Friday, April 16, 2021

ఇది నాకు నచ్చిన సినిమా ...ముగింపుతో సహా ...!

 చాలా రోజులకు The Great Indian Kitchen సినిమా చూసే అవకాశం కలిగింది ....

అసలు ...ఇండియన్ కిచెన్ గ్రేట్ అని, ఎందుకు పేరు పెట్టాడో నాకు అర్ధం కాలేదు ...
నాకు తెలిసి వ్యంగ్యంగా ఈ పేరు పెట్టి ఉండొచ్చు ...
నిజానికి మన కిచెన్ ఒక KGF లాంటిది ..అంటే GIK (Great Indian Kitchen) అన్నమాట ....
అందులోకి వెళ్లడమే కానీ బయటపడడం ఉండదు ...
KGF లో ముసలివాళ్ళయిపోయి ...పని చేయలేనప్పుడు చంపేస్తారు ...
మన GIK లో నుండి ...మరణం ఒక్కటే స్త్రీని బయట పడేస్తుంది ...
వంట చేయలేను ...గెస్ట్ లు వస్తే పని ఎక్కువైంది ...పార్టీలు ఇవ్వడం కుదరదు ...ఇవ్వాళ ఆదివారం ...వంట్లో బాగాలేదు ...
ఇలాంటివి GIK లో వినిపించకూడదు ...
ఇది కదా GIK అంటే...
-----------------------
నిజానికి ఈ సినిమా గురించి ఆత్మీయుల విశ్లేషణలు చూశాక...ఎప్పటినుండో చూడాలని ఎదురు చూస్తున్న సినిమా ఇది ...
ఇలాంటి సినిమా తీసినందుకు ...మలయాళీ సినిమా పరిశ్రమకు ముందుగా కృతఙ్ఞతలు చెప్పాలి ....
సినిమా మొదటినుండి ....చివరి సీన్ వరకు ...ఎక్కడా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయా ....
సినిమా అయిపోయాక కూడా సినిమాలోనుండి బయటకు రాలేకపోయా ...
ఎందుకో ఒక్క క్షణం అనిపించింది ....ఆ సినిమాలో ఆ హీరోయిన్ చాలా మంచి పని చేసింది ...అలా ప్రతి స్త్రీ చేయగలిగితే ఎంత బాగుండు అని ...
ప్రతి స్త్రీ కాకపోయినా నాలాంటి కొందరైనా చేయగలిగితే ఎంత బాగుండు అనుకున్నా ....
అలా అనుకోగానే ఎందుకో జీవితం మీద చాలా ఆశ కలిగింది ....
ఈ ఊహ చాలా బాగుంది అనిపించింది ....
సినిమాలో హీరోయిన్ ని ఎక్కడా ఏడిపించడు డైరెక్టర్ ....
కానీ నాకెందుకో బొట బొటా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి ..ఆగలేదు ....
భార్య భర్తలు ఇద్దరు కలిసి హోటల్ కి వెళ్ళినప్పుడు ...ట్రాష్ అంతా.. తిని టేబుల్ మీద పడేయకుండా ...ఒక ప్లేట్ లో పెట్టినప్పుడు ....టేబుల్ మానర్స్ ఇంట్లో లేదా బయట మాత్రమేనా అని అడుగుతుంది హీరోయిన్ ...
ఇంటికొచ్చాక ..అది తప్పు అని క్షమాపణ చెప్పమంటాడు భర్త ...
అప్పుడు ఆ అమ్మాయి ...కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు ఆపుకుని క్షమాపణ చెబుతుంది ...
స్త్రీ మనసులో పురుషుడి స్థానాన్ని దిగజార్చిన క్షణమది ...పురుషుడిగా ప్రతి పురుషుడు మరణించే సన్నివేశమది ...
ఏదో ఒక సీన్ ఉదాహరణగా చెప్పానే కానీ ...ఇందులో ప్రతి సీన్ కి ఒక జీవిత కథ చెప్పొచ్చు ....
ప్రతి జీవిత కథ పురుషుడు సిగ్గుతో చచ్చిపోయేది కావచ్చు ...
ఇందులోని సంభాషణలు కూడా ఒక రకంగా పురుష జాతిని నిగ్గదీసి అడిగే సంభాషణలే ...
దర్శకుడు ఎక్కడా సామజిక సంకోచం లేకుండా సంభాషణల్ని మలిచాడు ...
ఒక భార్య ...భర్తని ...సెక్స్ కి ముందు ఫోర్ ప్లే కావాలని ...అడగడం అంటే ... స్త్రీ సమాజంలో (అది కూడా భారతీయ సమాజంలో )ఒక అడుగు ముందుకు వేయడం అనే చెప్పాలి ...
ఇలాంటి సున్నితమైన అంశాలు సమాజంలో ఎంతమందికి అర్ధం అవుతాయి ...
ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మాట్లాడితే కానీ ఇలాంటివి అర్ధం కావు ...
ఏమో ...ఒకవేళ అర్ధం అయినా ... అహం అడ్డొచ్చే అల్ప ప్రాణులు ఎన్నో మన సమాజంలో ...
---------------------
సమాజంలో మార్పు కు ...అర్ధవంతమైన ఆలోచనలకు...ఇలాంటి సినిమాలు పునాది రాళ్లు వేయాలి ..
స్త్రీ శరీరంలో నెల నెలా వచ్చే ప్రకృతి సహజమైన మార్పులకు మూర్ఖత్వపు సంకెళ్లు వేయడం ఆపాలి ...
స్త్రీ కి ఇష్టాలు ఉంటాయని ...అభిప్రాయాలు ఉంటాయని ...మనసు ఉంటుందని ...ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి ....ముఖ్యంగా స్త్రీ అర్ధం చేసుకోవాలి ...!
చివరిగా ....ఇది నాకు నచ్చిన సినిమా ...ముగింపుతో సహా ...!

No comments:

Post a Comment