Sunday, July 2, 2017

నన్ను నేను ప్రేమించుకోవడం వలన ,

"ప్రేమ "....చాలా అర్ధాలు , పరమర్ధాలూ ఉన్న పదం ...సందేహం లేకుండా అంగీకరిస్తా ...
అందులో ప్రధానంగా గమనించ వలసి వస్తే ....
నాకు తెలిసినంత వరకు ప్రేమ తీసుకోవడం, ప్రేమ ఇవ్వడం ....రెండు ప్రధాన విధాలుగా చెప్పుకోవచ్చు ...
నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ...నేను ప్రేమను ఎవరెవరి దగ్గరనుండి ఆశించాను అని ఆలోచిస్తే ...నాకు అరుదుగా కొందరు వ్యక్తులు గుర్తొస్తారు ....అందులో అతి ముఖ్యమైన వాళ్ళు అమ్మా , నాన్నలు ....
ఇప్పటికీ నేను అనుకుంటా ...నేను ఆశించిన ప్రేమ కంటే వాళ్ళు నాకు ఎక్కువే ఇచ్చారు ....అని ....
ఇక మిగిలింది ప్రేమ ఇవ్వడం గురించి ....ఇది నేను చాలా మంది దగ్గరనుండి ఆశించాను ....
నా మనసులో ఉన్న ప్రేమను వాళ్లకు పంచాలని , ఏదో ఒక రూపంలో ఇవ్వాలని ...ఇవ్వడం వలన కలిగే సంతృప్తిని పొందాలని ....ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కలిగే ఆనందాన్ని చూడాలని ....ఇలా ...
మనసు , అంతరాత్మ వగైరాలన్నీ మూకుమ్మడిగా ఒక్కోసారి దాడి చేసి ...అది కూడా స్వార్ధమే అని కొన్ని సార్లు నీతి బోధలు చేస్తూ ఉంటాయనుకోండి ...నేను వాటిని విస్మరించినట్టు నటిస్తూ ఉంటా ....తప్పదు ....అది వేరే విషయం .... 
అలా ప్రేమను ఇవ్వాలని నేను ప్రయత్నించినప్పుడు ...కొందరు తిరస్కరించారు , కొందరు ఆస్వాదించారు , కొందరు అందుకు మూల్యం అడిగారు ....మరి కొందరు ఆంక్షలు విధించారు ....
అయినా ఇవ్వాలనే కోరిక మాత్రం అదృష్టవశాత్తు ఇప్పటివరకూ ఎప్పుడూ సజీవంగానే ఉంది ....
ఇంకా ఇంకా ప్రేమను పంచడం కోసం అతిధుల కోసం అన్వేషిస్తూనే ఉంది ....
ఎప్పుడైనా ఎవరికైనా అవసరమై వస్తే ....అంతా పంచేస్తే ...ఇంకా ...ఇంకా పుడుతూనే ఉంటుంది ..... 
ఇంత పంచినా ....ఇంకా ఇంకా ఎలా పుడుతుందా అని ఆలోచిస్తే ....నాకు సమాధానం దొరికేది కాదు .... 
ప్రపంచంలో ఎందరో ....ప్రేమ కోసం ...ఎక్కడుందా ఎక్కడుందా ...అని అన్వేషిస్తూ ఉంటే ....నాకేమిటి ప్రేమ ఎవరూ తీసుకోవడానికి రారు అని అనిపిస్తూ ఉంటుంది ....నా మనసులో ప్రేమ అక్షయపాత్ర ఏమైనా ఉందా అని అనుమానం కలిగింది ....
కానీ ....ఒక ఫైన్ ఈవెనింగ్ ...నాకు జ్ఞానోదయం అయింది .... 
ఈ ప్రేమ అనేది నాలోనే పుడుతుంది అని నాకు అర్ధమైంది .... 
అది ఎందువల్ల పుడుతుందా అని మళ్ళీ ఆలోచిస్తే .....,,
నన్ను నేను ప్రేమించుకోవడం వలన , నన్ను నేను గౌరవించుకోవడం వలన పుడుతుంది అని అర్ధమైంది ....ఈ మధ్య కాలంలో ఇంకా ఇంకా ప్రేమ పుట్టడానికి కారణం ....నన్ను నేను ఇంకా ఎక్కువ ప్రేమించుకోవడమే అని అర్ధమైంది .....
ముందు ముందు ఇంకా నా మీద నాకు ప్రేమ ఎక్కువైపోవాలని ....ఇంకా ఇంకా ప్రేమ పుడుతూనే ఉండాలని ....అది అందరికీ సరిపోయినంత పంచాలని నిరంతరం కలలు కంటున్నా ....!!  

