Wednesday, November 20, 2019

ఈ రోజు ఒక ఇరానియన్ తో పరిచయం జరిగింది ...

ఈ రోజు ఒక ఇరానియన్ తో పరిచయం జరిగింది ...
మొదట నేనూ అర్ధం కానట్టు చూశా ....నేను ఇరానియన్ అనగానే ....
ఇరాన్ నుండి వచ్చానని చెప్పాక అప్పుడు అర్ధం అయింది ...
అతనితో నా కొద్దిసేపు ప్రయాణం మాత్రం నా కార్ లేకపోవడం వలన అతను ఊబర్ నడపడం వలన చేయాల్సి వచ్చింది అనుకోండి ....అది వేరే విషయం ....
అతనితో మాట్లాడడం చాలా ఆసక్తికరంగా గడిచింది కాసేపు ....
కొంతమందితో మనం కాసేపట్లోనే చాలా రోజులనుండి పరిచయం ఉన్నట్టు కలిసిపోయి మాట్లాడతాం ....కొందరితో ఎన్ని సంవత్సరాలయినా ఏ మాత్రం బండి ముందుకు కదలదు ...
ఇతను మొదటి కోవకు చెందిన వ్యక్తి అన్నమాట ....
అతను అమెరికా ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించాడు తనని తాను పరిచయం చేసుకుంటూ ....
వాళ్ళ అబ్బాయి , అమ్మాయి చదువుకోవడానికి అమెరికా వచ్చి ....ఇక్కడే జాబ్స్ చేస్తూ సెటిల్ అయ్యారట ....వాళ్ళతోనే ఉండాలని ....అతను కూడా ఇరాన్ నుండి ఇక్కడికి వచ్చేశారట ....
అందుకే ...అతని ఇంగ్లిష్ కూడా నా ఇంగ్లిష్ లాగే ఎవరి యాస వాళ్లకు పూసగుచ్చినట్టు అర్ధం కాకుండా ఉంది ...
అతను కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇరాన్ భాషలోనే చదువుకుని ఉంటాడు అనుకున్నా .....
ఇరాన్ లో ఉన్నప్పుడు ...ఎకనామిక్స్ , మాథ్స్ చదువుకుని ఏదో మానేజ్మెంట్ రిలేటెడ్ జాబ్ చేసాడట ....ఇప్పుడు ఇక్కడ కాబ్ నడుపుకుంటున్నాడు ....పిల్లలు మంచి జాబ్స్ లో సెటిల్ అయ్యారు అని కూడా చెప్పాడు ....
మనలో చాలామందికి లేని ధైర్యం నేను అతనిలో చూసా ....
మనం అయితే ఉన్నతోద్యోగం ఏదైనా చేసి ....మళ్ళీ చిన్న పాటి పని చేసుకోవాలి అంటే ....చావనైనా చస్తాం కానీ ....చిన్న ఉద్యోగానికి మాత్రం పోను అంటాం ....
కానీ అతను అంత మంచి ఉద్యోగం వదిలేసి వచ్చి కూడా ఇక్కడ పిల్లల కోసం ఉంటూ ....క్యాబ్ నడుపుకోవడం చాలా హుందాగా చేస్తున్నాడు ....
నన్ను కూడా అతను వివరాలడిగాడు ....సాధ్యమైనంత వరకు చెప్పా ....
నువ్వు సాఫ్ట్ వేర్ లోనే ఎందుకు జాబ్ చేస్తున్నావు ...నీకు ఈ జాబ్ హ్యాపీగా ఉందా అని అడిగాడు ....
ఇది అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నా ....ఇదే కాదు నేను చేయగలిగిన పని , నాకు అన్నం పెట్టే పని ..ఏది దొరికినా హ్యాపీ గానే చేస్తాను ....ఇదే పని చేయాలి / చేస్తాను అని నిబంధనలు ఏమీ లేవని వివరించా ....
------------------------
కాసేపాగాక ...నా పిల్లలకు పెళ్లి చేయడం కష్టంగా ఉంది ...
మా దేశం వాళ్లకు ....మా సంస్కృతి తెలిసిన వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది ....కానీ వాళ్ళు ఈ దేశంలో ఎక్కువమంది దొరకరు ....దొరికినా వాళ్లకు మేము ....మాకు వాళ్ళు నచ్చడం కష్టంగా ఉంది అని అసలు విషయం చెప్పుకొచ్చాడు ....
