Saturday, November 21, 2020

నిరంతరం ...నేర్చుకోవడం లోనే జీవితం కదా ...

 చిన్నతనంలో ఎవరైనా నన్ను ఏదైనా అంటే ...అస్సలు భరించేదాన్ని కాదు ...

మాటకు మాట ...చేతకు చేత అన్నట్టు ఉండేది ...అందరితో నా ప్రవర్తన ..

మాటలైతే అనేదాన్ని కానీ ....(వచ్చు కాబట్టి ) చేతలు చూపించడానికి శక్తి సరిపోయేది కాదు ...

అప్పుడు మా నాయనమ్మనో...మా అమ్మనో వెంటబెట్టుకు పోయేదాన్ని ...

వాళ్ళు నన్ను ఇలా అన్నారు ...అలా అన్నారు ....కొట్టారు ...అని చెప్పేదాన్ని ....
ఒకసారి చిన్నతనంలో ఇలాగే స్కూల్ లో పిల్లలతో గొడవలైతే ....మా నాయనమ్మ ని వెంటబెట్టుకుని స్కూల్ కి వెళ్ళా ...

మా నాయనమ్మ గొడవపడితే ....అందులో నాకు తెలియని లాజిక్ లు కూడా లాగి ....నా తప్పు ఏం లేదని నిరూపించేది ...అప్పుడు నిజం చెప్పొద్దూ నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించేది ...నేనంత మంచిదాన్నా అని ....ఒకింత గర్వం కూడా కలిగేది ...నాకు అలాంటి గయ్యాళి నాయనమ్మ ఉన్నందుకు ....అదొక ప్రొటెక్షన్ అన్నట్టు ....

ఆ తర్వాత ఏవో సర్దుబాట్లు అయ్యేవి ...కాలక్రమేణా అంతా మర్చిపోయేవాళ్ళం ....

ఆ తర్వాత తర్వాత ...కొంతమంది బంధువులతో గొడవలైనప్పుడు ...ఎవరైనా మిత్రులతో గొడవలైనప్పుడు ....వాళ్ళిలా చేస్తారా ...అలా చేస్తారా అని ఆవేశం వచ్చేది ...

మా అమ్మ, ఎవరి దగ్గరకూ పోవద్దు ...ఇంటికి గొడవలు తీసుకుని రావద్దు ....ఇంట్లోనే ఉండండి అని జాగ్రత్తలు చెప్పడం వలన ...కొన్ని పెద్దవాళ్ళ దాకా పోయేవి కాదు ...తెలిస్తే ఆ తర్వాత నా కాళ్లే విరుగుతాయని ...

కానీ ...ఏమాటకామాటే ...ఇలా మాటకు మాట అప్పజెప్పడం వలన ...ఎదురు మాట్లాడడం వలన ...మానసిక ప్రశాంతత అయితే వచ్చేది ...

ఎందుకంటే ....నేనేమీ మాట పడాల్సిన అవసరం లేకుండా ఉంది కదా ....
బాధ అనేది నా మీద పడగానే ...రెట్టింపు వేగంతో ..ఇంకాస్త కలిపి ఎదుటివాళ్ళ మీదకు విసిరేయగలిగాను కదా ...అందుకేనేమో ....

అమ్మగారికి ...ముక్కుమీద కోపం ...అనే ముద్ర వేయించుకుని చిన్నతనం గడిపేసా ....

తర్వాత ...పెళ్లయ్యాక కూడా ఇదే మనస్తత్వం చాలా కాలం ఉండేది ....

కానీ ఈసారి ...నన్ను అన్నారని ఎప్పుడూ బాధపడేదాన్ని కాదు ..నా పిల్లలని ...మా వారిని అన్నారని బాధ కలిగేది ...

నిజం చెప్పాలి ...నా పిల్లలు నాలా కాదు ...

ఏం జరిగినా ...అది గుచ్చి గుచ్చి అడిగితే తప్ప చెప్పేవాళ్ళు కాదు ...

ఒకసారి ఇలాగే ...నా పెద్ద కూతురిని స్కూల్ టీచర్ ఒకరు కొట్టారు ...