Friday, June 30, 2017

ప్రపంచానికి తెలియకుండా దాచాల్సిన విషయాలు

ప్రపంచానికి తెలియకుండా దాచాల్సిన విషయాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయంటే ....అవి చాలావరకు మన తప్పులే అయి ఉంటాయి ....
ప్రపంచానికి వెలుగెత్తి చెప్పాల్సిన విషయాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయంటే ....అవి చాలావరకు మన గొప్పలే అయి ఉంటాయి ....  

మనస్ఫూర్తిగా ఒకసారి నవ్వాలి ,

ఎవరి మరణం ఎప్పుడు రాసిపెట్టి ఉందో ఎవరికీ తెలియదు .....🤔
అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు .....🙂
అవసరం అయి ఆలోచించినా పర్వాలేదు ....
మనం ఆలోచించినా ...ఆలోచించకపోయినా ...అది మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అనేది ...జీవితం ఎరిగిన సత్యం ....
అప్పుడు ఎప్పుడో ....ఎవరో నాతో ..మరణించడం గురించి మాట్లాడడం తప్పు అన్నారు ....
జీవితం గురించి మాట్లాడడం తప్పు కానప్పుడు ....మరణం గురించి మాట్లాడడం తప్పు ఎలా అయింది .....అని ఆశ్చర్యం వేసింది ....😮
కానీ మరణించే ముందు మనం చేయాల్సినవి కొన్ని అనివార్యమైన పనులు ఉన్నాయి ....అవి చేసినవాళ్లు , చేస్తున్నవాళ్లు మరణం గురించి చింతించాల్సిన అవసరం లేదు ....అని నా అభిప్రాయం ...😎
కానీ చేయనివాళ్ళు మాత్రం కాస్త ఆలోచించాలి .....ఆ పనులు చేయకుండా ఎన్నాళ్లు బ్రతికినా , ఎంత ముందుగా చచ్చిపోయినా వాళ్ళను చూసి ....అయ్యో అనక తప్పదు .....😥
ఇంతకూ ఏం చేయాలి అనుకుంటున్నారా ....??!!
మనస్ఫూర్తిగా ఒకసారి నవ్వాలి ,
మనసారా ఓ సారి ఏడవాలి ,
తనివి తీరా ఓ సారి ప్రేమించాలి ....😍
ఇలాంటివి కూడా చేయకుండా మనిషి చనిపోతే /బ్రతికితే...వాళ్ళను చూసి భలే జాలేస్తుంది నాకు ....!

స్త్రీ అమాయకత్వం ...

పురుషుడు తనకు పరిణతి లేని సమయంలో ....పరిణతి కలిగిన స్త్రీ సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు ....
తనకు పరిణతి కలిగాక ....పరిణతి లేని స్త్రీకి ....తన సాన్నిధ్యాన్ని పంచాలని కోరుకుంటాడు ....
---------------------------------
స్త్రీ ఎప్పుడూ తన పరిణతి స్థాయి గురించి ఆలోచించదు... పురుషుడి పరిణతికి తగ్గట్టు తనను తాను మలచుకుంటుంది ....ఆమె స్థాయి అతనికి కనిపించకుండా దాచుకుంటుంది ....అతని ముందు ఎంత పరిణతి కనపరిస్తే అతనిలో తనను కలుపుకోగలడో అంతే పరిణతి కనపరుస్తుంది ....మిగతా అంతా ఆమె పురుషుడికి కనిపించకుండా జాగ్రత్త పడుతుంది .....
ఆమె పరిణతి విశ్వవ్యాప్తం , ఆమె కోరిక విశ్వజనీనం ,..ఆమె సమయస్పూర్తి ఇరువురి కలయికకు అనువైన కార్యం .... 
-----------------------------------
దీనికి పురుషుడు తన సంతృప్తి కోసం పెట్టుకునే పేరు .....స్త్రీ అమాయకత్వం ....! 😀
(ఇవన్నీ ఒక కోణంలో ఆలోచించి వ్రాసినవి మాత్రమే ..అందరికీ వర్తించకపోవచ్చు ....)

ఎవరికైనా ఎవరినైనా చంపెయ్యాలి అనేంత కోపం ఉందనుకోండి ....

