Sunday, August 1, 2021

ఒకసారి ఒక అమెరికా పిల్ల మా ఇంట్లో కొన్నాళ్ళు పెరిగింది ...

ఒకసారి ఒక అమెరికా పిల్ల మా ఇంట్లో కొన్నాళ్ళు పెరిగింది ....అది నా చిన్న కూతురికి స్నేహితురాలు ...

సరే ఇద్దరూ నా బిడ్డల లెక్కనేలే అనుకుని ...దాన్ని కూడా నా కూతురితో సమానంగా చూసుకునేదాన్ని ....
దాని ఇష్టాఇష్టాలేంటో నా కూతుర్ని అడిగి తెలుసుకుని మరీ ...వండి పెట్టేదాన్ని ....ముఖ్యంగా కారం తగ్గించి వంటలు చేసి ....
ఇద్దరూ కలిసి స్కూల్ కి వెళ్ళేవాళ్ళు ...ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకునేవాళ్ళు ....ఇలా ...
అసలు కథ ఏంటంటే ...వాళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకుంది ....అది ఈ పిల్లకు నచ్చదు ...ఆ మారు తండ్రి కి ఈ పిల్లకు , వాళ్ళమ్మకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ....
వాళ్ళ అసలు నాన్న లండన్లో డాక్టరు ....
వాళ్ళ తాతగారు ...ఇందిరాగాంధీ వాళ్ళ చుట్టాలట...
వాళ్ళ తాతగారి ఇంటికి చిన్నప్పుడు వెళ్ళేదట ...ఇండియా అంటే చాలా ఇష్టం అని చెప్పేది ...
సరే ఇప్పటి ఏవో సమస్యల వలన ...ఈ పిల్ల కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంటానని ....వచ్చేసింది ...
ఏదో అలిగి వచ్చేసింది సరే ....కొన్నాళ్ళు ఉన్నాక నచ్చచెప్పి పంపిద్దాములే అనుకున్నా ...
దాని స్కూల్ ఒక ఆరు నెలల్లో అయిపోతుంది ....అది తరువాత ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ అవుతాను అంది ....
కాలేజ్ కి వాళ్ళకి లోన్స్ వస్తాయి ....జాబ్ కూడా చేసుకోవచ్చు ....
సరే ఒక ఆరు నెలలే కదా అనుకుని ....ఊరుకున్నా ....
వాళ్ళ నాన్న మధ్యలో కాల్ చేసి ....మీరు నైస్ గా ఉండొద్దు ....వెళ్లిపొమ్మని చెప్పండి ...అప్పుడు తను ఇంటికొస్తుంది అని అడిగేవాడు ....
వాళ్ళమ్మ కూడా వెళ్లిపొమ్మని చెప్పండి అనేది ...
నేను వెళ్లిపొమ్మని చెప్పడం సరే ...అది ఇంటికి వెళ్లకుండా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే అని ....పైగా దాన్ని వెళ్లిపొమ్మంటే ....నా ఫ్రెండ్ ని వెళ్లిపొమ్మంటావా అని నా కూతురికి కోపం వస్తే ....
దేవుడా ....కరవమంటే కప్పకు కోపం ....వదలమంటే పాముకు కోపం ...అయిపొయింది నా పరిస్థితి ....
నేనూ అదే చెప్పా వాళ్లకు ....నా డాటర్ రిక్వెస్ట్ చేసిందని నేను ఒప్పుకున్నాను ...తనకు బాధ కలిగించే పని చేయలేను కదా అని ....
సరే వాళ్ళు నెలకో 500 డాలర్లు ఖర్చులకు ఇస్తాం అన్నారు ...ఊరికే ఉంచడం మాకు కష్టంగా ఉంది ...
ఈ పిల్లలు అవి తీసుకోమన్నారు ...
నేనేం చేసానంటే ...అవి తీసుకుని ఆ పిల్లకే ఇచ్చేసా ...పోనీలే ఏవో ఖర్చులు ఉంటాయి కదా దానికి కూడా అని ....అప్పుడు అది ఖర్చుల కోసం జాబ్ చేయకుండా చదువుకోవడం వరకే చేసింది ....
సరే అదంతా పక్కనపెడితే ...నా కూతురు ఏదో పనిమీద వేరే ప్లేస్ కి ఓ రెండు రోజులు ట్రిప్ వెళ్ళింది ....అప్పుడు ఈ పిల్ల నా దగ్గరే ఉండేది ...
పాపం దానికి ఏం టైం పాస్ అయ్యేది కాదు ....
అప్పట్లో రంగస్థలం మూవీ రిలీజ్ అయింది ..
నవ్య వచ్చాక ఆ సినిమాకు వెళదాం ....బాగుందంట ....సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి ...అని చెప్పా దానికి ...
అది ఏమంది అంటే ...మనిద్దరం వెళదాం ఈ వీకెండ్ ...పర్లేదు ...అని అడిగింది ....
