Sunday, May 28, 2023

ఫేస్ బుక్ పోస్ట్ లు ఇంతగా వెంటాడుతాయా ...

 "ఫలానా వాళ్ళ గురించి ఫేస్ బుక్ లో వ్రాశావంట.. వాళ్ళు నాతో చెప్పుకుని బాధపడ్డారు ..." అడిగారు మావారు మొన్నొక రోజు ...

"ఈ మధ్య అసలు నేను ఫేస్ బుక్ లో ఏమీ వ్రాయడం లేదే ..." సాలోచనగా చెప్పా ...
"నేను కూడా వెతికాను ...నాకేం కనిపించలేదు ...."అడిగారు ...
"ఓ అదా ...ఎప్పుడో ఓ రెండేళ్లు అయింది అది వ్రాసి ...అయినా ఆ పోస్ట్ లో ఎక్కడా వాళ్ళ పేరు వ్రాయలేదు ...అది వాళ్ళ గురించే వ్రాశానని ఎలా అనుకున్నారు ..." గుర్తొచ్చి అడిగా ...
"అంటే డబ్బులు అప్పుగా ఇచ్చింది వాళ్ళకే కదా ... అందుకే" చెప్పారు
"అయినా ఆ పోస్ట్ లో ఎక్కువగా తిట్టింది మిమ్మల్నే ...అలా అప్పులిచ్చినందుకు ...ఏమైనా ఫీల్ అయితే మీరు అవ్వాలి కానీ ...వాళ్ళెందుకు ఫీలయ్యారు ...నేను ఎప్పుడు పోస్ట్ లు వేసినా ,,,మిమ్మల్నే ఎక్కువ తిడతాను ...అది మీకూ తెలుసు ...." చెప్పా ...
"ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసింది ఎందుకు అంటే ...., వాళ్ళ చెక్ నీ దగ్గర ఉందంట కదా ...వాళ్ళు అసలు వరకు ఇచ్చారు ...వడ్డీ ఇవ్వలేం అని చెప్పారు కదా ...అది మళ్ళీ అసలు కూడా ఇవ్వలేదని కేస్ వేస్తే మళ్ళీ వాళ్లకు ఇబ్బంది అని అడగడానికి ...చేసారు ..." కారణం వివరించారు ...
"లక్ష్మి అలాంటి పని చేయదు ...అని చెప్పాననుకో ..." మళ్ళీ ఆయనే చెప్పారు ...
"మీరిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ఏం చెప్పుకున్నారో పక్కన పెడితే .... ఇండియాలో ఆ చెక్కు నా చేతికి వచ్చిన వెంటనే ...అసలు మొత్తం ఇచ్చారు అని చెప్పారు కాబట్టి ....వెంటనే చెక్కు చింపేశాను ...ఆ విషయం వాళ్లకు కూడా చెప్పి ...నిశ్చింతగా ఉండమని చెప్పండి ..." చెప్పా ...
ఇదంతా కూడా ఎవరు చదువుకుంటారో వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండండి ...
వడ్డీ కోసం ఆశపడి ...అసలు ఇచ్చినా ...అసలే ఇవ్వలేదని చెక్కులు కోర్టుకి వేసేంత ఓపిక ఎవరికుంది చెప్పండి ...?!😇✍️
(Note: ఫేస్ బుక్ పోస్ట్ లు ఇంతగా వెంటాడుతాయా ...?!)

ఆ పుస్తకం మా ఊరు వాళ్ళు వ్రాసిందే ...

 "ఎవరు వ్రాసారు ఈ పుస్తకం ... మీ ఊరు వాళ్ళ లాగా ఉన్నారు ..." టీపాయ్ మీద ఒక పుస్తకాన్ని తీసి చూస్తూ అడిగారు కొన్నాళ్లక్రితం మావారు

ఆ పుస్తకం మా ఊరు వాళ్ళు వ్రాసిందే ...నాకు ఇండియా వెళ్ళినప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారు ...
"అవును మా ఊరు వాళ్ళే వ్రాసారు ...." చెప్పా ...ఒకింత గర్వంగా
"అబ్బో ...మీ ఊర్లో పుస్తకాలు వ్రాసేంత గొప్ప వాళ్ళు ఉన్నారా ..." పేజీలు తిరగేస్తూ నా వైపు చూడకుండానే చెప్పారు ...
ఒకవేళ వాళ్ళ ఊరు ఆడవాళ్లను వాళ్ళ భర్తలు కూడా అలాగే అంటారేమో మరి ...
మగవాళ్లకు కొందరికి ..., ఆడవాళ్ళ పుట్టింటి వాళ్ళను , వాళ్ళ ఊరుని , వాళ్ళ జిల్లాని, వాళ్ళని ...తక్కువగా చేసి చూస్తే వచ్చే ఆనందం ఏమిటో నాకు ఎంత ఆలోచించినా అర్ధం కాదు కొన్నిసార్లు ...
అదే వాళ్ళ వాళ్ళ సొంత ఊరులో నేరస్థులు కూడా గొప్పవాళ్లే అని ... నిశానీలు కూడా ఎంతో ప్రతిభ కలవారని .. తాగుబోతులు కూడా పద్దతి కలవారని .. దొంగలు కూడా నిజాయితీ పరులని ...సమర్ధించుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు ...
ఇలాంటి ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం బెటర్ అని ...సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ ఉన్నా ....
"ఎవరు ఈయన ...ఈయన వయసు ఎంత ఉంటుంది ...." ఆరాగా అడిగారు మళ్ళీ ఆయనే ....
"మీరనుకునే వయసు కాదులే ...అంత అనుమానం అవసరం లేదు ...ఆయన మా నాన్న వయసు వారు ..." క్లారిటీ ఇచ్చా ...
"అనుమానం కాదు .. ఇంత బాగా వ్రాసారు కదా ....ఎంత వయసు ఉంటుందో అని అడిగా ..." సమర్ధించుకుంటూ చెప్పారు ...
"చదవకుండానే బాగా వ్రాసారని తెలిసిందా ...వేషాలు కాకపోతే ..."
"ముందుమాట చదివా ..." 😀
ఎప్పటికీ మారరు.. మనసులో అనుకున్నా .. పైకి అనలేదు !
Happy long weekend!😇✍️