Saturday, November 27, 2021

ఆమె పుట్టుక లోపం ....ఆమె పెరుగుదల లోపం , ఆమె జీవితం లోపం , ఆమె రూపం లోపం, ఆమె చర్యలు లోపం ...అసలు ఆమె ఒక లోపం ...

మన సమాజం , సినిమాలు ...ఎందుకో చిరకాలం నుండి లోపాలను ఎంచడంలో ...లోపాలు ఎత్తి చూపడంలో వివక్ష చూపించింది అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ...
ఇప్పటికీ ఈ వివక్ష నేను గమనిస్తూ ఉంటాను ...అది వేరే విషయం ....
మా అత్తయ్య అనేది ఎప్పుడూ ..."మా లక్ష్మికేమ్మా ....పుట్టినప్పుడే ...నా చేతుల్లో కి తీసుకున్నా.. మమ్మ, తెల్ల జాంకాయలా ఉండేది ...మహా లక్ష్మే ....అనేది ..."
"అది కాస్త నలుపనే కానీ ...దాని ముక్కు మొహం బంగారం ...."
"అది తెల్లటి తెలుపు ....దాన్ని ఎవరైనా ఎగరేసుకు పోతాడు ..."
"వాడికేం ...మగపిల్లాడు ....కాస్త నలుపైతే ...ఏం ...." ఇలా పుట్టినప్పుడే ....రకరకాల మాటలు వినేదాన్ని ...
ఇక పెరిగేకొద్దీ ....ఈ పొగడ్తలు / వివక్షలు వింటూనే ఉండేదాన్ని ...
ఆ ముక్కు చూడు ...మూరెడు పొడుగు పెరుగుతుంది ...అమ్మగారికి ...అని మా తాతయ్య ఎగతాళి చేసేవాడు కొన్నిసార్లు ....
ఏదో సరదాగా అన్నా ...ఇంటికొచ్చి అద్దంలో వందసార్లు చూసుకునేదాన్ని ....
నిజంగానే అంత పొడుగయిందా ....అయినా దాన్ని నేనెలా తగ్గించగలను ....ఈసారి అన్నప్పుడు సమాధానం చెప్పాలి అని మనసులో అనుకునేదాన్ని ....
నా ముందు పన్ను ఒకటి ఎత్తుగా ఉండేది ....అని ...పళ్లెత్తు అని ఒకరు ఒకసారి అన్నారని ...పౌరుషం వచ్చేసి ...
"వాళ్ళకి అన్ని సరిగ్గా ఉన్నాయా ...అయినా నా పళ్ళు నా ఇష్టం ..."అని తిట్టిపోశా ...
అలాగే పెళ్లి చూపుల్లో ...శల్య పరీక్షలు ...అమ్మాయిలకు తప్పనిసరి ...(ఈ కాలంలో కాస్త తగ్గి ఉండొచ్చు )
రంగు , ఎత్తు , నడక , గొంతు ...ఇలా ఒక వ్యాపార వస్తువుని చూసినట్టు చూస్తారనడంలో ఏ మాత్రం అతి శయోక్తి లేదు ...
మరి అబ్బాయిలకో అంటే ...చాలా లోపాలు సంపాదనలో కొట్టుకుపోతాయి ...
ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అనే చూస్తారు ...
ఎంత డబ్బు సంపాదిస్తే అన్ని లోపాలు కొట్టుకుపోతాయి ...
సినిమాలూ అంతే ...
స్త్రీ లోని లోపాలను మాత్రమే చూపించింది ....అది పురుషుడు క్షమిస్తే ...అంగీకరిస్తే అదే పదివేలు అనే స్థితికి తెచ్చింది ...
స్త్రీ , పురుషుడి లోపం గురించి అడగొచ్చు ...మన లోపాలను ఎత్తి చూపినప్పుడు నీ లోపాలు కూడా నీకు ఒక మనిషిగా ఉంటాయి ...కాబట్టి నాలో ఉన్నవన్నీ లోపాలని చిత్రీకరించొద్దు అని అడగొచ్చు అని ....తరతరాలుగా స్త్రీ మర్చిపోయింది ....