ఇది కూడా నాకు నా కూతురు చెప్పలేదు ...మధ్యాహ్న్నం లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ....తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ....

"ఆంటీ, తన తప్పేం లేదు ఆంటీ ...అక్కడ క్లాస్ రూమ్ లో కూర్చున్న అందరినీ కొట్టారు టీచర్ ...అందులో కొంతమందే గొడవ చేసారు ...." అని చెప్పారు పిల్లలు ...

నా డాటర్ మెరిట్ స్టూడెంట్ ....అసలు ఎవరితో గొడవలు పడదు ....గొడవలు చెయ్యదు ....

కొట్టేటప్పుడు ....అందరినీ గొడ్డుని బాదినట్టు బాదడం కాకుండా ...ఎవరు గొడవ చేసారో వాళ్ళని కదా పనిష్ చేయాలి అని ...
నాకు వెంటనే కోపం వచ్చి ....స్కూల్ ప్రిన్సిపాల్ కి కంప్లైన్ట్ చేస్తానని చెప్పా ...

"వద్దు మమ్మి ...నాకు ఆ టీచర్ అంటే చాలా ఇష్టం ...నేనంటే కూడా టీచర్ కి ఇష్టం ....కంప్లైంట్ చెయ్యొద్దు" అని నా కూతురు రిక్వెస్ట్ చేసింది

ఆ తర్వాత నాకు ...ఈ సంఘటన కంటే ...ఇంత బాధ అనుభవించినా ....నా కూతురు నాకు ఎందుకు చెప్పలేకపోయింది అనే సందేహం బాధించింది ....

అసలు ఇదే కాదు ....ఏదైనా అన్ని గుచ్చి గుచ్చి అడిగితేనే చెప్పే మనస్తత్వం తనది ...

"నేను చెప్తే ....నువ్వు వెళ్లి టీచర్ తో గొడవపడతావని భయం వేసి ...చెప్పలేదు " తలొంచుకుని చెప్పింది ...

పాతాళంలో ఒక అడుగు కిందకు వెళ్లి కూలబడిన అనుభూతి కలిగింది ....
నాకు ...ఒక జీవితకాలం కనువిప్పు కలిగిన రోజది ....

ఆ టీచర్ కొట్టిన దెబ్బల కంటే ...నా గొడవపడే మనస్తత్వమే తనని ఇంకా ఎక్కువ భయపెట్టింది అని అర్ధమై ...నా మనసు సిగ్గుతో చితికిపోయింది ....

నా కూతురు నాకు ....నొప్పిని భరించడం ఎలాగో నేర్పించిన రోజది ....బాధను భరించడం ఎందుకో చెప్పిన రోజది ...

మాటకు మాట ...చేతకు చేత ...జీవిత విధానం కాదు ...కొన్ని ఎదుటివాళ్ళు చేసిన పొరపాట్లు భరించి సర్దుకుపోవడం ...జీవిత విధానం అని ....నా కూతుర్ని చూసి నేను నేర్చుకున్న రోజది ...

అయితే, జీవితం ఎన్నో ...జీవిత సత్యాల కలయిక ....

ఒకటి నేర్చుకున్నంత మాత్రాన ...మనకు జీవించడం వచ్చేసినట్టే అనుకుంటే ....అంతకన్నా అమాయకత్వం లేదు ...

ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ....

"నేను పుట్టే వయసుకి నువ్వెలా ఆలోచించేదానివి ....నీకు ఇప్పుడు మాకు ఉన్నంత ఆలోచనలు ....అవగాహన ఉండేవా ... " ఆసక్తిగా అడిగింది నా కూతురు ...

పిల్లలు కొన్ని అర్ధం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అడుగుతూ ఉంటారు ...

