Tuesday, October 17, 2017

ఒక్క డాలర్ ఖర్చు పెట్టి మిలియన్ డాలర్ రావాలని కోరుకోవడం తప్పే ...


(హెచ్చరిక ....లాటరీ టికెట్ కొనడం వ్యసనం ..అనుసరించుటకు అనర్హం ....)


ఒక్క డాలర్ ఖర్చు పెట్టి మిలియన్ డాలర్ రావాలని కోరుకోవడం తప్పే ...
ఖచ్చితంగా వ్యసనం అయిన లాటరీ టికెట్ కొనడం కూడా తప్పే .....
కానీ అందులో నా జ్ఞాపకాలను వెతుక్కోవడం ....జ్ఞాపకాలలో ఉన్న అనుభూతులను చెమరింపు కోరడం తప్పు కాదుగా .....
అలాంటి సందర్భాలను స్నేహితులతో పంచుకోవడం కూడా తప్పు కాదు కదా .....
ఒకానొక రోజుల్లో .............................
నాన్న వేరే ఊరులొ జాబ్ చేసే రోజుల్లో 15 రోజులకు లేదా నెలకోసారి ఇంటికి వచ్చేవారు ...మూడు బస్సులు మారాల్సి రావడమే అందుకు ఒక కారణం ....ఇంటికి వచ్చే రోజు నేను నాన్న కోసం ఎంత రాత్రయినా మేలుకునే ఉండేదాన్ని ....(అసలే మనం లేట్ గా నిద్ర పోయే అలవాటు ...ఇంకా మేలుకోవడం ఏమిటి )...నాన్నతో అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పడం(చెప్పించుకోవడం) అంటే నాకు చాలా ఇష్టం ....మేమిద్దరం ఒకేలా మాట్లాడుకునేవాళ్ళం ....సరదాగా సాగేవి మా కబుర్లు ....మా ఊరులొ కబుర్లన్ని నేను చెబితే ...తను జాబ్ చేసే ఊరులొ కబుర్లన్నీ నాన్న చెప్పేవారు .....ఊరు నిశ్శబ్దంగా ఉండటం వలన మా మాటలు విని మా నాన్న వచ్చారని అందరికి తెలిసిపోయేది ....అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నామని మా అమ్మ విసుక్కున్నా మా కబుర్లు వినడం మా అమ్మకు కూడా ఇష్టమని నాకు లీలగా తెలిసిపోయేది ....
అలా కోడికూసే వేళకు అతి కష్టంగా కునుకు తీసేదాన్ని ....రోజూ ఎంత నిద్రలేపినా లేవనిదాన్ని పొద్దున్నే నిద్రలేచేదాన్ని .....అన్ని పనుల్లో నాన్నతో కలిసి ఉండటం కోసం ...వేపపుల్లతో పళ్ళు తోముకుని ....అరుగుమీద కూర్చునేవారు ....కుర్చున్న వెంటనే ఏం చేయాలో నాకు బాగా తెలుసు ....ఇంట్లోకి పరుగు పరుగున వెళ్లి బియ్యం డబ్బాలో ఉన్న చెక్కరకేళి అరటి పళ్ళల్లో బాగా మగ్గిన పండు ఒకటి తీసుకుని కొడవలితో దాన్నితొక్క తీయకుండా ముక్కలుగా కోసి (అలా తినడం నాన్నకు ఇష్టం) నాన్నకు ఇచ్చేదాన్ని ....అది తిని తర్వాత కాఫీ తాగేవారు నాన్న ....అంతలో మా నాయనమ్మ కూడా వచ్చి కూర్చునేది ...నాయనమ్మ రాగానే నాన్న తన జీతం ఇవ్వడం కోసం ఇంట్లో గోడకున్న కొక్కేనికి తగిలించిన చొక్కా తెమ్మని నాతో చెప్పేవారు ......
అదేమిటో తన జీతం ఎప్పుడు తెచ్చినా నాయనమ్మకే ఇచ్చేవారు ......మళ్లీ అక్కడే మా అమ్మను పిలిచి మా నాయనమ్మ అమ్మ చేతిలో పెట్టేది ......
ఇంతోటి దానికి నాయనమ్మకివ్వడం ఎందుకో అర్ధమయ్యేది కాదు .....కానీ అదే తల్లిని గౌరవించడం అంటే అని జీవితంలో తర్వాత గానీ నాకు అర్ధం కాలేదు .....
సరే నాకు అందులో సరదా ఏంటంటే నాన్న జేబులో ఏమున్నాయో చూడటం ....నాకు కావాల్సినవి అడగటం .....
కొత్త రూపాయి నోట్లు ...రెండు రూపాయల నోట్లు ....ఇదు రూపాయల నోట్లు అంటే నాకిష్టం ....అవి తళ తళా మెరిసిపోవాలి ...అవి నాకిష్టం అని తెలిసి నా కోసమే తెచ్చేవారు నాన్న .....అవి తీసుకుని మడత నలగకుండా పెట్టుకుని సంబరపడిపోయేదాన్ని ......ఎందుకో అవి ఖర్చుపెట్టాలంటే ప్రాణం పోయేది .....వేడి వేడి బెల్లం జిలేబి కొనుక్కోవాలంటే మాత్రం రెండింటికి సమానంగా ఓట్లు పడేవి .......
అయితే జేబులో పనికి రాని కాగితాలన్నీ నాన్న పడేస్తున్నప్పుడు నా దృష్టిని ఒకటి చాలా ఆకర్షించేది ....అదే లాటరీ టికెట్ ...."నాన్నా..... ఈ లాటరీ టికెట్ ఎక్కడిది నాన్నా" అని అడిగేదాన్ని .....
అది..... ఆ షాపు అతను "ఒక్కటి కొనండి మాష్టారూ" అని బ్రతిమాలతాడమ్మా ....అందుకే కొంటాను ....అనేవారు ...
ఆ షాపు అతని కోసం నెల నెలా తప్పనిసరిగా ఒక లాటరీ టికెట్ మాత్రం కొనేవారు ....
ప్రైజ్ వచ్చిందా నాన్నా అని అడిగితే మాత్రం ...."ఏమో ....చూడలేదమ్మా ..."అనేవారు ....
కానీ నాకు మాత్రం ప్రతినెలా ఆ లాటరీ టికెట్ చూడటం .....ప్రైజ్ వచ్చిందా నాన్నా అని అడగటం ....ఆ తర్వాత ఫక్కుమని నవ్వడం అలవాటైపోయింది ....నాతోపాటు నాన్న కూడా నవ్వేవారు ....
.........................................................................................................................
ఈ రోజు ఒక చోట ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది ....అనుకోకుండా ఎదురుగా లాటరీ టికెట్ కనపడింది .....ఎందుకో నాన్న గుర్తొచ్చారు ...వెంటనే ఒక డాలర్ నోట్ తీసి ఆ మెషిన్ లో వేసా ....అది ఒక టికెట్ ఇచ్చింది .....(జీవితంలో మొదటిసారి లాటరీ టికెట్ కొన్నా ....)అది ఎంతో ఏమిటో కూడా చూడలేదు .... సన్నటి నీటిపొర అనుకుంటాను టికెట్ మీద ఏం రాసుందో సరిగా కనబడనివ్వలేదు ....టికెట్ పర్సులో దాచుకున్నా ....
కానీ ఒక్క డాలర్ కి మిలియన్ డాలర్స్ వస్తాయా ....అని తల్చుకుని ఫక్కుమని నవ్వేసా ....నాతోపాటు నాన్న కూడా నవ్వినట్టే అనిపించింది ....!!

