Monday, March 26, 2018

ఏమో ....ఇదొక జీవన్మరణ చదరంగం ...

మా ఊరి వెలుపల రెండు చెరువులు ఉండేవి ....(నాకు తెలిసినంత వరకు )
ఒక చెరువు ....మా చేను పక్కనే ఉంటుంది (ఇప్పటికీ )....అందులో చాకలివాళ్ళు బట్టలు ఉతుక్కునేవాళ్ళు ...
సాయంకాలం అయితే పొలం నుండి వచ్చే గేదెలన్నీ అందులో కాసేపు సేద తీరేవి ....
ముఖ్యంగా వేసవి కాలంలో కొంతమంది పిల్లలు కూడా అందులో ఈత కొట్టేవాళ్ళు ...నేను కూడా నా చిన్నతనంలో పిల్లలతో కలిసి ఓసారి ఈత కొడదాం అని వెళ్లి ....నీళ్లంటే భయం వేసి ....ఒడ్డునే నిలబడిపోయా ....అది ఎవరికీ చెప్పుకోలేని విషయం అనుకోండి ....
ఇక రెండో చెరువు ఊరికి దూరంగా ఎక్కడో ఉందని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వినడం తప్ప ....ఎప్పుడూ ఆ చెరువు నేను చూడలేదు ....కానీ ఎందుకో ఒకసారి చూడాలని ఉండేది .....
ఒకసారి అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది ....
సరదాగా పిల్లలందరం కలిసి....వారాంతపు బడి సెలవుల్లో ... గేదెల్ని తోలుకుని పొలానికి ....అదీ ...మేమెప్పుడూ చూడని ఆ చెరువు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం .....
ఊరికి దూరంగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దని పెద్దవాళ్ళు చేసిన హెచ్చరికల్ని ఆ క్షణంలో మాకు కలిగిన అత్యుత్సాహం అణగ తొక్కేసింది ....!
=======================
వెళ్ళాక ..., నిజం చెప్పొద్దూ ...
ఆ చెరువు చాలా అందంగా ఉంది ...ఒడ్డునే రెండు చింత చెట్లు ....నీరంతా నల్లగా కనిపించింది ....
కానీ ఏ విధమైన అలజడి లేదు ....అక్కడ మా గేదెలు , మేం తప్ప ..వేరే జన సంచారం లేదు మేం వెళ్లే సమయానికి ....
దారి పొడవునా కడుపు నిండా గడ్డి తిన్న గేదెలు .....దాహంతో ఉన్నాయేమో ....నీళ్లు కనిపించగానే ఒక్కసారిగా నీళ్ళల్లోకి దిగాయి ....
అంతలో పిల్లలు ఎవరో ..అరె.. నీళ్ళల్లో ఊబిలు ఉంటాయేమో అన్నారు ....
వెంటనే నాకు భయం పట్టుకుంది ....అయ్యో....మా గేదెలు ఊబిలో చిక్కుకుపోతాయేమో అని ....
కొంతమంది పిల్లలు ....అలాంటివేం ఉండవులేరా అని భరోసా ఇచ్చారు ....
అయితే అక్కడ ఉన్న చింతచెట్లుకి ఉన్న చింతకాయలు చేతికి అందేంత ఎత్తులో ఉండడం వలన ....అవి కోసుకుని తింటూ ఆనందంగా మేం ప్రపంచాన్నే మర్చిపోయాం ....చాలా కాయలు మాతో తెచ్చిన కండువాల్లో మూటకట్టుకున్నాం ....
పిల్లలు కొందరు కాసేపు నీళ్ళల్లోకి దిగి ఆడుకున్నారు....నేను మాత్రం నీళ్ళల్లో కాలు పెట్టడానికి కూడా సాహసం చేయలేదు ....
చాలా సేపు ఆడుకున్నాక ...ఇక గేదెల్ని తోలుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాం ....
నీళ్లలోంచి వచ్చిన మా గేదెలు ....ఒంటికున్న బురదంతా వాటి తోకల్తో అవే శుభ్రం చేసుకుని ....నల్లగా నిగ నిగ లాడిపోతున్నాయి ....
