Tuesday, January 14, 2020

నా చిన్నతనంలో ...మా ఊరులో .....మా ఇంట్లో

నా చిన్నతనంలో ...మా ఊరులో .....మా ఇంట్లో (ఉపోద్ఘాతం ఏమిటో చెప్పలేదని అలా కోపంగా చూడకుండా కాస్త ఓపిగ్గా చదవండి)...’పంచ’(గుంటూరు భాషలో "ఇంటిలో ఏ వరండాయైనను " అని అర్ధం) లో రెండు గూడులు ఉండేవి .... నేను బడికి వెళ్లి రాగానే ఆ గూడులు వెతకాలి ....అది నా బాధ్యత .....నిజానికి అది మా నాయనమ్మ నాకు అప్పజెప్పిన బాధ్యత(కొన్ని రోజులు మాత్రమే) ...పుస్తకాల బాగ్ అక్కడ విసిరేసి గూడులు వెతికేదాన్ని .....అందులో జాగ్రత్త కోసం పెట్టిన కొన్ని పాత బట్టల మధ్యలో మా నాయనమ్మ పెంచుతున్న కోడి పెట్టిన గుడ్డు దొరికేది ......అది తీసి ఇంట్లో ఉప్పు పోసిన మట్టి కుండ లో జాగ్రతగా పెట్టి మూత పెట్టేదాన్ని .....గుడ్డు పిల్లి ఎత్తుకు పోతుందేమో అని అనుమానం వస్తే నేను వచ్చేవరకు కోడి అక్కడే ఉండేది .....మా నాయనమ్మ ఇంటికొచ్చాక నన్ను అడిగే మొదటి ప్రశ్న....."కోడి గుడ్డు పెట్టిందా???" అని ....
ఇలా దాదాపుగా 15 గుడ్లు పెట్టాక…. సగం పగిలిన మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో సగం వరకు ఇసుక పోసి అందులో గుడ్లు అన్ని వరసగా పేర్చి ....దాని మీద కోడిని పెట్టి .....ఆ కుండ ఒక మూల (corner)పెట్టి ....దాని మీద ఒక బుట్ట కప్పేసేవాళ్ళం .....ఇదంతా మా నాయనమ్మ నేను ఇద్దరం చేసేవాళ్ళం .....రోజూ కోడిని కాసేపు బయటకు తీసి దానికి కాసిని గింజలు వేయడం తప్ప మిగతా సమయం అంతా ఆ కోడి గుడ్లు పొదుగుతూనే ఉండాలి ....
సరిగ్గా 21 రోజుల తర్వాత తెల్లవారి లేవగానే చిన్న చిన్న కోడిపిల్లల అరుపులు విని ఎంత ఆశ్చర్యం ,ఆనందం వేస్తుందో చెప్పలేను .....కోడి తన రెక్కల కింద పిల్లలన్ని దాచుకోగా ఒకటో రెండో పిల్లలు కాస్త వెలుపలికి తొంగి చూసేవి (మేము ఈ ప్రపంచంలోకి వచ్చేసామోచ్ ...అన్నట్లు).....
చావిడి(గుంటూరు భాషలో "కొష్టం "అంటారు )దగ్గరకు వేకువ జామునే వెళ్ళేది మా నాయనమ్మ ......ఒక్క పరుగున అక్కడకు వెళ్లి ....మా నాయనమ్మను తీసుకుని వచ్చేదాన్ని ......ముందుగా కోడిని తీసి కింద పెట్టేది ... తర్వాత ఒక్కొక్క పిల్లను జాగ్రత్తగా తీసి కింద పెట్టేది ....కొని తెల్లగా,కొన్ని తెలుపు నలుపు ,కొన్ని లేత పసుపు పచ్చ రంగు,కొన్ని నలుపు రంగులో ఎంత ముద్దుగా ఉండేవో ఆ కోడి పిల్లలు .....
పొరపాటున ఒక గుడ్డు పై పొర గట్టిగా ఉండి కోడి పగలగొట్టలేకపోతే మేమే జాగ్రతగా ఆ పొర తొలగించి .....పిల్లను తీసి నిలబెట్టడానికి ప్రయత్నించేవాళ్ళం .....విచిత్రం ఏమిటంటే అది తన పిల్ల కాదనే అనుమానంతో ఒక్కొక్కసారి కోడి కూడా దానిని మిగతా పిల్లల్లా తన పిల్లగా అంగీకరించేది కాదు .....ఒక రోజు గడిచాక మెల్లగా అది చూడకుండా ఆ పిల్లల్లో కలిపేసేవాళ్ళం...కానీ పాపం నిజం చెప్పొద్దూ ....అది చివరి వరకు బ్రతకడం కష్టమే .....
