Thursday, May 10, 2018

గుంపులు గుంపులుగా రామచిలకలు వేపచెట్టు మీద వాలి


సాయంత్రం ఆరు గంటలయిందంటే ఆరుబయట అందరి ఇళ్ళ ముందు లాగే మా ఇంటి ముందు కూడా మంచాలు వేసుకునేవాళ్ళం ..... గుంపులు గుంపులుగా రామచిలకలు వేపచెట్టు మీద వాలి, చేస్తున్న
అల్లరి చూడాలంటే రెండు కళ్ళు సరిపోయేవి కావు ....చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ...వాటి ముక్కులతో పాలుగారే లేత వేపకాయలన్ని ముక్కలు ముక్కలు చేసి, అప్పుడే శుభ్రం చేసిన వాకిలి నిండా చల్లినా రవ్వంత కోపం కూడా రాదెందుకో .....ఎంత అందంగా అల్లరి చేస్తున్నాయో చూసి ఆస్వాదించడం తప్ప ....."కడుపునిండా పాలు తాగి తల్లి ఒడిలోనుండి తొంగి చూసే పసిపాప కొంటె చూపు చిలకలదైతే .....,బిడ్డకు కడుపునిండా పాలిచ్చి.....ఇంక ఒడిలోనుండి కిందకు దిగివెళ్ళవా అనే తల్లి మందలింపు చూపులు మావయ్యేవి ....."
వాటి అల్లరి సద్దుమణిగే సమయానికి కడుపులో ఆకలి అల్లరి చేయడం మొదలు పెట్టేది ......మా నాయనమ్మ పొలం నుండి తెచ్చిన గోంగూర, పచ్చడి చేయడం అమ్మ మొదలు పెట్టింది అని ,అప్పటి వరకు ఆగాలని, అల్లరి చేస్తున్న ఆకలికి తెలిసేది కాదు ....కాదు కాదు ....తెలియనట్టు నటించేది .....ఆనక నక నక లాడిపోయేది.....
పొయ్యిమీద అప్పటికే ఉడికిన అన్నం "రా నన్ను వడ్డించుకో" అని వేడి వేడిగా ఒక చూపు చూసేది .....ఇక ఆగడం సాధ్యమా ...?! 
గుంటూరు తెల్ల గోంగూర,పచ్చిమిరపకాయలు ,కాస్త వెల్లుల్లి ,ఒక రెమ్మ కరివేపాకు ,కాస్త కళ్ళు ఉప్పు, రోట్లో వేసి రోకలిబండతో నూరుతుంటే .....నేను పళ్ళెంలో అన్నం పెట్టుకుని వచ్చి ...."అమ్మా తొందరగా కాస్త పచ్చడి వెయ్యమ్మా" అని అడిగేదాన్ని .....
"రోట్లో పచ్చడి వెయ్యకూడదు ....తిరగమోత కూడా పెట్టాలి ....కాసేపు ఆగు" అనేది అమ్మ.....
ఆ కాస్త సమయంలో ....రోటినిండా పచ్చడి వేసి ,కాస్త కూడా పక్కకి పడిపోకుండా,కళ్ళల్లో పడకుండా ఎలా నూరుతుందా అని ....గమనిస్తూ ఉండేదాన్ని .....ఇంతకు ముందు నేను చేసిన ప్రయోగాలలో కళ్ళల్లో కాస్త పడేసుకుని ....కెవ్వుమని కేకలు పెట్టి ,ఒంటినిండా చిందించుకుని ...."నా వల్ల కాదమ్మా"అని పరుగులుపెట్టిన అనుభవం నాది మరి ...... అమ్మ,అమ్మ పని.. ఇప్పటికీ నాకెప్పుడూ అద్భుతమే ....
గోంగూర పచ్చడితో ,ఆరుబయట మంచం మీద కూర్చుని,రేడియో లో వచ్చే పాటలు వింటూ,వెన్నెలను ఆస్వాదిస్తూ అన్నం తినడం మరువలేని ఒక చిన్ననాటి అనుభూతి ....సరే అదలా ఉంచితే ...