అవును ....ఈ సాంస్కృతిక విభేదాలు అన్ని దేశాల వాళ్ళు ఎదుర్కొనేవే ....మా దేశం వాళ్లకు కూడా ఈ కష్టాలు ఉన్నాయని అంగీకరించా ....
"ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న విషయం ....నువ్వు ధైర్యంగా చర్చిస్తున్నావు ...."చెప్పా అతనితో .....
నేను చాలామంది ఇండియా అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటాను ....అమెరికా అమ్మాయిల్ని చేసుకోవడం ఎవరూ ఇష్టం లేదన్నారు .ఎందుకో తెలియదు ....చెప్పాడు సందేహంగా ...
"ఎందుకంటే ....అమెరికా అమ్మాయిలు వంట చేయరు ....మేమైతే రోజూ వంట చేసి పెడతాం ....మాది లైఫ్ టైం అగ్రిమెంట్ ..." చెప్పా ...నవ్వుతూ ...
"ఇంకా మాట్లాడితే ....వీళ్ళే వాళ్లకు వండి పెట్టాలి ....అమెరికా అమ్మాయిల్ని చేసుకుంటే ...."మళ్ళీ నేనే క్లారిటీ ఇచ్చా ...
"కానీ ఇండియా అమ్మాయిలు అమెరికా అబ్బాయిల్ని చేసుకోవడానికి ఇష్టపడతారు ...." చెప్పాడు అతను ...
"అమెరికా అబ్బాయిలు కూడా ఇండియా అమ్మాయిల్ని చేసుకోవడానికి ఇష్టపడతారు ...."మళ్ళీ అతనే చెప్పాడు ....
"అదృష్టాన్ని ఎవరు కాదనుకుంటారు ...." చెప్పా అతనికి , అంతా విని ..
"అమెరికా అబ్బాయిలు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు ....అమెరికా అమ్మాయిలు అసలు సర్దుకుపోరు ....వివాహ బంధంలో " చెప్పాడతను ....(నిజంగా చెప్పాడండోయ్...నా అభిప్రాయం కాదు )
"ఇక్కడి అమ్మాయిలకు ఛాయిస్ ఉంది ....మాకు లేదు ..." నవ్వా ....నాకు ఎదో గుర్తొచ్చి ....
--------------------------
ఇదిగో ఇలా సాగింది మా సంభాషణ ....
కొసమెరుపేమిటంటే ....ఫ్రెంచ్ వాళ్ళు చాలా రొమాంటిక్ అబ్బాయిలట ....(ఇది కూడా అతనే చెప్పాడు )
ఒక ఇరానియన్ ఒక ఫ్రెంచ్ అతను రొమాంటిక్ అని అంగీకరించడం కూడా గొప్పే కదా ....పాపం ఇతనికి అసలు లౌక్యం తెలియనట్టుంది ....అనుకున్నా మనసులో ....😭
అయితే నాకు తెలిసినా ....నేను ధ్రువపరుచుకున్న విషయం ఏమిటంటే ....
ఈ భిన్న సంస్కృతుల కలయిక ....జీవన విధానాల వలన ...ప్రేమలు - పెళ్లిళ్లు కూడా రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే సమస్యలు అని ....
మనం ఇంకా ....కులాల దగ్గర , మతాల దగ్గర , ప్రాంతాల దగ్గర ....భాషల దగ్గరే సతమతమవుతున్నాం ....పిల్లల ఎదుగుదలను, జీవితాన్ని, జీవన విధానాన్ని ....సంస్కృతుల్ని ...వాళ్ళ ప్రేమను అర్ధం చేసుకునే దాకా ఎప్పుడొస్తాం ...??!!
అది కూడా వాళ్ళ భవిష్యత్తులో ఒక భాగం అని ఎప్పుడు గుర్తిస్తాం ....??!!🤔
-----------------------------
జవాబు అందని ప్రశ్నలు కాసేపు పక్కనపెట్టి నేను నా దైనందిన కార్యక్రమాల్లో లీనమైపోయా ....ఈ రోజుకి ...!🙏

No comments:

Post a Comment