ఎవరికైనా ఎవరినైనా చంపెయ్యాలి అనేంత కోపం ఉందనుకోండి ....
అప్పుడు ఈ కోపం ఉన్నవాళ్లు కొందరు ఏం చేస్తారంటే .... వాళ్ళ గురించి .....వాళ్లకు పరిచయం ఉన్నవాళ్ల అందరి దగ్గర విపరీతంగా పొగడడం ప్రారంభిస్తారు ....ఎంత విపరీతంగా పొగుడుతారు అంటే .....వాళ్ళ మీద ఈర్ష్యతో .....ఆ పరిచయస్తులు దహించుకు పోవాలి .....
ఆ తర్వాత వీళ్ళు కనిపించినప్పుడు .....ఓయబ్బో వీళ్ళింత గొప్పవాళ్ళా....నేనిన్నాళ్ళూ మాతో సమానమైన వాళ్ళు అనుకున్నానే .....అని వీళ్ళతో మాట్లాడకూడదు ....
వీళ్లల్లో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయా అని శల్య పరీక్ష చేసి చూడాలి .....అవతలి వాళ్ళు వీళ్ళని దేవత / దేవుడు అన్నారు .....వీళ్ళు దేవుళ్ళా /దేవతలా అని వాళ్లకు అనుమానం కలగాలి ....
వీళ్ళ గురించి అంతగా పొగిడేంతగా ఏముంది వీళ్లల్లో ....అని వాళ్లకు ఏహ్య భావం కలగాలి ....చివరకు, మానసికంగా వాళ్లకు తెలియకుండానే వాళ్ళు దూరం కావాలి .....
అప్పుడు ....ఈ చంపెయ్యాలి అని కోపం ఉన్నవాళ్లు అమాయకుల లాగా ....నేను వాళ్ళ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎంతో పొగిడాను ....ఎందుకు వాళ్ళలా దూరమయ్యారో తెలియదు అంటారు .....
లేదా వాళ్ళు ఇదివరకు అంత స్నేహంగా లేరు ఇప్పుడు .....ఇదివరకు వాళ్ళు నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఫ్రెండ్స్ ....వాళ్ళ స్నేహం అలా ఎందుకయ్యిందో తెలియట్లేదు అని మొసలి కన్నీరు కారుస్తారు ....
కొన్నాళ్ళకు ఎవరికి వాళ్ళు నిజాలు తెలుసుకుని అర్ధం చేసుకున్న తరవాత ..... వాళ్ళు మౌనంగా ఉంటారేమో కానీ .....
ఆ సదరు పొగడ్తలతో బంధాలను విడదీసే వ్యక్తులు మాత్రం మరొకరిని చూసుకుని ...వారి పని వారు మొదలు పెడతారు .....
చివరకు వారికి ఏ ఇద్దరి మధ్య ఏ బంధమూ ఉండడం సహించలేరు .....
ఎందువలన అనగా ......,,,
చిన్నతనం నుండి వాళ్ళు ఏ బంధం లేకుండా పెరిగారు ....
వాళ్ళు కోరుకున్న ఏ బంధమూ వాళ్లకు జీవితంలో దొరకలేదు ....
కోరుకున్న బంధాలను సంపాదించుకోవడానికి వారి దగ్గర కావలసిన గుణాలు .... , డబ్బు , సమాజంలో గౌరవం లేకపోవడం ....
అందరిచే చీదరించుకోబడడం ....
సమాజం ఆమోదించే ఏ మంచి గుణాన్ని అంతర్గతంగా పెంపొందించుకోలేకపోవడం వలన
ఎప్పటికప్పుడు తనకు లేని గుణాల్ని సమాజానికి చూపించుకుంటూ బ్రతకడం అలవాటు కావడం .....ఇలాంటి కొన్ని మానసిక కారణాలు ...వాళ్ళ ప్రవర్తనకు దోహదం చేయవచ్చు ....
అందుకే ఎవరైనా ఎవరి గురించి అయినా అతిగా పొగిడితే ....ఆ పొగడ్తల వెనక ఎలాంటి ఉద్దేశ్యం ఉందో గ్రహిస్తే ....కొన్ని అపార్ధాలను అధిగమించవచ్చు ....!

Monday, June 26, 2017

అదే నా దృష్టిలో "పని చేస్తున్నాను" అని చెప్పడం అంటే ....

