ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది.. అలాగే స్నేహితులు కూడా ఉంటారు ... వాళ్ళకి కూడా ఒక కథ ఉంటుంది ...
బంధువులు ఉంటారు ...వాళ్ళకీ కథలుంటాయి ...
అసలు కథలు లేనివాళ్లెవరు చెప్పండి ..
ఎవరు కష్టపడరు ... ఎవరు అవకాశం ఉంటే ...పరిస్థితులు బాగుంటే చదువుకోరు చెప్పండి ...
బేసికల్ గా ఏంటంటే అందరి కథల కంటే వాళ్ళ కథే గ్రేట్ అనుకుంటూ ఉంటారు కాబట్టి ...ఈ కష్టపడి అనే మాటలను పదే పదే ఉపయోగిస్తూ ఉంటారు .... అది మనం చాలా ఇష్టపడి వినాలని వాళ్ళ తాపత్రయం కాబట్టి అనుకోండి ....అది వేరే విషయం ...
అలాగే ఇక్కడ ఒకాయనకు ఒక కథ ఉంది ... అది కూడా అందరూ వినాలని ఆయన కోరుకుంటూ ఉంటారు ..
కాకపోతే అది కాస్త విషాదవంతమయిన కథ కాబట్టి ... మిత్రులకు చెప్పుకుని కాస్త ఉపశమనం పొందుతూ ఉంటారు ...
అయితే అది ఈ బడాయి కొట్టే కథల కంటే కాస్త మంచి కథే కాబట్టి ... నాకు కూడా చెప్పుకోవడం లో వినడంలో తప్పు లేదనిపించింది ...
ఆయనకో నాన్న ఉన్నారు ... బాగా చదువుకున్న వ్యక్తి .... మర్యాదస్తుడు ... గౌరవప్రదమైన, ఉన్నతమైన వృత్తిలో ఉండడం వలన పిల్లలను బాగా చదివించారు .... కుటుంబాన్ని బాధ్యతగా చూసుకున్నారు ...(సమాజానికి చూపించుకుని బాధ్యత కాదు ....కుటుంబానికి అవసరమైన బాధ్యత )
ఆస్థి పాస్తులు కూడా బాగానే కూడా బెట్టారు .. ఇన్ని బాధ్యతల నేపథ్యంలో ...ఆయన లో ఒక ఆలోచన ఎప్పుడూ తిరుగాడుతూ ఉండేది ... అదేమిటంటే ...బాధ్యతలన్నీ అయిపోయాక ...పిల్లలు సెటిల్ అయ్యాక ....నేను రిటైర్ అయ్యాక ఇక భారత దేశం అంతా తీర్ధ యాత్రలకు వెళ్లి రావాలి ...అని
అందరూ అనుకునేదే ...సమంజసమైన కొరికే ...
అనుకున్నట్టుగానే ...పిల్లలకు పెళ్లిళ్లు చేశారు...అనుకున్నంత సంపాదించారు అప్పట్లో డాక్టర్ గా ... 70 ఏళ్లకు రిటైర్ అయ్యారు ... ఇక ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ...
ఈయన భారతదేశ యాత్రలకు ఏర్పాట్లు చేసుకుంటే ....భగవంతుడు గుండె చప్పుడు ఆపేసి ... స్వర్గ లోక యాత్రకు ఏర్పాటు చేసేశాడు..
తప్పలేదాయనకు ...
ఈ కథ ఆ కొడుకు తలచుకొని రోజుండదు ...గుర్తు చేసుకోని నిమిషం ఉండదు ...బాధ పడని క్షణం ఉండదు ....
ఇలాంటి కథలు మనకు కూడా ముఖ్యంగా నా లాంటి వాళ్లకు గుణపాఠాలు ...అందుకే ఇలాంటి కథలు చెప్పుకున్నా ...విన్నా తప్పులేదు ...
ఇలాంటి కథలు విన్నప్పుడైనా నా లాంటి వాళ్లకు మారాలి అనిపిస్తుంది ...కొత్త సంవత్సరం వచ్చిందని మారడం కాదు ...కొత్త జీవితం మొదలు పెట్టాలని మారడం ...
నేనూ ఎప్పుడూ ఇదే ఆలోచిస్తాను ...బాధ్యతలైపోయాక ...పిల్లలు సెటిల్ అయ్యాక ... అదయ్యాక ఇదయ్యాక అని ...
ఇకనైనా మార్పొస్తుందా నాలో ... ఏమో ..కాలమే సమాధానం చెప్పాలి ...
కానీ నా పిల్లలు మాత్రం ఇలాంటి కథ ఎవ్వరికీ చెప్పుకోకూడదు..!
Happy New Year!
