Sunday, August 2, 2020

అస్తిత్వం ఓ ఎండమావి లాంటిది ...

నా అస్తిత్వం ఎక్కడైతే ఉందని ఇప్పటివరకు నేను అన్వేషించానో ...అక్కడ నాకు నా అస్తిత్వం ఇప్పటివరకూ కనిపించలేదు ...
ప్రతి చోటా శూన్యమే ఎదురవుతుంది ...
చివరకు నాకు ఒకే ఒక్కటి అర్ధం అవుతుంది ...
దేనిలోనూ అస్తిత్వం లేకపోవడమే నా అస్తిత్వం అని ...ఎక్కడైనా నేను నా అస్తిత్వం ఉందని నేననుకుంటే అది నా భ్రమే అని ...
అస్తిత్వం ఓ ఎండమావి లాంటిది ...
అక్కడెక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది ...దాని కోసం నేను ఎంతో కృషి చేసి ...అందులో ఉందేమో అని ఆశగా వెళ్తాను ...తీరా అక్కడ నాకు నేను కనిపించను ...శూన్యమే కనిపిస్తుంది ...
చిన్నతనం నుండి ...
ఏదో ఫలానా చదువు చదివితే అందులో అస్తిత్వం ఉందనుకున్నా ....
తర్వాత ఫలానా ఉద్యోగం సంపాదిస్తే అందులో అస్తిత్వం ఉందనుకున్నా ...
తర్వాత నాకంటూ ఓ కుటుంబం ఉంటే అందులో అస్తిత్వం ఉందనుకున్నా ....
నా భర్తే నా అస్తిత్వం అనుకున్నా ....
నాకంటూ పిల్లలు సొంతమైతే అదే నా అస్థిత్వమనుకున్నా ....
కనపడిన ప్రతిచోటా నా కలల సౌధం నిర్మించా ....అందులో నా అస్తిత్వం కోసం వెదికా ....
జీవితం ప్రయాణించిన ప్రతి గమనంలోనూ నా అడుగులు ఆపాలనుకున్నా ....అస్తిత్వం కనిపిస్తే పలకరిద్దామనుకున్నా ....కాసేపు సేద తీరుదామనుకున్నా ....
కలిసిన ప్రతి బంధం నాదే అనుకున్నా ....అందులో నా అస్తిత్వం కోసం అన్వేషించా ...
డబ్బు సంపాదించడంలో అస్తిత్వం ఉందేమో అనుకున్నా ....
ఎన్నెన్ని కలలు ...ఎన్నెన్ని ఆశలు...అన్నీ అస్తిత్వం కోసమే ....
నా అక్షరాల్లో కూడా అస్థిత్వాన్ని వెదికా ....
ఎన్నో పేర్లుతో పిలిపించుకోవాలని ప్రయత్నించా ...చివరకు పేరులో కూడా నా అస్థిత్వాన్ని వెదికా ...
నా రూపంలో ....నా మాటల్లో ...నా చేతల్లో ....నా నడకలో ....నా నవ్వులో ....నా ఏడుపులో...ఎక్కడా నా అస్తిత్వం లేదు ....చివరకు నేనంటూ అసలు లేనని ....
నన్ను నేను అన్వేషించడం ....భ్రమే అని నాకు అర్ధం అవుతుంది...🙏