Wednesday, January 29, 2020

మా నాయనమ్మకు రెండు పేటల బంగారు గొలుసు ఒకటి ఉండేది ...

మా నాయనమ్మకు రెండు పేటల బంగారు గొలుసు ఒకటి ఉండేది ...
ఎన్ని తులాలో నాకు సరిగా గుర్తులేదు ...కానీ అది చాలా గట్టిగా , బరువుగా ఉండేది ...
అది తను "నా చెల్లి దగ్గరే కొనుక్కున్నాను(ఇల్లు కట్టుకుంటూ డబ్బుకోసం వాళ్ళు అమ్ముకున్నారట) ....గుర్తుగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను" అని చెబుతూ ఉండేది ....
అయితే ....అది ఎవరిని నమ్మి ఎవరికీ ఇచ్చేది కాదు ...
కానీ ఎందుకో .. , పండగలకి పబ్బాలకి నా మెళ్ళో వేసి మురిసిపోతూ చూసుకునేది ....
మళ్ళీ ఆ రోజంతా నా వెనకాలే తిరిగి ....సాయంత్రం కాగానే తీసి ఒక నగల పెట్టెలో దాచేది ...
ఆ నగల పెట్టె ఒక మయా గృహం లాగా ఉండేది .... అందులో ఎన్ని అరలు ఉన్నాయో నాకు అర్ధం అయ్యేది కాదు ....మేం చిన్నపిల్లలం అని ...ఎవరికైనా చెప్పేస్తామేమో అని ...దూరంగా పంపించేసేది ... పూర్తిగా చూపించేది కాదు ...అందువలన నాకిప్పటికీ ఆ లోపలి భాగం పూర్తిగా జ్ఞాపకం లేదు ...దానికి ఒక తాళం కప్ప ఉండేది ....ఆ తాళం చెవి ఓ సంచీలో పెట్టుకుని బొడ్లో దోపుకుని తిరిగేది ఎప్పుడూ ....
అయితే కొన్నిసార్లు మంచి మూడ్ లో ఉన్నప్పుడు ....నన్ను మాత్రం దగ్గరకు రానిచ్చేది ...
తన పొలం, స్థలాల దస్తావేజులు...ప్రామిసరీ నోట్లు(వడ్డీ వ్యాపారం) ...వగైరాలు కూడా అందులో ఉండేవి ....
నాకు వాటిమీద కన్నా ఆ నగల మీద అమితమైన ఆసక్తి ఉండేది ...అవి అన్ని ఓసారి చూడాలని ...
ఒక్కొక్కటి చూపించి ...ఇది మీ నాన్నకు చిన్నప్పుడు కొన్న ఉంగరం ...ఇది మీ బాబాయి కోసం కొన్నది ఇలా వివరించేది ...
"ఏదీ నన్ను పెట్టుకోనివ్వు ..." అని ఓసారి మా నాన్న ఉంగరం కూడా పెట్టుకుని చూసేదాన్ని (అని గుర్తు ) . ఇది పచ్చ రాయి (ఎమురాళ్ల పచ్చ అని చెప్పేది ...అదేంటో నాకు తెలియదు )...ఇది తెల్ల రాయి ....ఇలా వర్ణించేది ....
అన్నిటికంటే చివరలో ..తన రెండు పేటల గొలుసు సంచిలో నుండి బయటకి తీసి దానికి ఎన్ని లాక్స్ ఉన్నాయో ...లెక్కపెట్టుకుని చూసుకునేది ...
లెక్క పెట్టేటప్పుడు మేం (అంటే పిల్లలు ) అస్సలు మాట్లాడకూడదు ....లెక్క సరిపోయింది అని తేల్చుకున్నాక దాన్ని భద్రంగా ఒక గుడ్డ సంచిలో పెట్టి ....దాన్ని మళ్ళీ ఓ నగల పెట్టెలో పెట్టి ....దాన్ని మళ్ళీ పెద్ద పెట్టెలో పెట్టేది ...
