Thursday, May 16, 2019

నా జీవితం పరిధి చాలా చిన్నది ...

నా జీవితం పరిధి చాలా చిన్నది ...
======================
నాకు తెలిసిన వ్యక్తులు , పరిచయం ఉన్నవారు , ఆత్మీయులు కూడా బహు కొద్ది మంది ....
ఇహ సెలెబ్రిటీలైతే నాకెవ్వరూ తెలియదు ...అది వేరే సంగతి అనుకోండి ... 😜
సరే ....అందుకు కారణాలు ఏవైనా నా ఆలోచనలు , అభిప్రాయాలు, అభిప్రాయబేధాలు మొదలైనవి ..ఎప్పుడూ ఆ అతి కొద్ది మంది చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ....
అందుకేనేమో ....ఆ అతికొద్ది మంది మీద నేను నాకు తెలియకుండానే ఆధారపడుతూ ఉంటా ....
ఆధారపడడం అంటే ఇక్కడ....వాళ్ళు నన్ను పెంచి ,పోషించి , లాలించాలని కాదు ....
నా అభిప్రాయాల ఏర్పాటుకు, వేర్పాటుకు ...సహాయపడుతూ ఉంటారని ...నేను ఆధారపడుతూ ఉంటానని ....
అయితే ...ఈ అతి కొద్దిమందిలో ...నేను, కొందరిని అభిమానిస్తూ ఉంటా ....కొందరిని ఆరాధిస్తూ ఉంటా ....మరి కొందరిని ప్రేమిస్తూ ఉంటా ....ఇంకొందరితో స్నేహం చేస్తూ ఉంటా ....కొందరితో కేవలం పరిచయం మాత్రమే కలిగి ఉంటా ....సహజంగానే కొందరిపై కోపం కలిగి ఉంటా ....కొందరిని ద్వేషిస్తూ ఉంటా ....
తద్వారా నా అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటా ....
కొన్నిసార్లు నా అభిప్రాయాలు తప్పని కొందరు నిరూపిస్తూ ఉంటారు ....కొన్నిసార్లు నా అభిప్రాయాలు ఒప్పని కొందరు నిరూపిస్తూ ఉంటారు ....
అభిప్రాయాలు తప్పని, లేదా ఒప్పని నిరూపించినవాళ్లు నేను ప్రేమించేవాళ్ళు కావచ్చు ....నేను ద్వేషించేవాళ్ళు కావచ్చు ....చెప్పలేను ...
కానీ విచిత్రంగా కొన్నిసార్లు ...నా అభిప్రాయాలు తారుమారవుతూ ఉంటాయి ....వాళ్ళు నా అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉండరు (లేదా వాళ్లకు తగ్గట్టు నా అభిప్రాయాలు ఉండవు ...)...
అంటే నా ముందు నటిస్తూ ఉంటారు కావచ్చు ....నేను వాళ్ళముందు నటించి ఉండొచ్చు ...అప్పుడు నేను వాళ్ళ మీద తప్పు అభిప్రాయం కలిగి ఉంటా ...
అలాంటప్పుడు ....నేను ద్వేషిస్తున్నవాళ్ళు, నా ద్వేషానికి ...నేను ప్రేమిస్తున్నవాళ్ళు, నా ప్రేమకు అర్హులు కాకపోవచ్చు ....
ఈ అభిప్రాయాల సంఘర్షణలో ....ద్వేషించేవాళ్లను పోగొట్టుకున్నా పర్వాలేదు ....కానీ, ప్రేమించేవాళ్లను కోల్పోతేనే సమస్య ....
అలా కోల్పోకుండా ఉండాలంటే ....నా అభిప్రాయాలకు నేను మరో అవకాశం ఇస్తూ ఉంటా ....మరో గమనింపునిస్తూ ఉంటా ....
విచిత్రంగా నాకు నా జీవితంలో ఇప్పటివరకు ....,
ప్రేమించిన వాళ్ళు కూడా ద్వేషించడం నేర్పించారు ....
ద్వేషించిన వాళ్ళు కూడా ప్రేమించడం నేర్పించారు ....
నమ్మిన వాళ్ళు కూడా మోసం నేర్పించారు ...
మోసగించిన వాళ్ళు కూడా నమ్మకం నేర్పించారు ....
గెలిపించిన వాళ్ళు కూడా ఓటమి నేర్పించారు ....
ఓడించిన వాళ్ళు కూడా గెలుపు నేర్పించారు ....
------------------
నాకున్న ఈ చిన్న పరిధిలో ఉన్న వ్యక్తుల్లో ఎవరు ఏం నేర్పిస్తారో ....ఎవరి వలన ఏ జీవిత సత్యాలు బోధపడతాయో చెప్పడం కష్టం ...
అందుకే నేను ద్వేషించేవాళ్ళని కూడా నా దగ్గరే ఉంచమని ... నాకు నేను నచ్చజెప్పుకుంటూ ఉంటా ....😊

No comments:

Post a Comment