(wrote and published on October 17 2014 )

ఎవరికైతే ....తన మీద తనకు నమ్మకం ఉండదో ...

ఎవరికైతే ....తన మీద తనకు నమ్మకం ఉండదో ....వాళ్ళే ఇతరులను అనుక్షణం కింద పడేయాలని చూస్తూ ఉంటారు ....
ఒక్కో మెట్టు ........ఎక్కడానికి కలలు కంటూ....మనం జాగ్రత్తగా నిర్మించుకుంటుంటే ....దాన్ని కాలితో తన్నేస్తూ ఉంటారు ....
మనం ఏదైనా చిన్న తప్పు చేయగానే ...."నీకు ఇది కూడా రాదా అంటారు ...." మెట్లు నిర్మించుకునే సమయంలో తప్పులు సహజం అని అర్ధం చేసుకోలేక ....
అదే తమ మీద తమకు నమ్మకం ఉంటే...,"కొన్నిసార్లు పొరపాటు జరుగుతూ ఉంటుంది....ఎవరికైనా సహజం ....అర్ధం చేసుకోగలను ...." అంటారు ....
మన ఆలోచనా విధానం కూడా మారాలి ....ఎదుటివాళ్ళు మనల్ని కింద పడెయ్యగానే ....మనం కింద పడిపోకూడదు ....🙅‍♀️
వాళ్ళ ఆలోచనా విధానం అధమ స్థాయిలో ఉంది ....అందుకే అలా అంటున్నారు అని అర్ధం చేసుకుని ..వాళ్ళని ఖండించాలి , లేదా నవ్వి ఊరుకోవాలి .....😀
"నాకింత చిన్నది రాకపోవడం/ తెలియకపోవడం ఏమిటి నీ అమాయకత్వం కాకపోతే" అని నవ్వుతూ చెప్పాలి ....   
లేదా ...అవును, ఇంత చిన్నది అయినా నాకు తెలియదు అని నమ్మకంగా చెప్పాలి ...😋
ఇవన్నీ మీకు తెలుసనుకోండి ...నాకు నేను గుర్తు చేసుకుంటున్నా ఓసారి ...🤔