ఇప్పటికీ నాకు అర్ధం కాని ఓ పజిల్ ఏంటంటే ...ఎవరైనా దొంగిలిస్తే ... గొలుసు మొత్తం ఎత్తుకు పోతారు కానీ ...కొన్ని లాక్స్ తెంపుకుని ఎందుకు ఎత్తుకుపోతారు ...కాస్త గొలుసు తీసుకుని ....మిగతాది అతికించి ఎందుకు అక్కడే ఉంచుతారు ...అని ...
ఏంటో ...దాని అనుమానం ...అదీ ...తన లెక్కలు తనవి ....
అయితే ఆ గొలుసు తో ...అందుకు చెందిన మా నయనమ్మతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ...
నాకు గొలుసు చూపించి ...."చెప్పిన మాట వింటే" ...నీకే ఇస్తా నా గొలుసు అని చెప్పేది ....
ఓహ్ నిజంగానా అనుకుని ...కొన్ని రోజులు గొలుసు కోసం చెప్పిన మాట వినేదాన్ని ...పైగా ఎవరికీ చెప్పేదాన్ని కాదు ....తనకు నాకు మధ్య డీల్ ఉందని ....పోటీ వచ్చేస్తారని భయం ..
తర్వాత దాని హింస భరించలేక ....నువ్వూ వద్దు ....నీ గొలుసూ వద్దు ఫో అని విసిరికొట్టేదాన్ని ...
కొన్నాళ్ళాగాక షరా మామూలే ....
అయితే ....తర్వాత అర్ధం అయింది ఏంటంటే ....నాకే కాదు ఆ గొలుసు చాలామందికి ఇలాగే ఇస్తానని చెప్పిందని ....
చివరికి ఎవరికీ ఇవ్వకుండానే పైకి పోయింది ....అది వేరే కథ ....
అప్పుడెప్పుడో నా చిన్న కూతురికి ....ఒడ్డాణం ఒకటి చూపిస్తే ..."how funny it is ...who wear this thick big belt ?...." అనేసింది పుసుక్కుమని ...
ఇది జీన్స్ మీదకు కాదురా ....ఓణీ వేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది ....ఒకసారి నా కోసం పెట్టుకుని కనీసం ఫొటోస్ అయినా తీసుకొనీ...అప్పుడప్పుడూ చూసుకుంటా ....అని రిక్వెస్ట్ చేశా ....
ఏంటో ...ఓ పది డాలర్లు పెట్టి కొన్న బెల్టు పాటి విలువ కూడా లేకపోయే వడ్డాణానికి ....అని నిట్టూర్చా ...
--------------------------------------------------------------------
మా అమ్మ మమ్మల్ని డబ్బులు తాకనిచ్చేది కాదు .....అంతెందుకు వాటిని అసలు చూడనిచ్చేది కాదు ...
ఆస్తుల గురించి మాతో ఎప్పుడూ చర్చించేవాళ్ళు కాదు ....పెద్దవాళ్ళు వాటి గురించి మాట్లాడుకునేప్పుడు మేం అక్కడే ఉంటే మమ్మల్ని బయటకు పంపించేవాళ్ళు ...
ఏదైనా కావాలంటే వాళ్ళే కొనిపించేవాళ్ళు దగ్గరుండి మరీ ....
డబ్బులు చేతికి ఇస్తే పిల్లలు చెడిపోతారని వాళ్లకు ఓ నమ్మకం ఉండేది ....
చిరుతిళ్ళకు ఎప్పుడు డబ్బులు అడిగినా ....లేవు అనే సమాధానమే మాకు వినిపించేది ....
రాత్రే పత్తి డబ్బులు కట్టలు కట్టలు వచ్చాయి ...ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు అని లాజిక్ లాగితే ....పెద్దగా రోడ్డు మీదకు వినపడేలా మాట్లాడినందుకు లాజిక్ లేకుండా పత్తి పుల్ల విరిగేది ...
పిల్లలకు ఇంట్లో ఉన్న ఆర్ధిక స్థితి గతులు తెలియకుండా పెంచాలి అనేది అమ్మ , నాయనమ్మ సిద్ధాంతం ...
అయినా ....నాకెందుకో అలాంటి స్థితి ఒక అభద్రతా భావం కలిగించినట్టు అనిపించేది ...