6నెలల క్రితం ....
ఇండియా వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాను ....ఎప్పుడూ నేనెప్పుడు వస్తున్నానో ముందుగా అమ్మకు చెప్పను ....ఊహించకుండా వెళ్లి అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం ,ఆనందం చూడడం నాకిష్టం .....కానీ విచిత్రం ఇప్పటివరకు ఆనందమే తప్ప ఆశ్చర్యం కనిపించకుండా చేసి ,ఆ ఆశ్చర్యం నాకే ఇచ్చేస్తుంది అమ్మ....నన్నెప్పుడూ అమ్మ అతిధిగా భావించదు,ఏదో లేదని కంగారు పడదు ..... అప్పటికప్పుడు నాకిష్టమైనది ఏదైనా చేసిపెట్టగల శక్తి అమ్మ సొంతం ..... 
ఇదివరకటి ఇల్లు వాస్తు సమస్య ఉందని ఎవరో చెబితే ఆ ఇల్లు పడేసి ....కనుచుపుమేరలోనే మాకున్న మరొక స్థలంలో ఇల్లు వేసుకుని ఉంటుంది .....ఆ వేపచెట్టు కూడా లేదనుకోండి ......
కారుదిగి ఇంటి ముందుకు రావడంతోనే ....కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది.....అలా కాళ్ళు కడుక్కుని బయట ఉన్న మంచం మీద కాసేపు విశ్రాంతిగా పడుకుని ఆకాశం వంక చూసాను ....ప్రపంచంలో ఎక్కడా నాకు ఆకాశం వంక చూడాలనిపించదు ....మా ఇంటిముందు మంచం మీద పడుకుని చూసేదే ఆకాశం అని నాకు గట్టి నమ్మకం ...ఆ మేఘాలు చూడగానే ...చిన్ననాటి నేస్తాలు కనిపించాయని మనసు మురిసిపోతుంది ......
అక్కడున్న సూర్యుడు,చంద్రుడు మా దేశం వాళ్ళే ...మా ఊరు వాళ్ళే అనే మతిలేని వాదన నాది ....
నేను ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండగానే ....అంతరాయంలా అమ్మ పిలుపు ....."ఒకసారి ఇంట్లోకి రామ్మా "అంటూ ...
"ఎందుకమ్మా " అడిగాను ...లేచి వెళ్ళడానికి బద్దకిస్తూ .....(అసలు అమ్మ దగ్గరకు వెళ్ళగానే ఎందుకో బద్దకానికే బద్దకంగా అనిపిస్తుంది .....)
"గారెలు తిందువుగాని రామ్మా ...."పిల్లలకు చేసిపెట్టడం ఇంత ఆనందం కలిగిస్తుందా ....అనిపించేలా అమ్మ పిలుపు .....(అన్నట్లు అమ్మ గారెలు చేస్తే రోట్లో పిండి రుబ్బి చేయాల్సిందే ...ఆ రుచే వేరు ....)
"ఇక్కడకు తీసుకుని రామ్మా ....." ఆరుబయట తినే ఆనందం కోసం ఎదురు చూస్తూ నేను 
"అందరి కళ్ళూ ఇటే.....దిష్టి పెడతారు ....ఇంట్లోకిరా ....." (అప్పటికే నాకు దిష్టి తీయడం అనే కార్యక్రమం చాలాసార్లు పూర్తి చేసినా కూడా.....)
"ఉహు నేను ఇంట్లోకి రాను ....." మొండిగా నేను ....
"చెప్తే వినరు కదా ....."కోపం +విసుగు కలగలిపిన నిస్సహాయత ....."రా ఇంట్లోకి "మళ్లీ గద్దింపు ....
"అయితే ...నాకు ఏమీ వద్దు ఫో,నేను తినను ....." అలగటం అనే విషయం అప్పుడే గుర్తొచ్చిందా అన్నట్టు .....