నాకైతే కొన్ని రోజుల వరకు ఆ అమాయకమైన పిల్లలను .....వాటిని కంటికి రెప్పలా కాపాడే తల్లిని గమనించడమే పనిగా ఉండేది .....
కొన్ని నూకలు వాటికి వేసి ....అవి చిన్న చిన్న ముక్కులతో ఎంత ముద్దుగా తింటున్నాయో గమనించడం ,
కాస్త పెద్దగా ఉన్న గింజలు ఎక్కడ పిల్లల గొంతుకు అడ్డం పడతాయో అని భయంతో తల్లి తన ముక్కుతో ముక్కలు చేసి పిల్లల ముందు ఉంచడం ,
పిల్లి గాని ...కుక్క గాని వస్తే ,తను ఒక్కదాన్ని పిల్లలను కాపాడలేకపోతే... మేమెక్కడ ఉన్నా వచ్చి సాయం చేస్తామనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తన కంగారు పెట్టించే అరుపులతో మమ్మల్ని అప్రమత్తం చేయడం……..
మేము ఎదుగుతున్నాం ఇంకా నీ చుట్టూ ఉండటం మా వల్ల కాదు అంటూ తల్లిని వదిలి కాస్త పక్కకు పోయి ...కాకి కావ్ కావ్ మంటూ రాగానే ...."అమ్మా అమ్మా" అని కంగారుతో కేకలు పెట్టిన అమాయకపు పిల్లను కాపాడుకోవడానికి,కాకిన తరిమి కొట్టి ...."చూసావా ఎంత ప్రమాదం తప్పిందో ....అమ్మ చెబితే వినాలి" అంటూ అక్కున చేర్చుకునే తల్లిని చూసి పిల్లలు నిశ్చింతగా తల్లి రెక్కల కింద దూరి పోవడం,
ఒక పిల్లను చూసుకునే శ్రద్ధతో మిగిలిన పిల్లలను కాస్త అశ్రద్ధ చేస్తే ఏ కాకో వచ్చి ఒక పిల్లను ముక్కున కరచుకుని పోతే ....తన ప్రాణాలకు తెగించి ...పిల్లను కాపాడాలని విఫల ప్రయత్నం చేసి ...కాపాడలేక ...క్షణకాలం అచేతనమై.. తల్లి కళ్ళు చెమర్చడం చూసి ....ఏమీ చేయలేక, ప్రకృతి ధర్మాన్ని నిందించడం .....
ఇలా ఎన్నో దశలు దాటి....ఎలాగో అవి పెరిగి పెద్దయ్యాక ....
వాటి బాధ్యతను నేను వదిలేసేదాన్ని .....
మా నాయనమ్మ మాత్రం వాటిని ఎవరెవరికో అమ్ముతుంటే చూస్తూ ఉరుకోవడమే (అది తన చిన్న బిజినెస్).......అందులో కొన్ని పుంజులు ఉండేవి కాబట్టి.....సంక్రాంతి వచ్చిందంటే పందెం కోసం ఓ పది రోజులు ముందుగానే ఎవరెవరో తీసుకుని వెళ్ళడం నాకు గుర్తు ......మా ఊరి చింతచెట్టు దగ్గర(ఇప్పుడు ఆ చింత చెట్టు లేదు )కోడి పందేలు ఉండేవి ..... రెండు కోడి పుంజులకు ....ఒక్కొక్క కాలికి చిన్న కత్తి తాడుతో కట్టి(ఎందుకు కడతారో తెలియదు).....అవి రక్తం వచ్చేవరకు పోట్లాడుకుంటుంటే చుట్టూ మానవత్వం నశించిపోయిన మనుషులు కొంతమంది చేరి ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండేవాళ్ళు ......
కనుమ పండగ అంటే నాకు గుర్తొచ్చే చేదు జ్ఞాపకం ఇది ......అలాగే ఇప్పుడు కోడి పందేలను ప్రభుత్వం నిషేధించింది అని తెలుసు కానీ .....ఎంతవరకు అమలు జరుగుతుంది ??? సమాధానం వెతకాల్సిన ప్రశ్న ...... ఆ పందెం లో ఉండే క్రూరత్వాన్ని చిన్న చిన్న పిల్లలు చూడడం ఎంతవరకు సమంజసమో సభ్య సమాజం ఆలోచిస్తుందా ...అనేది అనుమానమే ...... ఆలోచించాలని కోరుకుంటూ ...!


Note: Wrote and published on January 14, 2014.

No comments:

Post a Comment