సరే అని ఇద్దరం వెళ్ళాం ...
కాసేపు సినిమా బాగానే చూసింది ...స్టోరీ కూడా చెప్పా అక్కడక్కడా ...
కానీ చిట్టిబాబుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు ....సమంతాని చిట్టిబాబు తిట్టి , ఒక చెంపదెబ్బ కొడతాడు ... తరువాత పోలీసులు పట్టుకుపోతున్నప్పుడు ..పరిగెత్తుకుని పోయి ఒక ముద్దిస్తుంది ..అప్పుడు అదే ప్రేమంటే ఒక నిర్వచనం చెప్తారు ...
అప్పుడు దానికి కాన్సెప్ట్ అర్ధం కాలేదు ....
"తనను కొట్టినా కూడా వెళ్లి కిస్ చేసింది ....ఎందుకు చేసింది" అని అడిగింది ...
నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు ...
కాసేపాగాక నా కష్టం అర్ధం చేసుకుని అది నిద్రపోయింది ....
దేవుడా ఈ పిల్లను మళ్ళీ తెలుగు సినిమాకు తీసుకు రాకూడదు ...అనుకున్నా ...
ఆ తర్వాత నా కూతురికి చెప్పా నా కష్టం ....
అది నవ్వి దానికేదో సర్ది చెప్పుకుంది ....
=============================
ఆ తర్వాత ...ఈ మధ్య ...నా డాటర్ కాలేజ్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ....
"మనిద్దరం కలిసి ఏదైనా తెలుగు మూవీ చూద్దామా ....మమ్మి / బేబీ టైం ...." అడిగింది ...
ఈ మధ్య కొత్తగా వచ్చింది భీష్మ సినిమా చూద్దామా ..అడిగా ...
"బాగుంటుందా ...." అడిగింది ...
"యావరేజ్ ఉంటుంది ....కానీ పర్లేదు కాసేపు చూడొచ్చు ..." చెప్పా ...
సరే సినిమా పెట్టుకుని చూస్తూ ఉన్నాం ....
కంపెనీ ...ఎవరికిస్తాడు ఎవరికిస్తాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ....
"వెయిట్ ....కంపెనీ హీరోకిస్తాడా ...." అడిగింది నన్ను సందేహంగా సినిమా పాజ్ పెట్టి
"చూడు నీకే తెలుస్తుంది ...." చెప్పా ...
"కంపెనీ హీరోకి ఇస్తే ...ప్లీజ్ మమ్మి సినిమా ఆపెయ్యి ....నేను చూడను ..." చెప్పింది ...
"అవును హీరోకే ఇస్తాడు ...." చెప్పా ...
"ఆ హీరోయిన్ అంత టాలెంటెడ్ , హార్డ్ వర్కింగ్ ...ఆ అమ్మాయికి ఇవ్వకుండా హీరో కి ఎలా ఇస్తాడు కంపెనీ ...Foolish గా ఉంది ..." అని ....సినిమా చూడడం ఆపేసింది ...
ఈ ఐడియా అసలు నాకే రాలేదు ...నా మెదడు ఎంత అంతరించిపోయింది ...ఔరా ....అనుకున్నా ...
====================
కాబట్టి ....నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ..స్త్రీ కి తగిన గౌరవం ....మన తెలుగు సినిమా కలిగించాలి ....అంటే మన తెలుగు సమాజం ఆమోదించాలి ..
డైరక్టర్లు బావిలో కప్ప ఆలోచనలు మానెయ్యాలి ....
లేకపోతే ...తెలుగు సినిమా ఎంత డబ్బులు సంపాదించినా ....గౌరవం సంపాదించుకోవడం కష్టం ....
మన తెలుగు సినిమాలు అమెరికాలో పెరిగిన పిల్లలకు నచ్చవు ...
వాళ్లకు నచ్చాలంటే ....మన తెలుగు సినిమాల్లో స్త్రీని గౌరవించే పాత్రలు సృష్టించడం తెలుగు సినిమా డైరెక్టర్స్ చేయాలి ....తెలుగు సినిమా హీరోయిన్స్ ...మమ్మల్ని గౌరవించే పాత్రలిస్తేనే సినిమా చేస్తాం అని డిమాండ్ చేయాలి ...
హీరోయిన్ కి తగిన గౌరవం ఇవ్వకపోతే మేం సినిమాలు చేయం అని సినిమాలో నటించే ప్రతి ఒక్కరూ చెప్పాలి ..
బాడీ షేమింగ్ చేయడం ఆపాలి ...
ప్రతి ఒక్కరికీ తగిన ప్రాముఖ్యత కలిగి ఉండే పాత్రలు సృష్టించాలి ....
అప్పుడే తెలుగు సినిమా తరవాతి తరానికి నచ్చుతుంది .....గౌరవిస్తారు ...!🙏😇

