Thursday, October 17, 2019

(Transparency of thoughts) (unconditional love) (Happy for No Reason)

మొన్నామధ్య ఒకరు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ....
నా జీవిత లక్ష్యాలు కొన్ని వారికి ఉదాహరించా ....
అవి,
1. ఆలోచనల పారదర్శకత (Transparency of thoughts)
2. నిబంధనలు లేని ప్రేమ (unconditional love)
3. కారణం లేని సంతోషం (Happy for No Reason)
అయితే ఇవి సాధించడం అంత తేలిక కాదని అర్ధం అవుతుంది ....
అదేదో సినిమాలో ... ఒక్క నెలంతా ఒక్క అబద్ధం కూడా చెప్పకూడదు ...అప్పుడే ప్రేమిస్తాను ... అని ఒక నియమం ఉంటుంది ...ఆ హీరో అందులో ఎన్నో కష్టాలు పడతాడు ....లోపల మనసులో ఏం అనుకున్నాడో అన్ని చెప్పేయాల్సి వస్తుంది ....ఆ ఇక్కట్లు మనకు నవ్వు తెప్పించినా చెప్పే సమయంలో అతను ఎంత మానసిక సంఘర్షణను అనుభవిస్తాడో మన కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాడు ఆ దర్శకుడు .... ఓ రోజు ఆ హీరో ఆ నిబంధన నుండి విడుదలయ్యాడు కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం అనుకోండి ...
నేను కూడా ఎప్పుడైనా మనసులో అనుకున్నది అనుకున్నట్టు చెప్పాల్సి వచ్చినప్పుడు ....ఆ సమస్య ఏమిటో అర్ధం అవుతుంది ....
ఇక నిబంధనలు లేని ప్రేమ అంటే ....??!!
అది కూడా తేలికేం కాదు ...అసలు నిబంధనలు ఉన్నా కూడా కొందరిని ప్రేమించడం కష్టమే అయినప్పుడు ఇక నిబంధనలు లేకుండా అనేది ఊహించుకోవడం ....ఎలాగో అర్ధం కాకుండా ఉంది ....
అయితే... ఎదుటివ్యక్తిలో ఉన్న బలహీనతల్ని క్షమించడం నేర్చుకుంటే రాను రాను కొంతవరకైనా సాధించగలనేమో అనిపిస్తుంది ....
మూడోది ఏ కారణం వెతుక్కోకుండా సంతోషంగా ఉండడం ....
ఇదేమైనా తక్కువ కష్టమా ....??!!
ప్రతి దానిలోనూ అనుకూలతల్ని చూడడం నేర్చుకోవాలి ...ప్రతికూలతల్ని విస్మరించాలి ....ఏదైనా నష్టం జరిగితే ఏడుస్తూ కూర్చోకూడదు ....ఏదైనా లాటరీ తగిల్తే పొంగిపోవడం ఆపాలి ...ఇలా ...చాలా చేయాలి .....
ఈ సంతోషం జీవితంలో భాగమైపోవాలి ...దాని కోసం ప్రత్యేకంగా లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం లేనంతగా .....
---------------------
మొత్తానికి ఇవీ నా లక్ష్యాలు ....
ఇవి సాధించడానికి ఒక కాలపరిమితి లేదు ....ఎన్నాళ్ళు జీవిస్తే అన్నాళ్ళు ...
ఎంత శాతం సాధించాలి అనే కొలమానాలు లేవు ....నాకెంత సాధ్యమైతే అంత ...
సాధించగలనో లేదో తెలియదు ..జీవితం ఎంత అవకాశం కల్పిస్తే అంత ..!

