Monday, June 7, 2021

నాన్న ఉద్యోగ రీత్యా నెలకు కోన్ని రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు ...

 నాన్న ఉద్యోగ రీత్యా నెలకు కోన్ని రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు ...లేదా సెలవుల్లో పూర్తిగా ఇంటిదగ్గర ఉండేవారు ...

ఇంటిదగ్గర ఉన్నారంటే అది వేసవికాలం కాబట్టి కూరగాయలు , ఆకు కూరలు చాలా పరిమితంగా దొరికేవి ...
మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది ...
ఉన్నవాటిల్లోనే రోజూ రకరకాలు వండి పెట్టాలని ప్రయత్నం చేసేది ...
ఎన్ని కూరలయినా ఉండనీ.. పళ్లెంలో అన్నం పెట్టగానే మా నాన్న చూసేది తోటకూర పప్పు కోసం ...
పళ్లెంలో చికెన్ పెట్టనీ గాక ..."ఏంటే ...తోటకూర పప్పు వండలేదా ..."అని అడిగేవారు ...
భోజనానికి రమ్మనగానే ..."అమ్మ తోటకూర పప్పు చేసిందా " అని అడిగేవారు ..
"రోజూ తోటకూరే...తోటకూర... తోటకూర ...రేపు వండుతాలే గానీ ...ఇప్పటికిది తిను " అని విసుక్కునేది మా అమ్మ ...
కొన్నిసార్లు ..."నాన్నా ...అలమారలో రాత్రి పప్పు కొద్దిగా ఉంది నాన్నా ..." చెప్పేదాన్ని ....మా నాన్న ఇష్టం చూసి ...
అమ్మ నాన్నకు ...మిగిలినవి ...నిన్నటివి అసలు పెట్టేది కాదు ....
ఎప్పుడూ వేడి వేడి అన్నం కూరలు పెట్టాల్సిందే ...
"తీసుకుని రామ్మా ....నిన్నటిదయితే ఏం ....తోటకూర బంగారం ..." అనేవారు నాన్న ...
ఎందుకో తెలీదు ...తోటకూర పప్పు అంటే నాన్నకు అంత ఇష్టం ... మళ్ళీ పులుసు కూర చేసినా తినరు ...
తోటకూరపప్పు , కన్న తల్లి , గుంటూరు, పకోడి , చెక్కెరకేళి , ఉల్లిపాయ దోస ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది ...
ఇప్పటికీ నాన్నకి ఇష్టమైనవి ...తిన్నప్పుడల్లా "ఇది నాన్నకి ఇష్టం కదా " అని అనుకోకుండా ఉండలేను ...
ఒక్క నాన్నే కాదు ...ఎవరికి ఏది ఇష్టమో ...గుర్తు పెట్టుకుని ...చేసి పెట్టడమో ....తెచ్చి పెట్టడమో చేయడమే కదా ఇష్టం అంటే ...
తోటకూర మాకెప్పుడూ దొరకదు ...అది కూడా తెల్ల తోటకూర ...
ఇప్పుడు గార్డెన్ లో కాసిన్ని మొక్కలు వచ్చాయి ...చాలా రోజుల తర్వాత ....కాదు కాదు చాలా ఏళ్ళ తర్వాత ....నాన్నని గుర్తు చేసుకుంటూ తోటకూర పప్పు తింటున్నా ...!




No comments:

Post a Comment