అందులో ముఖ్యంగా నిర్ధారించుకోవాలి అనుకునేది ...నేను వాంటెడ్ చైల్డ్ నా అన్ వాంటెడ్ చైల్డ్ నా అని ....(అమెరికన్ కల్చర్ ప్రకారం .....వాంటెడ్ చైల్డ్ అంటే ....భార్య భర్తలు ...కొన్నాళ్ళు కాపురం చేసాక ...పిల్లలు ఒక పీరియడ్ టైం లో కావాలని అనుకుని ....ఇద్దరూ కలిసి నిర్ణయించుకుని ...పిల్లల్ని కంటారు ....ఇక అన్ వాంటెడ్ చైల్డ్ అంటే ...బలాత్కారం చేసినప్పుడు పుట్టే పిల్లలు ....చిన్న వయసులో తెలియక తప్పు చేస్తే పొరపాటున పుట్టిన పిల్లలు ...లేదా ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు కావాలనుకుని పుట్టినవాళ్ళు ....ఇలా పలు రకాల అర్ధాలున్నాయి ...
అన్ వాంటెడ్ అంటే ...పిల్లలు ఇక్కడ, తల్లితండ్రులకు తాము ఇష్టం లేదు అనుకుని ....దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటారు .... )

"లేదు ...అస్సలు ఏమీ తెలియదు ....మీకు మిడిల్ స్కూల్ లో ఉన్నంత విజ్ఞానం కూడా నాకు ఉండేది కాదు ...నువ్వు పుట్టాకే నాకు పిల్లలు ఎలా పుడతారో తెలిసింది ...నాకు పెళ్లయ్యే నాటికి సెక్స్ అంటే ఏమిటో కూడా తెలియదు ...సినిమాల్లో చూపించినట్టు కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుట్టేస్తారేమో అని అనుకునేదాన్ని ....మాకు ఎక్కడా సెక్స్ ఎడ్యుకేషన్ అందుబాటులో లేదు ....అన్ వాంటెడ్ చైల్డ్ ...వాంటెడ్ చైల్డ్ ఇవన్నీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు ...మా ఊహల్లో పెళ్లి ఒక్కటే ఉండేది ....ఆ తర్వాత భర్తే అన్ని బాగోగులు చూసుకుంటాడు అనే ఊహ ఉండేది ....అంతకు మించి ఆలోచన ముందుకు సాగేది కాదు ...ఒకవిధంగా చెప్పాలంటే ...నేను నీతోనే కలిసి పెరిగానురా ....కలిసి ఆలోచించాను ....కలిసి నడిచాను... కలిసి నేర్చుకున్నాను....కలిసి చదువుకున్నాను ....కలిసి ఉద్యోగం చేస్తున్నా ....నేను నిన్ను ఒక కూతురిలా పెంచలేదు ....ఒక ఫ్రెండ్ లా నీతోనే కలిసి పెరిగి ..నిన్ను చూసి నేర్చుకున్నా ...." సమాధానం చెప్పా ...

ఇదంతా పక్కన పెడితే ... మా వారితో డీల్ చేయడం ఇందుకు విరుద్ధంగా ఉండేది ....

పెళ్లయ్యాక తనని నా సొంతం అనుకున్నానేమో ....తనని ఎవరైనా ఏమైనా అంటే ....నాకు ఎక్కడ లేని ఆవేశం వచ్చేది ...

వాళ్ళని నాలుగు తిట్లు తిట్టి పడేసే దాన్ని ....వాళ్ళు ఎదురుగా లేకపోయినా ....

కాల క్రమేణా ...చాలా ఏళ్లకు ....అది కూడా నాకు జ్ఞానోదయం అయింది ....

వాళ్ళను తిట్టాక వాళ్ళతో నేను మాట్లాడేదాన్ని కాదు ...

నా మనసులో వాళ్ళు మా ఆయన్ని తిట్టారు ...కాబట్టి మా ఫ్యామిలీకి శత్రువులు అని ఆలోచించేదాన్ని ...

కానీ ..మళ్ళీ మా ఆయనే వాళ్ళతో స్నేహం చేస్తుంటే ....మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగేది ...

నాకు వాళ్ళ మీద అలా చెప్పారు ...మీరెందుకు వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే ...ఏవో కుంటి సాకులు ఉండేవి ....

ఓహో ...నేను వాళ్ళతో మాట్లాడకూడదు ....వాళ్ళని మెచ్చుకోకూడదు ....వాళ్ళతో స్నేహం చేయకూడదు ....బేసికల్ గా నేను వాళ్లకు చెడ్డదాన్ని కావాలి ....తన అంత మంచివాడు ....ఉత్తముడు ....నా లాంటి నీచురాలికి ఏ జన్మలో పుణ్యం చేస్తేనో భర్తగా వచ్చాడు అని వాళ్ళు అనుకోవాలి . ....