ప్రేమను సృష్టించేవాళ్ళు, ప్రేమను స్వీకరించేవాళ్లు,

ప్రేమను సృష్టించేవాళ్ళు,
ప్రేమను స్వీకరించేవాళ్లు,
ఈ రెండు రకాలవాళ్లే ఉంటారు ఈ ప్రపంచంలో ....
ప్రేమను తయారు చేసేవాళ్ళు ఎప్పుడూ వాళ్ళల్లో వాళ్ళే జీవిస్తూ ....వాళ్ళల్లో వాళ్ళే స్ఫూర్తి పొందుతూ ....వాళ్ళల్లో నుండి ప్రేమను పుట్టిస్తూ ఉంటారు ......
ప్రేమను స్వీకరించేవాళ్లు ....ప్రేమను సృష్టించే వాళ్ళ దగ్గరనుండి , ప్రేమను స్వీకరిస్తూ ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉంటారు ....
అయితే, ఎవరు ప్రేమను సృష్టిస్తున్నారు , ఎవరు ప్రేమను స్వీకరిస్తున్నారు అనేది ....ఈ తేడా ఇద్దరికీ తెలియకుండానే జీవితకాలం గడిపిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ...
లేదా ప్రేమను సృష్టిస్తున్నాం అని భ్రమ పడేవాళ్ళు కూడా ఉంటారు ....ప్రేమను స్వీకరిస్తున్నాం అని తెలియని వాళ్ళు ఉంటారు ....ప్రేమను స్వీకరిస్తున్నాం అని తెలిసినవాళ్ళు కూడా ఉంటారు ....
ఏది ఏమైనా ప్రేమను సృష్టించేవాళ్ళల్లో కూడా ....సృష్టిస్తున్నాం అని తెలిసినవాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు ....
అలా తెలుసుకున్న రోజు ....ప్రేమ కోసం ఇక వాళ్ళు ఆలోచించాల్సిన స్థితి ఉండదు .....తమ హృదయంలో నుండి ప్రేమను అనుక్షణం సృష్టించేపనిలోనే వాళ్ళు ఉంటారు ....❤️
అయితే .... ప్రేమను స్వీకరించేవాళ్ళు ఇతరులపై మేం ప్రేమ కోసం ఆధారపడుతున్నాం అని తెలియకుండానే ఆధారపడుతూ ఉంటారు .....ఎదుటివాళ్ళు ప్రేమ ఇవ్వకముందే ఆధారపడడం .... ప్రేమను పొందడం కోసం ఏం కావాలో అవన్నీ చేస్తూ ఉండడం ....ఆ ప్రేమ ఎక్కడికి పోతుందో అని భయపడుతూ బ్రతకడం ...ఆ ప్రేమ పోతే మానసిక వ్యాధికి లోను కావడం చేస్తూ ఉంటారు ....  😥
ప్రేమను సృష్టించేవాళ్ళు ప్రేమను సృష్టించడం ..అది అందరికీ పంచాలని ఆరాటపడం ....ప్రేమ కావాల్సిన వాళ్లకు ప్రేమను ఇచ్చి ....సంతృప్తి పడడం ....ఇంకా ఇంకా ప్రేమను సృష్టించడం ....ప్రేమ సృష్టించలేనని భయపడకుండా బ్రతకడం చేస్తూ ఉంటారు ....😍😘
-----------------------------
అయితే వీటన్నిటికి అతీతంగా ఆలోచిస్తే....కొందరు ప్రేమను స్వీకరించడానికి కూడా భయపడుతూ ఉంటారు ఎందుకు అనే ప్రశ్న ఎదురైంది నాకు .....??!!
నాకు తెలిసిన సమాధానం ...,,,
ప్రేమను మన దగ్గరనుండి పొందాలి అంటే ....మళ్ళీ మనకు తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమో అనే సందేహం ....ప్రేమను మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన సందర్భం వస్తే ....ప్రేమ కోసం ఎవరిదగ్గరో ఆధారపడే తన దగ్గర ప్రేమ ఎక్కడినుండి వస్తుంది ,,,...ప్రేమే లేకపోతే ఎదుటివాళ్ళకు ఎలా ఇవ్వగలను అనే భయం .....
వీరు ప్రేమను ప్రేమతో కాకుండా మరే వస్తువుతో అయినా కొనుక్కోవాలని చూస్తారు ....
ఇతరులకు డబ్బు , అధికారం , పదవి లాంటివి ...ఏదో ఒకటి ఇచ్చి తాత్కాలిక ప్రేమను తయారు చేసుకుని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని ప్రేమను పొందుతూ ఉంటారు ...
అదే మనం ఏం ఆశించకుండా జీవితాంతం వాళ్ళని ప్రేమిస్తూ ఉంటామని వాళ్లకు నమ్మకం కలిగితే వాళ్ళు మన దగ్గర నుండి ప్రేమను తీసుకోవడానికి సందేహించరు ....
వాళ్లకు నిబంధనలు లేని ప్రేమ కావాలి ....
ఏది ఏమైనా ....ప్రేమను సృష్టించేవాళ్ళు వీళ్ళను అర్ధం చేసుకుని నిబంధనలు లేని ప్రేమను వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నించి ....ప్రపంచాన్ని ప్రేమ మయం చేయక తప్పదని నా అభిప్రాయం ....😍

Wednesday, October 4, 2017

నేను ఎప్పటికీ శ్రీలక్ష్మి లాగే ఉండాలి ..!

