అనుకుంటారు ....వీళ్లకు మెదడు అది చేసే మాయదారి మ్యాజిక్కులు గురించి ఆలోచించే అవసరం రాదు ...ఒకవేళ వచ్చినా ఎందుకు ఆలోచించాలి అని ప్రశ్నిస్తారు ....వీళ్ళు ఎదిగాక కూడా అన్నీ మనసు స్పందనలకు అనుకూలంగా ఆలోచిస్తారు ....ఇతరుల స్పందనలను అర్ధం చేసుకుంటారు ....
అయితే ఇదంతా పక్కనపెడితే ....ఈ మెదడు పండితులకు కూడా మనసు చదవాలని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది (ప్రతి మనిషికి అవసరం )....ప్రయత్నిస్తూ ఉంటారు కూడా ....కానీ పాపం సాధ్యం కాదు ....
మనసు పండితులకు కూడా మెదడు చదవాలని అనిపిస్తుంది ....సాధ్యం అవుతుంది ....కానీ చదవరు ....
ఇక కొందరు అరుదుగా ....మెదడు మనసు రెండూ చదవగలరు ....వీళ్లకు ఎప్పుడూ సంఘర్షణే ....రెండిటి మధ్య సమన్వయం కుదరక ...😥
ఒకసారి సమన్వయం కుదిరితే ...ఎదుటివాళ్లను వీళ్ళు చాలా తేలికగా అర్ధం చేసుకుంటారు ....ఇలాంటి వాళ్ళు నాకు అరుదుగా కనిపిస్తూ ఉంటారు ...నా జీవితంలో ఇలాంటి వ్యక్తులని వేళ్ళ మీద లెక్కించగలిగినంత మందిని మాత్రమే చూసాను ....😍
కానీ నాకు చేతనైనంతవరకు మెదడు చదవగలిగేవాళ్లకు మనసు చదవడానికి ....మనసు చదవగలిగేవాళ్లకు మెదడు చదవడానికి సహాయపడాలని ఆశిస్తూ ఉంటా ...😍
ఏమో ...కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ....🤔
(గమనిక : నేను మానసికశాస్త్ర నిపుణురాలిని కాను ...ఇవి జీవితంలో నాకు ఎదురైన వ్యక్తుల / సంఘటనల ఆధారంగా వ్రాసినవి మాత్రమే ! )

Sunday, June 24, 2018

ప్రపంచంలో ఇంతమంది శాడిస్ట్ లను ....మంచితనం ముసుగేసుకున్న పిచ్చివాళ్లను చూశాక ..

చిన్నతనం నుండి నాకు అనుభవం లోకి వచ్చిన ఒక జీవిత సత్యం ఏమిటంటే ....,,
నాకు ఏదైతే భయమో ,నేను ఏదైతే చేయడానికి భయపడతానో .....అది తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ....
అది చేయాల్సిన పరిస్థితి ఎంతవరకు ఎదురయ్యేదంటే ....ఆ పని అంటే నాకు భయం పోయేంత వరకు ,మళ్లీ జీవితంలో ఇంకెప్పుడూ ఆ పని అంటే నేను భయపడనంత వరకు ....!
--------------------------------
ఉదాహరణకు ….,,
నా చిన్నతనంలో....ఇంజక్షన్ చేయించుకోవడం అంటే నాకు చాలా భయం .....
టీకాలు వేసేవాళ్ళు స్కూల్ కి వస్తున్నారంటే స్కూల్ మానేసేవాళ్ళం ....అప్పట్లో టీకాలకు ఉన్న విలువ ఏమిటో కూడా ఇంట్లో చెప్పలేదు ....టీకాలు వేస్తే జ్వరం వస్తుందనే నమ్మకం ...
అలాగే ఒకరోజు స్కూల్ కి టీకాలు వేసే వాళ్ళు వస్తున్నారని తెలిసి, స్కూల్ మానేసి పిల్లలందరం ఇంట్లో ఉన్నాం ....(హ్యాపీ గా ) ...
అంతలో పిల్లల్లో ఎవరో ఒక పుకారు లేవదీసారు ....బడి మానేసిన పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళ ఇంటికొచ్చి మరీ టీకాలు వేస్తున్నారట అని ....ఇంకేముంది ...మా మొహాలన్నీ నల్లగా మాడిపోయాయి .....మా ఆనందం అంతా ఆవిరైపోయింది .....ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి లా తయారైంది మా పరిస్థితి .....
తప్పించుకోవాలి...తప్పించుకోవాలి ....కానీ ఎలా ....??
పిల్లలందరం ఒక కమిటీ వేసి ఎక్కడో ఒకచోట దాక్కోవాలి అని నిర్ణయించాం ...
