Thursday, July 30, 2020

I need privacy

నేను చిన్నతనం నుండి ...ఎప్పుడూ ..."నన్ను ఒంటరిగా వదిలేయండి" అని ...అదే "I need privacy" అని ఎప్పుడూ అనలేదు ...
అలా అంటే కాళ్ళు విరగ్గొట్టి ఉండేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ...
"ఏందే దయ్యం గియ్యం ఏమైనా పట్టిందా" అని వేపాకులు తెచ్చి దులిపేసి ఉండేవాళ్ళు ...
అసలు అలా అనొచ్చు అని కూడా నాకు తెలియదు ...
అసలు ఏకాంతం మనకి ఎందుకు కావాలో ....ఎందుకు అడగాలో కూడా నాకు తెలియదు ...నా పెళ్లయిన తర్వాత కూడా చాలా ఏళ్ళు నాకు తెలియదు ....
నా పిల్లలకి కూడా నేనెప్పుడూ చెప్పలేదు ...వాళ్ళూ నన్నెప్పుడూ అడగలేదు ...చదువుకోవడానికి సరైన వాతావరణం కల్పించడం ....మాట్లాడకుండా , టీవీ పెట్టకుండా ఉండడం లాంటివి చేసేవాళ్ళం ...
కానీ అమెరికా వచ్చాక ...పిల్లల దగ్గరనుండి మొదటిసారి అలాంటి మాట విన్నా ....
బహుశా స్కూల్ లో పిల్లలు నేర్పించి ఉంటారు ...
లేదా ఇంగ్లీష్ బుక్స్ చదివి , షోస్ , సినిమాలు చూసి నేర్చుకుని ఉంటారు ...
ఓహో ...ఎవరికైనా కాసేపు ఏకాంతంగా గడపాలి అనిపిస్తే ....I need privacy అని అడగాలన్నమాట అనుకున్నా ...
చాలా ఏళ్ళు చుట్టుపక్కల అందరికీ Privacy ఇవ్వడం అలవాటైంది కానీ నాకు ఎప్పుడూ అలా అడిగే అవకాశం రాలేదు ...
ఒకసారి ...,,
నా పుట్టినరోజు సందర్భంగా ... పిల్లలు నన్ను ఏం కావాలి అని అడిగారు ...నేనెప్పుడూ జరుపుకోను అని తెలిసినా...
"ఏం వద్దురా ... చిన్నప్పటినుండి పుట్టినరోజులు చేసుకోవడం నాకు అలవాటు లేదు ...ఇప్పుడు కొత్తగా ఉంటుంది ..." చెప్పా ..నొప్పించకుండా ...
"కాదు ...నీకిష్టమైన వంట చేస్తాం ...లేదా బయటకి వెళదాం ...నీకు ఏదైనా డ్రెస్ కావాలా ..." ఇలా లిస్ట్ అడిగారు ...
ఎందుకో టక్కున నాకు Privacy గుర్తొచ్చింది ...
"I need privacy..." అని చెప్పా ...
ఆశ్చర్యంగా చూసారు నా వంక ...
"నిజంగా ...నన్ను ఏకాంతంగా వదిలేయండి ....ఎవరూ నాతో మాట్లాడొద్దు ....నా గురించి పట్టించుకోవద్దు ...నేను ఉన్నానని మర్చిపోండి ...అదే నాకు గిఫ్ట్" అడిగా చాలా ఉత్సాహంగా ...
ఎలా గడిపానో ....ఏం జరిగిందో పక్కన పెడితే ....
నాకు కూడా జీవితంలో ఏకాంతంగా ఉంటానని అడిగే అవకాశం వచ్చింది ...
నిజంగా భలే అనిపించింది ....😍
ప్రతి మనిషికి అప్పుడప్పుడు ఏకాంతంగా గడపడం అవసరం అనిపించింది ....
అలా గడపడం కంటే ...ఎప్పుడు నాకు ఏకాంతంగా గడపాలని ఉంటే అప్పుడు ...ఇతరులకు చెప్పగలగడం చాలా బాగుంటుంది అనిపించింది ...🥰
ఇప్పటికీ అనిపిస్తుంది ....
జీవితంలో నాతో నేను గడిపిన క్షణాలే నేను నేనుగా జీవించిన క్షణాలు ...నాతో నేను జీవించిన క్షణాలు ...అని...
భవిష్యత్తులో కూడా ...I need privacy...నాతో నేను జీవించే Privacy...😍

No comments:

Post a Comment