"నేను ఈ రోజు, (ఇంతకుముందు అభిప్రాయ బేధాలు వచ్చి కొన్నాళ్ళు దూరంగా ఉన్న) నా స్నేహితురాలిని కలిశాను ....ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంది ....తన మాటలు చేతలు అన్ని ఎంత అబద్ధంగా ఉన్నాయో ....అంతకు ముందు ఎన్నో సంవత్సరాలు స్నేహంలో ఉన్నప్పటికంటే ....కొన్నాళ్ళు దూరం అయ్యాక ....మళ్ళీ కలిశాక ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది ...అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది స్పష్టంగా గుర్తించగలుగుతున్నాను .... " చెప్పింది నా డాటర్ బాధగా నాతో ....
"నువ్వు చూసేది అబద్ధం అని ఇప్పుడు తెలుసుకున్నావు ....దగ్గరగా ఉన్నప్పుడు ఆ అబద్ధాన్ని గుర్తించలేకపోయావు ....అదే నిజమని నమ్మావు...
ఇప్పుడు నువ్వు ఇది అబద్ధం అనుకుంటున్నావు సరే ...కానీ మరొకటి ఏదో నువ్వు నిజమని నమ్ముతున్నావు ....అది కూడా కొన్నాళ్ళు పోయాక అబద్ధం అని తెలుస్తుంది ....
బహుశా, ఇప్పుడు అబద్ధం అని నమ్ముతున్నది అప్పుడు నిజం అని నీకు సందిగ్ధం కలిగే అవకాశం ఉంది ....
భవిష్యత్తులో మరో నిజం నీకు కనిపించినప్పుడు ఇప్పుడు ఉన్నవన్నీ అబద్ధాలు గా కనిపించొచ్చు ....లేదా నిజాలుగా మారిపోవచ్చు ....ఇలా నువ్వు జీవితం అంతా నిజం అని నమ్మినవే అబద్ధాలుగా మారిపోతూ ఉంటాయి ....మళ్ళీ మళ్ళీ నిజం కోసం అన్వేషిస్తూనే ఉంటావు ....
నాకు తెలిసి నేను ఇంతవరకూ నిజాన్ని ఎప్పుడూ చూడలేదు ......జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తుంది అనే ఆశతో అన్వేషించడమే జీవితం అని ....మనం ఏర్పరచుకున్న నమ్మకం మాత్రమే నిజం అని అర్ధం అయింది ...." వివరించా ...
"అయితే నిజమే లేకపోతే.. ఇక దేనికోసం ఈ పరుగు ....?"
"అందుకే దేనికోసం పరుగులు పెట్టొద్దు ....ఒక్క క్షణం నువ్వు దేనికోసమో ఆశించి పరుగులు పెట్టావా ....ఆ క్షణం నువ్వు నీ జీవితాన్ని కోల్పోయినట్టే .....
ఈ క్షణం , ఈ రోజు .....నీ మనసుకు , శరీరానికి ఏం కావాలి అని ఆలోచించుకో ....అవి ఇవ్వడానికి కృషి చేయి ....ఏదైనా నీ దగ్గరనుండి ఆశించి ఎవరైనా వస్తే ....నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు ....లేదా ఎవరి దగ్గరనుండి అయినా నువ్వు ఏదైనా ఆశిస్తే అడుగు ....
మొత్తానికి నీకు కావాల్సింది నీకు దొరికిందా... సంతృప్తిగా సంతోషంగా బ్రతుకు ....నీకు దొరకలేదా ...అయినా సంతోషంగా సంతృప్తిగా బ్రతుకు ...
ప్రతి క్షణాన్ని ఆస్వాదించు ....అది ఎలా ఉన్నా సరే ....!"
నేను అనుసరించే జీవితాన్ని వివరించా ...దగ్గరగా ఉండి వాళ్ళు చూసేదే అయినా .....!
"నువ్వు మమ్మల్ని కనకుండా ఉంటే....ఓషో అయి ఉండేదానివి అనిపిస్తుంది ...." చెప్పింది ....ఏదో ఆలోచిస్తూ ....
"హ హ ....నాకు ఓషో అవ్వాలని లేదు నాన్నా ....నేను ఎప్పటికీ శ్రీలక్ష్మి లాగే ఉండాలి ....నా జీవితాన్ని నేను ఆస్వాదించాలి .....నాకు మరొకరిలా ఉండాలని ఎప్పటికీ ఉండదు ...." నవ్వుతూ చెప్పా ....
"అలా ఎందుకు చెప్పాను అంటే ... నీకు గొప్ప పేరొస్తుంది కాదా ...అందరికీ అర్ధమయ్యేలా ఇంకా బాగా చెప్పగలుగుతావు ...." అభిప్రాయ వ్యక్తీకరణ ...
"ఆ పేరు కోసం ...ఎవరిలాగో అవ్వాలనుకోవడం కూడా అబద్ధమేగా ....దాని కోసం పరుగులు పెట్టడమే కదా ....అప్పుడు మనం మన జీవితాన్ని ఎక్కడ ఆస్వాదిస్తున్నాం ....ఈ క్షణం ఎక్కడ జీవిస్తున్నాం ....నా దృష్టిలో ఓషో ఓషోనే ....నేను నేనే ..." ఆ ఓషో ఏం చెప్పాడో నాకేం తెలియకపోయినా వివరించా ....
"నాకు నీతో మాట్లాడాక చాలా సంతోషంగా అనిపిస్తుంది ....థాంక్స్ " చెప్పింది ప్రేమగా .....😍

Saturday, September 30, 2017

"ప్రపంచంలో నీకు ఉన్నంత అహం నేను ఎవరిలోనూ చూడలేదు ...."