అప్పట్లో మా ఇంట్లో & మా బాబాయి వాళ్ళింట్లో ఇంటి నిండా పత్తి మండెలు (క్వింటాళ్ళ కొలది ప్రత్తి ని ఒకచోట కుప్పగా పోయడం) ఉండేవి ....
అర్ధమైంది కదా ...అవును ....అదే అయిడియా మాకు కూడా వచ్చింది ....ఆ పత్తి మండెలే మా ఉనికిని కాపాడే రహస్య స్థావరాలు అని నిర్ణయించుకున్నాం ....
మా నాయనమ్మకు భయపడి కొంతమంది పిల్లలు మా ఇంటికి రావడం కుదరదు అని నిర్ద్వందంగా ప్రకటించారు ....
సరే అని మా బాబాయి వాళ్ళింట్లోకి వెళ్లి లోపల గడి వేసుకుని .....అందరం పత్తి మండె మీదకు ఎక్కి తలా ఒక మూల కూర్చున్నాం ......కూర్చున్న కాసేపటి తర్వాత మాకు మళ్లీ భయం వేసింది ... మా బాబాయి వాళ్ళ ఇంటి గడి అంత గట్టిగా ఉండదు ....గట్టిగా తోసేస్తే వచ్చేస్తుంది ....ఒకటి రెండు సార్లు పరీక్షించుకుని చూసి అక్కడ మాకు రక్షణ లేదు అని గమనించాం .....ఫలితం మళ్లీ కమిటీ .....
ఈ సారి కమిటీలో ....మా నాయనమ్మ నుండి వాళ్లకు రక్షణ కల్పిస్తానని నేను ఇచ్చిన హామీ ఫలితంగా అందరూ మా ఇంటికి రావడానికి అంగీకరించారు .....
సీన్ అదే ....ప్లేస్ మారింది .....అస్సలు శబ్దం చేయకుండా ...గుస గుసగా మాట్లాడుకుంటూ .....వినపడని వాళ్లకి చెవిలో చెప్పుకుంటూ అక్కడ చెమటలు కక్కుకుంటూ ...మేం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు .....సాయంత్రం అయింది ....
టీకాలు వేసేవాళ్ళు రాలేదు .....మా పెద్దవాళ్ళు వచ్చారు ....నా వీపు విమానం మోత మోగించారు .....
ప్రత్తి మండె అంతా తొక్కి... సర్వ నాశనం చేశామని ....
నిజం చెప్పొద్దూ ....ఆ టీకా ఏదో చేయించుకున్నా ... మాకు అంత నొప్పి ఉండేది కాదేమో ....??!!
ఆ తర్వాత అదృష్టమో దురదృష్టమో తెలియదు ..నా కడుపులో ఓ పాప ఉందనీ ....ఆ పాపకు టీకా నా ద్వారానే వేయించాలని డాక్టర్ చెప్పేవరకు ....నాకు ఇంజక్షన్ చేయించుకోవాల్సిన అవసరం రాలేదు ....
అప్పుడు నా భయం నాకు మళ్ళీ గుర్తొచ్చి ....పక్కనే ఉన్న మా వారి చేయి గట్టిగా పట్టుకున్నా భయంతో ....
పట్టుకున్న చేయి నన్ను చూసి (నా భయాన్ని చూసి ) నవ్వింది ....
నవ్వింది ఎవరి చేయి అయినా కానివ్వండి .....ఆ భయం గురించి మరో పదిమందికి తెలియడం ఇష్టం లేక అయినా కానివ్వండి ....అందువల్ల కలిగిన ఉక్రోషం నాకు నెమ్మదిగా ఇంజక్షన్ అంటే ఉన్న భయాన్ని క్రమంగా అధిగమించేలా స్ఫూర్తినిచ్చింది ....
ఇప్పుడు ఇంజక్షన్ చేస్తుంటే ....ఆ నీడిల్ వైపే నవ్వుతూ చూస్తూ ఉంటా అనుకోండి ...అది వేరే విషయం .....
======================
అలాగే ....
ఎన్నో భయాలు ....ఎన్నెన్నో భయాలు...చాలా భయాలు ....అలా అధిగమిస్తూనే ఉన్నా ....జీవితంతో ప్రయాణిస్తూ ....
చివరకు నాకు తెలిసింది ఏమిటంటే ....ఏది అంటే నేను భయపడతానో అది నేను అధిగమించేవరకు నాకు ఎదురవుతూనే ఉంటుంది .....
ఒకసారి అధిగమించానా ....దాని తస్సాదియ్యా ....అది పత్తా లేకుండా మాయమైపోతుంది ....అప్పుడు నిజానికి సరదా పడుతూ ఉంటా ....రా రా రా ...అని ....,రాదు ....