నాకు ఈ లాజిక్ అర్ధం కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది ...

అప్పటికి ...నాకు ఎవరు ఎలాంటి మానసిక ఆనందాలు పొందుతున్నారు అనేది ఆలోచించడం మానేసి ....నేను ఎవరికి ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే వయసు వచ్చేసింది ....(అనుకుంటున్నా )

అన్నిటికంటే ముఖ్యంగా ....చాలా బాధను భరించడం నేర్చుకున్నా ...

ఇక్కడ భరించడడం అంటే ....ఎదుటివాళ్లను బాధపెట్టకుండా ఉండడం ....కనీసం ప్రయత్నించడం ...

నిజానికి ఈ మార్పు నన్ను సంతోషంగా ఉంచుతుందా అంటే ...ఏమో పిల్లలు ...నాకు తెలిసిన వాళ్ళు ...నా ప్రవర్తన వలన బాధపడకుండా ఉంటున్నారా అని ఆలోచిస్తే ....కాస్త ఉంటున్నారేమో అనేది ...నన్ను సంతోషపెట్టింది ...అందువల్ల అలాంటి బాధ భరించొచ్చు అనిపించింది ....

అయితే ఈ ప్రాసెస్ లో నేను నా బంధువుల్ని , మిత్రుల్ని , ఆత్మీయుల్ని ....అందరినీ కోల్పోయాను ...

విచిత్రంగా ఈ దూరమైన వాళ్ళల్లో ....వాచ్ మెన్ , పనివాళ్ళు , పాలవాళ్ళు కూడా భాగమే ....అనుకుంటే ...నా మీద నాకే జాలేసింది ....

చుట్టూ తిరిగి చూసుకుంటే ....నేను చేసిన పనులు సమర్ధించే ప్రాణులు నాకు ఎవరూ మిగల్లేదు ...

మా అమ్మ , నా పిల్లలు , నా అని చెప్పుకునే వేళ్ళ మీద లెక్కించగలిగే ... స్నేహితులు తప్ప ....

వాళ్ళు నా ప్రపంచమే ...వాళ్ళకి తెలుసు నేనేమిటో ...కానీ మిగతా ప్రపంచం సంగతేమిటి ...

ఎందుకు నేను అందరికీ దూరమయ్యాను ...ఎందుకు అందర్నీ దూరం చేసుకున్నాను...

పోనీ వాళ్ళందరి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగి ...నేను మిమ్మల్ని ఎవరినీ కావాలని బాధపెట్టలేదు ...కావాలని అనలేదు ....క్షమించండి అని అడిగి ....దగ్గరవుదామా అని ఆలోచించా ...

కానీ ఎవరు నమ్ముతారు ....ఇంకా వాళ్ళకి నేను నా నిజం ఏమిటో ఎప్పుడూ చూపించలేదే ...

అసలేమిటి నా నిజం ....ఎలా తెలుసుకోవడం ....

పోనీ నా ఆత్మీయులు ఎవరైతే నాకు మిగిలారో ...వాళ్ళు నాకు సరిపోరా...

వాళ్ళకి నేను అర్ధమయ్యాను సరిపోదా ...

వాళ్ళకంటే ముందు ...నాకు నేను తెలియాలి ....అసలు నేను ఏమిటి అనేది ....

అదిగో ...అప్పటినుండే నన్ను నేను అర్ధం చేసుకోవడం మొదలు పెట్టాను ...
నాలో నన్ను చూసుకోవడం మొదలుపెట్టాను ....ప్రతి పని చేసేముందు విచక్షణతో ఆలోచించడం మొదలుపెట్టాను ....

అందుకు ఈ కొద్దిమంది ఆత్మీయులే నాకు ఆసరాగా నిలబడ్డారు ....
నా తప్పుల్ని అనుక్షణం నాకు ఎత్తిచూపారు ....ఏ తప్పు ఎందుకు చేస్తున్నానో చెప్పారు ...
అది ఎలా సరిదిద్దుకోవాలో చెప్పారు ....నేను ఏదైనా చిన్నపని సాధించినప్పుడు వాళ్ళతోనే పంచుకునేదాన్ని ....అభినందనల కంటే ...ఎక్కడ పడిపోతానో అని జాగ్రత్తలు చెప్పిన సందర్భాలే ఎక్కువ ...