fear of losing

ఒక్కోసారి ...పొద్దున్నే నిద్ర లేవగానే 99 శాతం మందికి జీవితం ఎలా కనిపిస్తుందో నాకూ ఈ మధ్య అలాగే కనిపిస్తుంది ....
ఈ జీవితానికి అర్ధం ఏమిటి ....అసలెందుకు జీవిస్తున్నాం ....ఎంతకాలం జీవిస్తాం ....ఎప్పుడు మరణిస్తాం ....మరణించే లోగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమిటి ....ఆ బాధ్యతలు పూర్తి చేయగలనా ...ఒకవేళ చేయలేకపోతే ఎలా ....ఈ బంధాలేమిటి ....ఎవరు తోడు ....ఎందాక ఈ పయనం ....నా ఉనికి ఎక్కడ ....అసలున్నానా లేదా ....ఇలా రకరకాల ప్రశ్నలు బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి ....
ఆ సంఘర్షణ ....ప్రయత్నం అన్ని నాలోనే ....
ఇలాగే ....కొన్నాళ్ల క్రితం నాలో నేను చాలా సంఘర్షణకు గురైనప్పుడు ....దీనికంతటికీ కారణం ఏమిటా అని ఆలోచిస్తే ....,, నాకున్నది ఏదో పోతుందని నాలో ఉన్న భయమే ఒక కారణం అనిపించింది ....
ఇక్కడ మిత్రులు తరచూ చెప్పే ఓ మాట గుర్తొచ్చింది ....(fear of losing)
ఆ భయం నన్ను జీవితానికి దూరంగా నెట్టి వేయడానికి ప్రయత్నించింది ....
ఆ భయాన్ని ఎలాగైనా వెంటనే అధిగమించాలి అని ....అనివార్యం అనిపించింది....
--------------------------
ఆ వెంటనే ....ఏవి/ఎవరిని.. కోల్పోతానని నేను భయపడుతున్నానో ఒక లిస్ట్ తయారు చేసుకున్నా ...
బంధాలు, బ్రతుకుతెరువులు, ఆస్థిపాస్థులు మొదలైనవి ... వాటిలో ముఖ్యమైనవి ...
అవి కోల్పోతే వచ్చే నష్టాల గురించి వ్రాసుకున్నా ....
అవి ఎక్కడినుండి వచ్చాయో ....ఎందుకు వచ్చాయో ...ఎలా వచ్చాయో ...
అవి కోల్పోతే నాకు ఏమవుతుంది ....నేను ఎక్కడికి వెళ్తాను ....అని విశ్లేషించుకున్నా ....
తీరా విశ్లేషణ చూసాక ....
నేను కోల్పోతానని భయపడుతున్నవి ఏవీ శాశ్వతం కాదని అర్ధమైంది ....
అన్ని మధ్యలోనే వచ్చి చేరాయని ....కొన్ని కొన్ని చర్యల ఫలితంగా సంక్రమించాయని ....అన్ని మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టి చేసుకుంటే .....అలాంటి ఫలితాలే వస్తాయని ...వీలయితే ఇంకా మంచి ఫలితాలే వస్తాయని ....అవేవో నేను కోల్పోవడం వలన నన్ను నేను కోల్పోయేదేం లేదు అని ..అర్ధమైంది ....
చివరకు ....ఏది మిగలకపోతే నేను భయపడతాను అని ఆలోచిస్తే ....నాకు ఒక్కటి కూడా నా లిస్ట్ లో కనిపించలేదు ....
వెంటనే మనసంతా గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది ....
అప్పుడప్పుడూ ....వీలయితే రోజూ ...నిద్ర లేవగానే ....ఏదైనా కోల్పోతానేమో అని నేను భయపడుతున్నానా అని ...తరచి చూసుకోవడం ఎంతో అవసరం అనిపించింది ....
ఒకవేళ భయపడితే ....ఎందుకు అనేది విశ్లేషించుకుని దాన్ని వీలైనంత త్వరగా అధిగమిస్తే ....జీవితం ఎంతో అద్భుతంగా జీవించొచ్చు అనిపించింది .....!
*************************
(గమనిక : ఇవి నా స్వీయ ఆలోచనలు ...నిజానిజాలు నా నమ్మకాల ఆధారంగా సృష్టించబడినవి మాత్రమే!)

నేను చేసిన తప్పులు /ఒప్పులు

నేను చేసిన తప్పులు /ఒప్పులు ఎన్ని ఉన్నాయా ....ఎలా చేసానా ....ఎలాంటి స్థితిలో చేసానా ...ఏమేం చేసానా ....అని ...నేను నా గత జీవితం వైపు తరచి చూస్తే ...నాకు రెండూ వివిధ మోతాదుల్లో కనిపిస్తున్నాయి ....
ఎందుకో ఒప్పులు కంటే తప్పుల్ని చూసుకున్నప్పుడే నాకు గర్వంగా ....హాయిగా ...జీవితాన్ని ఆ క్షణాల్లో జీవించానని ....నాలో నేను నాతో నేను ఉన్నానని ....అవి నాకోసమే చేసుకున్నాను అని అనిపిస్తుంది ....విచిత్రంగా అవి నాకు ఒప్పులుగానూ మారి కనిపిస్తున్నాయి ....
ఇక ఒప్పుల్ని చూసుకుంటే ....అవి సమాజం కోసం చేసినట్టుగా....బలవంతంగా చేసినట్టుగా ....ఇతరుల కోసం చేసినట్టుగా ...అనిపిస్తుంది ....అవి నాకు ఒకింత తప్పులుగా కూడా మారి కనిపిస్తున్నాయి ....

ఆఫ్కోర్స్....విభిన్న సమాజాలను .....భిన్నమైన వ్యక్తుల మనస్తత్వాలను చదివాక కూడా ..ఈ తప్పొప్ప్పులకు నిర్వచనాలు నాకు ఇప్పటికీ తెలియదనుకోండి ....
ఏమైనా ...ఇకముందు నా జీవనాన్ని ...నా పూర్వ నమ్మకాలు శాసించకుండా చూసుకోవడానికి ...ఈ విశ్లేషణ ను ఉపయోగించుకోవాలని నా అభిలాష ...!