చాలా మంది అంటూ ఉంటారు ....మీకు ఏం భయాలండీ అని ...
నాకూ భయం ఉందంటే ....ఓ పట్టాన నమ్మరు ఎంత చెప్పినా ....
అయితే వ్యక్తి వ్యక్తికీ భయాలు మారుతూ ఉంటాయి ....
కొందరికి మనుషులంటే భయం ....మరి కొందరికి జంతువులంటే భయం ...జంతువులు మనిషిని చూసి భయపడుతూ ఉంటాయని తెలుసు కానీ మనిషిని చూసి మనిషి భయపడడం ఏమిటి అనిపిస్తుంది కొన్నిసార్లు ....
అయినా ఇక్కడ మీకో రహస్యం చెప్పాలి ....ఇప్పుడంటే ఇలా అనిపిస్తుంది కానీ ....
ఈ మనిషిని చూసి భయపడడం నేనూ చేసేదాన్ని నాకు తెలియకుండానే ....ముఖ్యంగా పిచ్చివాళ్ళంటే నాకు భయం ఉండేది ....దాన్ని ఎలా అధిగమించానో నాకూ తెలియదు ....అధిగమించానో లేదో కూడా నాకు తెలియదు ...ఏమో ...
అసలు ఈ భయం నాకు ఎలా మొదలైందో మీకు చెప్పాలి ....
------------------------
నా చిన్నతనంలో ...నాకు ఊహ తెలిశాక ....మా ఊర్లోకి పిచ్చి శంకరాయ్ అని ఒక వ్యక్తి వచ్చాడు అని అందరూ చెప్పుకుంటుంటే వినేదాన్ని ....
అతను వేణుగోపాలస్వామి గుడిలో ....శివుడి గుడిలో (రెండూ ఎదురెదురుగానే ఉండేవి /ఉన్నాయి ) ఉన్నాడని ..అక్కడ ఎవరైనా ఏదైనా పెడితే తింటూ ....గుళ్లో ప్రసాదం పెడితే తింటూ ....అక్కడ బావి చుట్టూ ఉన్న గుంటల్లో నీళ్లు తాగుతూ ...ఉండేవాడని కూడా నాకు గుర్తు ....
అతను ఎలా వచ్చాడో ....ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికీ తెలియదు ....
అతనికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు ....
బహుశా శంకరుడి గుడిలో ఉండడం వలన శంకరాయ్అని పిలిచారేమో ....లేదా ఎప్పుడో తనలో తానే తన పేరు చెప్పుకుంటుంటే ఎవరైనా విన్నారేమో ....ఏమో ...తెలియదు ....
అయితే అతను పిచ్చివాడు కాబట్టి పసి పిల్లలని ....నా అంత పిల్లలని కూడా భయపెట్టడానికి తల్లితండ్రులకు / పెద్దవాళ్లకు ఓ ఆయుధం ....
ఒకసారి మా నాయనమ్మ నేను చెప్పిన మాట వినకపోతే ...."పెద్దబావి కాడ / గుడి కాడ పిచ్చి శంకరాయ్ ఉన్నాడు ....పట్టుకుపోతాడు" అని చెప్పేది
అలాగే మిగతా పిల్లలకు కూడా ఈ విలువైన సమాచారం పెద్దవాళ్లందరి చేత చేరవేయబడింది .....
ఇక అప్పటినుండి ...ఆ పెద్దబావి వైపు ఏదైనా పని ఉందని చెప్తే ...."అక్కడ పిచ్చి శంకరాయ్ ఉన్నాడు ....నేను వెళ్లను" అని చెప్పేదాన్ని
అలా అలా అందరిలో అతనంటే ఒక భయం అయితే మాత్రం ఏర్పడి పోయింది ....
అలాంటి రోజుల్లో ....నాకూ ఓ రోజు అతన్ని చూసే అవకాశం కలిగింది ....
మా అమ్మ చెప్పిన ఏదో పనిమీద ఆ వైపు తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది ...
అక్కడి వరకూ పరుగులు తీసుకుంటూ వెళ్లిన నా కాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆగిపోయాయి ....
నా కాళ్ళ పట్టీల చప్పుడు వినపడకుండా జాగ్రత్తపడుతూ ....మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ ఉన్నా ....
ఆ క్షణంలో నేనతన్ని మొదటిసారి చూసాను .....