గురువంటే ఇప్పుడు అర్ధం మారిపోయింది ...

గురువంటే ఇప్పుడు అర్ధం మారిపోయింది ...అని, నాకు కొన్ని సంఘటనల వలన అర్ధం అయింది ...

మొన్నామధ్య ....మాటల సందర్భంలో ...
"నాకు ఒక గురువున్నారు ...మా గురువు ఇలా చెప్తారు ...అలా చెప్తారు ...నన్ను ఇలా చేయమంటారు ...అలా చేయమంటారు ..." అని చెప్పారు ఒకరు ....
ఆ వెంటనే మరొకరు ...
"మా గురువు అల్లా ఫలానా వ్యక్తి ...మా గురువు వేరేగా చెప్తారు ...ఆయన వ్రాసిన పుస్తకాలు చదువు ...ఎంత గొప్పగా ఉంటాయో ..." అని చెప్పారు ...
"మా గురువైతే ...ఏ పుస్తకం చదవలేదు ...కానీ చాలా గొప్పగా చెబుతారు .." అని ఒకరు చెప్పారు ...
"లేదు లేదు ....మా గురువు బోధనలు మీరు వింటే ...మీరు ఒక్కసారిగా మారిపోతారు .." అని మరొకరు చెప్పారు ...
నా గురువు గొప్పంటే ...నా గురువు గొప్పని ...ఎవరెవరి గురువు ఏ విషయంలో గొప్పవాళ్ళో ...ఒకరికొకరు కాసేపు చెప్పుకుని ...,
అవన్నీ వింటూ నేను మౌనంగా ఉండడం చూసి ....,
"మీరేంటండీ ఏం మాట్లాడరు...మీ గురువెవరు ..." అడిగారు నన్ను ....
"నాకెవరూ గురువు లేరండీ ..." చెప్పా నేను ...
"ఎవరూ లేరా ...." మీరసలు సభ్య సమాజంలో ఉండాల్సిన మనిషేనా ...అన్నట్టు ఆశ్చర్యంగా అడిగారు ...
"ఆవిడకెవరూ గురువు లేరు ...ఆవిడ ఎవరి మాటా వినదు ...." ఎవరి మాటా వినదు అనే పదం కాస్త నొక్కి చెబుతూ ...మా ఆయన నా గురించి కన్ఫర్మ్ చేసారు ....
"అంటే ....తప్పనిసరిగా గురువు ఉండే తీరాలాండీ ...." అడిగా నేను అక్కడున్న ఫేమస్ శిష్యులందరినీ ..
నాకు సమాధానం రాలేదు ...
చిన్నతనంలో గురువంటే ...మనం స్కూల్స్ లో పాఠాలు చెప్పేవాళ్ళని ఆలా పిలిచేవాళ్ళం ...
ఇంకా ...గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.. అని చదువుకునేవాళ్ళం ...
అయితే మంచి చెడు కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు కొన్నిసార్లు ....
మా నాన్న దగ్గరకు కొందరు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి ....
"మావాడు చెప్పిన మాట వినడం లేదండీ ...కాస్త మీరయినా చెప్పండి " అని అడిగేవాళ్ళు ...
అప్పుడు మా నాన్న ఆ పిల్లలకు కాస్త భయం చెప్పేవారు ..
అక్కడ భయం చెప్పడం అంటే ...వాళ్ళ జీవితానికి కాస్త మంచి చేసేలాగా అన్నమాట ....
కొందరు ....పిల్లల్ని తీసుకుని రాకుండా ...వాళ్ళే వచ్చేవాళ్ళు ...