"ప్రపంచంలో నీకు ఉన్నంత అహం నేను ఎవరిలోనూ చూడలేదు ...." ఈ రోజు ఒకరు నాతో అన్నారు ...🤣
ఒక్కసారిగా ఫక్కుమని నవ్వొచ్చింది .....🤣
పండగ పూట నన్నింత మాట అంటారా ....మాటకు మాట సమాధానం చెప్పు ....అని నాలో ఉన్న అహం అహాన్ని నిద్రలేపబోయింది కానీ ....వద్దులే ...అది అలా నిద్ర పోవడమే నీకు నాకు ఆరోగ్యం అని ....అహం హాయిగా నవ్వింది ....🤣
నిజానికి వాళ్ళు / మరెవరో అన్నారని కాదు కానీ ....నాకు (చాలా / కొద్దిగా నాకు తెలియదు ....) అహం ఉన్న మాట నిజం ....😊
అయితే ఈ అహం అన్ని సమయాల్లోనూ ....అందరి దగ్గర మనం ప్రదర్శించం ....
అసలు మనలో ఉందని కూడా మనకు తెలియదు ....ఎవరో చెప్తే తప్ప ...
వాళ్ళు ఎలాంటి సందర్భంలో చెప్పారు .. మనలో ఉన్న అహాన్ని వాళ్లెలా చూసారు అని ఆలోచిస్తే ....., మనం వాళ్లకు అహాన్ని చూపించే అవసరాన్ని వాళ్ళు కలిగించారు ....అని అర్ధం చేసుకోవచ్చు ....🤔
మనలో అహం అనేది ఎప్పుడూ సుషుప్తావస్థలో ఉంటుంది ...😴
ఓ రకంగా అది నిద్రిస్తున్న సింహం లాంటిది ....🦁
సింహం దానిని నిద్రపోనిస్తే ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించదు ....దాని మీద ఎవరైనా రాళ్లు వేస్తే అది గర్జిస్తుంది ...దానికి ఎవరైనా నొప్పి కలిగిస్తే అది కూడా పంజా విసురుతుంది ....దాన్ని ఎవరైనా చంపాలని చూస్తే ....అది తిరిగి వాళ్ళ ఉనికే లేకుండా కబళించాలని చూస్తుంది .....
అలాగే అహం కూడా ....🤔
తనను ప్రశ్నిస్తే ....అవమానిస్తే ....తక్కువ చేసి చూస్తే ....అది ఎలాగైనా మళ్ళీ అలాంటి సందర్భం తనకు ఎదురుకాకుండా ప్రశాంతంగా ఉండడం కోసం ...వాళ్ళని తనకంటే తక్కువ చేసి , వాళ్ళను కూడా అవమానించి ....వాళ్ళను కూడా తక్కువ చేసి ....తన కోపం చల్లార్చుకుంటుంది .....
నా చిన్నతనం నుండి నాలో అహం ఉందని గుర్తించిన వాళ్లంతా ...ఎక్కువ శాతం ....అలా నన్ను బాధపెట్టిన వాళ్ళు ....లేదా అవమానించిన వాళ్ళుగా గుర్తించబడ్డారు ...☝️
వాళ్ళనలా పక్కన పెడితే ....మరి కొందరు ....అహాన్ని కావాలని రాళ్ళేసి రెచ్చగొట్టి ...అది కోపంతో గర్జిస్తే ....అబ్బే సరదాకి రాళ్లేశాను అని ....అని తెలివిగా తప్పుకునేవాళ్ళు ....😢
మరి కొందరు ...అహాన్ని బాధపెట్టి ....అది నొప్పితో అరిస్తే ....చూశావా దీన్నే అహం అంటారు ....అని గుచ్చి చూపించేవాళ్ళు ...😥
అయితే ....చాలాకాలం రకరకాల ఆటలన్నీ చవిచూశాక ....ఒకరోజుకి ...ఇవన్నీ అర్ధమై హాయిగా నవ్వుకునే స్థాయికి అహం చేరుకుంటుంది ....
అలాంటి వ్యక్తులనే నిరహంకారి అని పిలుస్తాం ...
ఇక ఈ స్థితికి చేరుకున్నాక ....ఎవరు ఏ విధంగా ..నిద్ర లేపాలి అని ప్రయత్నించినా .... అది గుర్రు పెట్టి నిద్రపోతుంది తప్ప ....ఏ మాత్రం చలించదు...
నేను ఇంకా ఆ నిరహంకార స్థితికి చేరుకోలేదు ....కానీ ప్రయత్నిస్తున్నా ....😢
ఆ నిరహంకార స్థితికి చేరుకోవాలంటే ...ముందు
మనలో అహం ఉందని గుర్తించాలి ....అది గుర్తించాక ఎప్పుడెప్పుడు అది గర్జిస్తుందో పరిశోధించాలి ....ఎలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు అది నిద్ర లేస్తుంది ....అని ....అప్పుడు దానికి ఏ సమాధానము చెప్పి నిద్ర లోకి పంపించాలో ....సాధన చేయాలి .... దాన్ని శాశ్వత సుషుప్తావస్థలో ఉంచాలి ....😔
మొత్తానికి మన అహం పై మనం విజయం సాధించాలి .....ఆ విజయం కోసమే నా కృషి ....😍