అవేదో ...మినిష్టర్ పదవి సాధించినవేం కాదు ....

ఎవరినీ ఎందుకు బాధపెట్టకూడదు ....ఏ బాధనైనా నేనెలా భరించాలి అనేంత చిన్నది కావచ్చు ....

లేదా ...ఎంతో క్రూరత్వం కలిగించే మాటలు అన్నా కూడా ఎలా నవ్వుతూ సరిపెట్టుకోవచ్చు అని కావచ్చు ...ఇలా ...

ఉదాహరణకు ...

నేను ఆవేశంతో అరవాలనిపించే సందర్భంలో ..అది ఆవేశంతో చెప్పడం కన్నా కూడా ....

పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టుగా చెప్పడం నేర్చుకో అని చెప్పారు ....

నిజమే కదా ...పోకిరిలో ...ఎవరు కొడితే అనే డైలాగ్ ....ఎంత ప్రశాంతంగా చెబుతాడో ....ఎంత ఆవేశాన్ని లోపల దాచుకుంటాడో అని గమనించి ప్రాక్టీస్ చేసేదాన్ని ....

ఎవరు నన్ను ఏం అన్నా కూడా ....ఇలాగే కొంతకాలం గుర్తు పెట్టుకుని పాటించేదాన్ని ....

ఇలా చిన్న చిన్న విజయాలు జీవితంలో నన్ను నేను తీర్చి దిద్దుకుని ....నా ప్రవర్తనను సరిచేసుకోవడానికి ఎంతగానో దోహదం చేసాయి ...

కొన్నాళ్ల క్రితం ...ఓ సందర్భంలో ...మా ఆయన, పవన్ కళ్యాణ్ పార్టీ ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేయడం మొదలు పెట్టిన కొత్తలో ...ఇక్కడే అమెరికాలో ఒక అమ్మాయి జగన్ పార్టీని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేసేది ....

అన్ని వీడియోస్ నేను చూడకపోయినా ...కొన్ని నా దృష్టిలో పడినవి చూడడం తటస్థించింది ....

అందులో ...ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఒక వీడియో చేసింది ....(అది నేను పూర్తిగా చూడలేదు ....కొన్ని బిట్స్ చూసాను ...)

వెంటనే ఆ అమ్మాయిని విమర్శిస్తూ మా ఆయన ఒక వీడియో చేసారు ....

ఆ తర్వాత క్రమేణా అది వ్యక్తి గత విమర్శలకూ దారి తీసింది ....

ఆ సందర్భంలో ....మా ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి ....,
"నేనిలా ఒక వీడియో చేశాను ....నన్ను ఆ అమ్మాయి తిట్టింది ...ఇలా ఇలా జరిగింది ....నువ్వు కూడా ఆ అమ్మాయిని తిడుతూ ఒక వీడియో చెయ్యి ...." అన్నారు ...

ఇదేమైనా ఇంటర్నెట్ లేని రోజుల్లో ఎదుటివాళ్ళు ఏం చెప్తే అవి నమ్మే రోజులా ...
నేనూ వీడియో లు చూసి ఎవరు తప్పు ఎవరు రైట్ అని నిర్ధారించుకోగలను కదా ...

"ఇంతకీ ఆ అమ్మాయి ఏమంది ...అసలు నేను వీడియో చేయడం ఏమిటి ...." అడిగా అర్ధం కాక...

"ఆ లేదు ...మా పవన్ కళ్యాణ్ ని ఇలా తిట్టింది ....నేను ఇలా అన్నాను ...అందుకు ఆ అమ్మాయి ...., ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయిల అందరి కంటే నేనే అందంగా ఉంటాను అని అంది ......నువ్వు ఎంత అందంగా ఉంటావో అమ్మాయికి తెలియాలి ...అంత పొగరా ....ఉన్నత వర్గాలకు చెందిన లేడీస్ అందరినీ అంది ...అందుకే ఈ ఉన్నత వర్గాల లేడీస్ అందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ నువ్వు వీడియో చేసి పెట్టాలి ..." ఆవేశంగా చెప్పారు ....