"ఉష్ ....పిల్లలు చెప్పిన మాట వినరు కదా ....." కక్కలేని కోపంతో అమ్మ.....
అలవాటైన అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందిలే అనే ధీమాతో కూడిన నవ్వు నాలో ....
తర్వాత హాయిగా గారెలు ఆస్వాదిస్తూ నేను....నా అలకను సంతృప్తి పరుస్తూ అమ్మ ......
ప్రపంచంలో నాకు అలిగే అవకాశం అమ్మ దగ్గరే .....నా అలకను భరించే శక్తి అమ్మకే సొంతం ......
కడుపునిండా పాలు తాగి తల్లి ఒడిలోనుండి తొంగి చూసే పసిపాప కొంటె చూపు నాదైతే.....,బిడ్డకు కడుపునిండా పాలిచ్చి.....ఇంక ఒడిలోనుండి కిందకు దిగివెళ్ళవా అనే తల్లి మందలింపు చూపులు అమ్మవయ్యేవి.....!!
అమ్మ ...ఇల్లు,వేపచేట్టులా నాకు కనిపిస్తే .....నేను ..అమ్మకు చిలకమ్మలా కనిపిస్తాను ఎప్పటికీ మా బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ .....
మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో .............
(ఫోటో ....మా ఊరు లోకి వెళ్లేదారి ....)


(Note: Wrote and published on May 10th 2014) 

Monday, May 7, 2018

లక్ష్యం అంటే నిర్వచనం ఏమిటి ...???!!

లక్ష్యం అంటే నిర్వచనం ఏమిటి ...???!!! 🤔
లక్ష్యం ఎలా ఉండాలి ...??!! 🤔
లక్ష్యం - మనం ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే ....
అది సాధించడం కోసం ఎంతగా కృషి చేయాలంటే .....
ఆ లక్ష్యం కూడా ..తనను తాను చూసుకుని ...నేను ఇంత కష్టమైనా దాన్నా ....నేను ఇంత ఆటంకపరురాలినా....కాస్త తెలికైపోతే ఎంత బాగుండు ...ఏ ఆటంకాలూ సృష్టించకుండా ఉంటే ఎంత బాగుండు ....అని విచారించే అంతగా 
కృషి చేయాలి ....
😍
లక్ష్యం - పుడితే నేను మళ్లీ లక్ష్యం లాగే పుట్టాలి ...అదీ మన దారిలోనే ఎదురవాలి అని తనకు తానే లక్ష్యం ఏర్పరచుకునేలా కృషి చేయాలి ....
😍
లక్ష్యం - లక్ష్యాన్ని చూసి ....కృషి ,పట్టుదల ,సంకల్పం ...నీకోసం మేం ఎంత కష్ట పడుతున్నమో చూడు , ఏ జన్మలోనో నీకు రుణపడినట్టు ....అని కక్ష్య పెంచుకునేలా కృషి చేయాలి ....
😍
లక్ష్యం - మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడం చూసి ....మరి కొందరు మన చుట్టు పక్కల వాళ్ళు అదే లక్ష్యం చేరుకోవాలని ప్రయత్నించాలి ....
😊
లక్ష్యం - అనుకున్న లక్ష్యం చేరుకున్నాక .... మళ్లీ అదే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే నేను చేరుకోగలనా ....సాధించగలనా ...అని భయం వేయాలి .....🤔
లక్ష్యం - ఎవరైనా మనం సాధించిన ఫలితం మీద దృష్టి సారించడానికి సాహసించాలి తప్ప ....మనం చేసిన కృషి తలచుకోవడానికి సాహసించకూడదు ...🙅‍♀️
లక్ష్యం - మనం సాధించిన లక్ష్యం ....మళ్ళీ మనం నిర్దేశించుకుంటే ....సాధించడం మనకు అసాధ్యం కావాలి ...😥
😍.........అదీ లక్ష్యం అంటే ....లక్ష్యాన్ని సాధించడం అంటే ........😍

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ..... :) :) :)

పిల్లల దగ్గరనుండి అయినా ...కొన్ని విషయాలు నేర్చుకోవడానికి నేనెప్పుడూ వెనకాడను.....అదీ నా పిల్లలైతే ఇంకా గర్వంగా నేర్చుకోవాలి అనిపిస్తుంది ....ఎందుకంటే అందుకు నేను కూడా పరోక్షంగానో ...ప్రత్యక్షంగానో కారణం అనే నమ్మకం ఉంటుంది కాబట్టి ....  