Tuesday, September 19, 2017

ధైర్యంగా దగ్గరవ్వాలని....😍

ఆత్మీయులను , బంధాలను , స్నేహితులను , బంధువులను ....ఎవరైనా కానివ్వండి ....మనం వాళ్ళను ఎందుకు దూరం చేసుకుంటాం ....ఏ సందర్భంలో దూరం చేసుకుంటాం ....??!!
అని ఆలోచిస్తే ....నాకు అర్ధమైంది ఏమిటంటే .....,,,
వాళ్ళ వలన మనకు ఏదైనా ....మానసికంగా , శారీరకంగా , ఆర్థికపరంగా .....నష్టం / కష్టం కలిగినప్పుడు మనం వాళ్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాం ....అని
ఇంకా కాస్త ముందుకు వెళ్లి ఆలోచిస్తే ....మన వాళ్ళు అనుకున్న వాళ్లకు ఎవరైనా నష్టం / కష్టం కలిగించినా ...అది మనకే కలిగింది అనుకుని ....మనం కొందరికి దూరమవుతాం ...అది వేరే విషయం ...
అయితే జీవితం అంతా ఇలా అందరినీ దూరం చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమా అని ఆలోచిస్తే ....నాకెందుకో అది సరైన పరిష్కారం కాదనిపించింది ....
ఇలా కాదు .....అని ఆలోచించి ....
ఎవరైనా నాకు ఏదైనా నష్టం / కష్టం కలిగిస్తే ...వాళ్లకు, "నీ ప్రవర్తన వలన నాకు ఈ నష్టం / కష్టం కలిగింది ...దయచేసి ఇలా ఎప్పుడూ చేయకండి ...." అని చెప్పడం అలవాటు చేసుకున్నా ....
కొన్నిసార్లు వాళ్ళు చేసిన పని నాకు ఏ విధంగా బాధ కలిగిస్తుందో విడమరచి చెప్పా ...
కొన్నిసార్లు ఏడుస్తూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ....నాకు అంత బాధ కలిగించారు మీరు అని చెప్పడం కోసం ....😥
విచిత్రం ఏమిటి అంటే ....అలా చెప్పినప్పుడు ....అవతలి వాళ్ళు...
బాధ కలిగించాం అని ఒప్పుకోవడానికి నిరాకరించారు ....కొన్నిసార్లు , నువ్వలా చేయడం వలెనే మేమిలా చేసాం అని ....తిరిగి నా మీదే తప్పుని మోపడానికి ప్రయత్నించారు ....
కొందరు ....సారీ చెప్పి, అదే ప్రవర్తనను మళ్ళీ మళ్ళీ కనబరుస్తున్నారు ....
మరి కొందరు ....ఆ విషయాన్ని దారి మళ్లించి మనం ఆ విషయం మర్చిపోయేలా చేయాలని ...ఏడుస్తున్న పిల్లల చేతిలో చాకోలెట్ పెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు ....
అయినా నా ప్రయత్నం నేను ఆపకుండా ....మళ్ళీ ధైర్యంగా "మీ ప్రవర్తన వలన నాకు ఈ విధమైన బాధ కలిగింది ....దయచేసి మళ్ళీ అలా ప్రవర్తించకండి ...." అని చెబుతూనే ఉన్నా ....
ఇప్పటివరకు అలా చెప్పించుకున్నవాళ్ళల్లో ...."నేను నిన్ను బాధపెట్టి ఉంటే....క్షమించు ...మళ్ళీ ఎప్పుడూ ఇలా ప్రవర్తించను...." అని మనస్ఫూర్తిగా చెప్పినవాళ్ళే లేరు ....😥 (
అయినా ఆపకుండా ....నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను ...
ఇందంతా నేను చేసేది ....పిరికిదానిలా వాళ్లకు చెప్పకుండా నేను వాళ్లకు దూరం కాకూడదని ....వాళ్ళ ప్రవర్తన నాకెలా బాధ కలిగిస్తుందో వాళ్లకు తెలియజేసి ..ధైర్యంగా దగ్గరవ్వాలని....😍
అప్పుడు కూడా ఒక సమస్య ఎదురవుతుంది .....😥
(అదేమిటో మిత్రుల ఊహాశక్తికి వదిలేస్తున్నా ..... 🙂)

