Sunday, November 4, 2018

ఇంకా ఇంతకంటే ఏం కావాలి ....??!!

జీవితంలో జీవితం మనకు సహకరించనప్పుడు కూడా జీవించడానికి మనకంటూ కొన్ని జీవన దృశ్యాలు కావాలి ....జీవన అనుభూతులు కావాలి ....జీవన జ్ఞాపకాలు కావాలి ....మొత్తానికి మరో పదిలపరుచుకోగలిగే జీవితం కావాలి ...
అవి జీవితం మనకు సహకరించినప్పుడే మనం ఏర్పరచుకోగలం ....
అంటే ....మనం రోజూ ఉరుకులు పరుగులతో జీవించే జీవితం వేరు ....పదిలపరచుకునే జీవితం వేరు ....

ఉరుకుల పరుగుల జీవితం అంటే ....ఈ క్షణమే అది శాశ్వతం ....మరుక్షణం ఏం చేసామో గుర్తుండదు ....గుర్తుంచుకోవలసిన అవసరం ఉండదు ....అందులో జ్ఞాపకంగా మారే అనుభూతి ఏమీ ఉండదు ....అలా అని అది జీవితం కాదా అంటే ....అదీ జీవించడమే ....కానీ అది అవసరం ...నీ మనుగడకు అవసరం అంతే....
పదిలపరచుకునే జీవితం అంటే....ఈ ఉరుకుల పరుగుల జీవితంలోనే ఏర్పడే శాశ్వత క్షణాలు ....మంచు లాగా ఘనీభవించిన క్షణాలు ....లావా లాగా ఉబికి ఎగిసిన క్షణాలు .... మెరుపై ఓ క్షణం నిలిచిపోయిన క్షణాలు ...అనుభూతిగా మారి మనసుని స్పృశించిన క్షణాలు ...జ్ఞాపకంగా మారి మరు క్షణానికి తరలించబడే క్షణాలు ....మరో జీవితంగా మారి మరు జీవితాన్ని పరిపూర్ణం చేసే క్షణాలు ...ఇదే పదిలపరచుకునే జీవితం ....అదే జీవితంలో జీవితం ....ఇది అస్తిత్వానికి అవసరం అంతే...
మరి మనకు అలాంటి అస్తిత్వానికి అవసరమైన జీవితం ఉందా అంటే ....ఏమో ...ఆలోచించాలి ....
ఈ మధ్యే నేను ఒక కార్యక్రమం గురించి విన్నాను ...
ఒక వారం రోజులు మనం ప్రపంచానికి దూరంగా ఉండాలి ....మనం కాదు... నేను , లేదా నువ్వు ....ప్రపంచానికి దూరంగా ఉండాలి ....
ఏ సమాచార వ్యవస్థ నీకు దొరకదు ....ఎవరూ నీకు తోడుండరు ....ఎవరూ నీతో మాట్లాడరు...ఎవరూ నీకు కనిపించరు ....ఎవరూ నీతో రారు ....బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధం నీకుండదు ....ధ్యానంలో గడపాలి ....నీతో నువ్వే మాట్లాడుకోవాలి ....నిన్ను నువ్వే పలకరించుకోవాలి ....నిన్ను నువ్వు అర్ధం చేసుకోవాలి ....అలా ఓ వారం రోజులుండాలి ...
ఒకవేళ నేను ఆ కార్యక్రమానికి వెళ్తే .....అలా నేనుండగలనా అని ఆలోచించా ......
ఎవరి గురించి ఆలోచిస్తాను ....ఏం ఆలోచిస్తాను ....అసలు వారం రోజులు ఆలోచించడానికి ఏం ఉంది ...అనే ఆలోచన వచ్చింది ....
నా రోజువారీ పనులన్నీ ఎవరు చేస్తారు ....ఆగిపోతాయా ....ఏమీ ఆగిపోవు ....ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలరు ....ఒకటి రెండు రోజులు ....వాళ్లకు అలవాటు అవుతుంది ....
మరి నా వాళ్ళు ? ఎవరు నా వాళ్ళు ....ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ....ఉన్నారనేది నా ఆలోచన మాత్రమే ....ఈ ఆలోచనలేవీ అసలు ఉండకుండా నా గురించి మాత్రమే ఆలోచించుకునే నా జ్ఞాపకాలు నాకు గుర్తొస్తాయా ....
ఏమో ....ఒకవేళ గుర్తొస్తే .....నాకంటూ జ్ఞాపకాలు ఉన్నాయా ....
నేను జీవించినప్పుడు ఏర్పరచుకున్న మరో జీవితం ఉందా ....
అందులో ఏం జ్ఞాపకాలు ఉన్నాయి .....
ఆలోచించి చూసుకుంటే , ....ఉన్నాయి ....చాలా జ్ఞాపకాలు ఉన్నాయి .....నేను పదిలపరచుకున్న మరో జీవితం ఉంది ....అని అర్ధమైంది ...
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ....చాలా చాలా క్షణాల్ని నాకు తెలియకుండానే నేను పదిలపరుచుకున్నాను...
ఎన్నో మంచుముద్దలు ఉన్నాయి ....ఆ మంచుముద్దల్లో కరిగిపోని కరడుగట్టిన కఠిన వాస్తవాలు ఉన్నాయి ....
ఎన్నో లావాలు ఉన్నాయి ....ఆ లావాలో కరిగి ప్రవహించని కన్నీటి కథలు ఉన్నాయి ...
ఎన్నో మెరుపులూ ఉన్నాయి ....ఆ మెరుపుల్లో మాయమైపోని మమతల మధురిమలు ఉన్నాయి ....
వీటన్నిటినీ తన జ్ఞాపకంగా పదిలపరుచుకున్న పదిలమైన జీవితం ఉంది ...ఆ జీవితానికి ఓ అస్తిత్వం ఉంది ...😍
ఇంకా ఇంతకంటే ఏం కావాలి ....??!!

No comments:

Post a Comment