Wednesday, January 4, 2023

వచ్చేటప్పుడు కొన్ని పనులు నేను చేయలేకపోయినవి

 వచ్చేటప్పుడు కొన్ని పనులు నేను చేయలేకపోయినవి చెప్పి వచ్చా మా ఆయనకి,

అవి తప్పనిసరిగా త్వరగా చేయాల్సినవి ...
ఎన్నిసార్లు అడిగినా ఆ పనులు చేయలేదనే సమాధానం.. అయినా విసుగుపడకుండా ప్రశాంతంగా అడిగేదాన్ని ...చేశారా చేశారా అని ...
లేదనే సమాధానం ..
చివరికి ...నువ్వు లేకుండా నాకు మోటివేషన్ లేదు ...చేయలేకపోతున్నా అని చెప్పారు ఓ రోజు ...
రాముడు ..అశ్వమేధ యాగం చేసేటప్పుడు ....సీత విగ్రహం చేయించుకున్నట్టు ...మీరు కూడా మోటివేషన్ కోసం నా విగ్రహం ఒకటి పెట్టుకోండి అని ఐడియా ఇచ్చా .. మీరు ఏక పత్నీవ్రతులు కాకపోయినా ...చెప్పా ...
అయినా ఫలితం లేదు ...
చివరికి ఇలా కాదని ...
రోజూ మెయిల్ పెట్టడం స్టార్ట్ చేశా ...To Do లిస్ట్ అని ..
రిమైండర్ అని రోజూ ఫార్వార్డ్ చేయడం నా డ్యూటీ అన్నట్టు...
అయినా ఫలితం లేదు ...ఒకరోజు ఇలాగే తను కాల్ చేసినప్పుడు నా ఫ్రెండ్ ముందు ఉన్నా ...
అయినా అప్పుడు కూడా ప్రశాంతంగానే అడిగా ...చేశారా అని ...
చేయలేదు అనే సమాధానం ....
మనసులో నా ఉద్దేశ్యం ఏమిటంటే ...అడగడం నా బాధ్యత ... నా బాధ్యత అయిపొయింది అన్నట్టు నేను కూల్ గా ఉంటా ...(మోటివేట్ చేయడం నా బాధ్యత కాదని చాలా ఏళ్ళ క్రితమే జ్ఞానోదయం అయింది ....)
ఆయన ...పొద్దున్నే లేచి నేను ఏదో సరదాగా మాట్లాడదాం అని కాల్ చేస్తే ...ఈ పనుల గోలేంటి అని ఆయన ఫీలింగ్ ....
అయినా నేను అడగడం ఆపను..
తర్వాత ...తన ఫ్రెండ్స్ తో వెళ్లిన లాస్ వేగాస్ ట్రిప్ ఎలా గడిచింది ...ఎంత పోగొట్టుకున్నారు తదితర వివరాలడిగి ...అంతే ప్రశాంతగా ఫోన్ పెట్టేశా ...
బహుశా మళ్లీ తర్వాత రోజు ఉదయం కూడా ఇదే ప్రశ్నతో మా సంభాషణ మొదలవ్వొచ్చు ....చెప్పలేను ..
ఫోన్ పెట్టేసి మా ఫ్రెండ్ వైపు చూస్తే ఫ్రెండ్ కళ్ళల్లో నీళ్లు ...
అంటే ...నాలో మార్పుని చూడగలిగే ఒకే ఒక్క ఫ్రెండ్ ...పాతికేళ్ల స్నేహం ...
చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు ...నన్ను అతి తక్కువ సందర్భాల్లో చూసి ఉండొచ్చు ... లేదా ఫేస్ బుక్ రాతల్ని బట్టి అంచనా వెయ్యొచ్చు ...లేదా చిన్నప్పటిలా ఉంటాను అనుకోవచ్చు ...ఆఖరికి నన్ను కన్న తల్లి కూడా నాలో మార్పుని గమనించలేకపోవచ్చు ...
కానీ తను అలా కాదు ...నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనల్లో నా ప్రవర్తనను ...మాటల్ని ...హావభావాలను దగ్గరగా చూసిన వ్యక్తి ...
"అసలు ఎలా మాట్లాడుతున్నావు ...కోపం లేకుండా ...నువ్వు అడగాల్సింది అడిగి ..పోగొట్టుకున్న డబ్బుతో నాకు సంబంధం లేదన్నట్టు ...తల్లోయ్ ...నువ్వు నిజంగా ..." అంటూ ఎమోషనల్ అయ్యింది ...
"చాలా నేర్చుకున్నాను ...జీవితం నేర్పించింది" ...చెప్పా తనకు ...
ఆఫ్కోర్స్ ఇవ్వాళ కూడా అదే ప్రశ్న అడిగా ...పొద్దున్న కాల్ లో ...
ఒక్క పని అయింది అన్నారు .. థాంక్స్ చెప్పా ...రెండో పని ...మూడో పని గుర్తు చేయడం మర్చిపోలేదు అనుకోండి ...అది వేరే విషయం ...
పెళ్లయిన కొత్తలో ..." మీకు ఇంగ్లిష్ బాగా వచ్చు కదా ...నాకు రోజుకో ఇంగ్లిష్ పదం నేర్పించండి ...." అని అడిగా మా వారిని ...
అన్నప్రాసన రోజే ఆవకాయ వేసినట్టు ..."procrastination" అనే పదం నేర్పించారు ...
అప్పుడనుకోలేదు ....ఆ పదానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్ అని ...
ఆ తర్వాత రెండో పదం ఇంతవరకు నేర్పించలేదు ....అడిగే ధైర్యం నేనూ చేయలేదు.!😇🙏

No comments:

Post a Comment