Friday, August 16, 2019

"నాకేం కావాలి ?!"

"నాకేం కావాలి ?!"
నన్ను నేను ఇలా ప్రశ్నించుకోవాలి అని నాకు తెలియనప్పుడు ...
స్కూల్ బాగ్ కావాలనో ....పెన్ను కావాలనో ....పుప్పు ముద్దలో జీడిలో కావాలనో అనిపించేది ....అప్పటికవే నా ఆలోచనలు ....
"నాకేం కావాలి ..??!!" 
నన్ను నేను అడగడానికి కూడా భయం వేసే రోజులేమో అవి ....
అప్పుడా ప్రశ్న గుండెనుండి గొంతువరకు వచ్చి ఆగిపోయేదేమో ....బహుశా నాకే వినిపించేది కూడా కాదేమో ....
"నాకేం కావాలి..?!"
నన్ను నేను ప్రశ్నించుకోవడం నేర్చుకున్నా .. సమాధానం తెలియని ..అవగాహన లేని రోజులవి ...
"నాకేం కావాలి..?!"
నన్ను నేనే రహస్యంగా ప్రశ్నించుకుని ....సమాధానము సమాజం వింటుందేమో అని గుండెలోనే సమాధి చేసిన రోజులవి .....
"నాకేం కావాలి..?!"
నన్ను , నా జీవితాన్ని నా అనుకున్న వాళ్లకు అంకితం చేసి నన్ను నేను ప్రశ్నించుకోవడం మర్చిపోయిన రోజులవి ...
"నాకేం కావాలి..?!"
ఈ ప్రశ్నే తప్పని ...."నీకేం కావాలి...?!" అని మాత్రమే అడగాలి అని సమాధానము దొరికిన రోజులవి ...
"నాకేం కావాలి..?!"
నాకు నేను కావాలని ....నన్ను నేను పొందాలని ....నాకు నేను చెందాలని ఆశగా తపించిన రోజులవి ...
"నాకేం కావాలి..?!"
ఈ ప్రశ్న నాకు నిరంతరం కావాలి అని నాకు నేను బుద్ధిగా చెప్పుకున్న రోజులవి ....
"నాకేం కావాలి..?!"
బానిసత్వపు ఆలోచనలనుండి విముక్తి కావాలి ....నా అలోచనలకు స్వాతంత్య్రం కావాలి ....అని కోరుకుంటున్న రోజులివి ...❤️
-----------------********సశేషం ********-------------------