అంతా విని ..."అసలు ఏమైనా అర్ధం ఉందా మీరు అడిగేదానికి...ఫస్ట్ అఫ్ అల్ ...నేను మీరనుకునే అంత అందగత్తెను కాను ....ఒకవేళ ఆ అమ్మాయికి అందరికంటే నేను అందంగా ఉంటాను అనే అభిప్రాయం ఉంటే..అది తన అభిప్రాయం ....ఉన్నత వర్గం వగైరా వగైరా కూడా తన అభిప్రాయాలే ...తన అభిప్రాయాలను తప్పని చెప్పడానికి నేనెవర్ని ...అవి నిరూపించడం ఎందుకు ..." అడిగా అర్ధం కాక ...

"తను నన్ను చాలా విమర్శించింది ...ఈ వీడియో చేస్తే ....నువ్వు కూడా ఫెమస్ అవుతావు ...నీ వీడియోస్ కి కూడా ఎన్నో లైక్స్ వస్తాయి" అడిగారు ..

"మీరేదో అన్నారు ...ఆ అమ్మాయి ఎదో అంది ...మీరు ఒక రెండు పార్టీల కోసమో ...ఇద్దరు నాయకుల కోసమో ...మీ అహం సంతృప్తి కోసమో ...కొట్టుకుని విమర్శించుకుంటే ...అది నాకు సంబంధం లేని విషయం ....లైక్స్ కోసం ...అంత అర్ధం లేని పనులు నేను చేయను" ...ఖచ్చితంగా చెప్పా..

ఆ తరువాత చాలాసార్లు అడగడం ...నేను మాట్లాడకుండా మౌనంగా నా పని నేను చేసుకోవడం ....ఇలా జరిగిపోయింది ....

ఈ మధ్య మాటల సందర్భంలో ...ఆ అమ్మాయి తనకు ఫ్రెండ్ అయిందని ...వాళ్లద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటారని ...ఇప్పుడు గొడవలేం లేవని అన్నప్పుడు ....నేను చాలా సంతోషించా ...

నేను సంతోషించింది ....వాళ్లద్దరూ మిత్రులయ్యారని కాదు ....
నేను తనకు శత్రువుగా మారలేదని ....మనసుకి ఒక మిత్రురాలు ఉందని ....
నిజానికి ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు ....చేసుకోవాలనే ఆసక్తి కూడా లేదు ...

జీవితంలో ...ఒక పని చేయను అన్నందుకు ....ఆ సమయంలో నేను కొన్ని విమర్శలు ఎదుర్కొని బాధపడి ఉండొచ్చు ...కానీ అనవసరంగా ఎవరినీ బాధపెట్టకుండా ఉండడం కూడా ....మనకు భవిష్యత్తులో సంతోషాన్ని ఇస్తుందని తెలిస్తే ....ఎవరినైనా ఎందుకు బాధపెడతాం ...బాధ భరిస్తాం కానీ ...

నాకు ఇదంతా ...ఎవరిమీదో పగ సాధింపు , కక్ష్య సాధింపులా కనిపించదు ....నన్ను నేను తీర్చి దిద్దుకోవడం ....ఇతరులను బాధపెట్టకుండా బ్రతకడం ఎలాగో నేర్చుకుంటున్నా అనిపిస్తుంది ....అది నా చుట్టూ ఉన్నవాళ్లను చూసే ...

ఈ సంఘర్షణల్లో...నేను ఎవరిని దూరం చేసుకుంటున్నాను ....ఎవరికి దగ్గరవుతున్నాను అనేది వదిలేసి ....నన్ను నేను చూసుకోవడం ..నాకు నేను దగ్గరవడం ...ఎక్కువ చేశా అని చెప్పొచ్చు ....

నాణానికి ఒకవైపు మనకు ఎపుడూ కనిపిస్తుంది ....కాకపోతే కష్టపడి రెండోవైపు కూడా చూడగలిగితే ...ఎన్నో సమస్యలకు పరిష్కారాలు అక్కడే కనిపిస్తూ ఉంటాయి ...

