Sunday, August 1, 2021

గురువంటే ఇప్పుడు అర్ధం మారిపోయింది ...

గురువంటే ఇప్పుడు అర్ధం మారిపోయింది ...అని, నాకు కొన్ని సంఘటనల వలన అర్ధం అయింది ...

మొన్నామధ్య ....మాటల సందర్భంలో ...
"నాకు ఒక గురువున్నారు ...మా గురువు ఇలా చెప్తారు ...అలా చెప్తారు ...నన్ను ఇలా చేయమంటారు ...అలా చేయమంటారు ..." అని చెప్పారు ఒకరు ....
ఆ వెంటనే మరొకరు ...
"మా గురువు అల్లా ఫలానా వ్యక్తి ...మా గురువు వేరేగా చెప్తారు ...ఆయన వ్రాసిన పుస్తకాలు చదువు ...ఎంత గొప్పగా ఉంటాయో ..." అని చెప్పారు ...
"మా గురువైతే ...ఏ పుస్తకం చదవలేదు ...కానీ చాలా గొప్పగా చెబుతారు .." అని ఒకరు చెప్పారు ...
"లేదు లేదు ....మా గురువు బోధనలు మీరు వింటే ...మీరు ఒక్కసారిగా మారిపోతారు .." అని మరొకరు చెప్పారు ...
నా గురువు గొప్పంటే ...నా గురువు గొప్పని ...ఎవరెవరి గురువు ఏ విషయంలో గొప్పవాళ్ళో ...ఒకరికొకరు కాసేపు చెప్పుకుని ...,
అవన్నీ వింటూ నేను మౌనంగా ఉండడం చూసి ....,
"మీరేంటండీ ఏం మాట్లాడరు...మీ గురువెవరు ..." అడిగారు నన్ను ....
"నాకెవరూ గురువు లేరండీ ..." చెప్పా నేను ...
"ఎవరూ లేరా ...." మీరసలు సభ్య సమాజంలో ఉండాల్సిన మనిషేనా ...అన్నట్టు ఆశ్చర్యంగా అడిగారు ...
"ఆవిడకెవరూ గురువు లేరు ...ఆవిడ ఎవరి మాటా వినదు ...." ఎవరి మాటా వినదు అనే పదం కాస్త నొక్కి చెబుతూ ...మా ఆయన నా గురించి కన్ఫర్మ్ చేసారు ....
"అంటే ....తప్పనిసరిగా గురువు ఉండే తీరాలాండీ ...." అడిగా నేను అక్కడున్న ఫేమస్ శిష్యులందరినీ ..
నాకు సమాధానం రాలేదు ...
చిన్నతనంలో గురువంటే ...మనం స్కూల్స్ లో పాఠాలు చెప్పేవాళ్ళని ఆలా పిలిచేవాళ్ళం ...
ఇంకా ...గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.. అని చదువుకునేవాళ్ళం ...
అయితే మంచి చెడు కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు కొన్నిసార్లు ....
మా నాన్న దగ్గరకు కొందరు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి ....
"మావాడు చెప్పిన మాట వినడం లేదండీ ...కాస్త మీరయినా చెప్పండి " అని అడిగేవాళ్ళు ...
అప్పుడు మా నాన్న ఆ పిల్లలకు కాస్త భయం చెప్పేవారు ..
అక్కడ భయం చెప్పడం అంటే ...వాళ్ళ జీవితానికి కాస్త మంచి చేసేలాగా అన్నమాట ....
కొందరు ....పిల్లల్ని తీసుకుని రాకుండా ...వాళ్ళే వచ్చేవాళ్ళు ...
"మావాడికి మీరు కాస్త చదవమని భయం పెట్టాలండీ" అని అడిగేవాళ్ళు ...
తెల్లవారి క్లాస్ లో ఆ పిల్లాడికి కాస్త ప్రయివేటుగా పాఠం చెప్పేవారు మా నాన్న ...
అప్పట్లో గురువులు అంటే నాకు తెలిసిన అర్ధం అదే ...
తరువాత స్వామీజీలు ఉండేవారు ....వాళ్ళు వేరే ..
వాళ్ళు భయం చెప్పరు ....భవిష్యత్తు చెప్పేవాళ్ళు ....
అందువలన భయం కలిగేది ....
తర్వాత తర్వాత ...కొందరు స్పెషమ్ స్వామీజీలు కూడా బయట పడ్డారనుకోండి ...అది వేరే విషయం ...
తర్వాత కాలంలో ...కొత్తగా స్వామీజీ కం గురు పుట్టుకొచ్చారు ....
అంటే వాళ్ళు కొందరికి స్వామీజీ ....కొందరికి గురువు ....
వాళ్ళ మాట శిష్యులు తప్పనిసరిగా వినేవాళ్ళు ...
ఒకవేళ గురువు చెప్పింది ఇష్టం లేకపోయినా ....గుడ్డిగా గురువు చెప్పాడు కాబట్టి వినేవాళ్ళు ...
అది కూడా కొంతకాలం నడిచాక ...
కాలక్రమేణా ....
కొందరు గురువులు బిజినెస్ లోకి ప్రవేశించారు ....అంటే శిష్యులకి బిజినెస్ ఆఫర్ ఇప్పిస్తారు ...
శిష్యుడు బిజినెస్ చేసి ...అందులో గురువుకి కొంత లాభాన్ని పంచాలి ..
ఇందులో మోసం జరగదు అని చెబుతారు ..
అలా అని నమ్మితే నమ్ము లేకపోతే లేదు ....నీ ఇష్టం ...
ఆ బిజినెస్ గురువు కనుసన్నలలోనే జరుగుతుంది ....
తరవాత కొన్నాళ్ళకు .....గురువు ల భార్యలు ...కొందరు మాతాజీలు కూడా ఈ గురువులుగా చలామణి అయ్యారు ...ఏదో ...అలా జరుగుతూ వస్తున్న తరుణంలో ....
ఇదిగో ఈ మధ్య గురువుల అర్ధం మారిపోయింది ...
ప్రతి ఒక్కళ్ళకీ ఒక గురువు ఉండాల్సిందే అయిపొయింది ....
నా గురువు గొప్ప ....నా గురువు ఫేమస్ అనే స్థాయికి ఎదిగింది ...
ఈ క్రమంలోనే నాకు ఆ ప్రశ్న ఎదురైంది ...
ఆ మధ్య సద్గురు టెక్సాస్ లో ఒక కార్యక్రమం పెడుతున్నారు అని తెలిసి ....నా కూతురు నాకు ఒక టికెట్ బుక్ చేస్తాను ....మెడిటేషన్ ప్రోగ్రాం కి వెళ్ళమని అడిగింది ...
"సరే చూద్దాం లేరా ...." చెప్పా ...
"కాదు ...నా కోసం ఒప్పుకో ...నీకు ఈ ఒక్కటీ స్పాన్సర్ చేయాలని ఉంది నాకు" అని ....నాకు టికెట్ కొనింది ...
సరే కదా అని ప్రోగ్రాం కి వెళ్తే ...
అక్కడ నాలుగు వేల మంది అదే ప్రోగ్రాం కి వచ్చారు ....
అంటే నాలుగు వేలమందికి ....ఆయన గురువైపోయాడన్నమాట ...
ఎక్కడికెళ్లినా లైక్ మైండెడ్ స్నేహితులు పరిచయం అవుతారన్నట్టు ....అక్కడ నాకు ఒక కేరళ ఆవిడ పరిచయం అయింది ....
ఏంటో నాలుగు వేలమంది ఏడుస్తున్నప్పుడు ....నాకూ ఆవిడకి మాత్రం ఏడుపు రాలేదు ....
సరే ప్రోగ్రాం గురించి ప్రత్యేక చర్చ కార్యక్రమం పెట్టుకుందాం ...
మొత్తానికి నేను సరైన శిష్యురాలిని కాలేకపోయా ...
అప్పుడు నాకు సద్గురు ని గురువని చెప్పుకునే అర్హత లేనట్టే కదా ...
ఆయన మా పిల్ల గురువు ....అంటే నా డాటర్ కి గురువు అని ...
నా చిన్న కూతురికి ఏ గురువు లేరు ...
అది సూటిగా చెప్తుంది ...."నీకు వర్క్ అయ్యేది నాకు వర్క్ అవ్వదు...నీ మెడిటేషన్ / గురువు ...నీది ...నా దారి నాది ...." అని ...
ఎవరి ఇష్టా ఇష్టాలను నేను వ్యతిరేకించను....ఎవరిష్టం వాళ్ళది ...
మావారికి చాలామంది గురువులుంటారు ...
అయితే ....ఏమాటకామాటే ...మావారి గురువుల్లోకెల్లా ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గురువు చాలా గొప్పగా ఉంటారు ....
గొప్పవాళ్ళ గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి ....
ఆయన ...శిష్యుడు ఏం చేసినా కరెక్ట్ అంటాడు ....
తప్పు చేసినా రైట్ అంటాడు...రైట్ చేసినా రైటే అంటాడు ...
మావారు తప్పు చేసినప్పుడల్లా గురువుకి ఫోన్ చేసి ....నేను తప్పు చేసానా గురువుగారూ అని అడుగుతారు ...
లేదు నువ్వేం చేసినా కరెక్ట్ అంటారు ఆయన ...
పైగా నేను అడిగిన ప్రతిదానికి ....నాకెందుకు చెప్పలేదు అంటే ...నేను గురువుగారికి చెప్పాను అప్పుడే అంటారు ....
అదేంటి గురువుని కాదుగా నువ్వు పెళ్లి చేసుకుంది అంటే ....
గురువుగారు నేను చేసింది కరెక్ట్ అన్నారు అంటారు ....
అందుకే ఈ మధ్య ఏదైనా చేసినప్పుడల్లా ...ఒకసారి గురువుగారి ఆమోదం కూడా పొందండి ...ప్రశాంతంగా నిద్ర పోవచ్చు అని చెబుతున్నా ...
అదంతా పక్కన పెడితే ...
మొదటి ప్రశ్న విషయానికొస్తే ...
నాకెవరూ గురువు లేరన్నమాట ...
నేను చేసిన తప్పుల్ని సమర్ధించేవారు ....నాకు భయం చెప్పేవాళ్ళు ....నాకు మంచి బుద్ధుల్ని నేర్పించేవాళ్ళు ....నాకెవరూ లేరన్నట్టు ....
సభ్య సమాజంలో నాకు గొప్ప గురువు లేని కారణంగా నేను నేర్చుకోవలసినది చాలా ఉందన్నట్టు ...
గురువంటే ఇప్పుడు అర్ధం మారిపోయింది ...ఇంకా ముందు ముందు ఎలాంటి గురువులొస్తారో ...ఎప్పటికి నేను కాస్త జ్ఞానం అలవర్చుకుంటానో ఏమో ...?! 🙏😇

No comments:

Post a Comment