Wednesday, October 31, 2018

నాకు నా అక్షరాలే ....అయినవాళ్లు ....కానివాళ్ళు ....ఆత్మ బంధువులు .....!

మనిషిని ....జంతువులను, ఇతర జీవులను హింసించడం లేదా చంపడం మానవ మనుగడలో భాగం అయి ఉండొచ్చని అనాదిగా వస్తున్న మన నమ్మకం ....
కానీ మనిషిని మనిషే హింసించడం కూడా మానవ మనుగడలో భాగమే అనిపిస్తుంది ....
కొందరికి కనిపించిన ప్రతి ఒక్కరినీ హింసించాలని ఉంటుంది ....
మరి కొందరు ....వాళ్ళ మనసు , శరీరం అసౌకర్యానికి విపరీతమైన బాధకు గురైనప్పుడు ఆ బాధ ఎదుటివారికి కూడా తెలియజేయాలని ....ఎలాగైనా వాళ్ళు కూడా అలాంటి బాధకు గురైతే తమకు కాస్త ఉపశమనం కలుగుతుందని అనుకుంటారు ....
ఇంకొందరు ....తమ కింద ఉద్యోగస్తులను తమ హింస తత్వాన్ని ప్రదర్శించడానికి ఎన్నుకుంటారు ....ఇది ఎదుటివాళ్లను అసహాయులను చేసి ప్రదర్శించే హింస ...
ఇందులో కొందరు పైకి మంచివాళ్ళం అనిపించుకుని కింది ఉద్యోగస్తులను హింసించాలి అనుకుంటే ....వాళ్ళ ఆర్ధిక , సామజిక , కుటుంబ స్థితిగతులు ఏమిటో తెలుసుకుని ....వాళ్ళ హింసను భరించడం తప్ప వీళ్లకు వేరే మార్గం లేదని తెలుసుకున్న వ్యక్తులను హింసకు ఎన్నుకుంటారు ....
ఈ మధ్య ఇండియా వచ్చినప్పుడు చూసా ....బట్టల షాపులో కౌంటర్ దగ్గర కస్టమర్ కి కస్టమర్ కి బిల్లు కట్టించుకోవడంలో ఉన్న గాప్ లో ....అక్కడే పక్కన కూర్చుని బట్టలు మడతబెట్టుకుంటున్న అమ్మాయి నడుము గిల్లి ఏమీ తెలియనట్టు ....మళ్ళీ బిల్లు కట్టించుకోవడానికి వచ్చాడు ఒకడు .....అదొక రకమైన హింస ...
కొందరు ...మూడో కంటి వాళ్లకు తెలియకుండా హింసించాలి అనుకుంటారు ....అంటే వీళ్ళు ఇంక ఎవరికీ చెప్పలేరు అని నిర్ధారించుకుని అలాంటి వ్యక్తులను మాత్రమే హింసకు ఎంచుకుంటారు ....వీళ్లకు సమాజం అంటే చచ్చే భయం ఉంటుంది .....సమాజంలో చెడ్డపేరు రాకూడదు ....పెద్దమనిషితనం వీళ్లకు చెక్కు చెదరకూడదు .....
మరికొందరు ....తమ కష్టాలు ఎదుటివాళ్ళకు చెప్పి ....వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు సంతోషిస్తారు ....అంటే మనకోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కదా అని సంతోషం ....ఎక్కువగా బాధ పెట్టడం కోసం కష్టాలను గోరంత ను కొండంత చేసి చెబుతారు ....
కొన్నిసార్లు కష్టం మాత్రమే చెప్పి దానికి దొరికిన పరిష్కారం చెప్పరు...వాళ్ళు ఎక్కువ కాలం అదే విషయం గూర్చి చింతిస్తూ ఉండాలని ....తర్వాత ఎప్పుడో వాళ్ళు అడిగితే ...ఈ మధ్యే పరిష్కారం అయింది ....అని విచారంగా చెబుతారు ....(అయ్యో వీళ్ళ బాధ పోతుందే ఎలా అని )
ఇలా మనిషిని మనిషి బాధపెట్టడానికి అవకాశం ఇవ్వాలే కానీ ... చిత్ర విచిత్రమైన తత్వాలతో మనిషి ప్రపంచంలో ఉన్న క్రూర జంతువులన్నిటిని మించిపోగలడు .....మనుషులు ఎన్ని రకాలు ఎన్నాయో హింసలు అన్ని రకాలు ఉంటాయని ... నాకు కొందరు నేర్పిన జీవిత పాఠం ....
ఏది ఏమైనా ....
ఇతరులతో మనం బాధింపబడినప్పుడు ఆత్మీయుల దగ్గర సాంత్వన పొందడం ...ఆత్మీయులతో బాధింపబడినప్పుడు ఇతరుల దగ్గర సాంత్వన పొందడం .... మనం అప్పుడప్పుడూ చేస్తూ ఉంటాం ....
కానీ ఆ ఆత్మీయులు ఎవరు ....ఆ ఇతరులు ఎవరు అనేదే మనం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి .....
నేనూ ఈ దుష్ట మానవ ప్రవృత్తికి అతీతమైన వ్యక్తిని కాను ....
నాకు తెలియక నేను ఎవరిని హింసిస్తానో నాకు తెలియదు ....నాకు తెలిసీ నేను ఎవరినీ హింసించాలని అనుకోను ....
ఒకవేళ నన్ను ఎవరైనా హింసిస్తే ఎందుకు వాళ్ళు హింసిస్తున్నారో ఆలోచిస్తా ....
అది వారి మనుగడలో భాగం అయితే దూరంగా జరుగుతా ....
కావాలని హింసిస్తే ....అయినా దూరంగా జరుగుతా....
ఒకవేళ వాళ్ళ బలహీనతలను అధిగమించడానికి అయితే ....కొంతవరకు హింసను భరిస్తా .....
నా బాధ్యతలు నిర్వర్తించడానికి అయితే .... ఆనందంగా హింసను భరిస్తా ....
నా లక్ష్యాలను సాధించడానికి అయితే ....ఆనందంగా హింసను ఆస్వాదిస్తా ....
కానీ, సాంత్వన కోసం అయితే ...అక్షరాలను ఆశ్రయిస్తా ....
నాకు నా అక్షరాలే ....అయినవాళ్లు ....కానివాళ్ళు ....ఆత్మ బంధువులు .....!😍

No comments:

Post a Comment