అన్నట్టు ఆ వీడియోస్ లో ...ఆడవాళ్లు చిప్పలు తోముకోవడం ...ఒక లేబర్ పని అని మా ఆయన విమర్శించారు ...అలా లేబర్ పనులు చేసుకునే ఆడవాళ్లు రాజకీయాల గురించి , పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే రైట్ లేదు అని కూడా అన్నారు ...

మా ఆయన పుస్తకం తీసుకుని చదువుకుంటూ ఎదురుగా కూర్చున్నప్పుడు ....ఆయన దృష్టిలో ఎన్నో విలువైన పనులు ఆయన చేస్తున్నప్పుడు ....అలాంటి లేబర్ పని చేస్తున్న నేను ....తను తిని విసిరి పారేసిన ఎంగిలి కంచం కడుగుతున్న నేను ...తన దృష్టిలో ఒక లేబర్ దాన్ని అని అనుకుంటే నాకు నిజంగా బాధగా అనిపించేది ....

గిన్నెలు కడిగే ఆడవాళ్ళందరూ లేబర్ వాళ్లేనా అనే ప్రశ్న ... నన్ను చాలా కాలం తొలిచేసినప్పుడు ...ఎవరు గిన్నెలు వాళ్ళు కడుక్కోండి అని చెప్పేదాన్ని ....కానీ ఇంతవరకూ ఈ లేబర్ పని చేయడానికి సాహసం చేసిన ...పురుషుల్ని నేను చూడలేదు ...

అంతెందుకు ...నీకు జన్మనిచ్చే ...పురుడు పొసే వార్డ్ ని కూడా లేబర్ వార్డ్ అనే అంటారు ....

నువ్వు భూమ్మీద పడగానే నీ చుట్టూ పట్టిన మకిలిని తల్లే శుభ్రం చేస్తుంది ....అంత మాత్రాన ఆమె లేబర్ పని చేసిందని అంటావా ....

ఏమో ....ఇలా వ్రాయడానికి నాకు నా తల్లి నేర్పిన సంస్కారం అడ్డొస్తుంది ....ఆ సంస్కారమే ఇప్పటికీ అందరి ఎంగిలిని శుభ్రం చేయడం నా బాధ్యత అనుకునేలా అడ్డు పడుతుంది ....

టాపిక్స్ ఈసారి ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో పోతున్నాయేమో ...అయినా పర్వాలేదు ....
ఇది ఎవరినీ బాధపెట్టడం కాదుగా ...

అన్నట్టు ...బాధ పెట్టడం ....బాధను భరించడం గురించి కదూ మాట్లాడుకుంటున్నాం ...

నా దృష్టిలో ....నేను పడ్డ బాధ లాంటిదే ఇతరులకు రాకూడదు అనుకుంటా ....నేను ఎదుర్కొన్న కష్టం లాంటిదే ఇతరులకు ఎదురు కాకూడదు అనుకుంటా....

నన్ను అన్న మాటలే ఇతరుల్ని అనకూడదు అనుకుంటాను ....

ఇదంతా ఇప్పుడు చేస్తున్నానని కాదు ....ఇంతకు ముందు చేసానని కాదు ...
ఇప్పటికీ ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను ....చేయడానికి ప్రయత్నిస్తాను అని అర్ధం ....

నిరంతరం ...నేర్చుకోవడం లోనే జీవితం కదా ...

ఈ విషయంలో కన్న తల్లి అయినా ....కడుపున పుట్టిన బిడ్డలయిన నాకు ఒక్కరే ....
వాళ్ళ దగ్గర నేను విద్యార్థిలా కూర్చుని నేర్చుకోవడానికి సందేహించను ....

చాలాసార్లు మళ్ళీ పాఠం మొదటినుండి నేర్చుకోవాల్సి రావచ్చు ...ముగింపు లేనంతవరకు ...

జీవితం మొదటినుండి మొదలు పెట్టాల్సి రావచ్చు ...ముగింపు ఇచ్చేవరకు ...

అందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను ....!🙏