Thursday, October 17, 2019

fear of losing

ఒక్కోసారి ...పొద్దున్నే నిద్ర లేవగానే 99 శాతం మందికి జీవితం ఎలా కనిపిస్తుందో నాకూ ఈ మధ్య అలాగే కనిపిస్తుంది ....
ఈ జీవితానికి అర్ధం ఏమిటి ....అసలెందుకు జీవిస్తున్నాం ....ఎంతకాలం జీవిస్తాం ....ఎప్పుడు మరణిస్తాం ....మరణించే లోగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమిటి ....ఆ బాధ్యతలు పూర్తి చేయగలనా ...ఒకవేళ చేయలేకపోతే ఎలా ....ఈ బంధాలేమిటి ....ఎవరు తోడు ....ఎందాక ఈ పయనం ....నా ఉనికి ఎక్కడ ....అసలున్నానా లేదా ....ఇలా రకరకాల ప్రశ్నలు బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి ....
ఆ సంఘర్షణ ....ప్రయత్నం అన్ని నాలోనే ....
ఇలాగే ....కొన్నాళ్ల క్రితం నాలో నేను చాలా సంఘర్షణకు గురైనప్పుడు ....దీనికంతటికీ కారణం ఏమిటా అని ఆలోచిస్తే ....,, నాకున్నది ఏదో పోతుందని నాలో ఉన్న భయమే ఒక కారణం అనిపించింది ....
ఇక్కడ మిత్రులు తరచూ చెప్పే ఓ మాట గుర్తొచ్చింది ....(fear of losing)
ఆ భయం నన్ను జీవితానికి దూరంగా నెట్టి వేయడానికి ప్రయత్నించింది ....
ఆ భయాన్ని ఎలాగైనా వెంటనే అధిగమించాలి అని ....అనివార్యం అనిపించింది....
--------------------------
ఆ వెంటనే ....ఏవి/ఎవరిని.. కోల్పోతానని నేను భయపడుతున్నానో ఒక లిస్ట్ తయారు చేసుకున్నా ...
బంధాలు, బ్రతుకుతెరువులు, ఆస్థిపాస్థులు మొదలైనవి ... వాటిలో ముఖ్యమైనవి ...
అవి కోల్పోతే వచ్చే నష్టాల గురించి వ్రాసుకున్నా ....
అవి ఎక్కడినుండి వచ్చాయో ....ఎందుకు వచ్చాయో ...ఎలా వచ్చాయో ...
అవి కోల్పోతే నాకు ఏమవుతుంది ....నేను ఎక్కడికి వెళ్తాను ....అని విశ్లేషించుకున్నా ....
తీరా విశ్లేషణ చూసాక ....
నేను కోల్పోతానని భయపడుతున్నవి ఏవీ శాశ్వతం కాదని అర్ధమైంది ....
అన్ని మధ్యలోనే వచ్చి చేరాయని ....కొన్ని కొన్ని చర్యల ఫలితంగా సంక్రమించాయని ....అన్ని మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టి చేసుకుంటే .....అలాంటి ఫలితాలే వస్తాయని ...వీలయితే ఇంకా మంచి ఫలితాలే వస్తాయని ....అవేవో నేను కోల్పోవడం వలన నన్ను నేను కోల్పోయేదేం లేదు అని ..అర్ధమైంది ....
చివరకు ....ఏది మిగలకపోతే నేను భయపడతాను అని ఆలోచిస్తే ....నాకు ఒక్కటి కూడా నా లిస్ట్ లో కనిపించలేదు ....
వెంటనే మనసంతా గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది ....
అప్పుడప్పుడూ ....వీలయితే రోజూ ...నిద్ర లేవగానే ....ఏదైనా కోల్పోతానేమో అని నేను భయపడుతున్నానా అని ...తరచి చూసుకోవడం ఎంతో అవసరం అనిపించింది ....
ఒకవేళ భయపడితే ....ఎందుకు అనేది విశ్లేషించుకుని దాన్ని వీలైనంత త్వరగా అధిగమిస్తే ....జీవితం ఎంతో అద్భుతంగా జీవించొచ్చు అనిపించింది .....!
*************************
(గమనిక : ఇవి నా స్వీయ ఆలోచనలు ...నిజానిజాలు నా నమ్మకాల ఆధారంగా సృష్టించబడినవి మాత్రమే!)

No comments:

Post a Comment