Friday, April 26, 2019

సమాజానికి సెప్టిక్ అయింది ....😢😢

సమాజానికి సెప్టిక్ అయింది ....😢😢
===================
అవును ....
నిజమే అనిపిస్తుంది ....
చిన్నతనంలో ....ఊర్లో చాలామంది ....మేం కూడా ...
పరిగెడుతూ పడిపోతేనో ....పెన్సిల్ చెక్కుతూ చేయి తెగితేనో ....కూరగాయలు తరుగుతూ కొడవలి కోసుకుంటేనో ....మేత నరుకుతూ గొడ్డలి గాటు పడితేనో ....కాలు బెణికితే ....ఎముక విరిగితే .....ప్రతి గాయానికి డాక్టర్ దగ్గరకి వెళ్ళేవాళ్ళు కాదు ...
పల్లెటూరు లో డాక్టర్ అందుబాటులో లేక ...లేదా పేదరికం వలన ....
ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికెందుకు ....అదే తగ్గిపోతుందిలే అనేవాళ్ళు ....
ఇంట్లోకెళ్ళి ...అలమరాలో ఉన్న పసుపు డబ్బాలో ఉన్న పసుపో....దొడ్లోకెళ్లి కుండలో ఉన్న సున్నమో తెచ్చి తెగిన చోట అద్ది ....పల్చటి పాత గుడ్డ ముక్క చుట్టి కట్టు కట్టేవాళ్ళు ....
కాస్త వైద్యం తెలుసని వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం ఉన్నవాళ్లు ....పసరు కట్టు అని ...కలబంద కట్టు అని కట్టేవాళ్ళు ....
మా నాయనమ్మ పసరు కట్టు కట్టేది ....
మా ఇంటి దగ్గరే ఉన్న చెట్లలోకి వెళ్లి ఏదో ఒక ఆకు తెచ్చేది ...అది రోట్లో వేసి నూరి ....ఆ ఆకులనుండి వచ్చిన పసరు(రసం) గాయం మీద పిండి ....కట్టు కట్టేది ....
రోజూ ఉదయం సాయంత్రం కట్టు కట్టాలి....తగ్గేవరకూ ....
ఇదే వైద్యం దూడలకూ గేదెలకూ కూడా చేసేది ....
వాటికి కళ్ళకు ఏదైనా గాయం అయితే ....నోటితో ఆ ఆకును నమిలి వాటి కళ్ళల్లో చుక్క చుక్క నోటితో వేసేది ....
నాకు కాస్త తెలివితేటలు(అంటే ఏమిటో తెలియదు) వచ్చాక మా నాయనమ్మను ఆ ఆకు ఏమిటో నాకూ చూపించవా...అది ఎలా పనిచేస్తుంది అని అడిగా చాలాసార్లు ....
అది ఇతరులకు చెప్తే పని చేయదు ....నీకు నా చివరి రోజుల్లో ఆ రహస్యం చెబుతాను అంది ....
చాలాసార్లు ....ఆ చివరి వరకూ ఆగే ఓపిక లేక ....దొంగ లాగా మా నాయనమ్మ వెనకాలే వెళ్లి చూసొద్దాం అనుకున్నా .....
కానీ ఎప్పుడైతే అది పనిచేయదు అని భయపెట్టిందో ఆ ఆలోచన విరమించుకున్నా....
చివరకు చాలా విషయాల్లాగే ఇది కూడా చెప్పకుండానే పోయింది ...ఇప్పటికీ ఆ ఆకు రహస్యం తెలియనే తెలియదు .....
అయితే ..ఈ నాటు వైద్యం ......శరీరానికి సహజ నిరోధక శక్తి ఉంటే...అదృష్టం బాగుంటే ఆ గాయం తగ్గిపోయేది ....
లేకపోతే .... అది, ఏ తుప్పు పట్టిన బ్లేడో కత్తో అయితే ....ఎక్కడైతే గాయం అయిందో అక్కడ లోపల్లోపలే ఆ శరీర భాగం కుళ్ళి పోవడం మొదలయ్యేది ....పైన గాయం మానిపోయినట్టే కనపడుతుంది ....లోపల శరీరాన్ని తినేస్తూ ఉంటుంది ఆ కలుషితం ....
పైన చూసుకుని సంబరపడి ....ఆహా భలే ఉంది ...తగ్గిపోయింది ....అంతా బాగుంది ...అని సంబరాలు జరుపుకుంటాం ....లోపల శరీరావయవాలు కుళ్లిపోయాక .....వాటిని తీసివేయక తప్పని పరిస్థితి ఎదురవుతుంది .....
అదే ....గాయం అయిన వెంటనే ....డాక్టర్ దగ్గరకు వెళ్లి ...ఎక్సరే తీయించుకుని ....సరైన వైద్యం చేయించుకుంటే ....సమస్య అనేదే తలెత్తదు కదా....
అయితే అందుకు ముందుగా మనకు అవగాహన ఉండాలి ....అలవాటు ఉండాలి ....
చిన్నతనం నుండి ....మన అలవాటు ప్రకారం....ప్రాణం మీదకు వస్తే గానీ డాక్టర్ దగ్గరకు వెళ్లాలనిపించదు...
తలనొప్పి వస్తే ....శారిడాన్ ...వేసుకుంటాం .....పాముకరిస్తే మంత్రం వేస్తాం ....జ్వరం వస్తే తాయెత్తు కడతాం ....ఇలా చెప్పుకుంటూ పోతే ..... మంత్రాలు చెప్పి చింతకాయలు రాలతాయేమో అని చూస్తూ ఉంటాం ....
--------------------------
ఇప్పుడు మన సమాజం కూడా అంతే అయింది...లేదా మనం చేసాం ...
గాయాలకు ...సున్నమో, పసుపో , ఆకు పసరో పూస్తున్నాం ....అంతా బాగుంది అంటున్నాం ...సంబరాలు జరుపుకుంటున్నాం ...
సమస్యని లోపలే పాతి పెడుతున్నాం ....లోపల్లోపలే సమస్య సమాజాన్ని కుళ్లబెడుతుంది ....
సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ....అసలు లోపం ఏమిటో విశ్లేషించకుండా ...పరిష్కారం ఏమిటో కనుక్కోకుండా ....విధి విధానాలేమిటో సవరించుకోకుండా ....సమస్యను ...వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేసి చేతులు దులుపుకుంటున్నాం ....
ఫలితం ...ప్రాణాలే బలవుతున్నాయి ....పసి మొగ్గలు, యువత , వృద్ధులు తేడా లేకుండా ...అందరి మరణాలకూ సాక్షీ భూతాలవుతున్నాం ...
అందుకే ఇప్పుడైనా ...సమాజానికి గాయం అయితే ....మంచి డాక్టర్ కి చూపించి ...వైద్యం చేయిద్దాం ...రుగ్మతలు లేకుండా చేద్దాం ....సెప్టిక్ కాకుండా చూద్దాం ....🙏
*********************************

1 comment:

  1. సూటిగా..సుతిమెత్తగా చెప్పారు!!����

    ReplyDelete