Friday, January 28, 2022

వాళ్ళు మాత్రమే నవ్వడం నేర్చి ...

 వాళ్ళు మాత్రమే నవ్వడం నేర్చి ....పక్కవాళ్ళ కన్నీళ్ళలో జలకాలాడేవాళ్ళను ...

వాళ్ళు మాత్రమే నడవడం నేర్చి ...పక్కవాళ్ళ కాళ్ళు విరగ్గొట్టేవాళ్లను ...
వాళ్ళు మాత్రమే మాట్లాడడం నేర్చి ...పక్కవాళ్ళ నోరు మూసేవాళ్లను ....
వాళ్ళు మాత్రమే తినడం నేర్చి ....పక్కవాళ్ళ పళ్లెం లాక్కునేవాళ్లను ....
వాళ్ళు మాత్రమే బ్రతకడం నేర్చి ....పక్కవాళ్ళ పాడె కట్టే వాళ్ళను ...
అసలు మనిషనే వాడినే భరించలేని కొంతమంది మహానుభావుల్ని ....ఈ సమాజం కలిగి ఉండకపోతే మనుషులేమైపోతారా అని నాకు చాలా చింత కలుగుతూ ఉంటుంది ....
వాళ్ళు ఉండడం వలెనే కదా ....అలాంటి వాళ్ళను భరించడం వలనే కదా ....మన మానవత్వం ఏ మోతాదులో ఉందో ....ఎంత పెంపొందించుకోవాలో మనకు అనుక్షణం తెలుస్తుంది....అని అనిపిస్తూ ఉంటుంది ....
ఎంత దుర్మార్గుల్ని మనం భరిస్తే ....మనలోని మనిషనే వాడు అంత ఎదుగుతాడు అన్నట్టు ....
ఎంత రాక్షసత్వం మనం భరిస్తే అంత దైవత్వం మనకు అలవడుతుంది అన్నట్టు ....
వాళ్ళ బ్రతుకుని ఎంత సహిస్తే ....మన జీవితం అంత ఎదుగుతుంది అన్నట్టు ....
సర్వే జనాః సుఖినోభవంతు ..!🙏✍

Note: ఈ పోస్ట్ ఇప్పుడు వ్రాసింది కాదు ...లాస్ట్ ఇయర్ వ్రాసాను ఇదే రోజున ...అప్పుడు పోస్ట్ చేయలేదు ...
ఆ రోజున ఎందుకలా అనిపించిందో తెలియదు ...!

Sunday, January 23, 2022

నిజానికి ...ఎలాంటి పద్ధతులైనా , నమ్మకాలైనా , అలవాట్లైనా ..

 నిజానికి ...ఎలాంటి పద్ధతులైనా , నమ్మకాలైనా , అలవాట్లైనా ....ఎవరివి వారికి సొంతమైనవి ....ఆమోదించదగ్గవి ...

అవి ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తాయంటే ....
ఆ పద్ధతులు వారు అనుసరిస్తున్నారు కాబట్టి ....ఇతరులంతా అవే అనుసరించాలని ....అవి పాటించని వాళ్ళు దుర్మార్గులని ....దుష్టులని ....వాళ్ళని నిందించడం ....
ఆ పద్ధతులు అనుసరించేదాకా వారిని అదే పనిగా దూషించడం చేస్తే ....అప్పుడు వారితో సమస్య ....అది వారితో పరిచయం కొనసాగించడానికి ఇబ్బంది కలిగిస్తుంది ...
నీకో / నాకో ఒక నమ్మకం ఉండొచ్చు ....అది ఎదుటివారికి మూర్ఘత్వంగా అనిపించవచ్చు ....
కాదు నేను నమ్మాను కాబట్టి ....నువ్వు కూడా నమ్మాల్సిందే అని మొండిగా వాదించడం ఎంతవరకు సమంజసం ....
అది దేవుడు కావచ్చు ....దెయ్యం కావచ్చు ....
సమాజంలో ...ఎవరి నమ్మకాలు వారివి ....ఎదుటివాళ్ళ మెదళ్ళమీద దానిని పెట్టనంతవరకు ...ఏ ఇబ్బందీ లేదు ....
కాదూ కూడదు అంటే ....
వారితో స్నేహం కొనసాగించడం అనేది ....ఇబ్బంది కలిగిస్తుంది ....
నాకో /నీకో ...ఏవో కొన్ని అలవాట్లు ఉండొచ్చు ....ఏ ఇద్దరి అలవాట్లు ఒకే విధంగా ఉండవు ...
నా అలవాటే గొప్పది ...ఇక ప్రపంచంలో మిగతావన్నీ భ్రస్టు పట్టిపోయాయి అంటే ....ఎలా ...
నీ అలవాటు నీ జీవితానికి అనుకూలంగా ఉంటుంది ....నా అలవాటు నా జీవితానికి అనుకూలంగా ఉంటుంది ....
కాదు ...నేను నమ్మిన ఆచరిస్తున్న అలవాటే అందరూ అలవరచుకోవాలి అనేవాళ్ళతో స్నేహం , బంధం ఏదీ కొనసాగదు...
ఇవన్నీ ఎవరివి వారు సొంతం చేసుకుని ....ఆచరిస్తూ ....ఉన్నంతకాలం ....ఆమోదించదగ్గవే ...మనకు ఇబ్బంది కలిగించనివే ....
లేకపోతే...వాళ్ళని భరించడం కష్టం ...!🙏✍

Tuesday, January 4, 2022

అలా ఉంటారండీ కొందరు మెగా మహారాజులు ..