ఈ జీవితంలో ఈ పని చేయడం నాకు సాధ్యం కాదు అని నేననుకోవాలి .......,
నువ్వు ఈ పని చేయగలవా ....నీ వల్ల కాదు.....అని నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను చూసి ఎప్పుడో ఒకసారి నవ్వి ఉండాలి .......,
విధి నాకు... అన్ని విధాలుగా సహకరించకుండా ఎదురు నిలవాలి .......,
అయినవాళ్ళు ,కానివాళ్ళు .."ఈ పని మొదలు పెట్టడమే కానీ ....పూర్తి చేయడం నా తరం కాదు..." అని ఒక బలమైన నిర్ణయానికి వచ్చేయాలి ....
అలాంటి ఒక పనిని నేను మొదలుపెట్టి .....చావడమా,చేయడమా (Do or Die) అని రెండే ప్రత్యామ్నాయాలు పెట్టుకోవాలి .....,
అదే నా దృష్టిలో "పని చేస్తున్నాను" అని చెప్పడం అంటే ......లేదా నాకు తీరిక లేదు అని చెప్పడం అంటే ......!!

Sunday, June 25, 2017

మన ఆలోచనలకు విచక్షణ నేర్పాలి....

ఈ రోజు వాకింగ్ కి వెళ్తూ ఓ రెండు బాటిల్స్ వాటర్ తీసుకుని వెళ్ళా ....
దారి మధ్యలో ఒక బాటిల్ ఖాళీ అయిపోయింది ....నీళ్లు ఉన్నంత సేపు మోయడం కష్టం కాదు కానీ ....ఖాళీ అయిన బాటిల్ మోయాలంటే కాస్త చిరాగ్గా ఉంటుంది.... 
దారిలో డస్ట్ బిన్స్ ఏం లేవు ...అది తప్పని సరిగా ఇంటివరకు మోయాల్సిందే .... పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉండడం వలన దారి పక్కన ,ఎక్కడా విసిరేయలేం .... 

అయితే..., ఈ రోజు దారిలో ఒక పొద దగ్గర కొందరు పడేసిన చెత్త కాస్త కనిపించింది ....చెత్త అంటే మరీ ఎంతో కాదు ...ఒక కోక్ కాన్, ఒక వాటర్ బాటిల్ , ఒక చిన్న పేపర్ ....ఇలా ....
రెండు మూడు వస్తువులకే అక్కడ ఎంతో చెత్త ఉన్నట్టుగా అనిపించింది .....అమెరికాలో ఆ మాత్రం చెత్త కనిపించడమే గ్రేట్ ....
వెంటనే నేనూ నా బాటిల్ అక్కడ విసిరేద్దామా అనిపించింది .... 
వాళ్లెవరో వేశారని నేను వేయడం ఏమిటి .... ??!! అని నవ్వుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నా .... 
--------------------------------
తర్వాత ఆలోచించా ....మిగతా శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో విసిరేయాలని అనిపించలేదు ....ఇక్కడ చెత్త చూడగానే విసిరేయాలని ఎందుకు అనిపించింది ....అని 
మనిషి మనస్తత్వం అంతే .....చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తే మనమూ అదే చేయడానికి అగస్మాత్తుగా ఓ క్షణం ప్రయత్నిస్తాం ....
అది ...తప్పా ఒప్పా ....మంచి చెడా...మన మనస్తత్వం అందుకు అంగీకరిస్తుందా అంగీకరించదా.... అనే విషయాలు విచక్షణతో ఆలోచించి మన ప్రవర్తనను అనుక్షణం మనకు అనుగుణంగా మలచుకోకపోతే....
మన బ్రతుకు మందలో గొర్రె బ్రతుకే .... 
అలాగే మనుషుల్లోని ఆలోచనలు కూడా ....,,,
మన చుట్టూ ఉన్నవాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ....మన ఆలోచనల మీద వాటి ప్రభావం ఏమిటో గమనించి ....ఎలాంటి మనుషుల మధ్య మనం మనుగడ సాగించాలి అనేది నిర్ణయించుకోవాలి ....
ఒకవేళ ..అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉండేలా మనం నిర్ణయించుకునే స్వేచ్ఛ మన జీవితానికి లేకపోతే ....మన ఆలోచనలకు విచక్షణ నేర్పాలి....
ఈ రోజు నేను నేర్చుకున్న జీవిత సత్యం ఇదే .....!!  

(Wrote and published on June 25, 2016)