అందుకు ఉదాహరణ అయిన ఒక సంఘటనను... మీతో ....మాతృ దినోత్సవ సందర్భంగా షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా .....(మిగతా రోజుల్లో అయినా షేర్ చేసుకోవచ్చు ....కానీ సందర్భం వస్తే ఇలాంటివి వ్రాయడానికి కాస్త సమయం మరి కాస్త బలవంతంగా అయినా కేటాయించుకుంటాం) మిత్రులు కాస్త ఓపిక చేసుకుని చదవండి ....  
---------------------
నా పెద్ద కూతురు డ్రైవింగ్ నేర్చుకుంటున్న కొత్తలో ....,,,
ఇక్కడ(అమెరికాలో ) డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్లకు ...లెర్నర్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఒక రూల్ ఉంటుంది ....ఎవరైనా అప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు పక్కన ఉన్నప్పుడు మాత్రమే(అంటే పేరెంట్స్/గార్డియన్స్) డ్రైవ్ చేయాలి అని .....
నా కూతురికి కూడా లెర్నర్ లైసెన్సు వచ్చినప్పుడు ...నేను కానీ /మా వారు కానీ పక్కనే కూర్చునేవాళ్ళం ....ఒక నాలుగైదు సార్లు నేను /మరో నాలుగైదు సార్లు ..(పోనీ తనే ఓ రెండుసార్లు ఎక్కువ అనుకోండి ...  )మా వారు ...
అలా రెండు మూడు రోజులు జరిగాక .....మేమిద్దరం మాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ చెప్పాక .....తను కాస్త నేర్చుకుంది అనిపించాక ....ఒకరోజు నా దగ్గరకు వచ్చింది ….(అప్పటికే రాత్రి పదయింది ….)
"మమ్మీ ...ఒకసారి నాతో డ్రైవ్ కి రావా ....నేనెలా నేర్చుకున్నానో నువ్వు చూద్దువుగాని ..." అని అడిగింది .... 
సాధారణంగా పిల్లలు అంత సరదాగా అడిగినప్పుడు సమయం ఎలా చూస్తాను??!! ....
"సరే పద" అన్నా ....
రెండు మూడు కర్వ్ లు తీసి చూపించి ...."చాలా బాగా చేశా కదా ..." అంది మెరిసే కళ్ళతో .....
అంతకంటే మెరిసే కళ్ళతో ....."నిజంగా చాలా బాగా చేశావు నాన్నా .....నువ్వు చిన్నప్పటినుండి అంతే కదా ....ఏదైనా తొందరగా నేర్చుకుంటావు ......నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా ..." అంటూ కాస్త ఎక్కువగానే (అవసరం అనిపించి )పొగిడా .....
తర్వాత తర్వాత ...ఓ రెండు మూడు రోజుల తర్వాత ...గమనిస్తే ....ఎందుకో వాళ్ళ డాడీ కంటే నాతో ఉన్నప్పుడు డ్రైవ్ చేయడానికి కాస్త ఎక్కువ భయపడుతుంది అని గమనించా .... 
కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించా ....!!
నేను కాస్త ఎక్కువగా తనని గమనించి ...ప్రతి చిన్న విషయం పట్టించుకుని ....ముందుగానే జాగ్రత్తలు చెప్పి హెచ్చరించడం ఒక కారణం అయితే .....తనకంటే ముందే నేను భయపడడం ఒక కారణం .....అనిపించింది ....మరో ముఖ్యమైన కారణం నేనంటే మనసులో కాస్త ఎక్కువ భయం తనకు ఉండడం కూడా అనిపించింది .....(నేను భయపెట్టకపోయినా  ) 
సరే ....కొన్ని కొన్ని పనులు చేయడానికి మనం సరైన వ్యక్తులం కాదు అనుకున్నప్పుడు ....మనం మొండికేసి ..అవి చేయకపోవడం మంచిది అని అనుకుని ....ఎక్కువసార్లు .....అడిగినప్పుడల్లా ....(వాళ్లకు తెలియకుండా )
"కాస్త పనుంది నాన్నా" , అనో ...."ఓపిక లేదు నాన్నా" అనో ...."డాడీ ని తీసుకుని వెళ్ళు" ....అని చెప్పి తప్పించుకున్నా ..... 
ఇక తప్పనిసరి అని వాళ్ళూ అర్ధం చేసుకుని వెళ్ళే వాళ్ళు ....
----------------------------------
అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళాలని అందరం కలిసి వెళ్ళాం .....తనకు ఫ్రీ గా ఉండాలని .....నేను వెనక సీట్ లో కూర్చుని.... మా వారిని ముందు సీట్లో కూర్చోబెట్టా ....
అయినా నా కళ్ళకు గంతలు కట్టడం , నోటికి తాళం వేయడం మాత్రం చేయలేదు .....   
రైట్ లేన్ తీసుకునేటప్పుడు ఎదురుగా వస్తున్న లెఫ్ట్ చూసుకోలేదు ...."ఆపు నాన్నా" అని హెచ్చరిస్తున్నా రైట్ తీసేసింది ....వాడు హార్న్ చేశాడు ....
నేను మావారి మీద ఫైర్ అయ్యా ...."ముందు సీట్లో కూర్చుని చూడొద్దా మీరు" ...అని ....
ఎప్పటిలాగే ...."తను చూసుకుంటుంది కదా ...నేను కూడా చూస్తూనే ఉన్నాను ".....అన్నారు .... 
"మమ్మీ ప్లీజ్ ....నువ్వు , డాడీ ఇద్దరూ చెప్తే నేను ఇంకా మిస్టేక్స్ చేస్తాను ...నేను ఫోకస్ చేయలేను అంది ..." నా కూతురు ....
కాసేపు ఆగాక ....లెఫ్ట్ టర్న్ తీసి షాప్ దగ్గరకు వెళ్ళే ముందు కార్ కర్బ్ మీదకు ఎక్కించేసింది...."
ఈసారి చాలా ప్రశాంతంగా ...."కార్ కర్బ్ మీదకు వెళ్ళింది "...అని చెప్పా .....
"నో వెళ్ళలేదు ..." "నువ్వు భ్రమ పడుతున్నావు ...." అంది నమ్మకంగా ....
"డాడీ కర్బ్ మీదకు వెళ్ళిందా ...." అడిగింది వాళ్ళ డాడీని ...మీరే సాక్ష్యం అన్నట్టు
...
"లేదు ...నాకైతే అలా అనిపించలేదు ...." చెప్పారు తను ...
"మమ్మీ నువ్వుంటే ...నాకు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నాను అనిపిస్తుంది ....." అంది ....కాస్త కోపంగా ...అస్సహాయతతో ...
"కారాపు ..." చెప్పా ప్రశాంతంగా ....
కారాపాక ...."ఓకే నేను నడిచి ఇంటికి వెళ్తున్నాను ....మీరు మీ పని చూసుకుని రండి ...." చెప్పా ...
"నో మమ్మీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ...." చెప్పింది ....
"నేను కోపంగా వెళ్ళడం లేదు ....ఇక్కడి నుండి ఇల్లు కాస్త దూరమే ...పైగా నేను నడవగలను ....నేను ఉండడం వలన నీకు మిస్టేక్స్ జరుగుతున్నాయి అనే ఫీలింగ్ నీకు లేకుండా ఉండడం నాకు ముఖ్యం ....నీ ఫీలింగ్స్ ని గౌరవించి వెళ్తున్నా ...." చెప్పా కోపం లేకుండా ....
"అయినా వెళ్ళడానికి వీల్లేదు ...." చెప్పింది ఏడుపు గొంతుతో ....
"నేను వెళ్ళాలనే నిర్ణయించుకున్నా ..." చెప్పా ఖచ్చితంగా ....
కీ తీసుకుని నడుచుకుంటూ నాలుగు అడుగులు వేశా....
"నువ్వు ఇప్పుడు వెళ్తే ...నీతో నెల రోజుల వరకు నేను మాట్లాడను ....." వినిపించింది వెనకనుండి ....
అడుగులు వేయడం ఆపా ...
"పిల్లల మీద నాకున్న ప్రేమ నా బలంగా ఎదుటివాళ్ళకి కనిపించాలి కానీ ....నా బలహీనతగా కనిపించకూడదు ....అందుకు ఈ సంఘటన నాంది కావాలి ....." చాలా బలంగా మనసులో అనిపించింది ....
"నీకెలా చేయాలనిపిస్తే అలా చెయ్యి ...." వెనక్కి తిరగకుండానే స్థిరంగా చెప్పి ....అడుగులు ముందుకు వేశా ....
నడుస్తూ ఇంటికి వచ్చా ....తాళం తీసి ....నాకిష్టమైన పాటలు పెట్టుకుని వంట చేసుకుంటూ ఉన్నా .....
అంతలో వాళ్ళందరూ వచ్చినట్లుగా తలుపు చప్పుడైంది .....
అందరూ మాట్లాడుకుంటూ కిచెన్ రూం వైపు వస్తున్నారు .....
నా పెద్ద కూతురు మాటలు నాకు దగ్గరవుతున్న శబ్దం నాకు వినిపించింది ...
నా వెనకగా వచ్చినట్లుగా ...చప్పుడు వలన ....నాకు తెలిసింది .....అయినా నేను తలెత్తకుండా నా పని నేను చేసుకుంటూనే ఉన్నా ....
వెనకనుండి ఒక్కసారిగా నన్ను కౌగలించుకుని ....."సారీ మమ్మీ ....తప్పయింది నన్ను క్షమించు ....నేను నీతో అంత హార్ష్ గా మాట్లాడి ఉండాల్సింది కాదు .... ...." అంది బాధ పడుతూ ...
తనను దగ్గరకు తీసుకుని ...."నీ మీద నాకు ఏం కోపం లేదు నాన్నా ....అసలు నాకే కాదు ఏ తల్లికి పిల్లల మీద ఎప్పుడూ కోపం రాదు .ఉండదు ..." చెప్పా ప్రేమగా ....
"నిజంగా కోపం లేదు కదా ....నాతో మాట్లాడతావు కదా ...." అడిగింది ఒకింత సందేహంగా ....
"నిజంగా కోపం లేదు ....నీ ఆలోచనలు నువ్వు సరిదిద్దుకోవాలనే అలా చేశాను ..." వివరించా ...
"థాంక్యూ మమ్మీ ...." చెప్పింది సంతోషంగా .... 
..................................
ఎందుకో ఆ క్షణంలో నాకు మా అమ్మ గుర్తొచ్చింది .....
నువ్వు నీ పిల్లల్ని పెంచడం కంటే నా పిల్లలని నేను గొప్పగా పెంచుతాను అని అమాయకంగా మా అమ్మతో ఎప్పుడో శపథం చేయడం గుర్తొచ్చింది .... 
"చూశావా అమ్మా ....నేను ఎన్నోసార్లు నీతో కోపంగా మాట్లాడాను .....నేను నీకు ఎప్పుడైనా సారీ చెప్పానా....నా కూతుర్ని చూశావా ...ఎంత బాగా పెంచానో ....నేను గెలిచాను కదమ్మా ,..." మనసులోనే మా అమ్మను ప్రశ్నించా ....
"పిచ్చిదానా ....ఆ కూతుర్ని పెంచిన వాళ్ళను కన్నది ఎవరే ....గెలిచింది కూడా ఎవరో నువ్వే చెప్పు" అని అమ్మ అడుగుతున్నట్టు అనిపించి /వినిపించి నాలిక్కరుచుకున్నా .... 
ఎప్పుడో ఒకసారి మా అమ్మకు "సారీ" చెప్పి ...నేనూ గెలవాలని నిర్ణయించుకున్నా .....అన్నట్టు ఇలా చెప్పాలని మాత్రం నా కూతురిదగ్గరనుండే నేను నేర్చుకున్నా ..... 
నవ్వుతూ ...నా కూతుర్ని హత్తుకుని .... "థాంక్స్" చెప్పి ....ఎందుకు చెప్పానో వివరించా .....   
----------------
అమ్మ అనే అనిర్వచనీయమైన అనుభూతిని అందరూ ఆస్వాదించాలని మనసారా కోరుకుంటూ ....,,,,
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు .....   
----------------------
(Note: Wrote and published on May 7th 2016 )

Monday, April 30, 2018

"నువ్వు ఎంత స్వార్ధంగా ఆలోచిస్తున్నావో ....??!!"

"నువ్వు ఎంత స్వార్ధంగా ఆలోచిస్తున్నావో ....??!!" ఒకరు నాతో ..
చిరునవ్వు ....(నాదే )😊
"నువ్వు ఎంత చెడ్డ దానివో ...??!! మరొకరు నాతో ....
మళ్ళీ చిరునవ్వే ....(ఇది కూడా నాదే )😊
"నువ్వు అబద్ధం కూడా చెప్పగలవా ??!! " ఒకరు నాతో ...
"నేను నిజాలు మాత్రమే చెబుతాను అని ఎవరికీ హామీ పత్రం వ్రాసి ఇవ్వలేదే...??!!" నవ్వుతూ నేను ...😃
"నువ్వు మహా తెలివైన దానివి ...నీ అంత తెలివితేటలు నాకు లేవు "
"ఏమో ఎలా నేర్చుకున్నానో తెలియదు .... కావచ్చు" నవ్వుతూ నేను ...🤣
"నీకు పొగరు ...."
"అవును ...చాలా ..." ఒప్పుకోలుగా నేను 😂
"నీకు అహంకారం ...."
"మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా ...." నవ్వుతూ నేను 😘🤣😂
-----------------------------------------
ఈ మధ్య తరచూ నా మొహం మీదే ఇలాంటి మాటలు నాకు వినిపిస్తున్నాయి ....😍
నిజానికి నాకు ఇలాంటి మాటలు ఇదివరకు ....అంటే చిన్నతనం నుండి విన్నప్పుడు ....కడవలు కడవలు ఏడుపొచ్చేది ....😭
ఇప్పుడైతే నాకు ఇలాంటి మాటలు వింటే చాలా ఆనందం కలుగుతుంది ....
నవ్వు కూడా వస్తుంది ....నవ్వంటే మామూలు నవ్వు కాదు ....సంపూర్ణమైన ....సంతృప్తితో కూడుకున్న నవ్వు ....హాయైన నవ్వు ....ఆహ్లాదకరమైన నవ్వు ....నాకు నేను అర్ధమైన నవ్వు ...🤣😃😂
--------------------------------------------------
అసలింతకీ ...ఇదివరకు ఎందుకు ఏడుపొచ్చేది అని ఆలోచిస్తే ....🤔
ఎవరైనా స్వార్ధంగా ఆలోచిస్తున్నావు అంటే ....అది అప్పుడు నిజం కాదు కాబట్టి ...🙅‍♀️
చుట్టుపక్కల వాళ్ళ గురించి తప్ప నా గురించి నేను ఆలోచించలేదు ....