స్త్రీ ...ఆమె ప్రమేయం లేకుండా పురుషుడి బలాత్కారానికి గురైతే ....తప్పు ఆమెదే అనడం ....జీవితకాలం శిక్షించడం ...వేలెత్తి చూపడం ....వెలివేయడం ...ఆమెకి పెళ్లి చేసుకునే అర్హత లేదని ...ఆమె అపవిత్రమైపోయిందని ...ఇక ఆమె బ్రతుకు ని ఉద్ధరించే పురుషుడు దేవుడని ...
ఇలాంటి అపరాధ భావము స్త్రీ కి సృష్టించిన ఘనత ...మన సమాజం , సినిమాలదే ...
అలాంటి దారుణానికి గురైన వారికి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గం అనే భావం కలిగించడం కూడా మన సమాజానికే చెల్లింది ....
పెళ్లయ్యాక కూడా ....భర్త తన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి భార్యనే అడుగడుగునా అవమానిస్తూ ....ఆమె లో ఉన్న లోపాలను ....(అంటే సమాజం నవ్వుకోదగినవి ...) ఇతరుల ముందు ప్రస్తావిస్తూ ...ఇది మగవాడిగా నా జన్మ హక్కు అని జీవిస్తూ ఉంటాడు ...
అదే తన లోపాలు భార్య ప్రశ్నిస్తే ...విడాకుల ఆయుధం ఉపయోగిస్తాడు ...
నాకు అసలు లోపాలనేవి ఉంటాయా అని విర్రవీగుతాడు ....
ఆమె పుట్టుక లోపం ....ఆమె పెరుగుదల లోపం , ఆమె జీవితం లోపం , ఆమె రూపం లోపం, ఆమె చర్యలు లోపం ...అసలు ఆమె ఒక లోపం ...
అతని పుట్టుక వరం ...అతని పెరుగుదల సమాజం ...అతని జీవితం అతనిష్టం ...అతని రూపం ఆరాధనీయం ...అతని చర్యలు పొగడ్తలకు అనుగుణం ...అసలు అతనే ఓ అద్భుతం ...
ఇదంతా ఒకప్పుడు...
ఇప్పుడు కాలం మారుతుంది ...
ఆడవాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి ...
మగవాళ్ల ఆలోచనలు కూడా మారక తప్పడం లేదు ...
తదనుగుణంగా ....సమాజం ...సినిమాలు కూడా తమ పంధా మార్చుకోవాల్సి వస్తుంది ....ఇదంతా ఆహ్వానించదగ్గ పరిణామం ....
ఒకప్పుడు ...ఇద్దరు భార్యలున్న సినిమాలు ...ఆడవాళ్లు స్వచ్చందంగా అంగీకరించారు ...
మగవాళ్ళు ఏం చేసినా అడగకూడదు అని ఆడవాళ్లే జై కొట్టారు ....
మగవాళ్లకు లోపాలుంటాయా ....వాళ్ళు దేవుళ్ళు అన్నారు ....
ఇప్పుడు అలా కాదు...
ఇప్పుడు మగవాళ్ల లోపాలను కూడా చర్చించగలిగే సినిమాలు తీస్తున్నారు ...
ఇలాంటి క్రియేటివ్ సినిమాలకు ఈ పాండమిక్ ప్రాణం పోసింది ....
లోపాలు అందరికీ సహజం అని సమాజం అర్ధం చేసుకుంటుంది ....
ఇక క్రమేణా సమాజంలో వివక్ష తగ్గుతుందని ఆశించొచ్చు అనిపిస్తుంది ....
అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ....
30 weds 21 ..., ek mini katha..., nootokka jillala andagadu....
మూడూ విభిన్నమైన కథా చిత్రాలు ...
చూడదగిన చిత్రాలు ...!

No comments:

Post a Comment