------------------------------------------
ఇంటికి వచ్చాక ....,,,
తాడుతో గేదెల్ని కట్టేసి ... వాటికి కాస్త మేతేసి...పిల్లలందరం అన్నం పెట్టుకుని తింటూ కూర్చున్నాం ...
అంతలో ఒకరు ...వాళ్ళ గేదెకు జలగ పట్టుకుందని మా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ....
జీవితంలో నేనెప్పుడూ జలగ ను చూడలేదు ....అసలు జలగ అంటే ఏమిటో ఏం చేస్తుందో కూడా తెలియదు ....
ఆ తర్వాత వాళ్ళూ వీళ్లూ చెప్పగా తెలుసుకున్నా ....అది ఒకసారి ఏ జంతువునైనా పట్టుకుంది అంటే ....దాని రక్తం ఆఖరిబొట్టు వరకు పీల్చితేగాని ఆ శరీరాన్ని వదలదని ...ఆ ఆఖరిబొట్టు పీల్చడానికి ముందే ఆ జీవి మరణిస్తుంది అని ....
పిల్లలతో కలిసి వెళ్లి ఆ జలగను చూసా ....
గేదె ఒంటి రంగుతో కలిసిపోయి ....అది దాని శరీరం మీద ఉందని గుర్తుపట్టడానికి వీల్లేకుండా గోడమీద బల్లిలా అంటుకుపోయి ఉంది ....
నాకు దానిని చూడగానే శరీరం గగుర్పొడించింది ....నేను భయంతో దూరంగా నిలబడి చూస్తూ ఉన్నా ....
పిల్లలు దాన్ని పుల్లపెట్టి తీయడానికి ప్రయత్నించారు ....ఎంతకీ రావట్లేదు ....
ఇంత చిన్న జంతువుకు ఎంత బలం ఉంది అని ఆశ్చర్యం వేసింది ....
అంతలో ఎవరో దారిన పోతూ ....జలగ అలా ఊడి రాదు ....దానికి సున్నం పెట్టాలి అన్నారు ....
మా ఇంట్లో ....ఒక కుండ నిండా ఎప్పుడూ సున్నం ఉండేది ...ఇంటికి కొట్టగా మిగిలిన సున్నం కుండలో ఉంచి ....ఎప్పుడూ ఎండిపోకుండా ....నీళ్లు పోస్తూ ఉండేవాళ్ళం ....
ఊర్లో ఎవరికి సున్నం కావాలన్నా అందరూ వచ్చి అడిగేవారు ...
వెంటనే మా కుండలో సున్నం తెచ్చి ....జలగ మీద పెట్టారు పిల్లలు ....
అది వెంటనే ఊడి కిందపడింది .....కానీ, అప్పటికే అది రక్తం పీలుస్తూ ఉండడం వలన ....అక్కడ గాయం అయింది ....
అందరూ వాళ్ళ వాళ్ళ గేదెలను పరిశీలించి ....అన్ని జలగలకు సున్నం పెట్టి .... వదలగొట్టి ....వాటిని దూరంగా పడేసారు ....
మా గేదెను కూడా అందరం కలిసి శల్య పరీక్ష చేస్తే ....వెనక కాలిమీద ఒకటి ....మెడమీద ఒకటి కనిపించడంతో....వాటికి సున్నం పెట్టి వదలగొట్టాం ...
అప్పటికి మాకు కాస్త ఉపశమనం కలిగి ....హమ్మయ్య అనుకున్నాం ....
====================
చీకటి పడ్డాక .... పెద్దవాళ్ళు పొలం నుండి వచ్చారు ....
పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నానే గానీ ....ఒక్క ముక్క చదవడం లేదు ....
ఎక్కడో ఏదో భయం ....ఇంట్లో వాళ్లకు ... ఆ చెరువుకు వెళ్ళాం అని .... అక్కడ జలగలు పట్టుకున్నాయని ...తెలిస్తే ఏం చేస్తారో అని ....బిక్కుబిక్కుమంటూ కూర్చున్నా ....
అప్పటికే చీకటి పడి పోవడం....ఆలస్యం కావడం వలన మా నాయనమ్మ పాలు తీసే తపేలా తీసుకుని ....అందులో కాసిన్ని నీళ్లు తీసుకుని ...పాలు తీయడానికి కొష్టం దగ్గరకు వెళ్ళింది ...
కాసేపాగాక ఇంటికొచ్చి ....ఎంత సేపు పాలు తీయాలని ప్రయత్నించినా.. పాలు ఇవ్వడం లేదని ....కాస్త తవుడు చాటలో తీసుకుని ....మళ్ళీ వెళ్ళింది ....
అయినా పాలు ఇవ్వకపోవడంతో ....ఇంటికొచ్చి ....
"పొలంలో మేత మేసినయ్యా బర్రెలు ...ఎక్కడకి తోలుకుపోయారే ....." అడిగింది మమ్మల్ని ....
నేనేం మాట్లాడలేదు ....
"వంకాయలపాడు డొంకకు పొయ్యారా....అక్కడ ఉప్పు గడ్డి తిన్నాయా" ...అడిగింది ....
"పిల్లలు అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాను" అని చెప్పా ...చెరువు విషయం దాచేసి ....
తర్వాత ఎంత అదిరించినా ...బెదిరించినా ...చివరకు కొట్టినా ...దాని దగ్గర పాలు పిండలేకపోయింది మా నాయనమ్మ ....
======================
ఇంకా చీకటి పడ్డాక ఎలాగైతేనేం మా నాయనమ్మకు మేం చేసిన నిర్వాకం (చెరువు , జలగలు , సున్నం ) అంతా తెలిసింది ...
మమ్మల్ని తిడుతూనే ....ఒక లాంతరు తీసుకుని కొష్టం కాడికి మళ్ళీ వెళ్ళింది ...జలగలు ఉన్నాయేమో అని వెతకడానికి ....
అదిగో ....అప్పుడు బయటపడింది ....
సరిగ్గా పొదుగుకు వెనుకవైపున ఎవరికీ కనపడని ప్రదేశంలో ఉన్న జలగ ....ఇంకా రక్తం పీలుస్తూ ....ప్రాణం తీయడానికి సిద్ధమవుతున్నట్టు ....
మా నాయనమ్మ దాన్ని తీసి పడేసిన తర్వాత ....
పాపం దాని పొదుగునే పట్టి రక్తం పీలుస్తుంటే పాలేం ఇస్తుంది ...అని గేదె మీద చాలా జాలిపడింది .....
ఆ తర్వాత మాకు ....ప్రపంచంలో ఇన్ని తిట్లు ఉన్నాయని ...అవి మేం పడాల్సి వస్తుందని మొదటిసారి తెలిసింది ....
నాకు అందుకు బాధగా అనిపించలేదు ....నేను తప్పు చేశాను కాబట్టి ....
తెల్లవారాక ....ఆ గేదె కళ్ళలోకి చూసినప్పుడు ...."నీవల్లే నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది ...ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవించాను" అని నిలదీసినట్టు అనిపించి .... క్షమించమని ...ఇంకెప్పుడూ ఇలా చేయనని ...కళ్ళతోనే దాన్ని వేడుకున్నాను .....
అది నన్ను క్షమించిందో లేదో నాకు తెలియదు .....ఒకవేళ క్షమించినా ...అది పొందే అర్హత నాకు ఉందో లేదో నాకు అంతకంటే తెలియదు ...!
=========================
ఈ అనంత కాల గమనంలో ....
అందమైన చెరువులో ....జలగలు ....ఉన్నట్టే ...అందమైన జీవితం వెనక కూడా కొన్ని ...జలగలు ఉంటాయి అని.... జీవితం అనే చెరువులో పడ్డాక అర్ధం అయింది ....
అయితే కనిపించేలా పట్టినవాటిని ....సున్నం పెట్టి ఎలాగో వదిలించుకుంటాం .....
ఎవరికీ కనపడకుండా ....పొదుగుని పట్టి రక్తం పీలుస్తూ ఉంటాయే....వాటిని గుర్తించడం చాలా కష్టం ...
ఒకవేళ గుర్తించినా .....,, అప్పటికే సమయం మించిపోవచ్చు ...ప్రాణం పోవచ్చు ...అసలెవరికీ తెలియకపోవచ్చు ....తెలిసినా ఎవరికీ చెప్పుకోలేకపోవచ్చు ....
ఏమో ....ఇదొక జీవన్మరణ చదరంగం ...!😥

No comments:

Post a Comment