ఎప్పుడూ మీరు తిన్న తర్వాత మిగిలితే నాకు అనేదాన్ని ....
మీరు చదువుకున్న తర్వాత నేను చదువుకుంటా అనేదాన్ని ....
మీరు బట్టలు కొనుక్కున్న తర్వాత అందరికీ సరిపోయిన తర్వాత మిగిలితే నాకు అనేదాన్ని ....మీరు అస్సలు నా గురించి ఆలోచించకండి ....నేనున్నానని మర్చిపోండి అనేదాన్ని ....😈
అసలు ఎవరో ఏమిటి ....నా గురించి నేను కూడా ఆలోచించని ఆ రోజుల్లో నేను నాతో సహా అందరికీ నిస్వార్ధ పరురాలిని ....నేను మంచిదాన్ని ....నేను ఉత్తమురాలిని ....🙏
నన్ను అలాంటి నిస్వార్ధం అనే స్వార్ధంలో సమాజం , బంధువులు , నేను ఉంచకపోతే ....నేను నిస్వార్ధం అనే భావంలో నుండి బయటపడితే ....నేను త్యాగమూర్తిని కాలేను ....అందుకే కొన్ని శతాబ్దాల కాలం పాటు నేను నిస్వార్ధం లో ఉండిపోయా ....🙇‍♀️
అప్పట్లో నువ్వు స్వార్ధపరురాలివి అని ఎవరైనా అంటే మరి నేను కడవలు కడవలు ఏడవనా ....అది అబద్ధం కదా ...??!! 😥
కానీ ఇప్పుడు ....నేను స్వార్ధపరురాలినే ....😜
నన్ను నేను రోజూ పలకరించుకుంటున్నా ...నన్ను నేను పరామర్శించుకుంటున్నా ....నన్ను నేను సంతోషింపజేసుకుంటున్నా ...నన్ను నేను ప్రేమించుకుంటున్నా....మొత్తానికి నా గురించి నేను ఆలోచిస్తున్నా ....😍
అందుకే ఇప్పుడు ఎవరైనా నన్ను స్వార్ధపరురాలివి అంటే నాకు కోపం రాకూడదు కదా ....😀☺️😊
అదే ఇప్పుడు నువ్వు నిస్వార్ధపరురాలివి అని చూడండి ....నేను కడవలు కడవలు ఏడుస్తా....😥😂
---------------------------------------
అలాగే ....అబ్బా నువ్వు ప్రాణం పోయినా అబద్ధం చెప్పవు కదా ...అనే రోజుల్లో ...నన్ను నేను నిజాలు తప్ప అబద్ధాలే లేవని నమ్మించిన రోజుల్లో ....,,🤔
నా మాట ఎవరైనా నమ్మకపోతే ....నా అంత నిలువుటెత్తు నిజాయితీ మాట నమ్మకపోతారా ...వ్వామ్మో ...అని కడవలు కడవలు ఏడ్చేదాన్ని ....😥😂
మరి ఇప్పుడు అబద్ధాలు చెప్పాల్సొస్తే హాయిగా అందరిలాగే చెప్పేస్తున్నా ....
మరి ఇప్పుడు నువ్వు అబద్ధాల కోరువి అంటే ...హాయిగా ఉండాలి కదా ....🤔😍😊
అదే ....నిజాయితీ పరురాలివి అని చూడండి ....నిజంగా నిజం (ఇది అబద్ధం కానే కాదు )...కడవలు కడవలు ఏడుస్తా ....😥😂
-------------------------------------------
మొత్తానికి ...అదన్నమాట ...
ఇప్పుడు చెప్పండి ....ఎవరెన్ని అన్నా ... హాయిగా ...సంతోషంగా ఉన్నా ....అంటే ...అతిశయోక్తి కాదు కదా ...??!! 😍☺️😊😘