బాసింపట్లు వేసుకుని గుడి అరుగుమీద కూర్చుని ఉన్నాడు ....అతని జుట్టు పాయలు పాయలుగా వేళ్ళాడేసుకుని తైల సంస్కారం లేకుండా ఎండిపోయి ఉంది ....అతని గడ్డం జుట్టు కలిసిపోయి ఏది ఏదో గుర్తుపట్టలేనట్టుగా ఉంది ...చిరిపోయి మట్టిగొట్టుకుపోయిన లాగు చొక్కా వేసుకుని ఉన్నాడు ...స్నానం చేసి ఎన్నో యుగాలయిందేమో అన్నట్టుగా ఉంది అతని వాలకం ....
అంతకు మించి అతని వర్ణనకు ఉపయోగపడే ఆభరణాలేవీ లేవు అతని దగ్గర ....వయసు ఓ ముప్పై ఉండొచ్చేమో అనిపించేలా ఉన్నాడు ....అతని పక్కన అతనికి సంబంధించిన మూట కూడా ఏదో ఉంది ....తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది ....
ఇదంతా అతనికి అనుమానం రాకుండా గమనించుకుంటూ గుండెల్లో భయం చిక్కబట్టుకుని ....నెమ్మదిగా ముందుకు వెళ్లి ...అక్కడినుండి ఒక్క పరుగున వెళ్ళిపోయా ....
ఆ తర్వాత కూడా నేను అతనిని ఎన్నో సార్లు చూసా ....కొన్నిసార్లు చెత్తలో ఏవో ఏరుకుంటూ కనిపించేవాడు .....కొన్నిసార్లు తన మూటమీద తలపెట్టుకుని నిద్రపోతూ కనిపించేవాడు .....కొన్నిసార్లు ఎవరో పెట్టినవి తింటూ కనిపించేవాడు ....కానీ ఎవరికీ ఏ హానీ చేసినట్టు నేను ఎవరిదగ్గరా వినలేదు ....ఆ తర్వాత అతను ఎక్కడికి పోయాడో కూడా ఎవరికీ తెలియదు ....అలాగే మాయమైపోయాడు ....
------------------------------
కానీ ఇన్నేళ్ల తర్వాత నాకు అతను మళ్ళీ గుర్తొచ్చాడు ....
విచిత్రంగా అతనంటే నాకు ఈసారి భయం వేయలేదు ....అతని మీద నాకు ఇష్టం , గౌరవం కలిగింది ....ఇప్పుడు మళ్ళీ నేను పనిమీద ఆ దారిలో వెళ్తే ....అతను ఆ గుడి గట్టు మీద కూర్చుని ఉంటే....నా పట్టీలు చప్పుడయ్యేలా అతని ముందు నుండే ఎగురుకుంటూ నడవాలనుంది....అతని పక్కన కూర్చోవాలని ఉంది ....భయం లేకుండా అతని కళ్ళలోకి చూడాలనుంది ....పిచ్చి శంకరాయ్ అని ప్రేమగా ....కాదు కాదు ...శంకర్ అని ...పిలవాలనుంది...
--------------------------
ఏమో ...అతనంటే నాకు భయం ...ఎందుకు ఎలా పోయిందో నాకు తెలియదు ....బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నాకు అంతకంటే ఎక్కువ పిచ్చి ఉన్నవాళ్లే కనిపించడం వలన అయి ఉండొచ్చు ....అంతకంటే ఎక్కువ భయంకరమైన వాళ్లనే నేను చూడడం వలన కావచ్చు ....
వాళ్ళు కనిపించిన ప్రతిసారి నా గుండె చప్పుడు వాళ్లకు వినిపించకుండా ఊపిరి శబ్దం బిగబట్టి బ్రతకడం ...అలవాటు కావడం వలన కావచ్చు ....
వాళ్ళు సూట్లు , బూట్లు వేసుకుని ...నీట్ గా షేవ్ చేసుకుని .... కళ్ళల్లో క్రూరత్వాన్ని , రాక్షసత్వాన్ని అవలీలగా అనుమానం రాకుండా నవ్వుతూ ప్రదర్శించడం వలన కావచ్చు ...మనుషుల అంతర్ముఖం , బాహ్య ముఖం గుర్తుపట్టలేకుండా కలిసిపోయి అసహ్యంగా కనిపించడం వలన కావచ్చు ....
-------------------------
చెప్పలేను ....ఒక్కటి మాత్రం అనిపిస్తుంది ...ప్రపంచంలో ఇంతమంది శాడిస్ట్ లను ....మంచితనం ముసుగేసుకున్న పిచ్చివాళ్లను చూశాక ...ప్రపంచానికి అతను పిచ్చి శంకరాయ్ కావడంలో /చేయడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది ....!
(ఇంకా ఉండొచ్చు ....లేకపోవచ్చు ....సశేషం కావచ్చు ....శేషం కావచ్చు ...చెప్పలేను )