"మావాడికి మీరు కాస్త చదవమని భయం పెట్టాలండీ" అని అడిగేవాళ్ళు ...
తెల్లవారి క్లాస్ లో ఆ పిల్లాడికి కాస్త ప్రయివేటుగా పాఠం చెప్పేవారు మా నాన్న ...
అప్పట్లో గురువులు అంటే నాకు తెలిసిన అర్ధం అదే ...
తరువాత స్వామీజీలు ఉండేవారు ....వాళ్ళు వేరే ..
వాళ్ళు భయం చెప్పరు ....భవిష్యత్తు చెప్పేవాళ్ళు ....
అందువలన భయం కలిగేది ....
తర్వాత తర్వాత ...కొందరు స్పెషమ్ స్వామీజీలు కూడా బయట పడ్డారనుకోండి ...అది వేరే విషయం ...
తర్వాత కాలంలో ...కొత్తగా స్వామీజీ కం గురు పుట్టుకొచ్చారు ....
అంటే వాళ్ళు కొందరికి స్వామీజీ ....కొందరికి గురువు ....
వాళ్ళ మాట శిష్యులు తప్పనిసరిగా వినేవాళ్ళు ...
ఒకవేళ గురువు చెప్పింది ఇష్టం లేకపోయినా ....గుడ్డిగా గురువు చెప్పాడు కాబట్టి వినేవాళ్ళు ...
అది కూడా కొంతకాలం నడిచాక ...
కాలక్రమేణా ....
కొందరు గురువులు బిజినెస్ లోకి ప్రవేశించారు ....అంటే శిష్యులకి బిజినెస్ ఆఫర్ ఇప్పిస్తారు ...
శిష్యుడు బిజినెస్ చేసి ...అందులో గురువుకి కొంత లాభాన్ని పంచాలి ..
ఇందులో మోసం జరగదు అని చెబుతారు ..
అలా అని నమ్మితే నమ్ము లేకపోతే లేదు ....నీ ఇష్టం ...
ఆ బిజినెస్ గురువు కనుసన్నలలోనే జరుగుతుంది ....
తరవాత కొన్నాళ్ళకు .....గురువు ల భార్యలు ...కొందరు మాతాజీలు కూడా ఈ గురువులుగా చలామణి అయ్యారు ...ఏదో ...అలా జరుగుతూ వస్తున్న తరుణంలో ....
ఇదిగో ఈ మధ్య గురువుల అర్ధం మారిపోయింది ...
ప్రతి ఒక్కళ్ళకీ ఒక గురువు ఉండాల్సిందే అయిపొయింది ....
నా గురువు గొప్ప ....నా గురువు ఫేమస్ అనే స్థాయికి ఎదిగింది ...
ఈ క్రమంలోనే నాకు ఆ ప్రశ్న ఎదురైంది ...
ఆ మధ్య సద్గురు టెక్సాస్ లో ఒక కార్యక్రమం పెడుతున్నారు అని తెలిసి ....నా కూతురు నాకు ఒక టికెట్ బుక్ చేస్తాను ....మెడిటేషన్ ప్రోగ్రాం కి వెళ్ళమని అడిగింది ...
"సరే చూద్దాం లేరా ...." చెప్పా ...
"కాదు ...నా కోసం ఒప్పుకో ...నీకు ఈ ఒక్కటీ స్పాన్సర్ చేయాలని ఉంది నాకు" అని ....నాకు టికెట్ కొనింది ...
సరే కదా అని ప్రోగ్రాం కి వెళ్తే ...
అక్కడ నాలుగు వేల మంది అదే ప్రోగ్రాం కి వచ్చారు ....
అంటే నాలుగు వేలమందికి ....ఆయన గురువైపోయాడన్నమాట ...
ఎక్కడికెళ్లినా లైక్ మైండెడ్ స్నేహితులు పరిచయం అవుతారన్నట్టు ....అక్కడ నాకు ఒక కేరళ ఆవిడ పరిచయం అయింది ....