ఆ క్షణాలే నాకు జీవితాన్ని జీవించిన సంతృప్తి కలిగించిన క్షణాలు ....😍

ఈ రోజు మధ్యాహ్న్నం....
ఒక సమస్య గురించి ....ఏమైంది అని అడిగిన నా డాటర్ కి ....,,
"కక్ష్య తీర్చుకునే అవకాశం ఉన్నా కూడా ....అన్ని పరిస్థితులూ నాకు అనుకూలంగా ఉన్నా కూడా ....ఆలోచించి ....క్షమించి ...వదిలేశాను ....
కక్ష్య తీర్చుకుంటే సంతోషంగా ఉండేదాన్నో లేదో నాకు తెలియదు ....కానీ క్షమించి వదిలేసినందుకు నేను ఈ క్షణం చాలా సంతోషంగా ఉన్నాను ....
మంచి పని చేసాను అని అనుక్షణం నాకు నేను చెప్పుకుంటున్నాను ....
నిజంగా క్షమించడం చాలా కష్టంగా అనిపించింది ....ఎంతో సంఘర్షణకు గురయ్యాను ....కానీ క్షమించాక వచ్చే ఆనందం ముందు ఆ కష్టం చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ...." అని ఓ వ్యక్తి పట్ల నా ప్రవర్తనను వివరించా ....😍
నిజం చెబుతున్నాను ....
నిజానికి నాకు క్షమా గుణం చాలా తక్కువ ....😥ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా ....
నిజం చెప్పొద్దూ ....జీవితం ఎంతో హాయిగా అనిపిస్తుంది ...❤️
ఇన్నాళ్లూ ...మనకు లేదా ఇతరులకు ద్రోహం చేసిన వాళ్ళ మీద ....ప్రతీకారం /పగ తీర్చుకోవడమే పర్యవసానం అనుకునేదాన్ని ...
కానీ ఇప్పుడు అర్ధమవుతుంది ....అలా ద్రోహం చేసినవాళ్ళని క్షమించడం లోనే గొప్పతనం దాగుందని ....క్షమించడమే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అని ...🤔
క్షమించడం అంటే ....
వాళ్ళేదో చేసార్లే ... వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అని వదిలేయడం కాదు ....అది అసమర్ధత కూడా అవుతుంది .....
అలా చేసిన వాళ్ళ పట్ల .... అంతకంటే ఎక్కువ బుద్ధి చెప్పగలిగే అవకాశం మనకు వచ్చినప్పుడు (అలా వచ్చే వరకూ పోరాటం చేయాలి ) ...ఆ సందర్భంలో కూడా క్షమించడమే ఇక్కడ మనం అలవరచుకోవాల్సింది....
అప్పుడే మన నిజమైన నిగ్రహ శక్తి తో కూడిన క్షమా గుణాన్ని మనకు మనం పరిచయం చేసుకుంటాం ....🙂
ఈ రోజు...ఆ క్షణాలే నాకు జీవితాన్ని జీవించిన సంతృప్తి కలిగించిన క్షణాలు ....😍

Wednesday, September 13, 2017

ప్రేమైక జీవితం మన సొంతం అవుతుంది ...!

జీవితంలో ఒక దశలో మనకు భయం వేస్తుంది ....మనకు దొరికిన అభిమానం జీవితాంతం ఉండదేమో అని .....మనకు దొరికిన ప్రేమను మనం కోల్పోతామేమో అని ....లేదా ఈ ప్రేమ, అభిమానం లేకుండా మన జీవితం ఏమవుతుందో అని .....ఇలా ....
కానీ ఒక్కసారి .....ఒక్కసారి ఆ అభిమానం ,ప్రేమ ఏం లే
కుండా లేదా పోగొట్టుకుని కొంతకాలం బ్రతికాక ....వాటికి మనం ఎంత విలువ ఇచ్చాము మనల్ని కూడా కాదని అని తెలుసుకుంటే ....మన నుండి మనల్ని ఎంత కోల్పోయామో అర్ధం అవుతుంది ....
అప్పుడే మనల్ని మనం అభిమానించడం ,ప్రేమించడం నేర్చుకుంటాం ....
ఇక ఒకసారి మనల్ని మనం ప్రేమించాక ,అభిమానించాక.....ఇతరుల ,అభిమానం ప్రేమ మన వద్దకు వచ్చి రెండు రోజులుండి పోయే అతిధులే అని మనకు అర్ధం అవుతుంది ....
అతిథుల్ని మనం వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తాం , మన దగ్గర ఉన్నది పంచుతాం , గౌరవంగా చూసి పంపిస్తాం ....
అతిథుల్ని మనం ఆహ్వానించినా , వాళ్ళంతట వాళ్ళే వచ్చినా ....శాశ్వతంగా ఉండిపోరుగా ....
మళ్లీ వాళ్ళు వెళ్ళిపోయాక మనం , మన జీవితం ....యధాతధంగా .... 
ఇక భయాలేం ఉండవు ....ప్రేమైక జీవితం మన సొంతం అవుతుంది ....... 

Tuesday, September 12, 2017

నేను అందరికీ ప్రియమైన శత్రువుని అన్నమాట ....😍


జీవితంలో ...
వీళ్ళు నాకు చాలా ఆత్మీయులు , స్నేహితులు,బంధువులు,హితులు , సన్నిహితులు అని అనుకున్నవాళ్ళే ...నన్నుఆగర్భ శత్రువుగా పరిగణిస్తూ ఉంటారు ...నేను తప్పనిసరై వాళ్ళతో శత్రుత్వం ప్రకటించేవరకు నన్ను వదిలిపెట్టరు...అస్సలు నేను ఈ మధ్య శత్రుత్వం అనే పదం మర్చిపోయాను అని మొత్తుకున్నా ....వాళ్ళ ప్రవర్తనతో శత్రుత్వం కలిపి రంగరించి నా మీద గుమ్మరిస్తారు ....😥
మరో కోణంలో ....వీళ్ళు నాకు ఆగర్భ శత్రువులు అనుకున్న వాళ్ళు ....నాకు ప్రాణ మిత్రులుగా మారిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే .....నేను వాళ్ళను మిత్రులుగా చేసుకుంటా రమ్మని ...బొట్టు పెట్టి పిలిచినా కూడా ... వాళ్ళు కాదు మాకూ శత్రుత్వమే ఇష్టం అంటారు .....😜
ఇలా అందరూ నాతో మితృత్వం కన్నా శత్రుత్వాన్నే ఇష్టపడతారు ....ఎందుకో అర్ధం చేసుకోవాలి ....🤔
అలా ...నేను అందరికీ ప్రియమైన శత్రువుని అన్నమాట ....😍

Sunday, September 10, 2017

"ఇంక నా జీవితంలో ఏ పురుషుడికి చోటు లేదు ...."