అప్పుడప్పుడు మా నాన్నను మాత్రం అడిగి ....వివరాలన్నీ తెలుసుకునేదాన్ని నేను ....మనకెంత పొలం ఉంది ....నాన్నకు జీతం ఎంత వస్తుంది ....ఎంత ఖర్చవుతుంది .....ఎంత మిగులుతుంది .....ఏవైనా అప్పులు ఉన్నాయా ....ఎవరికైనా అప్పులు ఇచ్చామా .....ఇలా ....
నాన్న నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం ....పక్కన కూర్చోబెట్టుకుని దాపరికం లేకుండా నాన్న నాకు అన్ని చెప్పేవారు ....అది నాకు భద్రతా భావాన్నిచ్చి ....భరోసా కలిగించేది ....నాన్న నాకు / మా కుటుంబానికి చెందిన వ్యక్తి అని కొండంత బలం కలిగేది .....
ప్రతి తరం విచిత్రమైన తరమే అనిపిస్తుంది ....
------------------------------------------.
కుటుంబ సభ్యుల్లో ఒక్కరే సంపాదపరులు అయినప్పుడు ....ఒక కుటుంబం ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్నప్పుడు ....ఆ కుటుంబం మొత్తం ఆ వ్యక్తి దగ్గరనుండి భరోసా కోరుకుంటుంది ....ఆ వ్యక్తి కూడా కుటుంబ సభ్యులకు భద్రతా భావాన్ని కలిగించాల్సిన బాధ్యత ఉంది .....(మనది పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి ....తప్పనిసరిగా భర్త / లేదా తండ్రి సంపాదిస్తూ ఉంటారు ....)
తను సంపాదించిన సంపాదన మీద కుటుంబ సభ్యులందరికీ సమానమైన హక్కు ఉంటుంది ....అనేది ...చట్టం లో వ్రాయబడిందో లేదో నాకు తెలియదు ....నైతిక విలువల్లో మాత్రం వ్రాయబడి ఉందని మా నాన్న నాకు ఆచరించి చూపించారు ....
----------------------------------------------------------
తరం మారింది .....
అయినా మనిషి ఆలోచనలు ....భద్రతకు భరోసాకు అతీతం కావు కదా ....
అయితే ....నా పెళ్లయ్యాక ....మా నాన్నను అడిగినట్టే ....మా వారితో కూడా నేను భద్రత గురించి అప్పుడప్పుడు అడిగేదాన్ని....
సమాధానాలు నాకు షాకింగ్ గా అనిపించేవి ....
అదేదో ఒక నవలలో యండమూరి గారు వ్రాసినట్టు గుర్తు ....తను పోయాక కూడా తన కుటుంబం ఇబ్బంది పడకూడదు అని ...పిల్లలకు ఏ ఇబ్బంది రాకూడదు అని .....ఎక్కడెక్కడ ఏం దాచి ఉంచాడో ....అన్ని భార్యకు చెప్తాడు ఒక భర్త ....
అంత ఆదర్శవంతంగా కాకపోయినా ....కనీసం ఎవరికైనా అప్పులు ఇచ్చినప్పుడు నాకు చెప్పాలని ....లేదా ఇచ్చిన అప్పులకు ప్రామిసరీ నోటు లాంటిది అడగాలని ఆశించేదాన్ని ...
అన్నిటికంటే ....నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన ....తను రిటైర్మెంట్ డబ్బులన్నీ ఏ విధమైన ప్రూఫ్ లేకుండా ఒక ఫ్రెండ్ కి అప్పివ్వడం ....
ఆ ఫ్రెండ్ చచ్చిపోతే డబ్బులు తీసుకున్నాడు అని ఎవరిని అడగాలి అని ....నేనెన్నో రోజులు కంగారు పడుతూ ఉండడం ....
అవన్నీ తలచుకుంటే ....ఇప్పుడు నా మీద నాకే జాలేస్తూ ఉంటుంది ...
బతుకు మీద చిటికెడంత భద్రత ఆశించిన రోజులవి ....
-----------------------------------------------
ఇదంతా పక్కన పెడితే ....
అమెరికా వచ్చాక ....ఇక్కడి పరిస్థితులు వేరు ....