 "కాస్త కూరలో ఉప్పు చూడండి..." చేపల పులుసులో ఉప్పు , కారం సరిపోయిందేమో చూస్తారని పిలిచా మా వారిని ...(నాకు ఉప్పు చూసే అలవాటు లేదు ...అందుకే ఎవరో ఒకరిని పిలుస్తూ ఉంటా ...)

కూరలో ఉప్పు చూసి ... "కాస్త కారం తగ్గింది ..." చెప్పారు ...
ఒక స్పూన్ కారం తగిలించా ...
"కాస్త ఉప్పు కూడా తగ్గినట్టు ఉంది ..."మళ్ళీ చెప్పారు ...
పులుసులో కాస్త ఉప్పు ఎక్కువే పడుతుంది ...అందునా పచ్చి మామిడికాయ తగిలించా కాబట్టి ....మరో స్పూన్ ఉప్పు కూడా వేశా ...
"ఓహ్ ..టేస్ట్ అదిరిపోయింది ...."చెప్పారు చివరగా ...
చిన్నతనంలో ...పిల్లలందరం ఒక పాట పాడుకునే వాళ్ళం ....
"పిల్లల్లారా పిల్లల్లారా పిండి కొట్టండి ...
పార్వతీ దేవొచ్చి పాకం పట్టిద్ది..
అలివేలు మంగమ్మొచ్చి అరిసెలొండిద్ది ...(అరిసెలు వండుతుంది )
ఎంకటేసుల్ సామొచ్చి (వెంకటేశ్వర స్వామి ) ఎంగిలి చేసి పోతాడు "
"మేం పిండి కొట్టి , పాకం పట్టి , అరిసెలు చేసాం ...ఇక మీరు ఆరగించొచ్చు ...మహా మహా దేవుళ్ళే పని చేయకుండా హాయిగా ఆరగించి బతికేశారు ..." చెప్పా ...కొత్తిమీర కట్ చేసి ...చల్లేసి ..స్టవ్ కట్టేసి ...
"నేను హెల్ప్ చేయలేదు కాబట్టి ...నాకు ఇది తినే రైట్ లేదు ...తినొద్దు ...అని ఒక్క మాట చెప్పు ....ప్లీజ్ " అడిగారు ...
"చెప్పను ...పుట్టుకతో, పెంపకంతో ...ఒక రకమైన సంస్కారం వచ్చి సచ్చింది ...నేను చెప్పాలన్నా ....అది నన్ను చెప్పనివ్వదు ..." నవ్వి చెప్పా ...
ఇంతకూ ...ఎందుకు అలా తినొద్దు అనమని అడిగారో చెప్పలేదు కదూ ...
అంతకు ముందే ఏదో ఆహారం పొట్టనిండా లాగించారు ....ఖాళీలేదు ...అందుకే ...నేనలా అంటే అయినా తినకుండా ఉండొచ్చని ఆశ ...
ఏం పర్లేదు ...ఖాళీ అయ్యాక ...నేనొకదాన్ని ఇంట్లో ఉన్నానని కూడా గుర్తు లేకుండా లాగించేస్తారు ...
అలా ఉంటారండీ కొందరు మెగా (వివాదాస్పదమైన పదాలు వాడకూడదని ...మెగా అని వ్రాశా )మహారాజులు ...!😇😎😉


Monday, January 3, 2022

లేదా మరుజన్మ కైనా తిరిగి చెల్లించాల్సి రావచ్చు

 ఎవరైనా నిన్ను దూషిస్తే, ద్వేషిస్తే, అవమానిస్తే, వేరు చేసి మాట్లాడితే ...వాళ్ళే నీ ఆత్మీయులు అని అర్ధం ..వాళ్ళు నిన్ను ఈ భవబంధాల నుండి విముక్తి చేయడానికి సహాయపడుతున్నవారు ...వారికి మనం చేతులెత్తి మొక్కాలి ...!

ఎవరైనా నిన్ను ప్రేమిస్తే , ఆరాధిస్తే , గౌరవిస్తే, వారిలో ఒకరిగా కలుపుకుంటే ...వాళ్ళు నిన్ను రుణ గ్రస్తుల్ని చేస్తున్నవారు ...వాళ్ళ ఋణం తీర్చుకోవడానికి నువ్వు అనుక్షణం వారికి బందీగానే ఉండాలి ...మనల్ని మనం తప్పనిసరిగా రుణవిముక్తుల్ని చేసుకోవాలి ..!
లేదా మరుజన్మ కైనా తిరిగి చెల్లించాల్సి రావచ్చు ..!✍

దుఃఖం - సంతోషం

 దుఃఖం - సంతోషం

============
నాకు దుఃఖం కలిగినప్పుడు ..నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా సంతోషంగా ఉంది అనుకోవడం ఆత్మన్యూనతా భావం ..
నాకు సంతోషం కలిగినప్పుడు ..నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా దుఃఖం లో ఉంది అనుకోవడం అహంకార భావం ..!
నాకు దుఃఖం కలిగినప్పుడు ..నేను ఒక్కదాన్నే ఏడుస్తూ ఉన్నాను అనుకోవడం అమాయకత్వం ..
నాకు సంతోషం కలిగినప్పుడు ..నేను ఒక్కదాన్నే సంతోషంగా ఉన్నాను అనుకోవడం అవివేకం ..!