ఏంటో నాలుగు వేలమంది ఏడుస్తున్నప్పుడు ....నాకూ ఆవిడకి మాత్రం ఏడుపు రాలేదు ....
సరే ప్రోగ్రాం గురించి ప్రత్యేక చర్చ కార్యక్రమం పెట్టుకుందాం ...
మొత్తానికి నేను సరైన శిష్యురాలిని కాలేకపోయా ...
అప్పుడు నాకు సద్గురు ని గురువని చెప్పుకునే అర్హత లేనట్టే కదా ...
ఆయన మా పిల్ల గురువు ....అంటే నా డాటర్ కి గురువు అని ...
నా చిన్న కూతురికి ఏ గురువు లేరు ...
అది సూటిగా చెప్తుంది ...."నీకు వర్క్ అయ్యేది నాకు వర్క్ అవ్వదు...నీ మెడిటేషన్ / గురువు ...నీది ...నా దారి నాది ...." అని ...
ఎవరి ఇష్టా ఇష్టాలను నేను వ్యతిరేకించను....ఎవరిష్టం వాళ్ళది ...
మావారికి చాలామంది గురువులుంటారు ...
అయితే ....ఏమాటకామాటే ...మావారి గురువుల్లోకెల్లా ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గురువు చాలా గొప్పగా ఉంటారు ....
గొప్పవాళ్ళ గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి ....
ఆయన ...శిష్యుడు ఏం చేసినా కరెక్ట్ అంటాడు ....
తప్పు చేసినా రైట్ అంటాడు...రైట్ చేసినా రైటే అంటాడు ...
మావారు తప్పు చేసినప్పుడల్లా గురువుకి ఫోన్ చేసి ....నేను తప్పు చేసానా గురువుగారూ అని అడుగుతారు ...
లేదు నువ్వేం చేసినా కరెక్ట్ అంటారు ఆయన ...
పైగా నేను అడిగిన ప్రతిదానికి ....నాకెందుకు చెప్పలేదు అంటే ...నేను గురువుగారికి చెప్పాను అప్పుడే అంటారు ....
అదేంటి గురువుని కాదుగా నువ్వు పెళ్లి చేసుకుంది అంటే ....
గురువుగారు నేను చేసింది కరెక్ట్ అన్నారు అంటారు ....
అందుకే ఈ మధ్య ఏదైనా చేసినప్పుడల్లా ...ఒకసారి గురువుగారి ఆమోదం కూడా పొందండి ...ప్రశాంతంగా నిద్ర పోవచ్చు అని చెబుతున్నా ...
అదంతా పక్కన పెడితే ...
మొదటి ప్రశ్న విషయానికొస్తే ...
నాకెవరూ గురువు లేరన్నమాట ...
నేను చేసిన తప్పుల్ని సమర్ధించేవారు ....నాకు భయం చెప్పేవాళ్ళు ....నాకు మంచి బుద్ధుల్ని నేర్పించేవాళ్ళు ....నాకెవరూ లేరన్నట్టు ....
సభ్య సమాజంలో నాకు గొప్ప గురువు లేని కారణంగా నేను నేర్చుకోవలసినది చాలా ఉందన్నట్టు ...
గురువంటే ఇప్పుడు అర్ధం మారిపోయింది ...ఇంకా ముందు ముందు ఎలాంటి గురువులొస్తారో ...ఎప్పటికి నేను కాస్త జ్ఞానం అలవర్చుకుంటానో ఏమో ...?! 🙏😇

నిన్న మిత్రులతో జరిగిన ఒక

 నిన్న మిత్రులతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ..

ఒకరు ఏమన్నారంటే .... "నాకు డబ్బు అవసరం లేదండీ ...నెలకు ఒక వెయ్యి డాలర్లు పర్సనల్ ఖర్చులకుంటే చాలు ... ఇక మిగతావన్నీ నాకు అవసరం లేదు ...ఎవరికైనా ఇచ్చేస్తాను ..." అన్నారు ..
" అవును నాకూ డబ్బులంటే ఇష్టం లేదు ...నాకు మెడిటేషన్ ఉంటే చాలు" ఇంకొకరు చెప్పారు ...
"నాకూ డబ్బులంటే కేర్ లేదు ..." మరొకరు ...
ఐ డోంట్ కేర్ మనీ ....డోంట్ కేర్ మనీ ...మనీ మనీ ....గొంతుకలు అన్ని కలిపి ...ఒకే గొంతుకతో ...అందరూ చెప్పారు ...
"నాకు డబ్బంటే ఇష్టమండీ ...అంతే కాదు నాకు అవసరం కూడా ..." చెప్పా నేను ...
ఒకింత ఆశ్చర్యంగా చూసారు అందరూ నా వైపు ...
"డబ్బు మీద ఇష్టంతోనే నేను పని చేస్తున్నా ...డబ్బు మీద ఇష్టంతోనే ఇంకా చాలా చేస్తున్నా ...
నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ....అందుకు నాకు డబ్బు కావాలి ....
నాకు కొన్ని ఆశయాలున్నాయి ....అందుకు నాకు డబ్బు కావాలి ...
నాకు కొన్ని బాధ్యతలున్నాయి ....అందుకు నాకు డబ్బు కావాలి ....
అన్నిటికంటే ముఖ్యంగా నా జీవితానికి కూడా ఏదైనా న్యాయం చేయాలి ...
అందుకు నాకు డబ్బు అవసరం ....
అంత అవసరం అయిన డబ్బుని అవసరం లేదని నేను విసిరి పారేయలేను ...." కొనసాగింపుగా చెప్పా ...😇🙏

Tuesday, July 27, 2021

ఈ గార్డెనింగ్ అనేది ...

 ఈ గార్డెనింగ్ అనేది ...చాలా పరిమితంగా చేసుకోవాలి అనేది ఈ సంవత్సరం నేను నేర్చుకున్న పాఠం ...

ఎక్కువ పండించడం వలన ...లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి ...
మొన్నొక ఆంటీ వాళ్ళకి ...మా తోటలో పండిన కూరగాయలు ఇవ్వడానికి వెళ్తే ...అప్పుడు ఆంటీ నాకు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చారు ...చిక్కుడు కాయలు , సొరకాయలు ఇలా చాలా...
"ఆంటీ నా దగ్గర ఉన్నవాటికే ఫ్రిడ్జ్ లో చోటు లేదు ...
పోనీ అని కష్టపడి చేసినా ...వండినవన్నీ తినలేకపోతున్నాం ...
అంతలో పాడైపోతున్నాయి ....మధ్యలో పిల్లలు ....బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు ..." అని వద్దని చెప్పా ...
అప్పుడు ఆంటీ కూడా అదే చెప్పారు ...
పొద్దున్న నిద్రలేచేసరికి మీ అంకుల్ ..వాళ్ళిచ్చారు వీళ్లిచ్చారు అని ...తోటలోవి అని ...రకరకాల కూరగాయలు పెడుతున్నారు ...దానితో అది చెయ్యి ...దీనితో ఇది చెయ్యి బాగుంటుంది అని లిస్ట్ చదువుతున్నారు ....నేనేమో చేయలేకపోతున్నాను ....అని
ఇలా ఒకరికొకరు ఇవ్వడం వలన కానివ్వండి ...గార్డెనింగ్ వలన కానివ్వండి ...ఆడవాళ్ళ మీద కనిపించని ఒత్తిడి పడుతుంది ...
కానీ మగవాళ్ళు మాత్రం కోరుకున్న రుచులు ...తింటూ హాయిగా కాలుమీద కాలేసుకుని కాలం గడుపుతున్నారు ....(కొద్ది మంది మినహాయింపు )
పైగా దీనికి తోడు ....మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ...గిన్నెలు కడుక్కోవడం ఒకటి ...
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ...ఇలాంటివి స్త్రీ కి అదనపు బాధ్యతలే తప్ప ...
ఏ విధమైన లాభం లేదని అర్ధమైంది ....
అందుకే పరిమితంగా ఓ నాలుగైదు చెట్లు వేసుకుని ....బజార్లో బియ్యం తెచ్చుకుని ...బండ మీద కారం నూరుకుని ....ఎవరైనా బలవంతంగా కూరగాయలు అంటగట్టినా ....సున్నితంగా తిరస్కరించి ....సంతోషంగా కాలం గడపాలి అని గుణ పాఠం ...అన్నమాట 🙏!

Sunday, July 18, 2021

ప్రతి స్త్రీ ..తనకు ఇల్లుందా లేదా ...

 ప్రతి స్త్రీ ..తనకు ఇల్లుందా లేదా ....ఇంట్లో తనకు హక్కులున్నాయా లేదా అని ఆలోచించాలి ....

ఇల్లు లేకపోవడం అంటే ...ఇల్లు లేకపోవడం కాదు ...
ఇంట్లో స్త్రీ కి హక్కులు లేకపోవడం ...
ఇల్లంటే ....మేడ ....చెట్టు ...పుట్ట ఏదైనా కావచ్చు ....
ఎక్కడైనా ఉండనీ ...ప్రతి స్త్రీ కి తన ఇంట్లో తనకు హక్కులున్నాయా అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే ...
కనీసం తన మీద తనకైనా హక్కుందా ....తన సంపాదన మీద ...,తన వస్త్ర ధారణ మీద .., తన ఇష్టా ఇష్టాల మీద, ... తను తినే తిండి మీద అయినా తనకు హక్కుందా ...?!
ఆలోచించాలి...మరోసారి ...వీలైతే మరోసారి ...స్త్రీ ఆలోచించాలి ....తనను తాను ప్రశ్నించుకోవాలి !🤔

బాధ్యత నిర్వర్తించడం అంటే ...

 బాధ్యత నిర్వర్తించడం అంటే ...,, అప్పుడప్పుడు, ఇష్టమైనప్పుడు, సమయం అనుకూలించినప్పుడు , నిద్ర లేచినప్పుడు , చేయాలని అనిపించినప్పుడు , ఎవరైనా చూస్తున్నప్పుడు , ఎవరైనా చెప్పినప్పుడు ...చేసేది కాదు ...

అది పూర్తయ్యేవరకు ....ఇష్టమున్నా ...లేకపోయినా ....సమయం ఉన్నా ...లేకపోయినా ...చేయాలనిపించినా అనిపించకపోయినా ....ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా ....చూసినా చూడకపోయినా ...నిద్రలోనూ ...మెలకువలోనూ...అదే ధ్యాసలో అదే శ్వాసలో ...పూర్తి చేస్తే ...బాధ్యత నిర్వర్తించడం అంటారు ....!😀😇

ఎందరో స్త్రీలు ..ప్రతి రోజూ ..ప్రతి క్షణం ...

 ఎందరో స్త్రీలు ..ప్రతి రోజూ ..ప్రతి క్షణం ...కుటుంబానికి , సమాజానికి , పరిస్థితులకు అనుగుణంగా ...తమను తాము మార్చుకుంటూ ....మారిపోతూ ...మార్పు చెందుతూ ఉండడం ...నేను నా జీవితం అంతా చూస్తూనే ఉన్నా ....

🙏
కానీ నా జీవితకాలం లో ..ఒక్క పురుషుడు కూడా ...తనని తాను మార్చుకోవడం ...మారుతూ ...మార్పు చెందుతూ ఉండడం నేను చూడలేదు ...
సమాజం , కుటుంబం , పరిస్థితుల కోసం కాకపోయినా ...చివరకి తన కోసం తాను అయినా సరే ...!🤔