"ఇంక నా జీవితంలో ఏ పురుషుడికి చోటు లేదు ...." చెప్పింది... ఓ స్త్రీ ఈ రోజు నాతో ....తన జీవితంలో ఎదురైన చేదు వాస్తవాల గురించి వివరిస్తూ ....
"ఆ ఆలోచనే... మీకు ఇప్పుడు ఉన్న బాధను రెట్టింపు చేస్తుంది ....మీ మనసుని , శరీరాన్ని డిప్రెషన్ లోకి వెళ్ళమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ....ఒక పురుషుడి వలన మోసపోయిన స్త్రీ ....మరో పురుషుడు నా జీవితంలో లేడు ....అని ....ఒక స్త్రీ వలన మోసపోయిన పురుషుడు...నా జీవితంలో మరో స్త్రీ లేదు అని తాత్కాలికంగా అనుకోవడం ....ఆ బాధ నుండి ఉపశమనం పొందడం కోసమో ...ఆ బాధను భరించలేకో అయి ఉంటుంది ....
ఆ ఆలోచన రానీయకండి ....జీవితం ఎంతో విశాలమైనది ....
మరో పురుషుడికి చోటు ఉంటే ఉంటుంది ...ఉండకపోతే ఉండదు ...మీకు తెలియని మీ జీవితాన్ని మీరు శాసించకండి ....
ఏమో ....మరో అద్భుతమైన ....మీ మనసుని అర్ధం చేసుకునే పురుషుడు మీ జీవితం లోకి రావచ్చు ...అప్పుడు మీరు కాదనలేరు ...
ఎవరూ రాకపోవచ్చు ....అప్పుడు మీరు బాధపడలేరు ....
జీవితాన్ని ఏం జరిగినా జరగనివ్వండి ....మరో పురుషుడికి చోటులేదు అనే నిర్ణయం ఇప్పుడే తీసుకోవాల్సిన అత్యవసరం ఏముంది ....??!! మరో పురుషుడు రేపే ఎదురై మీ జీవితం లోకి వస్తాను అంటే ఆనందంగా ఆహ్వానించండి ....లేదా ఎన్నాళ్ళున్నా ఎవరూ రాకపోయినా వారి కోసం అన్వేషించకండి....
జరిగిన సంఘటనలను ....జరగనిచ్చి ....మీ బాధ్యతలను మీరు నిర్వర్తించుకుంటూ ... ....సంతోషంగా ఉండండి ...." చెప్పా ....

మన అభిప్రాయాలు ...

మన అభిప్రాయాలు ...
ఎదుటివాళ్ళ లోపాలను తడిమి చూడనంతవరకు వాళ్ళ దృష్టిలో అవి గొప్ప భావాలు ....  
ఒక్కసారి, వాళ్ళ లోపాలను తడిమి చూస్తే ...
అంతే ...కట్టలు తెగిన వారి ఆగ్రహానికి సాక్ష్యం చెప్పలేని మౌన గీతాలు ....  

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!
ఇప్పుడున్న చోటు నుండి మరో అడుగు ముందుకు వేయడానికో , మరో మెట్టు పైకి ఎక్కడానికో ప్రయత్నిస్తున్నావా ....??!!
అయితే..... ఒక విషయం తప్పనిసరిగా గమనించి ,గుర్తుపెట్టుకోవాలి .....,,,
మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్పకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ....ఏ సమస్యా లేదు ..... కానీ ....
అలా కాకుండా ...మనవాళ్లే కదా , మన మేలు కోరేవాళ్లే కదా అనుకుని ..... చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్తే ....మనల్ని కదలకుండా గట్టిగా అయినా పట్టుకుంటారు , లేదా కిందకు లాగేస్తారు .....
అంతే కాకుండా ....వాళ్లు ఏ క్షణంలో అయినా మనల్ని వదిలేయొచ్చు ....అందుకు కూడా సిద్ధంగా ఉండాలి .....
ఎందువలననగా ....,,,,
మనం వాళ్ళ కింద అయినా ఉండాలి , లేదా వాళ్లకు సమానంగా అయినా ఉండాలి ....వాళ్ళ కంటే ఎత్తుకు ఎదగడానికి ఎవ్వరూ ఒప్పుకోరు .....ఏ రోజుల్లో అయినా ....
"లోక సహజ జీవన సిద్ధాంతం ....!!"  
----------------------------
(గమనిక : ఇందులో "నువ్వు" అంటే అర్ధం "నేను" అని ....
ఇది అన్ని వేళలా అందరికీ వర్తించదు .... అని అర్ధం  )