ఇక్కడి న్యాయ వ్యవస్థ వేరు ....ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రూల్ ఉంటుంది ....
ముందు అవి తెలుసుకోవాలి ....
మన దగ్గరున్న డబ్బులు మనం ఎవరికి ఇవ్వాలో చెప్పకపోతే ....ఒకవేళ మనం పొతే ....ఆ డబ్బు మనం ఎవరికి ఇవ్వాలో చెప్పలేదు కాబట్టి ....గవర్నమెంట్ కి పోతాయి ....అందుకే అన్ని ముందుగానే కుటుంబ సభ్యులకి చెప్పాలి .....
మొన్నొక రోజు ....వ్యాయామం చేస్తుంటే ....హఠాత్తుగా గుండె పట్టేసినట్టు అనిపించి నాకు కాసేపు ఊపిరి అందలేదు ....
వెంటనే నాకు గుర్తొచ్చింది కాలేజ్ లో చదువుకుంటున్న నా కూతురు ....ఒకసారి తనకు ఫోన్ చేసి ముందు బ్యాంకు పాస్ వర్డ్స్ చెప్పాలి అని ఆలోచించా ....
కాసేపటికి తేరుకున్నా...అనుకోండి ....
అప్పట్లో డాకుమెంట్స్ రూపంలో ఆస్తులు దాచేవాళ్ళం ...(పెద్దవాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ....డాకుమెంట్స్ ఇంట్లోనో ....లాకర్ లోనో ఉండేవి ....
డెత్ సర్టిఫికెట్ ఇస్తే ....వారసులకు అవి ఇచ్చేవాళ్ళు ....)....ఇప్పుడు అలా కాదు ....అన్ని పాస్ వర్డ్స్ ....user names రూపంలో దాస్తున్నాం ....
నా పిల్లలకు భరోసా ని ....భద్రతా భావాన్ని కలిగించాలని ....
ఏ క్షణంలో నాకు ఏం జరిగినా ....వాళ్ళు కంగారు పడకూడదు అని నాకు అర్ధమైంది ....,
తర్వాత ఒకరోజు ....నా కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని ..బ్యాంకుల వివరాలు , వాటి పాస్ వర్డ్స్ , సెక్యూరిటీ క్వశ్చన్స్ ...వాటికి ఆన్సర్స్ .....జాయింట్ అకౌంట్ దేనికి ఉంది ..........ఫండ్స్ , షేర్స్ , వాటి అకౌంట్స్ ....వాటి user names, urls, ..నామినీ గా ఎవరున్నారు ....లాండ్స్ ....వాటి తాలూకు డాకుమెంట్స్ ....లాకర్ వివరాలు.....ఆస్తుల మీద వాళ్లకున్న హక్కులు ....
ముఖ్యంగా నేను అప్పు ఎవరికి ఇచ్చాను ....ఎంత ఇచ్చాను ....వాటి తాలూకు మెయిల్స్ ....నేను ఎవరికీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని ....ఇలా ....
అన్ని వివరాలు చెప్పాను ....
అఫ్కోర్స్ పాస్వర్డ్స్ మార్చినప్పుడల్లా అప్డేట్ చేస్తూ ఉంటాననుకోండి ....
నాకు ఒకింత నిశ్చింతగా అనిపించింది ....
నా బాధ్యత నేను నిర్వర్తించాను అనిపించింది ...
నాన్న గుర్తొచ్చారు ....తప్పు ఒప్పుల వివాదాలు ....బాధ్యతలు ఎవరివి అనే వివాదాలు పక్కన పెడితే ....ఇలా చేయడం నాకు చాలా భరోసా కలిగించింది ....
అన్ని విషయాలు పిల్లలకు చెప్పాలనుకోకపోయినా ....మన ఆర్ధిక స్థితి గురించి భరోసా కలిగించాల్సిన బాధ్యత మనకుందని అనిపిస్తూ ఉంటుంది .....
తరాలు మారినా ....దేశాలు మారినా ....బ్రతుకులు భిన్నమైనా....
భరోసా ....భద్రతా ...ఎప్పుడూ జీవితానికి అవసరమే ....
కోరుకున్నా ....కలిగించినా ....🙏
==============******************===============

1 comment: